నీకున్న బాధ నాకుండక పోవొచ్చు
నాకున్న బాధ నీకుండక పోవొచ్చు
అసలొకటికానీ నీబాధ నా బాధ
ఒక్కటిగానే తిరుగుతుండొచ్చు.
సగం నీదుఃఖం నా దుఃఖం పొత్తు కలవొచ్చు
నువ్వు నేను నాలోని నీనేను
ఏ బాధల తాళ్లకో కట్టబడుండొచ్చు
ఉచ్చుముడిలో బిగుసుకుపోయి
జీవితపు మడిలో
మునువు ఎల్లలేక అక్కడక్కడే కూలబడొచ్చు.
మహా అయితే కొంచెం కదలొచ్చు
లేదా కదులుతున్నట్టు నటించొచ్చు.
వేడి వేడి నూనె వాగులో
ఈదుతుంటే దరిదొరకక పోవొచ్చు.
చూసినవాళ్ళెవ్వరూ పట్టించుకొక పోవొచ్చు.
ఎవరి బావిలో ఎన్ని కన్నీళ్ళు
వూరుతుంటాయో తెలియదు.
ఎవరూ ఏ కొడవలి లిక్కితో
కళ్ళపువ్వుల గొంతుల్ని
కొస్తుంటారో అంతు బట్టదు.
అసలీ మనిషి నెత్తురు మీద
ఎన్ని దెబ్బలు పడుతున్నాయో
లెక్కకు రాదు.
ఎవరు ఎవరి నవ్వులకు నిప్పంటిస్తారో
పసిగట్టలేము.
ఒకానొక మత్తులో ఉన్న వ్యవస్థ
నిన్ను నన్ను ఏ వ్యానుతోనో గుద్దిపోవొచ్చు..
కూరలేదనో అన్నం ఉడకలేదనో
అక్కడికి ఎందుకు పోయావనో
ఇక్కడే ఎందుకు ఉన్నావనో
వేడి వేడి మాటలతో
అచ్చులు పడేలా కొట్టొచ్చు.
తెల్లారే సరికి
పచ్చినొప్పులతో ఆకాశం
కమిలిన చేయి,
దడ దడలాడుతున్న గుండె
చేసిన తప్పేంటని
బరువుతో అడుగుతూనే వుంటుంది.
తప్పు గొంతు విప్పదు
విప్పినా సత్యం మాట్లాడదు
తప్పు ఆలోచించదు
తప్పుకసలు ఆలోచన నాడీ వ్యవస్థే ఉండదు.
మెత్తగున్న వాళ్ళని మరింత మెత్తగ చేసి
ఏడిపించే పొర ఒకటుంటుంది
మాటల మిషన్లతోనే
లోలోపల బరాలు పెట్టే మనుషులుంటారు.
బాంబులు పెట్టి పేల్చుతారు.
మనవాళ్లే మన గొంతు పట్టడం
మనవాళ్లే మన కుండల్లోకి
రాళ్లు వదలడం
అబ్బబ్బబ్బా
జీవితం ఎన్ని సార్లు తాటిచెట్టు మించి
జారిపడి బతుకుతుందో !.
ఎన్ని గుబురుముళ్ల పోదలను
దాటుకుంటూ నడుస్తుందో !.
బాధగా చిక్కగా
చాలా కఠినంగా
రాత్రంతా నడిచిన కథ
తెల్లారే సరికి నువ్వనుకుంటున్న
ముగింపుకు రాదు..
ఒక కథల్లోకి మరొక కథ
మరొక కథల్లోకి మరింకో కథ
తలలూపుతూ
నిలువుగా.. అడ్డంగా
తిరుగలమరగల పాకుతూ మానబోతున్న పుండునల్లా
మళ్ళా మళ్ళా పచ్చి చేస్తూనే ఉంటుంది.
*
చిత్రం: సృజన్ రాజ్
woooooooo excellent 👌
థాంక్యూ.. సుష్మ
అవును…. పచ్చిపచ్చిగానే వుంది…
వెచ్చగాను వుంది.
నులివెచ్చని మనిషిని తట్టిలేపుతున్నట్లే వుంది.
మంచి కవిత సోదరా… అభినందనలు…
ధన్యవాదాలు అన్నా
Nice poetry bro
చాల గొప్పగా రాస్తున్నారు 🙏🙏💐❤️✊
థాంక్యూ అన్నా
రామూ…ధారలాగ సాగిపోయింది. అనేక విషయాలను చెప్పావు. చాలా బాగుంది.
అన్నా.. ధన్యవాదాలు
కవిత చాలా బాగుంది మిత్రమా!
జీవితం సాఫీగా సాగే పయనం కాదు సుఖదుఃఖాలు ఎప్పుడైన మలుపులు తిరుగుతూండచ్చు… 👌
ధన్యవాదాలు మిత్రమా☘️☘️
కవిత బాగుంది.
కొడవలి అన్నా, లిక్కి అన్నా ఒకటే. కొడవలి పెద్దది. లిక్కి బుజ్జిది. కొడవలి కోతకు, లిక్కి కలుపుకు వాడతరు. ఒకవేళ అయ్యి రెండూ కావాలనే రాసుంటే ఓక్కే.
ధన్యవాదాలు అన్నా
కవిత చాలా బావుంది తమ్ముడు
అన్నా.. ధన్యవాదాలు☘️