“ప్రేమ మీకు కిరీటం పెడుతుంది, అదే ప్రేమ మిమ్మల్ని శిలువ వేస్తుంది”
ఖలీల్ జిబ్రన్ ‘ద ప్రాఫెట్’లో ఇలాంటి వాక్యాలు చదివి మ్యూజింగ్స్ అంటే ఎంత బాగుంటాయ్ అనుకునేవాన్ని.
“నిజంగా నన్ను ఎవరు బాధపెట్టగలరు? నా ఆలోచన తప్ప ఇంకేమీ కాదు.” అంటూ మార్కస్ ఎరేలియస్‌ని చదువుతూ ‘ఓ ఎంత తాత్వికత!’ అనుకుంటూంటే ఇలాంటి రాతల మీద ఇష్టం స్థానంలో ప్రేమా పెరిగింది. ఇక తెలుగులో దాశరథి రంగాచార్యుల “జ్ఞాపకాల జలపాతం”, చలం మ్యూజింగ్స్ అంటూ మరికొన్నీ…
అయితే ఇవన్నీ జీవితాన్నీ, పోరాటాన్నీ కాచి వడబోసినవి. మేధావులనదగ్గవాళ్ల మాటలూ, రాతలూ…
అయితే నన్నొక కన్నీటి మధుపాత్రికలో ఊరేసినట్టు రాయటం అదీ పాతికేళ్లు దాటని ఓ కుర్రతాత్వికతలో మునిగిపోవటం. ఇదే మొదటిసారి… ఇలా రాయటానికి, వాటిని బహిరంగ పరచటానికీ ముందు ఆ రాసినవాడి మనసు ఎంత కల్లోలంగా ఉండి ఉంటుంది? తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మీద ఎంత ప్రేమా, కోపమూ, వ్యతిరేకతా, ఇష్టమూ అన్నీ కలిసిపోయి వాన్ని కుదిపి ఉంటాయీ… కవితల్లా అనిపించేవి, జస్ట్ ఏదో ఒక ఆలోచనలా కదిలి వెళ్లిపోయేవి, చిన్న కథలా అనిపించేవి… చాలా ఉన్నాయి ఈ మ్యూజింగ్స్‌లో…
‘తలలు పగలగొట్టబడిన విగ్రహాల లెక్కలుండొచ్చు; కానీ ఒక మనిషి బతికుండగానే ఎన్నిసార్లు పగలగొట్టబడతాడో ఆ లెక్క ఎవరు గుర్తు పెట్టుకుంటరు తలలు దాచుకోవడానికి అలవాటు పడ్డంక’ (గ్రేట్ పీపుల్) ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది? లోలోపలే కూలిపోతున్నా సైకలాజికల్ పర్సనాలిటీలని గుర్తించాల్సినంత అవసరం ఎక్కడ మొదలై ఉంటుంది?? సమాధానం. కాదు, సమాధానాలు మిగతా ముక్కల్లో దొరుకుతాయి… పూర్తి వ్యక్తిగత స్థాయిలో మొదలైన ఆలోచన సామాజికమై, సార్వజనీనమూ అయింది. మొరల్స్ మాస్కుల కింద ఉండే నిజమైన ముఖ్హదర్శనం అవుతుంది. ఇంతకీ ఆ మొహాలన్నీ ఎవరివీ? మనవే… చదువుతున్న ప్రతీ వాడికీ ఎదురైన, చూసిన ఘటనలే కాదు ఆలోచనలూ ఇలాంటివే ఉంటాయి. అయితే, అవి బహిర్గతం చేసే ధైర్యమో, తెంపరి తనమో మనలో లేదు. తను ఓపెన్ చేశాడు.
ఇదేమీ కష్టాలనీ, బాధలనీ గ్లోరిఫై చేసుకునే ప్రయత్నం కాదు లోలోపల అనీజీనెస్‌ని వొమిట్ చేసుకునే ప్రయత్నం. ఎలాగైనా మెడడును తొలుస్తున్న దాన్ని బయటికి పంపాలన్న ప్రయత్నం.
రచయితగా, రాతగాడిగా లేదూ రాతగత్తె(ఇలా అనొచ్చా? ఏమో! అనేద్దాం)గా బతుకుతున్నప్పుడు లక్ష అడ్డుగోడలుంటాయ్. భాష విషయంలో, పంక్చువేషన్స్ విషయంలో, ఎక్స్ప్రెషన్ దగ్గరా… కొన్ని స్టీరియోటైప్ దృష్యాలకి అలవాటు పడి పోయాం లేదా బయటికి రాలేకపోయాం. అయితే రాతలకూ, ఈ సోకాల్డ్ సభ్యతలకూ దూరంగా రియాలిటీ ఒకటుంటది “గుద్దల్దమ్మున్న అమ్మాయి”లాగా. చదవటానికే ఇబ్బందిగా అనిపించిందా? అదే ప్రదేశంలో ఎన్నో తన్నులు తిన్న ఆమెకి ఎలా ఉండి ఉంటుంది? అందుకే! ఆమెని అలాగే దమ్ముతో తీసుకొచ్చి నిలబెట్టాడు. అయ్యో! అయ్యో!! అంటూ మనం గుండెలు బాదుకున్నా ఆమె దమ్ము “అక్కడే” ఉంది.
“ఏది ఎవరికి డిఫికల్ట్ అనేది ఎక్కువగా ఎవరికి వాళ్లకు మాత్రమే తెలిసే విషయం” (డిస్కనెక్ట్) పాఠకుడా! నీలో నువ్వు ఎన్నివందలసార్లో అనుకుని ఉంటావీ మాట ఇప్పుడొకడు నీలో ఉన్న మాటకి ఒక వాక్యరూపం ఇచ్చి అక్షరాల్లోకి మార్చాడు. చదువుకో నిన్ను నువ్వే. ప్రేమ, కోపం, ఆవేశం, ధైర్యం అన్నీ ఒకే దేహంలో సహజంగా కదులుతాయి. అవి బయటకు వచ్చినప్పుడే అది వ్యక్తి స్థాయిని దాటి వ్యవస్థా, సమాజం అనే రూపం తీసుకుంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, సమూహ చట్టం మధ్య సంఘర్షణ ఇక్కడ ప్రధాన తత్త్వం.
పొలాలు, వర్షం, పంటలు, పశువులూ… వాటితోనూ మనిషికి ఉండే పోలికలు చూపించటం ఆధునిక ఎకో-ఫిలాసఫీకి దగ్గరగా ఉంటూనే, అంతా ఏదో కలగాపులగంగా అనిపిస్తూనే ఒక స్పష్టమైన ఆలోచనని మాత్రం ఇస్తాయి. గ్రామీణ సమాజం లోని ఆర్థిక, సామాజిక, మానసిక స్థితిగతులను చూపించే శక్తివంతమైన రచన.
ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక తరం ఎదుర్కుంటున్న మానసిక స్థితి. డిప్రెషన్, స్ట్రెస్ అంటే సాఫ్ట్వేరోళ్లకి, సిటీ పీపుల్‌కీ వచ్చే “పోష్ ప్రాబ్లెమ్స్” మాత్రమే కాదు. ఎన్నో ఏళ్లుగా గ్రామాల రైతులూ, వాళ్ల భార్యలూ, పిల్లలూ ఎదుర్కుంటున్నవి. వేల ఆత్మహత్యలకు కారణమవుతున్నవి కూడా. వాటికి కారణం ఏమిటో, మనం విస్మరిస్తున్నదేమిటో గుర్తు చేసే రాతలివి.
ఇప్పుడు కాసేపు టెక్నికల్ సాహిత్య భాషలో మాట్లాడుకుందాం:
రచయిత భాష సజీవంగా, శిల్పసౌందర్యంతో ఉంది అయితే ఇది రైటింగ్ టెక్నిక్స్, ఎడిటింగ్‌లాంటి దిద్దుళ్లతో లేదు. అంతా పచ్చిలిక్కర్ వాసనలాంటి ఎక్స్ప్రెషన్ మాత్రమే. పదాల మధ్య స్థానిక మాండలికం, పల్లె నుడికారాలు ప్రామాణికతను పెంచాయి. పాత్రల సంభాషణలు సహజంగా నిజజీవితానికి దగ్గరగా చెప్పబడ్డాయి. పల్లెటూరి జీవనశైలిలోని పద్ధతులు, ఆర్థిక అసమానతలు, మానవ సంబంధాల లోతు ఇలాంటివన్నీ గాఢంగా ప్రతిఫలిస్తాయి. ప్రతీ రైటప్ వ్యక్తిగత పోరాటం, అతని స్వప్నాలు, విలువలు చుట్టూ తిరుగుతుంది. అయితే అది వ్యక్తిగత స్థాయిలో ఆగకపోవటమే దీనికో విలువని తెచ్చింది.
ఇప్పటి వరకూ “ఈ రోజు నేను కలుసుకునేవారు, అవగాహన లేని వారు, కృతఘ్నులు. అయినా వారు నా సోదరులే.” లాంటి ఆలోచనలని ఏ మార్కస్ ఎరేలియస్ నుంచో తెలుసుకునే పనిలేదు. ఇదిగో ఇక్కడ “నాదగ్గర మంచితనం, ప్రేమా ఉన్నాయని నమ్మించాలనుకున్నాను. వాటితో మనం సంపాదించిన వేటలో నీ పోగు త్యాగం చేస్తావా? అని అడిగారువాళ్లు” అని చెప్పగలిగిలిన వాడు మనదగ్గరే ఉన్నాడు.
ముందు ఇక్కడ నుంచీ మళ్లీ మొదలు పెడదాం.
*
నరేష్ గారు,
మీ పరిచయం చాలా బావుంది. మార్కస్ అలీరియాస్, ఖలీల్ జిబ్రాన్ లాంటి మేధావుల కు సరి సమానం గా ఆలోచించే వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని తెలియడం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. పుస్తకం ఖచ్చితం గా కొని చదువుతాను.