చదువు జ్ఞాపక శక్తితో ముడిపడి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేరు. మరి చదివింది గుర్తుపెట్టుకోవటం అనేది ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో కష్టం అవుతోంది. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా నిరంతరం చదువుకోవాల్సిన పరిస్థితిలోనే వున్నాం.
కాని అందరూ చెప్పేది ఒకటే చదివింది గుర్తు ఉండదు అని. ఎందుకంటే మన మెదడు ఎంత త్వరగా మర్చిపోతుందో తెలుసా? ఒక రోజులోనే దాదాపు 70% సమాచారం మాయమయిపోతుంది! దీన్ని “ఫర్గెట్టింగ్ కర్వ్” అని అంటారు. ఇక్కడ రాసిన టెక్నిక్స్ ని గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నించటంలోనే మన జ్ఞాపక శక్తిని పెంచుకునే దిశగా మనం అడుగులు వేయవచ్చు.
అందరికి తెలిసిన విషయమే, జపాన్ వారికి గొప్ప లర్నింగ్ టెక్నిక్స్ ఉన్నాయని. జపాన్లో విద్యార్థులు ఈ సమస్యను ఎలా అధిగమిస్తున్నారో చూద్దాం.
మనం సాధారణంగా ఏం చేస్తాం? పుస్తకాలు చదువుతాం, ముఖ్యమైన లైన్లు హైలైట్ చేస్తాం, మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటాం. కానీ ఇవి పెద్దగా పనికిరావు. నిజానికి అసలు పద్ధతులు వేరే ఉన్నాయి.
1) “యాక్టివ్ రీకాల్” అంటే, చదివిన తర్వాత పుస్తకం మూసేసి, ఏం నేర్చుకున్నామో గుర్తు తెచ్చుకోవాలి. మెదడుని కష్టపెట్టాలి. అప్పుడే ఆ సమాచారం గట్టిగా మెదడులో పాతుకుపోతుంది.
2) ఇంకో మంచి టెక్నిక్ “స్పేస్డ్ రిపిటీషన్”. దీన్లో ఒకసారి చదివిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ రివ్యూ చేయాలి. ఈ గ్యాప్ క్రమంగా పెరుగుతూ పోతుంది. అంటే మర్చిపోయేలోగా మళ్లీ గుర్తు చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల టెన్షన్ లేకుండా సులభంగా గుర్తుంటుంది. జపాన్లో వాడే “కుమాన్ మెథడ్” అంటే ఇదే.
3) కైజెన్ పద్దతి. జపనీయులు ఒకేసారి చాలా చదవకుండా, రోజూ కొంచెం కొంచెంగా చదువుతారు. దీన్ని “కైజెన్” అంటారు – రోజూ 1% మెరుగుపడితే, సంవత్సరం చివరికి 37 రెట్లు మెరుగుపడతాం! అవును, కొంచెం కొంచెంగా చేసిన మార్పులే పెద్ద తేడా తెస్తాయి.
4) ఏదైనా పూజ చేస్తున్నపుడూ ఎన్ని ఆచరిస్తామో, ఎంత సరంజామ, సెట్టింగు వేస్తామో, కాని చదువు విషయంలో ఏమి పట్టించుకోము. జపనీయులు చదువును కూడా ఒక పూజ లాగా పవిత్రంగాను, ఆహ్లాదంగాను చేయాలి అంటారు. పరధ్యానానికి తావు లేని ప్రశాంతమైన చోట, పూర్తి దృష్టితో చదవాలి. అప్పుడే మెదడుకి సరిగ్గా సమాచారం చేరుతుంది. ఇది చదువుకే కాదు, స్పోర్ట్స్ నేర్చుకోవాలంటే, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే కూడా ఇలాగే చేయాలి. చదువుకోవటానికి అనువైన ఒక వాతావరణం, సెట్టింగ్ ఏర్పరచుకోవాలి. అక్కడ చదువు తప్ప ఇంకేమి గుర్తు రాకూడదు.
5) వివిధ విధానాలు. కేవలం చూస్తూ, వింటూ చదువుకోవటం కాదు. యాక్టివ్గా పాలుపంచుకోవాలి. గేమ్ ఆడడంలాగా, స్పోర్ట్స్ ఆడడంలాగా చదువులోనూ యాక్టివ్గా ఉండాలి. అప్పుడే నిజమైన నేర్పు వస్తుంది.
చివరగా ఒక మాట – ఈ టెక్నిక్స్ని ఇప్పుడే అలవాటు చేసుకోండి. ఎంత త్వరగా మొదలుపెట్టారో, అంత త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. పాత పద్ధతుల్ని వదిలేసి, ఈ సైంటిఫిక్ పద్ధతులు అనుసరిస్తే మీ చదువు విధానం పూర్తిగా మారిపోతుంది.
అది కేవలం చదువుకే కాదు, జీవితంలో ఎటువంటి విషయం నేర్చుకోవాలన్నా ఈ పద్ధతులు పనికొస్తాయి!
*
Add comment