కడలికి తెలియని కథలు

చీకటిని పులుముకుని
చుక్కల్ని అంటించుకుని
కడలి కళ్లలోకి చూసింది గగనం.

పొంగి పొరలుతూ కడలి తన అలలతో
కలిసి ఉన్న కొన్ని అడుగుల్ని తుడిచేసింది.

వాళ్ళెప్పటికీ కలవరని ముందే తెలుసేమో !
వాళ్ళు తెచ్చిన పువ్వులని తీరాన వదిలేసి
విసిరిన రాళ్ళన్ని తనలోకి లాక్కుంది.

తన కన్న బాధలోతుల్ని
ఇంకెవ్వరూ తెలుసుకోలేరని అనుకుందేమో !

కలిసి కలవలేని మనస్సులు
వీడి వీడలేని మనుషులు
గమ్యం తెలియని ప్రయాణాలు
ఈ కడలికి తెలియనివి కథలు లేవేమో !

మనస్సులో మిగిలిన ఊసులు
కాగితం పై నలిగిన మాటలు
కడలికి అప్పజెప్పి వెళ్లిపోయారేమో !

ప్రపంచం నిద్రిస్తుంది.
చెట్లు తూగుతూ తూలుతున్నాయి.
వెన్నెల కూడా మబ్బుల మరుగైపోయింది.
కాని కడలి ఘోష మాత్రం ఆగనే లేదు.
ఎన్నో హృదయాల తడి తానే మోస్తూన్నట్టు ఉంది.

*

ఇందు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు