ఇటీవలి ఉత్సాహపూరితమైన ప్రేరణ- నరేష్కుమార్ సూఫీ! ఒక్కసారిగా రెండు విలువైన పుస్తకాలు మన ముందు వుంచాడు. ఈ సందర్భంగా ఇద్దరు కొత్తతరం విమర్శకులు- కట్టా సిద్ధార్థ, రూప రుక్మిణి- ఈ రెండు పుస్తకాల గురించి రాశారు. ఈ రెండు పుస్తకాల్ని చదువుదాం. నరేష్కుమార్ సూఫీని అభినందిద్దాం.
1
మెట్టుతో కొడతాను
-కట్టా సిద్ధార్థ
ఒక ఎలివేషన్ వాక్యంతో వ్యాసాన్ని మొదలుపెడతాను.
కనుమరుగైన “మంగలిపల్లె” రక్తాన్ని సిరాగా నింపుకుని రాసిన కథలివి. ఇప్పుడు రెండు నిజాలు చెప్తాను. ఒకటి- మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు. రెండు- మెజార్టీ తెలుగు కథల్లో కథ ఉండదు. మైనార్టీల తరపున నిలబడటమూ, మెజారిటీ కథల్లా ఉండకపోవడమూ ఈ కథకుడి బలం. ఈ మధ్యన పాపులర్ అవుతోన్న తెలుగు మీమ్‌లాగా అయితే “అదీ ఉండాలి. ఇదీ ఉండాలి”. అదే సూఫీ బలం. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే? ఈ కథల్లో కథ ఉంది. మీరు మీ వీపును తడుముకున్నట్టుగా ఈ పుస్తకాన్ని తడమండి. మీ చేతులకు వెన్నెముక అని ఒకటి తగులుతుంది.
ఈ రచయత నాకు వ్యక్తిగతంగా తెల్సు. పై వాక్యాన్ని తీసేసి, మరుసటి వాక్యాన్ని సేవ్ చేయండి. ఈ రచయత నాకు బాగా క్లోజ్.
సూఫీకి బండి తోలడం సరిగా రాదు. దానికి కామన్సెన్స్ కావాలి. సొంతగా బండి కొనుక్కుని కొన్నేళ్ళు అయినా అది అబ్బలేదు. వీళ్లుంటారు కదా, ఏవో వైద్య శాస్త్ర పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సూఫీ మెదడుని అప్పగించొచ్చు. కథని సూఫీ అత్యంత సునాయాసంగా తోలుతాడు. హారన్ కొట్టకుండానే నువ్వు తలుపులు తీస్తావు. కథ వచ్చి, నీ హృదయంలో కూర్చుంటుంది. ఈ సహజక్రియ జరగటానికి శైలీ, శిల్పం లాంటి కుంకుడుకాయలతోపాటు ఒక వజ్రం కావాలి. అది కామన్ సెన్స్.
సూఫీకి అక్కడ అబ్బని కామెన్సెన్స్ ఇక్కడెలా అబ్బిందో తేల్చడం నాబోటి వాళ్లకు కష్టం. ఏ డాక్టరు బాబో పరిష్కరించాలి.
ఈ కథలను ఎవడైనా నోస్టాల్జియా అంటే మెట్టుతో కొడతాను.(చెప్పుతో కొడతాను అనటం ఇష్టం లేక, నా అభిమాన రచయిత నామిని యాసను అరువు తెచ్చుకున్నాను). ఇది చరిత్ర. ఇది ప్రపంచీకరణ చేసిన గాయం. అభివృద్ధి పేరుతో రాజ్యం చేసిన విధ్వంసం.
కాదూ.. నోస్టాల్జియా అనే అంటావా? నీ ఇంగితజ్ఞానానికీ, తెలుగు సినిమా దర్శకుల ఇంగిత జ్ఞానానికీ మధ్యన ఒక ‘ఈజ్ ఈక్వల్ టూ(=)’ని తెచ్చిపెడతాను. జయంతి వేడుకకూ, పుట్టినరోజు పండుగకూ తేడా తెల్సుకోమంటాను. ఇంకా చెప్పాలంటే.. వొద్దులే, నేననుకుంటున్న వాక్యం సాహితీలోకంలో బాగా ట్రోలవుతోంది. అయినా ఫర్వాలేదు, చెప్పేస్తాను. “వెళ్లి చదువుకో ఫస్టు”.
అభివృద్ధికి డెఫినిషన్ భారతదేశంలో దొరకదు. నాలుగు డీమార్టులూ, ఇంకో నాలుగు ఐటీ కంపెనీలూ, అలాంటివి మరో పదహారూ.. అభివృద్ధి స్టిక్కరేసుకుని కనిపిస్తాయంతే!
అభివృద్ధి అంటే? లుంగీ ఎగ్గట్టి, రారా నాకొకడా అని చెప్పి సామ్రాజ్యవాదానికి ఎదురునిలబడటం.
అభివృద్ధి అంటే? చీర బొడ్లోకి దోపి, రారా దొంగ నా బట్టా అని తిట్టి ప్రపంచీకరణకి ఎదురునిలబడటం.
అభివృద్ధి అంటే? మంగలిపల్లెని డాక్యుమెంట్ చేయడం.
అభివృద్ధి అంటే? భూమ్మీద నుంచి చెరిపేసిన మంగలిపల్లెను తెచ్చి, సాహిత్యంలో కూర్చోబెట్టడం.
అభివృద్ధి అంటే? ఇలా నరేష్ కుమార్ సూఫీలా ఈ కథలను రాయడం. ఈ పుస్తకాన్ని అభివృద్ధి జాన్రాలోకి చేర్చండి.
ప్రతి ముప్పై కిలోమీటర్ల విస్తీర్ణానికీ “ప్రాంతం” అని ఒక పేరు అనుకోండి. ప్రతి ప్రాంతం గొంతు మీదా ఒక కత్తి వేలాడుతూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి.. వీళ్ళెవరూ దాన్ని కాపాడలేరు. ఒక్క రచయత మాత్రమే, ఆ కత్తిని నేలకు రాల్చగలడు. ఏ ప్రాంతంలో అయితే రచయిత పుట్టడో ఆ ప్రాంతం మరణిస్తుంది. ఈ పుస్తకంతో నామవాచకంగా కనిపిస్తున్న సూఫీ సర్వనామం కావాలి. మరిన్ని చోట్ల, మరింత మంది రచయితలు పుట్టి, మరిన్ని ప్రాంతాలను కాపాడాలి. ఆ శక్తి ఈ పుస్తకానికి ఉంది.
ఈ కథల్ని చదివి, మీరు గతంలోకి జారకండి. ప్రస్తుతంలో నిలబడండి. కన్నీరు కార్చకండి, రక్తాన్ని మరిగించండి. కులాసాగా కూర్చుని, చదివేసి అల్మారాలో పెట్టేసే పుస్తకం కాదిది. అలా చేస్తే, మీరూ మంగలిపల్లె హత్యలో దోషులవుతారు. దీన్ని మరొకరికి ఇవ్వండి. వాళ్ళ మంగలపల్లెనీ డాక్యుమెంట్ చేయమని చెప్పండి.
సూఫీ కమ్యూనిస్టు. గత కథల్లోనూ, కవిత్వంలోనూ అంతగా కనిపించడు. ఇప్పుడు కనిపిస్తాడు చూడండి… కామ్రేడ్ నరేష్కుమార్.
*
2
పచ్చని చెట్లపై కోయిలరాగం జమీల్యా
– రూప రుక్మిణి
సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం -చింఘీజ్ ఐత్ మాతోవ్ (రష్యన్, కిర్గిజ్ భాషల్లో )చేసిన రచన ఇప్పటికీ… నరేష్ కుమార్ సూఫీ అనువాదంలో… చల్లని వెన్నెల ఆరబోసినట్లు, పచ్చని చెట్లపై కోయిలరాగం ఆలపిస్తుంటే… అప్పుడే విచ్చుకుంటున్న కలువ మొగ్గలు నవ్వుతున్నట్లు, ఎటు చూసినా మెత్తని పొగ మంచు తాకి తాకకుండానే గోరువెచ్చటి టీచుక్కలు గొంతు దిగుతుంటే ఉండే హాయితనం ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఆస్వాదించగలుగుతున్నాము అంటే ఆ క్రెడిట్ అంతా అనువాదకుల సొంతమే.
ఎక్కడ కిర్గిజ్, స్టెప్ మైదానాలు ప్రపంచంలోని ఎక్కడో మైదానాల్ని చూస్తూ ఇక్కడి వెన్నెల్లో తడిపి వేసింది ఈ నరేష్ కుమార్ జమీల్యా…
ఇదివరకు ఈ అనువాదం చదవలేదా?! అంటే చదివాను,ఇంకో రూపంలో సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే జమీల్యా నా చేతుల్లో పెట్టి చదువు లైఫ్ లో ఈ బుక్ చదవకపోతే మనం ఎంత శుద్ధ వేస్ట్ నీకే అర్థమవుతుంది అని చెప్పినవాడు ఈ నరేష్ కుమార్ సూఫీనే…
నిజమే జెమీల్యా మూలం అటువంటిది. ఆ పుస్తకాన్ని చదవడం అర్థం చేసుకోవడానికి అప్పటి నాకు కాస్త కష్టమే అయింది. ఓ సాధారణ పాఠకురాలిగా పాతికేళ్ల క్రితం వాడిన పద సంపదలో ఎందుకో అంతగా నాకెక్కలేదు…అదే విషయం నరేష్ కి చెప్పా కొంచెం భాష కష్టంగా ఉంది, కానీ బావుంది కథ సారం అంటూ ఆ కాలంలోనే అంత చైతన్యభావ సౌరభవం ఎలా అన్నాను…
కట్ చేస్తే ఇవాళ ఈ పుస్తకం చేతికిస్తూ ఇప్పుడేమంటావో చూస్తా అంటే.. నిజానికి కొద్ది నిమిషాల్లో చదివేశా ఈ కొత్త పుస్తకం. నన్ను నాలుగేళ్లు వెనక్కి వెళ్లి మళ్లీ చదవమంది మనసు అందుకే పాత అనువాదాన్ని మళ్లీ వెతికి ఒకసారి చదివాను ఇప్పుడు కథలో ఓ స్పష్టత వచ్చింది., అది కథలో కాదు సరళమైన భాషా సౌందర్యానికి వచ్చిన స్పష్టత.
మనం వాడుతున్న భాష ఇప్పుడు ఈ పుస్తకం ఇంకో వెయ్యి రెట్లు ఎక్కువగా నచ్చుతుంది. కారణం నేను ఒక్కసారిగా ఆ స్టెప్ మైదానం అంచులని, అక్కడి నేల తడిని, యుద్ధ గాయాలని స్త్రీలు ఎలా మోస్తున్నారు యుద్ధ నేలపై జరిగే సంఘర్షణ, యుద్ధ వీరుల కుటుంబాలు పడే వేదన తో పాటు పాలుగారే చెక్కిళ్ల మధ్య సంధ్యా కాంతుల ప్రేమలు చిగురించిన వేళ పాడే పాటలు, ఎత్తయిన కొండ గాలి ఊదే వెణువు రాగంలా ధనియార్ గొంతు, ఆగస్టు నెల చలిగాలుల మధ్య వినిపిస్తూ ఉంటే… ఇంకోపక్క సంప్రదాయాల పరదాలు దాటాలన్న ఆలోచనలేమీ లేకున్నా, మనసులో ఏర్పడ్డ ప్రేమకి సంప్రదాయ గీతలోని ఎర్రని మట్టి రంగు కాలువని దాటుతూ జీవితంలో వెనక్కి తిరిగి చూడని జమీల్యా ని కళ్ళకు కట్టి చూపించావు.
మనసుకు నచ్చిన పని చిత్రం గీయటమే అని అర్థం చేసుకున్న చిన్నోడు జీవితానికి అందిన ఓ మెరుపు చిత్రం.. ఆ చిన్నోడి చేతిలోనే రూపుదిద్దుకున్న విధానం, సామాజిక సంఘర్షణలోని చైతన్యానికి ఎలా ఓ వెలుగైందో కొత్త తరానికి అర్థమయ్యే విధంగా రూపు దిద్దిన ఈ జెమీల్యాకు , అనువాదం చేసిన నరేష్ కుమార్ సూఫీకి ఆ ఆలోచన ఇచ్చిన మిత్రులకి అభినందనలు.
తప్పక ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకం ఈ చింఘీజ్ ఐత్ మాతోవ్ జమీల్యా… కొత్త తరానికి కొత్త తలంపుతో…
*
ఇది నిజంగానే నాకొక సర్ప్రైజ్. థాంక్ యు సిద్దూ, రూపక్కా అండ్ సారంగ ఎడిటర్ ❤️