కథ రాస్తాను గానీ, దాని మోతను పట్టించుకోను!

కారా మాష్టారి అముద్రిత ఇంటర్వ్యూ

నేపధ్యం

మనసు ఫౌండేషన్ తరపున శ్రీ కాళీపట్నం రామారావు గారితో నేను చేసిన వీడియో ఇంటర్వ్యూకి ఇది అక్షర రూపం. 22-09-2011 నుంచి 26-09-2011 వరకు 5 రోజులు, మొత్తం దాదాపు 10 గంటలపాటు ఆయన మాట్లాడారు.

మనసు ఫౌండేషన్ తరపున వివిధ రచయితల సర్వ లభ్య రచనల సర్వస్వాలు తీసుకొస్తున్నపుడు, ఆయా రచయితల గురించి డాక్యుమెంటరీ ఫిలింలను కూడా చేద్దామని అనుకున్నాం. గురజాడ, బీనాదేవి గార్ల మీద చేశాం. వివిధ కారణాల వల్ల, జాషువా, కారాల మీద తీసిన ఫిల్ములు ఎడిటింగ్ దశలోనే ఆగిపోయాయి.

కారా గారు 04-06-2021న చనిపోయాక, ఆయనకు నివాళిగా ఆయన ఇంటర్వ్యూ పాఠాన్ని పాఠకులకు అందించాలని మనసు ఫౌండేషన్ భావించింది.

ఆయన జీవితం, సాహిత్యం గురించి వివరంగా చెప్పమని కారాగారిని అడిగినప్పుడు “స్వీయచరిత్ర అంటేనా దృష్టిలో స్వంతడబ్బా అండీ. అందుకే నేను స్వీయచరిత్ర రాయలేదు” అన్నారు. అప్పుడు నేను ఆయనకు “మీ గురిoచి చెప్పకండి. మీరు జీవించిన నాటి స్థితిగతులు చెప్పండి.” అని Micro History Concept గురించీ, Giovanni Levi, Carlo Ginzburg వంటి Micro Historians గురించి చెప్పాను. ఒక మనిషి, ఒక సంఘటన, ఒక గ్రామం వంటి వాటి గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం గురించి చెప్పాను. ఆయన convince అయ్యారు.

మరుసటి రోజు ఆయన నవల రాయడం కోసం రాసుకున్న notes తీసుకొచ్చి వివరాలతో చెప్పడం మొదలుపెట్టారు.

నాలుగో రోజు,”నేను ఇన్నిగంటలు, ఇంత ఓపికతో, శ్రమపడి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు నన్ను అర్థంచేసుకోగల వ్యక్తి కాబట్టి” అన్నారు.

కారాగారి పూర్వీకుల దగ్గరి నుంచి, ఆయన విరసం వదిలి బయటికి వచ్చేదాకా వివరాలు యిందులో వున్నాయి. అంతవరకూ చెప్పేసరికే ఆయన బాగా అలసిపోయారు. దాంతో ఇక ఆపేశారు.

87యేళ్ళ వయసులో కూడా, రోజూ మేమున్న హోటెల్‌కి వచ్చి, చాలా ఓపికతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాల్ని ఆయన మాటల్లోనే యథాతధంగా రాశాను. ఆయన జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం-ఈ మూడు అంశాలు మనకు ఇందులో కనిపిస్తాయి.

ఈ ఇంటర్వ్యూకి కారణమయిన మన్నం రాయుడు గారికి, నా అసిస్టెంట్ వేముల రాజేందర్‌కి, విశాఖలో మాకు సహాయం చేసిన కారా వాళ్ల అబ్బాయి సుబ్బారావు గారికి, మిత్రురాలు సాయి పద్మకి నా కృతజ్ఞతలు.

-దాము

మా పూర్వీకులు

మా పూర్వీకులు 19వ శతాబ్దపు చివరి 30 ఏళ్ళలో, బహుశా బందరు నుండి, ఇక్కడ అప్పట్లో వున్న నీలిమందు ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి వచ్చారు. పతివాడపాలెంలో వాళ్ళు వున్నట్టు రుజువులున్నాయి.

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తూ వుంటే, పైడి భీమవరం దాటిన తర్వాత పతివాడపాలెం, అది దాటాక రణస్థలం, దానికి 20కి.మీ. దూరంలో మురపాక మా వూరు.

మా తాత వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందులో ఇద్దరు చిన్నతనంలోనే చనిపోయారు. మిగిలిన వాళ్ళలో పెద్దవాడు సుబ్బారావు. చిన్నవాడు రామ్మూర్తి. అప్పట్లో వాళ్ళు మురపాక రాలేదు.

ఒకసారి ఈ ఇద్దరు అన్నదమ్ములు సంతకు వెళ్ళారు. సంతలో గడ్డమనపు సూరమ్మ అనే ఆవిడ ఈ అన్నదమ్ములకి పరిచయం అయ్యింది. ఆమెదిమురపాక. ఆమె మిరాశీదారు. మిరాశీకి సంబంధించిన భూములుండేవి. ఆమెకు సంతకం పెట్టేవరకే చదువొచ్చు.

సంతలో, ”మీదే వూరు?” ”మీదే వూరు?” అనుకోడంతో పరిచయం జరిగాక, గడ్డమనపు సూరమ్మ గారు సుబ్బారావును దత్తత చేసుకోవాలని అనుకున్నారు. రామ్మూర్తి ఒప్పుకున్నాడు.

అలా, సుబ్బారావుగారు, ఆయన భార్య మురపాక వచ్చారు.

సూరమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా, ఆడమనిషయినా, ఆ రోజుల్లో అయినా, ఆవిడ పదిమందినీ నిలబెట్టగలిగే స్వభావం కలదిగా అయివుంటుంది. ఏడూర్ల కరణీకం. ఇంత మందిని కంట్రోల్ చెయ్యగల్గిన శక్తి ఆవిడకి వుండి వుంటుంది.

తర్వాత సుబ్బారావుగారు కరణీకం వ్యవహారాలవీ చూస్తుండేవారు. సంతకం ఏమో ఆవిడ పెడుతుండేది. అయితే వీళ్లకి కూడా సంతానం లేకపోయింది.

నా తలిదండ్రులు

రామ్మూర్తి గారికి ఒక కొడుకు వుండేవాడు. వెంకటప్పయ్య. 10 ఏళ్ళ తర్వాత పేర్రాజు అని ఇంకొక కుర్రాడు పుట్టాడు. ఆ పేర్రాజుని సుబ్బారావుకి దత్తత ఇవ్వమని సూరమ్మ అడిగింది. రామ్మూర్తి ఒక షరతుతో ఒప్పుకున్నాడు. ఆ షరతు ఏమిటంటే పేర్రాజు అభిమాన పుత్రుడుగా వస్తాడు తప్ప, ఇంటి పేరు మార్చుకునే ప్రసక్తే లేదు. ఆవిడ దానికి అంగీకరించింది.

ఆ పేర్రాజు గారే మా తండ్రిగారు. ఆయన పుట్టుక 24-10-1896న. ఇతను ఇంట్లో అల్లారుముద్దుగా వుండేవాడు. పెంచుకున్న పినతల్లి, సూరమ్మ ఇద్దరూ గారం చేసేవారు. అక్షరాభ్యాసం అయినా కూడా వూర్లో చదువు అంతంత మాత్రమే వుండేది.

రామ్మూర్తి గారి భార్య గిడుగు వెంకట రామ్మూర్తి గారి సోదరి. వారప్పుడు పర్లాకిమిడిలో వుండేవారు. పేర్రాజును అక్కడ పెట్టి చదివిస్తే బాగుంటుందనుకున్నారు. ఇక్కడే వుంటేగారంతో చెడిపోతాడనుకొని బహుశా రామ్మూర్తిగారు పంపాలనుకొనివుంటారు.

రామ్మూర్తి గారు వాళ్ళ బావగారికి వుత్తరం రాస్తే, ఆయన ఒక షరతు మీద ఒప్పుకొన్నాడు. కుర్రాడితో పాటు తల్లికూడా ఇక్కడికే వచ్చి కుర్రాడు మాలిమి అయ్యే వరకు ఒకటి రెండు నెలలు వుండాలి. అయితే, ఆమె ఆడపడుచురికం చెయ్యకుండా రామ్మూర్తిగారి భార్య అజమాయిషీలో వుండాలి. ఆ ప్రకారం అంగీకరించి అక్కడికి పంపారు.

అయితే పండగ సెలవులకు వారు ఇంటికి పంపలేదని, చెప్పా చేయకుండా బయల్దేరి మురపాకవచ్చేసారు పేర్రాజు. గిడుగు రామ్మూర్తి గారు వుత్తరం రాసారు, ”నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు ఇంక”. ఇది 1902 ప్రాంతంలో జరిగిన సంఘటన. 1940 దాకా మేనమామ గిడుగు, మేనల్లుడు పేర్రాజు చూసుకోడం జరగలేదు.

మా నాన్న గారిని పెంచుకొన్న సుబ్బారావు గారు 29-11-1898న పోయారు. మా నాన్న కన్న తండ్రి రామ్మూర్తి గారు 1908లో పోయారు. మా అభిమాన ముత్తవ్వ గడ్డమనపు సూరమ్మ మే,1907లో చనిపోయారు. మా నాన్న గారి దత్తత తల్లి సూరమ్మ 33 సంవత్సరాలు వైధవ్యం మోసి, 1931లో పోయింది.

మా వూళ్ళో బాల్య వివాహాలు ఎక్కువ. మా వూరికి 3-4 కి.మీ. దూరంలో వున్న తామాడ ఆడబడుచు మహాలక్ష్మిని మా నాన్న గారికి ఇచ్చి చేసారు. అప్పుడు ఆయనకు 12ఏళ్ళు. ఈయన కంటే 10 ఏళ్ళు పెద్దయిన వెంకటప్పయ్యకు అంతకు ముందే విజయనగరం నుంచి పిల్లనిచ్చారు.

సుబ్బారావు గారూ, రామ్మూర్తి గారూ, సూరమ్మ గారూ పోయిన తర్వాత వేలు విడిచిన మేనమామ ఎవరో వచ్చాడు ఆస్తిపాస్తులు చూడడానికి. ఆయన హయాంలో ఆస్తి చాలా వరకు క్షీణించిపోయింది.

అత్తవారింట్లో వుంటూ మా నాన్నగారు 14వ ఏట, జూన్ 1910 నుండి ఫిబ్రవరి 1911వరకు 4వ తరగతి చదువుకొన్నారు.

ఆ మేనమామ హయాంలో పంపకాల గొడవలొచ్చాయి. మురపాకలో ఆ ఇల్లూ, ఆస్తి దత్తుడిగా మా తండ్రిగారికే చెందుతాయి. కానీ తోడబుట్టినవాడవబట్టి, ఆయన తల్లి బ్రతికుంది కాబట్టి, మా అమ్మమ్మ గారి ద్వారా మా తాతగారు వచ్చి ఇది మూడు వాటాలు వేసుకోవడం న్యాయం అన్నారు.

1. మా పెద తండ్రి వెంకటప్పయ్య గారికి
2. మా నాన్న గారు పేర్రాజుగారికి
3. ఆయన్ని పెంచుకొన్న తల్లికి

పెంపకపు తల్లి సహజంగా పెంపుడు కొడుకుతో వుంటుంది కాబట్టి, పేర్రాజుగారికి రెండు వాటాలు, అన్న గారికి ఒకటి. 7-8 ఏళ్ళ దాకా ఇండ్లన్నీ కలసి ఒకటిగానే వుండేది. మా పెదతండ్రిగారు పోయిన తర్వాత ఆయన పిల్లలు ఆ ఇంటిని అమ్మేసారు. మా నాన్న గారికొచ్చిన రెండు వాటాలు ఇప్పటికీ మా కుటుంబంలోనే వున్నాయి.

మా నాన్న గారికి 20వ ఏట, ఆయన భార్య గర్భవతిగా వున్నపుడు చనిపోయింది. అప్పట్లో సాంప్రదాయం ఏమిటంటే, గర్భిణీస్రీ పోతే, మంగలి కత్తితో కడుపును కోసి, శిశువును బయటకు తీసి, తల్లితో పాటు గోతిలో పాతిపెట్టడమో, కాల్చేయడమో జరిగేది. ఈమె విషయంలో కూడా అలానే చేసారు. మా పెదనాన్న భార్య కూడా పోయారు.

మా నాన్న గారి 22వ ఏట, 1918 మార్చిలో కరణీకం ప్రారంభమయ్యింది. మొదటి భార్యను నష్టపోయిన మూడో ఏట 12ఏళ్ళ భ్రమరాంబతో(మా అమ్మ) మా నాన్న వివాహం 1919 ఫిబ్రవరిలో జరిగింది. మా అమ్మని పొందూరు అనపర్తివారి కుటుంబం నుంచి తీసుకొచ్చారు. మా అమ్మని మా నాన్నగారు ఓలి(కన్యాశుల్కం)ఇచ్చి కొన్నారు. ఆమె జననం 1908. పెళ్ళి నాటికి ఆమె వయసు 12 ఏళ్ళు. మా నాన్న కన్నా 12 ఏళ్ళు చిన్నది. 1921లో ఆమె రజస్వల అయింది.

ఇక్కడ మా అమ్మగారి కుటుంబం గురించి చెప్పాలి. మా అమ్మగారి తండ్రిగారు పోలీసు కానిస్టేబిలు. ఆయన పేరు జగన్నాథ రావు. భార్య నరసమ్మ గారు. వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దావిడ వెంకట నరసమ్మ. ఆవిడ చెట్టుపదిలంలోవుండేటటువంటి ఎల్లాప్రగడ వారి కోడలు. రెండో ఆవిడ భ్రమరాంభ, మా అమ్మ. మూడో ఆమె రాములమ్మ. ఆమె కవిపురపు వారి కోడలు, బరంపురం.

మా అమ్మమ్మ గారు 1932లో పోయారని వూహించి చెబుతున్నాను. అప్పుడు వాళ్ళకుండే ఆస్తి ముగ్గురు కూతుళ్ళు పంచుకొన్నారు. అప్పుడు మాలో తద్దినాలు పెట్టడానికి కన్నకొడుకు గానీ, పెంపకపు కొడుకు గానీ లేకపోతే, పెద్ద కూతురు పెద్దకొడుకుని దౌహితుడుఅంటారు. తద్దినాలు, కర్మకాండలు చేసే అధికారం అతనికి వుంటుంది. అంచేత ఆయనకు ఒక వాటా. అంచేత మా అమ్మమ్మ గారి ఆస్తిని 4 వాటాలు చేసి, రెండు వాటాలు మా పెత్తల్లి గారికి, మిగిలిన రెండు వాటాలు మా అమ్మ గారికి, ఇంకొక ఆమెకు. ఆప్పుడు మా అమ్మగారికి వచ్చినది అంతా కలిపితే 1600/- రూపాయలని నా జ్ఞాపకం.

మా పెద నాన్నకు కూడా కాసులమ్మతో రెండో పెళ్ళి జరిగింది. మా నాన్నకు పెళ్ళి అయి ఈయనకు కాలేదని అలిగి కొన్నాళ్ళు కాశీకి వెళ్ళిపోయాడని వినికిడి.

 

నా బాల్యం

నేను 09-11-1924లో పుట్టాను. రిజిస్టరులో మాత్రం 16-06-1924 వుంటుంది. వయస్సు పెంచి వేశారప్పుడు.

నా ఎర్లీయెస్టు మెమరీ ఏమిటంటే, నన్ను ఎత్తుకొనే వయసులో మా నాన్న గారు, మా అమ్మ కాకినాడలో ఒక పెళ్ళికి వెళ్ళారు. అది పసుపర్తి వారి ఇంట్లో పెళ్ళని తర్వాత అనుకోవడం విన్నాను. ఆ పెళ్ళిలో పెళ్ళికూతురు నన్ను బుగ్గలు గిల్లి, అల్లరి పెట్టి, టీజ్ చేయడం బాగా గుర్తు.

తర్వాత, నా అక్షరాభ్యాసం కన్నా ఒక సంవత్సరం ముందే పొందూరులో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రావడం దగ్గర నుంచి నాకు గుర్తుంది. మా ఆఖరి తమ్ముడు కృష్ణారావు పుట్టిన దాకా మా అమ్మ ప్రతి పురిటికీ పుట్టింటికి వెళ్తుండేది. మా రెండో చెల్లి పుట్టినప్పుడు, “మళ్ళా ఆడపిల్లేనా” అనుకుంటుంటే, నేను కూడా ”అయ్యో” అంటే, ”ఏమిరా?” అంటే, ”తమ్ముడుంటే…” అని ఏదో అన్నానని చెప్పుకునే వారు.

నా శైశవానికి సంబంధించినది ఏమిటంటే, మా నాన్నగారి స్నేహితులు…ఇలాంటి వాళ్ళు నన్ను తీసుకెళ్ళి, వీధి వరండాలో శ్రేణీ కమ్మలు అనివుంటాయి, వాటి మీద కూర్చోబెట్టి ఏడిపించడం గుర్తుంది. మా ఇంట్లో గదిలో భోషాణం పెట్టె వుండేది. దానికి సంబంధించిన గుర్తులు కొద్దిగా వున్నాయి.

నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. తర్వాత 1951లో, నా ఇద్దరు పిల్లల కన్నా చిన్న వాడు ఒక తమ్ముడు పుట్టాడు.

మా పెత్తల్లి వూరు చెట్టు పదిలంకు దగ్గరగా వుండే సిగడం అనే వూరు మైలున్నర దూరంలోవుండేది. నా స్నేహితులందరూ, బాల్యంలో నాతో చదువుకున్న వారు, అయ్యవార్లూ, మురపాక నుంచి రోజుకు నాలుగుసార్లు-ఉదయం వెళ్ళి భోజనానికి రావడం, తిరిగి వెళ్ళి సాయంత్రం రావడం కూడా జ్ఞాపకం.

అప్పటి ఆటలు కూడా గుర్తే. అప్పట్లో ‘ఆకాట’ ఇష్టంగా వుండేది. ముగ్గురేసి జట్లు వేసి దొంగను నిర్ణయిస్తారు. ఆ దొంగ మిగిలిన వారిలో ఎవరినైనా తోడు చేసుకోవచ్చు. లేదా ఒక్కడేవుండొచ్చు. “ఫలానా ఆకు తెంపి పట్రా” అంటారు. వాడు ఆకు తెచ్చే లోగా వీళ్లందరూ’బాజూట్’ అయిపోతారు. మా వూరికి అరమైలు దూరంలో నాలుగు వూర్లుండేవి. అక్కడికి కూడా పోయి దాక్కునేవాళ్ళం. తర్వాత వాడు పట్టుకుంటే, పట్టుబడినవాడు దొంగవుతాడు. మళ్ళీ వాడు భోగట్టాలవీ చేసి పట్టుకునేవాడు.

తర్వాత కోతి కొమ్మచ్చి ఒకటి. కోకో ఒకటి. ఇంకోటి, జట్లు వేసిన తర్వాత దొంగోడ్ని ఒక వృత్తం గీసి, అందులో కూర్చొని పెట్టే వారు. ఇంకొకడు వీడి చేతికి గావంచ ఇచ్చి, రెండో చేత్తో తువాలు తాడులా పేని, పట్టుకొని, వీడ్ని కొట్టడం కోసమని మిగతా పిల్లలు వస్తే, వాడ్ని ఈడు చుట్టూ తిరుగుతూ కాపాడుతుండే వాడు. అదొక మంచి ఇంటరెస్టింగ్ గేము.

పెద్ద వాళ్ళయితే కబడ్డీ. ఇంకొకటి చెర్రీ ఆట అని ఒకటి వుండేది. దానికేమో నీళ్ళతో లైన్స్ వేసేవారు. మూడో, ఎన్నో లైన్స్ దాటాలి. దాటి అవతలికి వెళ్ళి అక్కడ ఉప్పందుకొని, తిరిగి ఇవతలికి రావాలి. సాధారణంగా పొలాల్లో పని చేసి, సాయంత్రం ఇంటికి వచ్చిన యువకులు వెన్నెల్లో ఈ ఆట ఆడేవారు.

అమ్మాయిల ఆటలు వేరుగా వుండేవి. గచ్చకాయల ఆట, పులిజూదం, అష్టా చెమ్మ. దీన్నిమగాళ్ళు కూడా ఆడే వారు.

తక్కిన వూళ్ళతో పోలిస్తే మా వూళ్ళో కొంచెం సంస్కారానికి చోటు వుండింది.

మా నాన్న గారికి గిడుగు వారి మేనల్లుడనే స్పృహ వుండేది. ఆయన గురువు లేకుండానే ఇంగ్లీషు నేర్చుకున్నారు. హిందీ నేర్చుకొన్నారు. భారత, భాగవత, రామాయణాలు, వసుచరిత్ర, మనుచరిత్ర-ఇవన్నీ చదివే వారు.

కొంత మందితో కలిసి, మా నాన్న మా వూళ్ళో శ్రీ రామకృష్ణ గ్రంథాలయాన్ని స్థాపించారు. దీంట్లో ప్రబంధాలు, ఇతిహాసాలు, నాటకాలు, ఆ కాలంలో వున్న చెళ్ళపిళ్ళ వంటి వారి కవిత్వం వంటివి వుండేవి. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక వచ్చేవని చెప్పేవారు.

నేను మా పెత్తల్లి ఇంట్లోకి, మా ఇంట్లోకి మొట్టమొదటి మగ పిల్లవాణ్ణి కాబట్టి నాకు ఆభరణాలు వుండేవి. బంగారం కంటె, మురుగులు, ఒత్తులు, కాళ్ళకు వెండివి వుండేవట. మా పొరుగున వున్న భోగారపు వెంకట్రావు కుటుంబం బ్రాహ్మణులు-పట్నాయక్ కులాంతరవివాహం కుటుంబ సంతానం కాబట్టి, ఆ కుటుంబంతో మాకు సాన్నిహిత్యం వుండేది. వారు బ్రాహ్మణుల వంక మొగ్గేవారు. పట్నాయక్‌లు వూర్లో వున్నా, వారి వైపు మొగ్గేవారు కాదు. తమషా ఏమిటంటే, వీళ్ళ కుటుంబంలో ఆడపిల్లని ఒక బ్రాహ్మణుడు పెళ్ళి చేసుకున్నాడు. కాపురం చేసి, పిల్లల్ని కన్నాడు. కానీ, ఆయన వంట ఆయనే చేసుకొనే వాడు. అందుచేత అతన్ని తద్దినాలకు వాటికి కూడానూ భోక్తగా పిలిచే వారు బ్రాహ్మణులు. మా నాన్న గారు కూడా పిలిచే వారు. పురోహితులు కూడా దాన్ని తప్పు పట్టేవారు కాదు.

వర్ణాల గురించి మన అవగాహనకున్నూ, అప్పట్లో వుండే అవగాహనకూ చాలా తేడా వుంది. ఇప్పుడు ఈ ఆచారాలూ వీటిని సమర్థించడం కానీ, నిందించడం కానీ నా వుద్దేశం కాదు. ‘స్థితి’ని చెప్పడం మాత్రమే.

భోగారపు అప్పారావుకు మగపిల్లలు లేరు. ఒకే ఒక ఆడకూతురు. పేరు సత్యవతి. ఆ అమ్మాయి నా సహపాఠి. జీవితం ఆ అమ్మాయిపట్ల, కుటుంబం పట్ల ఎంత దుర్మార్గంగా వుండిందో నేను చెప్పలేను. నా కథల్లో ”అభిశప్తులు” అనే కథను ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకుని రాశాను. ఆ అమ్మాయి చాలా మంచిది. చాలా శ్రమపడేది. ఆవిడ తల్లి కాస్త నోరు పెట్టుకుని బతికేది. అప్పారావు కాస్త మెతక. అప్పారావు గారి భార్యది ఏ క్షణానికీ మర్చిపోలేని అరుదైన వ్యక్తిత్వం. ఆమెకి ఈ పిల్లంటే విపరీతమైన ప్రేమ. మరి ఈ పిల్లని ఏ కులం వాడికి ఇవ్వడం? మా వూరికి తుని నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఇంటిపేరు అవసరాల. అతనిది మంచి విగ్రహం. హార్మోనియం వాయించేవాడు. నాటకాలకు దర్శకత్వం వహించేవాడు. మా వూర్లో నాటక సంఘం ఒకటి వుండేది. ఏటా ఒక ఉత్సవానికి ఒక నాటకం వేసే వారు. మా వూర్లో ఐదారుగురు బాగా నటించగలిగేవారుండే వారు. అప్పట్లో సినిమాలు లేవు. నాటకాలే జనాల్ని ఆకట్టుకునేవి. అప్పట్లో సొమ్ములు కాసుకునే వారు కూడా గేదె మీద వెళ్తూ ”చెల్లియోచెల్లకో..” లాంటి పద్యాలు పాడుకునే వారు. సత్యవతిని ఈ బ్రాహ్మణ కుర్రవాడికి ఇచ్చి చేసారు.

మా నాన్న కరణీకం చేసేవారు. పన్ను వసూలు చేయడం వంటివి రోజూ చేసేవారు. మాది షేక్ మహమ్మద్ పురం ఇలాఖా గ్రామం. గడ్డమనుపు సూరమ్మ గారి నాటికి అంకితం వెంకట జగ్గారావు గారు మా ప్రాంతానికి జమీందారు. ఆయన పోయిన తర్వాత బానోజీరావు గారని వుండేవారు. మా వూర్లో చాలా భూములు వారివే.

అప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం-ఈ మూడు కలిపి ఒకటే జిల్లా. ఆ జిల్లాలో జమీందార్లకు ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద మహల్ వుండేది. అలాగే వెంకట జగ్గారావు గారికి కూడా డాల్ఫిన్ ప్రాంతమంతా కూడా ఒక పెద్ద ఆవరణలో వుండేది. ఆ తర్వాత బానోజీ రావు కోర్టు కేసుల్లో ఇరుక్కొని అప్పుల పాలయ్యారు.

మా గ్రామంలో 1600 మంది వుండేవారన్నది నాకు తెలిసిన ఒక సంఖ్య. మాదిగ కులం తప్ప మిగతా అన్ని కులాలు వుండేవి. కమ్మరి, వడ్రంగి, కంసాలి, పట్టుశాలీలు ఎక్కువగా వుండేవారు. తక్కిన చుట్టుపక్కల వూళ్ళతో పోలిస్తే మా వూరి సంస్కృతికి పట్టుశాలీలు కారణం. నా స్నేహితులు ఎక్కువగా ఈ కులపు వాళ్ళే. పట్టుశాలీలు సన్న నూలునేసేవారు. అప్పట్లో గాంధీ గారి వుద్యమం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మా వూళ్ళోనూ గాంధీ అనుయాయులు వుండే వారు. అయితే పెద్దగా రాజకీయాలు తెలిసిన వారు కాదు. గ్రంథాలయం, పత్రికలు రావడం, కందుకూరి వీరేశలింగం ప్రభావంతో మా వూళ్ళో సాంఘిక చైతన్యం వుండేది.

నాకు జ్ఞానం వచ్చేసరికి బ్రాహ్మణ కుటుంబాలు మా పెదనాన్న గారు, మేము, ఇంకో కుటుంబం. అంతే. మేము నియోగులం. సాధారణంగా కరణీకం వృత్తి చేసే వాళ్ళంతా బ్రాహ్మణులే.

శ్రీకాకుళంలో నియోగులు కాకుండా ‘శిష్ఠ కరణాలు’ వుండే వారు. వారికి తెలుగే కాకుండా, వాళ్ళకో భాష వుండేది. అది ఒరియా భాషకు దగ్గరగా వుండేది. వారు చేస్తే కరణీకాలు చేసేవారు, లేకపొతే ఉపాధ్యాయులుగా వుండేవారు. వారికి ‘పాలకొండ పట్నాయక్’లని పేర్లుండేవి. ప్రాథమికపాఠశాలల్లో ఎక్కువగా వీరే వుండేవారు.

శారదా బిల్లు రావడం నాకు తెలుసు. ఈచట్టం ద్వారా బ్రిటిషు ప్రభుత్వం బాల్యవివాహాల్ని రద్దుచేసింది. ఆ రోజుల్లో మా వూళ్ళో చాలా మంది యానాం వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చేవారు. ఇది ఫ్రెంచి వారి కింద వుండేది. అలా కనీసం ఒక వంద బాల్య వివాహాలు మా వూర్లో జరిగి వుంటాయి. అక్కడ చీరలూ, అవీ ఖరీదు తక్కువ. పెళ్ళి వారు వెళ్ళి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కరు ఒంటికి రెండేసి, మూడేసి చీరలు చుట్టుకొచ్చేవారని చెప్పుకునేవారు. మా పెంపకపు నాయనమ్మ కూతుళ్ళ పెళ్ళిళ్ళు అక్కడ చేయమని శతపోరుపెట్టేది.

మా వూరి నుంచి జీవిక కోసం బర్మాలోని రంగంవెళ్ళేవారు. నేను ‘యజ్ఞం’ రాసే కన్నా ముందు నా బాల్యంలో చాలా మందికి భూములుండేవి. అప్పట్లో భూమి కోసం ఇంత రొక్కటం లేదు. మా వూరికి దగ్గర్లో అల్లి అని ఒక అడవి వుండేది. జమీందార్లతో చెప్పీ చెప్పకా, లేదా కరణాల మతలబులతో ఆ అడవిని నరికేసి భూమిని సాగు చేసుకోవడం నేను ఎరుగుదును.

మాలలకు కూడా భూములు వున్నాయన్నది అక్షర సత్యం. మన వాళ్ళు విన్నకబుర్లతోనే, ఆధారం లేకుండానే మాలలకు భూములు లేవనే నిర్ధారణకు వచ్చారు. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మా నాన్న గారు అకౌంట్స్(అడంగులు)రాసేవారు కదా? డిసిబి(డిమాండ్ కలెక్షన్ అండ్ బ్యాలెన్స్)అని వుంటుంది. దాంట్లో రాసేటప్పుడు ఒక్కొక్క పట్టాలోనే, ఆ పట్టా అమ్ముకోవడం, పంచుకోవడం అవీ జరుగుతుంటాయి. ఇతరులకు కూడా అందులో వాటా ఏర్పడుతుంది. కనీసం 4-5ఏళ్ళు అలాంటివి రాశాను నేను.

మా వూర్లో దైనందిన జీవితం

పల్లెటూరి రోజుల్లో ఎవరింట్లో వాళ్ళు నిప్పు వెలిగించుకునేవాళ్ళు కాదు. ఎవరింట్లోనయినా పొగ కనపడితే, పిడక పట్టుకెళ్ళేవారు. దాని మీద నిప్పుపెడితే అది వెలిగాక, తెచ్చి వెలిగించుకునే వారు. ఎవరైనా చుట్ట వెలిగించుకోవాల్సి వస్తే కూడా, పక్కవానిది తీసుకొని వెలిగించుకొనే వారు. అగ్గిపెట్టెలుండేవి కానీ, ఖర్చుకు అంత జంకే వారు. ఇప్పుడు మనం ఎంత దుబారా చేస్తున్నామో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కలిమి కూడా పెరిగింది.

అప్పట్లో ఆముదం దీపం వాడేవారు ఎక్కువగా. కిరోసిన్ దీపం ఖరీదెక్కువ. మా ఇంట్లో మాత్రం రకరకాల దీపాలుండేవి. ఒకటి హరికేన్ లాంతరు. రెండవది బుడ్డి దీపం. దానికి చిన్న చిమ్నీ, బర్నరు వుండేవి.

ప్రతి ఇంట్లోనూ నందలుండేవి. నంద అంటే గరిసె లాంటిది. ధాన్యం పురుగు ముట్టకుండా వుండేందుకు ఈ నందల్లో పోసి మూత పెడతారు. వెదురుతో అల్లిన గరిసెలు కూడా రైతుల ఇళ్ళల్లో వుండేవి. మా ఇంట్లో నంద, భోషాణం మా తమ్ముడు చనిపోయేదాకా వుండేవి. అప్పట్లో పడుకోడానికి నులకమంచాలు ఎక్కువ. పట్టెమంచాలు కలిమిని బట్టి కొందరికి వుండేవి. ఎక్కువగా కింద కూర్చొనే తినేవారు. కొందరికే పీటలు వుండేవి. విస్తరాకు, అరిటాకు, వెండి కంచాలు, ఎక్కువగా పింగాణి కంచాల్లో భోజనం చేసే వారు. విరిగిపోయే పింగాణి కాదు. కోటింగుతో వుండే ఇనుపవి.

వర్షాకాలం, శీతాకాలాల్లో కూడా మా ఇళ్ళల్లో పట్టు లాగులతోనే భోజనం చేయాలి. మామూలు బట్టలతో కాదు. మడి అలా వుండేది. మా అమ్మ ఒకసారి ఆసుపత్రిలో చేరింది. అక్కడ తోటి వాళ్ళుంటారు కదా? అక్కన్నుంచి “ఎలాగూ మైల పడిపోయాం కదా” అని మా ఇంట్లో మడి బట్టల ఆచారం పోయి మామూలు బట్టల్లోకొచ్చాం.

పేద ఇంట్లో కూడా బియ్యానికి బదులు చోళ్ళు, గంటెలు, జొన్నలు వాడే వారు. వాటికోసమని ఒక గోన, కింద సన్నగా వుంటూ పైకి పోయే కొద్దీ విశాలంగా వుండి పైన మూత వుంటుంది, ప్రతి ఇంట్లోనూవుండేది. కలిమి వుండే వారు వరి అన్నం తినే వారు. ఎక్కువ మంది గంటిజావ, రాగులు ముందు రోజున తడిపి పులయపెడతారు. మర్నాడు వరి నూక కూడా చేర్చి సంకటి లాగా చేస్తారు. దాన్ని అంబలి అంటారు. మాంసాహారం అరుదుగా, ఏ పండగలప్పుడో తినేవారు.

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి సముద్రానికి సమాంతరంగా వుంటుంది. ఇక్కడంతా ఇసుక ప్రాంతం. ఇక్కడ మామిడి తోటలు, జీడి తోటలు, సరుగుడు తోటలు పెరుగుతుంటాయి. జాతీయ రహదారి దాకా మధ్యనుండే వాటిలో మెట్ట భూములువుంటాయి. మెరక భూములన్న మాట. మెరక భూముల్లో మిరప, వేరుశెనగ, గంటి, చోడి, జొన్న పంటలు పండించే వారు. కందులు, పెసలు, ఉలవలు వంటి ధాన్యాలు పండించే వారు. ఇంటికి కావాల్సినవి నిలువ వుంచుకొని, అధికమైన వాటిని సంతలో అమ్ముకునే వారు.

నా బాల్యంలో రూపాయి చలామణి చాలా తక్కువ. అది చెలామణి ఆరంభించాక, స్వాతంత్ర్యానంతర పరిణామాల తర్వాత, రూపాయిల వినియోగం పెరిగిన తర్వాత, నేననుకోవడం, పేదరికం వుండి, ఎక్కువ ఆశకు పోవడం వల్ల మరింత పేదరికం వచ్చిందనుకొంటున్నాను.

మెట్ట వ్యవసాయంలో ఆహారానికి కాకుండా, వ్యాపార పంటలు గోగు, వేరుసెనగ, మిర్చి వంటి వాటి ధర నిర్ణయించేది రైతు కాదు. ఎక్కడో, ఎవడో. వాడు వాడి దళారికి చెప్తాడు. పంట బాగా పండే రోజుల్లో తక్కువ ధరకి షావుకారికి చేరిన తర్వాత, ఎక్కువ ధరకి అమ్ముకొనే వాడు. ధాన్యం నిలవ వుంచుకొనగలిగే వాళ్ళు పేదరికాన్ని తట్టుకొనే వాళ్ళు.

నేను యజ్ఞంలో అన్నదొకటి గుర్తు. షావుకార్లకి అప్పులుండిపోయి బాధలు పడిన రైతులు, మెట్ట వ్యవసాయాలు చేసిన వాళ్ళే తప్ప, చెరువు కింద వరి పండించే వాళ్ళు కాదు. చెరువు కింద వరి పండించే వాళ్ళకి 2-3 ఏళ్ళకి నిలువ చేసుకోవడానికి వీలుంటుంది. అదే వేరుశెనగ, గోగు అలా కాదు. అంచేత ఏదో ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది.

మంగలి, చాకలి, ఇతర అన్ని వృత్తుల వారికి ఇనాములువుండేవి. తర్వాత, సంవత్సరం చివర్న ప్రతి కుటుంబీకులు ఎంతో కొంత ఇస్తారు. పంటలు కోసే సమయంలో కల్లం దగ్గర ధాన్యం కొలుస్తారు. దీన్ని ‘పొల్లాయ్’ అంటారని జ్ఞాపకం.

ఈ మధ్య వచ్చే కథల్లో “వృత్తులు పోయాయి” అని రాస్తుంటారు. నేను వారిని అడుగుతాను. “ఎవరి వృత్తులు పోయాయి? పట్నాలలో వుండే మంగళ్ళు, చాకళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పల్లెల నుంచే వచ్చారు. కొంత మంది అక్కడే వుంటారు. కొడుకులో, అన్నలో చేస్తూ వుంటారు. పల్లెల్లో సంవత్సరం పొడవునా బట్టలు వుతికితే ఒక పాత పంచె, పుట్టెడు ధాన్యం కొలిచేవారు. పట్నాలలో క్షవరం రేటు ఎంత? ఒక బట్ట వుతికి, ఇస్త్రీ చేస్తే ఎంత? వాళ్ళు నష్టపోయారని ఎందుకు అనుకుంటున్నారు?”

ఒక మాట అంటానండి. పంటలు, పాలు గ్రామాల్లోంచి వస్తాయి. తినే తిండి పల్లెటూరి నుంచి వస్తుంది. గవర్నమెంటు వాళ్ళు పల్లెటూర్లకి సహాయం చేస్తున్నట్టు బర్రెల్ని, ఆవుల్ని సబ్సీడీలో ఇస్తున్నారు. అక్కడ పాలశాఖ ఏర్పాటు చేస్తున్నారు. కష్టం పశువులను పెంచేవాడిది, పాలు మాత్రం పట్టణాలవాళ్ళవి. ఎవరైనా సరైన నాయకుడు నిలబడి, ప్రబోధించి, ఒక నెల పాటు తిండికి లోటు లేకుండా ఇంట్లో పెట్టుకుని, సమ్మె ఆరంభిస్తే పట్టణాల రూపురేఖలుండవు.

నా చదువు: మురపాక బడి

1929లో 5వ ఏట నా ప్రథమ అక్షరాభ్యాసం జరిగింది. మొదట మా వూర్లోనే చదువుకొన్నాను. మా సీనియర్లకి కుప్పిలి అప్పలస్వామి అయ్యవారు. నేను వెళ్ళే సరికి అప్పలస్వామి గారు మంచం మీద వుండేవారు. నారాయణ గారు మాకు పాఠం చెప్పేవారు. మొట్టమొదట మా వూరు పెద్ద మురపాకలో చదువు కోసం బయటికి వెళ్ళిన వాణ్ణి నేనే. నాలుగవ తరగతి దాకా ఇక్కడ చదువుకొన్నాను. పాఠశాల తనిఖీ గురించి సరదాగా ఒక విషయం చెబుతాను.

ప్రభుత్వ తనిఖీ అధికారులొచ్చి మా బడి బాగా నడుస్తుందో లేదో చూసి, ఎయిడ్‌కి సిఫారసుచేసే వారు. ఎక్కువ మంది మాస్టార్లుంటే బాగా నడుస్తున్నట్టు. అందుకోసమని చెప్పి మా వూర్లో మునసబు గారి తమ్ముణ్ణి, మా పొరుగున వుండే భోగాపురపు అప్పారావుని, మాస్టార్ని-ముగ్గుర్నీమాస్టార్లుగా చూయించే వారు నాలుగు తరగతులకి. అది నమ్మేసి అధికారులు గ్రాంటు ఇచ్చేసే వారు.

కానీ ఒకసారి నియమ నిబంధనలకీ, న్యాయానికీ కట్టుబడి వుండే ఒక అధికారి వచ్చాడు. ఆయన టీచరు హాజరుపట్టీ చూసి, ఒక కుర్రాణ్ణి నిలబెట్టి, టీచరు పేరు అడిగాడు. వూర్లో అందరినీ ఎరిగుంటారు కదా, ఫలానా అని చెప్పాడు. ఈయన్ని ఫలానా పాఠం మీద పిల్లలకు ప్రశ్న వెయ్యమన్నాడు. అతను పుస్తకం తెరుస్తుంటే “పాఠం చెప్పలేదా?” అన్నాడు. అలా కంగారు పెట్టి పట్టేసాడు. ఆయన ఒక్కసారి వచ్చేసరికే గోల గోలపెట్టేశారు మా వూరి వాళ్ళు.

మా వూర్లో నాలుగవ తరగతి వరకూ వుండేది. అమ్మాయిలు 4-5 మంది వుండే వారు. మా ఇద్దరు చెల్లెల్లు మా బడిలోనే చదువుకున్నారు. తెలకల వారి అమ్మాయి చదువుకునేది. కంసాలి పిల్ల, పట్టుశాలీ అమ్మాయిలు ఒకరో ఇద్దరో వుండే వారు. కాపుల పిల్లలెవరూ చదువుకునే వారు కాదు. అంటే భూమి మీద పనిచేసే పిల్లలెవరూ చదువుకునే వారు కాదు. హరిజనుల పిల్లవాడు ఒక్కడే వుండే వాడు.

నేను హైస్కూలులో చదువుకునేటప్పుడు కూడా, ఈ స్కూలుకొచ్చి దాన్ని ఉద్ధరించేపనులేవో చేసేవాణ్ణి.

అప్పుడు నేల మీద చదును చేసి, అక్షరాలు రాసి, వాటి మీద దిద్దించేవారు. తర్వాత పలక, తర్వాత కాగితం వచ్చాయి. కానీ, కాగితం తక్కువ. నోటితో చెప్పడమే ఎక్కువ. ఎక్కాలు, సంవత్సరాలు, వారాలు, నెలల పేర్లు, రాశుల పేర్లు నోటితో ఎక్కువగా చెప్పించే వారు. సాయంకాలం అరగంటసేపు స్కూలు అంతటినీ నిలబెట్టి ఒకడు చెప్తుంటాడు. ”ప్రభవ-ప్రభవా’, ”విభవ-విభవా’ అని. మేము ఫాలో అయ్యే వాళ్ళం. అలాగే 2×1=2 లాంటివి చెప్తే మేము తిరిగి చెప్పేవాళ్ళం.

పిల్లలకు కోదండం, గోడ కుర్చీలు, గుంజీలు, తొడపాశాలుండేవి. బెత్తాలు వీపు మీదా, వంటి మీదా విరిగేవి. ప్రతి వాడికీబడి మాస్టారు, బడి పెద్దలంటే చచ్చేంత భయం వుండేది. మన వాళ్ళు చిన్నపుడు జీవితం చాలా హాయిగా గడిచిందనుకొంటారు. కాదు. ప్రతి క్షణం భయమే. బడికెళ్తే మాస్టారు భయం. అల్లరి పిల్లల భయం. వీధిలోకెళ్తే పెద్దలంటే భయం. వాళ్ళకు కాని పనిలా అనిపిస్తే(అది కాని పని కాదు, వాళ్ళకు తోస్తే చాలు)లెంపకాయలేసేవారు.

నన్ను ఎవరూ కొట్టే వారు కాదు కానీ, “మీ నాన్నతో చెప్తాం” అనే వారు. వుఛ్ఛగావుండేది అప్పుడు.

నేను ఒకటో తరగతిచదువుతుండగా ఒక రోజు మారాం చేస్తుంటే, మా బామ్మ “నేనెత్తుకొని తీసుకెళ్తాను నాన్నా“ అంటూవుంటే, నేను చంక దిగిపోయి అల్లరిపెడుతున్నాను. మా నాయన లేచి రూలు కర్ర పట్టుకున్నాడు. అంతే, నేను పరుగో పరుగు. అది చాలా కాలం వరకూ దెప్పేవారు. మా బామ్మ నన్ను ఎత్తుకొని వెళ్ళి బడిలో దిగబెట్టేది.

సిగడం బడి

1933వ ఏడు నేను 4వ తరగతి పాసయ్యాను. పాసయ్యాక 6 నెలలు ఇంటిదగ్గరే వుండిపోయాను. ఆ రోజుల్లో తక్కిన పిల్లలతో పేకాట ఆడుతుండటం చూసి మా నాన్న గారు ఆందోళన చెంది, చెట్టుపదిలంలో మా పెత్తల్లి ఇంటికి, సిగడంలో చదువుకోవడానికి పంపించాడు.

ఆర్థికంగా ఆ కుటుంబం మాకంటే కొచెం తక్కువగా వుండింది. డబ్బు కానీ, ఇంకేదో ఇస్తామంటే నామోషీ. అందుకే దానికి వేరే ఇంకేదో పద్ధతి అవలంభించి అక్కడ పెట్టారు.

నేను 1933లో లేటుగా బడిలో చేరాను. అప్పట్లో చెట్టుపదిలం నుంచి సిగడం వెళ్ళడానికి రోజూ దాదాపు 6 మైళ్ళు నడిచేవాణ్ణి. ఎండా, వానా ఏవీ పట్టించుకునే వాళ్ళం కాదు. మొదటి ఏడాది సగంలో చేరినా 5వ తరగతి పాసయ్యాను.

6వ తరగతికి వచ్చేసరికి సహవాస దోషాలు నా మీద పనిచేసాయి. ఇంకోటి, అక్కడ బడిలో పెద్దగా ఏం చెప్పేవారు కాదు. తర్వాత, ఇంటికొచ్చి ఆటలు అవీ అయిపోయాక ఎక్కువ సేపు మేల్కొని వుండలేకపోయేవాణ్ణి. ఇంకోటి, extra curricular activities లలో, పోటీల్లో పాల్గొనడం ఎక్కువ వుండేది. అంచేత, చదువు మీద శ్రద్ధ తగ్గింది. సహవాస దోషం వల్ల చుట్టలు కాల్చడం వచ్చింది. పేకాట మాత్రం మురపాకలో మా పెద్దమ్మ కొడుక్కి అలవాటు అయినది కాస్త నాకు అలవాటు చేసారు.

ఆ వూరు తీరు ఎలాగున్నదంటే, 80శాతం కాపు, రెండు బ్రాహ్మణ కుటుంబాలు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, పట్టుశాలీ, ఇంకేవో చిన్న చిన్న కులాలు 20శాతంవుండే వారు.

మా వూరి కరణానికి విలువ ఎక్కువ వుండేది. దానికి రెండు కారణాలు. మునసబుకీ, మా నాన్న గారికి మధ్య గాఢమైన అవగాహన వుండేది. మునసబు గారి కుటుంబంలోని కొన్ని పరిస్థితుల కారణంగా ఇతని పక్షాన నిలబడ్దారు మా నాన్న గారు. అంచేత మా నాన్నగారి మీద ప్రత్యేక అభిమానం వుండేది. మాతో పోలిస్తే ఆయనకు భూములు చాలా వుండేవి. అతను మున్సబుగిరీ చేసేవాడు. కానీ, భూముల వ్యవహారం, ఇంకా ఏవో వుండేవి. మా నాన్న గారు ఎలా చెప్తే అలా నడిచిపోతుండేది.

ఇక్కడ చెట్టుపదిలంలో మాత్రం అది కాదు పరిస్థితి. భూపతి ఇంటిపేరుతో కాపులు వుండే వారు. వారిది ఆ వూర్లో మూడు వరుసల చాలా పెద్దిల్లు వుండేది. వాళ్ళబ్బాయి నారాయణమూర్తి నాతో సన్నిహితంగా వుండేవాడు. అక్కడున్నంత కాలం నాకు సరదాగానే వుండేది. మొదట్లో దిగులుండేది. జ్వరం పట్టుకునేది. మా పెదనాన్న గారు భోళా మనిషి, అమాయకుడు, దయకలిగిన మనిషి. ఇంటి నిర్వహణలో మా పెత్తల్లి గారు పూనుకుని నిలబడవలసి వచ్చేది. ఆమెకు ఎనమండుగురు సంతానం. వార్ని నిగ్రహించేది. మా నాన్న గారికుండే పలుకుబడి వారికి లేకపోవడంతో ఆమెకు కష్టాలు ఎక్కువ.

మా పెత్తల్లి గారి ఆడబడుచు బాల్యంలోనే భర్తను కోల్పోయి వీరి దగ్గరేవుండేది. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసేది. మా పెత్తల్లికి ప్రేమ వుండేది కానీ, పిల్లల్ని నియంత్రించడానికి ఒక రకమైన గాంభీర్యం, అదమాయింపు వుండేవి. మా పెదనాన్న నా పట్ల అభిమానంగానే వుండే వారు. తన పిల్లల్ని, నన్ను ఒక్క లాగే చూసుకునే వారు.

నేను చెట్టుపదిలంలో వున్నప్పుడే 1934 నుంచే పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. పెత్తల్లి వాళ్ళింట్లో వచనంలో రామాయణం, భారతం, భట్టి విక్రమార్క వంటి పుస్తకాలు 10-15 వుండేవి. అప్పట్లో అన్ని పుస్తకాలు ఒకే ఇంట్లో వుండటం చాలా అరుదే. ముఖ్యంగా పల్లెటూరిలో. అదీ గాక, మా పెదనాన్న గారికి చాలా పద్యాలు, శ్లోకాలు వచ్చు. అవన్నీ నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ‘కట్టు పద్యాలు’ చదవమనే వారు. ఇప్పుడు పాటలకు అంత్యాక్షరి ఎలా వుండేదో, అప్పుడు పద్యాలకు అలా వుండేది. అది నేను సెయింట్ ఆంథొనీ స్కూలులో ఉపాధ్యాయుడిగా వున్నంతవరకు కూడా కొనసాగింది. ఒకసారి నేను, మసూన గారు మా బడి పిల్లల్ని ఆలిండియా రేడియోకి తీసుకెళ్ళినప్పుడు ఈ కట్టు పద్యాలు చదివించడం కూడా నాకు గుర్తు.

కొన్ని వందల పద్యాలు నోటికొచ్చేవి. మురపాక స్కూలులో 2వ తరగతి చదువుకుంటున్నప్పుడు కూడా. శతకాలు- కృష్ణ శతకం, సుమతీ శతకం, దాశరథీ శతకం, భక్త చింతామణి శతకం వంటివి మా పెదనాన్న గారి దగ్గర చాలా వుండేవి.

నేరుగా రుణం తీర్చడానికి వీలు కానప్పుడు ఇంకో విధంగా తీరుస్తారు. అలా నా ఒడుగుతో పాటు, మా పెత్తల్లి కొడుకు ఉపనయనం, ఇంకేదో శుభకార్యం ఆ వేసవి సెలవుల్లో జరిపారు. అప్పట్లో ఉపనయనాలు కూడా 5 రోజులు జరిగేవి. నా పెద్ద చెల్లి వివాహం 5 రోజులు జరిగింది. నా పెళ్ళి కూడా బహుశా 5 రోజులు జరిగింది. మా రెండో చెల్లి వివాహం దగ్గర నుంచి మా తమ్ముడి వివాహం దాకా మూడు రోజులు. మా పిల్లల వివాహం రెండు రోజులు. తర్వాత ఒక రోజుకి కూడా మారాయి.

ఇంకో సంగతి ఏమిటంటే, కుటుంబం అన్నాక ఘర్షణలు సహజం. అలా మా పెత్తల్లి గార్కి, మా తండ్రి గార్కి ఘర్షణ వచ్చినప్పుడు, మా రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా కాలం పాటు తెగిపొయాయి . నేను మాత్రం కొనసాగిస్తూ వచ్చాను.

ఆ విధంగా చెట్టుపదిలంలో జీవితం బాగానే వుండింది. మరపురాని జీవితమే. కానీ 6వ తరగతి పూర్తి కాలేదు. 1935 ఏఫ్రిల్లో వచ్చిన పరీక్షా ఫలితాల్లో నేను పోయినట్టు వచ్చింది. అక్కడ నా చదువు సన్నగిల్లింది. కానీ, మురపాక నా బాల్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో, చెట్టు పదిలం కూడా అలా ప్రభావితం చేసింది.

శ్రీకాకుళంలో చదువు

మా నాన్నగారు మళ్ళీ ఆలోచించి నన్ను శ్రీకాకుళానికి పంపడానికి నిర్ణయించుకున్నాడు. 1935, జూన్లో శ్రీకాకుళం వెళ్ళాం. మా ఊర్లో జగన్నాధస్వామి ఆలయం వుండేది. దాంట్లో భద్రం సత్యనారాయణాచార్యులు గారని అర్చకులుండే వారు. వాళ్ళన్న గారు పుల్లయ్య గారు శ్రీకాకుళంలో పాలకొండ రోడ్డులో కోదండరామస్వామి ఆలయంలో అర్చకులు. పుల్లయ్య కుటుంబం వారు మా వూరిలో జరిగే వుత్సవాలకు వస్తుండే వారు. సత్యనారాయణ గారు కూడా శ్రీకాకుళంలో జరిగే విశేష పూజలకు హాజరు అవుతుండే వారు. అంచేత మా నాన్న గారికి పుల్లయ్య గారి కుటుంబంతోనూ, నాకు వారి పిల్లల్తోనూ సాన్నిహిత్యం వుండేది. అంచేత నేను బెంగెట్టుకోవడం వుండదని ఆయనింట్లో వుంచి చదివిద్దామనుకున్నారు. అది కుదరలేదు. కారణం, బహుశా నేననుకోవడం, వారు వైష్ణవులు, మేము నియోగులం.

బ్రాహ్మణుల్లో వైదికులు, వైదికులు కాని వాళ్ళు వుంటారు. వైదికులు వేదం, పూజలు, పెళ్ళిళ్ళు, వేదానికి సంబంధించి సమస్తం వాళ్ళు చూసుకొంటారు. వారికి మడి ఆచారలు ఎక్కువ. వైదికులు కాని వారు వుద్యోగాలు, తక్కిన పనులు చూసుకుంటారు. శాఖల గురించి నాకు పెద్దగా తెలియదు. నేనెప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ఇందులోనే మధ్వులు అనే తెగ వుండేది. కోదండరామస్వామి ఆలయానికి నైఋతి మూలలో ఇంకొక ఆలయం వుండేది. అందులో దేవుని పేరు ముఖ్య ప్రాణమూర్తి. అంటే ఆంజనేయుడు. దానికి ధర్మకర్త చక్రపాణి వెంకట్రావు గారు. ఆ దేవాలయం భూములు ఎక్కడో పల్లెటూర్లోవుంటాయి. ఏటా దేవాలయానికి, ఈ ధర్మకర్తకు వడ్లు, మొదలైనవి వస్తాయి. చక్రపాణి వెంకట్రావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. శ్రీకాకుళంలోనే ఒక బాలికల వున్నత పాఠశాల(8వ తరగతి వరకు)లో ఆయన ఉపాధ్యాయుడు. పుల్లయ్య గారు ఆయనతో మాట్లాడి నన్ను వాళ్ళింట్లో పెట్టుకోడానికి ఒప్పించారు. మా నాన్న గారు నెలకు పది రూపాయలు ఇచ్చేవారు ఆయనకు(అప్పుడు బియ్యం క్వింటాల్ 7రూపాయలు, బంగారం తులం 35రూపాయలు).

వెంకట్రావు గారు చదువుకున్నది 8వ తరగతి మాత్రమే. అయితే ఒక రకమైన హయ్యర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేసి వుండచ్చు. 5వ తరగతి చదివిన వారికి లోయెర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ అనివుండేది. స్కూల్ ఫైనల్ పాస్ అయితే సెకండరీ గ్రేడ్ వుండేది. ఆయన హయ్యర్ గ్రేడ్ పాస్ అయ్యారు. కానీ, ఆ రోజుల్లో 8వ తరగతి చదివిన వారికి కూడా ఇంగ్లీషు బాగా వచ్చేది. వెంకట్రావు గారికి కూడా ఇంగ్లీషు బాగా వచ్చు.

వాళ్ళింట్లోనే నాకు భోజనం, పడక, కష్టం, సుఖం. నా జేబు ఖర్చుకి రూపాయిలో ఎనిమిదవ వంతు బేడ అనివుండేది. ఆ డబ్బులు కూడా మాస్టారు గారి దగ్గర వుండేవి.

1935లోనే శ్రీకాకుళంలో రామకృష్ణ సినిమా హాలు పుట్టింది. సాయంకాలం అయ్యేసరికి ఒక కర్ర స్తంభం మీద ఒక పెట్టె లాంటిది వుంటుంది. అందులో కిరసనాయిలు పోసి దీపాలు వెలిగించే వారు. 1935 లేదా 1936 చివర్లో కరెంటు వచ్చింది.

చక్రపాణి మాస్టారు ఇంట్లో మడి, అచారం విపరీతం. లెట్రిన్‌కి వెళ్ళినా మనిషి కఠి స్నానం చెయ్యాలి. తెల్లారి వెళ్ళి ఏటిలో స్నానం చెయ్యాలి. ఏటి పక్కన వుండే జీవితం చాలా భిన్నంగా వుంటుంది. బట్టలుతకడం, బహిర్భూమి, స్నానాలు, జపాలు, తపాలు అన్నీ బాల్యంలో నన్ను ఆకర్షించిన విషయాలు.

ఆడవాళ్ళు బిందెతో వచ్చి స్నానం చేసి, వర్షాకాలం అయితే గుడ్డతో నీళ్ళు వడకట్టుకుని, ఆ బిందెను మోసుకెళ్ళి’ఎంగు(ఇండుగ)పిక్కలు’ అని వాటిని అరగదీసి, ఆ జిగురు బిందెలో కలిపితే, అందులోని మట్టి అడుగుకు చేరేది. పైన నీళ్ళు తాగేవారు. అక్కడ బావులన్నీ ఉప్పునీటివి.

మేము వుండే కోదండరామస్వామి ఆలయానికి తూర్పు వైపు ఒక సత్రం వుండేది. దక్షిణం వైపు రోడ్డు, పడమటి వైపు ఏటికి వెళ్ళే రోడ్డు.

రోజూ తెల్లతెల్లవారుతుంటే మొదట్లో లేపేవారు. చలి కాలాల్లో చలికాచుకునేవాళ్ళం. తర్వాత క్రమశిక్షణ అదీ పెంచడానికి తెల్లవారుఝామున 4గంటలకు లేపేవారు. హరికేన్ లాంతరు పెట్టుకొని నేను చదువుకోవాలి. వేసవి కాలంలో ఆయన గచ్చు మీద పరుపు వేసుకుని పడుకుంటే, నేను కింద పడుకునే వాణ్ణి. తెల్లవారుఝామున 4గంటలకు లేచి, నేను చదువుతూ ఏ మాత్రం కునికినా పఠీమని పడేది. ఆయనకు కోపం అని కాదు, క్రమశిక్షణ అని ఆయన నమ్మకం.

ఆయన తల్లిగారు వుండే వారు. అప్పట్లో వైధవ్యాలు చాలా ఎక్కువ. ఆవిడ చిన్నప్పటినుంచీ వైధవ్యం మోస్తూ వుంది. ఆ తల్లికి ఇతడు ఒక్కడే కొడుకు. ఆవిడకి ప్రతి ఆదివారం అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయానికి వెళ్ళే అలవాటు వుంది. ఆవిడకి నేను అంగరక్షకుడ్ని. అదే నేను ఆవిడకి చేసే వుపచారం.

పిన్ని గారికి నేను వెళ్ళేసరికి ఆంజనేయమ్మఅని రెండేళ్ల ఒక అమ్మాయి. నేను వెళ్ళాక ఒక కుర్రాడు పుట్టాడు. ఆంజనేయమ్మకు 4-5 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళింట్లోనే వున్నాను.

దిగులు మాత్రం వదిలేది కాదు. ఎప్పుడూ ఇంటి తలుపులోనే వుండే వాణ్ణి. మా వూరి నుంచి కానీ, చుట్టుపక్కల వూర్ల నుంచి లక్ష్మీ వారం సంతకు కానీ, వైద్యానికి కానీ వచ్చేవారు. అలా వచ్చిన వారిని చూస్తే మా అమ్మ నాన్నలను చూసినట్లు వుండేది. ఆ అనుభవాలతోనే ‘అభిమానాలు’ అనే కథ రాసాను. అoదులోనే కుర్రాడిగా, పినతండ్రిగా రెండు పాత్రలు పోషించాను. ఎలా వుంటే బాగుంటుందో అనేది పినతండ్రి సృష్టి. నేను నేనే. మా నాన్న గారు నాన్న గారే. మా అమ్మ అమ్మే. ఆ కుర్రాడు పడ్ద కష్టాలు అన్నీ నావే.

ఇప్పటి రాగింగ్ అప్పట్లో కూడా వుండేది. దారిలో పోతూ పోతూవుంటే ఎవడో కుర్రాడు వచ్చి టక్కున కాలు మీద కాలు వేసి నొక్కుతూ వుండే వాడు. వాడికి నా మీద ద్వేషం, పగ ఏమీ లేవు. వూరికే అలా చేసేవాడు. పల్లెటూరి వాళ్ళని బస్తీ వాళ్ళు చాలా హీనంగా చూసే వారు. వాళ్ళకే నాగరికత బాగా తెలిసినట్టు “పల్లెటూరి బైతు” అని పిలిచే వారు.

ఒకసారి నేను, పాలిశెట్టి విశ్వనాథం అని మా వూర్లో పొరుగునే వుంటాడు, బస్సులో వెళ్తున్నాం. ఆయన కాంగ్రెస్ కార్యకర్త, ఎన్నికలలో నిలబడేవాడు, షావుకారు. అలాంటి అతన్ని క్లీనరు చులకనగా మాట్లాడుతున్నాడు. నేను, ”ఏమిటనుకుంటున్నావ్ అతన్ని? నిన్నూ, నీ బస్సునూ, యజమానినీ కూడా కలిపి కొనగలడు. పల్లెటూరి వాళ్ళంటే అంత చులకనా?” అని కడిగాను. ఆ అనుభవాలు నన్ను అలా ప్రేరేపించాయి. ఇది జరిగే నాటికి నేను పదవతరగతి.

తర్వాత, చక్రపాణి మాస్టారు గారు ఇంగ్లీషు బాగానే చెప్పే వారు. తెలుగు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎటొచ్చీ లెక్కలు అడ్డేసేది ఆయన్ని. పల్లెటూరినుంచి వచ్చిన ప్రాథమిక పాఠశాల పిల్లలు, పట్నాలకి వెళ్ళినప్పుడు నిశ్చయంగా లెక్కల్లో బాగా వుంటారు. కనీసం మా వూరి పరిస్థితి అది. నాకు లెక్కలు బాగా వచ్చేవి.

ఒక సంవత్సరం పాటు ట్యూషన్ చెప్పి, తర్వాతి సంవత్సరం రెండవ ఫారంలో చేర్చారు. 6వ తరగతి ఫెయిల్ అయ్యాను కాబట్టి, మళ్ళీ 6లో వెయ్యాలి. హైస్కూలులో ఫస్ట్ ఫారంలో సీట్ ఇవ్వరు. ఎందుచేతంటే దానికి కావాల్సిన ఇంగ్లీష్ అవీ నా దగ్గర వుండవు కాబట్టి. అంచేత ఫస్ట్ ఫారం ప్రయివేటుగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఫారంలో జాయిన్ అయ్యాను.

1935-36-మొదటి ఫారం
1936-37- రెండవ ఫారం
1937-38-మూడవ ఫారం దాకా మాస్టారు ఇంట్లో వున్నాను.

నేను అలా వుంటున్నాను అని తెలిసి మా ఎస్టేటు మేనేజరు బులుసు అప్పలనర్సయ్య గారు తన ఇద్దరు కొడుకుల్ని ఈ మాస్టారు గారి దగ్గర చేర్చారు. ఆయన చాలా మంచి వ్యక్తి. పెద్ద వుద్యోగులందరూ అజమాయిషీ, పనులు జరగడానికి గొంతులు పెంచీ అవీ మాట్లాడుతారు కానీ, లోపలి వ్యక్తులు వేరు, తీరు వేరు. మేము ముగ్గురం కూడా పేయింగ్ స్టూడెంట్లము, గెస్టులము. మమ్మల్ని చూసి చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో వుండేటటువంటి కాళింగుల కుటుంబాల నుంచి, మునసబు కొడుకులు అలాంటి వాళ్ళు నలుగురు చేరారు. ఇంకొక వూరినుంచి ఒక బ్రాహ్మణ కుర్రాడొచ్చాడు. ఇలాగ అక్కడ శిష్యబృందం పెరిగింది. అక్కడ లెక్కలు ఏదైనా ఇబ్బంది వస్తే మాస్టారు గారు, ”రామా! ఈ కుర్రాడికి లెక్కలు ఏదో ఇబ్బందంట చూడు” అనే వారు.

ఇంగ్లీషు ఆయన చెప్పేవారు కానీ, ఎక్కేది కాదు. స్కూల్ ఫైనల్‌లో కూడా 35 పాసు మార్కులు అయితే, 36 వచ్చేవి నాకు. చరిత్ర, సైన్సు లాగించే వాణ్ణి కానీ, భూగోళం పెద్ద కష్టంగా వుండేది. దానిక్కారణం ఏమిటి అని నేను చాలా అనుకునేవాణ్ణి. ఒక్క మ్యాపు చూసి పేరు చెప్పేయడమే తప్ప, ఒక ప్రాంతం గురించి చెప్పాలనుకొంటే, అక్కడి వాతావరణ పరిస్థితులు, ముఖ్య పట్టణాల పేర్లు వరుస క్రమంలో చెప్పే అలవాటు అప్పుడు వుండేది కాదు.

ఆ ఇంట్లో పిల్లలందరూ వయసులో నా కన్న పెద్ద వారే. కానీ, ఇంట్లో సీనియర్ని కాబట్టి నాకు ఇంట్లో చనువు ఎక్కువ. కాబట్టి మాస్టారుకి బజారు పనులు అన్నీ నేనే చేసేవాణ్ణి. అంతే కాకుండా ఆయనకు కిళ్ళీలు కట్టడం, కాళ్ళు పట్టడం వంటి ఉపచారాలు నాకే వుండేవి. నేనూ సంతోషంగానే చేశాను.

ఈ కుర్రాళ్ళు వచ్చిన తర్వాత కొంత దిగులు తగ్గింది నాకు. కానీ వీరింట్లో భోజనంలో తేడా వచ్చింది. ఆ భోజనంలో తేడా నా ఆకలికి కారణమయ్యింది. చిరు తిండ్లు అలవాటయ్యాయి. వాటికి డబ్బుల కోసం మాస్టారు గారి బజారు సామాన్లు తెచ్చేటప్పుడు పిక్కడం. దాంతో అనారోగ్యం మొదలైంది. మరికొన్ని కారణాల వల్ల జబ్బు పడ్డాను. వూపిరి తీస్తే వచ్చే నొప్పిని గుండె నొప్పని అనుకునే వాణ్ణి. మొత్తం మీద డాక్టరు గారు ”ఈ కుర్రాన్ని ఒక సంవత్సరం చదువు మానిపించెయ్యండి”అన్నారు. జనవరిలో జరిగిందిది. ఇంటికి తీసుకెళ్ళారు.

నాన్న గారు ఫీజు మాత్రం కట్టారు. భద్రం సత్యనారాయణాచర్యుల వారు ఫీజు ఎలాగూ కట్టారు కదా పరీక్షల్లో కూర్చోనివ్వండి అన్నారు. పుల్లెల సత్యనారాయణ గారని మురపాకలో మా ఎదురిల్లు. ఆయన మా పక్క వూరిలో కరణం. ఆయన అల్లుడు సోమంచి వాస్తవ రావు గారని శ్రీకాకుళం గుడి వీధిలో వుండే వారు. ఆయన మంచి కవి. శంకరుడి గ్రంథాలు అవీ తెలుగు చేసే వారు. రామాయణం రాస్తుండే వారు. వాళ్ళింట్లో చేర్చారు మా నాన్న నన్ను. వాళ్ళింట్లో పంచ గది అని ఒక చిన్న గది వుంది. నా వయసు వాళ్ళు నిలువుగా పడుకోవడానికి స్థలం వుంటుంది. ఆ గదిలో వుంటూ హోటల్లో తింటుండేవాణ్ణి. హోటల్ తిండి, చిరు తిళ్ళ కారణంగా మళ్ళీ జబ్బు చేసింది. 3 నెలల తర్వాత ఏప్రిల్లో జరిగే పరీక్షలో కూర్చొని మితృడు చదువుతూ వుంటే, విని రాసి పాసయ్యాను.

5వ ఫారం పాసయిన తర్వాత ఒక సంవత్సరం ఇంట్లో వుండిపోయాను. అప్పుడు మా వూరి రామకృష్ణ గ్రంథాలయంలో నవలలు, ఇతర పుస్తకాలు చదివే వాణ్ణి. చదవగలిగినంత చదివేసాను. అది నా సాహిత్య జీవితానికి ఆధారం అయ్యిందని నేను అనుకొంటున్నాను.

మాస్టారు ఇంట్లో వుండగానే పద్యాలు వినే అలవాటుంది కదా? ప్రతి పద్యానికి ఒక లయ వుంటుంది. ఆ లయ పడితే కవిత్వం రాని వాడు కూడా గణ, యతి, ప్రాసలు సరిపోయేట్టుగారాయగల్గుతాడు. అలాగా ఒకటి రెండు పద్యాలు రాసాను. ఎప్పుడో చూయించాను. “నువ్వే రాసావా?” అని అడిగారు. నేనే రాశానన్నాను. దానికి ఆయన “పద్యం రాయాలంటే చంధస్సు అని వుంటుంది. అందులో కొన్ని గణాలతో, కొన్ని అక్షరాలతో పద్యం ఆరంభించేట్టయితే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి.” అన్నారు. నేను రాసిన పద్యాల్లో ‘శ్రీ భు’ అని ఏదో వచ్చిందట. ”ఆపు. ఆపు” అన్నారు. ఏమిటంటే శ్రీ తర్వాత భు వస్తే శ్రీ ఎగిరిపోతుందన్నాడు. అలా నన్ను భయపెట్టి కవిత్వం జోలికి వెళ్ళొద్దన్నాడు. ఇక నేనూ దాని జోలికెళ్ళలేదు. తర్వాత ఎప్పుడో చాన్నాళ్ళకి నేనూ రాయగలనన్న వుద్దేశంతో కొన్ని పద్యాలు, గేయాలు రాసాను.

పుల్లెల సత్యనారాయణ రావు గారి అల్లుడు వాస్తవ రావు నన్ను చాలా అభిమానంగా చూసే వాడు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అప్పట్లో స్రీలలోవుండేటటువంటి అలవాటు పక్కవాళ్ళను తేడాగా, తమ పిల్లల్ని దగ్గరగా చూడటం వున్నప్పటికీ, నన్ను ఇబ్బంది పెట్టలేదు.

శ్రీకాకుళంలో నేను 1935 నుండి 1942 వరకు వున్నట్టు లెక్క. మధ్యలో ఒక సంవత్సరం లేను. గుడి వీధిలో వున్నపుడే రామరాజా రావు అనే స్నేహితుడుండే వాడు. అతనికి పెళ్ళయిన తర్వాత కూడా, విశాఖపట్నంలో పక్క పక్కఇళ్ళల్లో వుంటూ స్నేహంగా వుండేవాళ్ళం.

స్కూలులో చదువుకునేటప్పుడు మాకు ఇద్దరు మేస్టార్లుండే వారు. ఈశ్వర సత్యనారాయణ శర్మ ఒకరు. ఇంకొకరు మల్లాది వెంకటకృష్ణ శర్మ అనుకుంటా. శ్రీకాకుళం వాడే అతను. సినిమాల్లో నటించేవాడు. విజయ అనే పత్రికను నడిపాడు. ఆధునిక కవిత్వం పట్ల శ్రద్ధ వుండేవాళ్ళతోనూ పరిచయం అయ్యింది. ‘పూ.భ.’ అని ఒక రచయిత వుండే వాడు. ఆయన మొదట్నుంచి గల్పికలు రాసేవాడు. వీళ్ళ ప్రభావం నన్ను సాహిత్యం వైపు తిప్పుంటుంది అని అనుకుంటున్నాను. స్కూలులో చదువుకునే రోజుల్లో నా కన్న ఒకటీ రెండు ఏళ్ళ సీనియర్లు కూడా వాళ్ళ రచనలు పత్రికల్లో వచ్చేవని చెప్పేవారు. ఆ ప్రభావం కూడా వుండివుండొచ్చు.

హైస్కూలులో పెళ్ళయిన వాళ్ళు కూడా చదువుతూ వుండే వాళ్ళు. ఒకరిద్దరు సంతానవంతులు కూడా వుండివుండొచ్చు. 40 మంది వున్న తరగతిలో 4-5 గురు మాత్రమే అమ్మాయిలు. ఈశ్వర సత్యనారాయణ శర్మ పాఠం చాలా బాగా చెప్పేవారు. కొంచెం చమత్కారం, కొంచెం కితకితలు పెట్టే స్వభావం వుండేది. బాగా పండితుడు. మల్లాది వెంకటకృష్ణ శర్మ ముందు పద్యం చదివి, తర్వాత పరిఛ్ఛేదన చేయించి, తర్వాత ప్రతిపదార్థం చెప్పి, ఈ అర్థాలన్నీ ఒక క్రమంలో పెట్టి దండాన్వయం చెప్పించి, తర్వాత తాత్పర్యం చెప్పేవారు. ఇదంతా అయ్యేసరికి పద్యం నోటికి వచ్చేది. తర్వాత పంచ భూతాలు, చతుర్ధశ భువనాలు ఆయన చెప్పిన తీరు వల్ల ఇవాళ్టికీ నాకు కంఠతా వచ్చు. తెలుగులో మంచి ప్రావీణ్యం వుంది. శ్రీనాథుని పార్వతీ పరిణయం చెప్పిన తీరు వల్ల మొత్తం పద్యాలన్నీ కంఠస్తం వచ్చేసాయి. వచనం కూడా చాలా చక్కగా చెప్పే వారు. ఆయన మంచి పునాది వేశారు.

బోధకులైన వుపాధ్యాయులు వేరు, వుద్యోగులైన వృత్తి వుపాధ్యాయులు వేరు. అప్పట్లో బోధకులైన వుపాధ్యాయులువుండేవారు. ఇప్పుడు లేరని అనను, వున్నారు. కానీ వాళ్ళకే జ్ఞానం అంతంత మాత్రం. పైగా డబ్బు యావ. గురువుల్ని ఎగతాళి చేసే పిల్లలంటే నాకు బాగా కోపం వచ్చేది.

అప్పట్లో సినిమాలు వచ్చినా, నాటకాల జోరు వుండేది. హరికథల జోరు ఇంకా ఎక్కువగా వుండేది. దురదృష్టం ఏమిటంటే శ్రీకాకుళంలో కూడా సభలైనప్పటికీ ద్వారం వెంకటస్వామి నాయుడిని చూడలేపోయాను. ఆదిభట్ల నారాయణ దాసు హరికథ కూడా స్వయంగా ఎప్పుడూ వినలేదు. చైత్ర శుద్ధ పాఢ్యమి నాడు శ్రీరామనవమి వుత్సవాలు జరుగుతాయి కదా, అవి శ్రీకాకుళంలోనూ జరిగేవి. పరీక్షలకు దగ్గరి రోజులవడం మూలాన వెళ్ళలేదు.

ఎప్పుడూ నా మీద అజమాయిషీ చేసేవాళ్ళు ఒకరుండే వాళ్ళు. గుడి వీథిలో చక్రపాణి మాస్టారు గారైతే, ఇక్కడ పుట్రేవు సత్యనారాయణ గారని రామరాజారావు అన్నగారు. ఆయన నా చదువు సంగతి చూసే వారు. పదింటికల్లా పడుకుని తెల్లవారుఝామున నాలుగు గంటలకు లేవాలి. ఈ కారణాల వల్ల ఆ నాటి కల్చరల్ యాక్టివిటీస్ ప్రయోజనం పొందలేకపోయాను. అది అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను.

అప్పటి సినిమాల సంగతి చిత్రంగా వుండేది. ఏటి అవతల లక్ష్మి టాకీసు అని టెంటు సినిమా హాలు వుండేది మొదట్లో. నేను వచ్చిన తర్వాత భవనం కట్టారు. రామకృష్ణ సినీ మహల్ మాత్రం మగటిపల్లివారిదనుకుంటాను. అప్పుడు నేల టికెటు ఖరీదు అణా(రూపాయిలో పదహారోవంతు). మా నాన్న గారొస్తే బెంచీ, లేదంటే మేమెప్పుడూ నేలకే వెళ్ళేవాళ్ళం. మొట్టమొదట ‘భక్త కుచేల’ చూశాం(1935 చివర లేదా 1936 మొదట). చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడైనా హిందీ సినిమాలు వేస్తే, అక్కడ సోడాలు అమ్మే కుర్రాడు అనువాదకుడిగా తయారయ్యే వాడు. అవి సింగిల్ ప్రొజెక్టర్ సినిమాలు. సినిమాలకు వెళ్ళేవాళ్ళంతా కూడా మరచెంబులూ, చాపలూ పట్టుకెళ్ళేవారు. ప్రతి వారికిన్నీఇంటర్వెల్లో చిరుతిళ్ళు తినటం, సోడాలు తాగడం, కిళ్ళీ వేసుకోవడం ఒక సరదా. మంచి సినిమా ఆడుతుందంటే పల్లెటూరి నుంచి జనాలు బళ్ళ మీద వరసగా వచ్చేవాళ్ళు.

కూర్మం యాత్ర అనివుండేది. మేం హైస్కూలులో నాలుగవఫారం చదువుకునే రోజుల్లో మాకు వంతెన అగుపడుతూ వుండేది ఎదురుగా. ఆ వంతెన మీద ఇవాళ బస్సులతో ట్రాఫిక్ జాం ఎలాగ అవుతుందో, అప్పుడు బళ్ళతో ట్రాఫిక్ జాం అయ్యేది. ఒకరిని ఒకరు ఓవర్టేక్ చేసుకోవడంతో ప్రమాదాలు జరిగేవి. బహుశా వందల బళ్ళు వుండుంటాయి. మాకు మాత్రం వేలకొద్దీగా అగుపడేవి. ఆ కూర్మం యాత్రకు వెళ్ళడానికి మాత్రం మా నాన్న గారు ఒప్పుకునేవారు కాదు. మా వూర్లో అందరూ వెళ్ళే వారు. హోలీకి జరుగుతుందీ యాత్ర.

మా నాన్న గారు శూద్రులను తక్కువగా చూసే వారు కాదు గానీ, మా కుటుంబం బ్రాహ్మణ కుటుంబంలా వుండాలనుకొనే వాడు. అందుచేత చాలా కోల్పోయాను నేను. కానీ ఆయన పడుకున్నప్పుడు చాలా చేసేవాడిని.

నేను మధ్యలో ఒక సంవత్సరం వూర్లో వున్నాను కదా, అప్పుడు ప్రతి వారం ఒక ఇంజక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. అప్పట్లో బస్సులు చాలా తక్కువ. వుదయం ఒకటి, సాయంత్రం ఒకటి వుండేది. సైకిలు మీద నా కంటే ఒక సంవత్సరం పెద్ద కుర్రవాడు నన్ను తీసుకెళ్ళే వాడు. నేను వెనుక కూర్చొనే వాణ్ణి. 11గంటలకు ఆసుపత్రికి వెళ్ళాలి. మళ్ళీ భోజనం టైంకి వచ్చేయాలి మంచి ఎండలో. అలా సంవత్సరం పాటు ఇంజక్షన్లు తీసుకున్నాను.

అప్పట్లో ప్రభుత్వఆసుపత్రులు ధర్మసంస్థల్లా వుండేవి. డాక్టర్లు కూడా బాగా వైద్యం చేసేవారు. అప్పుడంతా అందరం నిలబడాల్సిందే. ప్రత్యేకతలంటూ ఏమీ లేవు. దరిమిలా జనాభా పెరగడం, డబ్బు మీద వ్యామోహం, లంచాలూ-ఇవన్నీ తర్వాత వచ్చినవి.

మళ్లీ శ్రీకాకుళం వచ్చాను. అప్పట్లో అరిథ్మెటిక్ మేథమేటిక్స్ అందరికీ కావాల్సిన సబ్జక్ట్. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథ్స్ ఆప్షన్ వుంటుంది. అందులో 4లేదా 5వ ఫారంలో మేథ్స్ ఎంచుకొన్నాను. అది అప్పట్లో ఇంగ్లిషులో వుండేది. నేను 10వ తరగతికి వచ్చిన తర్వాత తెలుగులోకి మారిపోయాను.

ఆ ఏడాది మాకు రామనారాయణ గారని ఒక మాస్టారుండేవారు. చాలా శ్రద్ధగా పాఠం చేప్పే వారు. తమ్మా లక్ష్మీనరసింహం గారు జనరల్ మేథ్స్ చెప్పే వారు. ఇద్దరూ కూడా మంచి బోధకులు.

అందులో తమ్మా మాస్టారు పాఠం చెప్పే తీరు నాకు బాగా ఒంటబట్టింది. అంచేత గణితంలో ప్రవేశమే కాకుండా, గణితం ఎలా చెప్పాలి అన్నది ఆయన దగ్గర్నుంచి గ్రహించాను. అప్పుడు ఆ దృష్టితో చూడలేదు కానీ, ఆ తర్వాత దాని ప్రభావం నా మీద వుండిపోయింది. ఆయన ఏ లెక్క ఎలా చేయాలో చెప్పే వారు కాదు. క్లాసులో ఒక్కొక్కరిని నిలబెట్టి ఇదెలా చేయాలి అని అడిగే వారు. అందులో తప్పు చెప్పగానే, అతడే కాదు, తరగతి మొత్తం గ్రహించేలా చేసే వారు. దాని గురించి నేను తర్వాత ఒక వ్యాసం కూడా రాసాను.

తెలుగు, గణితాల్లో 50కి పైగా వచ్చేవి మార్కులు. తెలుగులో బహుశా తరగతిలో రెండవ స్థానం నాది. తక్కినవి బొటాబొటి. ఇంగ్లీషులో 36.

అలా పదవతరగతి పాసయ్యాను. నాతో పాటు చదువుకున్న ఎస్టేట్ మేనేజర్ గారి అబ్బాయిల పరీక్ష పోయింది. అంటే 6వ ఫారం చదువుకున్న కుర్రాడు పదవతరగతికి వచ్చాడు. పదవతరగతి చదువుతున్న కుర్రాడి పరీక్ష పోయింది. ఆయన శ్రీకాకుళం నుంచి విజయనగరానికి కుటుంబాన్ని మార్చాడు. అక్కడ ఆయనకు సొంతిల్లు వుంది. నన్ను తోడుగా తీసుకెళ్తే బాగుంటుందని, సొంతింట్లో వుంచి, అక్కడే బడిలో చేరిస్తే బాగుంటుందని మా నాన్న గారిని అడిగారు. నన్ను షార్ట్ హ్యాండ్, టైపింగు నేర్చుకోవడానికి, ఆ పిల్లలకు గణితం చెప్పడానికి పెట్టారు. అక్కడ 6నెలలు వున్నాను. అక్కడ కూడా వెర్నాక్యులర్ లైబ్రరీ అని వుండేది. అక్కడికి నిత్యం వెళ్ళే వాడిని.

అక్కడ ఒక ఆర్టిస్టు బొమ్మలెయ్యడం చూసి, నాకు బొమ్మలెయ్యాలని సరదా పుట్టింది. ఏవో వేసేవాణ్ణి కొన్ని. సినిమా నటులవి. నారదుడి వేషం వేసిన టంగుటూరి సూర్యకుమారి మొత్తం బొమ్మ, కొంత మందివి బస్ట్ సైజువి వేసాను. కొన్ని ప్రకృతి చిత్రాలు వేస్తుండేవాణ్ణి. తర్వాత ఇంటికొచ్చేసాను.

మా నాన్నగారు ఎంతో బలవంతం చేసారు నన్ను వూర్లోనే కరణీకం చేయమని. కానీ, నా మనస్తత్వానికి అది పడదు. నేను చదివిన సాహిత్య ప్రభావం వల్ల, నాకు అప్పటికే స్వతంత్ర భావాలుండేవి. తండ్రి మాటల్ని కొన్నిటిని లెక్కచెయ్యకుండా, కొన్నింటికి మాత్రం దాసుడిగా నన్ను జీవింపచేసాయి.

మా తమ్ముడు స్కూల్ ఫైనల్ చదువుకున్నాడు. కానీ, వాడికీ, మా నాన్నకీ, నాకూ ఛాయామాయలు తెలుసు. కానీ ఎప్పుడూ అమలు చేయలేదు. మా పెదనాన్న గారిది 4వూర్ల కరణీకం. కానీ, ఆయన జీవిత కాలంలో ఒక్క నయాపైసా మిగల్చలేదు. పైగా కూటికి, వాటికి కష్టమయ్యేది. భూమీ పుట్రా ఏమీ సంపాదించలేదు. కానీ, మా పెత్తండ్రి కొడుకు కరణం అయిన తర్వాత, వాడు రెండు ఇండ్లు, కొంత పొలం ఇలాంటివి సంపాదించగలిగేడు.

మా పెద్దబ్బాయి పాలిటెక్నిక్ పాసయ్యేంత వరకు రేడియో కూడా లేదు మా ఇంట్లో. కరెంటు కూడా వేయించుకోలేదు. అలాగా బ్రతకవలసిన ఆర్థిక స్థాయి. భేషజాలకు పోయేవాణ్ణి కాదు.

మాకు మా నాన్నగారి నాడు కానీ, మా తమ్ముడు నాడు కానీ, ఎక్కడా సెంటు భూమి పెరిగింది లేదు. గడుసుతనం లేదా? వుంది. కానీ, దాన్ని వుపయోగించి సొమ్ము చేసుకున్న వాళ్ళు కాదు. అందుచేత మా నాన్నగారు, మా తమ్ముడు ఏం చెప్పినా వినే వాణ్ణి.

విశాఖపట్నం రాక

నేను 1943లో విశాఖపట్నం వచ్చాను. అప్పటికి మా కుటుంబాల మధ్య మాటల్లేవు. కానీ, మా పెత్తల్లి రెండో అల్లుడి తమ్ముడూ, నేను శ్రీకాకుళంలో కలిసి చదువుకున్నాం. ఆయన ఒకనాడు నన్ను చూసి, “ఏంటి ఇక్కడున్నావ్?” అంటే ఏదో చెప్పాను. “పద ఇంటికి” అంటే, అతనితో పాటు వెళ్ళిపోయాను. అలా, మా పెదనాన్న, పెత్తల్లి, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు పోయేదాక సంబంధం కొనసాగుతూ వచ్చింది. బంధాలు నిలుపుకోవడం అప్పటి తరంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి తరంలో అలా కాదు.

1943 జనవరిలో మా పెద్ద చెల్లెల పెళ్ళి జరిగింది. ఆమె కాపురం విశాఖపట్నంలో. కాపురానికి దిగపెట్టడానికి వచ్చి, అక్కడ హిందు రీడింగ్ రూం చూసి, మరింక వెనక్కి వెళ్ళాలనిపించలేదు. ఆటైపు షార్ట్ హ్యాండ్ ఇక్కడే నేర్చుకుంటానని చెప్పి, మా బావగారింట్లో వుంటూ, క్లాసులకు వెళ్ళే వాణ్ణి. కానీ, ఎక్కువ సమయం హిందూ రీడింగ్ రూములోనే గడిపే వాణ్ణి.

కొన్నాళ్ళ తర్వాత మా చెల్లెలు పుట్టింటికెళ్ళింది. మేము ఇల్లు మారి ఇంకో ఇంటికెళ్ళాము. నేను, మా బావ సొంత వంట. ఆయన నాకు ఒక వుద్యోగం కూడా చూసారు. జడ్జి కోర్టులో కాపీ డిపార్టుమెంటులో కాపీ రీడరు. అది నా తొలి వుద్యోగం. కాపీ అయిన తర్వాత చదవాలి-తప్పులున్నాయో లేదో అని. కాపీ కావాల్సిన వాళ్ళకి కాపీలిచ్చినప్పుడు అమ్యామ్యాలుండేవి. అందరూ పంచుకొనే వారు. నాకివ్వడానికి వస్తే, నేను నిరాకరించే వాణ్ణి. అందరూ పిచ్చివాణ్ణి చూసినట్టు చూసే వారు. నాకు చిరాకేసి వదిలేసాను.

తర్వాత కోటావర్తుల ఎస్టేటులో రిసీవర్స్ ఆఫీసులో టైపిస్టుగా చేరాను. కొద్ది రోజులు అయిన తర్వాత రేషనింగు ఆఫీసులో ఎంక్వైరీ ఆఫీసర్ గా ధరఖాస్తుచేస్తే,వుద్యోగం దొరికింది. పాతది వదిలేసాను. అంటే ఏమిటి? ఒకరిప్పించిన వుద్యోగంలో వాళ్ళ పెత్తనంవుంటుంది. అది సహించే వాడ్నికాను.

రేషనింగు ఆఫీసులో పనిచేస్తున్నపుడుమ.సూ.నా.(మండా సూర్యనారాయణ) అనే స్నేహితుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం జీవితాంతం కొనసాగింది. మా బావగారి నుంచి తప్పించుకొని హిందూ రీడింగ్ రూముకు దగ్గర ఒక రూం తీసుకొన్నాను. అలా నాలుగేళ్ళు గడిచాయి.

సాహిత్యం

అప్పట్లో తెలుగులో వచ్చే అన్ని వార, మాస పత్రికలన్నీ చదివే వాణ్ణి. మొదట రవీంద్రనాథ్ టాగూర్, శరత్‌బాబు రచనలు చదవడం అయ్యాక, పత్రికలలో పరిచయమయినటువంటి కొడవటిగంటి కుటుంబరావు గారు, సభల్లో, సమావేశాల్లో పేర్లు విన్న విశ్వనాథ సత్యనారాయణ, ముఖ్యంగా గుడిపాటి వెంకట చలం రచనలు చదివాను. ఇలా అగుపడ్డ పుస్తకాలన్నీ చదివాను. ఇంగ్లీషు చదివే వాడ్ని కాదు. ఇంగ్లీషు నుoచి అనువాదం అయ్యే వాటిని అట్టే ఇష్టపడే వాణ్ణి కాదు.

కొన్ని సాంస్కృతిక సంఘాలు అప్పట్లోనూ వుండేవి. అవి పరాయి రచయితలు రాసిన అనువాదాలు చదివితే, పరాయి సంస్కృతికి లోబడిపోతామనే ధోరణిని ప్రచారం చేసేవి. అప్పుడే కమ్యూనిస్టు సభల్లో దొరికే కుర్రాళ్ళకి పుస్తకాలిచ్చి చదివించే వారు.

అప్పటికి నేను ‘అప్రజ్ఞాతం’ అని ఒక కథ రాశాను. అది రాసే నాటికే నాకు వర్గస్పృహ గురించి కొంత తెలుసు. స్వయంగా వ్యక్తి మీద ప్రభావం లేకపోయినా, దృక్పథంలో వర్గస్పృహ వుండేది. దీనికి సాయం చేసిన వారు ఇద్దరు నాకు. 1944-45 సరికి అక్కడ వుండినపులవర్తి గోపాలకృష్ణ, వాసిరెడ్డి వెంకటప్పయ్య. వీళ్ళిద్దరు ఆ ఆలోచన కల్గించిన వాళ్ళు. వాసిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త.

కమ్యూనిస్టు భావాల పరిచయం

1946 ఆ ప్రాంతంలో బోధచేసిన వారు అక్కడ ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన యువ రచయితలను చేరదీసి, వారికి పుస్తకాలు ఇచ్చేవాడు. అవి చదివితే, భాష అవిన్నూ, చదివించే గుణం వాటిలో వుండేది కాదు. ఆ పదాలు బోధపడేవి కావు. ఉదా|| ‘కార్మికుడు’ అనే పదం కమ్యూనిస్టు సాహిత్యంలోనే వినబడుతుంది తెలుగులో వుండదు. కమ్యూనిస్టు సాహిత్యంతో పరిచయం లేని వారికి ఆ పదం అర్థం అవడం కష్టం. అలాగే ‘బూర్జువా’ అలాంటివి. పుస్తకాలు చదవడానికిచ్చేవారు. కానీ, సందేహాలు తీర్చుకోవడం కోసం ఆ రోజుల్లో చాలా కష్టపడాల్సి వచ్చేది.

అప్పట్లో కమ్యూనిజంకి వ్యతిరేకంగా వుండే కాంగ్రెస్ వాళ్ళు, విప్లవం వచ్చి, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే, మొట్టమొదట వేసేసేది ఫెలో ట్రావెలర్స్‌నే (కమ్యూనిస్టు పార్టీలో సభ్యులు కాకపోయినా, వారితో ప్రయాణించే వాళ్ళు)అని అంటుండే వారు.

తర్వాత క్లాసుల విషయానికొస్తే, మధ్యతరగతి గోడ మీద పిల్లి అనీ, దాన్ని ఎప్పుడూ అనుమానిస్తూనే వుండే వారు. రైటర్స్ అందరమూ మధ్యతరగతి వాళ్ళమే. ఇవాళ కార్మికులు, కర్షకులు, కూలీనాలీ చేసుకునే వాళ్ళలోంచి, గిరిజనుల, అట్టడుగు జనాల్లోంచి సాహిత్య సృజన చేస్తున్న వాళ్ళున్నారు. కానీ, ఆ రోజుల్లో లేరు. అందరూ మధ్యతరగతి. వీళ్ళందర్నీదొంగలంటుండే వారు. అదొకటి బాధించేది మమ్మల్ని. అంచేత ఇటు, అటుగా వుండేవాళ్ళం.

పులగుర్తి గోపాలకృష్ణ చందాలు కూడా వసూలు చేసేవారు పార్టీ కోసం. అతను చాలా తెలివైన ఆయన. బాగా చదువుకున్న వారు. నా కథల్లో ‘పలాయితుడు’ అని ఒక కథ వుంటుంది. అందులో ఇద్దరు స్నేహితులు, మొదట సినిమాహాల్లో సీటు కోసం కాట్లాడుకుని తర్వాత స్నేహితులవుతారు. అందులో ఒకరు ఈ పులగుర్తి.

“రష్యాలో కానీ, ఇంకే దేశంలోనయినా నాయకత్వంలో వీళ్ళేవుంటారు. మార్క్సు కూడా మధ్యతరగతే. అంచేత మీరిలా ఆలోచించకండి. న్యాయం, ధర్మం ఎటువైపు వుంటే అటుండండి. లేదంటే మీ చందా మీరిచ్చి, మీరు రాసుకోవచ్చు” అనేవాడు.

మార్క్సు గురించి నా అవగాహన అంతా వినికిడి మీద ఏర్పడిందే. నేను కమ్యూనిస్టును ఎప్పుడూ కాలేదు. కాలేను కూడా. అంత చదవడానికి నా జీవితం ఎడం ఇవ్వదు.

ఆ లైబ్రరీలోనే పులగుర్తి గోపాలకృష్ణ గారితో పరిచయం జరిగింది. ఆరుద్రగారు నాకు తెలుసు. కానీ, నేనాయనకు తెలియదు. రోజూ లైబ్రరీకి వచ్చేవాడు. అప్పట్లో అక్కడ చదరంగం ఆడేవారికి ఒకరికి ఒకరం తెలిసే వాళ్ళం కాదు. చదరంగం బల్ల దొరికితే చాలు, కూర్చొని ఆడేవారు. తర్వాతర్వాత రావిశాస్త్రి గారు చదరంగం ఆడడానికి అక్కడికి వచ్చేవారు.

సత్యాన్వేషణలో ఇల్లు వదిలి వెళ్ళాను

1942లో స్కూలుఫైనల్అయ్యి, విజయనగరంలో కొన్నాళ్ళు గడిపి ఇంటికొచ్చిన తర్వాత, ఖాళీ బాగా వుండేది. అప్పుడు చదువుకున్న పుస్తకాల్లో ప్రధానంగా గాంధీ గారి ఆత్మకథ, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వుపన్యాసాలు. ఆ రెండింటి తాలూకా ప్రభావం నా మీద చాలా వుండేది.

సాక్షి హిందూ సంస్కృతిని చాలా గొప్పచేసి చెబుతుండేది. ఆ తర్వాత, మంత్రాలు వున్నట్టు ఆయా వ్యాసాలు చదివితే అర్థమయ్యేది. వేదాలు, ఉపనిషత్తుల గురించి కూడా ఏవేవో అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

తర్వాత నిజమేమిటి? పాపపుణ్యాలు వున్నాయా? దేవుడు వున్నాడా? లేడా? ఇలాంటి ప్రశ్నలతో తల బాగా పగులగొట్టుకునేవాణ్ణి. రోజూ ఇదే, ఇంకేం పనుండేది కాదు. మా వూర్లో శివాలయం వుంటే, దాని మీదికెక్కి లేదా ఎక్కడెక్కడో తిరుగుతూ, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుండేవాణ్ణి.

అప్పుడు ఒక బుద్ధుడిలాగానో, మరొకరిలాగానో, సన్యాసం తీసుకొనో, లేదా తపస్సో, చింతనో చేస్తే సత్యం తెలుస్తుందనుకుని ఇంట్లోనుంచి చెప్పకుండా వెళ్ళిపోయాను.

మొదటిసారి స్టేషను దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాను. ఇంకోసారి పిఠాపురం దాకా వెళ్ళి, పానుగంటి లక్ష్మీ నరసింహం గారింటికివెళ్తే వారు లేరు, పోయారని తెలిసింది. మొదట పెద్దాపురం వెళ్ళి, అక్కడి నుంచి పిఠాపురం నడిచి వెళ్ళాను. ట్రైనులో టికెట్ కొనే వెళ్ళాను. నా దగ్గర డబ్బులు చాలా తక్కువున్నాయి. అక్కడ సత్రాలుంటే, అక్కడే భోజనం.

పిఠాపురంలో వేద పాఠశాల వుందని విన్నాను. అక్కడికి వెళ్ళి, వేదం నేర్చుకోడానికి వచ్చానని చెప్తే, ఇవి వేసవి సెలవులు, అంచేత ఇప్పుడు లేదు, ఫలానా లాయరు గారింటికి వెళ్ళమని చెప్పారు. వారింటికెళ్ళాను. వీడెవడో పారిపోయి వచ్చిన బాపతు అని ఆయనకు అర్థమయ్యింది. “ముందు స్నానం చేసి, భోజనం చెయ్యి” అని చెప్పి ఆయన కోర్టుకెళ్ళిపోయాడు.

భోజనం చేస్తుంటే, ఆ ఇల్లాలు “ఎవరు బాబూ నువ్వు?” అంటూ మా అమ్మా నాన్న, అన్నదమ్ముల వివరాలన్నీ అడిగింది. చెప్పాను. ఆవిడంది, ”బాబూ చెప్పకుండా వచ్చేసావు. ఇంకా సమయం వుంది కదా పాఠశాలకు. అమ్మగారు చాలా బాధపడతారు” అంటూ అమ్మ గుండె నీకు తెలియదన్నట్లు హితబోధ చేసింది. ”మాకు నువ్వొక్కడివి ఎక్కువైనంత మాత్రాన బరువేం కావు. కానీ, ఆలోచించు” అన్నది. అక్కడి నుండి వచ్చేసాను.

రాజమండ్రిలో ఇంకా పెద్ద వేద పాఠశాల వుందని ఎవరో చెప్పారు. రాజమండ్రికి నడచుకుంటూ వెళ్ళాను. సామర్లకోట మీదుగా వెళ్ళినట్టు గుర్తు. తోవలో ఏవో సత్రాలుండేవి, బసకూ, భోజనానికి. రాజమండ్రి వెళ్ళి, గొదావరీ అదీ చూసాను. ఒకటే పూట భోంచేసే వాణ్ణి. మరొక పూట అరటి పళ్ళు తినే వాణ్ణి.

నేను ఒక దగ్గర కూర్చొని వుండగా, పెద్ద మబ్బు పట్టింది. కారుమేఘాలు కమ్ముకొన్నాయి. చుట్టూ తెల్లగా అయింది. గబుక్కున మా వూరిలో అలాంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ చేతిలో చీపురుతో(శుభ్రం చేసిన తర్వాత) కనిపించింది. అంతే, వెంటనే వూరికి పరిగెత్తాను.

స్టేషనుకొచ్చాను. అక్కడ ఏదో ప్యాసంజరు ట్రెయిను ఆగింది. టీసీ లేదా గార్డుదగ్గరికెళ్ళి, ”నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను, ఇంటికెళ్ళాలి. నా దగ్గర ఇంతే డబ్బులున్నాయి. తీసుకెళ్ళగలిగితే వెళ్తాను, లేదంటే ఇలా నడుచుకొంటూ వెళ్తాను” అన్నాను. ఆయన పెట్టె చూయించి, అందులో కూర్చోమన్నారు. కూర్చున్నాను. విశాఖపట్నం వచ్చేసాను. అప్పుడు మా నాన్న గారికి తెలిసింది. మా నాన్నగారు పులి లాంటి వారు. ఆయనను చూస్తే అందరికీ గౌరవం, భయం. అలాంటి ఆయన మా అమ్మ కన్నా ఎక్కువ కన్నీరు పెట్టుకున్నారని, మా అమ్మ తర్వాత చెప్పింది.

ఆయన బాధ ఏమిటంటే, మా తమ్ముడు కృష్ణారావు వున్నాడు కానీ, పెద్ద కొడుకు కర్మలు చేస్తేనే ఎక్కుతాయని ఆయన నమ్మకం. ఆ రకమైన దృష్టితో ”నన్ను ఏ చాకలో, మంగలో ఈడ్చేస్తారు” అనేవారంట అమ్మతో. ఇదంతా విని నాకు చాలా బాధేసింది. బాగా గుండెల్లో నాటుకుపోయింది.

తొలి ఉద్యోగాలు

మురపాకలో నాకు చాలామందే స్నేహితులువుండే వారు. అయితే తర్వాత నాకు ఇంట్రావెర్ట్ లక్షణం వచ్చింది. దానికి కారణం శ్రీకాకుళంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సూ టీజింగూ – రెండూను. అంచేత పరిమితంగా స్నేహితులుండే వారు. పల్లెటూరు నుంచి వచ్చిన కారణాన బెదురు వుండేది. మొదట మ.సూ.నా. తర్వాత అతని స్నేహితులు ఒకరిద్దరు. నా తోవ వేరు. మా బావ గారి ఫ్రండ్స్ నన్ను చేరదీయబోయినా చేరలేదు. ఎంచేతంటే వాళ్ళ ధోరణులు నచ్చలేదు. వాళ్ళు లంచం తీసుకోవడం, అబద్ధాలాడటం తప్పని నేననుకునేవాణ్ణి. దానికి కారణం గాంధీ ప్రభావం నా మీద వుండేది.

అప్పట్లో నిష్ఠ, అస్తేయం వుండేవి. దేనికైనా నిలబడితే, ఏది ఏమైనా దృఢంగా నిలబడే వాణ్ణి. దరిమిలా, మా పిల్లలు పుట్టాక చాలా కష్టపడవలసి వచ్చింది. అప్పుడు హరిశ్చంద్రుడి వెనకాల చంద్రమతీ, లోహితాస్యుడు కష్టపడవలసి వచ్చింది. అది చూసి, చాలా తప్పనుకుని, నా నియమాలు నాకే తప్ప, ఇతరులకు కాదని, మరీ పాపం, అన్యాయం జోలికి పోకుండా, ముందు బతికితే కదా పాపం, పుణ్యం అనుకున్నాక, నీతికి సంబంధించిన మార్పులు కొన్ని వచ్చాయి.

రేషనింగు ఆఫీసులో పనిచేస్తున్న రోజుల్లో ఈ మ.సూ.నా. కూడా అందులో చేరాడు. ఒక అధికారి బదిలీ అయ్యి ఇంకొక అధికారి వచ్చాడు. కులాల గొడవ. మమ్మల్ని వేసినాయన బ్రాహ్మణుడు. ఈ వచ్చినాయన పట్నాయక్. ఆయనకు తన వారిని వేసుకోవాలని కోరిక. అంచేత ఫట్‌ఫట్‌మని మని కొందరిని తీసేసాడు. మ.సూ.నా.ని 10thఫెయిలని తీసేసాడు. నాకు వార్నింగు ఇచ్చాడు సరిగా పనిచేయట్లేదని. నాకు ఆఫీసులో కూర్చొని ఫలానా వీధి, ఫలానా ఇల్లు అంటే, డోరు నెంబరు చెప్పగల పరిచయం వుండేది అన్ని వీధులతోటి. ఎంక్వైరీ ఆఫీసర్ అంటే, ధరఖాస్తును సరిచూసి, ఇంటికి కార్డుఇవ్వాలో లేదో చెప్పాలి. అలాంటి వుద్యోగం. మా మేనేజరుతో పాటు అతని అసిస్టెంటు కూడా సహకరించే వాడు కాదు.

అప్పట్లో స్వతంత్రమ్ వచ్చాక కూడా రేషను చాలా కాలం కంటిన్యూ అయింది. అప్పట్లో గుడ్డ కూడా ‘కంట్రోల్ క్లాత్’అని వేరేగా వుండేది. రేషనులో బియ్యంతో పాటు గోధుమ, కొన్నిసార్లు జొన్నలు కూడా ఇచ్చేవారు. కొన్నిసార్లు ముతక బియ్యం, వుప్పుడు బియ్యం కూడా ఇచ్చే వారు.

మా పెత్తల్లి కొడుకు రేషనింగు ఆఫీసులో స్టోరు కీపరు. తన రేషనింగులో బియ్యం అవీ కొనిపించడం చేస్తుండే వాడు. ఛాయామాయలుండేవి. నేను రేషనింగు ఆఫీసులో ఎంక్వైరీ ఆఫీసర్గా వున్నప్పుడు, మా పెత్తల్లి వాళ్ళు అదనపు కార్డులు అడిగితే ఇవ్వలేదు. దానికి వారు తప్పు పట్టలేదు. “వీడి నైజమే ఇంత” అనుకున్నారు.

అప్పట్లో మా అమ్మగారు ఆసుపత్రిలోవుండింది. ఆఫీసులో ఏ-బి గ్రూపులుండేవి. బి గ్రూపులో వుండే నా చేత నావే కాకుండా అన్ని వార్డులవీ నాకే ఇచ్చేవారు. నావి చేసి ఇచ్చేవాణ్ణి తక్కినవి ఆలస్యమైతే కోప్పడే వారు. నాకు ఒళ్ళు మండుకుని వుంది. మ.సూ.నా.ని “తీసేయమంటావా? రాజీనామా చేస్తావా” అంటే, ఆయన రాజీనామా చేసాడు. నేను రాజీనామా లెటరు రాసి తీసుకెళ్ళి హెడ్ క్లర్క్‌కి ఇస్తే, ఆయన, ”వార్నింగ్ అంటే తెలుసా? దానికింద’నోటెడ్’ అనిరాసేయ్. సరిపోతుంది. ఇచ్చేసి తల తిప్పుకుపో..నువ్వేంచేసుకుంటావో చేసుకో అన్నట్టు” అన్నాడు. రెవెన్యూ డిపార్టుమెంటు విషయాలు చెప్పాడు. కానీ అవన్నీ మనకు తలకెక్కలేదు. అలాగా రేషనింగ్ ఆఫీసులో నా వుద్యోగం పోయింది.

ఉద్యోగం కోసం మదరాసు ప్రయాణం

అప్పుడే నావి 4-5 రచనలు ఆనందవాణిలో వచ్చాయి. దాంతో, మద్రాసు వెళ్ళి పత్రికా కార్యాలయంలో వుద్యోగం సంపాదించుకొందాం అనుకుని బయలుదేరా. చేతిలో వున్న కొంత డబ్బు పట్టుకుని మద్రాసుకు ట్రెయిన్ ఎక్కాను. మొదట ఆనందవాణి ఆఫీసుకెళ్ళాను. అదెంతో పెద్ద ఆఫీసనుకున్నా. కానీ, ఒకటే గది. ఒక అటెండరు వున్నాడు. ”ఇక్కడ ఎడిటర్ గారు లేరా?” అని అడిగాను. ”వాళ్ళ నాన్నగారు పోయారండీ, అంచేత ఇవాళ ఆయన సెలవులో వున్నారు” అన్నాడు. ఎవరని అడిగాను. ”శ్రీశ్రీ ” అని చెప్పాడు. “వారి ఇల్లు తెలుసా” అంటే ఫలానా దగ్గర అని చెప్పాడు.

శీశ్రీ ఇంటికెళ్ళాను. ఆయన ఇంట్లో నుంచి ఇవతలికి వచ్చి ఎవరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు శ్రీశ్రీ అంటే ఐడియా వుంది కానీ, ఇంత సింపుల్గా వుంటాడనుకోలేదు. లుంగీ, బనియన్, తువాలుతో వున్నారు. నేను వెళ్ళిన పని చెప్పాను. అలానా అని లోపలికెళ్ళి షర్టు వేసుకొచ్చి 2-3 ఆఫీసులకు తీసుకెళ్ళారు. అందులో ఒకటి రూపవాణి పత్రికాఫీసు. అప్పట్లో మద్రాసులో కాలి నడకనే తిరిగాం. ట్రాములువున్నాయి కానీ, అంతకు తూగాలి కదా?

అప్పట్లో నా డ్రస్ పంచెకట్టు, చిన్న లాల్చీ. నా లగేజి చిన్న బ్యాగు. అందులో నా సర్టిఫికేట్లు వున్నాయి. శ్రీశ్రీ గారు “ప్యాంటు వుంటే వేసుకోండి” అన్నారు. మద్రాసు స్టేషనుకు ఎదురుగుండా ఒక పెద్ద సత్రం వుండేది. ఆ సత్రంలోకెళ్ళి స్నానం అదీ అయ్యాక బట్టలేసుకొని, నా లగేజ్ సత్రం మేనేజరు దగ్గర పెట్టి, ఆఫీసులకెళ్ళి వెతికే వాడ్ని.

మధ్యాహ్నం వాహినీ స్టూడియోకి వెళ్ళాను. అదీ చాలా చిన్నది. తర్వాత కన్నాంబ గారింటికెళ్ళాను. ఆవిడ లేరు. గేట్ కీపర్ అడ్డేసాడు. అక్కడి నుంచి వచ్చేసాను. పొద్దుపోయింది. ఒకరి చేతిలో ‘సూర్యప్రభ’ అనే పత్రిక వుండింది. అది చూసి తెలుగువాడు అయ్యుంటాడని భావించి అతనితో మాట్లాడాను. ఆయన ఎవరు, ఏమిటి అని పలకరించాడు. “నేను కథలూ అవీ రాస్తుంటానండీ” అంటూ ఇక్కడికొచ్చిన పని గురించి చెప్పాను. “మీరెక్కడbదిగారండీ” అని అడిగాడు. “నా దగ్గర డబ్బుల్లేవు, అందుకని సత్రంలో దిగా”నని చెప్పాను. అతను లగేజి పట్టుకొచ్చెయమన్నాడు.

ఆయన రూంకెళ్ళాను. ఆయన నిండా నోట్లున్న పర్సు తీసి పక్కన పెట్టి, స్నానానికి వెళ్ళాడు. నా గుండె అదిరిపోయింది. “అదేమిటి నన్ను సందేహించకుండా, ఇలా పెట్టి వెళ్తున్నాడు? ఇదేమన్నాట్రాప్ ఏమో.” అని పిచ్చిగా ఆలోచించాను. ఆయన స్నానం చేసి వచ్చి, ”నేనూ వుద్యోగం కోసం వెతుకుతూ వచ్చాను. నువ్వు ఇక్కడే వుండి వుద్యోగ ప్రయత్నాలు చెయ్యడం మంచిది. నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను” అన్నాడు.

నాకేదో ట్రాప్‌లో పడిపోతున్నాననే బెంగ. “నేను ఇంటికి వెళ్ళిపోతాను” అన్నాను. “ఎందుకూ” అన్నాడు. “లేదు, వెళ్ళాలి” అన్నాను. రాత్రి ట్రెయిను దగ్గరికి అతనే వచ్చి, టికెట్ కొని, కొంత డబ్బు ఇచ్చి ట్రెయిను ఎక్కించాడు. నేను అతని అడ్రస్ రాసుకొన్నాను, డబ్బులు వెనక్కి పంపించడం కోసం.

అతని అడ్రసు రాసుకొన్న చీటీ ఎక్కడో పోయింది. అతనిది గుంటూరు అని తప్ప ఇంకేం వివరాలు గుర్తు లేదు. నా పుస్తకాలు ఎప్పుడూ ఎవరికీ అంకితం ఇవ్వలేదు. ఆ గుంటూరు వ్యక్తికి మాత్రం ఒక పుస్తకాన్ని అంకితం ఇచ్చాను.

ఆత్మహత్యా యత్నం

ఆ తర్వాత నేను విశాఖ వచ్చేశాను. పెద్దాపురం నుంచి ఒక కుర్రాడు వుండేవాడు. అతనితో చాలా కాలం పాటు సన్నిహిత సంబంధాలుండేవి. అతను సోర్ (సోర్-స్టాఫ్ ఆఫ్ రాయల్ ఇంజనీర్స్)లో పని చేసేవాడు. అతను “ఎందుకలా తిరుగుతావ్” అని తిట్టి “సోర్లో వుద్యోగం ఇప్పిస్తాను, కానీ కొంచెం టైముపడుతుంద”ని చెప్పాడు.

అప్పుడు సింగిలు రూంలో ఒక్కన్నే వుండేవాణ్ణి. ఆ వుద్యోగం లేటు అవడంతో, అలా తిరుగుతూ జీవితం గురించి గాఢంగా ఆలోచించాను. “జీవితం అంటే కష్టాలమయం అంటారు గదా? ఆ కష్టాలు పడుతూ బతకడం ఎందుకు? ఫుల్‌స్టాప్ పెట్టేస్తే ఏమవుతుంది?” అని ఆలోచించి, నా దగ్గరున్న కాయితాలన్నీ చింపి పోగులు పెట్టి, సముద్రంలోకి వెళ్ళిపోయాను. రెండు సార్లు లోపలికి వెళ్తే, రెండు సార్లూ అలలు నన్ను ఒడ్డుకు విసిరేసాయి. కొంతమంది దురదృష్టవంతుల్ని బయటున్నవాళ్ళను లోపలికి లాగేస్తుంది. నన్ను మాత్రం బయటికి విసిరేసింది సముద్రం. వెనక్కి వచ్చి తడిబట్టలతోనే వరండాలో పడుకుండిపోయాను.

మర్నాడు పెద్దాపురం ఫ్రండ్ విషయం తెల్సి ”తంతాను గాడిద” అంటూ చీవాట్లు పెట్టి సోర్లో వుద్యోగం ఇప్పించాడు.

సోర్లో వుద్యోగం

సోర్ ఆఫీసులో 70 రూపాయలు జీతం. అంతకు ముందు రేషనింగు వాటిల్లో 50 రూపాయలు. అప్పటికింకా మనకు స్వతంత్ర్యం రాలేదు. యుద్ధానికి సంబంధించిన ఆఫీసు. ఓడలో సరుకులు వస్తాయి. అక్కడి నుంచి మిలిటరీకి రవాణా చేయాలి. ఓడలో నించి దించిన సరుకుల్ని టాలీ క్లర్కులు లెక్కపెట్టాలి. వాళ్ళిచ్చిన డేటాను అకౌంటు క్లర్కులు రిజిస్టర్ చేయాలి. నేను అలాంటి క్లర్కును. పులగుర్తి గోపాలకృష్ణ గారు కూడా అందులో టాలీ క్లర్కు.

అందులో వుద్యోగం 3 షిఫ్టులుగా వుంటుంది.
1. రాత్రి 12.00 నుంచి వుదయం8.00 వరకు
2. వుదయం8.00 నుంచి సాయంత్రం 4.00 వరకు
3. సాయంత్రం 4.00 నుంచి రాత్రి 12.00 వరకు
నాకేం పెద్ద కష్టంగా వుండేది కాదు. రాత, పుస్తకాలు, ఆలోచన్లు వుంటే ఎక్కడైనా బతికేయచ్చు.

మా మీద ఒక లెఫ్టినెంటు, కేప్టను, ఆఫీసర్లు వుండే వారు. ఒక సూపర్వైజరు వుండేవాడు. తమిళుడు. అతను చాలా కటువుగా వుండే వాడు. లెఫ్టినెంట్ 25 లోపు వాడు. చాలా తమాషాగా వుండే వాడు. ఒకసారి తమిళ సూపర్వైజరు ఏదో రాసిపెడితే దాని కింద ‘బాల్స్’ అని రాసారు పులగుర్తి.

నేనెప్పుడూ డ్యూటీలో వుండగా నిద్రపోయేవాణ్ణి కాదు. ఏదో రాసుకోవడమో, చదువుకోవడమో చేస్తుండేవాణ్ణి. ఒక సారి పులగుర్తి నిద్రపోతూ దొరికిపోయాడు. “డ్యూటీలో వుండగా నిద్రపోతావా?” అని వాళ్ళు మందలిస్తే, ”నిద్రొస్తే నిద్రపోరా?” అని తార్కికంగా మాట్లాడాడు. అప్పట్లో ఆయన ఖద్దరు వస్త్రధారి. తర్వాత లెఫ్టిస్టు. కొన్ని రోజుల తర్వాత ఆయనను తీసేసారు.

నేను1945లో సోర్లోనుంచి బయటపడి వుంటాను. వాళ్ళు నన్ను ఎన్ఎడి(Naval Armament Depot)కి బదిలీ చేసారు. నిరుద్యోగంలోకి నెట్టకుండా ఇక్కడికి పంపించారన్న మాట. అది 8 గంటల డ్యూటీ. వుదయం 8.00 నుంచి సాయంత్రం 4.00 వరకు. వుదయమే ఒక ట్రక్కు అందరినీ వేసుకొని NADకు తీసుకెళ్ళేది. రెండు ట్రిప్పులు వేసేది. అదొక్కటే కష్టం. ఆఫీసులో పెద్ద పని వుండేది కాదు. మా మీదుండే సూపర్వైజరు చాలా మంచివాడు.

పెళ్ళి

అందులో పనిచేస్తుండగా, నా పెళ్ళయింది. 1946 ఏఫ్రిల్. అప్పుడు సీతమ్మ గారి వయస్సు 14, నా వయస్సు 22.

నేను మురపాకలో ఖాళీగా వున్నప్పుడు తోటి పిల్లలతో కలిసి తిరుగుతుండేవాణ్ణి. అప్పట్లో పల్లెటూర్లో వ్యభిచారం కొంచెం ఎక్కువగానే వుండేది. ప్రతి వారికీ ఎవరో ఒకరితో సంబంధం వుండేదని చెప్పుకునే వారు.

శ్రీకాకుళం అరసవెల్లిలో సానివాడ వుండేది. అక్కడ గొడుగుల సాని అని ఒకావిడ వుండేది. ఆమె గురించి మాట్లాడుకొనేవారు. ఒకసారి కూర్మం యాత్రకు స్నేహితులు అందరూ సైకిళ్ళ మీద బయలుదేరితే, నేనూ బయల్దేరాను. తిరిగి వస్తుండగా, సైకిలు చెడిపోయో, నిద్రకు ఆగలేకో అరసవెల్లిలో పడుకోడానికి రెడీ అయ్యాం. ఆ వూర్లో ఎవరికీ బంధువులు లేరు. అందులో అప్పారావు గారని వుండే వారు. అతనికి వారకాంతలతో సంబంధాలు వుండేవి. అతను అక్కడికి తీసుకెళ్ళాడు.

అందులో ఒకమ్మాయి వచ్చి నాతో ఏదో అంటే, అప్పారావు, ”చూడమ్మాయి, నువ్వు ఎవరితో ఏదైనా చేయి, అతను ఇక్కడికి రావాల్సిన వాడు కాదు, మా బలవంతం మీద వచ్చాడు, వాళ్ళ నాన్న ఫలానా, మేం చచ్చిపోతాం ఏదైనా జరిగితే” అన్నాడు.

ఇలాంటివేవో నాన్నగారికి తెలిశాయో లేక నేను చదివే పుస్తకాలు(చలంఇతరత్రా) చూశారో కానీ, ఆయన, ”అబ్బాయీ(నాకు అప్పటికి 20 ఏళ్ళు నిండ లేదు), మనది 7వూర్లకు సంబంధించిన కరణం కుటుంబం. రేప్పొద్దున నువ్వు కరణం కావాల్సిన వాడివి. చూసావు కదా? కరణాలు తీర్పరులుగా కూడా వున్నారు, మనం ఆదర్శప్రాయంగా వుండాలి(ఇలా కాకుండా మామూలుగా చెప్పారు). మనలో ఏ లోపం చూసినా 7 వూర్లు చెప్పుకుంటాయి. నీకు ఎప్పుడు పెళ్ళి కావాల్సి వస్తే అప్పుడు చేస్తా” అన్నారు.

అలా, నా 22వ ఏట పెళ్ళి సంబంధాలు చూడమన్నాను. చూసిన కొద్ది రోజుల్లోనే నా పెళ్ళి జరిగింది.

ఈవిడది 3 వూర్ల మొఖాసాల కుటుంబం. తర్వాత కోర్టు లావాదేవీల గొడవల వల్ల మొఖాసాలు పోయాయి.

మా పెళ్ళి నాటికి వాళ్ళ తల్లిగారు లేరు. వీళ్ళ తల్లిగారు రెండో భార్య. ముందు భార్యకు ఇద్దరు కొడుకులు. వీళ్ళమ్మకు 5గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. ఈవిడ 5వ సంతానం.

శ్రీకాకుళంలో పెళ్ళిచూపులు అయ్యాయి. మా నాన్న గారిని వెళ్ళి చూడమన్నా, ”వాళ్ళమ్మ గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించీ మా మేనేజరుకు తెలుసు. చాలా మంచి కుటుంబం పేర్రాజు, చేసేయండి” అంటే చేసేసారు. పిల్లను నేను కూడా వెళ్ళి చూసాను. మా అమ్మగారు, మా చెల్లెలు కూడా చూసారు. అప్పటికి వీళ్ళన్నగారు శ్రీకాకుళంలో వుద్యోగం చేస్తుండే వారు. వీళ్ళందరూ వెళ్ళడానికి ఏరు దాటడం వుండేది. అందుకని మా నాన్నగారు వెళ్ళలేదు.

పెళ్ళయిన తర్వాత ఇక్కడికి తీసుకురావడానికి, వాళ్ళ సవతి తల్లిగారు రాలేని పరిస్థితి. ఎందుకంటే సంసారం అంతా ఆవిడ చేతుల మీదే నడిచేది. మా అమ్మకీ ఇంట్లో చాలా పనులుండేవి. మా స్నేహితుడు, వాళ్ళావిడ ధైర్యం చెప్పి ఇక్కడకు తీసుకు వచ్చారు. కాపురం పెట్టాను.

ఎన్ఎడిలో పనిచేసేటప్పుడు, ట్రక్కులో ట్రిప్పుల మూలంగా, వుదయం6.00కి వెళితే సాయంత్రం 6.00కి వచ్చి స్నానం చేసి, హిందూ రీడింగ్ రూముకు వెళ్ళిపోయేవాడ్ని. ఈ అమ్మాయి ఒక్కత్తీ ఏడుస్తూ కూర్చునేది. నాకేమో ఏడిస్తే చిరాకు. నాకూ మనసు అశాంతిగా అయ్యేది. అప్పుడు గ్రహించే జ్ఞానం లేదు. కానీ వున్నంతలో నయం. ఆవిడను బాధ పెట్టడం, నాకూ చదవడానికీ, రాయడానికీ తీరిక లేదని చెప్పి ఆ వుద్యోగం వదిలేసాను.

టీచర్ ట్రైనింగ్-హాస్టల్ సెక్రటరీ

అప్పట్లో టీచరుకయితే 45రూపాయలు జీతం. స్వాతంత్ర్యానంతరం గవర్నమెంటు స్కూళ్ళను పెంచే క్రమంలో, రెండేళ్ళ సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్‌ను 12 నెలలకి కుదించారు. దానికి ఎస్ఎస్ఎల్సి/ఇంటరు పాసవడం ఒక షరతు.

నాకు ట్రైనింగులో సీటు దొరికింది. మా స్నేహితుడు రామరాజు మాత్రం పునరాలోచించుకుని ఎన్ఎడిలోనే వుండిపోయాడు. అక్కడ మంచి స్నేహితులు కలిశారు. అందులో గంటి అప్పల నరసింహం అని చాలా సన్నిహితుడు. అతన్ని చిన్న కమ్యూనిస్టు అనేవారు. పెద్ద కమ్యూనిస్టేమో పెద్దాడ వీరభద్ర రావు. అక్కడ కూడా ఎక్కువగా పెన్సిల్‌తో బొమ్మలువేసే వాణ్ణి. అక్కడ నా చురుకుదనం అవీ చూసి హాస్టల్ సెక్రెటరీగా నిలబెట్టారు.

అప్పట్లో ఎలాగుండేదంటే, కొలత కప్పుతో అన్నం పెట్టే వారు. గోధుమ రొట్టెలు మనిషికి రెండు వచ్చేవి. ఎవరైనా హాజరు కాకపోతే రొట్టెలు మిగిలిపోయేవి. అవి కూడా ముక్కలు చేసి నేను అందరికీ పంచేవాణ్ణి.

సూర్యనారాయణ అని ఒకడు చాలా తమాషాగా వుండేవాడు. ఒకసారి, “రొట్టెలు, అన్నం మేం ఎక్కువ ఇవ్వలేం కానీ, తక్కినవి ఏవైనా ఎంత అడిగితే అంత పెడతాం” అంటే, ”పెడతావా? అయితే సాంబారు పట్టుకురా” అని అన్నంలో సాంబారు వేసుకుని జుర్రుతూ వుండే వాడు. అలా సాంబారు మొత్తం అయిపోనిచ్చి”ఇంకా పట్టుకురా” అన్నాడు. నేను ”సారీ రా నీకు దండం పెడతాను” అన్నాను.

తర్వాత ఒక పేద స్నేహితుడు వుండేవాడు. హాస్టల్ మెంబర్ కాడు. కానీ, రొట్టె అడిగేవాడు. నేను అతన్ని నాతో పాటే రోజూ తీసుకెళ్ళి, టిఫను పెట్టించేవాణ్ణి. కానీ, హాస్టల్లోకి మాత్రం ప్రవేశించనిచ్చేవాణ్ణి కాదు.

తర్వాత, నా భార్యను వూర్లో వుంచాను. ఇక్కడ నాకు స్టైఫండు 18 రూపాయలు వచ్చేది. ఇంకా రెండు ట్యూషన్లు ఒప్పుకున్నాను. నేను సింగిలు రూం తీసుకొని వుండేవాణ్ణి. డాబా మీదే పడక. స్నేహితులు కూడా తోడు వుండేవారు.

ఎన్ఎడిలో చేసేటప్పుడు అరియర్లు 100 రూపాయలు వచ్చేవి. ఆ ఏడాది పండగ ముందు స్టైఫండు లేటయ్యింది. సెలవుల తర్వాత ఇస్తామన్నారు. అందరూ వూరికెళ్ళడానికి లేక ఇబ్బంది పడుతుంటే, ఎవరు ఎంత అడిగితే అంత అప్పుగా జాబితా రాసి ఇచ్చేశాను. కొందరు తర్వాత తిరిగిచ్చారు. కొందరు చాలా ఆలస్యంగా ఇచ్చారు.

అప్పల నరసింహం నన్ను హెచ్చరించాడు. ”రేయ్ నీకు వళ్ళు పై తెలియదు. కొంచెం జాగ్రత్తగా వుండు”.

హాస్టల్లో నేను చేసే పనులు చాలా మంది ఇష్టపడే వారు. కానీ, కొందరు మాత్రం తూలనాడే వారు. అది చూసి నేను రాజీనామా చేద్దామనుకొన్నా. కానీ వార్డను వద్దన్నాడు. నేను మాట అనిపించుకోవడం ఇష్టం లేదన్నాను. ఆయన మధ్యాహ్నం వరకూ ఆగమని చెప్పి, మధ్యాహ్నం భోజనాలప్పుడు”రామారావు రాజీనామా చేశాడు. నేను ఒప్పుకోలేదు. మీ ఓటింగు కోసం అడుగుతున్నాను. అతను కావాలనుకునే వాళ్ళు చేతులెత్తండి” అన్నాడు. దాదాపు అందరూ చేతులెత్తారు. ”చూడయ్యా, నిన్ను ఎన్నుకున్నప్పుడు 60 మంది వుంటే, ఇప్పుడు 90 మంది నిన్ను సపోర్టు చేసారు” అన్నాడు.

అలాగే ఒకసారి హెడ్మాస్టరుతో ఒక విషయం మీద పోట్లాడాల్సి వచ్చింది. మా డ్రిల్మాస్టరు విజయనగరం, బొబ్బిలి, సీతానగరం విద్యార్థుల్ని తప్ప, ఎక్కువమంది పల్లెటూరివాళ్ళని రీడింగు రూంలోకి అనుమతించలేదు. పైగా నమస్తే పెట్టలేదని తిట్టేవాడు. దీన్ని నేను వ్యతిరేకించాను.

‘సైకాలజీ’ ఫెయిల్ చేసింది

ట్రైనింగు సమయంలో అన్ని సబ్జెక్టులు ఏమో కానీ, సైకాలజీ గురించి చెప్పాలి. చదవడం, రచయితగా ఆలోచించడం వల్ల, సైకాలజీ నాకు బాగా తెలుసు అనుకునే వాణ్ణి. ఆ పొగరు ఎంత వరకు పోయిందంటే, మాస్టారు పొరబడుతున్నారనుకునేవాణ్ణి. పరీక్ష రాసాక, ఒక ప్రశ్నకు జవాబు ఏమి రాశాం అని చెక్ చేసుకునే క్రమంలో మిగతా వాళ్ళు రాసిన జవాబు తప్పన్నాను. “అది మాస్టారు చెప్పింది” అని చెప్పారు. నేనేమో అది తప్పని వాదించాను.

తర్వాత చూస్తే, పరీక్షలో ఫెయిలయ్యాను. తర్వాత ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. అప్పుడు మా వూర్లో ట్యూషన్లు చెప్పే వాడ్ని. సైనుబోర్డులు రాసేవాడ్ని. మా వూర్లో పొగాకు వర్తకులు ఎక్కువ. ఆ ఆఫీసర్ ఎవరో ప్రతి ఇంటి ముందు బోర్డ్స్ పెట్టమన్నాడు. అంచేత వూర్లో వుండే పొగాకు వ్యాపారులకు బోర్డులు రాయవలసి వచ్చింది. అలా ట్యూషన్లు, ఇతర చిన్నచిన్న పనులు చేస్తూ నా ఖర్చులు వెల్లగొట్టుకునేవాణ్ణి. ఇంటికి ఏమీ పంపించలేకపోయేవాణ్ణి. పుస్తకాలు మాత్రం బాగా చదువుతుండేవాణ్ణి.

Untrained Teacher Job

శ్రీకాకుళంలో స్కూళ్ళలో Untrained Teacher Job కోసం ప్రయత్నిస్తుండే వాడ్ని. అది మా ఆవిడ మొదటి సారి గర్భవతిగా వున్న సమయం. చివరికి అంగూరులో ఆ వుద్యోగం దొరికింది. ఆ వూర్లో ఒక చుట్టం వున్నాడని తెలిసింది. నేనెప్పుడూ చూడలేదు. మా తండ్రికి చెల్లెలు వరసయ్యే ఒకామె రణస్థలిలో వుండేది. మేం “అత్త” అని పిలిచే వాళ్ళం. వాళ్ళకి, వీళ్ళు బంధువులు. మా నాన్న గారు, ”నువ్వెళ్ళి ఫలానా అని చెప్పు, తెలుస్తుంది” అన్నారు.

వెళ్ళి కలిసాను. తెలుసుకొని, పక్కనున్న అతనితో, ”చూడు, ఫలానా రూం ఖాళీ చేయించి ఇతనికివ్వు” అన్నాడు. వూర్లో ఇల్లు చూసుకుంటానంటే, ”ఎలాగూ మీ ఆవిడ గర్భవతే కదా? నీకిక్కడ వుండటానికేంటి? ఇక్కడే తిని వుండు” అన్నాడు.

డబ్బులిద్దామంటే తంతాడేమో అనేంత మొరటుగా వుండే వాడు. అతను వుదయం 6 గంటలకి శ్రీకాకుళం వెళ్ళి, రాత్రి 1గంటకి ఇంటికొచ్చే వాడు. అతని ఇల్లాలు అప్పుడే వండి వడ్డిచ్చేది. అతనింటికి ఎవరు వచ్చినా మర్యాదతో “సార్” అని పిలిచేవాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరు కూడా నన్ను మర్యాదగానే చూసే వారు.

కొన్ని నెలల తర్వాత, నా భార్యని తీసుకొస్తున్నానని చెప్పి, ఎలాగోలా బయటపడి, వీళ్ళింటికి దూరంగా ఇల్లు తీసుకున్నాను.

స్కూల్ విషయానికొస్తే, మాస్టార్లందరూ బాతాఖానీ కొట్టుకునే వారు. పిల్లలకు ఏదో హోంవర్క్ ఇచ్చేవారు. లేదా ఏదో చదువుకొనమనే వారు. నేను మాత్రం బుద్ధిగా క్లాసులు తీసుకునే వాడ్ని. అది చూసి వాళ్ళు, ”బుద్ధి, జ్ఞానం వుందా? ఏమిటలా వూరికే ఎగపడతావు…?” అంటూచీవాట్లు పెట్టే వారు. అంటే, “ప్రతి అడ్డమైన వాడు చదువుకుంటే ఎలా?” అనే ధోరణి వుండేది.

అందులో ఒకతను బ్రాహ్మణుడు, ఒకతను కాపు, ఒకతను వెలమ, ఇంకో అతను ఎవరో వుండే వాడు. బ్రాహ్మణుడు సరే, తక్కిన వాళ్ళు కూడా అలాగే వుండే వాళ్ళు. ఎప్పుడూ జీతాల గురించో, పై వాళ్ళ గురించో మాట్లాడుకునే వారు. ఎప్పుడో తప్ప క్లాసులో పాఠాలు చెప్పిన గుర్తు లేదు.

ఇంకొన్ని నేను చెప్పరానివి వున్నాయి. స్టూడెంటు-టీచరు సంబంధాల గురించి ఇవాళ పేపర్లలో చూస్తున్నాం కదా? అప్పుడు కూడా అవి వుండేవి. నన్ను ఏడిపించే వారు. నేను కొంచెం భిన్నంగావుంటా కదా? “జీతాలొచ్చాయా” అంటే రాలేదనే వారు. సాయంత్రం సంతకం చేశాక ఇచ్చే వారు. “మరి పొద్దునేంటి అలా అన్నారు” అంటే, “వూరికే అలా అన్నాను” అనే వాడు. అదేంటంటే, ”బ్రాహ్మణుడిగా వుండి, ప్రతిదానికీ అలా గెంతుతావేంటి?” అనే వాడు.

నేను తిన్నగా మా ఆవిడను పట్టుకొచ్చి, శ్రీకాకుళంలో అక్కచెల్లెల్ల దగ్గర పడేసి, నేనేమో వైజాగ్ వచ్చేసాను.

గాంధీ మీటింగు

అదే సమయంలో, 1948, జనవరిలో గాంధీ గారు పోయారని తెలిసి వెర్రెత్తిపోయాను. మనుషులు నాయకుల పట్ల ఆరాధనా భావంతో వుంటారు కదా? ఆ ఆరాధనా భావం రాజకీయాల దగ్గరికొచ్చేసరికి నాకు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసుల మీద వుండేది.

గాంధీ మీటింగుకి వెళ్ళాను. ట్రెయినులో ఒక వూరి నుంచి మరొక వూరికి వెళ్తూ, వాల్తేరు స్టేషన్లో దిగి ఒక అర గంట సేపు జనాన్ని వుద్ధేశించి మాట్లాడి వెళ్ళిపోయారు. నెహ్రూ సమావేశం స్టేడియంలో జరిగింది. దాని కోసం మా వూరి నుంచి కూడా అతిథులు వచ్చారు. మునసబు, మరికొందరు రాత్రి మా ఇంట్లో పడుకొని వుదయం అందరూ లేచి వెళ్ళిపోయారు.

గాంధీ పోయినప్పుడు దేశం ఏమైపోతుందో అనుకొన్నాను. కానీ, నెహ్రూ పోయినప్పుడు అలా అనుకోలేదు. ఎందుకంటే, గాంధీ పోయినప్పుడు దేశం ఏమీ అయిపోలేదు కదా?

నెహ్రూ నాటికి రావిశాస్త్రి గారితో పరిచయం అయింది. ఆయన ‘మూడు దశలు’ నా అవగాహన మీద చాలా ప్రభావం చూయించింది. చూపు-వెనక్కి చూడటం నుంచి ముందుకు తిప్పింది అది. అందరూ గతం గొప్పది అనే వారే. గురజాడ “గత కాలము మేలోయ్ వచ్చు కాలము కంటే” అనేది, భారతంలో ఒక విషయం చెప్తూ అర్థాంతరన్యాసంగా( ఒకటి చెప్పి, దాన్ని బలపర్చడానికి చెప్పేది) భారతంలో నన్నయ చెప్పిందాన్ని గురజాడ కోట్ చేసాడు.

సాహిత్యం పట్ల అభిరుచి, రచయితకు వుండవలసిన పద్ధతి గురించి కుటుంబరావు దగ్గర నుంచి నేర్చుకున్నాను.

వూర్లో పాఠాలు

1948లో పోయిన పరీక్షలు కట్టి పాసయ్యాను. ఆ తర్వాత మా తండ్రిగారు మా వూర్లోనే ప్రాథమిక పాఠశాలలో పంతులుగా చేయమన్నాడు. మా స్కూలు మేనేజర్లతో, టీచర్లతో మాట్లాడారు. మా నాన్నగారిని కాదనలేక సరే అని నాతో మాట్లాడారు. “ఏమిటి? ఇక్కడ మాకే బతుకు లేదు. నువ్వేమో సెకండరీ గ్రేడ్ టీచర్, ఇదేమో ఎలిమెంటరీ స్కూలు..” అన్నట్లు మాట్లాడారు. వారికి నేనిక్కడ పని చేయడం ఇష్టం లేదని నాకర్థం అయ్యింది.

వేసవిలో నేనే ఒక స్కూలు మొదలుపెడదామనుకున్నా. ముందు హరిజనులకి పాఠాలు చెప్పడం ఆరంభించాను. అది వూర్లో అందరికీ అసంబద్ధంగా వుండేది. వుదయం షావుకార్ల పిల్లలకి, రాత్రి హరిజనుల పిల్లలకు చెప్పే వాణ్ణి. అది వాళ్ళకే అయిష్టంగా వుండేది.

మళ్ళీ విశాఖకు

దాంతో మా అమ్మగారి నుండి కొంత డబ్బు తీసుకుని, మా నాన్న గారికి చెప్పాపెట్టకుండా విశాఖపట్నం వచ్చేశాను. అక్కడ మా పెత్తల్లి గారి కుమారుడు టెలిఫోను ఆఫీసులో పని చేసేవాడు. ఆయనంటే గురి. మా తండ్రి గారి మాటైనా జవదాటగలనేమో గానీ, ఆయన మాట జవదాటలేను. ఆయన వ్యక్తిత్వం అటువంటిది.

అలాంటి ఆయన ఇంట్లో భోజనం చేయమంటే చేయలేదు. హోటల్లో తినడానికి నా దగ్గర డబ్బులు చాలవు. వారం రోజులు పకోడీలు, పళ్ళు లాంటివి తిని గడిపాను. ఆ వారంలో రకరకాల ప్రయత్నాలు చేసాను.

అప్పుడు హోటెల్స్‌లో విస్తళ్ళు నేల మీదే వేసుకుని లేదా పీటల మీద కూర్చుని తినే వాళ్ళం. టేబిళ్ళు వుండేవి కావు.

రేషనింగ్ ఆఫీసులో పని చేస్తున్నపుడు ఒక ఆచారి హోటల్ నడిపే వాడు. అతను అందర్నీ “ఏమిరా?” అని పిలిచే వాడు. వుద్యోగులైనా సరే. భోజనం మాత్రం బ్రహ్మాండంగా పెట్టేవాడు. కుర్రాళ్ళని చీవాట్లు వేసి తినిపించే వాడు. ఆలస్యంగా వస్తే తిట్టే వాడు.

ఒక అయ్యర్ హోటల్ వుండేది. అది కొత్తరోడ్ జంక్షన్లో, నా బసకు దగ్గరగా వుండేది. విజయవాడలో బాబాయ్ హోటల్లా ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఆయనని చాలా గౌరవించే వారు. వుప్పుడు బియ్యం లాంటిది కాకుండా, మంచి భోజనం పెట్టే వాడు. వేస్ట్ చెయ్యద్దని పిల్లలను మందలించే వాడు. అలాగని కడుపు మాడ్చే వాడు కాదు. కస్టమర్లతో ఇలా చెప్పే వాడు, “బాబూ, చాలా మంది తిండికి లేక ఏడుస్తున్నారు. మీరు కావాల్సినంత పెట్టించుకోండి, కానీ, పారేయ్యకండి”.

సెయింట్ ఆంథోనీలో లెక్కల మాస్టారుగా 31 ఏళ్ళు

వారం, పది రోజుల తర్వాత ఒక ప్రయివేటు స్కూలుకి వెళ్ళాను. అక్కడ ఎవరైనా వారం రోజులు టీచరుగా చేశాక, వేరే స్కూలుకు వెళ్ళిపోయే వారు కానీ, అక్కడెవరూ స్థిరపడే వారు కాదు. అప్పట్లో ప్రయివేట్ స్కూలు ఫీజులు వారి ఇష్ట ప్రకారం వుండేవి కాదు. ప్రభుత్వమే నిర్ణయించేది.

నేను ఎ.వి.ఎన్ కాలేజిలో ఒక అప్లికేషన్ పెట్టి, సెయింట్ ఆంథోనీ స్కూలులో ఖాళీలున్నాయంటే, అక్కడికెళ్ళాను. నా సర్టిఫికేట్స్ అవీ చూసి, ఎప్పుడు జాయిన్ అవుతావని అడిగారు. అప్పటికే మునిసిపల్ స్కూలులో కూడా ప్రయత్నం చేస్తున్నా. ఒక 15 రోజులు చూసినా వేరే ఎక్కడా ఫలితం లేదు. ఇక సెయింట్ ఆంథోనీలో జాయిన్ అయ్యాను. అయ్యే ముందు మా అన్నయ్యకు చెబితే, “అది క్రిస్టియన్ స్కూలు కదా? క్రిస్టియన్లు ఎవరైనా వస్తే నిన్ను వెళ్ళిపొమ్మంటారు” అన్నాడు.

అన్నీ ఆలోచించుకొని, చివరికి నేను జూన్16న ఆంథోనీ స్కూలు కెళ్ళి ఫాదర్ రెవరెండ్ గారినీ,కరస్పాండెంట్ గోపి గారినికలిసాను. వెంటనే క్లాసు తీసుకోమన్నారు.

ఫాదర్ రెవరెండ్ గారు రెండు పీరియడ్లు క్లాసులు తీసుకొని మిగతా టైము బైబిల్ చదువుతూ క్లాసురూంల ముందు తిరిగే వారు. అప్పుడు బిల్డింగుపెద్దది కాదు. నేను గమనించిందీ, తర్వాత రూఢి చేసుకుంది ఎమిటంటే, ఆయన బైబిల్ చదువుతున్నట్టు తిరుగుతూ, టీచర్లు క్లాసులు ఎలా చెబుతున్నారో వినేవారు.

తర్వాత మధ్యాహ్నం భోజనం అయ్యాక నా సర్టిఫికేట్లు ఇవ్వమన్నారు. అంతకు ముందే మా అన్నయ్య సర్టిఫికేట్లు ఇవ్వద్దని చెప్పారు. అయినా నేను ఇచ్చేశాను. ఆ సాయంత్రం ఇంటికెళ్ళాక, ఎ.వి.ఎన్ కాలేజినుంచి జాయనింగ్ లెటర్ వచ్చింది. మా అన్నయ్య “సర్టిఫికేట్లు పట్టుకొచ్చేయ్ ఇక్కడికెళ్దాం” అన్నాడు. వొకసారి సంతకం పెట్టాక నేను రానని చెప్పేశాను. మొదటిసారి మా అన్నయ్య నా మీద ఫైర్ అయ్యాడు. కానీ నేను వినలేదు.

ఆ క్రిస్టియన్ స్కూలులో 1948లో చేరాను. 1979లో రిటైర్ అయ్యాను. ఈ 31ఏళ్ళ సర్వీసులో ‘’ఆయ్యో! క్రిస్టియన్ స్కూలులో చేరానే’’ అని ఒక్క నాడూ చింతించలేదు. ఈ స్కూలులో చేరిన మొదట్లో ట్యూషన్లు చెప్పకూడదనే నియమం వుండేది. తర్వాత దాన్ని సడలించారు.

ఆ స్కూలులో చేరినప్పుడే భారతిలో నా కథలొచ్చాయి. అప్పుడు విశాఖ రచయితల సంఘం అని ఒకటుండేది. విశ్వనాథ సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం, అబ్బూరి రామకృష్ణారావుగారితో పాటు, యూనివర్సిటీ నుంచి మేధావులు కూడా గౌరవ సభ్యులుగా వుండే వారు.

వుద్యోగం రాగానే, నేను వైజాగ్లోనే కాపురం పెట్టాను. చిన్న నాటి స్నేహితుడు రామరాజు, నేను పక్క పక్కఇళ్ళల్లోనే వుండేవాళ్ళం.

కుటుంబం

1948లో నాకు మొదటి సంతానం అబ్బాయి పుట్టాడు. 1950లో రెండో అబ్బాయి, ’51లో మా తమ్ముడు, ’52లో మూడో అబ్బాయి, ’54లో వొక అమ్మాయి, పుట్టి బాల్యంలోనే పోయింది, ’56లో ఒక అబ్బాయి, 58లో ఒక అమ్మాయి,‘60లో అబ్బాయి. ఇదీ నా సంతానం.

మొదట్లో రీడింగ్ రూము ప్రాంతంలోనే మా ఇల్లు వుండేది. తర్వాత స్కూలుకి దూరంగా వుందని, స్కూలు పక్కనే కోర్టు, దాని పక్కనే జైలు రోడ్డు, అక్కడ ఇల్లు తీసుకున్నాను. అప్పట్లో పూర్తిగా రేషనుబియ్యం మీదే బతికాం. తర్వాత ఇంకో ఇల్లు, సాయిబాబా వీధిలో. ఇది రామరాజు గారు వుండే ఇంటికి దగ్గర. ఆ ఇంట్లో చేరిన దగ్గర నుంచి నేను పడిన కష్టాలు చూసి మా కజిన్ నాకు ఏవేవో సరుకులు పంపించే వాడు. నేను రాజీ పడ్డాను.

యలమంచిలిలో మా తోడల్లుడు రెండోవాడు పార్థుడని వుండే వాడు. నేను 5వ అల్లుడ్ని. ఆయన కరణం. రాష్ట్ర స్థాయి కరణాల గ్రామోద్యోగులకి అధ్యక్షుడు. ఆయనకి చనువు ఎక్కువ. గాలి లాగ ఇలా వచ్చి అలా మాయమయ్యే వాడు. నేను రానంటూ వున్నా, నన్ను రెక్క పట్టుకొని సినిమాకు తీసుకెళ్ళి, టాప్ క్లాసులో కూర్చోపెట్టే వాడు. నాకేమో కుతకుతగా వుండేది. వుత్తుత్తినే డబ్బులు ఖర్చు చేసేవాడు. మేము కష్టాలు పడుతుంటే, మా రెండో వాడికి పాల డబ్బాలు అవీ తెచ్చేవాడు. నేను డైరెక్ట్గా ఇస్తే తీసుకోనని మా ఆవిడ చేత “డబ్బాలు వెనక్కి తీసుకుంటారా, అవతల పారేయమంటారా”-టైపులో చెప్పించే వాణ్ణి. కానీ, చాలా ప్రేమగా వుండేవారు. అలా నా సంసారం జరుగుతూ వుండేది.

1960లో మా ఆఖరి అబ్బాయి, 4వ కొడుకు పుట్టిన తర్వాత వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుందామంటే, మా పెత్తల్లి వద్దంది. మా పెదనాన్నకు పిల్లలు లేరు. మా వదిన గారు కూడా “మీరు కనేసి నాకివ్వండి” అంది. దాంతో మానేశాను. మా నాన్న గారు పెంపకం ఇవ్వడానికి వ్యతిరేకి. ఎంచేతంటే, ఆయన పెంపకం కొడుకుగా బాల్యం అలా చేసింది ఆయన్ను. మా తోడల్లుడు కూడా అడిగాడు దత్తత ఇవ్వమని. మా నాన్న గారు వద్దన్నారు. ఆ కాలంలో పిల్లలకి స్వీయ నిర్ణయం తీసుకోవడం ఇష్టం వుండేది కాదు. నేనలాంటివాణ్ణి. అంచేత సంసారం బరువు ఎక్కువ వుండేది. ట్యూషన్ల మీద నడిచేది.

స్కూలు

స్కూలులో చేరిన మొదటి రోజే నాకు సెకండుఫారంకి లెక్కలు, 5వ తరగతికి తెలుగు, ఫస్టుఫారంకి ఏవో సబ్జక్టులు ఇచ్చారు. క్లాసులోకి బితుకుబితుకు మంటూ వెళ్ళాను. ఎంచేతంటే పిల్లలు టీచర్లను అల్లరి పెడతారని విని, ఈ స్కూలులో కూడా అలాగే వుంటుందనుకొని వెళ్ళాను. ఆ రోజుల్లో కార్టూన్లు, అత్తగారు-అప్పడాల కర్రలా, టీచరు, డాక్టర్లు, నర్సుల మీద ఎక్కువ వుండేవి.

టీచర్ల చేత బాధింప పడ్డ వారి మనస్సులో ఒక రకమైన అణచివేయబడ్డ ద్వేషం వుండేది. డాకర్లు చెప్పినట్టు వినాల్సి వచ్చేది. ప్రయివేటు ప్రాక్టీసనర్లు కూడా ఇచ్చినంత పుచ్చుకునే వారు. ఇప్పటిలా డిమాండు లేదు. పేద వారని తెలిస్తే, కొందరు డాక్టర్లు మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు.

జంకుతూ జంకుతూ క్లాసు లోపలికి వెళ్ళిన నేను, రెండూ రెండూ నాలుగు, నాలుగూనాలుగూ పదహారు-అలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక కుర్రాడొచ్చాడు. “నువ్వు అడుగు” అన్నాను. అతను అడుగుతుంటే నేను అలా పై పైకి వెళ్ళాను. అలా 16 అంకెల దాకా వచ్చింది. పిల్లలు ఇంప్రెస్ అయ్యారు. వీడెవడో గట్టివాడిలా వున్నాడనుకున్నారు. ధైర్యం కోసమే అలా చేసాను.

అలాగే 5వ తరగతికి తెలుగు మాస్టార్ని కదా, పద్యాలు చదవమనే వాడ్ని. నాకు పద్యాలు బాగా తెలుసు కదా, వాళ్ళు తప్పు చదివితే, చెప్పే వాణ్ణి. ఎవడో ఒకడు నాకు తెలియని పద్యం చదివాడు. ఇది నాకు రాదని చెప్పి, మళ్ళీ చదవమని, గబగబా చదువుతుంటే, మెల్లగా చదవమని, రెండు సార్లు మనసులో అనుకునే వాడ్నిఅతను చెబుతుంటే, అలా రెండు సార్లు అయ్యాక, మూడో సారి రాసేసేవాణ్ణి. తర్వాత పిల్లలకు చెప్పే వాడ్ని.

పాఠాలు మా మాస్టారి పద్ధతిలో చెప్పేవాణ్ణి. ముందు పిల్లల దగ్గర గౌరవం సంపాదించుకొని, తర్వాత పాఠాలు చెప్పేవాణ్ణి. కొత్త పిల్లలు వచ్చిన ప్రతిసారీ ఇదే పద్ధతి. ఒక్కోసారి కొట్టడం తప్పేది కాదు. ఎందుకంటే, మా ఎలిమెంటరీ స్కూలు నుంచి వచ్చిన వాళ్ళు సరే, మిగతా ఎలిమెంటరీస్కూళ్ల నుంచి వచ్చిన వాళ్ళకు పునాది వుండేది కాదు.

కూడికలూ అవీ చెప్పేటప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్షలు-ఈ స్థానాలైతే చెప్తారు కానీ, అవేమిటనే అవగాహన వుండేది కాదు. ఒకట్లంటే ఒక రూపాయి, పదులంటే పది రూపాయలు, ఇలా అవగాహన కలిగించే వాణ్ణి. నేను కూడికలు వేసి కూడమనేవాణ్ణి. వాళ్ళు ఒకట్ల నుంచి కూడుకుంటూ వస్తుంటే, నేను ఇట్నుంచి కూడమనేవాణ్ణి. వాళ్ళు అదెలా వస్తుందంటే, నేను కూడి చూపించే వాణ్ణి.

నేను పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా కుర్రాడు పక్కకి చూసినా, వేరే వాళ్ళతో మాట్లాడినా కొట్టేసేవాణ్ణి. కొన్నాళ్ళ తర్వాత పాఠం చెప్పేటప్పుడు, వాచీవిప్పి పక్కనే టేబిలుమీద పెట్టేసేవాణ్ణి. అంతే, ఇక ఎవ్వరూ మాట్లాడే వారు కాదు.

నా దగ్గర స్కూలులో చదువుకుని, రచయితలు అయినటువంటి శిష్యులు చాలా మంది వున్నారు. అలాంటి వారు నా గురించి చెప్పేటప్పుడు, “మాస్టారు వాచీ విప్పి టేబిలు మీద పెట్టాడంటే కిక్కురుమనకూడదు” అనే వారు. అలా ఎందుకు చేసేవాణ్ణి అంటే భయపెట్టడానికి. దానికి ఇంకో మార్గం కొట్టాలి. అది నాకు ఇష్టం వుండదు.

తర్వాత, ఎవరినైనా కుర్రాన్ని కొట్టే ముందు, నా చేతిలో వున్న దానితో కొడితే ఎంత దెబ్బ తగులుతుందో, ముందు నా చేతి మీద కొట్టుకుని చూసిన తర్వాతే కొట్టేవాణ్ణి. ఒళ్ళు మరచి ఎప్పుడూ కొట్టలేదు.

1952 దాకా మణుగులు, వీసెలు వంటి పాత కొలమానాలుండేవి. తర్వాత, దశాంశ కొలమానాలొచ్చాయి. అప్పుడు, ఇప్పుడు కూడానూ పిల్లలకి కాన్సెప్టులను అందించడానికి చాలా కష్టపడ్డాను. “వీసం, మణుగు” అనే వారు. ఒక పుస్తకం పట్టుకునీ “దీని బరువెంత?” అంటే ఎవరూ చెప్పే వారు కాదు. అప్పుడు త్రాసు, గుండ్లు తెప్పించి వీసె బరువెంత, మణుగు బరువెంత అనేది అర్థం చేయించే వాణ్ణి.

ఒకసారి ఒక లెక్క అడిగాను. “కోటి రూపాయలిస్తాను. తీసుకురావడానికి ఎంత మంది కావాలి?” ఒకడు లేచి “నేను వెళ్ళి తెచ్చేస్తాను” అన్నాడు. ఇంకొకడ్ని లేపి “తెచ్చేస్తానంటున్నాడు, ఒకడు సరిపోతాడా?” అంటే, ఎందుకో మాస్టారు ఇలా అడుగుతున్నాడనుకొని “లేదు సార్. పది మంది కావాలి” అని చెప్పాడు. అప్పుడు గోదావరి వరదలు వచ్చినప్పుడు 52కోట్లు నష్టం అన్నారు. అందుకోసం ఈ లెక్క వేశాను.

అప్పుడు రూపాయి కాసు తులం బరువుండేది. కోటి తులాలు నష్టం అంటే దానిని 120 చే భాగిస్తే అన్ని వీసెలు, దాన్ని 8 చేత భాగిస్తే అన్ని మణుగులు-అలా లెక్కొస్తుంది. మణుగంటే ఎంత బరువోవీళ్ళకు తెలియదు. 960 తులాలకి ఒక మణుగవుతుంది. అంటే 1000 రూపాయలు.

మణుగు బరువు ఎత్తి భుజాన వేసుకునే వాణ్ణి. చిన్న పిల్ల వానితో ఎత్తించేవాణ్ణి. “వీడు ఒక మణుగు కంటే ఎక్కువ ఎత్త లేడు. మరి కోటిలో ఎన్ని వేలు వున్నాయి?” అంటే 10 వేలు అని చెప్పే వారు. అలా చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసేది. టీచర్లకి నోర్లు మూతలు పడిపోయేవి.

అలా అక్కడి నుంచి కాన్సెప్టులుగా గ్రాములు, మిల్లి గ్రాములు కూడా సైన్సు లేబరేటరీలోకెళ్ళి, వాళ్ళు చేతిలో వేసుకుని తెలుసుకునేలా చెప్పేవాణ్ణి. అలాగే మైలు, ఫర్లాంగులు పిక్నిక్కులు టూర్లకు వెళ్ళినప్పుడు చూపించే వాణ్ణి.

నేను ఒకటవ, రెండవ ఫారాలకి లెక్కలకి ఆథరైజ్డ్ టీచరును. 12 వ తరగతి వరకు ట్యూషన్లు చెప్పే వాణ్ణి. బి.ఎడ్. టీచర్లకి కొంచం గీరగా వుండేది. అందులో ఎం.ఎ. చేసిన ఒక కుర్రాడికి ‘వీడు చెప్పడం ఏంటి’ అన్నట్టు వుండేది. పిల్లలకి హోంవర్కు కొంచెం జఠిలంగా ఇచ్చేవాడు. ట్యూషన్లో అవి చూసి నేనూ కంగారు పడిపోయే వాణ్ణి. నేను ఛాలెంజిగా తీసుకొన్నాను. మా ఆవిడ బంగారం అమ్మి, వరహాల శెట్టి గారి బుక్ షాపులో టెక్స్ట్ పుస్తకాలకు సమాధానాల పుస్తకాలు కొన్నాను.

నా కథా ప్రస్థానం

1948 నాటికి నాకు కథ రాయటం తెలిసింది. అప్పటికే కొన్ని కథలు రాసినా, ’49 లో భారతిలో నా కథలు రావడం ఆరంభం అయ్యింది. అప్పట్లో విశాఖ రచయితల సంఘాన్ని మసూనా గారు చాలా కష్టపడి నడిపించే వారు. ఆయన రచయితా, కవి కూడా. అయినా కూడా ఎక్కువగా కార్యకర్తగానే రాణించారు. దాని వల్లే ఆయన రచన కొంత కుంటుపడిందని నేనకుంటాను. ఆయనకు అంగర సూర్యారావు కుడి భుజంలా వుండే వారు. ఆయన బాగా చదువుకున్న వారు.

విశాఖపట్నంలో మొదటి ట్యుటోరియల్ కాలేజి ‘విశాఖ ట్యుటోరియల్ కాలేజి’ అనుకుంటా. అది సీతారాముల కోవెల దగ్గర వుండేది. అది చాలా ప్రసిద్ధమైంది. ప్రతి ఆదివారం అందులో సభలు పెట్టే వారు. అందరం అక్కడ కలుస్తుండే వారం. బలివాడ కాంతారావు గారు, గండికోట బ్రహ్మాజీ రావు గారు, ఇంకా యల్లాప్రగడ రామారావు, వేల్చేరు సూర్యప్రకాశ రావు లాంటి చాలా మంది యువ రచయితలు, విద్యార్థులు, కొత్తగా వుద్యోగంలో చేరిన వాళ్ళు చాలా మంది సభల్లో ఫాల్గొనే వారు. ఇంక ఎన్.ఎస్.ప్రకాశరావు, బి.టి. రామానుజం కూడా వచ్చేవారు. పెద్ద వారి దగ్గర వీళ్ళు మాట్లాడడానికి జంకే వారు. నేను సులభుడిగా వుండేవాణ్ణి. అంచేత నాతో చర్చించే వారు.

సాయంకాలాలు మేమంతా కలిసి వ్యక్తిత్వాలు, సాహిత్యాల గురించి కబుర్లు చెప్పుకుంటుండే వారం. రావిశాస్త్రి గారబ్బాయి నారాయణ మూర్తి కూడా వుండే వాడు.

నాకు కొడవటిగంటి కుటుంబరావు గారి మాట ఒకటి రక్తంలో ఇంకిపోయింది. “వెలిగే దీపాలు కొత్త దీపాల్ని వెలిగించాలి.”

ఒక నాడు విశాఖ రచయితల సభ అయ్యాక, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, “ఎవడోనండి ఈ వూరివాడూనూ, రాచకొండ విశ్వనాథశాస్త్రి అంట, అడ్వొకేటు అంట, అతను రాసాడండీ నవల, అబ్బ తెలుగు సాహిత్యంలో కొత్త ద్వారాలు తెరిచినట్టు రాశాడు” అని ఎవరో ప్రశంసించారు. ఆ నవల ‘అల్ప జీవి ‘.

సభ అయిన వెంటనే రీడింగ్ రూముకి వెళ్ళిపోయాను. అల్పాజీవి రెండు పార్టులని చెప్పారు. ఆ రెండూ తీసి చదివి, నిశ్చలపోయాను. ఈ పధ్ధతి తెలుగులో ఎక్కడా లేదనిపించింది. రావిశాస్త్రి గారిని కలుద్దామనుకున్నా. ఆయన లాయరు అని చెప్పారు. బాగా చదువుకున్న వాళ్ళకి ఒక ఫోజు వుంటుందని నా నమ్మకం. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు వుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నా అలవాటు. అంచేత నేనెప్పుడూ ఆయనను కలవడానికి సాహసించలేదు.

తర్వాత, ఏదో ఒక సందర్భంలో శ్రీశ్రీ గారు విశాఖ వచ్చారు. అప్పుడు గుడిసెన గుళ్ళు అని పూర్ణా మార్కెట్ దగ్గర వుండేది. రథయాత్ర నాడు జగన్నాథస్వామిని తీసుకొచ్చి అక్కడ వుంచుతారు. మిగతా సంవత్సరం పొడవునా అది ఖాళీయే. అందులో ఏదో సభ.

నేనెప్పుడూనూ సాహిత్య సభల్లో వెనక బెంచీ. ఎంచేతంటే, నాకు చర్చల్లో పాల్గొనేందుకు తగిన సామర్థ్యం వుండేది కాదు. తర్వాత, నేను ఎక్కువగా వినడానికే ఇష్టపడేవాణ్ణి, మాట్లాడేదానికన్నా. మాట్లాడేదానికి శక్తి లేక, తర్వాత, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా.

రకరకాల సంస్థల నుంచి సభకు వచ్చి వుంటారు కదా, స్వీయ పరిచయాలుండేవి. మా వాళ్ళందరూ ఎవరి పరిచయాలు వాళ్ళు చేసుకున్నారు. నేను పరిచయం చేసుకునే ముందే రావిశాస్త్రి పేరు వినబడింది. చూస్తే, ఆయన శ్రీశ్రీ గారికి దగ్గరగా వున్నారు. వారిద్దరికీ ఎ.వి.ఎన్. కాలేజీ రోజుల నుంచీ పరిచయం.

కొంతసేపటికి రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు బయటకొచ్చారు, సిగరెట్ కాల్చడానికి. నాకేమో కిళ్ళీ అలవాటు కదా, నేనూ వరండాలోకి వచ్చాను. “కాళీపట్నం రామారావంటే మీరా?” అని అడిగారు. నా వివరాలు అడిగారు. నేను రాస్తున్న కథల గురించి అడిగారు. నా అభిరుచులు తెల్సుకోడానికి, సాహిత్యం పట్ల నా దృక్పథం తెలుసుకొని నన్ను అంచనా వెయ్యడానికి మరి కొన్ని ప్రశ్నలు వేశారు. నేను జవాబులు చెప్పాను.

ఆ పరిచయంతో నాకు అర్థమైంది ఏమిటంటే, ఆయన నిగర్వి, సులభుడు. తర్వాత, ఆయన సాయంకాలం వేళ, గణపతి రాజు అచ్యుత రాజు నాటక రిహార్సల్స్ దగ్గరికి వస్తుండే వారు. అక్కడ కలిసే వాణ్ణి. ఒకసారి “మీ రచనల ఫైల్ వుందా?” అని అడిగితే, పట్టుకెళ్ళి ఇచ్చాను.

తర్వాత కొన్ని రోజులకు ఆ ఫైలు తిరిగి ఇచ్చేస్తూ, “నేను చదవడం అయ్యింది కాదు. కానీ, మా అమ్మగారు చదివారు. ఇంప్రెస్స్ అయ్యారు. కుటుంబం గురించి రాశారు కదా” అన్నారు. పెంపకపు మమకారం, రాగమయి, అభిమానాలు వంటి నా కుటుంబ కథల గురించి. శాస్త్రిగారు ఎలాంటి వారంటే, నా యజ్ఞం వ్రాతప్రతి ఆయనకిస్తే, అది చదివి “తెలుగు కథ వున్నంత కాలం ఈ కథ వుండిపోతుందండీ” అన్నారు. ఇంకోసారి “నేను యజ్ఞం కథ చదవలేదు” అన్నారు.

ఈ పీడించడం వుంటుంది కదా? “ఇది ఎలా వుంది? అది ఎలా వుంది” అని, అది ఆయనకు గొప్ప చిరాకు. అందుకే చాలా వాటికి, చదవలేదని చెప్తారు. కానీ, ప్రతిదీ చదివే వారని నా నమ్మకం. ఎంచేతంటే, ఎక్కడైనా కామెంట్ చేసేటప్పుడు, ఈయన చదువుతుంటారని స్పష్టంగా తెలిసిపోతుంటాది.

అలాగా శాస్త్రి గారితో పరిచయం జరిగింది. అక్కన్నుంచి ప్రతి రోజూ నా ట్యూషన్లు అయిపోయాక, మా మీటింగు స్థలం దగ్గరికొచ్చేసేవాడ్ని. అక్కన్నుంచి శాస్త్రిగారు, నేను, అచ్యుతరామరాజు మరి కొంతమంది అందరం కలసి కబుర్లు చెప్పుకుంటూ, సరస్వతీ సినిమా హాలుదగ్గరికెళ్ళి, అక్కడ వాకిట్లోనే బెంచీలుండేవి. టీ తాగుతూ కబుర్లు చెప్పుకునే వారం. తర్వాత లీలామహలుకెళ్ళేవారం. అక్కడ అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వారం. అందులో క్రమంగా వాసిరెడ్డి వెంకటప్పయ్య, ఆకెళ్ళ కృష్ణమూర్తి జాయినయ్యారు. వాళ్ళిద్దరూ మంచి లెఫ్టిస్టులు.

అప్పటికి రష్యాలో స్టాలిన్ పోయి కృశ్ఛేవ్ ఇండియా వచ్చి వెళ్ళిపోయాడనుకుంటాను. దాని తర్వాత కమ్యూనిస్టు పార్టీలో ఒక చీలిక వచ్చింది. దాని గూర్చి శాస్త్రిగారూ, వీళ్ళిద్దరూ చర్చిస్తుండే వారు. దాంతో నాకు కమ్యూనిజంలో వస్తున్న మార్పులు, వైరుధ్యాలు అంటుంటాం కదా, వాటి గురించిన అవగాహన ప్రారంభమైంది. దాని ప్రభావం నా మీద వుండింది. 1968 దాకా కూడా దాని మీద అవగాహన కోసం ప్రయత్నం చేస్తుండే వాడ్ని. రష్యన్ కమ్యూనిజం ఇంటర్నేషనల్ కమ్యూనిజంగురించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత 1968లో ‘వీరుడు-మహా వీరుడు’ కథ రాసాను.

అప్పట్లో రావిశాస్త్రి ఈ లెఫ్టిస్టులవైపు మొగ్గడం నాకు అయిష్టంగా వుండేది. “మంచి రచయిత కదా? ఈయనేంటి ఇలా?” అనుకునే వాణ్ణి. “నేనెందుకురాశాను?” అని శాస్త్రిగారు 1962లో అనుకుంటా, ఒక శీర్షిక ప్రవేశ పెట్టారు. ఆ శీర్షికకు నన్ను రాయమన్నారు. “నేను రాయడం మానేసాను కదా” అంటే, “ఎందుకు మానేసారో అది రాయండి” అన్నారు.

అది నేను రాసినప్పుడు నన్ను నేను లోపలికి చూసుకోవడంతో నేను చేస్తున్న తప్పు, దాని వెనకాలవుండే స్వార్థం ఇవన్నీ నాకు అగుపడ్డాయి. తర్వాత నన్ను నేను సవరించుకోవడం చేశాను. అలా ఆలోచించాక, లెఫ్టుకేసి మొగ్గాలనిపించింది. మొగ్గాలనిపించడం విధి అనిపించింది. ఆ అలజడిని చిత్రిస్తూ ‘వధ’ అన్న కథ రాశాను. ‘వధ’ కథను భారతికి పంపిస్తే, వాళ్ళు తిప్పి పంపారు. అంతవరకు నేను పంపింది ఏదీ తిరిగి రాలేదు. శాస్త్రిగారు ‘విశాఖ’ అని ఒక పత్రిక నడిపారు కొద్ది నెలలు. అందులో వేసారు.

కథ గురించి ఒక కాన్సెప్టు వుంది నాకు. కథ అంటే సంఘటనలు, పాత్రలు, సన్నివేశాలు, అవి వ్యక్తం చేసే విషయాలు కథ అని నేను అనుకోను. “కథ బీజ రూపంలో వుంటుంది. ‘నేను’ అనే దానికి చేతులు, కాళ్ళు, కన్ను, ఆలోచన్లు ఎలా ఉపకరణాలో, కథకి సంఘటనలు, పాత్రలు, సన్నివేశాలు-ఇవన్నీ ఉపకరణాలే కానీ, ఇదే కథ కాదని నా వుద్దేశం” అని అప్పుడు రాశాను.

ఏదైనా వృత్తాంతం వ్యక్తం చేయడానికి ఇవన్నీ ఒక రూపుగా ఏర్పడతాయి. వృత్తాంతం సంఘటనలు, సన్నివేశాలుగా వ్యక్తం అవుతుంది. కథా రచనకి సంబంధించి చాలా పుస్తకాలు చదివాను. ప్రతి దాని మీదా నాకు కొన్ని అనుమానాలున్నాయి. ఒక దానికి, ఇంకో దానికి పొంతన లేదు. వాటి జోలికి పోకుండా, నా కాన్సెప్టు నేను ఏర్పరచుకొన్నాను. దాన్ని ఒక వ్యాసంగా కూడా రాసాను. జ్యోతిలో వచ్చిందనుకుంటా.

కథనీ, లోకాన్నీ, సాహిత్య ప్రయోజనాన్ని వీటన్నినిటినీ చూసి అర్థం చేసుకోవడం శాస్త్రిగారితో పరిచయం లేకుంటే, ఇలాగ మాత్రం జరిగుండేది కాదు. అది శాస్త్రిగారితో పరిచయం వల్ల కలిగిన ప్రయోజనం.

1955 తర్వాత రాయటం ఎందుకు మానేసానంటే, శాస్త్రిగారు తను ఏ రచన చేసినా వాటి గురించి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఒక ముగ్గురు, నలుగురి చేత తన మాన్యుస్క్రిప్టులను చదివించేవారు. వారిలో నేను ఒకణ్ణి. ఆయన కథలేంచేస్తాయంటే, పట్టుకుని ఈడ్చుకుపోతాయి. మొదటిసారి చదివినప్పుడు నేను కొట్టుకుపోయేవాణ్ణి. వెంటనే మళ్ళా చదివేవాణ్ణి. అప్పుడు పరిశీలిస్తూ చూడ్డానికి సాధ్యమవుతుంది. మొదట పాఠకుడిగా, తర్వాత ఒక శిష్యుడిగా, విద్యార్థిగా, రైటర్గా పరిశీలించే వాణ్ణి.

శాస్త్రి గారి దగ్గర నుంచి కథానిక అంటే ఏమిటో తెలుసుకున్నాను. నావి కథానికలని చెప్పడానికి లేదు. ఏదో కథ చెప్పే వాడ్ని అంతే.

రెండవ తడవ రాసినవి కథలైనా సరే, వాటికి కథానికా రూపం వచ్చింది. నాకు ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషు అనువాదకులపై వైముఖ్యాన్ని ఎవరో ఏర్పరచారు నాకు. ఇవాళ పశ్చాతాప పడుతున్నాను. ఎంచేతంటే, ఇటీవల ఎం.వి. రమణారెడ్ది అనువాదం చేసిన ‘చివరికి మిగిలింది’ చదివాను. చాలా బాగుంది. అది ‘గాన్ విత్ ది విండ్’కు అనువాదం. సినిమా కూడా వచ్చింది. ఇలాంటివి నేనప్పుడుచదివుంటే, ఇంకా మంచి రచయితనయ్యివుండేవాడిననుకుంటా. బైరప్ప’పర్వ’, ‘దాటు’ లాంటి నవల అవలీలగా రాసి వుండేవాడిని ఏమో.

శాస్త్రి గారిది అనితర సాధ్యమైనటువంటి ధోరణి. కొట్టుకుపోతుంటుంది. కానీ, దాన్ని అర్థం చేసుకోగలను. ఆయన లాయరు. కోర్టులో ఓడిపోయినటువంటి న్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకు రావాలని చెప్పి, ఆ న్యాయాన్ని కథగా, నవలగా రాసే వారు.

మొన్న రాయుడు గారు ఒక తమాషా ప్రశ్న వేశారు. “‘రాజు-మహిషి’ నవలా?” అని అడిగారు. నేనేమో “కాదు అది షార్ట్ స్టోరీ” అన్నాను. ఎందుకంటే, శాస్త్రిగారు కథలు రాయడం గురించి ఒక వ్యాసం రాస్తూ, అందులో, ‘’నీ ప్రియురాలి కోసమని చెప్పి, ఒక గులాబీ మొక్కను పెంచి, అది పువ్వు పూసిన తర్వాత మర్నాడు పట్టుకెళ్దాం అనుకుంటూ వుండగా, దాన్ని పొరుగింటి రాజమ్మ గేదె తినేస్తే, అది కథగా రాయచ్చు’’ అన్నారు. అది నవలగా రాశారు. రాయుడు గారు ఎందుకడిగారో తెలుసు కాబట్టి, అది కథానికే కానీ, నవలగా కూడా రాయచ్చుఅన్నాను. కవిత్వం, నాటకం, నవల ఏదైనా బీజ రూపంలో వుంటుంది.

చూడటం, చూసిన దానికి రూపు ఏర్పరచడం ఇది అనలెటికల్గా నాకు తెలియదు. కానీ, ఒక రకమైన అవగాహన ఏర్పడింది. ఇంట్యూషన్లా శాస్త్రిగారి ద్వారా వచ్చింది.

కమ్యూనిస్టు రాజకీయాలు

1952లో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ మంచి బలం పుంజుకుంది. కేరళలో లాగా ఈ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని కాంగ్రెస్ గజగజలాడింది. వీటన్నిటినీ గమనించే వాణ్ణి. రచయితగా వీటి ప్రభావం నా మీదుంది.

ఒక టర్మ్ అయ్యాక, మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగేటప్పుడు కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆరుద్ర, నండూరి రామ్మోహన్ రావు, మరి కొంత మంది ప్రోగ్రెసివులు కూడా కాంగ్రెస్ను బల పరుస్తూ కాకినాడలో శ్రీశ్రీకి పిచ్చెక్కిపోయే స్టేట్మెంటు ఇచ్చారు. రావిశాస్త్రి గారు మాత్రం కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రచారం కూడా చేసారు. ఆయన మీద వెంకటప్పయ్య, కృష్ణమూర్తిల ప్రభావం ఎక్కువగా వుండేది.

నేను ఏదో భిన్నంగా మాట్లాడితే, శాస్త్రిగారు హర్ట్ అయ్యారు. నా అవగాహనను కరెక్టు చేస్తున్నట్లు కొంచెం మందలిస్తున్నట్టు మాట్లాడారు. మామూలుగా ఆయన నా పట్ల చాలా మృదువుగావుండే వారు. అలాంటి అతను గొంతు పెంచి చీవాట్లేస్తున్నట్టు అనిపించింది.

అప్పట్లో ఐ.వి. సాంబశివ రావు అని వుండే వారు. ఇతను కూడా వుద్యోగం చేస్తూ, నాటకాలలో తిరుగుతూ, శాస్త్రిగారితో సన్నిహితంగా వుండే వాడు. శాస్త్రి గారు ఐ.వి.ని నా మీద ప్రయోగించారనే అనుమానం వుంది నాకు. శాస్త్రిగారితో ప్రతివాదం చేయలేను కానీ, ఐ.వి.తో చేయగలను. అంచేత నా అవగాహన మార్చడానికి శాస్త్రిగారు ఐ.వి. తో ప్రయత్నించే వారని నా నమ్మకం.

శాస్త్రిగారు నన్ను మాస్టారనే పిలిచే వారు. నేను శాస్త్రిగారనే పిలిచే వాణ్ణి. అన్నతో, గురువుతో మాట్లాడుతున్నట్టే మాట్లాడేవాణ్ణి.

పార్టీ, పార్టీ విధానం, మార్క్సిజం ఇవన్నీ రోజూ చర్చించుకునే వాళ్ళం. శాస్త్రి గారితో ఏ రాత్రీ 12 లేదా ఒంటి గంట అయ్యేది. ఐ.వి.తో మాత్రం తెల్లారిపోయేది. మొహాలు కడుక్కుని, టిఫన్ తిని ఇంటికి వెళ్ళే వారం.

చైనా యుద్ధ కాలంలో, 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. షిప్ యార్డులో పనిచేసే వాసిరెడ్డి వెంకటప్పయ్య, ఆకెళ్ళ కృష్ణమూర్తి ఇద్దరూ సి.పి.యం.లో చేరిపోయారు. అప్పటి నుంచి సి.పి.ఐ.ని విమర్శించేలా చర్చలూ, కబుర్లూ వుండేవి. నేనంతా వింటుండేవాణ్ణి.

నేనెప్పుడూ అరసం వైపు వెళ్ళేదు. సి.పి.యం. వైపు కూడా వెళ్లలేదు. 1962-’63లో ‘ఇల్లు’ అని ఒక కథ వచ్చింది. తర్వాత ‘తీర్పు’ వచ్చింది. దాని తర్వాత ’63లో ‘యజ్ఞం’ రాసాను. అది ఎలా జరిగిందంటే, రెండోసారి కమ్యూనిస్టు పార్టీ దెబ్బ తినేసింది కదా, మా వూరి వారు ఎకనామిక్ కబుర్లు చెబుతుంటే, నేను సవరించే వాణ్ణి. దీని గురించి రాయాలని నా మనసులో వున్న దానిని ఐ.వి. శాస్త్రిగారికి చెప్పాడు. శాస్త్రి గారు నవలగా రాయమన్నారు. నాకేమో ట్యూషన్ల గొడవ. మొత్తమంతా మనసులో వున్నా, రాయలేదు. ఐ.వి. రోజూ నన్ను కలిసి సతాయించే వాడు. “అలలు ఆగిన తర్వాత స్నానం చేస్తానంటే కుదుర్దు. నువ్వు రాయి” అనే వాడు.

ఎప్పుడో ఒకప్పుడు ఒక ఎమోషన్ వస్తుంది కదా, నాకు ఇది ఎలా రాయడం అని ఆలోచిస్తుంటే, మొట్టమొదట అప్పల్రాముడు అగుపడ్డాడు. పద్మ విలాస్లో కాఫీ తాగుతుంటే, అతని రూపు, పాత్ర అగుపడింది. తర్వాత, మా వూరి చరిత్రను ఆధారం చేసుకుని రాసాను.

1963లో మరొక ఇన్సిడెంట్ జరిగింది. నెహ్రూ నాయకత్వం బలహీన పడింది. ఎందుకలా అన్నానంటే, పేపర్లో చదివింది, రేడియోలో విన్నది, టీవీలో చూసింది నమ్మను. ఫలితాలు ఇంకోలా infer చేస్తాను. అందులో ఒకటేమిటంటే, అప్పటి కాంగ్రెస్ మహా సభల్లో నెహ్రూకి గుండె పోటు వచ్చింది. అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, రాజకీయాల్లో ఈయన పని అయిపోయిందని.

నెహ్రూ సోషలిస్టు తరహా ప్రజాస్వామ్యం వుండాలని అన్నాడని లెఫ్టిస్టులు కూడా ఆయన్ని బలపరిచారు. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, తప్పయితే కావచ్చు, ఈ దేశంలో మన కమ్యూనిస్టులు ఎప్పుడూ కూడా ఎవరికో ఒకరికి భావదాస్యం చేస్తూ వచ్చారు. కొన్నాళ్ళు రజనీ పామీదత్ వీరి నాయకుడు. ఆయనేం చెబితే వీళ్ళకది వేదం. రష్యా వాళ్ళు ఏది చెబితే అది చేసేవారు. ఎంచేతంటున్నానంటే, మాకు చిన్న కమ్యూనిస్టు, పెద్ద కమ్యూనిస్టు అంటూ ఇద్దరుండేవారు. వాళ్ళకు విగ్రహారాధనలా, నాయకుల ఆరాధన వుండేది. అది వుండకూడదని నా అభిప్రాయం.

రావిశాస్త్రి పట్ల నాకు ఆరాధన లేదు. నా కళ్ళు తెరిపించినందుకు గౌరవం, అభిమానం మాత్రమే వుండేవి. అందుకు ఋణగ్రస్తుడను అని కూడా నేననుకుంటాను. అలాగే, ఆయనలోనూ లోపాలున్నాయి. ఎవరికీ తెలియని కొన్ని లోపాలు నాకు తెలుసు. ఆయన లోపాల వల్ల, సమాజం గానీ, సాహిత్యం గానీ ఏమీ నష్టపోలేదు.

ఆయన జాతకం అని ఒక కథ రాసారు. ఆయన జాతకాల్ని నమ్ముతారు. దానికి కారణాలున్నాయి. నేను కూడా జాతకాల్ని నమ్మాను ఒకప్పుడు. ఇప్పుడు కూడా జాతకాల్ని తీసిపారేయను కానీ, దాని ప్రకారమే వెళ్ళాలని అనుకోను. నా జాతకం ప్రకారం 2013 దాకా నాకు ఢోకా లేదు. అయితే అవుతుంది, లేకపొతే లేదు. దాని లైన్లో ఆలోచించడం వరకు నష్టమేం లేదని నా నమ్మకం. శాస్త్రి గారూ అంతే. ప్రతి దానికీ దాని మీద అధారపడ్డ వారు కాదు.

అలా కమ్యూనిస్టులు భావ దాస్యం చేయడాన్ని కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల వాళ్ళు వెక్కిరించే వారు. అది ఎందుకు ఆలోచించే వారు కాదో నాకు బోధపడ లేదు.

యజ్ఞం కథ గురించి

మా ప్రాంతంలో,మురపాక, బొంతల కోడూరు, తామాడ, కేశరావుపాళెం, మరికొన్ని వూర్లలో వుండే పట్టుశాలీల్లో తెలివైన, గడుసైన వారు షావుకార్లు అయ్యేవారు. షావుకార్లంటే అప్పులిచ్చే వారు.

‘యజ్ఞం’లో ఒక అప్పు వ్యవహారం వుంది. ఇప్పుడు చెప్పేస్తున్నా.

వాళ్ళ సంవత్సరం చైత్ర శుద్ధ పాఢ్యమితో ఫ్రారంభం అవుతుంది. వాళ్ళకు చిట్టాలూ, అవీ వుంటాయి. అందులో ఫలానా రైతు ఫలానా పేజీలో ఏ తారీఖున అప్పు తీసుకున్నది వుంటుంది. అప్పట్లో తెలుగు అంకెలు వుండేవి. కూడికలూ, గుణకారాలన్నీ తెలుగు అంకెల్లో జరిగేవి. నా చిన్నప్పుడు నాకు తెలుగు అంకెలు వచ్చు.

పాఢ్యమి నుంచి కొత్త అమావస్య, సంవత్సరంలో ఆఖరి రోజు వరకు ఏ తారీఖున ఎంత అప్పు, ఫలానా వారికి ఇచ్చారు అనేది రాస్తారు. ఇదంతా మొత్తం కూడేస్తారు. ఆ వచ్చిన దాని మీద నెలకి ఒక రూపాయకి ఒక కాణీ వడ్డీ. అంటే 12 నెలలకి 12 కాణీలు అని వడ్దీ లెక్కగడతారు. అయితే బ్యాంకులో వడ్డీ ఏ తేదీన తీసుకుంటే ఆ తేదీ నుంచి లెక్కగడతారు. కానీ ఈ షావుకార్లు సంవత్సరం పొడవునా ఎప్పుడు తీసుకొన్నా, సంవత్సరం మొదట తీసుకున్నట్టే లెక్కగడతారు.

1938లో కాంగ్రెస్ వాళ్ళు డెట్ రిలీఫ్ చట్టం తీసుకొచ్చారు. అప్పుడొచ్చింది ఈ కాణీ వ్యవహారం. రూపాయికి నెలకి ఒక కాణీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ, ఆఖరి రోజున, కొత్త అమావస్య నాడు అప్పు తీసుకున్నా, దాని మీద సంవత్సరం అంతా వడ్డీ పడుతుంది. అందుకే ఆ అప్పులు ఎప్పుడూ తీరేవి కావు. ఇదంతా ‘యజ్ఞం’లో ఏ పాత్రతో చెప్పించాలా అని కొట్టుకు చచ్చాను. అప్పల్రాముడి నోటి వెంట చెప్పించడం కుదర్దు. నాకు కథ నడిచినట్టు వుండాలి. అందుకే చెప్పించలేకపోయాను.

దేశంలోని మౌలిక సదుపాయ నిర్మాణానికి కావాల్సిన పెట్టుబడిని పంచవర్ష ప్రణాళికల ద్వారా తీసుకున్నట్టు నాకు అనిపించింది. అందువల్ల నెహ్రూని నాయకునిగా చేసి, యజ్ఞం కథలో శ్రీరాములు నాయుడిగా ఆయనను తీసుకున్నాను.

మా వూర్లో ఒక సంఘటన జరిగింది. మా వూర్లో దాసన్న గారి కుటుంబం సంపన్న కుటుంబం. ఆ అన్నదమ్ముల్లో ఆఖరి వాడు జల్లేపల్లి కూర్మానాయుడు. ఆయన 3వ ఫారం చదివాడు. నవలలూ అవీ చదివే వాడు. నేను సాహిత్యం అదీ రాస్తున్నానని తెలిసి “ఏంటి రామారావు రాస్తున్నావు?” అన్నాడు. అతను బాగా చొరవ వున్న మనిషి. ఎవరినయినా పట్టుకొని వాడుకోగలిగే వాడు.

నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక అమలు చేస్తున్న రోజుల్లో, గ్రామీణాభివృద్ధి కోసమని రకరకాల పద్ధతులొచ్చాయి. అందులో భారీ నిధులువుండేవి. అతను ఆ చొరవను వుపయోగించుకున్నాడు. అంతకు ముందు మా నాన్నగారు, మునసబుగారు రోడ్లు మొదలైన వాటి కోసం ప్రయత్నించి ఫెయిలయ్యారు. కానీ కూర్మానాయుడి చొరవతో మా వూరికి రోడ్లు, మిగిలినవన్నీ వచ్చాయి.

యజ్ఞం కథలో శ్రీరాములు నాయుడు వూర్లోకి తెచ్చిన ఒక్క ప్రయోజనాన్ని కూడా వాడుకోని వాడు. కూర్మానాయుడు భూములు సంపాదించి, తోటలూ అవీ పెట్టి అభివృధ్ధి చేసాడు. సహకార సంఘాలు అవీ పెట్టి, వాటన్నిటి ప్రయోజనం పొందాడు. రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు పెట్టాడు. ప్రజల దగ్గర విరాళాలు సేకరించి దేవాలయాలు కట్టించాడు. రాజకీయంగా చనువు సంపాదించి నాయకుల పేరుతో ఒక కాలనీ కట్టాడు.

ఇవన్నీ చేసిన ఇతన్ని నాయకుడిగా తీసుకోలేదు నేను. నిస్వార్థపరుడ్నే నాయకునిగా తీసుకున్నాను. అలా ఎందుకంటే, నిస్వార్థంగానే చేసినా, ఒక విధానం వల్ల ఒక వర్గం వారు దెబ్బతింటారు. ఇంకొక వర్గం లాభపడుతుంది. అతని భావజాలం వల్ల, స్థాపించిన సంస్థల్ని నడపడంలో అవగాహనా లోపం వల్ల ఒక వర్గం దెబ్బ తింటుందని చెప్పడం నా లక్ష్యం.

ఇది నేను కావాలనే క్రియేట్ చేసాను. కానీ, ఎవరూ నమ్మరు. ముఖ్యంగా రంగనాయకమ్మ లాంటి వారు. అలా ఎందుకంటే, వీడు సెకండరీ గ్రేడు టీచరు, పల్లెటూరి నుంచి వచ్చాడు, బ్రాహ్మణుడు కాబట్టి వీడికి ఇంత ఊహ వుంటుందని నమ్మరు. నండూరి రామ్మోహన్ రావు ఏదో రాస్తూ, “అప్పల్రాముడికి ఆర్ధిక విశ్లేషణ సాధ్యమవుతుందా?” అన్నాడు. నేను జవాబు చెప్పాను. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి పుట్టుకతో వచ్చేది. జ్ఞానం సంపాదించుకుంటే వచ్చేది. తెలివి ఏ కులం వాడికైనా వుంటుంది.

అయితే కొన్ని పరిమితులువున్నాయి. దాన్ని దాటలేకే యజ్ఞంలో అప్పు గురించి క్లియర్గా చెప్పించలేకపోయాను. 3-4 నెలలు కష్టపడ్డాను.

ఇంట్యూషన్ను నేను నమ్ముతాను. రైటర్కి ఒక రకమైన ఆవేశ స్థితి ఏర్పడినప్పుడు, అన్నీ దానంతట అవి కనిపిస్తాయి. అతని ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. నాలో అటువంటిది కల్గినప్పుడు తప్ప, నేనెప్పుడూ కలం పట్టలేదు.

ఏది రాసినా సరే, నిర్మాణం, సృజన అని రెండు వుంటాయి. సృజన శక్తులు విజృంభించినప్పుడు ‘యజ్ఞం’ లాంటి కథలొస్తాయి. నిర్మాణం-మనం ఎప్పుడైనా కూర్చొని నిర్మించవచ్చు. దానికి తెలివితేటలు, నేర్పువుంటే చాలు.

ఆ విధంగా యజ్ఞం పుట్టింది. ముగింపు దగ్గరికి వచ్చేసరికి, శ్రీరాములు నాయుడిని పూర్తిగా unfold చేసాను. శ్రీరాములు నాయుడు నెహ్రూ అయితే, అప్పల్రాముడు సి.పి.ఐ. లెఫ్టిస్టు. వాడు కబుర్లన్నీ చెబుతాడు కానీ, భావదాస్యం మాత్రం వదలడు. అప్పల్రాముడ్ని unfold చేసి నిజస్వరూపాన్ని ఒలిచింది ఎవరంటే, సీతారాముడు. సీతారాముడ్ని కూడా unfold చేసి వాడి లోపాల్ని చెప్పాను. సీతారాముడ్ని కనువిప్పు కోసం వాడుకున్నాను.

కుర్రాణ్ణి చంపడం నాకూ ఇష్టం లేదు. నిజంగా అక్కడ ఒక సీతారాముడూ లేదు, కుర్రాణ్ణి చంపడమూ లేదు. అదొక టెక్నిక్‌గా వాడుకున్నాను. కథను సీరియస్గా తీసుకోవడం కోసం సీతారాముడు ఆ పని చేసాడని చెప్పాను. కానీ మార్క్సిస్టులు కూడా తప్పు పట్టారు. ‘పిలుపు’ అన్న పత్రికలో కొండపల్లి సీతారామయ్య గారు కూడా తప్పు పట్టారు.(రచయితకి రైతు సెంటిమెంటు తెలియదు అన్నారు)దానికి నేనెక్కడా జవాబివ్వ లేదు. సీతారామయ్య గారు ఒక కారణం కోసం ఎంతో మంది యువజనుల ప్రాణాలను పణంగా పెట్టాల్సివచ్చింది. సీతారాముడు కూడా తండ్రి “నిశానీ పెట్రా” అన్నప్పుడు ఒక కనువిప్పు కోసం చేసాడని చెప్పాను. వాసిరెడ్డి వెంకటప్పయ్య, ఆకెళ్ళ కృష్ణమూర్తి వల్ల రావిశాస్త్రి కూడా ప్రభావితమయ్యారు.

యజ్ఞం కథను ఏ పత్రికకు పంపాలి? భారతి నా కథను తిప్పి పంపింది కదా, ‘యువ’కు పంపిస్తే ఒకటిన్నర సంవత్సరం వరకు అచ్చు వేయలేదు. రావిశాస్త్రి హైదరాబాద్ వెళ్లినప్పుడు వాకబు చేసారు.

నేను కథ రాయడం రాస్తాను గానీ, దాని మోతను పట్టించుకోను. వచ్చిందాకా ఆతృత పడటం వుండదు. బాగుంటే వేస్తారు. లేకపోతే లేదు అనుకునే వాడ్ని. అదీకాక సొంత వ్యవహారాలు చాలా వున్నాయి.

నేను కథలు రాసేటప్పుడు వాటిల్లో అవాస్తమైన తప్పులు ఏమీ లేవని మా తమ్ముడు చెప్తే తప్ప నేను ముందుకెళ్ళలేదు. అలాగే ‘కుట్ర’ అన్నది ఎకనామిక్స్ కు సంబంధించినది. నేను ఎకనామిస్టును కాను. కానీ, ఒక దృక్పథంతో విషయాలని చూడటం, అర్థం చేసుకోవడం, మార్క్సిజం తాలూకా బీజాలు నాకు తెలియడం వుంది. అనుమానం వచ్చిన చోటల్లా వెంకటప్పయ్య గారు సరిగా వుందో లేదో చెబుతుండే వారు. ఆయన పోయిన తర్వాత, 1972లో రాసిన ‘కుట్ర’ కథను ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్టుమెంటు హెడ్డుకు చలసాని ప్రసాద్ గారు ఇచ్చి అందులో అవాస్తమైన తప్పులు వుంటే చెప్పండనే వారు. అతను “ఏం తప్పులు లేవు” అన్నాకే దాన్ని అచ్చుకిచ్చాను. అంత ప్రూవ్ చేసుకోందే నేనేదీ అచ్చుకివ్వలేదు.

నేను వుదయం 4.30కి ట్యూషను మొదలు పెడితే, స్కూలు తర్వాత మళ్ళీ రాత్రి 10 వరకు చెప్పే వాణ్ణి. సైకిలు వుండేది. ఇంటి నుండి క్యారేజి వచ్చేది. స్కూలుకు వెళ్ళే ముందు గబగబా నోట్లో వేసుకుని పరిగెత్తే వాడ్ని. ఇంత పని వత్తిడిలో ఎప్పుడు రాసానంటే, లీజర్ పీరియడ్ వుంటే వాడుకునే వాణ్ణి. ఒక్కొక్కప్పుడు, ఎమోషన్ తట్టుకోలేకపోతే, పిల్లలకి తగిన పని ఇచ్చేసి రాసుకునే వాణ్ణి. ఒక్కోప్పుడు ట్యూషన్లకి డుమ్మా కొట్టి రాసేవాణ్ణి. కానీ, ఎప్పుడూ నా విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యే వారు కాబట్టి, ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. కానీ, నాకు జ్వరం వచ్చినా కూడా, ఆ జ్వరం విడవగానే సైకిల్ ఎక్కేసేవాణ్ణి. పథ్యం తీసుకునే టైములో సైకిలు వేసుకొని వెళ్ళి పాఠాలు చెప్పేవాణ్ణి. ఆదివారాలు కూడా పాఠాలు చెప్పేవాణ్ణి.

ఈ విధంగా విపరీతంగా పని ఒత్తిడితో వుండగానే నా సాహిత్యమంతా రాశాను. చిట్టచివరి రచన దాకా ఇలాగే రాసాను. తీరిగ్గా వుండగా ఏదీ రాయలేదు.

నేను సెకండరీ గ్రేడు టీచరు కదా, స్కూలులో బి.ఎడ్. టీచర్లు వుండే వారు. వారికి వారు పెద్ద వాళ్ళుగా అనుకునే వారు. మా తెలుగు డిపార్టుమెంటులో కూడా అలాంటి వారు వుండే వారు. నాకు అలాంటి వాటిని ఓర్చే గుణం వుండేది కాదు. నేను పరీక్షలు రాయలేదు కానీ, బాగా చదివిన వాడ్ని. నాకు తెలుగులో పునాది గట్టిది. అప్పకవీయం, వ్యాకరణం బాగా చదువుకున్నాను. పండితులు కొంచెం గర్వంతో వుంటే, నేను వాళ్ళని కొన్ని డౌట్లు అడిగే వాడ్ని. ఛందస్సు, గురువులు, లఘువులు వంటి వాటి గురించి. వారు చెప్పలేకపోతే, నేను వివరించి చెప్పే వాడ్ని.

“నీకు ఎకనామిక్స్ ఎలా తెలుసు?” అన్నారు. చూడగలిగే శక్తి, కోరిక వుండటం వల్ల తెలిసింది. “మాస్టారుకు యజ్ఞం లాంటి కథ రాయడం ఎలా సాధ్యం?” అన్నారు రంగనాయకమ్మ. ఆమెతో ఆ వ్యాసం రాయించిన వారు వేరు అని నా నమ్మకం. సూచించిన వారు, మెటీరియల్ అందించిన వారు వేరు. ఆవిడకి ఈ unfold టెక్నిక్ ఇష్టం వుండదు. క్లియర్గా, కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పాలి. అయితే అది, చెబితే వినే వాళ్ళకి. వాళ్ళు ఇంకొకరు చెబితే వింటారు. గ్రహించే వాళ్ళు ఇంకొకరు చెబితే వినరు. వాళ్ళు గ్రహింపుకొస్తారు. మనిషి మారాలంటే వాడంతట వాడే గ్రహించాలి.

మళ్ళీ స్కూలు గురించి

అప్పట్లో మేం చదువుకునేటప్పుడు, జామెట్రీ, ఆల్జీబ్రా మాత్రమే వుండేవి. ట్రిగొనామెట్రీ, కేలిక్యులస్ ఇవన్నీ పుస్తకాల ద్వారా సొంతంగా నేర్చుకున్నవే. అలాగే ఇంగ్లీషు గ్రామరు కూడా నేర్చుకున్నాను. నేను ఒక పాఠం నుంచి ఇంకో పాఠానికి వెళ్ళడానికి పావు గంటో, అర గంటో టైము తీసుకునే వాణ్ణి. ఆ టైములో మెంటల్గా ఆలోచించే వాణ్ణి. అలా నా శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే వాణ్ణి.

ట్యూషన్ పిల్లలందరూ కూడా, ఇవాళ్టికీ నన్ను గురువుగానే చూస్తారు. డాక్టర్లు కూడా నా శిష్యులు వున్నారు. వారు కూడా చాలా గౌరవంతో చూస్తారు. చాలా మంది చాలా బిజీగా వుండి, అపాయింటుమెంటు లేకుండా చూడరు. కానీ నన్ను మాత్రం వెంటనే చూస్తారు. అంటే, గురువులు ఎంత శ్రద్ధగా పాఠం చెబుతారో, శిష్యులు అంత గౌరవంగా మసులుకుంటారు. నాకున్న గొప్ప సంపదల్లో ఇదొకటి. స్టూడెంట్లను ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ చేయించి వారంతట వారే గ్రహించేట్టుగా చేయడమే నా టీచింగ్ స్పెషాలిటీ.

ఇంకొక విషయం చెప్పాలి. నేను చేరుతున్నప్పుడు క్రిస్టియన్ స్కూలు అని మా అన్నయ్య భయపడ్డాడు కదా, కానీ అది నిజం కాలేదు. ఆ స్కూలు కరస్పాండెంట్ ఫాదర్ గోపీనాథ్. ఆయన తర్వాత బిషప్ అయ్యారు. నేను ‘విరసం’లో చేరినప్పుడు, న్యూస్ పేపర్లలో నా పేరు చూసి బిషప్ నన్ను పిలిచి “రామా రావ్, ఆర్యూ ఎ కమ్యునిస్ట్?” అని అడిగారు. “కాదండీ” అన్నాను. “కానీ, రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్లో నీ పేరు వుంది?” అన్నారు. “అవునండీ” అన్నాను. కానీ, నన్ను స్కూల్ నుండి తీసెయ్యలేదు.

అంతకు ముందు ‘సోవియట్ భూమి’ అనే పత్రికని స్కూలులో నేనుండగా పోస్టుమ్యాన్ తీసుకొచ్చాడు. అది చూసి, “ఈ పత్రిక నీకెందుకొస్తుంది?” అంటే, “రచయితలందరికీ పంపిస్తారు”, అంటే, “అంతేనా, లేక లెఫ్టుతో సంబంధం వుందా?” అంటే, “లేదండీ, నేను ఏ పార్టీలోనూ లేను” అన్నాను. నా మీద ఎప్పుడూ ఏక్షన్ తీసుకోలేదు.

ఆయన చివరి దశలో హాస్పిటల్లో వుండగా, నేను, సీతారామ్మూర్తి అని ఇద్దరం వెళ్ళాం. ఆయన పులి. ఆయనను చూస్తే టీచర్లకీ, పిల్లలకీ దడ, ప్రేమ. అట్లాంటాయన మంచం మీద మేము చూడడానికెళ్తే కళ్ళ నీరు పెట్టుకున్నారు. నాలో సేవాభావం, అంకిత భావం ఏమైనా వుంటే, అవి బిషప్ గోపీనాథ్ గారి నుంచి వచ్చినవే.

ఆయన స్కూలు బాగు, పిల్లల బాగు గురించి ఆలోచించాడు కానీ, మతం గురించి ఆలోచించ లేదు. అతను క్రిస్టియన్ అయినా, ఆయనకు క్రైస్తవం పట్ల కాకుండా, సంస్థ పట్ల ప్రేమ వుండేది. దాన్ని ఒక విద్యా సంస్థగా మాత్రమే నడిపాడు. అందులో క్రిస్టియన్ పిల్లలు కూడా తక్కువే. అతను నాకు ఇన్స్పిరేషన్. ఆయనటే చాలా భక్తి, గౌరవం.

కుటుంబం

నాకు సరిగా జ్ఞాపకం లేదు గానీ, చాలా కాలం వరకు నేనే కుటుంబ నిర్వహణ చేసాను. ఒక దశకొచ్చిన తర్వాత, మా బంధువు ఒకాయన ఇంటికి సాయంకాలం వెళ్ళాను. ఆయనతో చాలా సేపు మాట్లాడాను. ఉదయం ఆయన పోయాడని కబురు మోసుకొచ్చారెవరో. అప్పటి నుంచి నాకు బెంగ పట్టుకుంది. అప్పటికే ఏడుగురు పిల్లలతో కాపురం. నాకు ఏమన్నా అయితే ఎలాగ?

మా గృహిణికే కుటుంబ నిర్వహణ నేర్పుదాం అని చెప్పి, అప్పటి దాకా బంధువుల ఇళ్లకు తప్ప బయటకు వెళ్ళని ఆమెను, బజారుకి పంపించడం, జీతం మొత్తం తెచ్చి ఆమెకు ఇస్తే, ఆమె కుటుంబాన్ని నిర్వహించడం, పిల్లల్ని అదుపులో పెట్టడం-అన్నీ ఆవిడకే అప్పగించాను. ఇంకొకటి ఏమిటంటే నేను 12 నుంచి 14 గంటలు పని చేయ్యడం. ఇది రెండో కారణం.

ఇలా వీటి ప్రభావం వల్ల, మా గృహ నిర్వహణలో మా అవిడతో పాటు, పిల్లల్ని పాత్రులని చేసాను. మా కుర్రాళ్ళలో ఒకడు విశాఖ నుంచి 2-3కి.మీ. దూరంలో వున్న సంతకు వెళ్ళి చౌకగా కూరగాయలు తెచ్చేవాడు. పెద్ద కుర్రాడు, మిగతా పిల్లల మీద అజమాయిషీ చేసేవాడు. ఇప్పటికీ మా పిల్లలందరికీ వాడంటే చాలా గౌరవం.

మా గృహిణి వంట సరే, పండగలకి, పబ్బాలకి చేసే పదార్థాలు చాలా రుచికరంగా వుంటాయి. మా స్కూలులో పార్టీలప్పుడు లేదా పిక్నిక్కులప్పుడు బొబ్బట్లు వంటి వంటలు చేసి పంపేది. అవి తిన్న వాళ్ళు మళ్ళీ కావాలనే వారు. దాంతో నాకో ధైర్యం, మా ఆవిడ ఎప్పుడు వ్యాపారం పెట్టినా బతికేయచ్చు.

1960లలో నా జీతం చాలా తక్కువ. 1979లో నేను రిటైర్ అయ్యే నాటికి నా జీతం నెలకు 700 రూపాయలు. పెన్షన్180 రూపాయలు. ట్యూషన్లే నా కుటుంబాన్ని ఆదుకున్నాయి.

మా పెద్దబ్బాయి పెళ్ళి 1975లో జరిగింది. అతని పాలిటెక్నిక్ మూడేళ్లలో అయిపోవడం జరిగింది. BHELలో హరినాథ్ అని రచయిత వుండేవాడు. దాన్లో వీణ్ణి ఇంటర్వ్యూకు పిలిచారు. వీడు డిస్టింక్షన్ కాబట్టి ఉద్యోగం వస్తుందనుకున్నాం. అక్కడ లంచం పడేసి ఒకడు జాయినయ్యాడు. మా వాడు, మేము వద్దనుకున్నాం.

తర్వాత శ్రీకాకుళంలో పెట్రోలు బంకులో చేసాడు. చేతులు మొత్తం కాయలు కాస్తే, తీసుకొచ్చేసాం. తర్వాత స్టీలు కంపెనీలో చేరాడు. అప్పుడు కూడా చాలా కష్టాలుపడ్డాం. ఒక దశకు వచ్చిన తర్వాత అందులోంచి కూడా బయటకు వచ్చేసాడు. తర్వాత, ఎం.ఇ.ఎస్.లో చేరాడు. అందులో స్నేహితుడి తమ్ముడు వుండే వాడు. అతను “మాస్టారూ ఉద్యోగం వచ్చిన తర్వాత పార్టీ ఇవ్వాలి” అన్నాడు. మనిషిని ఒక్కొక్క ఘటనా మారుస్తుంది, ప్రతి ఓటమీ మారుస్తుంది.

హస్త సాముద్రికం

నేను ట్యూషను చెప్పడానికి పిల్లల ఇళ్ళకు వెళ్ళినప్పుడు, వారు రడీ అయ్యేలోపు నేను పత్రికలు చదివే వాణ్ణి. అలా ఒకసారి ఆంధ్రప్రభలో పామిస్ట్రీ మీద వ్యాసం చూసాను. ఆ వారం ‘ఆయుఃరేఖ’నువిభజించి, వయస్సు కూడా దాంట్లో వేసారు. నా చేయి చూసుకుంటే, నాకు 48 వయసుకు ఆగిపోయింది నా ఆయుఃరేఖ. అదొకటి నా మీద పని చేసింది.

తర్వాత ఇంగ్లీషులో వచ్చిన పామిస్ట్రీ పుస్తకాలు సంపాదించాను. తెలుగు హస్త సాముద్రికం మీద ఎందుచేతనో నమ్మకం లేదు. ఛీరో రాసిన పుస్తకాలు చదివాక ఇతరుల చేతులు చూడటం, మౌంట్స్ వివరాలు చూడటం చేసేవాణ్ణి. నా అనుభవం ఏమిటంటే, ట్రెండ్సు చెప్తే చెబుతుంది కానీ, వివరాలు ఖచ్చితంగా చెప్తే, దాన్ని నమ్మడానికి వీలులేదు అనిపించింది. ఎందుకంటే, మా స్కూలులో ఒక మాస్టారి చేయి చూసినపుడు, ఆ చేతి ప్రకారం ఆయన ఏ 25వ ఏటో పోవాలి. కానీ ఆయన అప్పటికే 58.

కానీ, లోతుగా స్టడీ చేయలేదు. కానీ, మౌంట్స్ వివరాలు మాత్రం చాలా వరకు కరెక్టుగా వుండేది. దాన్ని ఆధారం చేసుకుని నా జీవితంలో కూడా వుపయోగించుకున్నాను. ఒక రోజు క్లాసులో హోంవర్క్ చేయని కుర్రాళ్ళని వరుసగా కొడుతున్నాను. ఒకడి చేతిని చూడగా, బొటన వేలు గుండ్రంగా వుంది. అలాంటి వాళ్ళు హంతకులు అవుతారని విన్నాను. వాడు ఎప్పుడైనా జైలుకెళ్ళిపోతాడేమో అనిపించింది. వాణ్ణి చూసి, “రేయ్ బాబూ, నీకు కోపం అమితంగా వస్తే నిగ్రహించుకో” అని చెప్పాను. వాడికి కోపం వస్తే కుర్చీ కోడు తీసుకొని కొడతాడని పక్కనున్న పిల్లలు చెప్పారు. ఇంకొక కుర్రానికి “నీకు చదువు రాదు, కళలు వస్తాయి. అంచేత దాంట్లో ప్రయత్నంచేసుకో” అని చెప్పాను. తర్వాత అతను మా స్కూలు లోనే డ్రాయింగ్ మాస్టర్గా చేసాడు.

అయితే ఇవి సూచనలు మాత్రమే. పామిస్ట్రీ వల్లే అలా అయ్యరని కాదు. పిల్లలకు పాఠం చెప్పడానికి ముందు, చేయి చూసి చెప్పేవాడ్ని. ఎంత కరెక్ట్ అంటే, 80% కరెక్ట్ గావుండేది. వారి లక్షణాలకు నేను చెప్పేది సరిపోతుండడంతో, తర్వాత సూచనలు ఇచ్చేవాణ్ణి. ఆ చేతిలో వున్న దానికి వ్యతిరేకంగా కూడా సూచనలు ఇస్తే, అది మానసికంగా కూడా పని చేస్తుంది వాడి మీద.

అలాగే మా బంధువులు కూడా ఇప్పటికీ చేతులు చూపించి అడుగుతుంటారు. నేను చెబుతూ వుంటాను. ఇదొక నమ్మకం మాత్రమే. నా చేతి రేఖ ప్రకారం నేను 1948లోనే పోవాలి కానీ, ఇప్పటికీ వున్నా కదా. కొంత వరకు స్వభావాన్ని చెప్పచ్చు. రావిశాస్త్రి గారు జాతకం పట్ల అవును, కాదు అనే ధోరణి అనుసరించే వారు. ‘జాతకం’ కథలో జాతకం శుద్ధ ట్రాష్ అని రాశారు. అది రాసినప్పుడు ఆయన జాతకం గురించి గట్టిగా ఆలోచించే వారు.

నక్సలైటు ఉద్యమo

1969లో శ్రీకాకుళంలో నక్సలైటు మూమెంట్ మొదలయ్యింది. వాళ్ళనేదేమిటి? వర్గ శతృ నిర్మూలన. కానీ నిర్మూలిస్తున్నది మాత్రం పెట్టీ షావుకార్లని. అసలు వర్గ శతృవులు ఆ వ్యవస్థని నడిపే వాళ్ళు. శ్రీకాకుళంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు వుండేవాడు. ఆయన జోలికి వెళ్ళే వాళ్ళు కాదు. కోమట్లు, చిన్న చిన్నవాళ్ళను చంపుతుండే వారు. నేనిదంతా గమనిస్తుండేవాణ్ణి.

మధ్య తరగతి, సామాన్య జనం మనస్తత్వం ఏమిటంటే, ఎవరినా సరే తమను ఆపద నుంచి బయటపడేయాలనుకుంటారు తప్ప, వాళ్ళు మాత్రం, ఏ రిస్కూ తీసుకోరు. అది చర్చించడానికి ‘భయం’ రాసాను. అది ‘యువ’ 1970 నవంబరు సంచికలో వచ్చింది.

నక్సలైటు ఉద్యమకారులు రావిశాస్త్రిని తరచు కలుస్తుండే వారు. కొంత మంది యువకులు, మెడికల్ కాలేజి విద్యార్థులు ఉద్యమ సానుభూతిపరులు తర్వాత విరసంలో చేరారు. నేను యజ్ఞం రాసా కదా, నన్ను కలిసే వారు.

మూడు కుటుంబాల వారు ఈ ఉద్యమం పట్ల పూర్తి సానుభూతితో వుండేవి. వారితో నాకు పరిచయం జరిగింది. వారితో బాంధవ్యాలు కూడా ఏర్పడ్డాయి. సాయంత్రం పూట కబుర్లు చెప్పుకునే వాళ్లలో ఈ మెడికల్ విద్యార్ధులు కూడా వున్నారు. ఆ రోజుల్లో ఐ.వి.గారు ఎం.ఏ. చేస్తుండే వారు. ఆదివారం సాయంత్రం కలిసే వారు.

యజ్ఞం కథను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చదివి, ఆచరించారని అనుకుంటాను. కుర్రాళ్ళ మీద దాని ప్రభావం వుందని నా అభిప్రాయం. అది రెండు రకాలుగా వుండింది. కొంత మంది అజ్ఞాతంలోకి వెళ్ళారు. కొంత మంది నిగ్రహించుకున్నారు. ఆవేశం వున్న వాళ్ళు లోపలికెళ్ళారు, ఆలోచన వున్న వాళ్ళు బయటే వుండిపోయారు.

లోపల కెళ్ళిన వారు దోపిడీ జరుగుతుంది, దాన్ని ఎదుర్కోవాలని వెళ్ళిన వారు. దోపిడీ జరుగుతుంది కానీ, దానికి కారణం ఈ షావుకార్లు కాదు, వ్యవస్థ అలా రూపుదిద్దుకుంది అనుకున్న వాళ్ళు నిగ్రహించుకొన్నారు. ఆవేశపరులకి, ఆలోచనాపరులకి తేడా అది. ఆవేశపరులు అన్యాయాన్ని ఎదుర్కోవాలని చూస్తుంటారు. ఆలోచనాపరులు మాత్రం వ్యవస్థ మారితే కాని దీన్ని మార్చలేం, ఇప్పుడు మారే పరిస్థితులు లేవు అనుకునే వారు. ఇవన్నీ తర్వాత నాకు తెలిసాయి.

నేను విరసంలో చేరిన తర్వాత, ‘కుట్ర’లో నేనడిగింది పెట్టుబడిదారుల ప్లాను, బాంబే ప్లానుగురించి. అంటే నెహ్రూ ప్లాను ఒక ధోరణిలో వుంటే, ఇది దానికి భిన్నంగా వుంది. బాంబే ప్లాను గురించి వెంకటప్పయ్యను అడిగాను. నేను మార్క్సిజం చదవకపోతే తప్పులు జరిగిపోతున్నాయేమో అనుకునే వాడ్ని. కానీ, ఆయన “ఏం వద్దు. చదవకుండానే బాగా రాస్తున్నావు. చదివితే సిద్ధాంతంలో కొట్టుక పోతావు. లోకాన్ని చూసి రాస్తున్నావు, అదే మేలు” అన్నారు.

ఈ ఉద్యమ ధోరణి పట్ల నాకు సందేహాలు కల్గిన తర్వాత ఆకెళ్ళ కృష్ణమూర్తి, రావిశాస్త్రి, కుటుంబరావు, కృష్ణాబాయి, రమణా రెడ్డి-వీరంతా అవగాహనా లోపంతో వున్న వారే. వీళ్ళనడిగితే కుదర్దు. ఒక ధోరణికి నిబద్ధులైపోయిన వారు కొత్త ఆలోచనల్ని నిరాకరిస్తారు తప్ప, ఆలోచించడానికి ఇష్టపడరు. దీనికి వ్యతిరేకులు ఎవరైనా వుంటే బాగుంటుంది.

సి పి ఐ లో వుండే గట్టి వ్యక్తులంతా కూడా సి పి ఎం గా విడిపోయారు. కొంత మంది చారు మజుందారు భావజాలంతో వచ్చారు. ఎందుచేతనో ఆయన నాకు ఆనలేదు. కానుసన్యాల్ వంటి వారు ఆనారు. ఇదంతా వారి వ్యాసాలు అవీ చదవడం ద్వారానే.

ఐ.వి. వుద్యమంలోకి వెళ్ళిన తర్వాత, దాన్లోకి రిక్రూట్ చేయడానికి ఉత్తి వెధవల్ని కూడా రమ్మనే వారు. కమిట్మెంటు, బుర్ర లేని వాళ్ళు కూడా దానితో కలిసిపోయేవారు. నా అనుభవంలో నేను చూసాను.

“ఈ వుద్యమం సరైనదేనా?” అని ఆకెళ్ళ కృష్ణమూర్తిని అడిగాను. ఆయన ఔనని కానీ, కాదని కానీ చెప్పలేదు. మీ పద్ధతిలో ఆలోచించండని చెప్పారు. ఆయన అప్పటికే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా జరిగింది నేను విరసంలోంచి బయటికి వచ్చేముందు. రావిశాస్త్రి గారితో మాత్రం స్నేహం చివరి క్షణం దాకా కొనసాగింది.

విరసంతో ప్రయాణం

నేను విరసంలో చేరడానికి కారణం నా చుట్టూ వుండే ఐ.వి. లాంటి స్నేహితులు. రెండోది, కుటుంబరావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి విరసం అవసరం అనుకున్నారు. రచయితగా వాళ్ళకు నా పై వున్న అవగాహన వల్ల నన్ను చేరమన్నారు. నేను చేరిపోయాను. వాళ్ళు కమ్యూనిస్టులే కావాలని అనలేదు.

కె.వి. రమణారెడ్డి గారి కూతురు వివాహం జరిగింది. పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు. కులాంతర, ప్రేమ వివాహం. ఆయన్ని కన్యాదానం చెయ్యమన్నారు. ఈయన చేయనన్నారు. పెదతండ్రో, ఎవరో చేసారు. దాన్ని పత్రికలు దుయ్యబట్టాయి.

పెళ్ళికొడుకు తండ్రి పోలీస్ ఆఫీసర్. కులాంతరం, ప్రేమ -రెండూ పాజిటివ్. పోలీస్ ఆఫీసర్ కొడుకు నెగటివ్. ఏం చేయాలి రమణారెడ్డి గారు? విరసం వర్కింగ్ కమిటీలో ఆయన మీద అభిశంసన తీర్మానం పెట్టారు. ఆయన వివరణ ఇచ్చారు. అప్పుడు నేను అన్నాను “మా తండ్రి గారు పోతే కర్మ చేసి తీరతాను. నన్ను వదిలేయండి.”

కె.వి. రమణారెడ్డి సంఘటన అప్పుడు నిజం అనే పత్రికలో నా ‘కుట్ర’ కథ వచ్చింది. దానికి background వుంది. ఒకానొక దశలో ఉద్యమంలో వుండగా, స్వయంగా జరుగుతున్న ఉద్యమాన్ని తెలుసుకోడానికి ఊగిసలాడాను. ఆ టైములో చాలా ఆలోచించాను.

నన్ను నేను ఎప్పుడూ కమ్యూనిస్టుగా భావించలేదు. నాకు మార్క్సిజం పట్ల నమ్మకముంది. లెనినిజం పట్ల అనుమానాలున్నయి. కానీ, గత్యంతరం లేదు. ఈ క్షణానికి కూడా దాని గురించి ఆలోచిస్తుంటాను. దానికి భిన్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు అవగాహన సరిపోదనుకున్నాను కానీ, ఖండించలేదు. అంతిమంగా మార్క్సిజమే నిలబడుతుందని నా నమ్మకం.

మార్క్సిజంలో తప్పు లేదు కానీ, నిర్మాణాలు, ఎత్తుగడల్లో లోపం వుంది. తప్పులు జరగకపోతే ఎందుకు దెబ్బతింది? బాలగోపాల్ దాన్ని తప్పు పట్టలేదు కానీ, లోపాలున్నాయి చూసుకోండన్నారు. సిద్ధాంతంలో లోపముందని నేను అనుకోడం లేదు. ఆచరణలో ఫెయిలయ్యింది.

కార్మికవర్గ నియంతృత్వం అంటారు. నియంతృత్వం ఏ రూపంలో వున్నా కష్టమే. నియంతృత్వాన్ని మానవుడు సహించలేడు. అప్పుడు రాచరికం ఎందుకు పోయింది? పెట్టుబడిదారీ వ్యవస్థ మీద జనాభాలో ఎంతమంది వ్యతిరేకులుగా వున్నారు? అంచేత ఆ అవగాహనను, భావజాలాన్ని తగినంత పెంపొందించితే తప్ప విప్లవం అసాధ్యం.

దాన్ని అధ్యయనం చేసేంత శక్తీ, టైమూ నాకు లేవు. అంతగా నిబద్ధుణ్ణికాను. నేనేదో చెయగల్గుతాననే నమ్మకం నాకు లేదు. ప్రజల పట్ల వారికున్న నిబద్ధత చూసి విశ్వాసంతో వెళ్ళాను.

ఇవాళ కూడా, అవసరమైన ఉత్పత్తి రాకపోవడం, ప్రమాదకరమైనది తయారుచేసి విషం కాదు, ఔషధం అన్నట్టు ప్రచారం ద్వారా అమ్మడం, అసలు ఏ అవసరం లేని దాన్ని తయారు చేసి ప్రజల టైము, ధనం, ఆరోగ్యం ధ్వంసం చేయడాన్ని చూస్తున్నాం. ఇటువంటి వినియోగం వుండే చోట, కొనుగోలు శక్తిని పెంచడానికి శ్రమకి ధరని విపరీతంగా పెంచడం లాంటి ధోరణులతో వున్న ఈ వ్యవస్థ ఏ నాటికైనా కూలిపోక తప్పదని నా గాఢ విశ్వాసం.

‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ పాటలా, ప్రపంచంలో విప్లవం రావాల్సిన పరిస్థితులను అర్థం చేసుకోక, విప్లవం తేవాల్సిన వర్గాల గురించీ, మానవ ప్రవృత్తుల గురించీ అర్థం చేసుకోకుండా, ముందే విప్లవం సాధ్యం అనుకొనో, పొరబడో కమ్యూనిస్టులు ఉద్యమ ప్రయత్నాలు చేసారు.

ప్రపంచానికి ఎప్పటికైనా మార్క్సిజమే గత్యంతరం. కమ్యూనిజంలో బోలెడన్ని లోపాలున్నా, మార్క్సిజమే శరణ్యం.

1972 తర్వాత రాయడం ఆగిపోయింది. ఎంచేతంటే, నా కథ చదివిస్తుంది, ప్రభావం చూపుతుంది. కానీ, దిశ సరిగా వుండాలనేది నా అభిప్రాయం. అంటే, కథ ద్వారా వ్యక్తీకరింపబడే సందేశం, అవగాహన సరి అయినది అయి వుండాలి. తప్పు చేస్తే మహా ద్రోహం అన్నట్టు.

ఇంకో కారణం కూడా వుంది. విరసంలో మూడు ధోరణుల్లో వుండే వారు.
1. తరిమెలనాగి రెడ్డి గ్రూపు(టి ఎన్ గ్రూపు),
2. చండ్ర పుల్లారెడ్డి గ్రూపు (సి పి గ్రూపు),
3. కొండపల్లి సీతారామయ్య గ్రూపు(కె ఎస్ గ్రూపు).
ఈ ముగ్గురూనూ ఒక్క మాట కోసం కొన్ని గంటలు(ఒక సెషను మొత్తం) కొట్టుకు చచ్చేవారు. అది చాలా అసహ్యం వేసేది. అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు, ఒకరితో ఒకరు ఏదో విధంగా రాజీ పడి ముందుకు వెళ్ళాలి. కానీ, ఇలా కొట్టుక చావడం ఏంటి? నాయకత్వం కోసమని నాకనిపించేది.

నాయకత్వం కోసం మనిషిలో అంత కాపీనం ఎందుకు వస్తుందంటే, ఇండియాలో విప్లవం ఫలానా వాడి ద్వారా వచ్చింది అనే చారిత్రక విజయం కోసం. వీళ్ళు కూడానూ, ప్రతిదీ, చరిత్ర రాయడం, చరిత్రలో నిలిచిపోవడం అన్నదే చెబుతారు తప్ప, “మన కర్తవ్యం” అని ఒక్కడి నోటి వెంట నేను వినలేదు. ‘చరిత్ర క్షమించదు’ లాంటి మాటలు వాడతారు. అదొకటి నాకు పరమ అసహ్యం వేసేది.

నిష్కామ కర్మ అని ఒకటి వుంటుంది కదా, ఏ ఉద్యమంలో పనిచేసే వారెవరైనా సరే, ఆ cause కోసం పని చేయాలి తప్ప, దాని నుండి ఏదో స్వార్థ ప్రయోజనం కోసం కాదు.డబ్బు ఒక్కటే స్వార్థ ప్రయోజనం కాదు. తక్కినవి కూడా వున్నాయి. దానికోసం నువ్వు వెళ్ళడం అంటే, అలా వెళ్ళే వారు నాకు నచ్చరు.

ఐ.వి. అలాంటి వాడు కాదని నేను అనుకునే వాణ్ణి. నిజమెంతో, అబద్ధం ఎంతో నాకు తెలియదు.

ఒక సభలో వరవరరావు, కె.వి.రమణారెడ్డి లాంటి వారందరూ వున్నచోట, నేనొక ప్రశ్న వేశాను. “మన ప్రభుత్వాలకి ఏదో లక్షణాలు వున్నాయని, బూర్జువా, అర్థ వలస, అర్థ భూస్వామ్య లాంటి పదాలు వాడటమే తప్ప, ఏనాడూ వాటిని నిర్ధారించి కార్యకర్తలకీ, కొత్త వాళ్ళకీ చెప్పే ప్రయత్నాలు ఎందుకు చెయ్యరు?” అని, ఒక్కరూ నోరు విప్పలేదు.

1972 తర్వాత నవల మీదికి నా దృష్టి పోయింది. కానీ చాలా విషయాలు తెలియవు. నాయకులు చెబుతారు, ప్రభుత్వంలో వుండే వారిలో ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, మిగిలిన ఇలాంటి వారిలో భిన్న శక్తులు, పాశ్చాత్య ప్రలోభాలున్నవారి చేతుల్లో వ్యవస్థ పగ్గాలు వున్నాయి. సామ్రాజ్యవాదుల అవసరాలకు ఎవరు సహాయం చేస్తున్నారు? బూర్జువాకి ఎవరు సహాయం చేస్తున్నారు? జాతీయ బూర్జువానే చేయాలి. దళారీ కాదు. ఇవేవీ తెలియకుండా నవల ఎలా రాస్తాం? అవి అర్థమవ్వాలి కదా? ఎవడి ఉపన్యాసాలు, ఎవడి వ్యాసాలు, ఎవడి ప్రచారాల పట్ల నేను దృష్టి పెట్టి ఇది అవగాహన చేసుకోవాలి?

దాని పట్ల, ఆ అవగాహన పట్ల నాకు విరక్తి ఏర్పడి, నమ్మకం పోయింది. దాంతో, ఇందులో నుంచి ఎప్పటికైనా బయట పడాలని అనుకుంటూ వుండేవాణ్ణి. ‘’72లో ఐ.వి.తో గట్టిగా చెప్పాను. “నీకు తెలుసు కదా, నేను కర్మలు చేయక తప్పదని. కాబట్టి నన్ను వదిలేయ్” అన్నాను. “లేదు, వుండాలి” అంటే, “సరేలే” అన్నాను.

1975లో అనుకుంటా విరసం అనంతపురం మహాసభలు జరిగాయి. అందులో తరిమెల నాగిరెడ్డి గ్రూపు ముందు బయటికి వచ్చేసింది. దానికి నాయకుడు జ్వాలాముఖి. ఆయనతో పాటు ఆయన అనుయాయులు నిఖిలేశ్వర్, ఎం.వి. రమణారెడ్డి లాంటి వారoతా బయటికి వచ్చేసారు. కె.ఎస్. గ్రూపుది మొండితనమే. చెరబండరాజు మంచి కవి. కానీ ఆయన మేధస్సు పైన నాకు పెద్ద ఇది లేదు.

టి.ఎన్. గ్రూపు నిష్క్రియత్నంకేసి నడుపుతున్నట్టు నాకు అనిపించేది. వాళ్ళు ఒక గ్రూపుగా వున్నారు తప్ప, ప్రజల మధ్యకు వెళ్ళి, ప్రజల్ని ప్రభావితం చేస్తున్న గ్రూపు కాదు. దానితో పోల్చితే సి.పి. గ్రూపు మంచిదనిపించింది. దాని అనుచరుల ధోరణి సవ్యమైందని నాకనిపించింది. కాకపొతే నా సన్నిహితులందరూ కె.ఎస్. గ్రూపులో వున్నారు కాబట్టి, నేనూ వున్నాను. కె.ఎస్. గ్రూపు వారు కార్యశూరులుగా వుండేవారు. ఆచరణ ప్రధానంగా వుండేది. ఆలోచనగా కాదు.

విరసం కార్యదర్శిగా

ఆ ముందు రోజు రాత్రి వర్కింగ్ కమిటీ మీటింగు. మర్నాడు మహాసభలు. మహాసభలో తీర్మానాలు అవీ జరుగుతాయి. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం “మాస్టారూ, మిమ్మల్ని కార్యదర్శిగా ప్రతిపాదిస్తున్నాం. మీరు కాదనడానికి వీల్లేదు” అంటే, నేను “కాదయ్యా, నాకా యోగ్యత లేదు” అన్నాను. “కాదు, మీరుండాలి” అంటే, “మా తండ్రిగారు అవసాన దశలో వున్నారు. ఆయనపోతే, నేను మురపాక వెళ్ళి కర్మకాండలు చేయక తప్పదు” అన్నాను. “ఏం ఫర్లేదు” అన్నాడు ఐ.వి.

నేను ఐ.వి.కి బద్ధుణ్ణి. ఎంచేతంటే, అతను హాయిగా బతకవలసిన జీవితాన్ని వదులుకున్నాడు. మంచి మేధావి. మంచి నిర్వహణ శీలి. ఆయనతో పరిచయం అయిన ఎవరూ కూడా ఆయన ప్రభావం నుంచి తప్పించుకోలేరు. అప్పటికే ఆయన చైనా వెళ్ళి వచ్చాడనుకుంటా. సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశాడు. ఉద్యమానికి మెదడు అతనే అని నా అభిప్రాయం. పొరబాటు పడి వుండచ్చు, నాకు తెలియదు. ఎంచేతంటే, కె.ఎస్. గారిని నేను అప్పటికే చూసాను. ఈ వూర్లో ఒక గంటసేపు మాట్లాడాను. అలాగే శివసాగర్తోనూ. శివసాగర్ లాంటి వాళ్ళు నా సాహిత్యం పట్ల ఆసక్తితో వుండే వారు.

నన్నెందుకు ప్రతిపాదించారంటే, నేను వివాదాస్పదుణ్ణి కాకపోవడం, నా వ్యక్తిత్వం, నాది కొంచెం మచ్చ తక్కువ జీవితం అని సభ్యులు అనుకోవడం వల్ల అని అనుకుంటా. లేదా అది ఐ.వి. ఉద్ధేశం. నేను “సరే” అన్నాను. “నాకు కార్యదర్శి పనులేవీ రావు” అంటే, కృష్ణాబాయి, చలసాని ప్రసాద్ “మీరుండండి, పనులు మేం చూసుకుంటాం” అన్నారు.

తీరా అయ్యాక, ఆ వేళ ఆ సభలో నేనుండగానే ‘పిలుపు’ అనే పత్రిక వచ్చింది. అందులో కె.ఎస్. యజ్ఞం గురించి రాసిన వ్యాసం వచ్చింది. ఇవతలేమో నన్ను కార్యదర్శిని చేస్తున్నారు, అవతలేమో నా అవగాహనా లోపం గురించి కె.ఎస్. రాశారు. అలాంటి కె.ఎస్.ని ఎలా నాయకుణ్ణి చేసారని నేననుకొన్నా.

అలాంటి పరిస్థితిలో కార్యదర్శినయ్యాను. దస్తాలు నా దగ్గరుండేవి కానీ, నా మెదడు మాత్రం కృష్ణాబాయి గారే. అన్ని పనులు ఆమే చూసేది. చలసాని ప్రసాద్ అప్పుడు కార్యకర్తే. అప్పుడు విరసం అధ్యక్షుడు శ్రీశ్రీ, ఉపాధ్యక్షుడు రావిశాస్త్రి. కార్యవర్గ సమావేశానికి కొ.కు.గారు ముందు రాను అనేశారు.

శాస్త్రిగారనే వారు “ప్రతి వారిని విరసంలో ఎందుకు చేరుస్తారండీ? ఏ ఇబ్బందయినా వస్తే, అందరం ఒకే సారి జైలుకెళ్ళాలి. కొందరు జనం మధ్య వుంటే మేలు” అని, అది కూడా పట్టించుకునే వారు కాదు. సాహిత్యం అంటే ఏంటో తెలియని వారిని కూడా రిక్రూట్ చేసే వారు. నంబరు కోసం. అది కూడా నాకు అయిష్టంగా వుండేది.

నేను అనుకునేదేమంటే, కష్టపడి కమిటెడ్గా పని చేస్తున్న కొందరు, కొందరి ప్రభావం వల్ల అలా కట్టుబడి వున్నారనిపిస్తుంది. బయటికొచ్చేస్తే కొట్టుకపోతుంది. విరసం పట్ల నమ్మకం పోతుంది. అందుకని అలా కొనసాగుతూ వుండేవారు.

విరసం నుంచి బయటకు

నేను కార్యదర్శిగా 6నెలలున్నాను. మా నాన్న గారు పోయే ముందు, ప్రతి రోజు సాయంత్రం స్కూలు అవగానే, మురపాక వెళ్ళేవాణ్ణి. రాత్రి అక్కడ వుండి మర్నాడు వుదయం తిరిగి వచ్చే వాడ్ని. అలా వారం రోజులు వెళ్ళాను. ఒక రోజు వెళ్ళలేదు. ఆ వేళ పోయారు. అది రాత్రి 12:00 –1:00 గంటలప్పుడు నాకు తెలిసింది. అప్పుడు కార్యదర్శి, సభ్యత్వం రెంటికి రాజీనామా చేసి, కృష్ణాబాయిగారికిచ్చి, రాత్రి రెండు గంటలకి లారీ పట్టుకుని తెల్లారి మురపాక వెళ్ళాను. ఇది 1975లో జరిగింది. కార్యదర్శి రాజీనామా వెంటనే ఆమోదించారు. సభ్యత్వాన్ని మాత్రం ’79లో రద్దు చేశారు.

ఎమర్జెన్సీ కాలంలో శాస్త్రిగారినీ ఇతరులనూ అరెస్టు చేసారు. నన్ను అరెస్టు చేయకపోవడానికి కారణం, ఒకటి, నేను కర్మకాండలు చేసాను. అంచేత “వీడు నిజమైన కమ్యూనిస్టు కాదులే” అనుకున్నారు. ఇంకోటి, రావిశాస్త్రి గారు పెద్ద ఫిగరు. నిర్ద్వందంగా ప్రభుత్వం మీద విరుచుకు పడే వాడు. లాయరు గానే కాకుండా, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. నేను ఏనాడూ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. నాకు చేత కాదు.

నేను రావిశాస్త్రిలా బలమైన రచయితను కాను, మరీ ఎక్కువ రాసిన రచయితనూ కాదు. బుధ్ధిజీవిని మాత్రమే. నేను రాయడం వరకే-నేను పెద్దగా మాట్లాడే వాణ్ణి కాదు. రాయడం మానేసి అప్పటికి మూడేళ్ళయింది. కృష్ణాబాయి గారి కుటుంబంతో దూరపు బంధుత్వం ఏదో వున్న ఒక ఆయన ఇంటలిజన్స్ ఆఫీసర్. ఆయనకు తెలుసు ఫలానా వాడు ఏంటని. అలా నేను తప్పించుకొన్నాను.

1979వరకు అఫిషియల్గా విరసం సభ్యునిగా వున్నాను. రాజీనామా చేసిన తర్వాత కూడా ఒకటీ రెండు విరసం మహాసభలకి వెళ్ళాను. వర్కుషాపులకు కూడా వెళ్ళాను. అల్లం రాజయ్య, తుమ్మేటిరఘోత్తమ రెడ్డి గారి రచనా ధోరణుల మార్పులో నా ప్రమేయం వుందని నేను అనుకుంటాను. నిజమెంతో నాకు తెలియదు. వాళ్ళు ‘సృజన’లో కలం పేరుతో రాసే వారు. నేనేమన్నానంటే, “నువ్వు రాస్తున్నది వద్దని నేను అనను. నువ్వు ఎవరి కోసం రాస్తున్నావో ఆలోచించుకో. జన సామాన్యం కోసం రాసేట్లయితే, మీ భాష, తీసుకునే సబ్జెక్టులు, చెప్పే ధోరణి కొన్ని వేల మందికి చేరే విధంగా వుండాలి.”

ఆ తర్వాతే అల్లం రాజయ్య రాసిన కథల్లో చాలా తేడా వచ్చింది. ఆయన కథల సంపుటులు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ రఘోత్తమ రెడ్డి కొత్త కొత్త ప్రయోగాలు అవీ చేస్తున్నాడు. వీరిద్దరూ ఆ వేళ నుంచీ కిందటి సంవత్సరం దాకా నా పట్ల వెనకటి స్నేహం కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక టైములో ఇద్దరూ వచ్చి కలిసే వారు.

అవార్డు గొడవలు

ఆ టైంలోనే నాకు ఎ.పి. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాన్ని సిఫార్సు చేసింది కుటుంబరావు, రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఆ అవార్డు ముగ్గురికి వచ్చింది. కథకి నాకు(యజ్ఞం కథలు), ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికి (కవిత్వానికి-తీసుకున్నారు), వినుకొండ నాగరాజు (వూబిలో దున్న నవలకు-తిరస్కరించారు. నేను తీసుకోవద్దు అనుకున్నా. కానీ, నేనొక సంస్థలో సభ్యుడినయినప్పుడు, సంస్థ తాలూకా అభిప్రాయం తీసుకొని, దాని ప్రకారం తిరస్కరించాలి. ఎంచేతంటే, నేను తీసుకోనని తెలిసినా, అంతకు ముందు కుటుంబరావు గారు, రావిశాస్త్రి గారు తీసుకున్నారు. వారు తీసుకొని, నేను తీసుకోనంటే అది విరసం వాళ్ళకి స్ట్రాటజీ అవుతుంది. కానీ లోకం తిట్టుకుంటుంది కదా అనే ధోరణిలో వుంటే, కాదన్నారు. “రిజక్ట్ చేయిద్దాం” అన్నారు.

తీరా ఏమైంది? స్థానికులు విశాఖలో అభినందన సభ పెట్టారు. ఆ సభలో నేను “తీసుకుంటాను, తీసుకోను” అని ఏమీ చెప్పలేదు. కానీ సభలో పాల్గొన్నాను. అంత స్పష్టతతో ఆలోచించలేదు. రంగనాయకమ్మ, వినుకొండ నాగరాజు దాని మీద దుమారం లేపారు. దానికి నేనేం జవాబివ్వలేదు. వరవరరావు, రమణారెడ్డి తర్వాత జరగబోయే విరసం వర్కుషాపు సభల్లో రిజక్ట్ చేయమని సూచించారు.

రిజక్ట్ చేయడానికి రెండు మార్గాలున్నాయి. 1. సభకు వెళ్ళి రిజక్ట్ చెయ్యడం. 2. ఇక్కడి నుంచే రిజక్ట్ చెయ్యడం. ఇది స్ట్రాటజీకి సంబంధించినది. అది నిర్ణయించాల్సింది వాళ్ళు తప్ప నేను కాదు అన్న వుద్ధేశంతో వున్నాను. అందరూ తిట్టారు నన్ను. నేనేం ఖాతరు చెయ్యలేదు. “దూషణ భూషణ తిరస్కారంబులు దేహానికి కానీ, ఆత్మకు కాదు” అని మన సంప్రదాయాలను కూడా అవగాహన చేసుకున్నాను. తర్వాత విరసం సభలో రిజక్ట్ చేసాను. దాని డ్రాఫ్టు నేను రాసింది కాదు. రావిశాస్త్రి గారు రాశారు నా మాటల్లో. రావిశాస్త్రిగారి పదాలువేరు, వాక్యనిర్మాణం వేరు.

విరసం అవార్డులు తీసుకోవద్దంటుంది. ఒక వేళ తీసుకుంటే, బలహీనుడైతే వాణ్ణి గెంటేస్తుంది. వాని అవసరం వుందనుకుంటే మాత్రం ఏమీ అనదు.

అయితే విరసం రంగనాయకమ్మ గారి లాంటి వారితో చాలా సాన్నిహిత్యంగా వుండేది. గౌరవం కూడా. కానీ, ఆవిడ ఏదైనా చేస్తే, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సరి చెయ్యడం వర్కింగ్ కమిటీ బాధ్యత కాదా? “మా వర్కింగ్ కమిటీ సూచన కోసం ఆగారు” అని చెప్పద్దా? ఎందుకు చేయలేదని కూడా నేనేమీ అడగలేదు.

రంగనాయకమ్మ గారి ధోరణి ఎలాగుంటుందంటే, ఆవిడ స్వయంగా ఏదీ తెలుసుకోదు. ఎవరో ఏదో చెప్పగా విని దాడి చేస్తుంది. దానికి ఇంకో వుదాహరణ ఏమిటంటే, యజ్ఞం సినిమాకు, కథకు నంది అవార్డు వచ్చింది. నేను దాన్ని తీసుకోడానికి వెళ్ళలేదు. మా బంధువులెవరూ వెళ్లలేదు. ఎవరో అమ్మాయి వెళ్ళి పుచ్చేసుకుంది. రంగనాయకమ్మ గారు, నా కూతురు వెళ్ళి తీసుకుందని రాసేసింది.

తర్వాత నేను ఇంట్లో లేనప్పుడు, శ్రీకాకుళం ఆయన, అందులో నటించినతను జ్ఞాపిక అదీ తీసుకొని మా ఇంటికొచ్చి డబ్బు, నంది, పటం ఇవ్వబోతే, “మా నాన్న గారు లేరు. ఆయన లేనిది మేం తీసుకోం” అన్నారు. “ఒక పని చేయండి, మేo కోర్టుకెళ్ళాలి, అందాక ఇవి వుంచండి. మేం నాన్నగారు వచ్చాక కలుస్తాం” అని చెప్పి వెళ్ళారు. నేను వచ్చి, “ఎందుకు తీసుకున్నారు?” అంటే జరిగింది చెప్పారు. వాళ్ళు మళ్ళీ రాలేదు. వారం రోజులు చూశాను. అవి పట్టుకుని ఎవరికి ఇవ్వాలి? ఇంకొకటి మా మనుమరాలు మొండిది, “మీరు డబ్బులు ఎవరికిచ్చినా ఫర్లేదు, కానీ ఇవి మాత్రం నేనివ్వను” అంది. “సరే, మనకెలాగూ అక్షింతలు నెత్తిన వేయించుకోవడం అలవాటే కదా” అని వూరికే వున్నాను.

ఆ డబ్బు మాత్రం నేను ముట్టలేదు. ఏనాడూ సాహిత్యం మీద వచ్చిన డబ్బు నా స్వంత ఖర్చులకు వాడుకోలేదు. అందులో నుంచి అప్పు తీసుకుంటాను. మళ్ళీ దాన్లో వేస్తాను. అలాగా నాకు, మూడు నాలుగు అకౌంట్లు వున్నాయి. వాటికి ధర్మకర్తనే తప్ప స్వార్జితానికి వాడుకోలేదు.

ఇక ఇక్కడితో ఆపేస్తాను. కథానిలయం గురించి చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను. నా జీవితంలో జరిగిన మఖ్యమైన సంఘటనలన్నీ కాలక్రమ పద్దతి లోచెప్పాను. ఇక సెలవు తీసుకుంటాను.

*

దామూ

6 comments

Leave a Reply to Uma nuthakki Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్సలెంట్ చారిత్రాత్మక ఇంటర్వ్యూ న్నా సూపర్భ్ చాలా విషయాలు తెలుసుకోగలిగాము

  • మనసు విప్పి హాయిగా మాట్లాడినట్లు వుంది. గోడల మీద కబుర్లు విని దుమారాలు లేపడానికి ఎవరూ అతీతులు కాదన్న మాట.

  • KARA Garu Telusunu Kani. Vari jeevita charitra teliyadu.ippudu
    Damu. Gari valana telisindi.variki abhinandanalu dhanyavadaalu.

  • కా రా మాష్టార్నీ ఆయన సాహిత్యాన్నీ అర్థం చేసుకోవడానికి మరో దారి దొరికింది. థేంక్యూ దామూ!

  • కాళీ పట్నం గారి జీవిత కథలో రావిశాస్త్రి, శ్రీ శ్రీ, కొడవటి వంటివాళ్ళు అతిధి పాత్రలో కనువిందు చేస్తూ కళ్ళముందు కదిలిన అనుభూతి కలిగింది. అరుదైన కథనం.

  • కారా గారిని కళ్ళముందు నిలిపారు.కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు