బాపు తీసిన వంశవృక్షం సినిమా వచ్చేసరికి నేను టీనేజర్ని. అప్పటికే బాపు సినిమాలంటే ఒక ఆరాధనా భావం. అలా వెళ్ళి ఈ సినిమా కూడా చూశాను. సినిమా అంతా ఏవేవో గంభీరమైన విషయాలు, కాన్సెప్టులు. జె వి సోమయాజులు వేసిన పాత్ర చెప్పే భారీ డయలాగులు. ఆ వయసులో ఏమీ అర్ధం కాలేదు, కానీ మొత్తానికి ఇవన్నీ చాలా లోతైన విషయాలు అని మాత్రం తట్టింది. కథలు, నవలలు చదివే అలవాటు అప్పటికే బాగా ఉన్నా, ఈ సినిమా ఒక కన్నడ నవల ఆధారంగా తీశారని తెలియదు, చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ నా పరిధిలో లేరు అప్పట్లో.
తరవాత చాలా ఏళ్ళకు గానీ నవలా రచయితగా శ్రీ భైరప్పని పరిచయం చేసుకో లేకపోయాను. నా దురదృష్టమనే చెప్పాలి, ఎందుకంటే విపరీతంగా చదివే కోరికా, చదవడానికి తీరికా తగ్గిపోతూ వచ్చాయి అప్పటికి. ఐనా భారత పర్యటనల్లో మూడు నవలలు కొనుక్కో గలిగాను. ఆయన పాతిక దాకా నవలలు రాశారు. కేంద్ర సాహిత్య ఎకాడమీ పుణ్యమా అని చాలా నవలలు తెలుగులోకి అనువాదం అవడమే గాక ఈ అనువాదాలు అనేక పునర్ముద్రణలు పొంది ఎప్పటికప్పుడు దొరుకుతూనే వచ్చాయి. అలాగ ఈ మూడు నవలలు కొనుక్కుని చదవగలిగాను – దాటు, పర్వ, వంశవృక్షం.
దాటు నవల నన్ను చాలా ప్రభావితం చేసింది. భారతీయ స్వాతంత్ర్యానికి కొద్ది సంవత్సరాల ముందు నుంచీ స్వతంత్రం వచ్చిన తరవాత కొద్ది సంవత్సరాల కాలం వరకూ, సుమారు పదేళ్ళ కాలంలో కర్నాటక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో జరుగుతూ వచ్చిన పరిణామాలు చిత్రించారు ఈ నవలలో. ఆ దేశ కాల పరిస్థితుల్లో ఎన్నో విభిన్నమైన ఆలోచనలు, శక్తులు బలంగా రేకెత్తి ఉన్నాయి. మనుషుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ఉన్నాయి. ఐనా భైరప్పగారు ఏ ఇజానికీ గొడుగు పట్టకుండా, ఏ ఆలోచననీ ఇదే మంచిది, ఇది మాత్రమే చెడ్డది అని తీర్పులు ఇవ్వకుండా, సమాజ గమనాన్ని అత్యంత సూక్ష్మ దృష్టితో పరిశీలించి, గొప్ప సంయమనంతో ఈ నవల రాశారు. ఒక సామాజిక నవల రాయాలి అని ఆశ పడే రచయితలకి – నవలకి తగినంత పెద్ద కాన్వాస్ ని ఊహించుకోవడంలో, రచనా శిల్పంలో, పాత్ర చిత్రణలో – ఈ నవల ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పవచ్చు. భారత స్వాతంత్ర్యం చుట్టూ అల్లిన అనేక రచనలు నేను చదివాను దేశం నలు మూలల నించీ, అనేక భాషల నించీను. దాటు నవల ఈ జాన్ర లో తలమానికం అని నా ఉద్దేశం.
పాఠకులకు చాలా మందికి కనీసం పేరైనా తెలిసిన నవల బహుశా పర్వ. మహాభారత కథ ఆధారంగా రాసిన నవల. మూల కథలోని అతిశయోక్తులని, మాయ మంత్రాలనీ, మతపరమైన చర్చలనీ పరిహరించి, కథలోని ముఖ్య సంఘటనలని యథాతథంగా స్వీకరించి పూర్తిగా ఒక మానవీయ కోణంతో ఈ నవలని నిర్మించారు. నవలలోని చాలా అధ్యాయాలు ద్రౌపది, కుంతి, గాంధారి వంటి స్త్రీపాత్రల మనోగతమైన ఆలోచనల ఆధారంగా నడిపించారు కథనం. అలాగని ఏ పాత్రకూ అన్యాయం చెయ్యలేదు, ఔచిత్యానికి భంగం కలుగనియ్య లేదు. నిజంగా జరిగిన చరిత్ర లాగా, ఆయా సంఘటనలు జరగడానికి ముఖ్య కారకులైన ఆయా పాత్రలు ఇలాగే ఆలోచించి ఉంటారేమో అనిపిస్తుంది పాఠకులకి.
వంశవృక్షం నవలని విశ్లేషించే శక్తి నాకు లేదు. అందులో ఆయన చర్చకు పెట్టిన అంశాలు చాలా వాటిపై నాలో నాకే పరస్పర విరుద్ధమైన ఆలోచనలు ఇప్పటికీ సంఘర్షిస్తూ ఉంటాయి. బహుశా ఆ సంఘర్షణే భైరప్పగారి ఉద్దేశమేమో. కానీ ఒకటి తోచింది. పాఠకులు చాలా మట్టుకి కాత్యాయని, రాజు లతో ఐడెంటిఫై అవుతారు. శ్రోత్రి గారి పాత్ర (సినిమాలో సోమయాజులు వేసిన పాత్ర) తో కనెక్ట్ అవడం కష్టం. ఐనా సరే, ఆయన్ను తప్పు పట్టలేం, ద్వేషించలేం. కొద్దో గొప్పో కించిత్ గౌరవం కూడా కలుగుతుంది ఆయనంటే. రాసినవారు భైరప్ప అంత సమర్ధులు, సంయమనం కలిగిన వారు అయుండకపోతే, శ్రోత్రి ఒక రాక్షసుడిగా, దుర్మార్గుడిగా మిగిలిపోయే వాడు.
ఆయన రచనల్లో, తాత్విక దృక్పథంలో భారతీయ ఆత్మని పట్టుకున్నారు.
ఈ మూడూ ఇరవయ్యో శతాబ్దం మధ్య కాలంలో రాసినవే. భైరప్ప గారి మరణవార్త తెలిశాక ఆయన వికి పేజికి వెళ్ళి చూశాను. గత ముప్ఫై యేళ్ళుగా ఆయన కొత్త నవలలు రాస్తూనే వచ్చారు. 1990 తరవాత భారత దేశంలో అమలు అయిన కొత్త ఆర్ధిక విధానాలు, తదుపరి రాజకీయ సామాజిక పరిణామాలను భైరప్ప ఎలా చూశారు, తన రచనల్లో ఏం చిత్రించారు అని ఇప్పుడు నాకు కుతూహలం రేకెత్తింది. ఈ కొత్త నవలలు కొన్ని అయినా చదవడానికి తీరిక చేసుకోవాలి.
*
Add comment