చెప్పకురా చెడేవు

పాఠకుడు చెప్తే తెలుసుకుంటాడు – ప్రదర్శిస్తే అర్థం చేసుకుంటాడు.

రచయితకి పాఠకులకి మధ్య సంభాషణ, అలిగి మాట్లాడుకోకుండా ఉన్న భార్య భర్తల మధ్య జరిగే సంభాషణలా ఉండాలి. కిచెన్‌ సింక్‌లో పడుతున్న గిన్నెల చెప్పుడులో భార్య కోపం భర్తకి అర్థమవ్వాలి. భర్త టీవీ ఛానల్స్ మారుస్తున్న వేగంలో భార్యకి నిరసన తెలియాలి.

గత పక్షం కలవడం కుదరలేదు. మన్నించాలి. దాదాపు నెల క్రితం వచ్చిన 12వ భాగంలో నేను ఒక కథాభాగాన్ని ఇచ్చి కథాంశం, పాత్ర స్వభావాన్ని మార్చకుండా ఇదే కథని మీరైతే ఎలా రాస్తారు అని అడిగాను. దానికి సంజయ్ ఖాన్ గారు ఒక్కరే సమాధానం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఇంకెవరైనా నాకు చెప్పకుండా ప్రయత్నించి ఉంటే సంతోషం.

ఇదీ ఆ కథ –

కరుణ చూపే చేతులు

ఆయన పేరు కరుణాకర్. ఆయన ఎంత మంచివాడో చెప్పలేం. చెప్పాలని ప్రయత్నిస్తే కనీసం ఆరు పేజీల వ్యాసం అవుతుంది. బాధలో వున్నవాణ్ణి చూస్తే ఆయన మనసు కరిగిపోతుంది. ఎవరైనా వచ్చి ఇబ్బంది అని వస్తే డబ్బులు ఇవ్వడానికి వెనుకాడడు. ఎంతోమంది బంధువుల పిల్లల చదువులకి డబ్బులు ఇస్తుంటాడు. ఎంతో మంది ఆరోగ్య సమస్య వుందంటే సహాయం చేశాడు. జీతంలో యాభై శాతం అలాగే ఖర్చుపెట్టేస్తాడు. ఇదే నచ్చలేదు అతని భార్య నళినికి. ముందు వద్దని చెప్పి చూసింది. గొడవపడింది. పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు విడాకుల నోటీస్ ఇచ్చింది. ఆ కేస్ విషయమై లాయర్ దగ్గరకు బయల్దేరాడు కరుణాకర్.

దారి పొడవునా ఆలోచనలే. నళిని గురించి కాదు. రెండు నెలల క్రితం అనాధ శరణాలయంలో కలిసిన పాప గురించి. ఆ పాపని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాడు కరుణాకర్. ఆ విషయంలోనే గొడవ మొదలై నళిని దూరమయ్యేదాకా వచ్చింది.

మునుపు నేను ఈ కథ ఇచ్చినప్పుడు మీరు చదివి ఉండకపోయినా, మరింత మెరుగ్గా రాసే అవకాశం ఏమైనా వుందా అని ఆలోచించి ఉండకపోయినా రెండు నిముషాలు ఆగి ఆలోచించండి. ఇదే కథ మీరైతే ఎలా రాస్తారు? ఆలోచించుకున్నారా?

ఇప్పుడు నేనైతే ఎలా రాస్తానో, ఆ వర్షన్ చదవండి. తరువాత వివరణ ఇస్తాను (నాకు అవకాశం ఇస్తే ఈ కథ శీర్షికని కూడా మారుస్తాను. ఆ సంగతులు మరోసారి) –

కరుణ చూపే చేతులు

ఆ చౌరస్తా దాటిన తరువాత నాలుగో బిల్డింగ్‍లో వుంది లాయర్ ఆఫీస్. సిగ్నల్ దగ్గర ఆగింది కరుణాకర్ కారు.

“ఎంత ఫీజ్ అడుగుతాడో” అనుమానంగా వుంది కరుణాకర్‍కి. “అయినా నళిని విడాకుల నోటీస్ ఇవ్వడమేమిటి?” రెండు రోజులుగా కొన్ని వందలసార్లు అనుకోని వుంటాడిలా. ఏ విషయంలో తక్కువ చేశాడని? తల పగిలిపోతోంది.

ఆలోచనలో గమనించలేదు కానీ ఎవరో పాపం అతని కారు పక్కనే నిలబడి అడుక్కుంటోంది. ఆమె చంకనెక్కి ఓ చంటిపిల్లాడు.

ఆ పసివాణ్ణి చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి అతనికి. అద్దం దించాడు.

“బాబూ… రెండు రూపాయలివ్వండి పిల్లాడి…” ఆమె మాట పూర్తికాలేదు. జేబులో చెయ్యి పెట్టి వంద కాగితం తీసి ఇచ్చాడు. ఆమె మెరిసిపోతున్న ముఖంతో అది అందుకోని దణ్ణం పెట్టింది.

“ఇలా ఇచ్చి ఇచ్చి వున్న కాస్త డబ్బు తగలబెట్టేయండి” ఇలాగే ఒకసారి డబ్బులు ఇస్తే నళిని అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అదొక్కటే వాళ్లద్దరి మధ్య వున్న విబేధం. అదే గొడవ. చివరికి అదే విడాకుల  నోటీస్‌కి కారణమైంది.

సైడ్ మిర్రర్ లో నుంచి డబ్బులు అడుక్కున్నామెని చూశాడు కరుణాకర్. ఆమె కుంటుతోంది. ఒక కాలు లేదామెకి. ఒక్క క్షణం విచలితుడైపోయాడు.

ఠక్కున కార్ తలుపు తెరిచి ఆమె వైపు పరుగెత్తాడు. సిగ్నల్ గ్రీన్ పడింది. మిగిలిన వెహికిల్స్ వెళ్లిపోతుంటే, కరుణాకర్ కారు, ఆ వెనక వున్న కార్లు అక్కడే ఆగిపోయాయి. అందరూ హారన్ కొడుతున్నారు. కరుణాకర్ నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి జేబులో వున్నాదంతా తీసి లెక్క కూడా చూడకుండా ఇచ్చేశాడు. మూడు వేలో నాలుగు వేలో. లాయర్ ఫీజ్‍  కోసం తెచ్చినవి. హారన్ కొడుతున్నవాళ్లు అద్దాలు దించి తిట్టడం మొదలుపెట్టారు. ఎవరు తిడితేనేం? జేబు బరువు తగ్గింది. మనసులో బరువుకూడా తగ్గింది. కార్ తీశాడు.

ఇలా ఆ కథని కొనసాగిస్తాను. అక్కడికి నేనేదో అద్భుతమైన కథ రాశానని కాదు కానీ, ముందు చెప్పిన వర్షన్‌కి ఈ రెండో వర్షన్‌కి ఉన్న తేడా గమనించారా? అదే విషయాన్ని రెండు మాటల్లో చెప్పేస్తాను –

మొదటి కథ చెప్పబడింది. రెండో కథ ప్రదర్శింపబడింది.

చెప్పడానికీ, ప్రదర్శనకీ వున్న తేడా గమనించండి. మొదటి కథలో “కరుణాకర్ ఎంత మంచివాడో చెప్పలేం” అన్నాడు రచయిత. పాఠకుడు “ఓహో అలాగా” అంటాడు. రెండొవ రకం కథనంలో ఎక్కడా రచయిత కరుణాకర్ ఎలాంటివాడో చెప్పలేదు. సిగ్నల్ పడ్డా, వెనుక ఆగిన కార్లు ఎంత హారన్ కొట్టినా, కారు ఆపి పరుగున వెళ్లి జేబులో ఎంత వుందో కూడా చూసుకోకుండా మొత్తం డబ్బు తీసి ఇచ్చాడు అని ఒక సంఘటనని ప్రదర్శించాడు రచయిత. దీని వల్ల పాఠకులు తమ ఆలోచనశక్తితో కరుణాకర్ అనే పాత్రని నిర్మించుకుంటారు. “పాపం కరుణాకర్ ఎంత మంచివాడో!” అనుకుంటాడు. మొదటి కథనంలో రచయిత చెప్పిన విషయమే ఇది. కానీ రెండో కథనంలో అదే విషయాన్ని రచయిత పాఠకుల చేత చెప్పించాడు.

ఈ రెండింటికి తేడా ఏమిటి?

పాఠకుడు చెప్తే తెలుసుకుంటాడు – ప్రదర్శిస్తే అర్థం చేసుకుంటాడు

నా ఉద్దేశ్యంలో రచయితకి పాఠకులకి మధ్య సంభాషణ అలిగి మాట్లాడుకోకుండా ఉన్న భార్య భర్తల మధ్య జరిగే సంభాషణలా ఉండాలి. కిచెన్‌లో సింక్‌లో పడుతున్న గిన్నెల చెప్పుడులో భార్య కోపం భర్తకి అర్థమవ్వాలి. భర్త టీవీ ఛానల్స్ మారుస్తున్న వేగంలో భార్యకి భర్త తాలూకు నిరసన తెలియాలి. అంతే కానీ “నీ మీద నాకు చాలా కోపంగా ఉంది తెలుసా” అని భార్య భర్తతో అనేసి, “అవును నాకు కూడా నీ మీద కోపంగానే ఉంది” అని భర్త భార్యతో చెప్తే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో రచయిత కథలోకి దూకి కథ చెప్తే అలా ఉంటుంది.

ప్రదర్శించడం అంటే చెప్పాలనుకున్న ప్రతి విషయానికీ ఒక సంఘటన కల్పించడం కాదు. చెప్పాలనుకున్నది రచయిత వాక్యంగా చెప్పకుండా, పాఠకులు తమంత తామే అర్థం చేసుకునేలా రాయటం.

రవి కోపంగా ఉన్నాడు.

అనకుండా –

రవి తీక్షణంగా చూశాడు. అతని చేతిలో ఉన్న గ్లాసును బలంగా నేలకేసి కొడితే అది భళ్లున పగిలింది.  పిడికిలి బిగించి, పళ్లు పటపట కొరికాడు.

ఇక్కడ రవి కోపాన్ని ప్రదర్శించడానికి ఒక సన్నివేశాన్ని కల్పించలేదు. కేవలం రవి గురించి చేసిన వర్ణనతో అతనికి కోపం వచ్చింది పాఠకుడికి అర్థమయ్యేలా చెప్పాము.

ఇంగ్లీషు సాహిత్యంలో “షో డోంట్ టెల్ (Show, don’t tell)” అని చెప్తారు. షో అంటే చూపించడం అనే అర్థం ఉన్నా, మనం తెలుగులో చూపించు అని కాకుండా ప్రదర్శించు అంటే ఇంకా కరెక్ట్‌గా ఉంటుంది. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. కానీ చాలా మంది రచయితలు నేరుగా కథలోకి దూకేసి “నేను చెప్తాను విను” అని ప్రకటించి మరీ అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. నేరుగా అన్ని విషయాలు వాచ్యంగా చెప్పే రచయితల గురించి వల్లంపాటి గారు చెప్పే వాక్యం నాకు భలే ఇష్టం. – “ఎక్కువగా మాట్లాడే రచయిత అతి ఉత్సాహవంతుడైన ప్రేక్షకుడి వంటివాడు. ఇతరుల మధ్య కూర్చోని వాగుతూ తాను నాటకాన్ని చూడడు. ఇతరుల్ని చూడనివ్వడు” అంటాడాయన.

కథా రచనకి సంబంధించి చాలా విరివిగా చెప్పబడే సూత్రమిది. అయినా రచయితలు ఈ తప్పు ఎందుకు చేస్తారు?

రెండు కారణాలు చెప్తాను.

