నాన్నా! ఒక డాడీ కావాలి!!

‘‘నాన్నా’’

సాధారణంగా నేను తినడానికి కూర్చునే వేళకి నిద్రపోతుంది పాప. ఆ రోజు ఎందుకో మేలుకునే ఉంది. ఒకవేళ ఎప్పుడైనా అలా మేలుకుని ఉన్నా.. తనతో పాటు నాక్కూడా టీవీలో కార్టూన్లు చూపించడం అలవాటు. కానీ, ఆరోజు టీవీ కట్టేసి నా పక్కనే కూర్చుని నేను తినడం మొదలెట్టగానే అంది. ఏదో చెప్తుంది లెమ్మన్నట్టుగా నేను నా పాటికి తింటున్నాను. మళ్లీ అంది.. ‘‘నాన్నా..’’

అప్పుడు తలతిప్పి తనకేసి చూశాను. ఏమైంది చిట్టితల్లికి. ఆ గొంతు ఎప్పటిలా అల్లరిగా, ఉత్సాహంగా లేదు. అందులో ఏదో తెలియని బరువుంది. రెండోక్లాసుకు వెళ్లబోతున్న పసిదానికి అంత భారం ఏముంటుంది? సైలెంట్‌గా ఉంది. ఏదో చెప్పడానికి నోరు తెరిచిందేమో.. ఆ సంగతి అర్థం చేసుకోకుండా, ఓ ముద్దకలిపి తన నోట్లో పెట్టాను. మళ్లీ సైలెంట్ అయిపోయింది.

ఉమ అప్పటికే చిరాగ్గా ఆవులిస్తోంది. అవును మరి.. తాగుబోతు, తిరుగుబోతు మొగుడైతే అందుకు తగ్గట్టుగా ట్యూన్ అయి ఉండొచ్చు. అలాంటి క్వాలిఫికేషన్స్ ఏం లేకుండా.. వారంలో ఒక్కరోజు-  రాత్రి భోజనం కొంపలో తినే ఒకే ఒక్కరోజు కూడా- పదిన్నర దాటిన తర్వాత వచ్చి వడ్డించమంటే ఏ భార్యకైనా చిరాకు కాక ఇంకేం వస్తుంది? ‘‘నువ్వెళ్లి పడుకో ఉమా.. నేను తిన్నాక కంచం కడిగేసి ఇవన్నీ సర్దేస్తాలే’’ అన్నాను. అలాంటి మాట కోసమే ఎదురుచూస్తున్నదేమో.. ‘‘మూతలు పెట్టడం మర్చిపోవద్దు’’ అనేసి వెళ్లి పడుకుంది. నేనూ, చిట్టితల్లీ మిగిలాం. ఇంకో చిన్న ముద్ద కలిపి నోట్లో పెట్టబోయాను. వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పింది. నిజమే, నేను పెట్టే ముద్దల కోసం తను ఇక్కడ కూర్చోలేదు. ఇంకేదో ఉంది. నేను తినడం ముగించి లేచాను. అన్నీ సర్దేసి, టీవీ ఉన్న గదిలోకి వచ్చాను. అలవాటుగా న్యూస్ చానెల్ పెట్టాను. చిట్టితల్లి కూడా వచ్చి పక్కన కూర్చుంది. ‘‘కాసేపు కార్టూన్స్ చూద్దామా’’ అన్నాను, రిమోట్ అందుకుంటూ. వద్దంది. ఏదో చెప్పాలనుకుంటోంది అనిపించి, టీవీ మ్యూట్ చేశాను.

‘‘నాన్నా..’’ అంది. ఆరు నిండేదాకా బళ్లో వేయకూడదనే అనుకున్నాను గానీ.. ఇంట్లో నా పప్పులేం ఉడకలేదు. అపార్టుమెంట్లలో జీవనం. ఇరుగు పొరుగు ఇళ్లలో పిల్లలు, నాలుగేళ్ల వయస్సున్న వారు, చక్కగా రెడీ అయి యూనిఫారాల్లో మెడలో టైలు కట్టుకుని ప్రతిపొద్దున్నే వెళ్తోంటే.. పాప ‘నన్ను  బడికి పంపుతావా పంపవా’ అంటూ మొండికేసి బడిలో చేరిపోయింది. చదువులు కాన్వెంటువే. కానీ ఆ పిలుపుల్ని ఇంట్లోకి చొరబడనివ్వలేదు నేను. ఏదో రెండు అరచేతులూ రక్షగా పెట్టి, నేనే కాపాడేస్తున్నాననుకునే శునకానందం నాది. తెలుగు పిలుపునే అలవాటు చేశాను. ‘‘నాన్నా..’’ అంది మళ్లీ. నా చిట్టి వసపిట్ట అలా ఒక్క పదం దగ్గరే ఆగిపోతోంది ఎందుకు? ఎందుకో సందేహిస్తోంది! ఏ పెద్ద కోరికలు కోరాలనుకుంటున్నదో! మామూలుగా ఖరీదైన చాక్లెట్లు, నేను ఆఫర్ చేసినా వద్దంటుంది. చిన్న చిన్న బొమ్మలతోనే సంతృప్తి పడుతుంది. కానీ ఈరోజు ఏదో అడగడానికి ఆ పసిమనసు ఇంతగా గుంజాటన పడుతోంది. పక్కనే కూర్చున్న పాపను నా ఒళ్లోకి లాక్కుని బుగ్గమీద ముద్దుపెట్టుకుని అడిగాను ‘‘ఏంటి నానా’’

కొంచెం ఆగి.. నా కళ్లలోకి చూసి, అడిగిన వెంటనే కోరిక తీర్చేయాలనే అప్రకటిత నియమాన్ని సంకేతంగా నాకు అందిస్తూ.. అన్నది.. ‘‘నాకు.. నాకు..  ఒక డాడీ కావాలి నాన్నా’’!

ఏం అడుగుతున్నదో అర్థం కావడానికి నాకు ఓ నిమిషం పట్టింది. ఎదురుగా టీవీలో డీడీ మెట్రో సిగ్నల్ మీదుగా ప్రసారాలు చేస్తున్న ఆజ్ తక్ ఛానెల్ ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చూపిస్తోంది. కళ్లు చూడగలుగుతున్నాయి గానీ గ్రహించడం లేదు. కొన్ని నిమిషాలు అలాగే స్తబ్దంగా ఉండిపోయాను.

తాను చెప్పవలసింది చెప్పేసినట్టు.. తన పసిమనసులోని భారం దిగిపోయినట్టు.. బంతిని నా కోర్టులోకి విసిరేసినట్టు.. అంతా నిమ్మళం అయిపోయినట్టు.. తాను అడగదలచుకున్నది అడిగేసిన తర్వాత, అలాగే నా ఒళ్లో కూర్చుని, నా గుండెల మీదికి ఒరిగి చిటికెలో నిద్రపోయింది పాప. నేనే.. శూన్యత కూడా ఒక భావనగా నాలో నిండిపోయి.. న్యూనత ఒక హక్కుగా నన్నంతా ఆక్రమించేసి మెలిపెడుతుండగా అక్కడ చేతనారహితంగా, భావరహితంగా, ఒంటరిగా మిగిలిపోయాను.

*  *  *

‘‘కొంతమందికీ.. నాకున్న జ్ఞానం ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదని గీర ఉంటుంది మిత్రమా.. నాకు తెలిసినంత ఇంగ్లీషు ఎవ్వరికీ తెలీదనీ.. తాను ఎన్నదగినట్టుగా తప్పులు మరెవ్వరూ ఎన్నలేరనీ చాలా గోరోజనం ఉంటుంది.. తాను రాయగలిగినంత నేర్పుగా మరెవ్వరూ రాయలేరనే అహంకారం ఉంటుంది గురూ.. ఇలాంటి పిల్లకాకుల్ని యెన్నింటిని చూళ్లేదూ..’’ అంటూ పెరటి అరుగు మీద చింతపండు ఈనెలు వలుస్తూ, స్వపురాణాన్ని స్వోత్కర్షలుగా శ్రోతలు లేకపోయినా సరే గొణుక్కుంటూ గడిపేసే తలచెడిన బామ్మల్లాగా రాగాలు తీస్తూ అంటుంటాడు కరటకుడు! ఎవరితో ఆ మాటలంటున్నాడో, పాతిక మందికి పైగా గందరగోళంగా పనిచేసుకుంటూ ఉండే ఆ డెస్కులో నిర్దిష్టంగా తెలియదు. జనాంతికమైన వాగాస్త్ర సంధానం అది. కానీ ఎవరిని ఉద్దేశించి అన్నాడో మాత్రం మనకు అర్థమైపోతుంది. దిశారహితంగా వదలినది అయినా సరే.. ఆ బాణం గాల్లో తేలుకుంటూ వచ్చి నాకే గుచ్చుకుంటుంది. వాడు అచ్చమైన కరటకుడు. చేపలబుట్టలోంచి ఏ ఒక్కరినీ బయటకు వెళ్లనివ్వడు. కాళ్లు పట్టుకుని లాగేస్తూనే ఉంటాడు.

ఈ ఎండీగాడితో వచ్చిన తంటా ఇది. ‘నీ దూలాలను చెదలు తినేస్తున్నాయి రా బాబూ..  నీ సామ్రాజ్యపు హర్మ్యాల కింద బొరియల్లో పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి.. అని  ఎవరైనా  అతిప్రేమ, అనల్ప భక్తితో ఒక రహస్య ఉత్తరం రాశారంటే.. నిజానిజాలు చెక్ చేసుకోడు. ఆ ఉత్తరాన్ని నేరుగా తీస్కెళ్లి చెదల చేతికిస్తాడు, పందికొక్కుల యెదట పెడతాడు. ‘ఇదేంటో చూసుకోండి’ అంటాడు. అలాంటప్పుడు ఆ సాయంత్రం వేళ ఇలాంటి కరటక ప్రవచనం సాగుతుంటుంది.

దమనకుడు మరొకడుంటాడు. కొత్తగా చేరే వారికి ఉత్సాహభంగం చేయడంలో బహు నేర్పరి. శీలభంగం (కేరక్టర్ అసాసినేషన్‌ను ఇలా కూడా అనొచ్చా) కూడా చేయగల సమర్థుడు! పీటీఐ కాపీని అద్భుతంగా అనువదించామని, రూరల్ రిపోర్టరు కాపీని అద్భుతంగా తిరగరాశామని మురిసిపోతూ చేతికిస్తే.. ‘ఇంత ముష్టిగా రాయడానికా.. మీ ఊరినించీ హైద్రాబాదొచ్చావు.. అక్కడే ఏదైనా మెకానిక్ షెడ్లో చేరితే ఇంతకంటె ఎక్కువ డబ్బులొచ్చేవిగా..’’ అంటూ కాపీని ఉండచుట్టి చెత్తబుట్టలో పడేస్తాడు. దమననీతిలో పీహెచ్డీ చేసినవాడు. వాడి జీవితంలో ‘అలా కాదు మిత్రమా.. ఇలా రాయాలి’ అని ఒక్కడికైనా చెప్పగా చూసే భాగ్యం నాకు కలగలేదు.

ఎవరు చెప్పింది.. కొన్ని వృత్తుల్లో కొన్ని సంస్థల్లో ఎదగడానికి కులం ఒక ట్రంపు కార్డులాగా పనిచేస్తుందని? అదంతా ట్రాష్ బాస్! ఒక సీక్వెన్సు కూడా లేకపోతే ఎన్ని జోకర్లున్నా ఏం చేసుకోవడానికి? కులం ప్రాంతం లాంటివి కూడా అలాంటి జోకరు కార్డులే. ‘విధేయత, భజన, ముఖస్తుతి, లొంగుబాటు, బానిసత్వ ఛాయ వంటి అనేకానేక లక్షణాల సమన్వితంగా బతికితేనే ఏ వృత్తిలోనైనా శోభించగలం’ అనేది నా అనుభవం! చచ్చి ఏ లోకాన ఉన్నాడో మా గురువు ముందే చెప్పాడు. ‘నేను చెప్పే చదువులు ఉద్యోగం చేయడానికి ఉపకరించేవే. కుదురుకోవాలంటే మూడు సూత్రాలు తెలియాలి. అవేంటో చెప్పనా..! ఒకటి– బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రెండు– లెర్న్ సేయింగ్ యెస్ టూ బాస్. మూడు– పై రెండు వాక్యములు నిత్య సత్యములు’ అని!

కలగని కలగని ఈ వృత్తిలోకి వచ్చాను. కొత్తగూడెంలో స్ట్రింగరుగా ఉండేప్పుడు నిజంగానే నాలో గోరోజనం కొండంతగా పొంగుతుండేది.  అప్పుడెంత? నాకు నిండా ఇరవై లేవు. కానీ కొలవగలిగే థర్మా మీటరు ఉంటే.. అది పగిలిపోయేంత లెవెల్లో ఉండేది నాకు. ఎక్కడైనా వీధుల్లో డ్రైనేజీ పొంగుతున్నదని ఆర్ 35లో మూడు నాలుగు సెంటీమీటర్లు రాస్తే చాలు. చిటికెలో ఆ సమస్య బాగైపోయేది. ఆ వీధిలోని జనం నన్ను హీరోలా చూసేవారు. అంతే కాదు.. మునిసిపాలిటీ వర్క్ ఇన్స్‌పెక్టరు బజార్లో కనిపిస్తే నాకో టీ తాగించి.. ‘ఆ మాత్రం దానికి మీరు రాయాలా సర్.. మీరు చిటికె వేసి చెబితే నేను గడియలో చేసేస్తా కదా’ అంటూ భక్తిప్రపత్తులు చూపించేవాడు. ఎప్పుడైనా కమిషనర్‌ను కలవడానికి వెళ్తే టీతోపాటు బిస్కట్స్ కూడా తెప్పించి.. ‘వెల్‌డన్ బ్రదర్.. వియ్ ఆల్వేస్ స్టే ఇన్ డార్క్.. యూ ఆర్ ది టార్చ్ బేరర్స్..’’ అనేవాడు. మురిసిపోయేవాణ్ని. అది కదా కిక్కంటే! అది కదా గోరోజనానికి జన్మస్థలమంటే!

ఆ గోరోజనం ముదిరి.. గ్రూప్స్ కు చదువుతున్న వాడిని.. యిటు గాలిమళ్లి, యింట్లో పెద్దోళ్ల హితవాక్యముల యెడల బధిరాంధుడినై యెగిరిగిరి వచ్చాను. యిప్పుడు అనుభవిస్తున్నాను. ‘గవర్నమెంటు ఉజ్జోగం కంటె స్థిరమైనది’ అని సీనియర్లు సన్నాయి నొక్కులు నొక్కితే.. నిజమేననుకుని ఇది దొరగ్గానే.. ఉమతో ప్రేమ సంగతి ఉభయుల ఇళ్లలోనూ చెప్పేసి ఆక్షేపణలూ, అభ్యంతరాలూ రానివ్వకుండా ఒక్కటైపోయాం. రెండేళ్లు తిరిగే సరికి పొత్తిళ్లలోకి మైత్రేయి!

నెమ్మది నెమ్మదిగా ఈ శ్లేష్మంలోంచి ఎటూ కదలలేకుండా బందీ అయిపోతున్నానా? అనే భయం పుట్టేది. చెప్పాలంటే కరటక, దమనకుల పీడ ఒక్కటే కాదు ఇబ్బంది.

నేను చాలా మంది జూనియర్లకి, కంటితుడుపు ఉపదేశాలు చేస్తుంటాను. వ్యక్తుల వెధవాయిత్వం వల్ల సంస్థకు దూరం కారాదు– అని!  మరి సంస్థ కూడా చేదెక్కితే ఏమిటి గతి? అయినా సరే దూరం కాలేం. బతికే భృతి గురించిన భయం ఒకటుంటుంది కదా. ఎలెక్స్ హేలీ ఏడుతరాలు అట్ట మీది సంకెలల లాగా మన ముంగాళ్లను అది పట్టేసుకుంటుంది.

ఎవరైనా ఇష్టంతో చదువుతారు.. ఉద్యోగాల కోసం మొక్కుబడిగానైనా చదువుతారు. కానీ పలాయన కాంక్షతో గుట్టుచప్పుడు కాకుండా ప్రెవేటుగా పీజీ చేసేశాను. రెండో కంటికి తెలియదు. తమ బానిసలు బుద్ధి వికాసం కోసం పై చదువులకు వెళ్లినా.. వృత్తి మార్పిడి కోసమే చేసినట్లుగా ఎంచే ప్రభువులు అలాంటి ప్రయత్నాలను  మెచ్చరు! కన్నెర్ర జేస్తారు! అసలే ఆఫీసుల్లో వాతావరణం డేగల పహరా కింద ఉన్నామేమోననే భావనను కలిగిస్తుంటుంది. గోడలకు చెవులుంటాయనడం చాలా చిన్నమాట. గోడలు, బల్లలు, కుర్చీలు, కంప్యూటరులు, కాగితాల సహా సమస్త వస్తుజాలమూ సహస్ర చక్షువులతోనూ, శతసహస్ర కర్ణములతోనూ అలరారుతుంటాయి!

కానీ, పీహెచ్డీలో చేరిన తర్వాత కప్పెట్టిన ముసుగు తొలగిపోయింది. కరటక దమనకుల విసుర్లు పెరిగాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే అవి విసుర్ల దశ దాటి ఖడ్గ ప్రహారాలుగా చిత్రవధ చేసేస్తున్నాయి. అన్నీ సూటిపోటి మాటలే. సోమవారంగా ఉన్న నా వీక్లీ ఆఫ్ బాసులకు మాత్రమే ప్రత్యేకించిన ఆదివారానికి మారింది. ‘బడు’ను ప్రయోగిస్తే బడుద్ధాయి అంటారని వెరస్తున్నాను గానీ.. నిజానికి మార్చబడింది! మరొక పదం లేదు వాస్తవం చెప్పడానికి! సోమవారాలు సెలవు తీసుకుంటే యూనివర్సిటీకి వెళ్లి నా థీసిస్ పనులు పరుగులు పెట్టించేస్తానని ఈ ప్రత్యేకమైన కుట్ర! అయినా రెండేళ్లలో ఆ డాక్టరేటు పట్టా పుచ్చుకుంటే.. మోజుపడ్డ ఈ రంగాన్ని వదలిపెట్టకుండా ఎక్కడైనా యూనివర్సిటీల్లో యివే పాఠాలు చెప్పుకునే కొలువు దొరుకుతుందని ఆశ! అన్ని చదువుల్లో ర్యాంకు స్టూడెంటుగా ఉన్నందువల్ల.. యూనివర్సిటీ కొలువుల ప్రకటన పడితే.. నాక్కాక మరెవరికి దక్కగలదనే గోరోజనం ఆ ఆశకు అదనం!

ప్రయారిటీ పీహెచ్డీ కాబట్టి.. యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుందని రాంనగర్ గుండులో ఒక చిన్న గుహ లాంటి ఇరుకు అపార్టుమెంటు ఫ్లాట్లోకి మారాం. ఆఫీసు పదిహేను కిలోమీటర్లకు పైగా దూరం.  రాత్రి రెండింటిదాకా డ్యూటీలు. ఇంటినుంచి వెళ్లేప్పుడు ఆర్టీసీ బస్సుండేది. తిరిగి వచ్చేప్పుడు– సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర రూములో ఉండే ఒక మిత్రుడు బండి మీద అక్కడ దింపేవాడు. అక్కడినుంచి నటరాజ్ సర్వీసులో లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఏ మూడున్నరకో, తొలి కోడి కూసేవేళకో, తొలికుంపటి వెలిగే వేళకో యిల్లు చేరుకోవడం! పొద్దున్న ఏ పదిగంటలకో యూనివర్సిటీని గుర్తుచేసే అలారం మోతకి మండుతున్న కళ్లతో లేస్తే.. అప్పటికే చిట్టితల్లి కాన్వెంటుకు వెళ్లిపోయి ఉంటుంది. ఉమ ప్రేమగా నాకోసం హాట్ బాక్సులో పెట్టి ఉంటుందిగానీ.. ఆరిపోయిన టిఫిను గతికేసి యూనివర్సిటీకి పరుగెత్తడం. సాయంత్రం దాకా అధ్యయన యావ, ఆచార్యసేవ! ఉరుకులు పరుగుల మీద ఇంటికొచ్చేవేళకి చిట్టితల్లి స్కూలునుంచి వచ్చి ఉండదు. స్నానం చేసి ఆఫీసుకు వెళ్లిపోవడం. ఇదే నిత్యకృత్యం.

ఇవాళ ఏదో స్పెషల్ పేజీలకోసం స్టోరీలు కావాలని మార్నింగ్ షిఫ్టుకు రమ్మంటే వెళ్లి, అంతా ముగించుకుని, గూట్లో దీపాలు కూడా ఆర్పేసే వేళకు యింటికొస్తే, ఇదీ చిట్టితల్లి నాకిచ్చిన తాకీదు.

‘యింకో డాడీ కావాలిట’

నవ్వొచ్చింది. అమంగళము అప్రతిహతమగుగాక. ఇది ఉమ కోరిక గానీ కాదు కదా! తన మనోగతాన్ని మైత్రేయి తో పలికించడం లేదు కద! ఛఛ. ఉమ నిజంగానే బంగారం. పుటం వేస్తూ కుంపటిలో మండే నాలాంటి అగ్గి ముక్కల వల్ల మరింత మెరుగైన బంగారంగా తయారైపోయింది ఉమ! నాలాంటి శాపగ్రస్థుడిని వలచి ముడిపెట్టుకున్నందుకు ఏనాడూ వగచిన అమ్మాయి కాదు. పైగా భీరువూ, పరాధీన, పరాన్నజీవీ కాదు.  తనకు కిట్టకుంటే.. ముమ్మారు తలాక్‌లు కాదు కదా.. ‘బాబూ సెలవు’ అనే ఒక్కమాటతో నన్ను గిరవాటు పెట్టగలదు! కాబట్టి ఇది తన మాట కాకపోవచ్చు.

గుండెల మీద నిద్రపోతున్న చిట్టితల్లిని జాగ్రత్తగా తీసుకెళ్లి ఉమ పక్కన పడుకోబెట్టి, మళ్లీ వచ్చి సోఫాలో కూలబడ్డాను.  బుర్రలో చైతన్యం లుప్తమై పోయిఉంది. సత్యశోధన, శూలశోధన జరగాలి. రేపే ఏ సంగతి తేలాలి. చిట్టితల్లి మైత్రేయి కోరిక.. ఏమిటనేది తెలుసు! ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరి వల్ల పుట్టినదో తెలియాలి. ఎలా ఆ కోరిక తీరగలదో అన్వేషించాలి!

దీనెమ్మా.. ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్. ఈ వృత్తిని ఎంచుకున్న పాపానికి, బ్రహ్మహత్యా పాతకంలాగా నన్ను అంటుకునే ఉంటుందా? ఎప్పటికీ!?

*  *  *

ఆదివారం. వాళ్లిద్దరూ ఇంకా లేవలేదు. ఏడున్నరకే పాలప్యాకెట్ కోసం వెళ్లి.. కాయిన్ ఫోను బాక్సునుంచి కరకటకుడికి లైను కలిపాను.

‘‘ఇవాళ వీక్లీ ఆఫ్ తీసుకుంటాను సార్’’

‘‘ఎలా కుదురుతుందీ.. ఇంకో నాలుగునెలల్లో పార్లమెంటు ఎలక్షను. ఆఫ్‌లు కేన్సిల్ అనుకున్నాంగా’’

‘‘వొళ్లంతా వన్నాట్ ఫోర్‌లో మండుతోంది సార్. వీక్లీ ఆఫ్ ఇవ్వకపోతే, రేపు మన పేపర్లోనే ‘నిర్యాణము’ యాడ్ వేయించడానికి ఉమకు మీరే అప్పివ్వాలి’’ వెకిలి జోకు వేసి, అంతకంటె వెకిలిగా నవ్వాను. కరటకుడు జత కలిపాడు.

‘‘అలాక్కానీ’’ అన్నాడు.

ముందుగా పేపరు మొత్తం చదివేసి.. కాఫీ తో ఉమను, బోర్నవిటాతో  మైత్రేయిని లేపేశాను. ‘ఇవాళ టిఫిను సెక్షను నాది’ అని ప్రకటించి, చిట్టితల్లికి ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసి పెట్టాను. మురిసిపోతూ లొట్టలేసుకుంటూ తింటోంది. ‘అమ్మకంటె నాన్న చాలా బాగా చేశా’డంటూ! ‘ఫర్బిడెన్ ఫ్రూట్ ఎఫెక్ట్’  అంటూ సైకాలజీలో ఒక థియరీ ఉంటుంది. ఎక్కడా దొరకని లేదా అరుదుగా దొరికే దాని మీదనే మనకు మోజు, ఆరాటం ఏర్పడుతుంటుంది. నా చేతి ఉప్మా బాగుందని చిట్టితల్లి అంటోంటే ఆ థియరీ గుర్తొచ్చింది. ఉమ ఉప్మా చాలా బాగా చేస్తుంది. కానీ.. ఏడాదికోసారి కిచెన్ లోకి వెళ్లే నేను చేసి పెడితే.. ‘నాన్న చాలా బాగా చేశా’డని పాప అనడం ఆ థియరీ ఎఫెక్టే కదా!

ఉమకు ఈ వైపరీత్యం ఎలా సంభవించిందో ఇంకా బోధపడ్డం లేదు. నివ్వెరపాటులోంచి బయటకు రాలేదు. ఈలోగానే ‘మేమలా బయటకు వెళ్లొస్తాం బాస్’ అని తనను మరింత దిగ్భ్రమలోకి నెట్టేస్తూ పాపను తీసుకుని పదిగంటలకెల్లా ఇందిరా పార్కుకు వెళ్లాను. మధ్యాహ్నం దాకా దాని ఆటలతోనే సరిపోయింది.  ఇంటికొచ్చి భోం చేశాక.. అలసిపోయిన చిట్టితల్లి నిద్రపోయింది.

‘‘ఏంటిది నువ్వేనా? గంటసేపు కుదురుగా ఇంట్లో కూర్చోవు. వీక్లీ ఆఫ్‌లలో గైడ్ ఇంటికెళ్లి సేవలు చేస్తుంటావు. యూనివర్సిటీకి ఇంటికీ ఆఫీసుకీ మధ్య కాళ్లకి చక్రాలు కట్టుకుని తిరుగుతుంటావు.. ఏంటివాళ?’’ ఆశ్చర్యపోయింది ఉమ. చిట్టితల్లి నా ముందు పెట్టిన కోరికను, ఉమ ముందు పెట్టడానికి ధైర్యం చాల్లేదు.

చిట్టితల్లి లేవగానే స్నాక్స్ తింది. ‘‘కిందికెళ్లి ఆడుకుందాం నాన్నా’’ అంది. మారు మాటాడకుండా తన వెంట కిందికి దిగాను. కింద అప్పటికే ఓ పదిమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఓ ఏడెనిమిది మంది, బహుశా పేరెంట్స్,  ప్రహరీ పక్కన చప్టా మీద కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మధ్యమధ్యలో పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నారు. వాళ్లంతా బహుశా మా ఫ్లాట్స్‌ వాళ్లే అయి ఉండొచ్చు. వెళ్లి ‘హాయ్’ అని ఒక సిగ్గుతో కూడిన పలకరింపుతో వారితో కూచున్నాను. ‘‘మిమ్మల్నెప్పుడూ చూడలేదండీ’’ అన్నాడొకడు. చిట్టితల్లికేసి వేలు చూపించాను. ‘‘ఓహ్ మైత్రేయి వాళ్ల డాడీనా?’’ అన్నాడు ఇంకొకడు.

ఆడుకుంటున్నా సరే దాని ధ్యాస మామీదే ఉంది. ‘‘కాదు మామా.. మా నాన్న’’ అంది!

‘‘అదేలేమ్మా..’’ ఆయన నవ్వుతున్నాడు. హాస్యంగానో, వెటకారంగానో మరి!

‘‘పేపర్లో చేస్తారంట కదా’’ ఒకడి ఆరా! ‘‘ఓహో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రహరీ గేటును కీచుమంటూ తెరిచేది మీరేనా?’’ లీలగా అసహనాన్ని ధ్వనిస్తూ మరొకడి సందేహం! రకరకాల కబుర్ల మధ్య రెండు గంటలు గడచిపోయాయి. పొద్దు వాలుతోంది. పిల్లల ఆటలు కేరింతలు వాతావరణాన్ని ఉత్సాహ తరంగితం చేస్తున్నాయి. పిట్టలు గూళ్లకు చేరుతున్నాయి. వేతనజీవులు ఇళ్లకు చేరుతున్నారు.  దూరంగా ఉన్న గుడిలో దేవుడి పాటలు మైక్ సెట్లో ప్లే చేస్తున్నారు.  ఎన్నడో గానీ నేను చూడని సాయంత్రపు వాతావరణం ఇది. ఏం చేద్దును? ఈ వేళకంటే ముందే నేను ప్రతిరోజూ ఆఫీసులో పంచ్ కొట్టి లోనికి వెళ్లి ఉంటాను కదా!

‘‘నా జీవితంలో ఇలాంటి రోజు మళ్లీ ఎప్పటికి వస్తుందో’’ ఏడున్నరకి భోజనాలు ముగించి ఉమ అన్న మొదటి మాట అది. ‘‘మీ తండ్రీ కూతుళ్ల ముచ్చట్లు తెమిలేదాకా నేను ఆగలేను’’ అని వెళ్లి పడుకుంది. మేం టీవీ ముందు సోఫాలో మిగిలిపోయాం. టామ్ అండ్ జెర్రీ నడుస్తున్నా సరే.. పట్టించుకోకుండా చిట్టితల్లి నాతో కబుర్లు మొదలెట్టింది.

‘‘నాన్నలు కూడా ఇలా చేస్తారా నాన్నా’’

‘‘ఎలాగమ్మా’’

‘‘అంటే.. నాన్నలు కూడా సాయంత్రాలు పిల్లలు ఆడుకునేప్పుడు వాళ్లతోపాటు కిందికొచ్చి కూర్చుంటారా? డాడీలే కదా అలా చేస్తారు! నా ఫ్రెండ్స్ అందరితో వాళ్ల డాడీలు సాయంత్రాలు వెంటవచ్చి వాళ్లతోపాటు ఆడుకుంటారు నాన్నా. లేదా దగ్గర్లోనే కూర్చుండిపోతారు. ‘మీ డాడీ రాడా’ అని ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉంటారు. నాన్నలు కూడా పిల్లలతో ఆడుకుంటారని నాకు తెలీదు కద. అందుకే అడిగా..’’ ముందురోజు తను కోరిన కోరికను గుర్తు చేసుకుంటూ ఉంది మైత్రేయి. ఇంకా ఏదేదో చెబుతోంది.

కర్రు కాల్చీ…

*  *  *

‘‘ఆ పీహెచ్డీ నెక్ట్ప్ మంత్ పూర్తయిపోతుందట. వాళ్ల నాన్న పీఎఫ్ లోంచి రెండు లక్షలు లోను తీసి లంచాలకు ఏర్పాటు చేశాట్ట. డాక్టరేటు చేతికి రాగానే.. యూనివర్సిటీలో లెక్చరరు ఉద్యోగానికి వెళ్తాట్ట!’’

‘‘ఇంగ్లీషు బాగా వస్తుందని గీర కదా.. ఇంగ్లిషు పేపర్లో చేరుతున్నాట్ట. మాటాడేసుకున్నాట్ట’’

‘‘రాయడంలో చేయి తిరిగిన వాడు కదా. రోజుకో గంట పనిచేసినా మేనేజి చేసేయొచ్చని ఆ పత్రికలో రిపోర్టింగులో చేరుతున్నాట్ట’’

ఆఫీసంతా ద్విత్వాక్షర టకారాలే! ట్ట..ట్ట..ట్ట..ట్ట.. లే!!

కొందరు జ్వలిస్తూ చూశారు. కొందరు షేక్ హ్యాండిచ్చారు. కొందరు కంగ్రాట్స్ చెప్పారు.

లోకాన్ నానావిధాని పశ్యన్తి! లోకాన్ నానావిధాని వర్తన్తి! లోకాన్ నానావిధాని వదన్తి!

నేను చేసిన పని ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా కనిపించింది. అనిపించింది.

బహుముఖ ప్రీత్యర్థం.. బహు రూపాలుగా ఉన్నా పరవాలేదు. వారు ఆనందించగలరు–

‘భాష్యమే’ కావాలి అందరికీ. ‘సత్యం’ అక్కర్లేదు!

మీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి..

సోమవారం ఉదయం పది గంటల అయిదు నిమిషాలకి పర్సనల్ డిపార్టుమెంటులో నా రాజీనామా సమర్పించాను.

(కథకు ప్రేరణ అయిన చిన్న అనుభవాన్ని నాతో పంచుకున్న ఆత్మీయుడికి..)

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కథ అనేక భావోద్వేగాలతో నిండిన ఒక అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక తండ్రి, కుమార్తె మధ్య సంబంధం, సామాజిక వాస్తవాలు, కుటుంబ సమీకరణాల మధ్య సంఘర్షణను ఈ కథ వివరిస్తుంది. కథలో తండ్రి తన బాధ్యతలను నిర్వర్తించాలన్న ఆవేదనతో ఉంటాడు..తండ్రిగా తన పిల్లల మనసును అర్థం చేసుకోవాలన్న దృక్పథాన్ని చూపుతాడు.

    కథలో “నాన్నా, నాకు ఒక డాడీ కావాలి” అన్న చిన్నపాప మాటలు హృదయాన్ని కదిలిస్తుంది. తండ్రి జీవితంలోని లోటు, ఒంటరితనాన్ని గుర్తు చేస్తాయి. సమాజంలో ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతల మధ్యన మనిషి పడే సంఘర్షణను కథ నిశితంగా వివరిస్తుంది. కథలోని శిల్పం, చమత్కారం, జీవిత వాస్తవాలను చెప్పే శైలి కథనాన్ని మరింత జీవంతో నింపుతుంది.

    ఈ కథ ఒక సాంఘిక స్పర్శతో పాటు కుటుంబ అనుబంధాల విలువను తేటతెల్లం చేస్తుంది. కథలోని ఉద్వేగాలు, వ్యక్తిగత బాధలు, జీవిత వాస్తవాలను అర్థం చేసుకోవడానికి పాఠకులను ఆలోచింపజేస్తాయి. చివరగా, కథ ఒక తల్లిదండ్రి తన పిల్లల కోసం జీవితాన్ని సమర్పించుకోవడమే జీవితానికి నిజమైన అర్థం అని చాటిచెప్పింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు