ప్రతిసారి ఇచ్చినట్లే ఒక కథా భాగం ఇస్తున్నాను. ఇది చదివేటప్పుడు ఈ కథలో ఎలాంటి లోపాలు ఉన్నాయో గమనిస్తూ చదవండి. లోపాలు ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? చదువుతున్నప్పుడు ఎక్కడో ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. చదవటం ఆపి ఒక్కసారి వెనక్కి వెళ్లి మళ్లీ ఆ చదివిన వాక్యాన్నే చదవాల్సి వస్తుంది. కథ మధ్యలో ఓహో అదా, ఇందాక చదివినప్పుడు నాకు వేరేగా అర్థమైంది అనిపిస్తుంది. అసలు రచయిత ఏం చెప్పాలనుకున్నాడు/చెప్పాలనుకుంది? అనే అనుమానం వస్తుంది. మొత్తానికి ఏదో చెప్తున్నారు కానీ అది చదువుతుంటే “సరే, అయితే ఏంటి?” అని అడగాలనిపిస్తుంది. అలా మీకు అనిపించిన ప్రతిసారి, అందుకు కారణం ఏమిటా అని కూడా గమనించుకుంటూ చదవండి. ఇదీ ఈ పక్షం ఇస్తున్న కథా భాగం –
గిరగిర గిరగిర
శివ అప్పుడే లోపలికి అడుగుపెట్టాడు. అతని పిన్నమ్మ సీత వాళ్ల అమ్మ గీతతో మాట్లాడుతోంది. సీత గీత ఇద్దరూ కవల పిల్లలైనా సీత గీతని అక్కా అని పిలుస్తుంది. గీత చెప్తున్న సినిమా కథ వింటూనే అది నచ్చకపోవటంతో పొద్దున పేపర్లో చదివిన వార్త గురించి ఆలోచిస్తోంది సీత. తాను చెప్తున్న కథ చాలా ఆసక్తితో అక్క వింటోంది అని నమ్మిన గీత కథని ఇంకా రసవత్తరంగా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది.
వాళ్లిద్దరూ మాటల్లో పడి తనని పట్టించుకోవటంలేదన్న కోపంతో “అమ్మా” అని అరిచాడు శివ. సీత ఉలిక్కిపడింది. అలా అరిచినందుకు కోపంగా కొడుకు వైపు చూసింది గీత. రాజా బెడ్ రూమ్‍లో నుంచి బయటికి వచ్చి అదే సమయంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న రామ్ వైపు ఏం జరిగింది అన్నట్లు చూసాడు. రామ్ మనసులో అప్పుడు సాయంత్రం తనని కలవబోతున్న శ్రీరామ్ కంపెనీ డైరెక్టర్ గురించి, అతనితో ఎలా మాట్లాడి డీల్ ఓకే చేసుకోవాలి అన్న ఆలోచన నడుస్తోంది. అందువల్ల హాల్లో శివ ఎందుకు అరిచాడో అతనికీ అర్థం కాలేదు. అదే విషయాన్ని రాజా వైపు చూసి కళ్లతోనే చెప్పాడు రామ్. రాజా గీత భర్త. సీత భర్త రామ్. గీత, రజాల కోడుకే శివ. సీతకీ ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు శీను. అంతకు ముందే అతను తన భార్య శాంతతో కలిసి బయటికి వెళ్లాడు.
బయట షాపింగ్ చేస్తున్న శీనుకి ఎందుకో శివ గుర్తుకొచ్చాడు. “ఈ రోజు ఇంట్లో ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తాను రా” అన్న శివ మాటలు పదే పదే అతని మనసులో సుడులు తిరుగుతున్నాయి. ఈ పాటికే చెప్పేసి వుంటాడా? ఒకవేళ చెప్పేస్తే పెద్దమ్మ, పెదనాన్న ఏమంటారు? అని ఆలోచిస్తున్నాడు. ఈ విషయాలేవీ తెలియని శాంత ఇంటికి వెళ్లేలోగా వేరు కాపురం విషయం శీనుకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తొంది. శీనుని ఒప్పించడం తేలికా కానీ శివని కూడా ఒప్పించాలి. శివ చెప్తే శీను కాదనడు.
ఉమ్మడి కుటుంబాలలో అన్నదమ్ములు కలిసుండటం విచిత్రం కాదు కానీ అక్కచెల్లెళ్లు కలిసి వుండటం విచిత్రమే. అంతకన్నా విచిత్రం ఆ ఇద్దరూ తమ తమ పిల్లలిద్దరినీ స్వంత పిల్లల్లా చూసుకోవడం. శివ అంటే గీతకి ఎంత ప్రేమో శీను అంటే సీతకి అంతే ఇష్టం. ఇదంతా ఆలోచిస్తున్న రాజా వచ్చి గీత పక్కనే సీతకి ఎదురుగా వున్న సోఫాలో కూర్చున్నాడు. అక్కడే వున్న రవిని ఎత్తుకోని ఒళ్లో కూర్చోపెట్టుకున్నాడు.
రామ్ మనసులో ఏదో కీడు శంకించింది. చేస్తున్న పని వదిలేసి లోపలికి వస్తూ –
“ఏంట్రా? ఎందుకలా అరిచావు? అసలేంట్రా నీ కథ?” అని అడిగాడు శివని
<><><>
ఈ కథ చదువుతుంటే మీకేమనిపించింది? చిరాకుగా ఉండా? నాలాంటివాడికైతే కోపం కూడా వస్తుంది. ఎందుకు?
ముఖ్యంగా మూడు సమస్యలు వున్నాయి. వాటి గురించి కాస్త చర్చిద్దాం.
మొదటి సమస్య – పాత్రల పేర్లు
సీత, గీత, శాంత, రాజా, రామ్, రవి, శివ, శీను. ఇవీ పేర్లు. ఒకవేళ వీళ్లు మీ బంధువులైనా సరే, ఏదైనా పెళ్లిలో కనిపిస్తే “అమ్మాయ్! గీత నీ పేరా నీ అక్క పేరా? అసలు నువ్వేనా పెద్దదానివి?” అని అడిగే అవకాశం ఉంది కదా? మరి చదివే పాఠకుడి ఎంత తికమకగా ఉంటుంది?
ఇది ఎలా అధిగమించాలి? అవసరమైనన్ని పాత్రలతోనే కథని నడపటం ఒక పద్ధతి. ఇది అన్ని కథలకూ సాధ్యం కాదు. ఒక కాలేజీలో ఆఖరు రోజు స్నేహితుల మధ్య జరిగే కథ రాయాలనుకోండి. అప్పుడు పాత్రలు ఎక్కువే వుంటాయి. అప్పుడెలా రాయాలి? పాత్రల పేర్ల విషయంలో జాగ్రత్తగా వుండాలి. ఒకే రకమైన పేర్లు (సీత, గీత), ఒకే అర్థాన్నిచ్చే పేర్లు (వినాయక్, గణేష్) లాంటివి లేకపోతే మంచిది. ఒక పాత్రకి రెండక్షరాల పేరు పెడితే మరో పాత్రకి మూడక్షరాల పేరు పెట్టడం ఇంకో సులభమైన పద్ధతి. ఒకరి పేరు దీప అయితే ఆమె స్నేహితురాలి పేరు కృష్ణవేణి అని పెడితే తికమకపడే అవకాశం తక్కువ. మీ కథలో అవకాశం ఉంటే, వివిధ కులాలు, లేదా మతాలను సూచించే పేర్లు – రాబర్ట్, ఇస్మాయిల్ లాంటివి వాడి ఈ సమస్యని నుంచి తప్పించుకోవచ్చు.
రెండో సమస్య – అందరూ ఒకేసారి పరిచయం అవటం
పైన ఇచ్చిన కథలో శాంత ఎవరి కోడలు అని అడిగితే ఠక్కున చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? మొత్తం పాత్రలన్నీ ఒక్కసారి వచ్చి మీద పడిపోతుంటే ఎవరు ఎవరో, ఎవరికి ఎవరు ఏమౌతారో తెలుసుకునే అవకాశం ఎక్కడ వుంది?
ఇదెలా సరి చేసుకోవచ్చు?
ముందు ముఖ్యపాత్ర ఎవరో నిర్ణయించుకోవాలి. ఈ కథలో శివ ముఖ్యపాత్ర అయ్యుండచ్చు లేక ఆమె తల్లి లేదా పిన్నమ్మ (సీత/గీత) ముఖ్యపాత్ర అయ్యుండచ్చు. కథ మొదట్లోనే ఈ పాత్రని ప్రవేశపెట్టి ఆ పాత్రతో పాఠకుడికి పరిచయం అయిన తరువాత ఒక్కొక్క పాత్రని ప్రవేశపెడుతూ, పరిచయం అయిన మొదటి పాత్రతో కలుపుతూ చెప్పడం మంచి పద్ధతి. ఇది చదవండి –
శివ గట్టిగా అరిచాడు. రూమ్‍లో నుంచి అప్పుడే బయటికి వచ్చిన రామచంద్ర కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశాడు. “ఏమే ఏమిటే వీడి గోల?” అన్నాడాయన భార్య సుమతి వైపు తిరిగి.
ఇక్కడ మూడు పాత్రల పరిచయాలు జరిగాయి. మొదట పరిచయమైన పాత్ర శివ. ఆ తరువాత వచ్చినది రామచంద్ర. “కొడుకు వైపు చూస్తూ” అన్న పదాలతో శివ రామచంద్ర కొడుకు అని తెలిసిపోయింది. “భార్య సుమతి వైపు తిరిగి” అనగానే అప్పటికే మనకు పరిచయమైన రామచంద్ర భార్య సుమతి అని తెలుస్తోంది. ఇలా పాత్రలని వాళ్ళ మధ్య వున్న ఉన్న సంబంధాలని చెప్తూ పరిచయం చెయ్యడం వల్ల ఎవరు ఎవరో సులభంగా గ్రహించగలుగుతారు పాఠకులు.
పరిచయం చెయ్యడానికి ఇది బాగానే ఉంటుంది కానీ, కథలో పాత్రలు వచ్చిన ప్రతిసారీ ఇలా రాస్తూ వుంటే ఆ కథ కృతకంగా తయారౌతుంది. పెద్ద కథ లేదా నవల లాంటి ప్రక్రియలో మరో రకం సమస్య ఉంటుంది. మొదటి ఛాప్టర్‌లోనో రెండో ఛాప్టర్‌లోనో పరిచయం అయ్యే పాత్ర మళ్లీ ఎప్పటికో కాని కనపడదు. ఆ కనపడప్పుడు ఆ పాత్ర ఎవరో, ప్రధాన పాత్రలతో సంబంధం ఏమిటో పాఠకుడికి గుర్తు రాకపోవచ్చు. ఇది పాఠకుడు పఠనానుభూతికి అడ్డం పడుతుంది.
ఈ రెండు సమస్యలను అధిగమించడానికి ఒకేరకం పరిష్కారం వుంది. ఒక పాత్రని పరిచయం చేసేటప్పుదు వాళ్ల హావభావాల చెప్పడం, వాళ్ల గురించి చిన్న వర్ణన ఇవ్వడం, వాళ్లు తరచూ చేస్తూ ఉండే పనిని వివరించడం, మాట తీరు ప్రత్యేకంగా ఉంచడం మొదలైనవి చెయ్యాలి. దాని వల్ల పాఠకుడి ఊహల్లో ఒక పాత్ర ఏర్పడిపోతుంది. ఆ పాత్ర వచ్చినప్పుడు అంతకు ముందు వాడిన హావభావాలనో, వర్ణననో, అలవాటునో ప్రస్తావించడం వల్ల (invoking), ఆ పాత్ర ఎవరో పాఠకులకి వెంటనే గుర్తుకు వస్తుంది (recall). ఇది చూడండి –
గుమ్మంలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టడానికి రెండే రెండు క్షణాలు పట్టింది ఆనందికి. వెంటనే వెనక్కి తిరిగి – “అమ్మా దప్పళం తాతయ్య వచ్చాడు” అని వెంటనే నాలిక కరుచుకుంది. ఆ మాట వింటూనే సీతాపతిరావు నాలుగు తొర్రిపళ్లు కనపడేలా గట్టిగా నవ్వేశాడు. “సారీ తాతయ్యా” అంటూ లోపలికి పరిగెత్తేసింది ఆనంది.
సీతాపతిరావు చాలా నెమ్మదిగా నడుస్తూ లోపలికి వచ్చాడు. షుగర్ వల్ల ఎడమకాలు బొటనవేలు అప్పటికే తీసేశారు. అందువల్ల గుమ్మం నుంచి సోఫా దాకా నడవటానికి కూడా చాలా కష్టపడ్డాడు ఆయన.
ఎవరిదో పెళ్లిలో దప్పళం గిన్న జారి ఆయన విస్తట్లో పడింది. వృధా చెయ్యడం ఎందుకు అని మరికొంచెం అన్నం పెట్టించుకుని దానితోనే భోజనం కానిచ్చేశాడు. పిల్లలు ఈ కథ విని తనకి దప్పళం తాతయ్యని పేరు పెట్టారని ఆయనకి అప్పటిదాకా తెలియదు.
సోఫాలో కూర్చుంటూ “దప్పళం తాతయ్య” అని మళ్లీ మళ్లీ తలుచుకుని మరీ నవ్వుకున్నాడాయన.
ఇలా ఆ పాత్ర గురించి చెప్తే, మళ్లీ ఆ పాత్ర కథలోకి వచ్చినప్పుడు –
“మీ సీతాపతి తాతయ్యలేడూ, అదేనే దప్పళం తాతయ్య ఆయన ఆరోగ్యం పెద్దగా బాలేదట” అని చెప్పచ్చు. లేదా –
ఆనంది పెళ్లి వైభవంగా జరిగింది. చాలా కష్టపడుతూనే సీతాపతిరావుగారు కూడా వచ్చారు. సంబంధం కుదర్చడానికి వచ్చినప్పుడు బొటనవేలు మాత్రమే లేని తాతయ్యకి ఇప్పుడు పాదం కూడా తీసేశారని తెలిసి చాలా బాధపడింది ఆనంది.
మొదట్లో ఇచ్చిన కథలో ఉన్న మూడో సమస్య: తలతిరుగుడు కథనం
దీన్నే ఇంగ్లీష్‌లో Head Hopping అంటారు. ఇది మనకి చాలా ముఖ్యమైనది. అందువల్ల దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం.
ఇంతకు ముందు మనం తృతీయ పురుష కథనానికి సంబంధించిన థియరీ చర్చించుకున్నాం కదా? అలాంటి కథలు రాసే రచయిత కంటికి కనిపించని, చెవులకు వినిపించని విషయాలను కూడా రాయగలుగుతాడని చెప్పుకున్నాం. పది పాత్రలు ఉంటే, ఆ పది పాత్రల మనసుల్లో ఏముందో ఆ రచయితకి తెలుసు. అందులో కొన్ని పాత్రలు వేరే దేశంలో ఉన్నా, గ్రహాంతరవాసం చేస్తున్నా సరే వాళ్ల మనసులో ఏమనుకుంటున్నారో ఈ రచయితకి తెలుసు అని అనుకున్నాం గుర్తుందా?
ఇలా అన్నీ తెలిసిన రచయిత, తనకు తెలిసినదంతా చెప్పాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమౌతుంది అనేందుకు పైన ఇచ్చిన కథ ఒక ఉదాహరణ. ఒక్కోసారి రచయిత తాను సృష్టించిన అన్ని పాత్రలని విపరీతంగా ప్రేమించేస్తాడు. అలాంటప్పుడు కూడా ఇలాంటి ఫలితమే వస్తుంది. ఎలాంటి ఫలితం? చూద్దాం రండి.
ఈ కథలో – గీత సినిమా కథ గురించి, సీత పొద్దున పేపర్లో చదివిన న్యూస్ గురించి, రాజా సాయంత్రం మీటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. శివ ఏం చేస్తున్నాడో అని శీను, వేరు కాపురం పెట్టడానికి భర్తని ఎలా ఒప్పించాలా అని శీను భార్య శాంత ఆలోచిస్తున్నారు. వీళ్లందరి ఆలోచనలలో ఏవి కథకి పనికొస్తాయో, ఏవి పనికిరావో ఇంకా మనకి (పాఠకులకి) / రచయితకి కూడా తెలియదు. అదలా వుంచండి.
ఉత్తమ పురుష కథల్లో ఒక దృక్కోణం తప్ప మరొకటి చెప్పకూడదనే పరిమితి వల్ల సమస్యలు వచ్చినట్లే తృతీయ పురుష కథల్లో పరిమితి లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. కథకి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకోకుండా రాయటం ఒక సమస్య అయితే ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పడం చేతకాక అందరి మనసులో ఉన్నది చెప్పడం మరోసమస్య. అన్ని సందర్భాల గురించి, అన్ని ఆలోచనల గురించి చెప్పే రచయిత పాఠకులను ఒక చోటా స్థిరంగా ఉండనీయడు. ఒకరి మనసులో నుంచి ఇంకొకరి మనసులోకి గెంతుతూ, పాఠకుడిని కూడా అలా దూకించడం వల్ల కొంతసేపటికి పాఠకుడికి తల తిరిగినట్లౌతుంది. అందుకే దానిని head hopping అన్నారు.
సాధారణంగా పాఠకులు ఒకటో రెండో పాత్రలతో కలిసి కథలో ప్రయాణం చేస్తారు. ఇలా అన్ని పాత్రల మనసులో ఉండే సంబంధంలేని విషయాలన్నీ వింటూ ఉంటే వాళ్లు ముఖ్య పాత్రలతో లీనమవలేరు. కెమెరా చక చక మంటూ ఆటూ ఇటూ మారుతూ ఉంటే చూడటానికి ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది. చాలాసార్లు ఏ సమయంలో ఎవరి ఆలోచనలను చదువుతున్నారో తెలుసుకోవడానికి పాఠకులు మరింత కష్టపడాల్సి వస్తుంది. దాంతో అంతా కంగాళీగా, గందరగోళంగా తయారౌతుంది. అది వేగాన్ని, స్పష్టతను దెబ్బతీస్తుంది.
ఈ గందరగోళం వల్ల కలిగే మరో ప్రభావం ఎమిటంటే – ఏదైతే ప్రధాన పాత్ర ఉంటుందో ఆ పాత్ర స్వరాన్ని ఇది బలహీనపరుస్తుంది. అంటే రచయిత చెప్పదల్చుకున్న ప్రధానం సందేశం (ఏదైనా ఉంటే) అది పాఠకులకి చేరదు. ఒక వేళ రచయిత రాస్తున్నది మిస్టరీ లాంటి ఫిక్షన్ అయితే అందులో ఉండాల్సిన ఉత్కంఠని చంపేస్తుంది. మొత్తం మీద రచయితకి రచన మీద పట్టు లేదని పాఠకులకి తెలిసిపోతుంది.
ఈ సమస్యని అధిగమించాలంటే రాసేదాని మీద నియంత్రణ, ఎంతవరకు చెప్తే పండుతుంది అన్న అవగాహన రచయితకి వుండాలి. ముఖ్యంగా పాఠకుడి మీద గౌరవం వుండాలి.
ఇలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నాలుగు వాక్యాలు అనుకుందాం –
ప్రతి సన్నివేశంలో ఒకటో రెండో పాత్రలను మాత్రమే ఎన్నుకుని, ఆ పాత్రల మనసులో ఉండే ఆలోచనలు మాత్రమే చెప్పాలి. మిగిలిన పాత్రల గురించి చెప్పేటప్పుడు ఉత్తమ పురుష కథల్లోలా కళ్లకు కనిపించేది, చెవులకి వినిపించేది మాత్రమే రాయాలి. సీన్ లేదా ఛాప్టర్ మార్చినప్పుడు మునుపు వదిలేసిన పాత్రల మనసులో ఉన్నది చెప్పచ్చు. కొన్ని రకాల కథలు/నవలల్లో ఒక్కో పాత్రని ఒక సెక్షన్/ఛాప్టర్ చేస్తూ ఆ పాత్ర పేరుని హెడ్డింగ్‌గా పెట్టి ఆ పాత్ర మనసులో ఉన్నది చెప్పచ్చు
దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. మీరు కథ చెప్తున్నట్లు కాకుండా, ఒక సినిమా తీస్తున్నట్లు ఊహించుకుని, కెమెరా అవసరమైనప్పుడు మాత్రమే కదిలి, మరో పాత్ర మీదకి ఎలా మారుతుందో, అలా అవసరమైనప్పుడు మాత్రమే ఆ పాత్రల మనసులో ఉండే విషయాలు చెప్పేలా అలవాటు చేసుకోవాలి. ఇది తలతిరుగుడు తగ్గించి, పాఠకుల ఫోకస్ సరిగ్గా ఉండేలా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఈ భాగం ముగించే ముందు మధ్యమ పురుష కథనం గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. మధ్యమ పురుష అంటే ఎలా రాస్తారు?
“నువ్వు నిద్రలేచావు. కాఫీ తాగుతున్నప్పుడు సుమ దగ్గర్నుంచి ఫోన్ వస్తే ఇష్టంలేక కట్ చేశావు. ఆ తరువాత ఆఫీస్‍కి బయల్దేరావు” ఇలా రాయాలి.
ఇలాంటి కథలు అరుదుగా కనిపిస్తాయి. ఇది కొంచెం కష్టమైనది కావడం ఒక కారణం అయితే, ఆ కష్టమైన వాక్యాల వల్ల పాఠకుడికి పఠనానుభూతి తగ్గుతుంది అని రచయితలు అనుకోవడం వల్ల కూడా ఇలాంటి కథలు తక్కువగా వస్తాయి. కానీ ఒక్కో కథాంశానికి ఈ కథన రీతి కొత్త సొగసుని తెచ్చుపెడుతుంది. నేను మధ్యమ పురుషలో ఒక కథ, ఒక నవల రాశాను. నవల గురించి చెప్తాను. ఇందులో ఒక కథానాయకి. నవల అంతా ఆమె ఆమెతో మాట్లాడుకుంటూ ఉంటుందా. ఒక రకంగా ఆత్మ పరిశీలన అనుకోండి. “నువ్వు అప్పుడు అలా చేసి ఉండకూడదు. నువ్వు కోరుకుంటేనే కదా అతను అలా చేశాడు. మరి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు” ఇలా సాగుతుంది. ఇలా రాయడం వల్ల ఏమిటి ఉపయోగం? పాఠకుడిని/పాఠకురాలిని ప్రధాన పాత్ర కుర్చీలో కూర్చో పెట్టి మాట్లాడుతున్నాం. పాఠకురాలు ఆ పాత్రలో లీనైమైపోయి అదే దృష్టికోణంలో చూడటం మొదలుపెడుతుంది. పాత్ర పడే సంఘర్షణ పాఠకురాలికి సన్నిహితంగా అనిపిస్తుంది. ప్రయోగాత్మక రచనలలో, ఇంటరాక్టివ్ కథలలో, డైరీ లేదా ఉత్తరాల ద్వారా కథలు నడిపినప్పుడు ఈ శైలి చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అయితే, ఇది జాగ్రత్తగా నిర్వహించకపోతే పాఠకుడిని రచనకి, రచయితకి దూరం చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రతి పాఠకుడు తనను సంబోధిస్తూ చెప్పే కథలో తీవ్రమైన పరిస్థితులలో ప్రధాన పాత్రని ఉంచడాన్ని సౌకర్యంగా భావించకపోవచ్చు. ఉదాహరణకి –
“నువ్వు స్టూల్ మీదకి ఎక్కి, ఫాన్‌కి కట్టిన ఉరితాడుని మెడలో వేసుకున్నావు. కళ్లు మూసుకోని నీ భార్యా పిల్లల్ని ఊహించుకుని కాళ్లతో స్టూల్‌ని తన్నావు. ఒక్కసారిగా గొంతు బిగుసుకు…”
ఇంకా వివరాలు ఎందుకులెండి. మీకు అర్థమైందిగా.
చివరిగా ఒక్క మాట
కథ యొక్క భావోద్వేగం ఏమిటో అర్థం చేసుకోని, నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోని, పాత్రల స్వభావాలను, ఆలోచనలను అంచనా వేసుకోని వీటన్నింటి గురించి, ఆ ప్రపంచం గురించి పాఠకుడికి ఎంతవరకు తెలియాలి అనే ప్రశ్న వేసుకోవాలి. ఎంతవరకు తెలిస్తే పాఠకుడు కథతో మమేకమౌతాడు అని బేరీజు వేసుకోవాలి. అప్పుడు రచయిత ఏ రకమైన కథనంలో కథని నడపాలో ఎంచుకోవాలి. మీరు చదివిన ఏవైనా ఉత్తమ రచనలను పరిశీలిస్తే, మీకు కథనంతో భావోద్వేగాన్ని రేకెత్తించగలిగిన రచయిత నేర్పు కనపడుతుంది. అసలు విషయం ఏమిటంటే రాసే నేర్పే కాదు, ఆ కథకి ఆ కథనం ఎంచుకోవడంలోనే రచయిత నేర్పు ఉంటుంది.
<><><>
మనం ఈసారి కలిసినప్పుడు చర్చించడానికి వీలుగా క్రింద ఒక కథాభాగం ఇస్తున్నాను. ఈ కథాభాగం చదివి అందులో మీకు ఎక్కడైనా లోపం వుంది అనిపిస్తే ఆ లోపమేమిటో, అది ఎలా సరి చెయ్యవచ్చో కామెంట్లలో రాయండి. నా అభిప్రాయంతో వచ్చే పక్షం చర్చ మొదలుపెడతాను.
శ్రమజీవి
ఆఫీస్ బస్ దిగిన వెంటనే వడివడిగా నడుచుకుంటూ సరిగ్గా ఐదు నిముషాలలో ఇంట్లో అడుగుపెట్టింది శాంత. అప్పటిదాకా టీవీ చూస్తున్న అత్తగారు టీవీ కట్టేసి ప్రసన్నంగా శాంత వైపు తిరిగారు.
“నువ్వు ఎంత మంచిదానివి శాంతా. నీ పెళ్ళై మూడేళ్ళైంది. కట్నం మూడు లక్షలు తెచ్చావు. ఆ డబ్బు మొత్తాన్ని నా కొడుకు చెడు వ్యసనాలకు వ్యర్థం చేసినా క్షమయా ధరిత్రి అన్నట్లు వాడిని క్షమించి ఉద్యోగంలో చేరి నీ సంపాదనతో ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు. మీ మామగారికి రెండు సార్లు హర్ట్ ఎటాక్ వచ్చిన సంగతి నీకు తెలుసు కదా. పైగా ఆరేళ్లుగా షుగరు ఒకటి. సమయానికి భోజనం పడకపోతే అల్లాడిపోతారు. అందుకని ఇక నుంచి నువ్వు వచ్చేసరికి నేనే వండిపెడదామనుకుంటున్నాను” అంది ఆవిడ.
శాంతకు తెలుసు. ఇదంతా పై పై వ్యవహారమని. అయినా ఆమె అంటే కోపం లేదు.
“అయ్యో ఎదుకులెండి అత్తయ్యా. నేనే ఆఫీసు నుంచి ఇంకొంచెం త్వరగా వస్తాను. మీరు ఇబ్బందిపడకండి” అంది శాంత
అత్తగారికి టీవీ సీరియల్ పిచ్చి. అది వదులుకోని ఆమె వంట ఎలాగూ చేయదు. అసలు అన్నీ బాగున్నప్పుడు కూడా మామగారికి వండి పెట్టింది లేదట. ఆడపడుచు గోపిక చెప్పింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా సహాయం చేస్తుందనుకోవడం భ్రమ. త్వరగా వచ్చి వండిపెట్టు అని నేరుగా చెప్పకుండా ఇదోక డొంకతిరుగుడు వ్యవహారం. ఇదంతా శాంతకి అర్థమౌతూనే వుంది. అయినా ఏమీ అనలేని పరిస్థితి. అత్తగారు మళ్లీ టీవీ పెట్టడంతో ఇంకేమీ మాట్లాడకుండా బట్టలు మార్చుకునేందుకు బెడ్ రూమ్‍లోకి వెళ్లిపోయింది శాంత.
*
Add comment