మొదటి కారణం: పాఠకులకి అర్థమౌతుందో లేదో అన్న భయం

చెప్పీ చెప్పకుండా చెప్తే, చెప్పిన విషయం అర్థమౌతుందో లేదో అనే భయం చాలామంది రచయితల్లో ఉంటుంది. నిజమే, చెప్పిన విషయం అర్థం కాకపోతే ఆ కథ అభాసుపాలౌతుంది. కానీ పాఠకులు అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని నేరుగా చెప్పాలని ప్రయత్నం చేస్తే రచయితలు అభాసుపాలౌతారు. ఈ తేడా తెలుసుకోలేని రచయితలు “స్పష్టత” కోసం వివరించడం మొదలుపెడతారు. కథలో పాత్రమీద జాలి కలగాల్సిన సందర్భం అనుకోండి – “పాపం. తినడానికి తిండిలేని అనాథ. ఆమెను జాలిపడటం మినహా మరేమీ చెయ్యలేని పరిస్థితి” అని రాసి పాఠకుడికి “ఇప్పుడు జాలిపడు” అని చెప్తాడు ఇలాంటి రచయిత. అదే రాయటం అనే క్రాఫ్ట్ తెలిసిన రచయిత ఆ పాత్ర చుట్టూ ఒక సందర్భాన్ని అల్లి ఆ సందర్భం ద్వారా పాఠకుడిలో ఆ జాలిని పుట్టిస్తాడు. ఈ వ్యాసం మొదట్లో ఇచ్చిన కథలో ప్రధాన పాత్రకి ఉండే జాలి అనే లక్షణాన్ని చెప్పడానికి, దాన్ని ప్రదర్శించడానికి ఉండే తేడాని చూశారు మీరు.

అసలు ఒక రచయితకి తాను రాసేది పాఠకులకి అర్థం అవుతుందో లేదో అన్న భయం ఎందుకు కలుగుతుంది? ఆ రచయిత తాను రాస్తున్న రచనపట్ల, తన సామర్థ్యం పట్ల నమ్మకం లేకపోవటం వల్ల వచ్చిన న్యూనత కారణం కావచ్చు. లేదా ఆ రచయితకి పాఠకుల తెలివితేటల మీద నమ్మకం, గౌరవం లేకపోవడం కారణం కావచ్చు. న్యూనత కారణమైతే దాన్ని దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చెయ్యాలి. అందుకు సాహిత్యం చదవడమే మార్గం. నేను రాస్తున్న ఈ వ్యాసాల్లాంటివి (ఆరుద్ర నుంచి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ఖదీర్‌బాబు దాకా చాలా మంది రాశారు) చదివి టెక్నికల్ స్కిల్ పెంచుకోవచ్చు.

పాఠకుల తెలివితేటలని నమ్మకపోవడం, వాళ్లని గౌరవించకపోవడం క్షమించరాని నేరం. ఈ విషయం నేను ఈ శీర్షిక మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. మళ్లీ చెప్తున్నాను. పాఠకుల మీద గౌరవం, వాళ్ల తెలివితేటల మీద నమ్మకం లేకపోతే ఆ రచయితని పాఠకులు గౌరవించరు. ఈ వ్యాసం మొదట్లో ఇచ్చిన ఉదాహరణే తీసుకుందాం. అందులో ప్రారంభ వాక్యాలు చూడండి.

“ఆయన పేరు కరుణాకర్. ఆయన ఎంత మంచివాడో చెప్పలేం. చెప్పాలని ప్రయత్నిస్తే కనీసం ఆరు పేజీల వ్యాసం అవుతుంది. బాధలో వున్నవాణ్ణి చూస్తే ఆయన మనసు కరిగిపోతుంది. ఎవరైనా వచ్చి ఇబ్బంది అని వస్తే డబ్బులు ఇవ్వడానికి వెనుకాడడు.”

కథానాయకుడు కరుణాకర్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే ఆరు పేజీల వ్యాసం అవుతుందట. అంటే పాఠకులతో రచయిత ఏం చెప్పినట్లు? “నేను చెప్తున్నాను! ఈ కథా రచయితని చెప్తున్నాను! కరుణాకర్ మంచివాడు. జాలిపరుడు. ఆలోచించకు. ఇదే నిజం.” అని ప్రకటించినట్లుంది. ఇందులో నేను చెప్పకపోతే మీకు తెలియదు / అర్థం కాదు అన్న చులకన భావం కూడా కనపడుతుంది.

ఇది ఎలా ఉంటుందంటే – ఒక జోక్ చెప్పి దాన్ని మళ్లి అర్థమయ్యేలాగా వివరించడం లాగా ఉంటుంది. జోక్ అర్థం అయినవాళ్లకి దాని వివరణ ఎలా చికాకు కలిగిస్తుందో కథ అర్థం చేసుకున్న పాఠకుడికి రచయిత జోక్యం అంతే చికాకు కలిగిస్తుంది. స్టాండ్అప్ కామెడీలో జోక్ అయినా, కథలో ఎమోషన్ అయినా ఏం చెప్పాలో అదే చెప్పాలి. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ముఖ్యంగా ఎక్కడ ఆపాలో అక్కడే ఆపాలి. పాఠకులు చాలా తెలివైనవాళ్లు, తప్పకుండా అర్థం చేసుకుంటారు అని నమ్మి రాయాలి. పాఠకుడిని గౌరవించి రాయాలి.

కొన్ని కథలు వుంటాయి. వి. చంద్రశేఖరరావు, త్రిపుర, రమణజీవి లాంటి రచయితలు రాసినవి. అంత త్వరగా కొరుకుడుపడవు. పైకి అర్థం కాని కథల్లా కనిపించినా లోపల ఎంతో లోతు వుంటాయి. అయినా ఆ రచయితలు వాటిని సరళంగా వివరించే ప్రయత్నం చెయ్యలేదు. అర్థం చేసుకున్న పాఠకుడు చేసుకుంటాడు. చేసుకోలేకపోతే అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో రచయితకి మరింత దగ్గరౌతాడే కానీ దూరం కాడు. అలా కాకుండా వాచ్యంగా కథ చెప్తే పాఠకుడు దూరమయ్యే ప్రమాదం వుంది.

రెండో కారణం: త్వరగా కానిచ్చే ప్రయత్నం

“ఆమె భయపడింది” అని చెప్పడానికి రెండు పదాలు కావాలి. చదవటానికి ఒక సెకను పడుతుంది. ఇదే విషయాన్ని ప్రదర్శించాలంటే ఆమె చేతులు వణకడం, తడబడటం, గుండె కొట్టుకోవడం లాంటివి చెప్తూ నాలుగైదు వాక్యాలు రాయాలి. అది చదవటానికి ఐదారు సెకన్లు పడుతుంది. రచయితకి ఏమనిపిస్తుందంటే – రెండు పదాలలో చెప్పడంలో ఉండే సౌలభ్యం, తక్కువ సమయంలో పాఠకులకి విషయం చేరవేసే అవకాశం వల్ల కథని త్వరగా నడిపేయచ్చు అని.

అసలు అంత తొందర తొందరగా కథ నడపాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు నడపాలి? నాకు మూడు కారణాలు కనపడతాయి. మొదటిది రచయిత అత్యుత్సాహం. రెండొవది మనం ఉంటున్న హడావిడి ప్రపంచం. మూడో కారణం తరువాత చెప్తాను కానీ, ముందు ఈ రెండు కలిపి మాట్లాడుకుందాం. నాకు టైమ్ లేదు అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచానికి ఊతపదం అయిపోయింది. నస వద్దు, పాయింట్‌కిరా అని అడిగేస్తున్నాం.

దీన్ని పాఠకులకు అన్వయించి చూసిన రచయితకి – వాళ్లకి తీరుబడిగా కథలు చదివే టైం లేదు చెప్పేదేదో సింగిల్ పేజీ కథగానో, కార్డు కథగానో చెప్పేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. అదే హడావిడి ప్రపంచంలో ఉన్న రచయిత పరిస్థితి ఏంటి?

రచయిత మనసులో మెదిలే ఏ కథైనా భోజనం తరువాత పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్ధం లాంటిది. అది అలాగే ఉంటే ఏ పని చేస్తున్నా, ఏమి ఆలోచిస్తున్నా, ఇంకేదో మాట్లాడుతున్నా, నాలుకకి తగులుతూనే ఉంటుంది. ఎలాగైనా దాన్ని వదిలించుకుంటే తప్ప మనశ్శాంతి ఉండదు. (ఉపమానం ఇబ్బంది పెడితే క్షమించండి). ఇప్పుడు మన హడావిడి ప్రపంచంలోకి వద్దాం. రచయితలు కూడా ఆ ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు కదా? మనకి కథలు చెప్పే రచయిత మరొకరికి కుటుంబ సభ్యుడు, ఇంకో ఆఫీసులో ఉద్యోగి, మరింకేవో బాధ్యతలు, కోరికలు ఉన్న వ్యక్తి. ఇన్నింటి మధ్య మనసులో సలుపుతున్న గాయంలా ఒక కథ ఉంటుంది. అది చెప్పకుండా ఉండలేక, చెప్పాల్సినదేదో ఠక్కున చెప్పేసి, ఆ బరువు దించేసుకుని మన పనేదో మనం చూసుకుందాం అని అనిపిస్తుంది. ఈ తరం రచయితల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాఠకులకి చదివే టైమ్‌లేదు, నాకు రాసే టైమ్‌లేదు అని చెప్పాల్సింది కథని టక టకా వాచ్యంగా చెప్పి వెళ్లిపోతుంటారు. అందుకే ఈ మధ్య చాలా కథల్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఒక సన్నివేశం నుంచి మరో సన్నివేశానికి దూకుడు కనిపిస్తుంది. అలాంటి కథలలో రచయితలు మనం చదువుతున్న కథలో నుంచి బయటికి వచ్చి – ఇదిగో ఇదీ కథ, ఇక్కడ నీకు బాధగా అనిపించాలి, చివర్లో నువ్వు అయ్యో అనాలి అని పాఠకుడికి తాము ఎంచుకున్న ఎమోషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే ప్రయత్నం చేస్తారు.

ఇది ఎలా సరిదిద్దుకోవాలి? చెప్తాను. దానికన్నా ముందు ఈ “త్వరగా కానిచ్చేద్దాం” అని రచయిత అనుకోడానికి గల మూడో కారణాన్ని కూడా చూసి ఆ తరువాత పరిష్కారాలు ఆలోచిద్దాం. నేను తరువాత చెప్తానన్న మూడో కారణం – నిడివికి సంబంధించిన పరిమితులు. మనందరికీ తెలిసిన విషయమే – పత్రికల్లో కథ ప్రచురించాలంటే వాళ్లు చెప్పే నిడివిలోనే రాయాలి. వాళ్ల పరిమితులు వాళ్లకి ఉంటాయి. కాదనలేం. కానీ కథల పోటీలల్లో కూడా పదాల పరిమితి విధిస్తారు. అదేమిటో మరి! ఏది ఏమైనా, ఇలా విధించబడిన పరిమితుల్లో కథ చెప్పాలంటే ప్రదర్శించే టైమ్ ఉండదు అని చాలామంది రచయితలు అనుకుంటారు. దాంతో ఆ రచయితలు స్వయంగా కథలోకి వచ్చేసి నరేషన్‌లో ఎమోషన్ చెప్పేసి కథని నడిపించేస్తుంటారు. నిడివికి సంబంధించిన పరిమితులని ఎలా అధిగమించాలి?

ఈ ప్రశ్నకి, ఇందాక చెప్పకుండా దాటేసిన ప్రశ్న – హడావిడి లేకుండా కథని ఎలా నడపాలి? – రెండింటికీ ఒకటే సమాధానం. మంచి కథలు చదవాలి. ముఖ్యంగా నింపాదిగా కథ చెప్పడం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పాతతరం కథలని చదవాలి.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వడ్లగింజలు అనే క్లాసిక్ కథ చదవండి. అచ్చులో 92 పేజీలు. కథ మనలో చాలామందికి తెలిసినదే. చతురుడు, మేధావి, చదరంగంలో దిట్ట అయిన శంకరప్ప మహరాజు ముందు నిలబడి, మెప్పించి బహుమతి కోరుకుంటాడు. చదరంగపు 64 గడులలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, ఆ తరువాత గడిలో రెండు, ఆ తరువాత నాలుగు, ఇలా పెట్టుకుంటూ వెళ్తే వచ్చిన ధాన్యం ఇప్పించమని అడుగుతాడు. ఇదే ముఖ్య కథ. కానీ దానికి 92 పేజీలు ఎందుకు? చదివితే తెలుస్తుంది. కానీ చదవడానికి కూడా తీరుబడి చేసుకుని చదవాలి. అప్పుడే అందులో ఉన్న ఒక్కో వాక్యాన్ని ఆస్వాదించే వీలు కలుగుతుంది. శ్రీపాదనే చదవాలని చెప్పట్లేదు. నిజానికి నేను ఈ తాపీగా, నింపాదిగా కథ చెప్పడం అవసరం అని నేర్చుకున్నది ఫ్రెంచ్ రచయిత గీ ది మొపాస కథలు అనువాదం చేస్తున్నప్పుడు. తాపీగా చెప్పడం అంటే పేజీలు పేజీలు రాయడం కాదు. చిన్న కథైనా నడక నెమ్మదిగా ఉండేలా చూసుకోవడం. అందులో ఎమోషన్ డోస్ ఎంత ఉండాలో అంతే వెయ్యడం. అప్పుడే అది పాఠకుల మనసులోకి కొంచెం కొంచెంగా ఎక్కుతుంది. ఎమోషన్ ఆర్గానిక్‌గా పెరుగుతుంది. చివర్లో ముగింపు దగ్గర పాఠకుడికి ఆ ఎమోషన్‌లో తడిసి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

మీకు మరో ఉదాహరణ చెప్తాను. తెలుగు కథకులలో ఫ్లాష్ ఫిక్షన్ లేదా సడన్ ఫిక్షన్ రాసిన రచయిత బి.పి. కరుణాకర్‌గారు. ఆయన ప్రత్యేకత – మూడు నాలుగు పేజీలలో ముగిసే చిన్న కథలు. “నీడలేని పందిరి” అని ఒక కథ ఉంది. నాలుగు పేజీల కథలో ఎండాకాలం వర్ణన, స్థల కాలాదుల వివరాలు, పాత్ర స్వభావ చిత్రణ మూడున్నర పేజీలు నడుస్తుంది. కథా నాయకుడు ఒక స్కూల్ టీచర్. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఒక కునుకు తీద్దాం అని పడుకున్న తరువాత ఎవరో తలుపు కొడతారు. కథ ఇక్కడ మొదలై, ఆ తరువాత అర పేజీలో ముగుస్తుంది. అంటే కథ అర పేజీనే అనుకోవచ్చా? లేదు. ఈ కథ చదివిన పాఠకులకి ముగింపులో ఒక రసస్పందన కలుగుతుంది. అది అర పేజీలో కథ చెప్తే రాదు. ఆ ఇంపాక్ట్‌కి కారణం అందుకు ముందు చదివిన మూడున్నర పేజీలు.

చాసో “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ కూడా ఉదాహరణగా చెప్తను మీకు. ఆ కథ చివర్లో వచ్చే “ప ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న వాక్యంలోనే కథంతా ఉంది. కానీ ఆ వాక్యం చదివితే వచ్చే భావోద్వేగానికి కారణం అందుకు ముందు నడిచిన ఐదు పేజీలలో ఉన్న వివరాలు. ఇలా ఒక వాక్యంలో దట్టించిన ఎమోషన్ దగ్గరికి తాపీగా తీసుకెళ్ళడం ఈ రచనలో తెలుస్తుంది. ఇలా తాపీగా కథ చెప్పే లక్షణాన్ని మనం ఎక్కడో మర్చిపోయాం.

మీకు నేను ఇచ్చిన మూడు ఉదాహరణలు మళ్లీ చూడండి. శ్రీపాద పెద్ద కథ, చాసో చిన్న కథ, బిపి కరుణాకర్ అతి చిన్న కథ. ఈ మూడూ చూస్తే మీకేం ఆర్థమౌతోంది? కథలో ఎమోషన్ పండించడానికి సరిపోయేంత నిడివి ఉండాలి. దానికేమీ కొలమానం లేదు. కొలత లేదు. రచయిత చెయ్యి తిరిగితే కథ నిడివితో సంబంధం లేకుండానే కథని ప్రదర్శించవచ్చు.

ఇంతకీ చెప్పొచ్చిందేమిటంటే – ఒక భావోద్వేగాన్ని వాచ్యంగా చెప్పి పాఠకుడి మనస్సులోకి దాన్ని బలవంతంగా చొప్పించడం చాలా సులభమైన మార్గం. కొత్తగా రాస్తున్న రచయితలకు, రాతపనిలో అనుభవం మాత్రమే తప్ప జ్ఞానం సమకూరని రచయితలకు ఇది చాలా సౌకర్యవంతంగానే అనిపించచ్చు. కానీ అది పాఠకులలో రచన ద్వారా సాధించాలనుకున్న భావోద్వేగాన్ని కలిగించడంలో విఫలమౌతుంది. కొండొకచో పాఠకుల నిరసనని పొందే అవకాశం ఉంది. ఈ సమస్యని అధిగమించాలంటే ఏం చెయ్యాలి?

మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దాన్ని కథారచనకి అన్వయించి అర్థం చేసుకోండి. మళ్లీ కలిసినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం.

ఒక మెజీషియన్‌కి స్టేజ్ మీదకి ఎక్కక ముందే తన టోపీలో ఒక కుందేలు ఉందని తెలుసు. కానీ మేజిక్ మొదలుపెట్టినప్పుడు ఇంకేదో చేస్తాడు. వేరే ట్రిక్స్ చేస్తాడు. కబుర్లు చెప్తాడు. టోపీ తీసి, అది ఖాళీగా ఉన్నట్లు చూపించి, టేబుల్ మీద పెట్టి దాని మీద ఎర్రటి మఖ్‌మల్ గుడ్డ కప్పుతాడు. మంత్రదండం దాని చుట్టూ తిప్పుతాడు. గాల్లో నుంచి ఏదో తీసి అందులో వేసినట్లు నటిస్తాడు. ఆ తరువాత గుడ్డ తీసి టోపీలో చెయ్యిపెట్టి, ఏమి దొరకనట్లు నటించి నవ్విస్తాడు. చప్పట్లు కొడితేగానీ మేజిక్ సాధ్యం కాదని చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టించి ఆ చప్పట్ల మధ్యలో కుందేలుని బయటికి తీస్తాడు. ఆ క్షణం అతను చెప్పకపోయినా చప్పట్ల జోరు పెరుగుతుంది. ఈ మేజిక్ నడిచినంతసేపు (నిజానికి షో మొదలైనప్పటి నుంచి) కుందేలు ఆ మెజీషియన్ టోపీలోనే ఉంది. బహుశా అది వేరే మేజిక్ చేసినప్పుడు కదిలి, నేను ఉన్నాను అని అతనికి గుర్తు చేసి కూడా ఉండచ్చు. కానీ అతను హడావిడిపడడు. కంగారుపడడు. ప్రేక్షకుల ఊహని, ఏదో జరగబోతోందన్న ఉత్సుకతని ఒక గ్రాఫ్‌లాగా పైకి తీసుకెళ్ళి సరిగ్గా ఆ ఎమోషన్ శిఖరం పైన ఉన్నప్పుడు ఠక్కున కుందేలుని తీసి ఆశ్చర్యపరుస్తాడు.

అలా కాకుండా ఏ డ్రామా చెయ్యకుండా, స్టేజ్ మీదకి వస్తూనే “ఇదిగో చూడండి నా దగ్గర ఒక ఖాళీ టోపీ ఉంది” అని చూపించి, “ఇప్పుడు ఇందులో నుంచి కుందేలు తీస్తాను చూడండి” అని ప్రకటించి మరీ కుందేలుని బయటకి తీస్తే మీరు చప్పట్లు కొడతారా?

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు