బ్రహ్మం ఆయాసపడుతూ మెట్లెక్కి ఆ గది తలుపులు తెరిచి ఉండడం గమనించి చిన్నగా ఊపిరి పీల్చుకున్నాడు. పుస్తకాలతో కుస్తీ పడుతున్న కిరీటి అడుగుల సవ్వడి విని తలెత్తి చూసి- “అరె! బ్రహ్మం గారా? రండి! రండి!” అంటూ ఆహ్వానించాడు.
అతడు చూపించిన కుర్చీలో కూలబడ్డాడు బ్రహ్మం.
“నా గదెలా తెలిసిందండీ మీకు?”
“నోరుంటే తెలుస్తుందోయ్!” బిగ్గరగా నవ్వాడు బ్రహ్మం.ఆ తర్వాత మళ్ళీ అన్నాడు- “అసలేం జరిగిందంటే- నేను చిన్న పని మీద బయల్దేరాను ప్రొద్దున్నే! దారిలో మీ నాన్న తగిలాడు. నువ్వెక్కడో అమెరికాలో ఉండి చదువుకుంటున్నావన్న బెంగాయనకు! ఎలాగూ విజయవాడ వెళ్తున్నావుగా? మావాడు ఎలా ఉన్నాడో కాస్త చూసిరా! అని పురమాయించాడు. నీ గదికి కొన్ని ఆనవాళ్ళు కూడా చెప్పాడు. నేనొచ్చిందేమో ప్రజల కార్యం మీద. అది పూర్తి చేసుకుని, అలా అలా వాకబు చేసుకుంటూ, అసలు నువ్వుంటావో ఉండవో అని సంశయిస్తూనే మెట్లెక్కాను. ఉన్నావ్! చక్కగా కూర్చుని చదువుకుంటున్నావ్! ఎంతైనా నువ్వు బుద్ధిమంతుడవోయ్! తప్పకుండా వృద్ధిలోకి వస్తావ్! నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.”
పొగడ్తకు ఉబ్బిపోనివాడు అసలు మనిషి కాదు. కిరీటి తనూ మనిషనిపించుకున్నాడు. ఈలోగా బ్రహ్మం కుర్చీలోంచి లేచి గది నలుమూలలా పరకాయించి చూసాడు.
“గది చాలా నీటుగా ఉందోయ్! బ్రహ్మచారి గదికి నిర్వచనం మార్చేయాలన్నట్లుంది. తోడుగా- చక్కని గాలి,వెలుతురు, ప్రశాంతమైన వాతావరణం! ఒష్షో! నీ గది నాకు చాలా నచ్చిందోయ్!”
కిరీటి చెబ్దామనుకున్న “థాంక్స్” అన్నమాట పెదవి దాటేలోగా- తిరిగి బ్రహ్మమే అడిగాడు- “అవునూ! నీ కూజాలో నీళ్ళు చల్లగా ఉంటాయా?”
అతడు అడిగినదానికి అనాలోచితంగానే తలూపాడు కిరీటి.
“ఏది? ఒక గ్లాసందించు! దాహమేసి కాదు. నీ కూజా నాణ్యత పరీక్షిద్దామని! అంతే!”
కిరీటి అందించిన గ్లాసెడు నీళ్ళూ గటగటా తాగేసి, కళ్ళు పెద్దవి చేసి అన్నాడు బ్రహ్మం- “ఆహా! ఐస్ వాటర్ కూడా ఈ కూజా నీళ్ళ ముందు దిగదుడుపు. ఏదీ! మరో గ్లాసందుకో! ఏమీ అనుకోకపోతే!”
“మీరు రాత్రికి ఇక్కడే ఉంటారా?” నీళ్ళందిస్తూ అడిగాడు కిరీటి.
“భలే వాడివి! రాత్రి బండికి వెళ్ళిపోతాను. రేపు ఉదయానికల్లా గుడివాడలో ఉండాలి. చాలా పనులున్నాయి.”
“నేను బాగానే ఉన్నానని చెప్పండి నాన్నకు. వచ్చే…!”
కిరీటి మాటలకు అడ్డం పడ్డాడు బ్రహ్మం. “ఆగవయ్యా బాబూ!! అప్పుడే అప్పగింతలు పెట్టేయకు. నాకింకో చిన్న పని ఉంది. అది చూసుకుని మరో గంటలో మళ్ళీ వస్తాను. అప్పుడు చెప్దువుగాని! ఎవరెవరికి ఏమని చెప్పాలో! సరేగాని నువ్విప్పుడు బయటికెక్కడికీ కదలవు కదా?”
లేదన్నట్లు తల తిప్పాడు కిరీటి.
“మరి భోజనానికి వెళ్ళవూ?”
“నాది స్వయంపాకమే కదండీ! ఎక్కడికీ వెళ్ళను. గదిలోనే ఉంటాను. మీరు వెళ్ళి రండి!”
“భేష్! వంట కూడా చేసుకుంటున్నావు కదూ? మర్చేపోయాను. ఈసారి వచ్చినప్పుడు నీ వంట కూడా రుచి చూస్తాను. మరి వెళ్ళి రానా?”
బ్రహ్మం వెళ్ళగానే, తిరిగి పుస్తకం తెరుస్తూ ఆలోచనలో పడ్డాడు కిరీటి.
బ్రహ్మం తన ఊర్లో ఉన్న ఉన్నవాళ్ళలో ఒకడు. పరోపకారి అని పేరుంది. ఆ పేరు నిలబెట్టుకోవడమా అన్నట్లు వాళ్ళ పనీ, వీళ్ళ పనీ నెత్తినేసుకుని ఊళ్ళు తిరుగుతుంటాడు. నాన్న అడిగీ అడగ్గానే తన కుశలం కనుక్కోవడానికి పనిగట్టుకుని వచ్చాడు. బాగానే ఉంది కాని మళ్ళీ వస్తానన్నాడెందుకని? ఏమో?”
కిరీటి చేతి గడియారం చూసుకున్నాడు. ఆరయింది. అప్పుడే సన్నగా చీకటి అలుముకోవడం మొదలయింది. పుస్తకం మూసేసి తన గది ముందున్న ఆవరణలోకి వచ్చాడు. పిట్టగోడనానుకుని నిలబడి క్రింద తోటలోకి తొంగి చూసాడు. ఆ టైంలో పూల మొక్కల మధ్య వనకన్యలా తిరిగే లాలస జాడ ఎక్కడా కనిపించలేదు. అంతలోనే గుర్తొచ్చింది- ఆరోజు ఫస్ట్ షో సినిమాకు వెళ్తున్నామని లాలస చెప్పిన విషయం.
చెప్పాలంటే- అది చిన్న మేడ. క్రింది భాగంలో రెండు వాటాలున్నాయి. ఒక దాంట్లో రిటైరైన ఇంటాయన, ఆయన భార్య ఉంటారు. రెండో వాటాలో బి.ఎ చదువుతున్న లాలస, ఆమె తల్లీతండ్రీ అద్దెకుంటున్నారు. మేడ మీద అన్ని వసతులున్న ఔట్ హౌస్ లాంటి పెద్ద గది కిరీటి అద్దె సామ్రాజ్యం. కిరీటి లాలసను ప్రేమిస్తున్నాడు. తను చదువుతున్న ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం పూర్తి కాగానే, చకచకా ఉద్యోగం సంపాదించేసి, తన వాళ్ళను ఒప్పించేసి లాలసను పెళ్ళాడేయాలనుకుంటున్నాడు. మేడ మెట్లకు క్రిందగా ఉన్న సన్నజాజి పందిరి దగ్గరే, అందరూ నిద్ర పోయాక ఈ రోమియో జూలియెట్లు ఇద్దరూ కలుసుకుని ఊహల గుసగుసలలో మునిగి తేలుతుంటారు.
కిరీటి తిరిగి గదిలోకి వచ్చాడు. బియ్యం కడిగి స్టౌ మీద అత్తెసరు పెట్టాడు. ఊరగాయ, పెరుగూ ఉన్నాయి. ప్రొద్దుటి తాలూకు సాంబారు ఉండనే ఉంది. “ఈ పూటకు వీటితో కానిస్తే సరి” అనుకున్నాడు. అతడు భోజనం ముగించేసరికి టైం ఏడయింది. ఇక చదువు మొదలుపెట్టాలని పుస్తకం తెరిచాడో లేదో- గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యింది బ్రహ్మం నవ్వు ముఖం.
“గుడ్! చదువుకుంటున్నావన్న మాట!” అంటూ లోపలికొచ్చాడు.
“రండి! కూర్చోండి” అన్నాడు కిరీటి.
బ్రహ్మం కూర్చోలేదు. ఏదో ఆలోచిస్తున్న వాడిలా నిలబడే ఉండిపోయాడు.
“ఇప్పుడు ఇక్కడికెవరూ రారు కదా?” చటుక్కున అడిగాడు.
“ఎవరూ రారే!” అర్థం కానట్లు చూస్తూ అప్రయత్నంగా అన్నాడు కిరీటి.
“చిన్న ఇబ్బంది వచ్చి పడిందోయ్! అవునూ! వేరేలా అనుకోకు! నీకు మందు కొట్టే అలవాటుందా?” ఠక్కున అన్నాడు బ్రహ్మం.
అతడన్నది అర్థం కావడానికి రెండు క్షణాలు పట్టింది కిరీటికి.
“అబ్బే! లేదండీ! నాకలవాటు లేదు” తేరుకుని అన్నాడు.
“నాకు తెలుసు నువ్వు బుద్ధిమంతుడివని. విషయమేమంటే- నేను చిన్న చిక్కు పరిస్థితిలో ఇరుక్కున్నాను. పరంధామయ్య గారని నా ఫ్రెండొకాయన ఉన్నాడు. చాలా మంచివాడు. పెద్దగా చెడ్డ అలవాట్లు లేనివాడు. చాల రోజుల తరువాత కనిపించాడు. నాలుగు చుక్కల మందుతో గొంతు తడుపుకుందామని అడక్కడక్క అడిగాడు. బారుకయితే ఆయన రాడు. పరమ భయస్తుడు. అక్కడ ఎవడన్నా ఎవడి మీదో గొంతెత్తి అరిస్తే, ఈయన కిక్కు దిగిపోతుంది. అందుకని- ఇక్కడయితే బాగుంటుందని, నువ్వు కాదనవనే నమ్మకంతో ఆయనను తీసుకొచ్చాను. క్రింద ఆటోలో ఉన్నాడు. ఎక్కువ సేపు ఉండం! ఒక్క గంటలో ముగించేస్తాం! అంతే! నీకేమీ అభ్యంతరం లేదు కదా? ఆయనను పిలవనా?” గుక్క తిప్పుకోకుండా చెప్పేసి విషయాన్ని కిరీటి కోర్టులోకి నెట్టాడు బ్రహ్మం. కిరీటికి ఏమనాలో తోచలేదు. అతని మౌనాన్ని ఆసరాగా తీసుకుని- “అమ్మయ్య! పరువు కాపాడావ్!” అంటూ మెరుపు వేగంతో బయటకు వెళ్ళిపోయాడు బ్రహ్మం.
స్థాణువులా అలాగే నిలబడి ఉండిపోయాడు కిరీటి.
“రండి పరంధామయ్య గారూ! ఈ ఎత్తు మెట్లు ఎక్కేదాకానే కొంచెం కష్టం! దిగేయడం తేలికే! భద్రం! నెమ్మదిగా రండి!” జాగ్రత్తలు చెబుతూ ఆయనను గదిలోకి తీసుకొచ్చాడు బ్రహ్మం.
“ఇతనేనండీ మావాడు కిరీటి! బుద్ధిమంతుడు. కనీసం సిగరెట్లు కూడా కాల్చడు.” వంట చేసుకుంటాడు- తింటాడు- చదువుకుంటాడు! అంతే!” అంటూ కిరీటి వైపు తిరిగి- “పరంధామయ్య గారని చెప్పానే! ఈయనే!” పరిచయం చేసాడు.
“నమస్కారమండీ”
“నమస్కారం”
“ఈ కుర్చీలో కూర్చోండి గురువు గారూ! ఎలా వుంది ఇక్కడ? అరిచినా,కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోరు. కూజాలో చల్లని నీళ్ళున్నాయి. అబ్బో! ఈ నీళ్ళ ముందు ఐస్ వాటర్ బలాదూర్ అనుకోండి! మరి నీళ్ళతో పని కానిచ్చేద్దామంటారా?”
“కష్టమండీ! సోడా లేకపోతే మనకు గొంతు దిగదు. మీకు తెలుసుగా?” అయిష్టంగా ముఖం పెట్టాడు పరంధామయ్య.
“అంతేనంటారా? సరే! దాందేముంది? ఏర్పాటు చేద్దాం!” అంటూ కిరీటిని అడగకుండానే గోడకున్న మేకుకు తగిలించి ఉన్న సంచీ అందుకుని కిరీటితో అన్నాడు- “పదవోయ్! అలా బయటకు వెళ్ళొద్దాం!”
“నేనెందుకండీ?”
“ఊరికే తోడు రావోయ్! మళ్ళీ ఇప్పుడే వచ్చేద్దాం.”
కిరీటికి బయల్దేరక తప్పలేదు.
“గురువు గారూ! మీరలా ఫోన్లో పాటలు వింటూ కూర్చోండి! చిటికెలో వచ్చేస్తాం. పదవోయ్!”
పెద్ద పెద్ద అంగలేస్తూ నడుస్తున్నాడు బ్రహ్మం. అసహనంగా అతడ్ని అనుసరిస్తున్నాదు కిరీటి. బ్రహ్మం మీదకన్నా, క్షేమం కనుక్కు రమ్మన్న తండ్రి మీద చాలా కోపంగా ఉందతనికి.
కిరీటి ఉంటున్న సందు చివరికి వచ్చారు. మెయిన్ రోడ్డుకు అవతలే ఎదురుగా ఉంది వైన్ షాప్! బ్రహ్మం రోడ్డు దాటబోతుంటే కిరీటి అన్నాడు- “మీరు వెళ్ళి రండి! నేను ఇక్కడే నిలబడతాను.”
“ఓష్! ఆ దేవాలయంలో అడుగు పెద్తేనే మైలపడిపోతావేమిటి? సరే! నీ సెంటిమెంటెందుకు కాదనాలి?” నవ్వేసి ముందుకు సాగిపోయాడు బ్రహ్మం.
మరో కొద్ది నిముషాలకు తిరిగి వచ్చాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న వాడిలా ముఖం పెట్టి- “నువ్వు రోజూ కాలేజీకి ఎలా వెళతావోయ్?” అడిగాడు.
“బస్సులో”
“అదే! అంటే…ఎక్కడుంది నీ బస్ స్టాప్?
“అదిగో! మీ వైన్ షాప్ పక్కన కనిపిస్తుంది చూడండి పోస్ట్ బాక్స్! దాని పక్కనే ఉంది.”
“మరి తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ దిగుతావ్?”
“ఇక్కడే! మనం నిలబడ్డ చోటు నుంచి అలా కుడి వైపు నాలుగు అడుగులేస్తే ఉంది బస్ స్టాప్.”
“అయితే ఆ సోడా కొట్టువాడు నీకు తెలుసన్నమాట!”
