కథలో కుండపోత

ఎపిసోడ్ : 05

కథ: విరాక్స్ 3.0

రచన: ప్రొఫెసర్ శ్రీరంగరాజన్

కాంటైన్మెంట్ జోన్ అంతా క్రయో చాంబర్ బ్యాకప్‌ల నుంచి వస్తున్న లోఫ్రీక్వెన్సీ విద్యుదైస్కాంత ధ్వనులతో నిండి ఉంది. డాక్టర్ ఆరవ్ ఆటోక్లేవ్‌ ప్రెషర్ డయల్‌ను సరిచేసి, తన కళ్లద్దాలను ముక్కు మీదికి దించి వస్తున్న డేటాను గమనించాడు.

అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ త్రిషా మెహతా వేసుకున్న బయోసూట్‌కి ఉన్న ప్రెషర్ లాక్స్ నుంచి వస్తున్న శబ్దం వినిపించి వెనక్కి తిరిగాడు ఆరవ్‌.

“మీ యాంటీ-ఆర్ఎన్ఏ సింథసిస్ డేటా స్ట్రీమ్ స్టేబుల్‌గానే ఉంది,” అన్నదామె చేతిలో ఉన్న టాబ్లెట్‌లోకి చూస్తూ. “కానీ ఇసోటానిక్ కండీషన్‌లో ఎక్సోన్యూక్లియేజ్ మార్కర్ నుంచి సరిగ్గా కోడాన్-127 దగ్గర అనవసరమైన కట్ అవుతోంది.”

ఆరవ్‌కి ఆమె చెప్పిన మాటలు ఇబ్బందిగా అనిపించాయి. ఎన్నో ఏళ్ల శ్రమ ఈ రీసర్చ్. అయినా స్థిరంగా నిలబడి సమాధానం ఇచ్చాడు. “అది ఊహించిందే కదా. ఆ కట్ రైబోజైమ్ కటాలిటిక్ కోర్‌లో మొత్తాన్నీ తిప్పేస్తుంది. అదే ఈ మాక్రోమాలిక్యూల్‌ను మ్యూటెంట్ స్పైక్ ప్రోటీన్‌లోని RBD లూప్‌కి అటాచ్ కావడానికి సహాయపడుతుంది.”

“కానీ ఆ తిప్పేయడం వల్ల, తరువాత ఎప్పుడైనా గ్లైకోసిలేషన్ దారిలో ముడతలు పడే ప్రమాదం ఉండదా?”

“అది hydrogen bonding సరిగ్గా లేకపోతే మాత్రమే. నేను ముందు నుంచే డైసోడియం ఫాస్ఫేట్ స్కాఫోల్డ్‌తో pH 7.4 స్థాయిలో ప్రె-బుఫ్ఫెర్ సిద్ధం చేశాను. ఇది డీనేచరేషన్‌ను, రిసెప్టర్ డికప్లింగ్‌ను నిరోధిస్తుంది.”

అప్పుడే డాక్టర్ రమేష్ వరుణ్ తన నైట్రైల్ గ్లోవ్స్‌ను తీస్తూ లోపలికి వచ్చాడు.

“నేను పేషెంట్ Z-46 పైన రెండు రౌండ్ల ప్లాస్మా ఎక్స్చేంజ్ పూర్తి చేశాను. బయోమార్కర్లు EL-6, TNF-ఆల్ఫా, D-డైమర్ స్థాయిలను ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇది స్పష్టంగా ఒక సైటోకైన్ స్టార్మ్. నీ సింథటిక్ పెప్టైడ్ మాడ్యులేటర్ సిస్టమ్‌లోకి వేగంగా చేరగలదా?”

“అది మీడియం పైన ఆధారపడి ఉంటుంది,” అని ఆరవ్ తన కన్సోల్‌ను తడుతూ చెప్పాడు.

ముగ్గురు ముఖాల్లోనూ తమ ప్రయోగం ఫలిస్తుందా అన్న టెన్షన్ ఉంది. కొంచెం కొంచెంగా ప్రపంచాన్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్న Virax-3.0 వైరస్‌ను నిరోధించే ప్రయత్నాలు గత ఆరు నెలలుగా చేస్తున్నారు ఆ ముగ్గురూ. ఆ వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసే యాంటీడోట్ కనిపెట్టానని అర్నవ్ చెప్పడంతో, దాన్ని పరిశీలించడానికి వచ్చారు మిగిలిన ఇద్దరు.

గత భాగం చివర్లో ఇచ్చిన కథ ఇది. ఈ కథని దాదాపు ఎవరూ పూర్తిగా చదవలేదు అని నేను పందెం వేసి గెలవగలను. చదివినా అసలేం జరుగుతోందో అర్థం కాని వాళ్లు ఎక్కువ అని ఇంకా సులువుగా చెప్పేయచ్చు. ఏం జరిగింది? ఈ కథలో తప్పేముంది? చూద్దాం రండి.

కథలో ఉన్న సమస్య అర్థం చేసుకోడానికి కథ మొత్తం చదవాల్సిన పని లేదు. మొదటి రెండు వాక్యాలు చూడండి –

కాంటైన్మెంట్ జోన్ అంతా క్రయో చాంబర్ బ్యాకప్‌ల నుంచి వస్తున్న లోఫ్రీక్వెన్సీ విద్యుదైస్కాంత ధ్వనులతో నిండి ఉంది. డాక్టర్ ఆరవ్ ఆటోక్లేవ్‌ ప్రెషర్ డయల్‌ను సరిచేసి, తన కళ్లద్దాలను ముక్కు మీదికి దించి వస్తున్న డేటాను గమనించాడు.

ఇదేదో సైన్స్ రీసర్చ్ పేపర్. ఆదివారం మాగజైన్‌లో పొరపాటున ప్రింట్ అయినట్లు ఉంది తప్ప, కథలాగే లేదు. కదా? ఈ కథ రాసిన రచయిత ప్రొఫెసర్ రంగరాజన్‌ బహుశా సైంటిస్ట్ అయ్యుండచ్చు లేదా తత్సంబంధమైన ఉద్యోగమేదో చేస్తుండచ్చు. లేదా ఇలాంటి కథ రాయాలని అహోరాత్రాలు శ్రమించి రీసర్చ్ చేసి ఉండవచ్చు (నిజంగా అంత రీసర్చ్ చేస్తే నేరుగా ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి డాక్టరేట్ తీసుకోవచ్చు). ఏది ఏమైనా ఈ సబ్జెక్ట్ గురించి కథ రాసిన రంగరాజన్‌గారికి ఎంతో తెలుసు. అందంతా కథలో ఒలకబోశారు. దాని వల్ల కనీసం నాలుగు సమస్యలు వచ్చిపడ్డాయి. ఒక్కొక్కటే చర్చిద్దాం.

మొదటి సమస్య – జార్గాన్స్

యాంటీ-ఆర్ఎన్ఏ సింథసిస్ డేటా స్ట్రీమ్, ఇసోటానిక్ కండీషన్‌, ఎక్సోన్యూక్లియేజ్ మార్కర్, కోడాన్-127, రైబోజైమ్ కటాలిటిక్ కోర్‌, మ్యూటెంట్ స్పైక్ ప్రోటీన్‌. వీటిలో ఎన్ని పదాలు సామాన్య పాథకుడికి అర్థమౌతాయి. (నాకూ అర్థం కాలేదు. ఈ కథ రాసేందుకు OpenAI వాడాను). ఇలాంటి పదాలు సైన్స్ జర్నల్‌లో అయితే అది చదివేది ఆ రంగంలో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్లకి అర్థమౌతాయి. బహుశా అభినందిస్తారేమో కూడా. కానీ సామాన్య పాఠకులు ఇలాంటి రాళ్లు నాలుగు పంటి కింద తగలగానే ఆ అన్నం పక్కి జరిపి చేతులు కడుక్కుంటారు. కాల్పనిక రచన (ఫిక్షన్) ప్రధాన ఉద్దేశ్యం ఒకటో రెండో భావోద్వేగాలను తాకడం. కుదిరితే రేకెత్తించడం. ఆ తరువాత ఆ భావోద్వేగం కారణంగా పాఠకుడు కొన్ని సందర్భాలలో తన నడవడి, అభిప్రాయం మార్చుకోవడం. తద్వారా సమాజంలో కొంత మార్పు రావడం… ఆగండాగండి. చివరి రెండు కొంచెం అత్యాశలా కనిపిస్తున్నాయి. ఏమో జరగచ్చేమో. కానీ మనకి అంత అత్యాశ వద్దు. సమాజాన్ని మార్చాలనే ధ్యేయంతో రాసే రచయితలందరికీ లాల్ సలాం. చాలా గొప్ప బాధ్యతతో మీరా పని చేస్తున్నారు. నేను అంత దూరం కూడా ఆలోచించట్లేదు. మొదటి రెండు ఆశయాలు మాత్రమే చూస్తే – భావోద్వేగాన్ని తాకడం లేదా రేకెత్తించడం. కథ ఇది సాధిస్తే చాలు అనుకుంటే ఇలాంటి అర్థం కాని జార్గాన్లు పాఠకుడిలో భావోద్వేగాన్ని ఏ రకంగా తాకగలవు? సగటు పాఠకుడు ఇలాంటి రెండు పేరగ్రాఫులు చదవగానే “ఇది పరమ పవిత్రమైన పాఠ్యపుస్తకం. దీనిని సృశించుటయే మహా పాపము” అని పక్కన పడేస్తాడు.

రెండో సమస్య – విజ్ఞాన ప్రదర్శన

ఒక రచయిత తన పాఠకులతో కథ ద్వారా సంభాషణ జరుపుతారు. అది కథలో ఉండేది కాదు. కథలో కనపడకుండా, కథ ద్వారానే జరుగుతుంది. పై  కథలో రచయిత ఏం చెప్తున్నాడు? “నాకు చాలా తెలుసు. నీకు ఏమీ తెలియదు. నేను చెప్తా విను” అంటున్నాడు. ఇది రెండు కారణాల వల్ల జరుగుతుంది. మొదటిది అహం. విజ్ఞానప్రదర్శన. “వైరాలజీలో నేను డబుల్ డాక్టరేట్ చేశాను, CRISPR గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో నాలుగు పేపర్లు ప్రజంట్ చేశా. చూడు కావాలంటే” – అని కథ రాసినట్లుంది. ఫలితం? రచయిత ఇగో పాఠకుడికి, రచనకి మధ్యలో అడ్డుగోడలా నిలబడుతుంది. ఈ గొడవలో కథ ఉరి వేసుకుని చచ్చిపోతుంది. ఇలా జరగటానికి రెండో కారణం ఉందని చెప్పాను. అది రచయిత చేసిన రీసర్చ్ వల్ల వచ్చే సమస్య. ఒక సబ్జెక్ట్ తీసుకోని దాని మీద కొన్ని నెలలు, ఒకోసారి సంవత్సరాలు రీసర్చ్ చేసి, దాన్ని నవలగా రాసే రచయిత ఇలాంటి చిక్కుల్లోపడతాడు. ఇది కేవలం ఉత్సాహాన్ని ఆపుకోలేని బలహీనత తప్ప ఇగో అనడానికి లేదు. నేను ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఎంత exite అయ్యానో, పాఠకుడు కూడా అంతే exite అవుతాడు అని నమ్మి చేసే పొరపాటు. మీరు తెలుసుకున్నప్పుదు మీరు రాయబోతున్న రచన కోసం వెతుకుతున్నారు. పాఠకుడు చదువుతున్నప్పుడు అతను లేదా ఆమె కథ కోసం, ఎమోషనల్ కనెక్షన్ కోసం వచ్చారు. మీరు exite అయిన కారణం వేరు. అందువల్ల రచయితకి exitement ఇచ్చిన information పాఠకుడికి అంతే exitement ఇవ్వదు.

తెలుగు రచయితల్లో ఇలా రీసర్చ్ చేసి మరీ నవలలు రాసినవాళ్లు కొంతమంది ఉన్నారు. యండమూరి వీరేంద్రనాథ్, సూర్యదేవర రామ్మోహన్‌రావు వంటి వాళ్లు చాలా సమర్థంవంతంగా కథలోకి ఇన్‌ఫర్మేషన్ చొప్పించగలిగారు. (అన్ని పుస్తకాలలో కాదులెండి.)

మూడో సమస్య – కబ్జా

పైన ఇచ్చిన కథ మీరు చదివి ఉంటే ఆ కథ దేని గురించో మీరు చెప్పగలరా? నేనిచ్చి భాగం పూర్తిగా చదివి ఉంటే ఆఖర్లో ఉన్న వాక్యాలలో కొంత విషయం తెలిసేది. కొంచెం కొంచెంగా ప్రపంచాన్ని కబళించే విరక్ష్-3.0 అనే వైరస్‌ ఒకటుందనీ, దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఆ ముగ్గురూ చేస్తున్నారని తెలుస్తుంది. ఎంతమందికి ఈ విషయం అర్థమై ఉంటుంది? ఎందువల్ల? కథకి ఇవ్వబడిన జాగాని ఇన్‌ఫర్మేషన్ కబ్జా చెయ్యడం వల్ల వచ్చిన సమస్య ఇది. ప్రపంచాన్ని కబళించే వైరస్ అంటే అందులో పాఠకుడికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విషయం ఉంది. కానీ ఈ కథలో పాత్రలు లక్షల మంది చనిపోతున్నప్పటికీ చాలా కోల్డ్‌గా, రోబోలు మాట్లాడుకుంటున్నట్లు, ఎలాంటి ఫీలింగ్ లేకుండా మాట్లాడుతున్నారు. విషాదం లేదు, అర్జెన్సీ లేదు, మానవాళికి ముప్పు అన్న సంఘర్షణ గురించి సరైన ప్రస్తావన లేదు. Information మధ్యలో కథ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.

నాలుగో సమస్య: అపశకునం

పాఠకుడు ఒక కథ మొదలుపెట్టి ముగింపు వైపుకి నడుస్తుంటాడు. ఇది ఒక ప్రయాణం అనుకోండి. మొదట్లోనో, కనీసం కథ మధ్యలోనో భావోద్వేగం కలగకపోతే పాఠకుడు ముందుకు వెళ్లడు. అలాంటివి లేకపోగా, పైన చెప్పిన విజ్ఞాన ప్రదర్శన, జార్గాన్స్ లాంటివి కనపడితే అవి అపశకునంగా భావించి వెనక్కి తిరిగే ప్రమాదం ఉంది.

నేను ఇప్పుడు చెప్పబోతున్న రెండు మాటలు  జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి – కథైనా, నవల అయినా, సినిమా అయినా, భావోద్వేగం కలిగించని కథ ముగింపు ఏమైనా పాఠకుడు పట్టించుకోడు. ఎమోషనల్‌గా కనెక్ట్ కాని పాత్ర చివర్లో గెలిచినా, చనిపోయినా పెద్ద తేడా లేనట్లు పాఠకుడు చిద్విలాసంగా నవ్వి మరో పుస్తకం అందుకుంటాడు.

కథ అంటే ముగింపే. ముగింపే ఆ కథ ఏం చెప్పాలనుకుంటుందో అది పాఠకుడి మనసులోకి, ఆలోచనలోకి వెళ్తుంది. ఆ ముగింపుని పాఠకుడు పట్టించుకోలేదు అంటే ఆ కథా ప్రయోజనం నెరవేరనట్లే కదా?

ఇది అర్థం చేసుకోడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. వేరే ఏదో ఎందుకు ఇదే కథని తీసుకుందాం. “ఈ కథలో ఈ వైరస్ ఎంత భయంకరమైందో చెప్పి, దాన్ని నివారించడానికి సైంటిస్టులు పడుతున్న కష్టాన్ని వివరించాలి” అంటే, అది ఎలా చెయ్యచ్చు? కింద మూడు రకాలు ఇస్తున్నాను –

  1. IL-6, TNF-Alpha స్థాయి పెరగటం వల్ల ఉత్పన్నమైన cytokine storm వచ్చి, systemic inflammation ను ట్రిగ్గర్ చేస్తుంది. అందువల్ల acute respiratory distress syndrome (ARDS) ఏర్పడి చివరికి multi-organ failure ద్వారా మరణం సంభవిస్తుంది. ఇంత దారుణమైన మరణాన్ని నిరోధించడానికి సిద్ధమయ్యారు ముగ్గురు సైంటిస్ట్‌లు

ఇది మనం ఇప్పటిదాకా చర్చించిన విజ్ఞాన ప్రదర్శన, information overload విధానానికి కొనసాగింపు. పెద్ద ప్రయోజనం లేదు. మారో మార్గం చూద్దాం.

  1. వైరస్ మనుషుల్ని చంపేస్తోంది. ఒక్కొక్కరే నేలకి ఒరిగి చనిపోతున్నారు. కనీసం ఇంటికి ఒకళ్లు. ఒక్కో ఇంట్లో ఒకళ్లే మిగులుతున్నారు. “దీన్ని ఎలాగైనా ఆపాలి. ఒక సైంటిస్ట్‌గా అదే నా కర్తవ్యం” అన్నాడు ఆరవ్. గత ఆరు నెలలుగా అతనికి ఒకటే ధ్యాస. ఒకటే ఆశయం. నిద్రలేదు. అన్నం లేదు. చిక్కి సగమైపోయాడు. అతనికి సహరించడానికి వచ్చిన స్నేహితులు త్రిష, రమేష్ అతనిని చూడగానే ఆశ్చర్యపోయారు.

ఇది కొంత మేలు. ప్రధాన పాత్రకి దారి తెలుసు. ఆ దారి పాఠకుడికి తెలుస్తోంది. కాబట్టి ఆ పాత్రతో కలిసి ప్రయాణం చెయ్యడానికి సిద్ధపడే అవకాశం ఎక్కువ. కానీ ఖచ్చితంగా అతనితోనే కలిసి ప్రయాణం చెయ్యడానికి కావాల్సినంత బలమైన కారణం లేదు. ఏమిటా బలమైన కారణం? ఎమోషన్.

  1. రేఖ హాస్పిటల్‌లో తన గది కిటికీ దగ్గర వచ్చి నిల్చుని కిందకి చూసింది. నాలుగు రోజుల క్రితం ఆమెకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే హాస్పిటల్లో చేర్చారు. భర్త, కూతురు లోపలికి వచ్చి కలిసే అవకాశం లేదు. ఆమె ఉన్న రూమ్ కిటికీ నుంచి రోడ్డు కనిపిస్తుంది. ఆ విషయం ఆమె ఫోన్ చేసి భర్తకి చెప్తే వాళ్లు వచ్చి అక్కడ నిలబడ్డారు. ఆ రోజు కూతురు దీప పుట్టిన రోజు. ఆమె అక్కడ్నుంచే భర్తకి కాల్ చేసి కూతురితో మాట్లాడింది. గ్రీటింగ్స్ చెప్పింది. తరువాత అతనితో మాట్లాడింది. ఆరోజు డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి, అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం ఉందని, బతికే అవకాశం తక్కువని చెప్పిన సంగతి ఆమె చెప్పలేదు. కన్నీళ్లు ఆపుకుంటూ చేతిని ఊపింది, గాల్లో ముద్దులు విసిరింది. అతను కూడా అంతే. తనకి కూడా శ్వాస తీసుకోవడం కష్టమౌతోందన్న సంగతి ఆమెకు చెప్పలేదు. నవ్వుతూనే చెయ్యి ఊపాడు. ఫోన్ పెట్టేసిన తరువాత అతను దేవుడిని తల్చుకున్నాడు – “భగవంతుడా ఈ వైరస్‌ను ఆపగలిగే మందు ఎలాగైనా వచ్చేలా చూడు. నా బిడ్డను అనాథని చెయ్యకు”

సరిగ్గా ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఒక యాంటీడోట్ కనిపెట్టాననీ, పేషంట్స్ ఒప్పుకుంటే క్లినికల్ ట్రైల్స్ చేస్తానని అదే హాస్పిటల్‌కి వచ్చాడు డాక్టర్ ఆరవ్. ఎలాగైనా ఈ వైరస్‌ని అంతం చెయ్యాలన్న పట్టుదలతో ఆరు నెలలుగా పని చేస్తున్నాడతను.

ఈ కథలో ఇప్పుడు పాఠకుడు ప్రధాన పాత్రతో కలిసి ప్రయాణం చెయ్యడానికి చాలా బలమైన కారణం ఉంది. ఆవిడకి ఏమౌతుందో? ఆ పాప అనాథ అయిపోతుందా? సైంటిస్ట్ మందు కనిపెడతాడా? ఈ ప్రశ్నలు పాఠకుడిని కథతో కలిసి ప్రయాణం చేసేలా చేస్తాయి. ఇలాంటి ప్రయాణంలో కృతకమైన, అర్థం కాని భాష అపశకునాల్లా ఎదురొస్తాయి. ఇదీ గత భాగంలో ఇచ్చిన కథలో ఉన్న ముఖ్యమైన నాలుగో సమస్య.

ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణ సైన్స్ ఫిక్షన్ కాబట్టి సైంటిఫిక్ జార్గాన్ సమస్య కనపడింది. ఈ సమస్య వేరే ఏ కథకైనా వర్తిస్తుంది. ఉదాహరణ ఇస్తున్నాను చూడండి –

దర్భస్పర్శ

తర్పణం ఎవరు వదలాలి అన్న దగ్గర చర్చ మొదలైంది. కర్మకాండ నిర్వహించి, సంచయనం, సపిండీకరణం కూడా దహౌత్రుడే చేసిన తరువాత తర్పణానికి ఏం అడ్డంవచ్చింది అంటాడు నిర్వహిస్తున్న బ్రహ్మగారు.  నరసింహావధాని ససేమిరా అన్నాడు. పిల్లాడికి పెదనాన్న వరుస ఆయన. సగోత్రీకులకే దత్తుబోయాడు కాబట్టి ఆ ఇంటి మనిషిగానే చూస్తారందరూ.”సలక్షణంగా తల్లీదండ్రీ ఉంటే వాడేం ఖర్మ పట్టిందండీ” అంటాడాయన. పోనీ అల్లుడి చేత చేయిద్దామంటే వాళ్లది ప్రేమ వివాహం. వర్ణాంతరం. అల్లుడు సిద్ధమే కానీ బంధువులు ఏమంటారో అనే ప్రశ్న. ఇంతకు ముందే “మాకు పాణీ హోమం లేదు ఇదెక్కడి మంత్రమని” పెద్ద చర్చే నడిచింది. “పిండాలలోకి మాషాపూప” అని బ్రహ్మగారు అనగానే వీభూతి పెట్టుకున్న నుదుళ్లు చిట్లించారు. అసలు రుక్‌శాఖాధ్యాయినని ప్రవర చెప్పుకుంటూ, “ఉత్తిష్టంతు భూతపిశాచ” అని మొదలుపెడితేనే తాతలంతా బ్రహముళ్లని పట్టుకోని జంధ్యాలను వీపుకు రుద్దుకుంటూ పళ్లు పటపటా కొరికారు. “పోనీలే అన్నయ్యా” అని పద్మ అనడంతో చటుక్కున లేచి “మీ ఇష్టం వచ్చినట్లు ఏడవండి. మామ్ గఛ్ఛంతు.” అని కదిలాడు నరసింహావధాని. ఆయనకి కోపం వస్తే నోట్లో నుంచి సంస్కృతం వస్తుంది.

అర్థమైన వాళ్లకి ఓం నమశ్శివాయ. ఉదాహరణ ఇవ్వాలని రాశాను కానీ మంచి కథా వస్తువు ఇది. (బహుశా నేను తరువాత ఎప్పుడైనా ఇది కథగా రాస్తానేమో). కానీ ఇలా రాస్తే ఎంతమందికి అర్థమౌతుంది? దానికన్నా ముఖ్యమైన ప్రశ్న ఎవరికి అర్థమౌతుంది? బ్రాహ్మణ కథ బ్రాహ్మలకి మాత్రమే అర్థమైతే, దళిత కథ దళితులకి మాత్రమే అర్థమైతే, కార్పొరేట్ కథ అలాంటి ఉద్యోగస్తులకి మాత్రమే అర్థమైతే ఎలా? మా భాష, మా జీవితం ఎలా ఉంటుందో అలా రాస్తే తప్పా? అని అడుగుతున్నారా? మంచింది. మీ కథ మీ కుటుంబానికి మాత్రమే అర్థమైతే, ఇంక అస్థిత్వవాద కథల అవసరమేముంది? ఖరీర్‌బాబు అనే ఆయిన దర్గామిట్ట కథలు రాసినప్పుడు అందులో ముస్లిం కుటుంబాల గురించే రాశాడు కానీ ముస్లిమేతరులకు అర్థమయ్యేలా రాశాడు. అందువల్ల పాఠకులు వాటిని ప్రేమించారు. ఎమోషన్ అనే ఆసరా ఇచ్చి పాఠకుడిని చాకచక్యంగా మీరు చెప్పదల్చిన భాష, జీవనం గుండా నడిపించాలి కానీ, నే రాస్తా, నీకు అర్థమైతే చదువు లేకపోతే మామ్ గచ్చంతు అని ఫో ఇక్కడ్నుంచి అంటే ఎలా?

ఇప్పుడు ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తున్నా. మీరు నాతో ఏకీభవించక్కర్లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. పైన చెప్పిన సిద్ధాంతం మాడలికాలలో రాసే కథలకి కూడా వర్తిస్తుంది.

ప్రతి మాండలికమూ తెలుగు భాషే. ప్రతి మాండలికానికీ ఒక సొగసు ఉంటుంది. వంద కిలోమీటర్లు దాటితే కొత్త యాస వినిపించే సాంస్కృతిక సంపత్తి మనకి ఉంది (ఇక్కడ ఏది ప్రామాణికం అన్న ప్రశ్నే లేదు. పక్కన పెట్టిండి). కానీ అన్నీ అందరికీ తెలియాలని లేదుగా. మందల అంటే నెల్లూరులో కబుర్లనీ అర్థం, అదే పదం గొర్రెల మందలు అనే అర్థంలో వాడతారు ఇంకో చోట. తూగు అంటే నిద్ర వచ్చి తూగడం ఒక ఊర్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో అర్థం సన్న కమ్మీతో చేతి పట్టు ఉండే స్టీల్ సామాను (నడిచేటప్పుడు ముందుకు వెనక్కీ తూగుతుంది కాబట్టేమో). ఇలా అర్థం మారిపోయే సమస్య కన్నా అసలు అర్థమే కాని పదాలతో పెద్ద సమస్య వస్తుంది. తెలియకపోతే తెలుసుకుంటారు అనే వాదన ఉంది. నిజమే. మయూఖ అనే అర్థం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పెద్దమనిషి గ్రంధాలయానికి వెళ్లి నిఘంటువు తెరిచి చూసి, ఆ తరువాత జేబులో చేతులు పెట్టుకోని ఎటో వెళ్ళాడు. అది రాసిన ఆ కవిగారి అదృష్టం. ఆలోచించి నిజం చెప్పండి – ఇప్పటి పాఠకులకు అంత తీరిక ఉందా?

మీకు తెలిసిన పదాలు రాయద్దని నేను చెప్పటం లేదు. మీ మాండలికంలో కథ రాయద్దని నేను చెప్పటం లేదు. అస్థిత్వ వాద అస్థిత్వమే ఎవరి కథ వాళ్లే చెప్పాలని. వాళ్ల భాషలోనే చెప్పాలని. ఎందుకు? అది వంద మందికి చేరితే వాళ్లు, వాళ్ళ సామాజిక, వ్యవహారిక, చారిత్రక జీవనానికి భిన్నమైన మనుషులు ఉన్నారని తెలుసుకోడానికి. వాళ్లని వీలైతే అర్థం చేసుకుని సహానుభుతిని చూపించడానికి. భిన్నత్వంలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించి, సమాజం అనే ఏక తాటిపైకి అందరూ రావాలని. కానీ ఇంత పెద్ద బాధ్యతతో మీరు కథ రాస్తే అది చదవాల్సిన వందమందికి చేరకపోతే ఎమిటి ప్రయోజనం? చేరినా వాళ్లు అది చదవలేకపోతే ఏమిటి ఉపయోగం?

మరేం చెయ్యాలి? చెయ్యి పట్టుకోని నడిపించడం ఒక పద్దతి. కొత్త పదం వాడితే దాని అర్థాన్ని వెంటనే చదివేలా కిందనో, చివర్లోనో ఇవ్వడం. వీలైనంత సరళంగా మొదలుపెట్టి క్రమంగా లోతుల్లోకి తీసుకెళ్ళడం. పాత్రల భాష ఎలా ఉన్నా, రచయిత భాష సులభ గ్రాహ్యంగా (అంటే అర్థమయ్యేలా) ఉంచడం. ఇవన్నీ ప్రయత్నించచ్చు. లిటరరీ ఫిక్షన్, సినిమా లాంటి కమర్షియల్ రచనలకైతే ఇంత చర్చ అవసరమే లేదు. రచనని complicate చెయ్యడానికి అనుమతి లేదు. సరళంగా రాసి తీరాల్సిందే.

ఏది ఏమైనా రాసే విషయం, సందర్భం, భాష అన్నీ నమ్మదగినట్లు ఉండాలి. ఏదో ఒక ఎమోషనల్ స్టేక్ ఉండేలా చూసుకోవాలి. పాఠకుడి ప్రయాణంలో అతని మనసు ముందు నడవాలి, వెనుక మెదడు నడవాలి. ఆలోచన కన్నా ముందు భావోద్వేగం నడవాలి. ఇదంతా జరగాలంటే రచయిత ఏ కథలో ఎంతవరకు రాయాలో అంతే రాయాలి. ముఖ్యంగా తనని తాను నియంత్రించడం నేర్చుకోవాలి. ఆ విషయం గురించి వచ్చే భాగంలో చర్చించడానికి ఆసరాగా ఇదిగో ఈ కథ –

సుహాసిని

ముద్దులొలికే ఆ పసిపాపని చూస్తే ఎవరైనా పలకరిస్తారు. ఎవరైనా పలకరించగానే ఆ పాప బోసి నవ్వు నవ్వుతుంది. నవ్విన వెంటనే ఎత్తుకున్న వాళ్లమ్మ సుహాసిని మెడలో ముఖం పెట్టుకోని సిగ్గుపడిపోతుంది. పాపం వాళ్లమ్మ మెడలో తాళిబొట్టు లేదు. నిజం చెప్పాలంటే ఆమె తాళి కట్టించుకోనే లేదు. అంటే పెళ్లి చేసుకోలేదని కాదు. ఒకరకంగా చేసుకున్నట్లే. ఆమె, రూబెన్ కలిసే వుంటారు. లివిన్ రిలేషన్ అన్న మాట. ఇప్పటికి ఏడు సంవత్సరాలైంది. ఇద్దరూ ఒకే కంపెనీలో వున్నప్పుడు పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో… అది ఇల్లు అని చెప్పడానికి లేదు. పట్నంలో వుండే అన్ని ఇళ్లలాగే ఇది కూడా గాల్లో లేచిన మేడ. ముఫై రెండు అంతస్థుల బిల్డింగ్‍లో ఇరవై ఏడొవ అంతస్తులో వాళ్ల ఇల్లు

చాలా చక్కగా కట్టిన ఇల్లు. కానీ ఇప్పుడు ఆ ఇంటి నిండా మనకి కనిపించేవి చిందరవందరగా పడేసున్న మాసిన బట్టలు, బీర్ బాటిల్స్, పార్సిల్ ఫుడ్ తో వచ్చిన కవర్లు, షాపింగ్ బ్యాగులు, ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్, వాటి ఛార్జర్స్. ఇద్దరూ ఉద్యోగస్తులు కదా! వారమంతా ఉద్యోగం. వారాంతంలో కాస్త షాపింగ్. కూతురు పుట్టకముందు స్వేఛ్చా విహంగాల్లా వున్న వాళ్ల జీవితాలు కూతురు పుట్టిన తరువాత బందీల జీవితాలలా సాగుతున్నాయి. వాళ్లు ఇక్కడే కాదు తమ ఆఫీసులో క్యాబిన్లలో కూడా బందీలే. తొమ్మిదిన్నరకి ఆ జైలులో అడుగుపెడితే ఆరున్నరకి విడుదల. అలా అని చెప్తారు కానీ రాత్రి తొమ్మిదిన్నరకో పదిన్నరకో బయటపడతారు.

ఒకటిన్నర సంవత్సరం క్రితం సుహాసిని ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది.

“మనకున్న కమిట్మెంట్స్, జాబ్ స్ట్రెస్‍లో పిల్లల్ని కనడం అవసరమా” అని అడిగింది అప్పుడు. ఎలాగో తెలియదు కానీ రూబెన్ ఆమెని ఒప్పించగలిగాడు. ఫలితం ఈ పసిపాప.

అయితే వాళ్ల జీవితం అతిపెద్ద సమస్య అది కాదు. ఆ పాప కడుపులో పడ్డప్పుడు వాళ్లు ఎదుర్కున్న సమస్య అన్నింటికన్నా పెద్దది. మెటర్నిటీ లీవ్. ఆఫీస్ రికార్డ్స్ ప్రకారం విద్యకి పెళ్లి కాలేదు కాబట్టి ఆమెకి లీవ్ ఇవ్వము అని చెప్పేసింది HR డిపార్ట్మెంట్. సుహాసిని ఆ విషయాన్ని HR Head వరకు తీసుకెళ్లింది. ఆఖరుకి సీయీవోకి కూడా మెయిల్ రాసింది. ఎలాంటి సమాధానం రాలేదు. మెటర్నిటీ లీవ్ లేకపోతే లాస్ ఆఫ్ పే పెట్టుకోవాలి. ఖర్చులు పెరిగాయి. జీతం వుండదు. ముఖ్యంగా డెలివరీకి వెళ్లినప్పుడు మెడికల్ రీయంబర్స్‍మెంట్ వుండదు.

*

అరిపిరాల సత్యప్రసాద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా వివరంగా, చప్పున అర్థమయ్యే ఉదాహరణలతో భలే రాస్తున్నావు సత్య ప్రసాద్ అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు