నల్లని రక్తం పరిచిన ఎర్రని తివాచీ 

చదువుతున్నంత సేపు దుఃఖపు జీర గొంతు వీడి పోలేదు, మనసు ఆర్ద్రమై, ఆ కలానికి అక్షరం జతచేసిన వారి ధైర్యానికి, ఆ సమయానికి వేల వేల జోహార్లు చెప్పకుండా వుండలేకపోయాను.

 “అధికారం” అంధకారాన్ని మిగుల్చుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తూనే ఉన్నాయి. ఎవరు ఎవరిపై చేయరు అధికార దుర్వినియోగం, ముఖ్యంగా మనుషులుగా చెప్పుకునే మనందరిలో ఈ అధికారవాంఛ లేదంటారా! ప్రతీ ఒక్కరికి అధికారం చలాయించాలని ఉంటుంది.
 మరి బానిసలు ఎవరు?! అంటే ఈ అధికారం కింద నలిగిపోతున్న వారే.
మరి బానిసత్వానికి కూడా గుర్తింపు కావాలి కదా! అవును నేను అంటున్నది బానిసత్వపు గుర్తింపు గురించే!!, ఏ బానిస అయినా తాను అధికారం కింద నలిగిపోతున్నానా!? లేదా!? అని గుర్తించగలిగిన నాడే గొప్ప చరిత్రను సృష్టిస్తాడు.
బానిసత్వపు సంకెళ్ల రుచిని గుర్తు ఎరిగిననాడు పిడికిళ్ళు బిగుసుకుంటాయి. అది చిన్న-పెద్ద, నింగి-నేల, రంగు-రూపు, చీకటి-పగటికి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించేలా చేస్తుంది. అప్పుడే కదా మనుషుల మధ్య మనుషులు బానిసలు అవుతున్నారని గుర్తించగలుగుతాం. అలా గుర్తించిన పిడికిళ్లకు గొంతు తోడవ్వాలి. ఆ గొంతు కవులకు మాత్రమే దక్కేటి వరం అనిపిస్తుంది నాకు. అంతే కదా!, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ నేలపైన అయినా, చైతన్యపు నాందిని పలకగలిగినవాడు కవి., కవిదే తొలి గొంతు ఉంటుంది.
ఎక్కడైనా ముందు నేలకొరిగే వాడు కవి.
అందరి గళమై గొంతు విప్పుతాడు, కలం పట్టిన వాడే నేలకొరుగుతాడు., ఒక కలం మరణం బానిసత్వాన్ని నిర్ధారిస్తుంది.
 విప్లవం రంగు అద్దుకున్న కలం, గళం అవ్వడానికి అట్టే సమయం పట్టదన్నప్పుడు అధికారపు వెన్నులో వణుకు పుడుతుంది. శతాబ్దాల చరితల్ని తవ్వినాకొద్దీ పిడికిలి బిగించిన చేతులు ఎన్నో… వాటిని పట్టుకున్న కలాలు మరెన్నో… మోసిన గళాలెన్నో… మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి, ఉంటాయి.
 అటువంటి బానిసత్వపు సంకెళ్లను తెంచుకునే యుద్ధం చేసిన కలాలు ఉక్కు పిడికిళ్ళ సంకెళ్లను తెంచుకొని ప్రవహించిన కవిత్వ ప్రవాహాన్ని అతి చిన్న పుస్తకం నిండా నూరు పేజీలు కూడా లేదు కానీ అణిచివేయబడ్డ నేల గొంతుల నుండి బిగించిన సంకెలను ఛేదించుకొని తమ నేల తల్లిని విముక్తను చేసి ఊపిరి పోయాలని కంకణం కట్టుకున్న ఆఫ్రికన్ కవుల కలం గళంలో పోటెత్తిన కవిత్వం ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ కవిత్వం.
        ఆఫ్రికా అనగానే అణిచివేతకు గురైన గురవుతున్న దేశంగా మనందరికీ సుపరిచితమే. ఎదుగుతున్న దేశం అంటుంటాము గాని ఆఫ్రికా ఖండంలో దొరికే ఖనిజ సంపద అక్కడ ప్రజలను బానిసలని చేసింది. చుట్టూ ఉన్న అధికార దాహం దాస్యపు సంకెలను బిగించిందక్కడి ప్రజలకు.
        ఆఫ్రికా నేలంతా ఎర్రని తివాచీ పరుచుకుందని, చీకటి వెలుగుల మధ్య రోజు గడవడమే కష్టం అయ్యి , అంతరించిపోతున్న తమ ప్రాంతాలని కాపాడుకోవడానికి నిరంతరం ధర్మ ఘర్షణ పడిన కవుల పిడికిళ్ళ ఆనవాళ్లను అనువాదం చేసి దీవి సుబ్బారావు గారు మనకు అందించారు.
     చదువుతున్నంత సేపు దుఃఖపు జీర గొంతు వీడి పోలేదు, మనసు ఆర్ద్రమై, ఆ కలానికి అక్షరం జతచేసిన వారి ధైర్యానికి, ఆ సమయానికి వేల వేల జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయాను.
        కవి చచ్చిపోవాలి అన్న కవితతో మొదలవుతుంది ఇందులో కవిత్వం. తాము జీవం పోసుకున్న మట్టిలో నల్లజాతీయుల రక్తం చేరి మరింత నలుపుగా కనిపిస్తున్నదని ఒక కవి చెబితే!, మృత జీవుల దేశం ఇది మాట్లాడుతూనే ఉన్నా!,… దుఃఖిస్తూనే ఉన్న!,….విస్మయంగా చూస్తూనే ఉన్నాను నా దేశాన్ని!,.. అంటాడో కవి.
   నడుము వంగిన నల్లటి ముసలమ్మలు కలుపు తీసేందుకు కష్టంగా ఉన్నా…, నడిచి వెళుతూ ఉంటారని, వారిది శ్రమజీవుల ఊరని, ఇక్కడ ఏదీ ఊరికే నిర్మితమవ్వదని, చర్చి కూడా ఊరి బావిలా జన సందోహమై సందడిగా ఉంటుందని, తన ఊరి జ్ఞాపకాల్లో తేలిపోతాడో కవి.
 అదృశ్య మూషికం తన కలుగులో నుండి బయటకు వచ్చినప్పుడు తన స్నేహితుల  స్వరాల్ని కోల్పోవలసి వచ్చిన దృశ్యాన్ని వర్ణించిన తీరు మన గొంతుకు అడ్డం పడుతుంది, మన నేల నుండి తవ్వి తీసిన కొన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు నిలుస్తాయి.
      “ ఒక వెయ్యి గయెర్నికా చిత్రాల జ్ఞాపకాలు సముద్రమంత విశాలం” అంటూనే అంగోలా తల్లి కడుపున పుట్ట లేకపోయిన, ఆ ప్రాంతం తమ శరీరంలోని భాగమే అని, ఆఫ్రికాలో ఏ ప్రాంతం నుండైనా విడిపోవడంలో ప్రాణం లేని మర బొమ్మలుగా మిగిలిపోయామంటుందో స్వరం.
     ఆఫ్రికా ప్రాంతానికి ఎగిరి వచ్చిన వలస పక్షులనడిగి ఇతర దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే, అత్యంత క్లిష్ట స్థితులని వినిపిస్తారు.
     అంతిమ తీర్పులో శ్వాస కి అడ్డంపడే దుమ్ము ధూళి గురించి అవమాన భారంతో మెలితిరిగిన వారికి శాంతి కాముకుల మాటలు ఎంత పనికిరానివో చెప్తారు.
    ఆఫ్రికా నేల నుండి నన్ను పిండి పారేసినా మళ్లీ మొలకెత్తే మొక్కనై నల్లని రక్తంతో తడిచిన నేలపై చిగురిస్తానని గుర్తు చేస్తాడు.
    ఈ ఆఫ్రికా నేల కోసం చనిపోయిన వారు ఎవరు ఆ నేలపొరల్లో లేరని, దుమ్ము – ధూళిలో కలిసి ఊపిరి పీల్చే గాలిలో చెట్లు – చేమల్లా జనం గుంపుల్లో కలిసిపోయి ఊపిరి పోసుకుంటున్నారని చెప్తారో కవి.
    ఆఫ్రికా! విషాద గీతాన్ని పాడుతుందని అంగోలా నగరాన్ని గుర్తుచేసుకొని నేటి తమ దుస్తుతికి కారణాన్ని నిందించే గళం మనకి వినిపిస్తుంది. అంతేకాదు ఆఫ్రికా హృదయ స్పందనలకు అనుగుణంగా ఏ ప్రకృతి ప్రతిస్పందిస్తుందోనని, ఉషోదయాన్ని ప్రశ్నించే కవులు తారసపడతారు .
      ఈ పుస్తకంలో 40 మంది దాకా ఆఫ్రికన్ కవుల హృదయం పరుచుకొని ఉంది. ఆఫ్రికా నేలపై వెల్లివిరియాల్సిన ఉషోదయాన్ని ఊహిస్తూ… వారు విప్పిన గళం!, ఈ పొట్టెత్తిన పిడికిళ్ళు.
   ఎన్నెలపిట్ట ప్రచురణలో ఈ పోటెత్తిన పిడికిళ్ళు పుస్తకం దొరుకుతుంది.
*

రూప రుక్మిణి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు