నగరం నాలుగు దిక్కులా ప్రవహిస్తోంది
అగ్నిపర్వతం బద్దలై పొంగిన లావాలా
ప్రకృతి నంతా దహిస్తూ ఘనీభవిస్తోంది
ఎగజిమ్మిన ధూళిమేఘంలా మూడో పాదంతో
ఆకాశాన్ని తాకి మేఘాల్ని చెదరగొడుతుంది
వాగుల్ని వంకల్ని చెరువుల్ని చెలమల్ని చెరబడుతోంది
విస్తరణవాద యాగాశ్వంలా
గ్రామాల్ని ఆక్రమిస్తూ నగరం విస్తరిస్తోంది
నగరం శ్రమకు వలువ లూడ్చి
స్వేదానికి విలువ కడుతుంది
పౌరులకు భయాన్ని పరిచయంచేసి
పట్టనితనాన్ని సామాజీకరిస్తుంది
పల్లెలన్నీ మోరలెత్తి నగరం వైపు
ఎగబడి తెగబడి పరుగుతీస్తాయి
సమస్తజీవులకునగరం
ఆశల అభయమిస్తుంది
నగరం నిద్రపోదు మనల్ని నిద్రపోనివ్వదు
కనురెప్పలకు వేలాడుతూ కలలుంటాయి
కనుకొనల చివర కన్నీటి చుక్క తెగిపడదు
నగరం నక్షత్రాలను మార్గమధ్యంలో వేలాడదీసి
పాలపుంతను గారడీ చేసి దాచేస్తుంది
నగరం కర్ణభేరిని ముద్దుచేస్తుంది
వయోలిన్ తీగ పుటుక్కున తెగుతుంది
తబలా తనకుతానే తల పగలగొట్టుకుంటుంది
పియానో మెట్లువిరిగి రాగం తీగసాగుతుంది
శబ్దకాలుష్యంలో నీజన్మ తరిస్తుంది
పబ్ లో రాత్రంతా ఒలకబోసుకున్న స్వప్నాన్ని
పగలు సోషల్ మీడియాలో వెతుక్కుంటుంది
పగలంతా వెతుక్కున్న పొట్టకూటి భవిష్యత్తును
రాత్రికి చీప్ లిక్కర్ చీకటిలో కరిగిస్తుంది
తిండికి పనికి మధ్య నగరం నిన్ను పరుగులు పెట్టిస్తుంది
నగరం ప్రేమకి డబ్బుకి మధ్య నీకు పరీక్ష పెడుతుంది
నగరం స్నేహానికి నాగరికత నేర్పుతుంది
నిర్దాక్షిణ్యాన్ని నగరం అంతర్లీనం చేస్తుంది
నగరాలకు వర్గభేదమేకాదు జాతిభేదం ఉంది
అనేక నగరాలకు మతాలున్నాయి
కొన్ని నగరాలు తెగల,కులాల కుంపట్లుగా మారాయి
అన్నినగరాలు లింగ వివక్షత పాటిస్తాయి
ప్రేమికుడిలా నగరం నిన్ను మైమరపిస్తుంది
ప్రేయసిలా కొందరిని చుట్టుకొని పరవసిస్తుంది
ఎందరినో అనాధలా మూలకు విసిరేస్తుంది
ఇంకొందరిని బిచ్చగాళ్ళని చేసి రోడ్లమీద చీదరిస్తుంది
నగరం సమ్మోహనంగా కొత్తతరాన్నిఆకర్షిస్తుంది
నగరజీవితం వ్యసనంగా కొనసాగుతుంది
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Excellent 👌
శబ్ద కాలుష్యం అనే స్టాంజాలో పైన వచ్చిన వాక్యాలు అతకలేదు .. అవి కవిత నిర్మాణాన్ని చెడ గొట్టాయి , నగరం అనే మాట అనేకసార్లు రావడం కూడ కవిత మూడ్ ని డిస్ట్రబ్ చేసింది. కవిత ముందు మన మనొపలకం మీద ముద్రితమవ్వాలి , అప్పటికప్పుడు పదాలు పేర్చి రాయడం వల్ల కవితా వస్తువు తన ఉనికి కొల్పోయి కేవలం పదాడంబరం మిగిలి కవిత్వం చచ్చిపోతుంది