“ఏ సోడా కొట్టువాడు?”
“అదేనయ్యా! నీ బస్ స్టాప్ కి కొంచెం ఇవతలగా కనబడ్డం లేదూ? కూల్ డ్రింక్స్ అండ్ సోడా షాప్ అనే బోర్డు” ఆ కొట్టు వాడు!
“ఒట్టండీ! అతనెవరో నిజంగా నాకు తెలియదండీ! నేనక్కడ ఏమీ కొనను!” బిత్తరపోతూ చెప్పాడు కిరీటి.
“అరె! మరీ అంత కంగారు మనిషివేమిటోయ్ నువ్వు? అనుభవం కొద్దీ చెప్తాను విను! నీకు అతను తెలియకపోవొచ్చు! ఒప్పుకుంటాను. కాని, అతనికి మాత్రం నువ్వు తెలిసే ఉంటావ్! నువ్వు రోజూ కాలేజీకి వెళ్ళేటప్పుడూ, తిరిగి వచ్చేటప్పుడూ- నిన్ను చూస్తూనే ఉంటాడు కాబట్టి! ఇంతకీ విషయమేమిటంటే- ఇప్పుడు మనకి గోలీ సోడాలు కావాలి. మనిషి తెలిస్తేనే, షాప్ వాళ్ళు డిపాజిట్ లేకుండా అవి పట్టుకెళ్ళనిస్తారు. ఇక్కడ నీ ఐడెంటిటీ నాకు ఉపయోగపడుతుంది.”
“గోలీ సోడాలెందుకండీ? ఇప్పుడు సోడా ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ లో కూడా దొరుకుతుంది కదండీ? హాయిగా అవే కొనుక్కోవచ్చుగా?”
“భలేవాడివే! గోలీ కిందకి నొక్కగానే, సుయ్యిమంటూ బుసబుస పొంగే గోలీ సోడాకీ, బిరడా విప్పే ముందే తుస్సుమనే పెట్ బాటిల్ సోడాకి సాపత్యమా? నీకు తెలియదులే కిరీటీ! పెద్దాడ్ని చెబుతున్నా- నా మాట విను! నా పక్కన నుంచో- చాలు! మిగతాదంతా నేను చూసుకుంటాను, పద!” అంటూ కిరీటిని ఆ షాప్ వైపు లాక్కెళ్ళాడు బ్రహ్మం.
కిరీటి,బ్రహ్మం అంత దూరంలో ఉండగానే- “రండి!రండి” అంటూ ఆహ్వానించాడు ఆ సోడా షాప్ యజమాని.
“ఔరా! బ్రహ్మం! నువ్వు ఊహించింది నిజమే!” అనుకున్న కిరీటి తాను పొరబడ్డానని తెలుసుకోవడానికి ఆట్టే సమయం పట్టలేదు.
నిజానికి షాపతను నవ్వొలకబోసింది కిరీటిని చూసి కాదు. బ్రహ్మాన్ని చూసి.
“నువ్వటోయ్ లోకనాథం! ఇక్కడికెప్పుడొచ్చావ్? ఇందాక ఇటునుంచే వెళ్ళాను. అప్పుడు షాప్ లో ఇంకెవరో ఉన్నారు. నీదేనన్నమాట ఈ కొట్టు?” ఉత్సాహంగా పలకరించాడు బ్రహ్మం.
“అవునండీ! బందర్లో టింగురంగా బార్ మూతబడ్డాక, నా బిజినెస్ డల్ అయిపోయింది. అక్కడి కొట్టు అమ్మేసి,ఇక్కడికొచ్చేసాను. ఇందాక మీరు చూసినప్పుడు షాప్ లో ఉన్నది మా బావమరిది లెండి! సోడాలెన్ని కావాలండి?”
“ఆరు చాల్లే! ఖాళీ సీసాలు గంటలో తెచ్చి ఇచ్చేస్తాను. మావాడి రూం ఇక్కడే! తెలుసుగా ఈయన?
“ఎందుకు తెలియదండీ! రోజూ చూస్తూనే ఉంటాను.” నవ్వుతూ చెప్పాడు లోకనాథం.
“ఇకిలించకురా లోకనాథం! నేనూ తాగుబోతునని అనుకుంటున్నావేమో? నా ఖర్మ కాలి ఈ పెద్దమనిషి పాలబడ్డాను. అంతేకాని నాకు తాగుడంటే పరమ అసహ్యమని నీకెలా తెలుస్తుందిరా?” కసిగా లోలోనే అనుకున్నాడు కిరీటి.
బ్రహ్మం అందించిన మందు సీసా ఉన్న సంచీలో సోడా సీసాలు భద్రంగా సర్దాడు లోకనాథం.
ఆ షాపులోంచి బయటకు వచ్చాక,ఆ పక్కనే ఉన్న బజ్జీల బండి వాడి దగ్గర బజ్జీలు, వడలూ వగైరా కొన్నాడు బ్రహ్మం.
తిరిగి రూం కి చేరుకున్నాక- “బాబూ! కిరీటీ! రెండు గ్లాసులుంటే చూడు!” అడిగాడు బ్రహ్మం.
కిరీటి గ్లాసులు కడిగి ఇచ్చాడు. ఒక లోటాతో నీళ్ళు కూడా అందించాడు.
రెండు గ్లాసుల్లో మందు పోసి, సోడా కలిపి, ఛీర్స్ అని ఒక సిప్ కానిచ్చిన తరువాత పరంధామయ్య అన్నాడు- ‘ఈయనకు చాలా శ్రమ ఇస్తున్నాం.”
“అబ్బే!అలా అనుకోడండీ! మావాడు మంచివాడు! బుద్ధిమంతుడు!” ఒక గుక్క లాగించి అన్నాడు బ్రహ్మం.
పొగడ్త కూడా వెగటు పుట్టించగలదని మొదటిసారిగా తెలుసుకున్నాడు కిరీటి. చేతి గడియారం చూసుకున్నాడు. ఎనిమిదయింది.
“బెంగెట్టుకోకోయ్! గంటని చెప్పానుగా? మాటంటే మాటే! తొమ్మిదింటికల్లా ముగించేస్తాం.” కిరీటి టైము చూసుకోవడం గమనించి నవ్వుతూ అన్నాడు బ్రహ్మం.
“అదేం లేదండీ! మీరు కానియ్యండి!” నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు కిరీటి.
బ్రహ్మం,పరంధామయ్య కబుర్లలో పడ్డారు.
చూస్తూ చూస్తూనే సమయం తొమ్మిది దాటింది. వాళ్ళకు కొంచెం దూరంగా కూర్చుని చదువుకుంటున్న కిరీటి ఓరకంటితో మందు సీసా వైపు చూసాడు. ఇంకా సగం మిగిలుంది.
“ఇంకో గంట పట్టేట్లుంది. ఈలోగా సోడావాడు కొట్టు కట్టేస్తే!? బాబోయ్! కొంప మునుగుతుంది. ఈ సీసాలు ఇక్కడే ఉండిపోతాయి.రేపు ప్రొద్దున్న పనిమనిషి అవి చూసిందంటే ఏమనుకుంటుంది? ఒట్టి సోడాలు సరదాకు తెప్పించుకుని తాగాననుకుంటుందా? చస్తే అనుకోదు. నన్నూ తాగుబోతుగా లెక్క కడుతుంది. నో! అలా అనవసరంగా అపనిందల పాలెందుకు కావాలి?” ఇలా సాగుతున్న కిరీటి ఆలోచనలకు భంగం కలిగిస్తూ పరంధామయ్య అన్నాడు- ” ఏమిటి గురువుగారూ! మీరలా నాస్తికులైపోవడం ఏమీ బాగోలేదు. రండి! పూజలో పాల్గొనండి.”
“వద్దులెండి! పాపం కుర్రాడు!బుద్ధిమంతుడు”
“అక్కడే పొరబడుతున్నారు బ్రహ్మంగారూ! మనం నిజానికి అతనికన్నా వయసులో చాలా పెద్దవాళ్ళం. కాని,మధువు సేవించాక పసిపాపలమైపోయాం. మన స్టేజికతన్ని తీసుకురావాలి. అతడలా పెద్దవాడిగా మిగిలిపోవడం నాకేం నచ్చలేదు.”
“అదేం లేదు లెండి! మరోసారి కలుస్తాడు. ఇప్పటికి మనం కానిద్దాం.”- మంది ఎక్కువైతే మందు పలచనైపోతుందని బ్రహ్మం భయం.
“సోడాకొట్టువాడు కొట్టు కట్టేస్తాడేమో” చిన్నగా అన్నాడు కిరీటి
తాడెత్తున లేచాడు బ్రహ్మం.
“కట్టేస్తాడా? చంపేస్తాను వాణ్ణి! మనం తిరిగి వెళ్ళేవరకూ చచ్చినట్లు తెరిచి ఉంచాల్సిందే! కిరీటీ! నీకు చిన్న ఉపదేశం చేస్తాను విను!- నువ్వీ నెలలో ఎన్ని సోడాలు తాగిఉంటావ్? బహుశా తాగిఉండవు. మరి ఒక సంవత్సరంలో…? ఏ రెండు సార్లో మూడు సార్లో! అంతే కదూ? ఇండియాలో ప్రతి మంచివాడూ ఇంతే! వీళ్ళను నమ్ముకుంటే సోడా అమ్ముకునే వాళ్ళు మసయిపోవల్సిందే! నీకీపాటికి అర్థమై ఉండాలి- సోడాల్ని ఆదరించేది- అమ్ముకునేవాళ్ళను పోషించేదీ ఎవరో? మేమే! మందు కొట్టేవాళ్ళందరూ ఒట్టేసుకుని తాగడం మానేసారనుకో! ఏమవుతుంది? సోడా పరిశ్రమే పడిపోతుంది. ఎందరికో జీవనాధారం మంటగలిసిపోతుంది. నేను చెప్పేదేమిటంటే- నువ్వు అనవసరంగా ఖాళీ సీసాల గురించి బెంగెట్టుకోకు. చదువుకో! నువ్వు బుద్ధిమంతుడివి.”
“ధర్మ సూక్ష్మాన్ని ఎంత చక్కగా సెలవిచ్చారు గురూగారూ!” చప్పట్లు కొట్టాడు పరంధామయ్య.
వాళ్ళిద్దరూ తన మాట పట్టించుకునే పరిస్థితి దాటిపోయారని గ్రహించిన కిరీటి చేసేది లేక పుస్తకంలో తల దూర్చాడు.
విస్తరాకు కుట్టే విధానం దగ్గరనుంచి విదేశీ వలస విధానం వరకూ రాని విషయం లేదు నిరాటంకంగా సాగిపోతున్న వాళ్ళ చర్చలో!
టైము చూసుకున్నాడు కిరీటి. పది కావొస్తోంది.వాళ్ళిద్దరూ ఆఖరి రౌండులో ఉన్నారు. సీసాలన్నీ ఖాళీ అయిపోయాయి.
“మీరెంత మంచివారండీ?” అంటున్నాడు బ్రహ్మం.
” అమ్మమ్మ! మీకంటేనా? నొచ్చుకుంటున్నాడు పరంధామయ్య.
“బాబూ! మీరిద్దరూ మంచివాళ్ళే! రేపు ఉదయం దాకా ఈ సీసాలు ఇక్కడే ఉంటే నేనే మంచివాణ్ణి కాకుండా పోతాను.”మనసులోనే గొణుక్కున్నాడు కిరీటి.
వాళ్ళిద్దరి గ్లాసుల్లో విస్కీ ఉంది. అది దిగమింగే సరికి ఎంతైనా అరగంట పట్టేటట్లు ఉంది.
“సోడాసీసాలు ఖాళీ అయిపోయాయిగా? నేను వెళ్ళి ఇచ్చి వస్తాను.” చివరికి తెగించి అన్నాదు కిరీటి.
“పాపం! కుర్రాడు ఉబలాటపడుతున్నాడు. వెళ్ళనీయండి!” రికమెండ్ చేసాడు పరంధామయ్య.
బ్రహ్మం ఒక క్షణం సీరియస్ గా ఆలోచించి సరేననన్నట్లు తలూపాడు.
“బ్రతుకుజీవుడా” అనుకుంటూ సీసాలు సంచీలో సర్దసాగాడు కిరీటి.
“ఆగండి! నేను హెల్ప్ చేస్తాను.” అంటూ ఒక చేత్తో సీసా అందియ్యబోయాడు పరంధామయ్య. ఇంతలో అతని రెండో చేతిలో ఉన్న గ్లాసులో మందు తొణికి కిరీటి షర్ట్ మీద పడింది.
“చూసారా! మీ చొక్కా మందు కొట్టేసింది. మీకన్నా మీ చొక్కాయే నయం.” ఒక్కపెట్టున నవ్వేసాడు పరంధామయ్య.
మెట్లు దిగుతున్నాడే కాని, కిరీటి మనసులో వివిధమైన ఆలోచనలూ- ఆందోళనలూ ముసురుకుంటున్నాయి. ఈ రాత్రి వేళ సంచీతో తనను చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సందులో లైటు స్థంభం దగ్గర పనీపాటా లేని కుర్ర జనాభా సమావేశమయి ఎప్పుడూ చెత్త విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు.ఈరోజు వాళ్ళు లేకుండా ఉంటే బాగుణ్ణు. సన్నజాజి పందిరి దగ్గర ఆగి చూసాడు. లాలస వాళ్ళ వాటాలో లైటు వెలగడం లేదు. గేటు తలుపు తీసాడు. సందులోకి చూసాడు.ఉన్నారు. అల్లరి గాంగ్ కొలువు తీరి ఉన్నారు. “వీళ్ళకు బుద్ధి లేదు. ఎవడింట్లో వాడు కూర్చుని బుద్దిగా చదువుకోకూడదూ?” తిట్టుకున్నాడు. గేటు తిరిగి వేయబోతుంటే సంచీ గోడకు తగిలింది. “మేమున్నాం లోపల” అన్నట్టు సీసాలు గట్టిగా తమ ఉనికిని చాటాయి. తన అజాగ్రత్తకు తనను తాను నిందించుకున్నాడు కిరీటి. వాళ్ళందరూ ఇటే తిరిగి చూస్తున్నారు. కబుర్లాగిపోయాయి.
మెల్లగా నడుస్తున్నాడు కిరీటి. వాళ్ళను దాటాడు.
వాళ్ళంత నిశ్శబ్దంగా ఉండిపోయారేం? మాట్లాడుకోరేం? తనను గమనిస్తున్నారా? ఏమో!? వెధవ సీసాలు! భూమి దద్దరిల్లేలా అంత చప్పుడు చేయాలా?
ఇలా ఎక్కడో మనసు పెట్టి నడుస్తున్న కిరీటి దారి పక్కనే ఉన్న రాయి మీద కాలేసి, పడబోయినంత పనయి నిలదొక్కుకున్నాడు.
“గురుడు మంచి డోసు మీద ఉన్నట్లున్నాడురోయ్!” కూసాడొకడు. అందరూ ఒక్క పెట్టున నవ్వారు.
“ఒరేయ్! సన్నాసుల్లారా? నేనేం తాగలేదురా! గ్రహచారం బాగోక కాలు తడబడింది. అంతే! నేనూ మీలాగా అలగా వెధవననుకుంటున్నారట్రా?” ఉక్రోషంతో సణుక్కున్నాడు.
సందు మలుపు తిరగ్గానే అతనికి గుండాగినంత పనయింది.
అనుకున్నంతా ఆయింది. లోకనాథం కొట్టు కట్టేసాడు.రెండు క్షణాలు అక్కడే నిలబడి ఉండిపోయాడు. “ఇప్పుడేం చెయ్యాలి? వెనక్కి తెరగడం కన్నా గత్యంతరం లేదు. అయినా తనకెందుకీ పిరికితనం? తనేం తప్పు చేయడం లేదే? ఎవరేమనుకుంటే ఏం? తను తాగనప్పుడు అనవసరంగా ఎందుకు గిల్టీగా ఫీలవ్వాలి? అయినదానికీ, కానిదానికీ అతిగా అలోచించే ధోరణి తనను తీవ్రమైన మానసిక సమస్యలలోకి నెట్టేలోగా ఈ విపరీత స్వభావం నుంచి తను బయటపడాలి. ధైర్యంగా,ధీమాగా ఉండడం ఇకనైనా అలవర్చుకోవాలి.” అనుకుంటూ కిరీటి వెనుతిరిగి తన నివాసం వైపు నడక సాగించాడు.
కిరీటి తమను దాటిపోగానే అల్లరి మూకలో ఒకడు అరిచాడు- “గురువుగారు మళ్ళీ స్టాక్ లోడ్ చేసుకుని వెళ్తున్నాడురోయ్!”
మళ్ళీ నవ్వుల వర్షం
“ఈ వెధవలకి నేను ఖాళీ సీసాలే తిరిగి తీసుకువెళ్తున్నానని ఎలా తెలుస్తుంది? అనుకోండి! మీ ఇష్టమొచ్చినట్లు అనుకోండి! నాకేం నష్టంలేదు.ఇలాంటి పనికిరాని విషయాలను ఇకపై పట్టించుకోను.” తనలో చెలరేగుతున్న అక్కసును ఆదుపులో పెట్టడానికి ప్రయత్నించాడు కిరీటి.
గేటు మూసి మెట్లెక్కబోతూ సన్నజాజి పందిరి చాటునుంచి వినవచ్చిన లాలస పిలుపుతో ఆగిపోయాడు.
“ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్ ఈ టైములో?”
“ఎక్కడ్నించీ లేదు. ఊరికే అలా తిరిగి వస్తున్నాను. ”
“చేతిలో ఏమిటా సంచీ?”
అబ్బే! ఏంలేదు.సంచీ వెనక్కి పెట్టబోయాడు.
ఆ తొందరలో గోడ స్పర్శ తగిలి పులకించి నవ్వాయి సీసాలు మళ్ళీ.
“ఏమిటా సీసాలు?” అంటూ ముందుకు వచ్చిన లాలస ముక్కు పుటాలకు అంతకుముందు కిరీటి షర్ట్ మీద ఒలికిన విస్కీ వాసన సోకనే సోకింది.
“ఏమిటా వాసన? కొంపదీసి నువ్వు తాగలేదు కదా ?”
“ఛ!ఛ! నేను తాగడమేమిటి? చొక్కా తాగింది! అంతే!” తడబడ్డాడు కిరీటి.
“చొక్కా తాగడమేమిటి? ఏమిటీ అర్థం లేని వాగుడు? అంటే- తాగి వస్తున్నావన్న మాట! ఛీ! ఇలా అయిపోతావని కల్లో కూడా అనుకోలేదు. ఇకపై నీ ముఖం నాకు చూపించకు” గిరుక్కున వెనక్కి తిరిగింది లాలస.
“లాలసా! ఆగు! నేను చెప్పేది కాస్త విను. నేను తాగలేదు. నామాట విను” ప్రాధేయపడసాగాడు కిరీటి.
లాలస ఆగలేదు.చరచరా నడుస్తూ చీకట్లో కలిసిపోయింది. చేసేది లేక తన గది వైపు నడిచాడుకిరీటి.
“ఏమిటోయ్! అవి మళ్ళీ తెచ్చేసావేమిటి?” అడిగాడు బ్రహ్మం.
“కొట్టు కట్టేసి ఉంది” తనలో రేగుతున్న కోపాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాదు కిరీటి.
“పర్వాలేదు. రేపు ఉదయం ఇవ్వొచ్చులే!” అన్నాడు బ్రహ్మం అదేమీ పెద్దగా పట్టించుకోదగ్గంత విషయం కానట్లు.
మందయిపోయింది. కబుర్లూ అయిపోయాయి. వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు. కిరీటికి థాంక్స్ చెప్పుకున్నారు.చిన్నగా తూలుతూ వెళ్ళిపోయారు.
తన దుస్థితికి వాపోతూ, నిస్సత్తువగా పక్క మీద వాలిపోయాడు కిరీటి.
“అమ్మోయ్! ఇన్ని సీసాలే!” మర్నాడు ఉదయం పనిమనిషి స్వగతంతో మెలుకువ వచ్చింది కిరీటికి. పక్క మీదనుంచి లేవాలనుకున్నాడు. కాని, నీరసంగా అనిపించి తిరిగి కళ్ళు మూసుకున్నాడు.
“అందరూ ఇంతేనమ్మా! ఈయనేదో మంచివాడనుకున్నాను. గది నిండా సీసాలే…!” అంట్లు తోముతూ, పక్కింటి పనమ్మాయితో తన పనిమనిషి అంటున్న మాటలు దూసుకువచ్చి అతని చెవుల్లో పడుతున్నాయి.
“అప్పలమ్మా!అప్పలమ్మా! నీ దృష్టిలో చెడ్డవాడ్నని అనిపించుకోకూడదన్న పిచ్చి ఆలోచనే నేనందరిలో అల్లరిపాలయేలా చేసింది. అది చాలనట్లు నువ్వు దుష్ప్రచారం కూడా మొదలెట్టావా? ఔన్లే! నాకిలా కావల్సిందేలే!” వాపోకుండా ఉండలేకపోయాడు కిరీటి. కొంత స్థిమితపడ్డాక, సోడా సీసాలు అప్పలమ్మకిచ్చి పంపించి, లాలసకు సుధీర్ఘమైన ఉత్తరం రాసాడు. పిట్టగోడ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. పూలమొక్కలకు నీళ్ళు పోస్తున్న లాలస తలెత్తి చూసిచటుక్కున తల దించేసుకుంది. ఎవరూ చూడడం లేదని ధ్రువపరుచుకున్నాక, ఉత్తరాన్ని ఉండగా చుట్టి ఆమె ముందు పడేటట్లు విసిరాడు. లాలసకు ఆ విధంగా సందేశాలు పంపడం అతనికి అలవాటే! లాలస ఉత్తరాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.
కిరీటి జరిగినదంతా సవిస్తరంగా విన్నవించుకున్నాడా ఉత్తరంలో. తను చెప్పిందంతా నిజమని నమ్మిన పక్షంలో, ముద్దబంతి పువ్వు ఒకటి జడలో తురుముకుని తనకు కనిపించాలనీ- అలా కనిపించకపోతే తననొక పచ్చి తాగుబోతుగానే ఆమె జమ కట్టిందని తాననుకోవలసి వస్తుందనీ విన్నవించాడు.
కొద్ది నిముషాల తరువాత లాలస తోటలోకి వచ్చింది. కిరీటి వైపు తలెత్తి చూసి జడను విసురుగా ముందుకు వేసుకుని తిరిగి వెళ్ళిపోయింది. ఆమె జడలో ముద్దబంతి పువ్వు లేదు.
X X X
రాత్రి పదయింది. నెమ్మదిగా నడుచుకుంటూ తన గదికి వస్తున్నాడు కిరీటి. రోజూ మాదిరిగానే సభ తీరి ఉన్నారు అల్లరి బృందం. ఒక్క క్షణం అక్కడ ఆగాడు. వాళ్ళెవరూ అతడ్ని పట్టించుకున్నట్లే లేరు. వాళ్ళ కబుర్లలో వాళ్ళున్నారు. కిరిటి ముందుకు సాగిపోయాడు.
మెట్లెక్కబోయి, ఆ పక్కనే నిలబడ్డ లాలసను చూసి ఆగాడు.
“నువ్వు కనిపిస్తావేమోనని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఉదయం నిన్ను సరదాగా ఏడిపించాలనిపించింది. అందుకే పువ్వు పెట్టుకోలేదు.కోపం వచ్చిందా? సారీ!” నొచ్చుకుంటున్నట్లు అంది లాలస.
శుష్క మందహాసం చేసాడు కిరీటి.
“నిన్న నేను తాగలేదని ఇప్పటికైనా నమ్ముతున్నట్లేనా?”
“నిజంగానే తాగావేమోనని అపోహపడ్డాను. నువ్వంత విపులంగా జరిగిందంతా రాసాక కూడా ఇంకా శంకిస్తానా? అలా చేస్తే మన ప్రేమను అవమానపర్చినట్లే కదూ?” ఇంతకీ రోజంతా ఏమై పోయావ్?”
“నిన్న జరిగిన సంఘటనలతో నన్ను నేను సంస్కరించుకోవలసిన అవసరం నాకు అవగతమయింది.నాలో పెను వృక్షంలా పెరుగుతున్న బెరుకును సమూలంగా నిర్మూలించాలన్న కృత నిశ్చయంతో రోడ్డెక్కాను. జనంలో తిరిగాను. పరిశీలించాను. ఎవరి బ్రతుకు బాటలో వాళ్ళు పయనిస్తున్నారు తప్ప నాలా ప్రతి చిన్న విషయానికీ అనవసరంగా స్పందించే తీరిక, అక్కర ఎవరికీ ఉండదని గ్రాహ్యమయింది. దాంతో ఒక మారిన మనిషిగా తిరిగి వస్తున్నాను. బాగా అలిసిపోయాను. ఇక మాట్లాడే ఓపిక లేదు. వస్తా! రేపట్నుంచి కొత్త కిరీటిని చూస్తావు.” అంటూ మెట్లెక్కాడు కిరీటి.
-సమాప్తం-
Add comment