ధర్మకాటా

“నాకేం సమజైతలేదు సారూ! నా బాట్లు సూడుండ్రి. తక్కెడ పాసంగం సూడుండ్రి. మోసం ఏం లేదు. మీ కరెంటు కాంటల్నే ఏదో మత్లబ్ ఉంది” అంది.

జీపులో కూకుంటూ, డ్రైవర్ రాజలింగంతో “బస్టాండ్ పోనీ” అన్న.

నా మాట విని, అప్పటి దాక ముచ్చట్లు పెట్టుకుంటున్న ఇన్స్‌పెక్షన్ టీం సభ్యులు నిశ్శబ్దాన్ని అలుముకున్నరు. ‘పొయ్యేది ఆర్మూర్ కదా! రూట్ మారిందేమిటా!’ అని ఆశ్చర్యాన్ని మౌనం మాటున కమ్యూనికేట్ చేసిండ్రు.

దాన్నుండి వాళ్ళని బయట పడేయ “మొన్న హైదరాబాద్ పోయేప్పుడు, బస్టాండ్ ఎంట్రెన్స్ గేట్ పక్కన రోడ్డు మీద కూకొని పండ్లు అమ్మే ముసలవ్వను గమనించిన. పక్కపోంటున్న మరో ఇద్దరికి లేని గిరాకి, ఈమె కాడ ఎందుకు ఉందాని! వాళ్ళ కంటే కిలోకు ఐదు రూపాయలు తక్కువ ధరకు అమ్ముతుంది. బేరమాడిన కాడికి ఇస్తుంది. గిరాకిని పక్కకు పోనిస్త లేదు. దండి కొడుతుందా అంటే, అదీ లేదు.

పాసంగం చూసుకోమని తానే ముందుగాల చెప్పవట్టె. నిజాయితీకి నికార్సయిన బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు!

పళ్లెం కింద ఐస్కాంతం ముక్క ఏదైనా ఉందేమోనని ఓ కన్ను వేసిన! గటువంటిదేం లేదని రువ్విడి అయ్యింది. చేతివాటం చూపిస్త లేదు. క్వాలిటీ సుత సక్కగనే ఉన్నట్లుంది. ఇంతట్ల బస్సు పాయింట్ మీదికి రావట్టెనని వెళ్ళిపోయిన” అని చెప్పిన.

“కట్ వెయిట్స్ ఏమైన పెట్టిందేమో సార్!” రవీందర్ అందించిండు.

“ఖాకీ బుద్ధి పోనిచ్చుకున్నవ్ కాదు. యూనిఫాం కండ్లకు అందరు దొంగల్లెక్కనే కనిపిస్తరు. ఏం? పడ్డ ధరకు ఓ రూపాయి అటీటుగ అమ్ముకుంటుందేమో! అట్లని ఎందుకు సోచాయించ కూడదు?”

మాటల్ల, బస్టాండ్ దగ్గర పడ్డది.

జీపును కంటికి కనిపించే దూరంల ఆపిచ్చి, సివిల్ డ్రెస్‌లో ఉన్న ఆఫీస్ సబార్డినేట్ రాణిని కస్టమర్‌లా పండ్లు కొనమని చెప్పి పంపింన.

కొనుక్కొని, పైసలు ఇచ్చేది చూసి, జీపు కొంటవోయి అవ్వ ముందర ఆపిండు డ్రైవర్.

యూనిఫాంల మమ్ముల చూసి, ‘పోలీసోల్ల’నుకుని గావరవడ్డది.

ఈలోపట జీపులోంచి ‘సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్’ బయిటికి తీసి, ఏర్పాటు చేసిండు రవీందర్. రాణి, కొన్న పండ్లను జోకింది. కిలోకు వంద గ్రాములు తక్కువున్నయి.

“ఆయీ! ఇదేంది?” అన్న.

“నాకేం సమజైతలేదు సారూ! నా బాట్లు సూడుండ్రి. తక్కెడ పాసంగం సూడుండ్రి. మోసం ఏం లేదు. మీ కరెంటు కాంటల్నే ఏదో మత్లబ్ ఉంది” అంది.

తక్కెడ పట్టుకొని లేపి చూస్తే బ్యాలెన్స్ లోపం లేదు. బాట్లు ఇవ్వమని, వేయింగ్ మిషన్‌పై పెడితే ‘విత్ ఇన్ ద టాలరెన్స్’లోనే ఎర్రర్స్ ఉన్నయి. వెనక్కి బోర్లిచ్చి చూస్తే, ‘ఏ’ క్వార్టర్ – 2016 సంవత్సరం’ ముద్రలు వేసి ఉన్నయి.

“కాంటా-బాట్లు ముద్రలు వేసినమని ఇచ్చే వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఉందా?” అంటే;

“ఉంది బిడ్డ! ఆర్నెల్ల కిందనే ముద్రలు వేయించిన” అంటూ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన జిరాక్స్ కాపీ తీసి, చెయిల పెట్టింది.

కట్ వెయిట్స్ లేవు! పాసంగం లేదు! మొదట్ల కనిపిచ్చిన బుగులుపోయింది. మనిషి తత్తరపాటు లేకుండా, నిమ్మలంగ కూకోని మాట్లాడుతుంది.

“అయస్కాంతం ఏదైనా పండ్ల మద్దెన గంపలో దాచిందేమో” నంటూ, రవీందర్ పండ్లను జరిపి చూస్తుంటే;

“పిడాత గంతమాటంటివి బిడ్డ! అనుమానం ఉంటే కుమ్మరిచ్చి సూడుండ్రి” బుట్టను ముందుకు జరిపి అంది.

గొంతులో ధ్వనించే ధీమాను చూసి “అక్కర్లేదులే! బండి ఎక్కండన్న”, మా దృష్టి లోపాన్ని నిందించుకుంటూ.

బండి కదిలే ముందు అనుమానపు అలికిడేదో మనసున కదిలి, ఒకసారి ఆపమని చెప్పి కిందికి దిగిన.

“ఏంది సారు! మల్ల వత్తిరి! ఏమి యాదికచ్చింది?” అంది.

“ఒకసారి లేచి నిలవడు” అన్న.

అవ్వ తతంగం అంతా అయిపోయిందని నిరాశగా వెళ్లిపోతున్న జనం ఆగి, ‘దాల్ మే కుచ్ కాలా హై’ అని తిరిగి గుమికూడిండ్రు. జనం తిరిగే చోట ఎక్కడ ఇన్స్‌పెక్షన్ జరిగినా చుట్టూత గుమ్మిగూడ్డం మామూలే! ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ వచ్చినంక వీడియోలు సుత తీసి పెడుతుండ్రు.

“నేనెందుకు నిలవడాలె?” అంది. గొంతులో అప్పటిదాక ఉన్న తెగింపుతనపు ధ్వని రూపు మారింది.

“సార్లు వచ్చినప్పుడు, మర్యాద కోసం నిలబడరా! అట్లనే అనుకుని లెవ్వు” అన్న, లేని కఠినత్వపు గన్ పౌడర్ని టోన్‌లో కూరుతూ.

“నేనేం తప్పు చేసిన! నిలవడ” అంది. తప్పు దొరికిపోయి, మాటలో మార్పు స్పష్టంగా వినిపిస్తుంది.

“నీ అంతట నువ్వు లెవ్వకపోతే, బల్మీటికి లేపుతం” అని రాణిని పిలిచి నిలవెట్టమన్న.

చిన్నపిల్లలు కూర్చున్నట్లు బిర్రబిగుసుకపోయి కూకున్నది. వీపు వెనుక నుండి చేతులు సొర్రగొట్టి, కావలించుకొని లేపి నిలబెట్టింది రాణి.

అరిపాదాల చెంత సింగులు కప్పి ఉంచిన ఐదు వందల గ్రాముల బాటు బయటపడ్డది. చూస్తే వంద గ్రాముల వరకు లేట్ మిషన్ మీద అరగదీసుంది.

“ఇదేందవ్వా?” గద్రాయించ ప్రయత్నించిన.

“ఏదో బుద్ధి గడ్డి మేసి చేసిన. మీరు ఏదంటే, గదే బాంచన్” అంటూనే..

“అందరు అడ్డగోలుగా బేరమాడి కొనేటోళ్లేనాయే! యాడికెళ్లి తెచ్చి అగ్గువకు అమ్మేది? కొనేకాడ ఒక్క కాయ ఎక్కువేయమంటే ‘మేమేమైనా పండిస్తున్నమా?’ అంటాడు. మమ్మల్ని మాత్రం ‘కొసరు వెయ్యవా! మొగ్గుజోకవా! బంగారం లెక్క జెయ్యవడితివి?’ అని నోరు నొయ్యకుండ అడుగుతరు. వాళ్ళ జేబుల్లకెల్లి తూటు పైస సుత జారిపోనియ్యరు. కాయలేమన్న మా పెరట్ల కాత్తున్నయా! ఇదేమన్యాలం?” గుండిగ ఎండుకపోయి సొరపోతుంటే ఆగి,

“కొనుక్కొచ్చిన ఒకటి రెండు దినాల్ల అమ్మకపోతే పండ్లు మురిగిపోతయి. ఆ తుట్టి ఎవరు కట్టిస్తరు? వడ్డికి తెచ్చి, రోజటిది రోజు కట్టాలే! అడ్డికి పావుశేరు. మా కట్టమంతవాడే దోసుకపోతడు. ఈడ కూసున్నందుకు ట్రాఫిక్ పోలీసోళ్ల తిప్పలు. అడిగినోనికి కాయ కోసి ఇయ్యాలే! జులుం చూపిస్తరు. అమ్ముడువోకున్నా తై బజారోనికి సుంకం కట్టాలె!”

“దొంగ దొరికినంక మాట్లాడే మాటలు గివ్వే!” వెటకారంగా అంది రాణి.

“నా వయసు వచ్చినంక మీరు రాజులోలె ఇండ్లల్ల కుసోని రెక్కాబొక్కా నొయ్యకుండ, పింఛన్లు తీసుకుంటరు. మా అసొంటోళ్లకు మూలకు పడేదాక ముక్కుకుంట మూలుక్కుంట కట్టం చేసుకుంటేనే బువ్వ పుడుతది.”

“ఆయీ! నీ కష్టం వినడానికి రాలే. కేసు రాస్తున్న. ఐదు వందలు పెనాల్టీ కట్టాలె” అన్న.

“ఇంకా బోణి సుత కాలేదు. నేను అమ్ముడువోయినా గంతగనం పైసలు రావు. యాడికెల్లి తేవాలె బాంచెన్!”

“అట్లయితే గీ పండ్లన్ని జప్తు చేస్తాం. ఆఫీస్‌కి వచ్చి పైసలు కట్టి ఇడిపిచ్చుకు పో” అన్నడు రవీందర్. ‘లాక్‌డౌన్ వేళలు ముగిసినా అముకుంటున్నడని’ ఆగ్రహంతో కూరగాయల్ని భూమ్మీద పారబోసి, బూటు కాళ్ళతో తొక్కి నలిపిన ఖాకీ గుర్తుకువచ్చి ‘ఆవేశపడకు’ అన్నట్లు భుజం తట్టిన.

“మీ సుట్టు తిరుక్కుంట కూకుంటే బేరమంత పోదా బాంచన్!”

“మాటకు మాట మంచిగనే కొలుసుకుంటున్నవ్ గని, బొడ్లసంచిల దాచిపెట్టిన పైసలు తియ్” అన్నడు రాజలింగం.

“బొడ్లెసంచుల కాలం ఎప్పుడో పోయింది దొర!” అంది.

“రయికల పర్సు దాచి పెట్టుకుంటరు కదా! తియ్యి” అన్నడు.

“యాడున్నది, చూసుకో” అంటూ కొంగు తీసింది.

కడుపుల పేగులు లేని తెలంగాణ తల్లి నిజరూపం కళ్ళ ముందు నిలబడి, కొంగు కొరడాతో కొట్టి, కాండ్రించి ముఖం మీద ఊంచినట్లు అనిపించింది. స్త్రీ హుందాను దిగజార్చినందుకు, ఉద్యోగపు తల కొట్టేసినట్లయింది.

కడుపు తిప్పల కోసం చేసే బడుగు జీవి బతుకు వ్యాపారం, కోట్లలో మోసాలు చేసే అక్రమ సంపాదకుల దోపిడీ వ్యవహారం.. ఒక్కటెలా అవుతుంది? మోసం మోసమేనని ‘కోతినీతులు’ చెప్పే నియమాల్ని, అన్యాయపు చట్టాల్ని, అమలుచేయ అన్నీ తెలిసివుండి, తటస్థ వైఖిరి వహించాలా! అప్పుడు సమన్యాయానికి అర్థమెక్కడిది? చట్టం, సామాజిక నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్న సాధనం మాత్రమే. అది ఎన్నటికీ సమగ్రం కాదు. పైగా ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో అక్రమార్కులకు అనుకూలపు పీటవేస్తుంది, అనుమానం లేదు.

కళ్లాల మీద ధాన్యం కొనే కమిషన్‌దార్లు రెండేసి సెట్లు; ఒకటి ముద్రలు వేసుకున్నది, మరొకటి వేసుకోనిది పెట్టుకొని రైతు కన్నీటి గింజల్ని కొల్లగొట్టే కారుణ్యమూర్తులే! కిరాణా షాప్ మొదలుకుని ఫ్యాక్టరీ యజమానుల వరకు రెండేసి సెట్లతో ప్రభుత్వ ఆదాయాన్ని మింగేసి, వినియోగదారులను నిట్టనిలువునా ముంచేసేవాళ్ళే. తాగే నీళ్లు సైతం! తక్కువ పోసి బాటిళ్లలో అమ్మే అంతర్జాతీయ కంపెనీ లీలలు. ఒకే రకం ఒకే కొలతగల కూల్ డ్రింక్‌ను, థియేటర్ క్యాంటీన్లో ఎక్కువ ధరకు, కిందనే ఉండే బజార్లో తక్కువ ధరకు ముద్రించి అమ్మే కార్పొరేట్ కంపెనీ కనికట్టు దోపిడీ. ఎన్నెన్నో కళ్ళముందు కదిలినయి.

చట్టాన్ని గౌరవించి ముద్రలు వేసుకుంది. బేరమాడే గిరాకీ జారిపోకుండా కట్ వెయిట్ పెట్టుకుంది చట్టాన్ని అమలుపరిచే అధికారిగా కేసు రాయాలా? మానవత్వం ఉన్న మనిషిగా గుండె గోడు వినాలా? ధర్మత్రాసు ఎటువైపు మొగ్గాలి?

సీజర్ మెమో రాసి, బాటు జప్తు చేసిన. రెండువందల రూపాయలు కట్టినట్లు నగదు రశీదు రాసి, అవ్వకు ఇచ్చిన. పాసంగం లేని మనసు శెబాసో అంటుంటే; రెండువందలు పర్సులోంచి తీసి రవీందర్‌కు ఇస్తూ “ట్రెజరీల జమకట్టు” అన్న.

‘ముందు నేను మనిషిని, ఆ తరువాతే అధికారిని’ ఊగిసలాడుతున్న లోలోపలి తరాజు స్థిరమైంది.

గాలి ఆడడం మొదలయి, పానం అల్కగయింది.

జీపు ఎక్కి పోతుంటే “బాటు ఇచ్చి పో సారూ! గోసయితదని” గోసగోసోలె అడుగుతున్న అవ్వ మాట నా ఖాకీ చెవిని దూరనివ్వలేదు. నేనిప్పుడు  కఠిన కార్యనిర్వాహక వ్యవస్థ కరకు ప్రతినిధిని.

*

ఊగిసలాట కారణంగా చాన్నాళ్లు రాయలేదు!

  • * నమస్తే కిషన్ గారూ! మీ గురించి చెప్పండి.

నమస్తే! నాది పూర్వ కరీంనగర్ జిల్లా లోని వేములవాడ. పుట్టింది, పెరిగింది అక్కడే. చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ తర్వాత లీగల్ మెట్రాలజీ శాఖలో పని చేసి రిటైరయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో నివాసం.

* మీ సాహిత్య ప్రయాణం గురించి..?

చిన్నప్పటి నుంచి సాహిత్య వాతావరణంలో పెరగడం వల్ల రాయాలన్న ఆసక్తి ఉండేది. మా ఊళ్లో నటరాజ కళానికేతన్ అందుకు బలమైన పునాది వేసింది. కళానికేతన్ ఆధ్వర్యంలో ‘నవత’ అనే రాతపత్రిక వచ్చేది. కళానికేతన్ సమావేశాలకు కవి శివారెడ్డి, దేవీప్రియ, జ్వాలాముఖి కవిచిత్రకారుడు శీలా వీర్రాజు లాంటి పెద్దలు వచ్చేవారు. వాళ్లని చూస్తూ, ఆ స్ఫూర్తితో రాయడం, చదవడం మొదలుపెట్టాను. మొదట్లో కవిత్వం రాసేవాణ్ని. ఆ తర్వాత 1980లో తొలి కథ రాశాను. అది ఒక గల్పిక. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది.

* కథల వైపు ప్రయాణం ఎలా సాగింది?

1980 తర్వాత కొన్ని కథలు రాసి ఆగిపోయినా, బొమ్మలు గీయకపోయినా, కవిగా మాత్రం కొనసాగాను. రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు నన్ను కథలు, కోట్స్ రాయమని ప్రోత్సహించేవారు. మా ఊరితో నాకున్న జ్ఞాపకాలను కథలుగా రాయమనేవారు. అయితే అప్పటికే జింబో(మంగారి రాజేందర్) గారు ‘మా వేములవాడ కథలు’ రాశారు. ఆయన్ని మామయ్యా అని పిలిచే సాన్నిహిత్యం ఉండేది. ఉద్యోగ, సాహిత్యపరంగా ఆయన నాకు స్ఫూర్తి. ఆయన రాసేశాక మళ్లీ వేములవాడ గురించి కొత్తగా ఏం చెప్పగలనన్న ఊగిసలాట కారణంగా చాన్నాళ్లు రాయలేదు. రిటైరయ్యాక 2020లో ‘లేంబాల వాటిక కథలు’ పేరుతో తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి ఫేస్‌బుక్‌ వాల్‌పై  వారానికో కథ రాయడం మొదలుపెట్టాను. మా ఊరితో నాకున్న అనుభవాలతో ఆ కథలు రాశాను.

* ‘లేంబాల వాటిక’.. పేరు కొత్తగా ఉందే?

వేములవాడని ఒకప్పుడు ‘లేంబాల వాటిక’ వాటిక అని పిలిచేవారు. మా ఊరి ‘మధుర కవి’ మామిడిపల్లి సాంబశివశర్మ రాసిన ‘శ్రీరాజరాజేశ్వరస్వామి సుప్రభాతం’ నుండి ఆ పదం తీసుకున్నాను. కాలక్రమంలో అది లేములవాడ, ఆ తర్వాత వేములవాడగా స్థిరపడింది. ఆ పేరు మీదే ఏడాదిలో మొత్తం 44 కథలు రాశాను. ఇటీవలే ‘లేంబాల వాటిక కథలు’ పుస్తకం పాలపిట్ట బుక్స్ ప్రచురించింది.

* అలిశెట్టి ప్రభాకర్, కేఎన్‌వై పతంజలి లాంటి వారితో మీ పరిచయం గురించి..?

నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం. అలిశెట్టి ప్రభాకర్ గారు బొమ్మలు బాగా గీసేవారు. ఆయన జగిత్యాల‌లో ఉన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో చిత్రలేఖనం నేర్చుకున్నాను. ఆయనకు ఫొటోగ్రఫీ అన్నా ప్రాణం. మా అన్న పి.ఎస్.రవీంద్ర ఆయన దగ్గరే ఫొటోగ్రఫీ నేర్చుకున్నాడు. ప్రభాకర్ చాలా నిరాడంబరమైన మనిషి. ఏ విషయమైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేవారు. కేఎన్‌వై పతంజలి గారితో మరో రకమైన అనుభవం. అప్పటికి ఆయనంత గొప్ప రచయిత అన్న విషయం కూడా నాకు తెలియదు. ఆయన ‘చూపున్నపాట’ కథ చదివి ఆయన రచనల మీద ప్రేమ కలిగింది. మా చిన్నచెల్లెలిని వాళ్లింట్లో కూతురిలా చూసుకునేవారు. ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. వారు సాయంకాలం దినపత్రికకు ఎడిటర్ గా ఉన్నపుడు ‘ది ఏషియన్ ఏజ్’ లాంటి పత్రికలోని ఆర్టికల్స్ అనువాదం చేయమని ఇచ్చేవారు. ఉదయం తెచ్చుకుని, సాయంకాలం ఇచ్చేవాణ్ణి.

* మీకు నచ్చిన రచయితలు?

చలం సాహిత్యంతో ప్రేమలో పడ్డవాణ్ని నేను. ఆయన నవలలన్నీ చదివేశాను. వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’ నవల సీరియల్‌గా వస్తున్నప్పుడు చదివి బైండింగ్ చేసి దాచుకున్నాను. గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, నవీన్ ‘అంపశయ్య’, కొ.కు ‘చదువు’ ఇలా చాలా నవలలు చదివాను. కథలు చదివింది తక్కువే! అందులో శంకరమంచి సత్యం గారి ‘అమరావతి కథలు’ చాలా ఇష్టం. ఆ కథల్లోలాగే మా ఊళ్లో రాజరాజేశ్వరస్వామి గుడి ఉండటం వల్ల అవన్నీ మా ఊరి అనుభవాల్లాగే అనిపించాయి. ‘చాసో కథలు’ అప్పుడే చదివాను. ఆ పుస్తకాలు ఇంకా నా దగ్గర ఉన్నాయి.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

యూనిఫామ్డ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేశాను. రకారకాల అనుభవాలు చూశాను. వాటి నేపథ్యంలో ‘డ్యూటీ కథలు’ రాయాలని ఉంది.

*

 

పిన్నంశెట్టి కిషన్

4 comments

Leave a Reply to చంద్ర శేఖర్ ప్రతాప Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవ్వతో సహా రైతుల మీద ఉత్పత్తి భాగస్వాముల మీద సాగుతున్న మార్కెట్ దోపిడీ ని కొంత గా నైనా ప్రస్తావన చేస్తే ప్రయోజనం ఇనుమడించేది.
    బాధ్యతగల కార్యనిర్వాహక వ్యవస్థ ప్రతినిధిని అని చెప్పుకున్న రవీందర్ సినిమాటిక్ ఆదర్శంలో కొంత అసహజత్వం చోటు చేసుకుంది.

  • ఖాకీ కరుకు యూనిఫాం వెనక గుండె వుంటే ఎంత బాగుంటుందో అనిపించే కథ! ఇలా అందరూ ఉండాలనే అత్యాశ కూడా కలిగించే కథ! చిన్న చిన్న వ్యాపారాలు (?) ఇలా అనవచ్చా వాటిని! చేసుకుంటూ జీవిక కోసం పరితపించే జీవులు మనచుట్టూ వుంటారు ! అలాగే మన జీవితాలు వాళ్ళ వ్యాపారం కోసం తాకట్టు పెట్టించుకుని రోజూ కనిపించని ఉచ్చును వేసి వారికి శాశ్వత ఆదాయవనరుగా మార్చుకునే బడా వర్గాల వారూ ఉంటారు!
    సంక్లిష్ట సమాజ స్థితిగతుల్లో మానవీయ విలువల కోసం కొట్టుకునే ఒక గుండె తారస పడితే …. ఈ కథ లాగే ఉంటుంది.. ఇలాంటి కథలు విరివిగా రావాలి ! సహజ సిద్ధమైన హృదయ స్పందనలు కలిగివున్న మనుషులతో ప్రపంచం క్రిక్కిరిసిపోతే బాగుండు! రచయిత స్వీయ అనుభవం లో వచ్చిన కథ అవడం వల్ల మంచి కథనం దానంతట అదే కథ నిండా పరచుకుంది…

  • Good morning Kishan…ధర్మకాటా.. నిజంగానే ధర్మకాటానే కిషన్. నలభైఏండ్ల డిపార్ట్మెంట్ అనుబంధంలో…. డిపార్ట్మెంట్ అనుభవాలను రచనారూపంలో చదువుతుంటే అదో అధ్భుతమైన అనుభూతి. బేరాల గురించి, కోసర్ల గురించిన పచ్చి నిజాలను అవ్వచేత పలికించిన తీరుకి hats-of! సమాజంలో గమనిస్తున్న మోసాల్ని, ధగాల్ని గురించి Inspector మనసులోని భావాల్ని కూడా తెలంగాణా మాండలికంలో చెప్పింటే మరింత సహజంగా వుండేదేమో కిషన్. ఇంత మంచి రచన చేసిన నీకు హృదయపూర్వక అభినందనలు.💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు