“…మూడు సార్లు పిలవండి, చెవిలో” అని నాక్కూడా చెప్పాడు అయ్యగారు. మా అన్నయ్యకూ చెప్పాడు, తమ్ముళ్ళకూ చెప్పాడు. నేను పిలవలేదు. నేను దేనికి వింటానో, దేనికి విననో ఆయనకు అర్థం అయి ఉండదు, ఖాళీ కళ్లతో నన్ను చూశాడు.
స్వర్గలోక యాత్రో, వైకుంఠ వాహనమో దాని పేరు గుర్తు లేదు కానీ, అందులోకి ఎక్కించడానికి అమ్మను ఎత్తినప్పుడు, అప్పటిదాకా ఎడంగా తచ్చాడుతున్న నేను, అమాంతం వెళ్లి ఒక కొమ్ము ఎత్తుకున్నాను. దింపేటప్పుడూ అంతే. చితి దాకా తీసుకువెళ్లే దారిలో ఒక భుజం అమ్మకు ఇచ్చాను. ఇదే ఆఖరు కదా, తనతో పాటు నేను ఇక ఎక్కడికీ నడిచేది ఉండదు.
“మూడు సార్లేమిటి, మూడువందల సార్లు పిలిచాం కదా, పలికిందా? లేదు కదా” అన్నాను చెల్లెళ్లతో. ఆ రోజు తెల్లవారు జామున, పిలిచినా, అరిచినా, కుదిపినా, చలనం లేకుండా ఉంది అమ్మ. జనవరి నెల చలి. ఒంటి వేడి తెలియడం లేదు. నాడి అందడం లేదు. గుండెకు చెవి ఆనించి వినబోతే, దడదడ నా గుండె చప్పుడే నాకు వినిపిస్తోంది. పిలుస్తున్నాము, పిలుస్తున్నాము, డాక్టర్ వచ్చేవరకు పిలుస్తూనే ఉన్నాము. చిన్నప్పటి నుంచి‘ అమ్మా’ అని రకరకాలుగా పిలిచి ఉంటాము. ఆ తెల్లవారు జామున పిలిచినట్టు మాత్రం ఎప్పుడూ పిలవలేదు.
నిజానికి ఎప్పుడో జరిగిన ఆరంభానికి అది ముగింపు. ఐదేళ్ల కిందట, భ్రమాత్మక భయాల నీడలు తనను కమ్ముకున్నప్పుడు, మరపు మతిని ముంచెత్తుతున్నప్పుడు, ఉపక్రమించిన ఒక సంభాషణ అర్థరాహిత్యంలోకి తెగిపోయినప్పుడు, మొదటిసారి ఆమెను కోల్పోయాము. అప్పుడే మా లోలోపల మాతృకేతనం అవనతం కాసాగింది. జ్ఞాపకం లేనిది ఉనికే లేదు. ఆమెలో నుంచి ఆమె జారిపోసాగింది. ఆమె జ్ఞాపకంలో నుంచి మేము చెరిగిపోసాగాము. మరణమన్నది హంస ఎగిరిపోవడం కాదు, దీపం ఆరిపోవడం అని తెలియసాగింది. నెమ్మది నెమ్మదిగా ఆమె మరణిస్తూ వచ్చింది. ఆఖరి చమురు బొట్టు కూడా ఇగిరిపోయి, ఒక రోజు ఆరిపోయింది.
తను అట్లా అచేతనంగా ఉన్నప్పుడు, ఆ తరువాత నిప్పుల్లో కాలిపోతున్నప్పుడు, ఈ మనిషి లో నుంచే, ఈ మనిషి ద్వారానే, తన వల్లనే, తన చేతనే నేను ఈ లోకంలోకి వచ్చాను కదా అని కొత్తగా గుర్తుకు వచ్చింది. నాలోనే ఏదో దహించుకుపోతున్నట్టు మనసు పెడబొబ్బలు పెట్టింది. ఇంతటి మమత్వం తను బతికివున్నప్పుడు చూపించి ఉంటే, ఎంత సంతోషించేది కదా అని సిగ్గు వేసింది!
అమ్మ వెళ్లిపోయి ఈ జనవరి ఆరు కు ఏడాది. తల్లి లేని పిల్లలుగా ఏడాది. తల్లీ తండ్రీ లేక ఏడాదిన్నర. ఎంత వయసు దాకా ఉండగలరు తల్లీ దండ్రీ! ఇంతకాలం ఉన్నారు చాలదా? … మనకు ఎంత వయసు వచ్చినా, తల్లిదండ్రులు ఉంటే, ఏదో ఒక చిన్నతనం మిగిలి ఉంటుంది. వారున్నంత వరకూ, కొడుకులూ కూతుళ్ల భావావరణంలోనే సంచరించగలుగుతాము. వాళ్ళు వెళ్లిపోయాక, ఇక మనకు మనమే అనిపిస్తుంది. వాళ్ల స్లాట్ లోకి మనమూ వెళ్లిపోయామని, కౌంట్ డౌన్ కాకపోయినా, కౌంటింగ్ మొదలయిందని తెలిసివచ్చి, భయం వేస్తుంది.
2024 డిసెంబర్ లో అమ్మ సంవత్సర కార్యక్రమాలు జరిగినప్పుడు, ఆమె ఇక నుంచి మా దినచర్యల్లో కనిపించడం మానేస్తుందని, బహుశా భూ ఆవరణాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్లిపోతుందని అనిపించింది. అంత్యక్రియలకు, పెద్దకర్మకు కొన్ని అర్థాలు చెబుతారు. ఈ లోకంలోని మమకారాలకు, పైలోకానికి చేసే ప్రయాణానికి మధ్య చిన్న ఘర్షణ ఉంటుందట. దాన్ని పరిష్కరించి, కుటుంబానికి దుఃఖం లేకుండా, మరణించిన మనిషి తన ప్రయాణం కొనసాగించే ప్రక్రియలే ఈ తతంగాలట. ఆ నమ్మకాల, పద్ధతుల సత్యా సత్యాల, మంచిచెడ్డల చర్చ ఇక్కడ అక్కరలేదు. కానీ, ఒక జీవితానికి, ఆ జీవిత నిష్క్రమణ జరిగిన తరువాత కలిగిన దుఃఖానికి సగౌరవమైన ముగింపు మాత్రం ఏదో ఉండాలి. తనువు చాలించిన వారిని పరలోకానికి తీసుకువెళ్లడమేమో కానీ, వదిలివెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి ఇహలోక స్రవంతిలోకి రావడానికి మాత్రం ఈ కర్మకాండలు బాగా పనికివస్తాయి.
తతంగాల మీద నమ్మకం లేని వారు సొంత మనోబలం మీద, అవగాహన మీదా ఆధారపడి, ఆ దుఃఖదినాలను గట్టెక్కాలి. మతపద్ధతులు పాటించనంత మాత్రాన, భావోద్వేగాలు, విరక్త భావన ఉండవని కాదు కదా? పరలోకప్రయాణ వివరాలను సంస్కృత మంత్రాల్లో జపించే క్రతువుల్లో పాలుపంచుకోకుండా ఉన్నప్పుడు, సోదరుల మాదిరిగా కేశవిసర్జన చేయనందుకు పశ్చాత్తాపమేమీ లేదు కానీ, వాటికి ప్రతిగా నాకూ ఒక తతంగం ఉంటే అందులో రక్షణ పొందేవాడిని కదా అనిపించింది. అమ్మ కు వీడ్కోలు చెప్పడానికి నాదైన పద్ధతి ఏది అన్న విచారం ఆవరించింది.
మా అమ్మ తనంతట తాను ప్రత్యేకమైన వ్యక్తి ఏమీ కాదు. అందరు అమ్మల వంటిదే ఆమె కూడా. పైగా, తను బడికి వెళ్లి చదువుకున్నది కాదు. ఆమెకు తెలిసిన ప్రపంచం మూడునాలుగు జిల్లాలు దాటదు. కారుణ్యస్పందనలు అవసరమైన ప్రమాదాలు, ఉత్పాతాలు, హత్యలు, ఆత్మహత్యలు, కాలధర్మాలు తప్ప మరో ప్రాపంచిక సమాచారం ఆమెను సోకదు. తాను ఏ మానవ సంబంధాల, సామాజిక సంబంధాల చట్రంలో పుట్టి పెరిగిందో దానిలోనే ఆమె బందీ. కానీ, తనకు కావలసిన వాళ్లు ఆ చట్రానికి బయట ఉండిపోతే, లేదా, చట్రం నియమాలను పాటించకపోతే, ఆమెకు పెద్ద పట్టింపు ఉండదు. కులమూ మతమూ ఆచారమూ అన్నీ ఉంటాయి, కొన్ని విషయాలలో పిల్లల కంటె వాటికే పెద్దపీట వేస్తుంది, కానీ, అవసరమైతే, మాతృత్వ హోదాలో దేన్నైనా వీటో చేస్తుంది. అమ్మకు ఏదో అద్భుత శక్తి లభించి ఇవన్నీ చూస్తూ ఉంటే గనుక, నేను ఈ కర్మలు, క్రియల లాంఛనాలలో పాలుపంచుకోనందుకు ఏమీ తప్పు పట్టేది కాదు, బాధపడేదీ కాదు.
ఫలానా వారి కూతురుగా, భార్యగా, తల్లిగా ఉండడం తప్ప వేరే మెట్లు అమ్మ విజయానికి లేవు. ఆమెకు వేరే సార్థకతలు లేవు. పిల్లలు పెరిగి ప్రయోజకులు కావడంలోనే తన సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ! పిల్లల్లో పరుగు తీయలేని వారినే ఎక్కువ ప్రేమించింది. మనసులు విరిగినప్పుడు కూడా అతుకుల కోసం ఆరాటపడింది. అట్లా ఉండే తల్లికి పిల్లలు ఏమి ఇవ్వగలరు? ఎంత ఇచ్చినా దానికి ఉండే విలువేమిటి? ఇటువంటి తల్లి ప్రేమని ఎక్స్ ప్లాయిట్ చేయకుండా మాత్రం ఏ పిల్లలు ఉండగలరు?
అనేక సన్నివేశాలలో, సందర్భాలలో ఇంకా అమ్మ స్ఫురణ పొడుచుకు వస్తూనే ఉంటుంది. అక్కడే ఎక్కడో తను కదలాడుతూ ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. మరపుతో సతమతమైన అమ్మ, ఇప్పుడు జ్ఞాపకంలో జీవిస్తూ ఉంది. కొంతకాలానికి, మా తలపులు కూడా పలుచబడినప్పుడు, ఆమె అందనంత దూరంలోని ఏదో గెలాక్సీకి ఎగిరిపోయి, ఇక ఎప్పుడూ ఈ లోకపు లంకె లేని కైవల్య పదానికి చేరుకుంటుంది కాబోలు. తను రామానుజ మతస్థురాలు కాబట్టి, దాన్నే సాయుజ్యంగా స్వీకరిస్తుందేమో?
చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరని మంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంది.
*
“పరలోకప్రయాణ వివరాలను సంస్కృత మంత్రాల్లో జపించే క్రతువుల్లో పాలుపంచుకోకుండా ఉన్నప్పుడు, సోదరుల మాదిరిగా కేశవిసర్జన చేయనందుకు పశ్చాత్తాపమేమీ లేదు కానీ, నాకూ ఒక తతంగం ఉంటే అందులో రక్షణ పొందేవాడిని కదా అనిపించింది. అమ్మ కు వీడ్కోలు చెప్పడానికి నాదైన పద్ధతి ఏది అన్న విచారం ఆవరించింది.”
గొప్ప మాటలివి. శ్రీనివాస్ గారు ఒక్కరే ఇలా వ్రాయగలరు. అందరి మనసులో వుండే ఆలోచనకు అక్షరరూపం ఇచ్చారు ఆయన. అమ్మకు నా నివాళి! 🙏🏼
Good and heart touching writeup
అద్భుతం!
యే తల్లికి అయినా ఒక బిడ్డ నుండి ఇంత కన్నా గొప్ప నివాళి కోరుకుంటది. నిజమే కదా వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన కనీస సమయాలను ఇవ్వలేక పోయినందుకు ఒకింత నిష్కృతి చాలు కదా..
It’s really heart touching sir
ఆచారంతో నమ్మకం ఉన్నా లేకున్నా
అమ్మ అంటే అవే భావాలు అందరికీ
పిల్ల ల్లో ఎక్కువ పరుగు తీయలేని వారినే ప్రేమించింది.
ఇది చాలు ఆమె మరికొన్నాళ్లు బతికి ఉండడానికి. తల్లిదండ్రులు వెంట వెంటనే వెళ్లి పోవడం బాధాకరం.క్రతువులు గుండె దిటవు చేసుకోవడానికి ఉపయోగపడవనిపిస్తది.
అమ్మల విషయంలో పుచ్చుకునే హక్కును ఫీల్ అయినంతగా తిరిగి ఇవ్వడమనే బాధ్యత తీసుకోని వాళ్ళమే ఎక్కువ మందిమి. నాలోని హేతువాదిని కొద్దిసేపు పడగొట్టగలిగింది భావోద్వేగానికి నచ్చిన నమ్మకం. మా అమ్మ చితిపై కాలి, కరిగిపోతూ ఉంది. నేను ఎద్దంత ఎదిగినా లేగను చూసినట్టు చూసిన అమ్మ ప్రేమకు ఆమె దేహం మాత్రమే మూలం కాదనీ, దేహాతీతమైన ఉనికి ఆ ప్రేమకు ఉంటుందనీ అనిపించింది. ఉండాలన్న ఆశ చెలరేగింది. ఆ చితి మంటల కాక నుంచి నాకు ఉపశమనంలా ఆ అభౌతిక ప్రేమ ప్రసారం చల్లగా నాకు తాకుతుందనిపించింది. ఆ నమ్మకం వైపు మొగ్గడం కొన్ని నిమిషాల పాటు ఊరటనిచ్చిన మాట నిజం! ఆ వెంటనే నాలోని హేతువాది శక్తి పుంజుకుని తన జయకేతనాన్ని తిరిగి ఎగరేయగలిగాడు.
Heart touching Sir.
దుఃఖంగా అనిపించింది. మా అమ్మమ్మ గుర్తు వచ్చింది.
Chala bagundi srinivas garu
Touching
అమ్మ ను కొల్పోవడమంటే….
ఈ లోకంతో బొడ్డుతాడు బంధం తెగిపోయిన వొంటరితనమే..
అమ్మను కోల్పోవడమంటే
తల్లి గర్భంలో తొమ్మిది నెలలూ వో కంఫర్ట్ జోన్ లో పెరిగిన బిడ్డ …
పుట్టగానే కొత్త లోకం లో అభద్రత తో తన్లాడినట్టు
మన చుట్టూ అల్లుకున్న బంధాలను చంటి బిడ్డలా,
కె ఎస్ గారన్నట్టు, ఒంటరితనపు భయం తో కొనసాగించాల్సి రావడమే..
నిజంగా మీ రచన…. తల్లి పట్ల దృక్కోణాన్ని సవారించేది గా వుంది. తల్లి ప్రేమను పొందడమే కాదు …. తన పట్ల టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే పద్ధతిలో కాకుండా మరింత బాధ్యతగా ప్రవర్తించే దిశగా ఆలోచింప చేసింది..
ధన్యవాదాలు కె ఎస్ గారికి
మనిషి ని లోతుల్ని శోధిస్తే ఏ మూలో రెండు కన్నీటి బొట్లు తప్పకుండా కనిపిస్తాయి. ఒకటి అమ్మ..మరొకటి నాన్న..
కె. శ్రీనివాస్ గారి రచన “జ్వరం కాస్తే, భయం వేస్తే…” అనేది తల్లి మరణంతో పాటు వచ్చిన ఆత్మపరిశీలన, భావోద్వేగాల సమ్మేళనం. తల్లి పిల్లల మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని, తల్లి ప్రేమ గొప్పతనాన్ని ప్రతిఫలిస్తుంది. తల్లి మరణాన్ని ఒక సహజ ప్రక్రియగా అంగీకరించి, ఆ నష్టాన్ని హేతువాద దృక్కోణంతో అర్థం చేసుకోవడం ప్రత్యేకతగా నిలుస్తుంది. తన తల్లి వీడ్కోలులో తానూ ఒక తతంగం కల్పించుకుని, మనసుకు నెమ్మదింపుగా ఉండే విధానాన్ని రచయిత పంచుకున్నారు. సాంప్రదాయాలకు విశ్వాసం లేకపోయినా, భావోద్వేగాల గాఢతను అంగీకరించడం ఆయనలో ఉన్న తాత్వికతను ప్రతిబింబిస్తుంది.
తల్లి పాత్రను సాధారణ మహిళగా చిత్రించడంలో, ఆమె వ్యక్తిత్వం, సంబంధాల విలువను చూపించడం బాగుంది. తల్లిదండ్రుల ఉనికి పిల్లలకు ఒక చిన్నతనం, భద్రతను అందిస్తుంది. అది లేని లోటు జీవితంలో ఎంత కోల్పోతామో అనిపిస్తుంది. మరణం, జీవితం మధ్య సహజ సంబంధాన్ని “మరణం అంటే దీపం ఆరిపోవడం” అని వ్యక్తీకరించడం బాగుంది. మొత్తంగా తల్లి మమతను, జీవితాల్లో బంధాల ప్రాముఖ్యతను గుర్తుచేసే హృదయవేదనతో నిండి ఉంది.
మా అమ్మ గుర్తుకు వచ్చింది. తను కాలం చేసినప్పుడు ఆ తీవ్ర విషాదం తాలూకు బాధ గుర్తొచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖం అన్నిటికీ భిన్నమైంది. చివరి శ్వాస వరకు వెంటాడుతుంది
చాలా కదిలించింది. స్శశాన వైరాగ్యాలు ఆధ్యాత్మిక చింతనలు మానవ సంబంధాలు వీటన్నింటిని దాటిన ఒకానొక తాత్విక చింతన కమ్మేసింది. మంచి భాష భావగాంభీర్యం ఒక ఆత్మీయ పలకరింపుతో కలసి పోయి నాబాధలేనా ఇవన్నీ అనిపించేలా రాశారు. ధన్యవాదాలు.
ఏ మనిషికైనా అమ్మ ఒక తీరని ఆకలి. ఎంత పిలుచుకున్నా కొంత ఖాళి మిగిలే వుంటుంది. అమ్మ ప్రేమను మించిన ఆచారం ఏముంటుంది. కన్నీళ్ళకి, కన్న తల్లికి ఎవరిమైనా ఏమివ్వగలం. అమ్మను పలకరించిన కె. శ్రీనివాస్ గారికి కృతఙ్ఞతలు.
అమ్మ జ్ఞాపకమే కాదు. జీవిత సత్యం. అమ్మ గురించి చాలా గొప్పగా రాశారు. ఎవరి అమ్మ అయినా అమృత కలశం. మీరు అమ్మ గురించి రాసినది చదివిన తరువాత నేనెంత కోల్పోయాను గుర్తుకు వచ్చింది. నేను ఆరు నెలల పిల్లవాడి గా వున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. ఆమె రూపమే నా మనసు లో లేదు.
అమ్మ లందరికీ జై జై… పోటు రంగారావు
చాలా బాగుంది. ఉద్వేగ భరితమైన రచన. కదిలించింది. కరిగించింది.
అమ్మ గుర్తుకు వచ్చింది.😔
అవును…. ప్రతి రోజు అమ్మ జ్ఞాపకంతో గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. అమ్మా అని పిలవాలనిపిస్తుంది.