కొంగున కట్టిన కాసు

వంట ఇంటిలో పని చేసుకుంటున్న రేణుక వంట చేస్తూ.. చేస్తూ గ్యాస్‌ పొయ్యి వెనకాల వున్న కిటికీలోంచి బయటకి చూసింది. రేణుక వాళ్ళ ఇల్లు కొత్తగా కట్టింది, ఎత్తుగా ఉంటుంది. పక్కింటి ఇల్లు పాతది అందుకని రేణుక కిటికీలో నుండి చూస్తే పల్లంలో వున్న ఆ ఇల్లు బాగా కనిపిస్తుంది. పక్కింటి శాంతవ్వ మూడు నాలుగు రోజుల నుండి కనిపించడం లేదు. నిన్న సాయంత్రం, మొన్న సాయంత్రం వరుసగా గంప కింద కప్పెట్టి ఉండాల్సిన కోళ్లు  గోడంచుగా వున్న జామ చెట్టు మీద  తలా  ఒక కొమ్మ పై  ముడుచుకుని పడుకుని ఉండటం చూసింది రేణుక.

అంతే కాదు దొడ్డి గుమ్మం దగ్గర, వరండాలో పగలు కూడా లైట్లు వెలుగుతూ కనిపించాయి. శాంతవ్వ బాగా పొదుపరి. అలా లైట్లు వేసి వదిలేసే మనిషి కాదు. కోళ్లను అలా గాలికి వదిలేసే మనిషి అసలే కాదు. అందులోను పెద్ద యెర్ర కోడి పుంజు అంటే శాంతవ్వకి మహాఇష్టం. దాన్ని బిడ్డలాగా సాకుతుంది. కాలనీ లో
అటూ ఇటూ  తిరిగే పని ఏదయినా ఉంటే దాన్ని బిడ్డని ఎత్తుకున్నట్లే ఎత్తుకుని వెళుతుంది. శాంతవ్వకి ఇంతకు మునుపు ఒక కుక్క ఉండేది. దాని పేరు టామీ.  అది ఆవిడ ఎటు వెళితే అటు  వెంబడించేది. అది కాలం చేసిన రోజు పుట్టిన ఈ కోడి పుంజుకు శాంతవ్వ టామీ అని పేరు పెట్టుకుంది. అసలు టామి చనిపోయి ఈ కోడి పుంజుగా యెట్లా పుట్టిందో ఆ విధానమంతా ఆవిడ కథలు కథలుగా ఆ పల్లెలోని వాళ్ళకి చెప్తూ ఉంటుంది.  ఆ కోడి పుంజు చరిత్ర తెలీని వాళ్ళు ఆ పల్లెలో లేరనే చెప్పచ్చు. ఆ కోడి పుంజు  ఎక్కడున్నా శాంతవ్వ ‘టామీ’ అని పిలుస్తే కుక్క పరిగెత్తుకుని వచ్చినట్లు పరిగెత్తుకుని వచ్చి కొక్కొకొక్కొమని గునుస్తూ, యెగిరి, చాపి పెట్టి వున్న  శాంతవ్వ  చేతి మీద మృదువుగా  వాలుతుంది. ఆ తరువాత ఇద్దరూ షికారుకు బయలుదేరుతారు. అది వాళ్ళిద్దరికీ దిన చర్య. అలాటి టామీని గంప కింద  కప్పెట్టకుండా పిల్లులకు
కుక్కలకు ఎంత మాత్రం వదలదు శాంతవ్వ. ఆ విషయం రేణుకకు బాగా తెలుసు.

శాంతవ్వ ఇంట్లో ఒక్కటే ఉంటుంది. ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో అంటే శాంతవ్వకి పద్దెనిమిది, పందొమ్మిది ఏళ్ళ వయసు వున్నప్పటి నుండి ఆమె ఒక్కటే ఉంటుంది. శాంతవ్వ అమ్మ నాన్నలకు ఇద్దరే సంతానం. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు మల్లేశం పుట్టిన పదిహేనేళ్లకు పుట్టింది శాంత  ఎవరనుకున్నారసలు అన్నేళ్ల తరవాత పచ్చటి రంగుతో, చారడేసి కళ్ళతో, నవ్వు ముఖంతో ఒక బిడ్డ పుడుతుందని. అలా ఆలస్యంగా పుట్టిన శాంతను  కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు శాంత తల్లిదండ్రులు. శాంత అన్న మల్లేశం  శాంతని బడిలో వేసే సమయానికి చదువుకోవటానికి టౌన్‌లో ఎస్ సి  హాస్టల్‌ కి
వెళ్ళిపోయాడు. మల్లేశం చాలా బాగా చదివేవాడు. బడికెళ్లిన శాంతను ‘మల్లేశం చెల్లి’ అని పిలిచేవాళ్ళు అందరూ. శాంత కూడా అన్న లాగే ఏకసంతాగ్రాహి. బడిలో టీచర్లు ప్రతి పనికీ శాంతను ముందుకు నెట్టేవారు. అలా శాంత ఏడవ తరగతి వరకు చదివింది.

ఏపుగా పెరుగుతున్న బిడ్డని చూసి శాంత తండ్రికి ఏమనిపించిందో గానీ ఆమెను నాలుగూళ్ళ  అవతల వున్న వూర్లో ఒక ఇంటికి  కోడలిగా పంపేశాడు. శాంతది తండ్రికి ఎదురు చెప్పే వయసు కాదు. చక్కగా తలొంచుకుని పెళ్లి చేసేసుకుంది. ఆమె భర్త రోజుకి నాలుగు సార్లన్నా ఆమె రంగుని చూసి మురిసేవాడు. ఆమె బుగ్గ గిల్లి ఆ బుగ్గ కందితేనో, చేతిని పట్టుకుంటే ఆ చేయి కమిలితేనో, శాంత కాస్త ముఖం గట్టిగ తుడుచుకున్నపుడు ఆమె ముఖం ఎర్రబడితేనో  చూసి అబ్బుర పడేవాడు. శాంత భర్త వయసు కూడా పెద్ద ఎక్కువ కాదు పట్టుమని పదిహేడేళ్ళు.

ఇద్దరూ  జతగా కూర్చుంటే అయినింటి వాళ్లెవరో బొమ్మల పెళ్లి కోసం పెద్ద పెద్ద బొమ్మల్ని జతచేసినట్లు ఉండేవారు. అంత ముద్దుగా చూసుకునే శాంత భర్త, పెళ్లయిన నాలుగు నెలలకి, ఒక రోజు  పొలం పనికి వెళ్లి పాము కరిచి, పాము మంత్రం సగంలో ఉండగానే కళ్ళ నుండి ముక్కు నుండి.. ఏ దారి ఉంటే ఆ దారి
నుండి రక్తం ధారలుగా స్రవించి   పిడుగు పడితే కాలి పోయిన పచ్చటి తాటి చెట్టులా శాంత కళ్ళ ముందే చనిపోయాడు.

భర్త చనిపోయిన తరువాత పుట్టింటికి వచ్చిన శాంత మరిక పెళ్లి చేసుకోలేదు. శాంత కులంలో మారు  మనువులు సాధారణమే అయినా  శాంత పెళ్లి చేసుకోనంటే చేసుకోనని మంకు పట్టుపట్టింది. అటు  శాంత అన్న టీచరు వుద్యోగం సంపాదించి, తోటి టీచర్‌నే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక  ఉద్యోగ రీత్యానో
మరెందు చేతనో ఇంటికి ముఖం చూడటం  చాలా తగ్గించాడు. మరికొంత కాలానికి శాంత తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు కాలం చేశారు. అలా శాంత ఒంటిదై  పోయింది.

అప్పుడు, అంత వరకు తండ్రి చక్కబెడుతున్న వ్యవసాయాన్ని చేపట్టింది శాంత. తన భాగము, అన్న భాగము కలిపి వ్యవసాయం చేసి అన్నకి రావలసిన భాగం అన్నకు నిఖార్సుగా పంపేది. తండ్రి లేకుంటే తన పొలాన్ని అక్కరగా చేసే వాళ్లెవరు అని అనుకుంటున్న మల్లేశానికి శాంత మొదటి సారి చెల్లిగా కాదు తమ్ముడిగా అనిపించేది.  అప్పటి నుండి జోడెద్దు బదులుగా కాడి భుజాన వేసుకున్న శాంతను అన్న మల్లేశం మాత్రమే కాదు వూర్లో వాళ్ళు కూడా ఆడపిల్లగా చూడటం మానేశారు.

రేణుక అన్నం కూరలు వండడం పూర్తయ్యాక మళ్ళీ శాంతవ్వ ఇంటి వంక చూసింది. అప్పటికి బాగా పొద్దెక్కింది. వరండాలో ముడుచుకుని పడుకుని వుంది టామీ.

ఎండకి పడుకున్నదో  శాంతవ్వ కనిపించలేదని దిగులుతో పడుకుందో అర్థం కాలేదు రేణుకకు. కానీ హఠాత్తుగా ఆమెకు ఒక విషయం బోధపడిరది. శాంతవ్వ ఇంటి వైపు నుండి ఏదో కుళ్ళిన వాసన వస్తుంది. కొంచెం గాలి వీచినప్పుడు ఆ వాసన మరీ కొట్టుకుని వస్తుంది. శాంతవ్వ జాడ లేదు, ఆమె ఇంటి వెనుక ముందు అంతా మొక్కలే, గుండు సూది పడేంత చోటు వున్నా అక్కడ ఏదో ఒక మొక్క నాటుతుంది
శాంతవ్వ. వంగ, బెండ, ఆకు కూరలు …  ఒక వైపు కోళ్లు గెలికేస్తున్న ఇంకోవైపు ఓపికగా వేస్తూ పోతుంది. ఏ రోజూ కూరగాయలు కొనదు. అందుకే రేణుక గుబురుగా పెరిగిన ఆ మొక్కల్లో దాక్కున్న ఏ పామో, కోడిని కాటేసి ఉంటుందని లేదా ఏ ఎలుకో చచ్చి పడి  ఉంటుందని భావించి ఆ విషయాన్నీ మొగుడికి
చెప్పింది.

రేణుక మొగుడు ప్రభాకర్‌ మెతక మనిషి. తన పనేందో తాను చూసుకునే రకం. అటు శాంతవ్వేమో ఊరందరి పనులు చక్క పెట్టే రకం. పల్లెలో ఒక రోజు ఒక పిల్ల సమర్తాడిరది. పెద్ద వాళ్ళు అందరూ కలిసి మూలన కూర్చో పెట్టారు. టామీని తీసుకుని వెళ్లిన శాంతవ్వ వాళ్ళు చేయాలనుకుంటున్న ‘ఓణీల ఫంక్షను’ గురించి
విని అక్కడికక్కడే వాళ్ళని జాడిరచి వదిలింది. ఓణీల ఫంక్షనుకు ఖర్చు పెట్టె డబ్బుతో పిల్లకి సైకిల్ కొనిస్తే సుబ్బరంగా పిల్ల స్కూల్ కి కష్టం లేకుండా వెళుతుందని చెప్పింది. మూల కూర్చుని శాంతవ్వ మాటలు వింటున్న పిల్ల దిగ్గున అక్కడ నుండి లేసి, ‘‘నాకు సైకిల్‌ కావాలి, ఓణీల ఫంక్షను వద్దు’’ అని మొరాయించడం మొదలు పెట్టింది. ఇదే కాదు శాంతవ్వ ఇలాటివెన్నో చేసేది. ఎవరి రేషను కార్డు ఆగిన, ఏ రైతో బ్యాంకు లోన్‌ తీసుకోవాలన్న , వాళ్ళు శాంతవ్వ వరండాలో ప్రత్యక్షమయ్యే వాళ్ళు. పల్లెలో ఎవరైనా తగాదా పడి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తే అక్కడ కూడా ఆమె ఉండాల్సిందే.

అధికారులతో ఆమె మృదువుగా మాట్లాడేది, వాళ్ళు కూడా ఆమెను చూడగానే మర్యాదగా మాట్లాడేవారు. ఒకవేళ వాళ్లు మాట వినకుండా కసురుకుంటే శాంతవ్వ  గొంతు పైకి లేసేది ‘‘ఏంది  సారు ! మీ తాత అవ్వది పెడ్తన్నావా, మాదిగ దండోరాని పిలవాలన’’నేది. అందుకని మండలాఫీసుల్లో, పోలీస్‌ స్టేషన్లలో శాంతమ్మ
అంటే పేరు. ఊర్లో కుర్రకారు శాంతవ్వకి తోడుగా వుండేవారు ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి గుంపు కట్టి వెళ్లే వాళ్లు. ఇదిగో ఈ ప్రభాకర్‌ మాత్రం ఇల్లు కదిలేవాడు కాదు. అందుకే అందరిలో పట్టుకుని ఒక రోజు ‘‘మన్నుదిన్న పాము’’ అనేసింది. ఏదో ఒకరోజు అంటే సరే అనుకునేవాడే. అలా కాదు, ఎక్కడ కనిపించినా ‘‘ఏంరా పూడు పాము, అంత బాగేనా?’’ అనేది. అలా కొన్ని సార్లు పిలిపించుకున్నాక  ప్రభాకర్‌ ఆవిడని తప్పించుకుని తిరిగేవాడు. అప్పటి నుండి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య మాటలు లేవు. అందుకే దుర్గంధం గురించి రేణుక ఫిర్యాదు విన్నా విననట్టు ఊరుకున్నాడు ప్రభాకర్‌. కానీ రేణుక అలా ఊరుకోలేదు రానురాను వాసన ఎక్కువవుతుంది ఏదో ఒకటి చెయ్యమని మొగుడిని విసిగించడం మొదలు పెట్టింది. రేణుక నసకు చిరాకుపడి చివరకు ప్రభాకర్‌ కూడా వంటింటి కిటికీ దగ్గరకి వచ్చి ముక్కు ఎగబీల్చాడు. దుర్గంధం ముక్కుని బద్దలు చేసింది. శాంతవ్వ మూడు రోజులుగా కనిపించలేదని భార్య చెప్పింది. ఏం
కుళ్ళి పోయిందో ఆ వాసన భరించాల్సింది. తామే కదా అనుకుని పల్లెలో యూత్‌ లీడర్‌ ని అని చెప్పుకుంటూ  తిరిగే డేవిడ్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు.

డేవిడ్‌ పుట్టినపుడు వాడికి ఆ పేరు శాంతవ్వనే పెట్టింది. శాంతవ్వ సైన్యంలో మొదటి మెంబరు వాడు. వాడు, ఆమె ఒకే చర్చికి వెళతారు  కూడా. అందుకే శాంతవ్వ ఇంట్లో దుర్గంధం విషయం వినగానే డేవిడ్‌ క్షణంలో
వచ్చేసాడు. శాంతమ్మ ఇంటి గేటు తీసుకుని లోపలి వెళ్లి చూస్తే ఇంటి తలుపు లోపలి నుండి వేసి వుంది. ప్రభాకర్‌, డేవిడ్‌ ముఖ ముఖాలు చూసుకున్నారు. ప్రభాకర్‌ కొంచెం వెనక్కి తగ్గి ‘‘ఒరేయ్‌ డేవిడ్‌ ! నువ్వెళ్ళి చర్చ్‌ పాస్టర్ని ఇంకా వాళ్ళని వీళ్ళనీ పిలుచుకు రారా’’ అన్నాడు.

పల్లెకి  చిందు మాదిగలు వస్తే శాంతవ్వదే  ఆతిథ్యం. వాళ్లకి ముప్పూటలా తిండి, ఖర్చులూ మొత్తం శాంతమ్మే చూసుకునేది. మామూలుగా ఎంగిలి మెతుకులతో చెయ్యి విసరాడానికి కూడా ఇష్టపడని శాంతమ్మ చిందు మాదిగల విషయంలో మాత్రం అత్యుత్సాహంతో ఖర్చు చేసేది. వాళ్ళు మాయా సుభద్ర, కంస మర్దనం, భీష్మ విజయం ఎన్ని ఆడినా శాంతమ్మ ప్రియమైన కథ  జాంబ పురాణమే. ‘‘భూపాలము నాడు
వేదం స్వామి భూమి కారునెల్ల పెద్ద’’ అని అందరికంటే ఈ భూమిపై పుట్టింది జాంబవంతుడేనని  గాయకుడు చెప్తే విని శాంతమ్మ గర్వంతో ఉబ్బిపోయేది. జాంబ పురాణంలో బ్రాహ్మణుడికి, జాంబవంతుడు అనే చిందు గాయకుడికి మధ్య జరిగే సంభాషణలో కొన్ని కొన్ని పద్యాలంటే శాంతవ్వకి మహా ఇష్టం. ముఖ్యంగా
బ్రాహ్మణుఁడు ‘‘యే  ముండాకొడక ! మీరంతా లంజలకు, ముండలకుపుట్టిన్రు’’ అంటే కధకుడు చిందు మాదిగ  ‘’లంజలకు ముండలు పుడితిరిగా / మమ్ములను మాదిగ లంజల్ని నిందింపుచుంటిరిగా /పుంజులకు కప్పలకు, రజక జంబుకంబులకు శునకములకు / పొందుగను  కరములకు పుడితిరి / ఎక్కువని మది పలుకఁబోకుమురా ఓరి ఎదవా పూర్వం/ఎక్కువెవరో తెలియ పలుకుమురా’’ అని పాడినప్పుడు శాంతవ్వ చప్పట్ల మోత మోగించేది. చుట్టు పక్కల వాళ్లకి అర్థం కాదేమోనని పెద్దగా ‘‘బ్రాహ్మలు… అట్లా పుట్టారు, కప్పలకి కుక్కలకి బ్రాహ్మలు’’ అని అరిచేది.

శాంతమ్మ జీవితంలో సగ భాగం హిందువుగానే బ్రతికింది. ఆమె క్రిస్టియన్‌ ఎందుకయ్యిందో ఎవ్వరికీ తెలీదు. ఆవిడ నిష్టగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది. అంతే నిష్టగా ఇంట్లో బైబిల్‌ చదివేది. టామీ తో అనుబంధం
ఏర్పడ్డాక మాంసం ముట్టడం మానేసింది కానీ ఆదివారం మాంసం కూర లేకున్నా కూరగాయల బిరియానీ నో మరోటో వండుకు తినేది. పాస్టర్‌, చర్చి పిల్లలు, డేవిడ్‌, ప్రభాకర్‌ అందరూ కలిసి తలుపు బద్దలు కొట్టేరు. ముందు గది  అంతా శుభ్రంగా ఎక్కడికక్కడ పొందిగ్గా వుంది. తలుపు తెరవగానే కోడి పుంజు టామీ
అంతవరకు పెట్టుకున్న బెంగతో శాంతమ్మను ఎందుకలా చేసావని అడగటానికి అందరికంటే ముందు మనుషుల కాళ్ళ మధ్య  సందు చేసుకుని శాంతమ్మ పడక గదిలోకి దూరింది. గదిలోకి దూరిన వాళ్లకి ముక్కు బద్దలయ్యేట్టు వచ్చిన వాసన దానికి వచ్చిందో లేదో మరి. యెగిరి మంచమెక్కిన దానికి, ఇంట్లోకి వచ్చిన వాళ్లకి మంచంపై కుళ్ళి పోయి లుక లుక మని పురుగులు పట్టిన శాంతమ్మ శవం కనిపించింది. అందరూ విస్తుపోయారు.

ముక్కులు మూసుకుని గబగబా ఇంటి బయటకి వచ్చి నిలబడ్డారు. కోడి టామీ మాత్రం శవం పక్కన ఏం చేయాలో తోచనట్టు  కొక్కొరొ… కోక్కరోమని గునుస్తూ ముడుక్కుని కూర్చుండి  పోయింది. శాంతమ్మ చావు పల్లెలో గుప్పుమన్నది.

దిక్కు మొక్కు లేని శాంతమ్మ ఒంటరిగా ఏదో ఒక రోజు అలాంటి చావు చావాల్సిందేనని అందరికీ తెలుసు. కానీ హఠాత్తుగా ఇలా జరిగే సరికి అందరూ కలవర పడ్డారు. కలవర పడ్డ అందరిలో సగం మంది, “ఎలాంటి చావు వచ్చింది. పిల్లికి కూడా బిచ్చం పెట్టేది కాదు, పై పెచ్చు డబ్బు ఎలా దాచుకోవాలో సలహాలు ఇచ్చేది. ఇలాటి వాళ్లకి  ఇంకెలాటి చావు వస్తుంది’’ అనుకున్నారు.

శాంతమ్మ శవాన్ని చూడగానే పాస్టరు పక్క ఊరిలోనే వున్న శాంతమ్మ అన్న పిల్లలకి కబురు చేశాడు.  పోలీసులు వచ్చారు, శాంతమ్మకి శత్రువులెవరూ లేరు కాబట్టి సహజంగానే ఏ గుండె పోటుతోనో నిద్రలోనే పోయి వుండొచ్చనీ.. తలకొక మాటా మాటా అనుకున్నారు. శాంతమ్మ అన్న పిల్లలు రానే వచ్చారు. లోపలికి
వెళ్లారు. దుర్గంధమే కాదు  శాంతమ్మ వళ్లంతా పురుగులు, “పురుగులు పడి చావడమంటే‘‘ ఏమిటో అక్కడ అందరూ కళ్ళతో చూసారు. పరుపుతో సహా శాంతమ్మ కుళ్ళిన శవాన్ని లేపి పట్టుకొబోయారు. లేపిన పరుపునుండి జల జలా రాలాయి రూపాయిల కాయితాలు. పరుపు లాగగానే కింద పడ్డాయి పేర్పులు పేర్పులుగా అణిగి నిగ్గు తేరిన నోట్ల దొంతరలు. పరుపు కిందంతా పరిచి పెట్టిన డబ్బుల నోట్లుతో పాటు శాంతమ్మ రాసిన వీలునామా కూడా దొరికింది. అది వీలునామా అంటే వీలు నామా కాదు తెల్ల కాగితాల మీద రాసి ముచ్చటగా సంతకం చేసింది.

తనకున్న చిల్లిగవ్వతో సహా లెక్కలు కట్టింది శాంతమ్మ. అందులో తన తర్వాత టామీని చూసుకున్న వాళ్లకి పాతిక వేలు మాత్రమే కాదు, మెడికల్‌ కాలేజీకి పోవాలని తహతహ లాడే  డేవిడ్‌ కి కొంత, చర్చికి కొంత, ఇలా తనకి తోచిన వాళ్లకి తోచినంత వివరంగా రాసి ఉంచింది. వీలునామా చూశాక అంతవరకు తిట్టుకున్న మనుషులందరూ శాంతమ్మని పొగుడుకున్నారు. రోజులు గడిచి పోతున్నాయి. టామీ రేణుకకు పెద్ద మాలిమి కాలేదు కానీ తిండి పెడితే తిని తిరిగినంత సేపు తిరిగి ఖాళీగా పడి వున్న శాంతమ్మ వరండాలో కూర్చుంటుంది.

వంట చేస్తూ కిటికీలో నుండి బయటకు చూసినప్పుడు అప్పుడప్పుడూ శాంతమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది రేణుక. ఆ జ్ఞాపకాలలో శాంతమ్మ ఎప్పుడూ అనే సామెత ఒకటి ఉంటుంది ‘‘ఆడదానికి కడుపున పుట్టిన బిడ్డయినా ఉండాలి, కొంగున కట్టిన కాసయినా ఉండాలి’’ !

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

సామాన్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు