తక్షణ న్యాయంపై గీసిన సెటైర్ చిత్రం

“ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఈ మార్పును మనం చూస్తున్నాం. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ల నుంచి టి20 ఫార్మాట్ కు వచ్చాం. వినోదం కోసం మనం 3 గంటల సినిమాను ఎంచుకుంటున్నాం. ఫిల్టర్ కాఫీ నుంచి ఇన్ స్టాంట్ కాఫీకి మారాం. ప్రస్తుత ఇన్ స్టాంట్ నూడుల్స్ కాలంలో ప్రజలు తక్షణ న్యాయాన్ని కోరుకుంటున్నారు. కానీ తక్షణ న్యాయంతో నిజమైన న్యాయం ప్రమాదానికి గురవుతుందనే వాస్తవం వారు గ్రహించలేక పోతున్నారు.”

-మాజీ జస్టిస్ ఎన్వీ రమణ

ఇన్ స్టెంట్ అన్నది అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో కుదరదు. తక్షణం అన్నీ కావాలి, అన్నీ జరగాలి అనుకోవడం వెనుక ఉద్రేకం ఉంటుంది. ఆ ఉద్రేకం, ఆవేశం ఆలోచనను అణచివేస్తుంది. ఉద్రేకంలోంచి వచ్చే ఆగ్రహం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. నిజాన్ని పూడ్చేసి, న్యాయం చేత తప్పులు చేయిస్తుంది. చివరకు ప్రాణాలు కూడా తీయొచ్చు, తీయించేయొచ్చు. అందుకే ప్రజాగ్రహానికి అధికారం, అందుకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వశాఖలు ఎప్పుడు, ఎక్కడ దాసోహం కాకూడదు. ఇందుకు ఉదాహరణే 2019 నవంబర్​ 27 రాత్రి హైదరాబాద్​ శివారులో యువ వైద్యురాలిపై నలుగురు యువకులు అత్యాచారం, హత్య చేసిన సంఘటన. అది యావత్​ ప్రజానీకాన్ని కదిలించింది. నిందితులను ఉరితీయాలంటూ ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. పోలీసులు సీన్​ రీ కన్​స్ట్రక్షన్ చేస్తుండగా ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించారు. ఇది ​బూటకపు ఎన్ కౌంటర్ అంటూ మానవహక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ధర్మాసనం జస్టిస్​ వి.ఎస్​. సిర్పూర్కర్‌ ఆధ్యర్యంలో కమిషన్‌ను నియమించింది. వారిచ్చిన నివేదిక, నిందితులు మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యంతోనే కాల్పులు జరిపారని తేల్చింది. ఈ కేసు వల్లే “దిశ” చట్టం వచ్చింది.

ఈ వాస్తవ సంఘటనకు మరికొంత వాస్తవికత, ఇంకొంత కాల్పనికత జోడించి, సినిమా టెక్నిక్ తో సతీష్ చందర్ రాసిన నవలే “బృహన్నలపేట”. ఇది రచయిత సృష్టించిన సెట్టింగ్ లాంటి ప్రదేశం. న్యాయం కోసం శిక్షలను నిర్భయంగా అమలు జరిపే చోటు. శీర్షికలోనే సెటైర్ వేశాడు రచయిత. నవలా నేపథ్యం యువతిపై జరిగిన అత్యాచారం, హత్య, అందుకు కారణమైన నిందితులను శిక్షించడం. కానీ సతీష్ చందర్ దాని చుట్టూ అల్లిన కథలో నేటి సమాజంలో ఆశ్రమాల ముసుగులో జరుగుతున్న మోసాలు, అక్రమాలు, అత్యాచారాలను చూపారు. న్యాయం అన్యాయమైనప్పుడు మానవ హక్కుల సంఘాలు జరిపే నిజనిర్దారణలు, వాటి ద్వారా వెలుగులోకి వచ్చే నిజాలు. థర్డ్ జెండర్ ను లోకం చూస్తున్న తీరు, వాళ్లు ఎదుర్కొంటున్న హేళనలు, బాధలు, వారిలోని శక్తి సామర్థ్యాలు. భార్యాభర్తల మధ్య బీటలు వారుతున్న బంధాలు. లోపలొకటి పెట్టుకుని, బయట ఇంకొకటి నటిస్తూ అవకాశాలు, స్త్రీల సుఖం కోసం అర్రులు చాచే మనుషుల ప్రవర్తన, వ్యక్తిత్వాలు.. ఇలా ఎన్నింటినో వివరించాడు.

నవలలో న్యాయం అంటే దోషులను చంపటం కాదు. వారిలో మార్పు తేవటం. అదీ మానసిక పరివర్తన తీసుకరావడం అన్న ఆలోచన చాలా ఉన్నతమైంది. అలాగే స్త్రీని సుఖాల లోగిలిగా కాకుండా, ఆమెలోని అమ్మతనాన్ని, ఆత్మశక్తిని చూపడం మరో అంశం. స్త్రీ తలచుకుంటే నగ్నంగా కొడుకు ముందు నృత్యం చేసి మరో జన్మ ఇవ్వగల మహోన్నతురాలని రుజువు చేయడం ఇంకో అంశం. అత్యాచారం జరిగిన స్త్రీ కులాన్ని బట్టే ప్రజలకు ఆగ్రహం వచ్చే శాతాల్లో కూడా తేడా ఉంటుందన్న నిజాన్నీ వెల్లడిస్తుంది ఈ నవల. కామంతో కళ్లు మూసుకుపోయి పసి పిల్లలను, పండు ముసలి వాళ్లను కూడా వదలక అత్యాచారం చేసే వాళ్లను సుఖ రోగులుగా గుర్తిస్తుంది. వాళ్లు లైంగిక శక్తి కోల్పోయేలా టెస్టికల్స్ తొలగించే సర్జరీ చేస్తుంది. చావుకన్నా ఘోరమైన క్షమాభిక్షతో వాళ్లలో పరివర్తన తేవడమే అలాంటి నిందితులకు వెయ్యాల్సిన శిక్షని ప్రత్యక్షంగా నిరూపిస్తుంది. దిశ, అభయ కేసుల గురించి ప్రస్తావించినా, వాటి మధ్యగల సారుప్య, వైరుధ్య స్వభావాలను కుల, ఆర్థిక కోణాల నుంచి చర్చకు పెడుతుంది.

మహిళలు ధరించే దుస్తులు, ప్రవర్తన వల్లే వారిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్న ప్రశ్నలకు రచయిత ఈ నవలలో జవాబిస్తూ పసిపిల్లలు, ముసలి స్త్రీలపై జరిగే అత్యాచారాల గురించి మీరేం మాట్లాడతారు? అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు రేప్ అంటే బయట స్త్రీల పై జరిగేదే కాదు, భార్యాభర్తల మధ్య భార్య ఇష్టం లేకపోయినా భర్త బలవంతంగా చేసే లైంగిక కార్యమూ రేపే అని అనేక కుటుంబాల్లో జరుగుతున్న వాస్తవాన్ని బయటపెట్టాడు. స్త్రీలు తలచుకుంటే అమ్మగా లాలించ గలరు, అపరకాళిలా శిక్షించ గలరు అని “బృహన్నలపేట”లో చూపించాడు సతీష్ చందర్. ఇలా అనేకాంశాలతో కూడి “ఇన్ స్టెంట్ రిలీఫ్! నొప్పినించే కాదు, కోపం నుంచి కూడా… అని నేటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎన్ కౌంటరే యాంగర్ కిల్లర్!” అని రచయిత చెప్పినట్లే యాంగర్ కిల్లర్ వల్ల జరిగే అనర్థాలను, అన్యాయంగా పోయే ప్రాణాలను చూపిస్తూ, న్యాయం అంటే ఏంటో కాల్పనికతతో కూడిన వాస్తవికతతో చూపిన నవలే ఈ “బృహన్నలపేట”.

పాత్రల విషయానికి వస్తే… కన్నప్ప- సమాజాన్ని ఒంటికంటి న్యాయంతో చూసే అవకాశవాది. పిరికివాడు. శ్రీ అందానికి దాసుడై, ఆమెతో రెండో పెళ్లికి సిద్ధమవుతాడు. ముందు వెనుకా ఆలోచించని యాంగర్ కిల్లింగ్ మెంటాలిటీ గల వాళ్లకు ప్రతినిధి. శ్రీ- పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోగల ధైర్యవంతురాలు. న్యాయాన్యాయాలను ఆలోచించి న్యాయం వైపు నిలబడి, ఎంతదూరమైనా ప్రయాణించగల ధైర్యశాలి. వ్యూహాలు పన్నగల ధీశాలి. నేటితరం యువతులకు ప్రతినిధిలా కనిపిస్తుంది. మహిమ- డాక్టరైనా, స్త్రీలపై జరిగే అత్యాచారాలు, హత్యల నిందితులను శిక్షించడం కోసం తన వృత్తినే ప్రవృత్తిగా మార్చుకున్న నిపుణ. విరాట- బృహన్నలపేట నిర్వాహకురాలు. నృత్యాన్ని, ఆయుధాన్ని సమానంగా ప్రయోగించగల యోధిని. అడుగడుగున పురుషాధిక్య, కాముకత్వంతో నిండిన పురుషులను ఎదుర్కొనేందుకు తనవంటి యువతులను తయారు చేసే ప్రయోగశాలను నడిపిస్తుంది. నిందితులను శిక్షించటంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.

ఎస్సై పరివర్తన- థర్డ్ జెండర్ అంటే సమాజంలో చిన్నచూపు ఉంది. కానీ, అవకాశం వస్తే వాళ్లు ఎస్సైలే కాదు, నిందితులను శిక్షించి, సమాజాన్ని రక్షించడంలో ముందుంటారని చేసి చూపిస్తుంది. మీరాబాబా- దొంగ ఆశ్రమం నిర్వహిస్తూ భక్తి ముసుగులో రక్తిని బోధిస్తూ, అనుభవిస్తూ, తన ముఠాతో అత్యాచారాలను ప్రోత్సహించే నీచుడు. ఆంజనేయులు- శ్రీని రెండో పెళ్లి చేసుకుని, ఆమెతో విడిపోవడానికి సిద్ధమైనా… అతనికి, మొదటి భార్యకు పుట్టిన కూతుర్ని మానభంగం చేసిన వాడ్ని నరికి చంపే తండ్రి. బాబాతల్లి- ఉదాత్తమైన పాత్ర. భోగిలాంటి కొడుకును యోగిలా మార్చటానికి మళ్లీ పురిటినొప్పులకు సిద్ధమైన సాధ్వి. ఖలీల్ సహాయక పాత్రలను, వీరభద్రం లాంటి నీచ పాత్రలెన్నింటినో కథకు తగ్గట్లు సృష్టించుకున్నాడు రచయిత.

ప్రతి పాత్రకు ప్రారంభం, ప్రాధాన్యత, ముగింపు ఇచ్చాడు. ఎస్సై పరివర్తన లాంటి కొన్ని ప్రాత్రల ప్రారంభానికి ముగింపుకు మధ్య బహుముఖీనత ప్రదర్శించాడు. అలాగే కథనంలో పాత్రల తీరులో సస్పెన్స్ ప్రవేశ పెట్టి, చివరకు పాత్రల మధ్య ఉన్న రక్తసంబంధాన్ని, మానవీయ కోణాన్ని, లక్ష్యసాధనలో ఏకత్వాన్ని చూపుతూ కొసమెరుపుతో ముడులు వేశాడు. ఈ ముడుల్లోని మెస్మరైజ్ తెలుసుకోవాలంటే ఈ నవల ఎవరికి వాళ్లు చదవాల్సిందే. సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ కలిసి సామాజిక స్పృహతో నిండిన స్త్రీవాద నవలగా కనిపిస్తుంది. అంతర్లీనంగా నేటి సమాజంలోని కులం, మతం, రాజకీయం, ప్రభుత్వ శాఖల పనితీరు, న్యాయం, చట్టం వంటి అనేకాంశాలపై సతీష్ చందర్ వేసిన ప్రశ్నలు మనల్ని అడుగడుగున గులాబీ ముళ్లలా గుచ్చుతాయి. వస్తు, శిల్పాల మధ్య పోటీపెట్టినా సయోధ్యతో నడిపించాడు. నవలా యవనిక మీద వచ్చే దృశ్యాలలో ప్రతి దానికీ ప్రాధాన్యత ఇచ్చి, మెయిన్ థీమ్ తో లింకు పెట్టాడు.

నవలను అత్యాచార సంఘటనతో ప్రారంభించి, ఇన్విస్టిగేషన్ మూడ్ లో నడుపుతూ, చివరకు నిందితులకు తనదైన క్షమాభిక్ష అనే శిక్ష వేయడంతో ముగించాడు. ఎంచుకున్న మెయిన్ థీమ్ కు అనుగణంగా పాత్రలను, సన్నివేశాలను, సంఘటనలను, ఉప కథలను పేర్చుకుంటూ పోయాడు. స్మశానం దగ్గర ముగించి జీవిత సారాన్ని ఇన్ డైరెక్టుగా సూచించాడు. ఒక విషయాన్ని నవలగా పాఠకులకు చెప్పడం మౌఖిక శైలి. చదివేలా రాయడం లిఖిత శైలి. కానీ సతీష్ చందర్ నవలను దృశ్యాలుగా మలిచాడు. అంటే నాటకీయ శైలి. పాత్రల ఆహార్య, హావ, భావ ప్రకటనలతోపాటు, ప్రాపర్టీస్ నూ కళ్ల ముందు చూపించాడు. ముఖ్యంగా శ్రీ గదిలో బంధించబడి, కిటికీలోంచి ఎస్సై పరివర్తన నిందితులను శిక్షించే విధానాన్ని చూడడం. బృహన్నలపేటలోకి శ్రీ ప్రవేశించినప్పుడు అక్కడున్న వాతావరణాన్ని వర్ణించడం. కన్నప్పకు లేడీ గెటప్ వేసి వీరభద్రాన్ని పట్టుకోవడం… ఇలాంటివన్నీ సినిమా చూస్తున్న అనుభవాన్ని, అనుభూతిని పంచుతున్నాయి.

సతీష్ చందర్ శైలి నవలకు ఇంకో ఆకర్షణ. వ్యంగ్యాన్ని వెయ్యి ఓల్టులతో వెలిగించే వీరు ఈ రచనను పాఠకుల గుండెలపై ట్రాన్స్ ఫార్మ్ లా పేల్చాడు. అక్షరం వెంట అక్షరం, పదం వెంట పదం, వాక్యం వెంట వాక్యం మనల్ని గుక్కతిప్పుకోనీయకుండా లాక్కెళ్తుంది. పేజీలు వాటికవే మనలో భావావేశాన్ని నింపుతూ కదలిపోతాయి. ముఖ్యంగా అర్థ, శబ్దాలంకారాలతోపాటు, వాక్య విన్యాస వక్రతను, ధ్వనీభూత వ్యంగ్యాన్ని కథకు అనుగుణంగా సందర్బాన్ని బట్టి వాక్యాలతో ప్రవేశపెట్టాడు. సమాజ తీరుపై వీరు పేల్చే అక్షర చమక్కులు మన హృదయాల్లో అణుబాంబులై పేలాయి. మహిళలపై జరిగే అత్యాచారాల వెనకున్నది సమాజంలో పేరుకుపోయిన స్త్రీలను శాసించే సంప్రదాయ ధర్మసూత్రాలేనని, అవి పురుషుల్లో తిష్టవేసి కూర్చున్నాయని వాక్యాల చెండ్రాకోలుతో చరిచాడు. ప్రతి సెటైర్ వెనుక నవ్వు ఉంటుంది. కానీ ఆ నవ్వు ఒకసారి బాధను, మరోసారి ఆశ్చర్యాన్ని, ఇంకోసారి కోపాన్ని కలిగిస్తుంది.

“వెలిగే ప్రమిదను తీసుకుని వెళ్లి, నీళ్ళ చెరువులో వదలాలి కానీ, ఎవరైనా పెట్రోలు టాంకులో వదులుతారా?”, “తద్దినపు బ్రాహ్మడూ, తలంబ్రాల బ్రాహ్మడూ ఒకే చెట్టుకింద తల దాచుకున్నట్లు, విడాకుల లాయరూ, మ్యారేజీ బ్యూరో వోనరూ ఒకే కప్పు కింద వుంటున్నారని”, “రేప్ అంటే బలవంతాన కోరిక తీర్చుకోవడం మాత్రమే కాదు, కక్ష తీర్చుకోవటం కూడా”, “జీతము + జాతకము = జీవితము”. “ఏడుపు పిల్లతనం, కోపం పెద్దరికం. ఏడుపు రాకుండా కోపం వచ్చిందంటే పెద్దమనిషి అయినట్లే లెక్క”. “అవినీతి మీద స్పందించడంలోనే కాదు, అత్యాచారాల మీద స్పందించటంలోనూ అతడు రిజర్వేషన్ పాటిస్తాడు”, “షాదీ అంటే రేప్ కు లైసెన్స్ అనుకుంటాడమ్మా ఆ సైతాన్”, “దుఃఖానికి కన్నీళ్లు ఉపశమనం మాత్రమే. నిద్ర ఒక్కటే నిజమైన చికిత్స”, “మనదేశంలో తక్షణ కోపాన్ని లేపే శక్తి మతానికీ, కులానికీ మాత్రమే వుంటుంది”, “మత్తులో వున్నవాణ్ణి తెలివిలోకి తెచ్చేదే శిక్ష”, “మత్తులో వున్నప్పుడు కామన్న, తెలివిలోకి వస్తే వేమన్న. మత్తు నెత్తికెక్కితే భోగి. దిగిపోతే యోగి..”, “క్షమాభిక్ష చావుకన్నా ఘోరంగా వుటుంది రా!”, “చట్టం కాదు, తుపాకి గొట్టం. తన పని తాను చేసుకుపోతుందని దిగులు”, “కోపానిక్కూడా కోటా ఉంటుంది”, “కాంట్రాక్టర్లు కారు. కామ–ట్రాక్టర్లే”, “అక్కడంతా భక్తిప్రత వాతావరణమే. బుర్రను ఊపే అవసరమే తప్ప, బుర్రను వాడే అవసరం ఉండదు”. “లంచం కన్నా అవమానకరం లంచభంగం!”, “శిక్షలన్నీ ‘ఖాకీ’లే అమలు జరిపితే, కోర్టులున్నవి దేనికీ? ‘ఖాక’మ్మ కథలు వినటానికా..?”  లాంటి ఎన్నో వ్యంగ్యాస్త్రాలు మన మనసుల్ని మెలిపెడతాయి. లోకం గుట్టు విప్పి, తాట ఒలిచి ఆరేస్తాయి. నీతులు, విలువలు, సంప్రదాయాలు…  ఒకటేంటి ఆలోచించ కుండా ఆచరించే ప్రతి నమ్మకాన్ని వంగోపెట్టి నడ్డి విరగ్గొడతాయి.

“నడినెత్తికెక్కింది సామాజిక స్పృహ!” అంటూ నవల ప్రారంభంలోనే ఇదో సామాజిక వ్యంగ్య నవల అని క్లియర్ గా చెప్పేశాడు రచయిత. పోలీసులు, చట్టం తమపని తాము చేయనప్పుడు బాధితుల పక్షాన న్యాయంకోసం నిలబడే వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, వాళ్లే శిక్షలు విధిస్తారని హెచ్చరించాడు. అత్యాధునిక ప్రపంచ పోకడుల్లో వస్తున్న వేగం అన్ని రంగాల్లో ప్రవేశించి జీవితాల్ని అతలాకుతలం చేస్తుంది. మనుషుల దిన చర్యలనే కాదు, మానసిక ప్రపంచాల్ని సైతం కబళించేస్తుంది. చివరకు చట్టాలను కూడా శాసించే స్థాయికి చేరిందన్న సత్యాన్ని వెల్లడించాడు. పలు సామాజిక రుగ్మతల పై సతీష్ చందర్ చేసిన అక్షరపోరాటం ఇది. వారి రచనాశక్తికి, అవగాహనకు, సామాజిక స్పృహకు, బాధ్యతకు, చేతనకు, చైతన్యానికి నిదర్శనం. మొత్తంగా ఈ “బృహన్నలపేట” వర్తమాన సమాజ లోపాలపై సతీష్ చందర్ వేసిన రియలిస్టిక్, క్రియేటివ్ సెటైర్.

బృహన్నలపేట (నవల)

రచన: సతీష్ చందర్.

పేజీలు: 240, వెల: 300. 

ప్రతులకు: 411, హిమసాయి గార్డెన్స్, స్ట్రీట్ నెం:5, జవహర్ నగర్, హైదరాబాద్ – 20. 

ఎ.రవీంద్రబాబు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు