ఖర్చు

చాలా కుటుంబాల్లో ఆర్థిక విషయాల్లో ఆడ, మగ అనే తేడా ఉంటుంది. ఆడపిల్లకు ఖర్చు పెట్టడానికి వందసార్లు ఆలోచించే తల్లిదండ్రులు మగపిల్లవాడికి ఖర్చు పెట్టాలంటే మాత్రం ఏమాత్రం ఆలోచించరు. అది బహిరంగంగా చూపించే వివక్ష.

‘అయ్యో..అది ఇంత రేటుంది. నాకొద్దు’ అంది మిథు.

‘నీకు నచ్చిందా?’ అడిగాడతను. 

‘అవును..కానీ..’ అంటూ సణిగింది.

‘నీకు ఏది నచ్చితే అదే తీస్కో. డబ్బు గురించి ఆలోచించకు’ అన్నాడు. 

ఒక్క క్షణం కళ్లలో నుంచి నీళ్లు వచ్చేశాయి తనకి. ఎన్ని సంవత్సరాలయ్యింది ఆ మాట విని. అసలు ఎప్పుడూ విన్నట్లు కూడా లేదు. అలాంటి ఒక్క సందర్భం కూడా గుర్తులేదు. 

‘ఏమైంది?’ అడిగాడు అయోమయంగా.

‘ఏం లేదు. ఇది నచ్చింది’ చెప్పింది. 

‘సరే! ఇదే ప్యాక్ చేయండి’ అన్నాడు షాప్‌వాడితో.

అతణ్నే చూస్తూ ఉంది. తనలో ఎన్నో ఆలోచనలు. ఎన్నో సంఘటనలు అలా ఒక్కసారిగా కళ్ల ముందు తిరిగాయి. ‘ఇంత ఖరీదైన డ్రెస్సా..వద్దు, మనకు స్థోమత లేదు. స్కూల్ ట్రిప్పా..వద్దు, ఎక్కువ ఖర్చవుతుంది. డబ్బులు లేవు. ఏంటి ఆ బుక్స్‌కి వెయ్యి రూపాయలా? ఎగ్జామ్ ఫీజ్ పదిహేను వందలా? ఏంటీ..ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారా? తలా ఐదొందలు వేసుకోవాలా? అన్ని పైసలా? ఏం అవసరం లేదు. వాళ్లనే ఇంటికి రమ్మను. ఇక్కడే తింటారు. అసలే డబ్బులకు కష్టం అవుతోంది. ఏంటి ల్యాప్‌టాప్ కావాలా? ల్యాప్‌టాప్ అంటే మాటలా? నలభై, యాభై వేలవుతుంది. అంత స్థోమత మనకి లేదు. ఏంటీ? ఆ కోర్స్ నేర్చుకుంటావా? అవసరం లేదు. మూడు వేలేనా? అవి తక్కువ డబ్బులనుకుంటున్నావా? తర్వాత చూద్దాంలే! పెళ్లి చుట్టాలదైతే నీకు కొత్త డ్రెస్ ఎందుకు? కజిన్ పెళ్లి అయితే మాత్రం? ఉన్నదేదో వేసుకో. అసలే ఆ పెళ్లిలో గిఫ్ట్ ఏం ఇవ్వాలోనని నేను ఆలోచిస్తుంటే కొత్త డ్రెస్ కావాలంటే ఎలా? డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? హోటల్లో తినాలని ఉందా? నలుగురు హోటల్లో తింటే ఎంత బిల్ అవుతుందో తెలుసా…’ 

ఇలా ఎన్నెన్నో మాటలు వింటూ, అవమానాలు పడుతూ వచ్చిన తనకి ‘డబ్బు గురించి ఆలోచించకు’ అన్న మాట చెవిలో పడగానే దు:ఖం తన్నుకువచ్చింది. ఇవన్నీ అతనికి అర్థం అవుతాయో, లేదో తెలీదు. చెప్పాలని కూడా లేదు. ఆ ఆలోచనల్లో తన చెయ్యి పట్టుకొని కొన్న కొత్త వస్తువులు పట్టుకొని, హోటల్‌ వైపు నడిచింది.

*

మైక్రో కథలు చెప్పాలి

* హాయ్ గ్రేస్! మీ గురించి చెప్పండి. 

హాయ్. మాది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం. నేను పుట్టింది, పెరిగింది అక్కడే. ఎం.కాం పూర్తి చేసి, ప్రస్తుతం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తున్నాను.

* చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉందా?

చిన్నప్పటినుంచీ అంటే..9, 10 కాస్లులు చదివేటప్పుడు ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ తీసుకుని చదివేదాన్ని. టీనేజ్‌లో ప్రతి ఒక్కరికీ ఒక రీడింగ్ ఫేజ్ ఉంటుది. ఆ ఫేజ్‌లో ఫిక్షన్ ఎక్కువగా చదువుతారు. అలా నేను ఆ టైంలో చేతన భగత్ ఇంగ్లీష్ నవలలు ఎక్కువగా చదివాను. ఆ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు తెలుగు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఎక్కువగా యండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదివాను. ‘మంచుపర్వతం’ నవల నాకు చాలా నచ్చింది. వికాస్ స్వరూప్ రాసిన ‘The Six Suspects’ నవల తెలుగు అనువాదం ‘ఆరుగురు అనుమానితులు’ కూడా అదే టైంలో చదివాను. అది కూడా నచ్చింది. ఆ తర్వాత ‘అన్నా ఫ్రాంక్ డైరీ’ చదివి, తనతో చాలా కనెక్ట్ అయ్యాను. చాలామందికి ఆ పుస్తకం బహుమతిగా ఇచ్చాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

పెద్దయ్యాక ఫలానాది అవ్వాలని చిన్నప్పుడు మనందరికీ ఉంటుంది. అలా నాకు పెద్దయ్యాక రచయిత కావాలని ఉండేది. I have many Stories to tell. 25-30 ఏళ్లు వచ్చాక ఏదైనా రాయాలని అనుకున్నాను. ఫేస్‌బుక్‌లో కొందరు కథలు రాయడం చూసి, నాకూ అలా రాయాలని అనిపించింది. ముఖ్యంగా ‘మైక్రో కథలు’ చదివి నాకూ అలా చిన్నగా కథలు రాయాలన్న ఆలోచన వచ్చింది. వాటి నుంచి స్ఫూర్తి పొంది కొన్ని కథలు రాశాను. అలా మొదట ప్రచురితమైన కథ ‘ఖర్చు’.

* ‘ఖర్చు’ కథ నేపథ్యం ఏమిటి?

చాలా కుటుంబాల్లో ఆర్థిక విషయాల్లో ఆడ, మగ అనే తేడా ఉంటుంది. ఆడపిల్లకు ఖర్చు పెట్టడానికి వందసార్లు ఆలోచించే తల్లిదండ్రులు మగపిల్లవాడికి ఖర్చు పెట్టాలంటే మాత్రం ఏమాత్రం ఆలోచించరు. అది బహిరంగంగా చూపించే వివక్ష. నేను కూడా అలాంటి అనుభవాలను ఫేస్ చేశాను. అలా నా మనసులో ఉన్న కథ రాయాలని అనిపించింది. ఇది రాస్తూ ఉంటే నాకు చాలా బాధేసింది. సంపాదించే ఆడవాళ్లు చాలా స్వేచ్ఛగా ఉంటారని చాలామంది అనుకుంటారు. అయితే ‘వర్కింగ్ విమెన్’ వేరు, ‘ఆర్థిక స్వాతంత్రం  ఉండటం’ వేరు. పని చేసే ఆడవాళ్లందరికీ ఆర్థిక స్వాతంత్రం  ఉండదు. ఆ ఆలోచనలన్నీ కలిసి ఈ కథ తయారైంది.

* ఆడవాళ్లు కథలు రాస్తే జడ్జ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కథలోని పాత్రలతో, సన్నివేశాలతో వాళ్లని పోల్చి చూస్తుంటారు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి?

మనల్ని జడ్జ్ చేసి మన గురించి మాట్లాడుకునేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఇవాళ మన గురించి మాట్లాడితే, రేపు మరొకరి గురించి మాట్లాడతారు. వాళ్ల గురించి పట్టించుకోవడం వృథా. ఎవరైనా వచ్చి నేను రాసిన కథల్లోని పాత్రలు నేనేనా అని అడిగితే ‘సినిమాని సినిమాలాగా చూడాలి. కథను కథలాగా చదవాలి’ అని చెప్పేసి ఊరుకుంటాను.

* ముందు ముందు ఇంకా ఏమేం రాయాలని ఉంది?

25-30 చిన్నకథలు రాసి పుస్తకం తేవాలని ఉంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇంగ్లీషు నవల రాయాలని ఉంది. మహిళల అంశాలు మాత్రమే కాదు, నేను చెప్పాలనుకున్న ప్రేమకథలు కూడా ఉన్నాయి. వాటిని నవలల రూపంలో తీసుకొస్తాను.

*

సి.పి. గ్రేస్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • How beautifully written….!!!!
    I’m a proud friend…
    Congratulations for the first one and all the best for the many coming up…
    Ichipadey!!!!! ❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు