‘సారీ చెప్తున్న కదా. డోర్ ఓపెన్ చేయ్. చలి చానా ఉంది.’ వాట్సాప్ మెసేజ్ చూసింది ఫర్రూ. మెసేజ్ తోపాటు ఏడుస్తున్న ఈమోజీ ఉంది. ఆ మెసేజ్ భర్త హబీబ్ నుంచి.
అప్పటికే బాగ ఉబ్బిపోయి ఉన్న ఆమె కండ్లకెల్లి మల్ల నీళ్ళు ధార కట్టినయ్. అయినా చలించదలుచుకోలేదు. ఫర్రూ పూర్తి పేరు ఫర్హానా. అందరూ ఫర్రూ అనే పిలుస్తుంటరు. హబీబ్ గూడ అట్లనే పిలుస్తడు.
ఫర్రూ మెసేజెస్ చూస్తనే ఉందని బ్లూ టిక్స్ తోటి నిర్ధారించుకుంటున్నడు. మూడు గంటల నుంచి మెసేజ్ ల వర్షం కురుస్తుంది. ఆమె మటుకు ఒక్క రిప్లై ఇస్తలేదు. దాంతోటి ఇరిటేట్ అయిపోతున్నడు.
అసలే ఆరింటికల్లా చీకటి పలకరిస్తున్న డిసెంబర్ నెల రోజులాయె. బయట ఒణికి పోతున్నడు.
జాలి గుండె గల్ల ఫర్రూ ఏమన్నా కరుగుతుందేమో అన్న ఆశ. ఫర్హానాకు ఈసారి బాగనే కోపం వచ్చిందని అర్థమైంది హబీబ్ కు.
ఆమెకు కోపం వచ్చినా, బాధ వచ్చినా హబీబ్ కు ఎప్పుడన్నా ఫరక్ బడి ఉంటే వేరేగ ఉండేది కత. ఫరక్ బడని మనిషి కాబట్టే భర్తను లోపట్కి రానీయకుంట తలుపు పెట్టుకుంది.
తలుపుకు అవతల హబీబ్ ఎంత బాధ పడ్తుండో, అంతకుమించి ఇవతల ఉన్న ఫర్రూ దుఃఖపడుతుంది.
‘ఒకటి దాటింది. ఇగో టైగర్ గూడ వచ్చింది. సూడు. బాగ ఒణుకుతుంది.’ ఆమె చేరదీసిన బజారు కుక్కను తీస్కోని మెట్లకాడ కూసున్న ఫొటో పెట్టిండు.
‘వాడకంల కుక్కను గూడ వొదలవు. థూ…’ చికాకుగ రిప్లై పెట్టింది.
ఆమె నుంచి రిప్లై రావడమే సంతోషంగ ఉంది హబీబ్ కు.
టైగర్ ఎండలకు తట్టుకోలేదు కానీ చలికాలంల హుషారుగనే ఉంటది. టైగర్ గురించి ఆమెకు బాగనే తెలుసు. అందుకనే ఆమెకాడ పప్పులుడకవని కొద్దిసేపట్లనే అర్థమైంది హబీబ్ కు.
భవిష్యత్తు అంత చీకటిలెక్క కనిపిస్తున్న శూన్యంలకి చూస్తా కూసుంది.
ఎప్పుడో సైలెంట్ ల పెట్టిన సెల్లు మోగకపోయినా దాని వెలుతురు రూం నిండా పరుచుకునేసరికి సెల్ వైపు చూసింది. ఇగ కాల్స్ చేస్తున్నడు.
‘ఛీ…’ సెల్ ను మంచంపైన పడేసింది.
అతడి ఉనికే భరించలేనంత అసహనంతోటి ఉక్కిరిబిక్కిరి అయితుంది. స్విచ్చాఫ్ చేసి ఊపిరి పీల్చుకుంది.
అట్ల ఒక్క నిమిషం గడవలేదు. డోర్ బెల్ మోగుతుంది ఒక పక్క. తలుపు మీద దబా దబా బాదుతున్నడు ఇంకోపక్క. వీటికితోడు ‘ఫర్రూ..! ఫర్రూ..!’ గట్టి గట్టిగా పిలవటం షురూ చేసిండు.
‘ఫర్రూ! డోర్ ఖోలోజీ.’ అది పిలుపు కాదు. అరుపు.
అడపా దడపా ఒక బండి పోవడం, అప్పుడో ఇప్పుడో ఒక కుక్క మొరగడం తప్ప బజార్ల ఇంకో సప్పుడు లేదు.
‘ఇట్లాంటి టైమ్ ల ఎవరికన్న ఇనబడ్తే గల్లీల ఇజ్జత్ ఉంటదా.’ భయం డామినేట్ చేస్తున్నా అదిమిపెడుతున్నది.
‘సారీ బోలా నా. గుస్సా థూక్ దోజీ…’ బతిమిలాడటం మొదలు పెట్టిండు హబీబ్.
తలకాయపట్టుకొని కూసుంది ఫర్రూ.
ఇరవై ఏళ్ళకు పైబడిన కాపురంల ఒకరికి తగినోల్లు ఇంకొకరు అన్న మంచిపేరే సంపాదిచ్చుకున్నరు ఇద్దరు. అందరనడం కాదు గానీ ఆల్లు గూడ మంచిగనే ఉంటరు.
అసుమంటోల్ల మద్దెన ఇంత సీరియస్ పంచాయితీ రావటానికి పెద్ద కారణమే ఉంది. ఇది ఒక్కసారికే పుట్టిన పంచాయితీ కాదు. దగ్గర దగ్గర రెండేళ్ళకింద దీనికి బీజం పడింది.
XXX
‘పై ఫ్లోర్ నుంచి అనిల్ ను ఖాళీ చేపిచ్చి మా అమ్మను ఉండమని చెప్దామనుకుంటున్న’ మద్యానంపూట డైనింగ్ టేబుల్ దగ్గర కూసొని అన్నం తినుకుంట అన్నడు హబీబ్.
‘ఎందుకు? అంత మంచోల్లను ఖాళీ చేపిస్తవా?’ కిచెన్ కాన్నుంచి కూర డిష్ పట్టుకొస్త అడిగింది ఫర్రూ.
‘మరేం జెయ్యాలె? ఊళ్ళె ఉన్నది రేకుల ఇల్లాయె. ఎండలకు తట్టుకుంటలేదు మా అమ్మ. యీడనే పై ఫ్లోర్ ల ఉంటా అన్నది.’ చెప్పిండు.
‘రాత్రిళ్ళు ఇంట్లనే బాత్రూమ్ కు ఒక్కతి పోలేదు. ఇగ ఎవ్వరూ తొంగి చూడని చోట ఆమె ఒక్కతే ఉంటదంటనా?’ ఆశ్చర్యంగ అడిగింది ఫర్రూ.
‘ముష్తాక్ గూడ వస్తడంట.’
ముష్తాక్ అంటే హబీబ్ తమ్ముడు.
‘ఆయన, మీ అమ్మ యీడుంటే మీ నాయన, ముష్తాక్ భార్యా పిల్లలు ఎటుపోవాలె. ఆల్ల చదువులు ఏంగావాలె..!’ మల్ల అడిగింది.
‘యే..! అందరు యీడికే షిఫ్ట్ అయితరంట.’ అసలు విషయం కక్కేసిండు.
‘అట్ల చెప్పు మరి. ఒక్కమాటల చెప్పేదానికి ఏందేందో నసుగుతవూ.’ చికాకుగ చూసింది ఫర్రూ.
‘సీరియస్ గ చెప్తున్న. జోక్ కాదిది.’
‘నేనూ సీరియస్ గనే మాట్లాడుతున్నా. జోకులేస్తలేను.’
‘మరి ఎగతాళి చేస్తున్నవ్.!?’
‘ఎగతాళా పాడా. కానీ, ఆల్లు యీడ ఉండటం ఎవ్వరికీ మంచిది కాదు.’ ఫర్రూ గొంతుల సీరియస్నెస్.
‘ఏమైతదేంది?’ అడిగిండు.
‘నాకా… ఆమెతోటి ముచ్చట్లు పెట్టేంత టైం ఉండదు. ఒకర్ని ఆడిపోసుకోలేను. ఇంకొకర్ని అంటాఉంటే ఇనుకుంట ఉండనూలేను.’
‘గా దానికే ఇదైపోతున్నవా?’ దీర్ఘం తీసిండు.
‘రెండు మూడు నెల్లకోసారి వస్తది. ఆడ ఏదన్న అయినప్పుడు బలవంతంగ నువ్వు పంపుడే గానీ ఎన్న్నడన్న ఇష్టంగ పోయిందా? ఎవరి గోలల ఆల్లుంటరు. మీ నాయనను పట్టించుకోవాలన్న సోయి ఉంటదా ఆమెకు? నువ్వు గూడ అమ్మకే ఎండలు తగుల్తున్నాయంటున్నవ్.’
హబీబ్ మాట్లాడకుంట అన్నం తింటుండు. మల్ల ఫర్రూనే చెప్పటం షురూ చేసింది.
‘ఆమె ఉన్నన్ని రోజులు నీ పనులు, పిల్లల పనులకు తోడు కూసున్నకాడికే అన్నీ అందియ్యాలె ఆమెకు. ఇగ ఈ పరిస్థితుల్ల నా గురించి ఎప్పుడు చూస్కోనూ, ఉద్యోగం ఎట్ల చేస్కోను.’ ఫర్రూ గొంతు గద్గదమైంది.
‘ఆమె నీకేం అడ్డొచ్చింది. ఇంక నీకు సాయమే చేస్తది కదా.’ తల్లి కూసున్నచోటికే ఫర్రూ అన్నీ అందించే సంగతి గుర్తుకొచ్చింది హబీబ్ కు. అయినా ఒప్పుకోదల్చుకోలేదు.
‘చూడు నాయనా. ఆమె ఉన్నన్ని రోజులు ఎంత అదబ్ గ ఉండాల్నో అంత ఉంటానికే ట్రై చేస్త. నడి వయసుకు వచ్చిన. మీ అమ్మ మాత్రం ఇప్పటికీ కొత్త చుట్టమే మనింటికి. ఆ ఖాతిర్ చేయలేక ఎంత పరేషాన్ అయితున్ననో నీకు తెల్వదా..’ కండ్ల నిండ నీళ్ళు తిరుగుతున్నయ్ ఫర్రూకు.
‘నిద్ర లేక, తిండి తినకా జ్వరంతోటి, ఒళ్ళు నొప్పులతోటి అడ్డం పడుతుంట. ఇగ ఇట్ల మొత్తానికే షిఫ్ట్ అంటున్నవు కాబట్టి ఆలోచించాల్సిందే.’ మొహమాటానికి హద్దులు పెట్టుకోకపోవటం తనతప్పే అని నిందించుకుంది మనసుల.
ఫర్రూ నుంచి ఆ జవాబు అస్సలు ఊహించలేదు హబీబ్.
‘అట్ల అంటే ఎట్ల చెప్పు? ఉండాల్సొస్తది. అందరు కలిసి మెలిసి బాగుండాలె అని చెప్తవ్. మావోల్లొస్తరంటెనేమో ఇట్లంటవ్.’ మెల్లి మెల్లిగా హబీబ్ గొంతు పెరుగుతుంది.
‘నేను మీవోల్లు, మావోల్లు అని చూస్తలేను. వస్తున్నోల్ల స్వభావం గురించి, నా ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తున్నా.’
‘ఎన్నిసార్లు యేడుస్తవ్ ఆల్లమీద. నేను గాకపోతే ఇంకెవరు చూస్తరు?’ కోపం మొదలైతుంది హబీబ్ లోపట.
‘నువ్వే చూడు. వొద్దని ఒక్కమాటన్నా చెప్పుతోటి కొట్టు. ఆమె అప్పుడప్పుడు వచ్చి ఉంటెనే యాడ తప్పు చేస్తనో అన్న భయంతోటి కంటి నిండా నిద్రపోను. ఇగ యీడనే ఉంటే నాతోని అయితదా చెప్పు.? ఇప్పటికే బీపీ, షుగర్, ఆర్థరైటిస్ ఉండనే ఉన్నాయి. వీటికి తోడు మెనోపాజ్ లక్షణాలు మొదలైనయని డాక్టర్ చెప్తె వింటివి కదా.? పిల్లలే ఎన్నిసార్లు బయట ఏదో ఒకటి తిని స్కూల్ కూ, కాలేజ్ కు పోతున్నరు. ఇగ యీల్లను సూడాల్నంటే నాతోని కాదు. ఆఫీస్ పనితోటే మస్త్ అయితుంది.’ సాంతం గాకున్నా చెప్పగలిగినంత చెప్పింది.
‘లోకంల లేనియి నీకొచ్చినయా? ఎంతమంది మేనేజ్ చేస్కుంటలేరు. అత్తగారోల్లనంగనే యిట్లనే యేడుస్తున్రా.!?’ మొఖం ఎర్రెర్రగ మారుతుంది.
‘ఏమన్నగానీ. నువ్ అర్థం చేసుకుంటవ్ అనుకోవడం నా పొరపాటు. ఇప్పటికే పిల్లలకోసం వండేసరికే సల్లగ చెమటలతోటి తడిసిపోతున్న. వంటామెను పెట్టుకోనీయవ్. ఎట్ల చేస్తున్ననో ఆ అల్లాకే తెలుసు. ఇగ నువ్వే ఉండి ఆల్ల సంగతి చూస్కో. నేనంటూ ఒకదాన్ని ఉన్నట్టు మర్చిపో. నా తిండిని నేను మేనేజ్ చేస్కుంట.’ క్లియర్ కట్ గ తన ఉద్దేశం చెప్పగలిగింది ఫర్రూ.
XXX
‘ఫర్రూ.! అమ్మ వాళ్ళు గౌస్ నగర్ ల కిరాయికి వస్తమంటున్రు. ఇల్లు చూడమన్నది.’ ఒకరోజు చెప్పిండు హాబీబ్.
‘అవునా.’ సాలోచనగ అన్నది. నిజానికి రిలాక్స్ గ ఫీలయింది.
‘మనకాడ ఉంటే ఎటోల్లు అటుపోతే మాట్లాడేటందుకు ఎవ్వరుండరు. చాచా ఇంటికి దగ్గర్ల తీసుకోమని చెప్పిన. రిష్తేదార్లు అందరు అటే ఉన్నరు కాబట్టి ఆల్లకు నిమ్మలంగ ఉంటది.’
‘ఓకే. మంచి గది చూడమని చిన్నత్తకు చెప్పు. అడ్వాన్స్ నువ్వే పే చెయ్యి. నెల నెలా రెంట్ తో పాటు అన్ని సరుకులు ఏస్తా అని చెప్పు.’
‘సరే.’ తృప్తిగ అన్నడు హబీబ్.
రెండు రోజులు గడవకముందే ఇంకో విషయం తెలిసి దిగులు పట్టుకుంది హబీబ్ కు.
‘త్రిబుల్ బెడ్రూమ్ కావాల్నని చచ్చీకి చెప్పిందంట అమ్మ. అంతపెద్దది ఎందుకూ అంటే రెండో కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలతోటి ఉంటమని చెప్పిందంట. ఇరవై వేలకు తక్కువల దొరకదు ఇల్లు.’ నల్లగైంది హబీబ్ మొఖం.
‘అట్లనా. ముష్తాక్ యీడికొచ్చి ఏం చేస్తడు. ఆయన లారీను సిటీల అలోనే చెయ్యరు కదా.’ సాలోచనగా అన్నది ఫర్రూ.
‘ఆ ఫీల్డు వొదిలేస్తడంట. పిల్లలను యీడనే జాయిన్ చేస్తడంట.’ హబీబ్ గొంతు ఇంకా డల్లుగనే ఉంది.
‘నలభై యేండ్లు దాటినయ్. ఇంకా కెరీర్ మార్చి ఏ ఫీల్డులకి పోగలుగుతడు చెప్పు.’ డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది.
‘కిరాణా, చికెన్ షాప్ లాంటియి.’
‘అయితే మంచిదే. కష్టపడి పని చేస్తెనే ఏదైనా ఫలితం.’ ఖుషీగా చెప్పింది ఫర్రూ.
‘ఆఁ… చేసిర్రు. నా బొంద. ఆల్లు తీస్కునే ఆ యింటికి కిరాయి, ఇల్లు గడిషేటందుకు పైసలు నేనే ఇస్తా అని చెప్పిందంట అమ్మ.’
‘—‘ ఫర్రూ నోట ఒక్క మాటా రాలేదు.
ఇది రెండేళ్ళ కింది ముచ్చట.
XXX
ఆదివారం పూట. పని అంతా పూర్తి చేసుకొని మంచం మీద ఒరిగింది ఫర్రూ.
‘ఫర్రూ..! మావోల్లందరు బయల్దేరినరంట. నాకు ఫోన్ చేస్తే కారు తీస్కోని స్టేషనుకు వస్తా అని చెప్పిన.’
ట్రాన్స్ ల ఉన్నట్టుగ విన్నది ఫర్రూ.
‘అట్లకాదూ.! నాకు బాగ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నవూ? ఒక్కమాట నన్ను అడగొచ్చు కదా. ఇన్ని బాధలల్ల ఎట్ల చేస్త నేను. నా పరిస్థితి తెలిసీ పిలవటం ఏంది.’ బాధపడింది ఫర్రూ.
‘ఏం కాదులే. ఆల్లే వండుక తినాల్నని చెప్పిన.’ సముదాయించిండు భార్యను.
‘మంచిగున్నప్పుడు వస్తే అందరికీ చేసిన. ఇప్పుడు కంప్లైంట్స్ వస్తే తట్టుకోలేను.’ హెచ్చరించింది.
‘అరే.! ఎందుకు కంప్లైంట్స్ వస్తయి? ఎప్పుడన్న నిన్నొక మాటన్నరా?’
‘నేను మంచిగున్న కాబట్టి ఏం అనలేదు. వేరేటోల్ల గురించి చెప్పుకుంటుంటే ఇంటలేనా ఏంది.! రేపట్రోజు నన్ను అనరని గ్యారెంటీ ఏంది?’
‘ఆల్లు దుష్మన్లు కాదు ఫర్రూ.’ అరిచిండు.
‘మరి పిల్లల ఎగ్జామ్స్ వస్తున్నయ్. యాడ సదువుకుంటరు?’ తగ్గకుండనే అడిగింది.
‘ఆల్ల తంటాలు ఆల్లు పడ్తరు గనీ నువ్వైతే ఇప్పటికి వంట చెయ్యి.’ పురమాయించి బయటకు పోయిండు.
‘ఎగ్జామ్స్ టైమిది. పిల్లలకు చదువుకునేటందుకు ప్లేస్ ఉండదు. నాకు పండుకునేటందుకు. ఎట్లనో యేమో.’ బాధపడుకుంట లేచింది ఫర్రూ.
‘ఆరుగురు పెద్దలు, నలుగురు పిల్లలు.’ చెప్పిండు హబీబ్.
‘మనం ఇద్దరం పెద్దలం, ముగ్గురు పిల్లలు. మొత్తం పదిహేను మంది.’ నిర్లిప్తంగ అన్నది.
‘అన్నట్టు చెప్పటం మర్చిన. పెదనాయిన మనుమడుకు కొడుకు పుట్టిండు కదా. వచ్చే ఆదివారం హఖీఖా ఉందంట. దావత్ వొచ్చింది.’ మార్పులొచ్చిన సంగతీ చెప్పిండు.
‘మనం పోవాల్నా?’ అడిగింది.
‘పోవాలె కదా. మా చెల్లెళ్ళు గూడ వస్తరు. ఆల్లు దావత్ నుంచి ఇటే వొస్తరు.’ గబగబా చెప్పుకుంట పోతున్నడు.
‘ఓకే. ఇప్పుడేం చేయాల్నో చెప్పు.’
‘ఏం లేదు. సింపుల్గా వండెయ్. పెద్ద పెద్దయి పెట్టుకోకు.’ బయటకు పోయిండు హబీబ్.
సింపుల్గా అంటే అన్నం వండి. ఇంత పప్పు చారు చేసి ఆ పూటకు గడిపేసింది.
XXX
‘మామీ మేరెకు హార్లిక్స్. డోరెమాన్ కప్ మే.’ ఒక పిల్లోడు ఆర్డర్.
‘బడెమ్మీ మేరెకు బూస్ట్ హోనా. అండా ఖానేకే బాద్.’ ఇంకో పిల్ల ఫర్మాయిష్.
ఎగ్జామ్స్ టైమ్ ల ఈల్లకు సెలవులెట్ల దొరికనయో అర్థమైతలేదు ఫర్రూకు. మెల్లగ తెలుసుకున్నది.
హైద్రాబాద్ కు షిఫ్ట్ అయ్యేదే కదా అని ఎగ్జామ్స్ రాయనీకుండనే తీసుకొచ్చిన్రని అత్తగారు చెప్పేసరికి షాక్ అయింది ఫర్రూ.
ఇదివరకు ఇట్ల మాట్లాడుకుంటనే
పనులన్నీ చేసిపెట్టి డ్యూటీకి ఉరికేది. ఇప్పుడేమో డొల్ల శరీరం.
ఆల్లకు ఫర్రూ ఆరోగ్యం సంగతి చెప్పకుండనే పిలిషిన హబీబేమో పని వంకన బయట బయటనే తిరుగుతడు. వంట చేస్కోమని చెప్పిన దాఖలా లేదు. ఈల్ల తిండీ తిప్పలు ఎవరు చూడాలె.
ఎట్లనోకట్ల రెండు రోజులు ఓపికగ చేసింది. ఏ పని చేస్తున్నా అలసట, చెమటలతోటి తడిసిపోతున్న ఫర్రూను చూస్తనే ఉన్నరు. సాయానికి మటుకు ఒక్కలు కదుల్తలేరు.
మూడోరోజు అట్లనే పని చేసినంక ఆఫీసుకు పోయి భర్తకు కాల్ చేసింది.
‘నాకు బాగా జ్వరం వచ్చింది. కమ్జోర్ గ ఉంది హాలత్. ఒణుకుడొస్తుంది.’ ఏసీ రూమ్ ల కూసున్నా తలకాయ నుంచి కారుతున్న చెమటలు తుడుచుకుంట చెప్పింది.
‘ఎందుకు. టాబ్లెట్ లు ఏస్కోలే?’ అడిగిండు హబీబ్.
‘ఏస్కుంటే.? దానికి తగ్గ తిండి కావాలెగా. నాకోసం వండుకోలేకపోతున్న.’ అన్నది.
‘ఇప్పుడు తిన్నవా లేదా?’
‘వొస్తొస్త ఇడ్లీ కొనుక్కొచ్చిన. ఇప్పుడే తిన్న. లేటయితే ఒణుకు రాదా చెప్పు.’ అర్థిస్తుంది ఫర్రూ.
‘ఇప్పుడేమంటవ్ జల్ది చెప్పు. టైం లేదు.’
‘ఇయ్యాల సాయంత్రం వొండలేను. నొప్పులకు నాతోని అయితలేదు. ఆల్టర్నేట్ చూడు.’ చెప్పలేక చెప్పింది.
‘అట్లజెప్పు. ఏం చెయ్యొద్దులే. ఆల్లే వొండుకోని తింటరు. వొదిలెయ్.’ చికాకుగ ఫోన్ పెట్టేసిండు.
మల్ల రింగ్ చేసింది. లిఫ్ట్ చేసిండు.
‘ఆఁ… ఏంది చెప్పు.’ గొంతు సీరియస్ గ ఉంది.
‘ఏం లేదు. నేను మూడు పూటలా అన్నమే తింటున్న కదా. ఇంకా తింటే షుగర్ పెరుగుతది. జెర ఆల్లకు అర్థమయ్యేటట్టు చెప్పు. వేరే ఏదన్నా వొండుకున్నా ఏమనుకోవద్దని.’ బతిమిలాడుకుంట మెల్లగ చెప్పింది.
‘అబ్బ! నా తీరుగ నేను చెప్పుకుంట. నీకవసరంలేదు. పెట్టేయ్ ఫోన్.’ కసిరిగొట్టిండు.
ఏడుపు తన్నుకొస్తుంది. వాష్ రూమ్ లకు పొయ్యి జెరంత మొఖం కడుక్కోని వొద్దామంటే కుర్చీలకెల్లి లేవలేకపోతుంది.
కళ్ళు మూసుకొని కూసుంది కొద్దిసేపు. తరువాత గుర్తొచ్చింది ఆఫీస్ ల ఉన్నట్టు.
‘ఎవ్వరు సూస్తలేరు కదా.’ చుట్టూ చూసింది.
తన జిగ్రీ దోస్త్, క్లాస్మేట్ కమ్ కొలీగ్ పుష్ప చూపులు మానిటర్ ను, తనను మార్చి మార్చి చూస్తుంది.
‘ఏంది సంగతి’ కనుబొమ్మలు ఎగరేసి సైగ చేసింది పుష్ప.
‘ఇటు రా..!’ తల వూపింది ఫర్రూ.
‘బ్యాగుల టాబ్లెట్లున్నయ్ తీసియ్యి.’ మాట బలహీనమైతుంది.
పుష్ప టాబ్లెట్లు ఇచ్చి మంచినీళ్ళు తాగించింది. ఫర్రూ చేతిని తన చేతుల్లకు తీసుకుంది. ఫర్రూ చేతులు సన్నగ ఒణుకుతున్నయని గ్రహించింది.
‘కాఫీ తాగుతవా.?’ అడిగింది.
‘వొద్దు. చాక్లెట్ లేదా?’ చూపు కూడా బలహీనంగ మారుతుంది.
‘ఉంది.’ గభాల్న బ్యాగ్ అందుకొనొచ్చి చాక్లెట్ నోట్లె పెట్టింది.
కొద్దిసేపటికి నిశ్చింత ఆవరించింది ఫర్రూ మొఖంల. అప్పటికే స్టాఫ్ అంత ఆమెను ఓ కంట గమనిస్తనే ఉన్నరు. పుష్ప తన పక్కనే ఉంది.
‘రెస్ట్ రూమ్ కు పోదాం పా.’ మెల్లగ చెప్పింది పుష్పతోటి. ఫర్రూ ముఖంల అలసట కనబడుతుంది.
పుష్ప మెల్లిగ నడిపించుకొని వాష్ రూమ్ వైపుకు తీస్కపోయింది.
లోపటికి పోయినంక పుష్పను గట్టిగ కావలించుకొని ఏడుస్తనే ఉంది. ఫర్రూ లైఫ్ గురించి అంతా తెలుసు పుష్పకు. ఆమె వీపును రుద్దుకుంట ఏడవనిచ్చింది. దుఃఖభారం దిగేదాంక ఆడనే ఉన్నరు ఇద్దరు.
‘క్యాంటీన్లకు పోదాం. మొఖం కడుక్కో.’ టిష్యూలను చేతులకు తీసుకున్నది పుష్ప.
‘ఓకే.’ మైండ్ లకెల్లి ఒత్తిడి ఎగిరి పొయినట్టు ఫీలయింది.
ఇద్దరూ క్యాంటీన్లకు పోయిర్రు.
‘కాఫీ తాగుదామా?’
‘పొద్దున చాయ్ తాగలే. చాయ్ చెప్పు. రెండు బిస్కెట్లు గూడా.’ కణతలు రుద్దుకుంట చెప్పింది ఫర్రూ.
ఆర్డర్ చెప్పి వచ్చింది పుష్ప.
‘మల్లేమైందే నీకు? ఆకలైందాంక ఎందుకుండాలె అసలు. హోటల్లనే తినివస్తే ఈ బాధయ్యేది కాదుకదా.’ నొచ్చుకున్నది పుష్ప.
‘ఫింగర్ ప్రింట్ పడకపోతే సాలరీ కట్. ఇప్పటికి ఎన్నిసార్లు లేటయిందో నీకు తెల్వదా?’
‘తెలుసులే. ప్రాణం కన్నా సాలరీ ముఖ్యం కాదు.’ టీ సిప్ చేసింది పుష్ప.
‘అది ప్రాణం ఉన్నోల్లకే. నాదేముందే. బతికినా, సచ్చినా ఎవరికి ఫరక్ పడదు గానీ ఇంటి ఇఎమ్ ఐకి అవసరం.’ బిస్కట్ నోట్లె పెట్టుకుంట నిర్లిప్తంగ అన్నది ఫర్రూ.
‘నువ్ ఎవరికి ముఖ్యమో కాదో నాకు తెల్వదే. నీ పిల్లలకు నువ్వు అవసరం. ఏది ఏమైనా నువ్వు టైముకు ఇంత తినాలె. టాబ్లెట్లు వాడాలె.’ కచ్చితంగా అన్నది పుష్ప.
‘తినకుంటుండటం నాకేమన్న ఖాయిషా. నిన్న ఆఫీసు నుంచి పోయి వండి పెట్టే సరికే మస్తు లేటైంది. కిందమీదైంది ప్రాణం. రెండు రోజుల నుంచి అన్నమే ఇంత తిని పండుకుంటున్న. ఇయ్యాలన్న లైట్ ఫుడ్డు తిందామనుకున్న. ఈలోపట ఎఫెక్ట్ పడనే పడ్డది.’ పెదిమలు అదిమి పట్టింది.
‘హాస్పిటల్ కు పోదామా? ఒకసారి చెక్ చేయిస్తే మంచిది.’
‘వొద్దులే. కొద్దిగ మంచిగ నిద్రపోతే సెట్ అయితదనుకుంట.’
‘కరెక్టే చెప్తున్నవా. ఒక్కసారి చూపించుకుంటే మంచిది.’ అనుమానంగ చూసింది పుష్ప.
‘ఏం కాదులే పా. ఇప్పటికే లేట్ అయింది.’ లేచింది ఫర్రూ.
ఇద్దరూ ఆఫీస్ లోపటికి నడిచిర్రు.
XXX
రాత్రి ఎనిమిది అయితుంది.
కిచెన్ ల పరిస్థితి చూసి తలకాయ తిరిగింది ఫర్రూకు. ఒక్క అన్నం, కూర తప్పితే ఏవేవో స్నాక్స్ లాంటివి మస్తుగ వండుకొని తిన్నట్లు తెలుస్తున్నది. ఎంగిలి గిన్నెలు చిందరవందరగ పడి ఉన్నయి. వాళ్ళకోసం వంట చేసుకుంటనే గిన్నెలు అన్ని ఒక్క దగ్గర సదిరి పెట్టింది.
తిని పండుకునే సరికే పదకొండు దాటింది. ఇటు ఆఫీసుకు లేట్, తిండికి లేట్, నిద్రకు లేట్.
ఇంకో దిక్కు భర్త నుంచి గింత సపోర్ట్ లేదు. ఒక్క ఓదార్పు మాటలేదు.
పైనుంచి పిల్లల ఎగ్జామ్స్ దగ్గరకు వొచ్చినయ్. ఈ గొడవల ఏం చదువుతున్రో అని టెన్షన్.
పది రోజులు గడిచినయ్. పదిహేను రోజులు గడిచినయి. ఆదివారమన్న జెర్ర నిమ్మలంగ పండుకుందామంటే పిల్లల గోల.
మాటిమాటికీ మామగారు ఫర్రూ పండుకున్న చోట కూడా తచ్చాడుతున్నడు. అత్తామామలు తిరుగుతుంటే కోడలు దర్జాగా పండుకుందనే మాటొస్తదని ఫర్రూ భయం. నాలుగిండ్లకు ఇనపడేటట్లు మోగుతున్నది టీవీ.
‘పిల్లికి చెలగాటం. ఎలకకు ప్రాణసంకటమంటే ఇదే.’ ఒకరోజు హబీబ్ తోటి అన్నది.
‘అంటే.’ అర్థం కానట్టు చూసిండు హబీబ్.
‘ఏముంది? నాకు ప్రాణ సంకటం. మీ అందరికీ చెలగాటం.’ బాధగా అన్నది ఫర్రూ.
‘ఏం మాట్లాడుతున్నవ్ నువ్వు? ఎటుపోయి అక్కడికే తీసుకొస్తవ్’ చికాకు పడ్డడు హబీబ్.
‘నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలె’ గద్గదంగా ఉంది ఆమె స్వరం.
‘సరేలే. రేపు మాట్లాడుకుందాం.’ ఒక్క మాటతోటి తేల్చేసిండు హబీబ్.
ఇంక మాట్లాడి లాభం లేదని మౌనంగ ఉండిపోయింది.
‘అసలు ఆల్లు వచ్చిందెందుకో ఆల్లకన్న గుర్తుందా?’ డౌటొచ్చింది ఒకరోజు.
ఎప్పుడు చూసినా అందరూ టీవీ ముందల, లేకుంటే లూడో ఆడుకుంట. ఒక్కసారన్నా ఫలానా చోట ఇల్లు చూసినమన్న ముచ్చటే ఇనపడలేదు.
లాభంలేదనుకొని తన ఫోన్లనే ఓఎల్ ఎక్స్ యాప్ డౌన్లోడ్ చేసింది. ఇండ్ల గురించి తెలుసుకోవటం మొదలుపెట్టింది.
ఒకరోజు కొన్ని ఇండ్ల నెంబర్లు తీసి మరిది చేతిలబెట్టి కాల్స్ చేసి కనుక్కోమని చెప్పింది.
సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత డెవలప్మెంట్ అడిగింది. అందరూ మొఖాలు చూసుకున్నరు గనీ జవాబియ్యలేదు.
అదేరోజు రాత్రి భర్తను అడిగింది.
‘యాడేడ చూసిన్రు ఇండ్లు? ఏమన్న నచ్చినయా?’
‘అరే చూస్తం ఆగరాదు. నాకు టైం దొరకాలెగా.’ లైట్ తీసుకుండు హబీబ్.
‘ఇరవైరోజులు కావొస్తుంది. ఇంకెప్పుడు దొరుకుతది నీకు టైం?’
‘అరె.! ఏంది నీ తొందర? దొరికినప్పుడు దొరుకుతది. దాని గురించి ఎందుకిప్పుడు.’
ఏది మాట్లాడినా వాదనకిందికే మారుస్తుండు హాబీబ్.
XXX
‘నాకు ఒళ్ళంత తిరుగుతుంది. బాడీ ఒణుకుతుంది. రోజు వేడిగుంటుంది. ఏమన్న అయితదో ఏమో.’ ఆందోళన పడుతుంది ఫర్రూ.
‘ఏమైతది చెప్పు. ప్రతిదానికీ టెన్షన్ పడతవు.’ కొట్టిపారేసిండు హబీబ్.
‘నాకేమన్న అయితే దానికి నువ్వే కారణం. పిల్లలు ఎగ్జామ్స్ కు ఎట్ల ప్రిపేరయితున్రో చూడలేకపోతున్న. మాట్లాడలేకపోతున్న.’ ఫర్రూ మనసులోపటి ఆవేదనను చెప్పింది.
‘యే… అయ్యిందాన్ని, కానిదాన్ని భూతద్దంల పెట్టి చూస్తుంటవ్. పండుకో.’ కసిరిచ్చిండు కోపంతోటి.
నిస్సహాయంగ ఒంటరిగ అనిపిచ్చింది ఫర్రూకు. ఆ కుటుంబానికి పొసగని మనిషిని అని మల్ల అనిపించింది. ఏడుపులనే ఎప్పుడు నిద్రపట్టిందో. తెల్లారి ఎప్పటిలెక్కనే పనిల పడింది.
ఆఫీసుకు పోయింది గని మనసు మనసుల లేదు. నికాహ్ అయినప్పటి నుంచి ఇదే గోల. ఏనాడూ ఇద్దరూ కలిసి సంతోషంగ గడిపింది లేదు.
హైదరాబాద్ ల నిలదొక్కుకొని మంచిగ స్థిరపడాల్నని చిన్న చిన్న జాబ్ లు చేసుకుంట ఇంటర్ ఉన్న క్వాలిఫికేషన్ను డిగ్రీలుగా మార్చుకుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంది. ఆఖరికి చిన్నపాటి ఇల్లు కొనుక్కున్నా చెరిసగం లోన్ తీసుకోవాల్సొచ్చింది.
‘ఏందే ఆలోచిస్తున్నవ్. టీ బ్రేక్. పా రెస్ట్ రూమ్ ల జెరసేపు పండుకుందువు.’ పుష్ప వచ్చి ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది.
‘స్క్రీన్ మీద లెటర్స్ కానొస్తలెవ్వే. రాత్రి హాస్పటల్ కు పోతే షుగర్ లెవెల్స్ తక్కువైతెనే ఏమన్నా. లేకుంటే కండ్లకు డేంజర్ అన్నడు డాక్టర్.’ దిగులు పడింది ఫర్రూ.
‘చెప్పిన కదే. నువ్వు మా యింట్ల ఉండు అని. హబీబ్ తోటి నేను మాట్లాడత.’ ఓదార్చబోయింది పుష్ప.
‘లాభంలేదే. నెల రోజులు దాటింది. పరిస్థితిల ఏ మార్పు లేదు. నాకు హబీబ్ మీదనే డౌటుగుంది. ఇంట్లనే ఉంటానికి పిలిషినట్లుండు. నాకు మటుకు వేరేఇల్లు సూస్కుంటానికి వచ్చినట్లు చెప్పిండు.’
‘అంతే అంటవా.’
‘లేకుంటె ఇన్ని రోజులకెల్లి ఒక్క ఇల్లు దొరకదా. పోనీ నేను నెంబర్లు ఇచ్చినా ఫోన్లు చెయ్యరా? పనులన్ని ఇడిషిపెట్టి అట్ల సోయి లేకుంట ఎవరుంటరే.’ రకరకాల అనుమానాలు పుష్ప ముందు పెట్టింది.
‘ఫస్ట్ ర్యాంకర్ తోటే మజాకులా’ నవ్వింది పుష్ప.
‘కాదే. మా పెద్దోడు పుట్టినప్పుడు డిగ్రీ ఫస్టియర్ ఎగ్జామ్స్ రాస్తున్నం కదా మనం.’
‘అవును.’
‘అప్పుడు పిల్లగాడిని చూస్కునేటందుకు మా అత్తను పిలిచిండు హబీబ్.’
‘అవును. ఏందో అన్నది అన్నవ్.’ గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తుంది పుష్ప.
‘పాలు తాగే పిలగాణ్ణి వొదిలి ఏం పరీక్షలు అని మా చిన్న మరిది అన్నడని చెప్పింది.’ గుర్తు చేసుకున్నది ఫర్రూ.
‘కరెక్ట్.’
‘ఆమె ముంగటే మా మరిదిని అడిగితే నేనెప్పుడన్నా అన్నడు. తెల్లమొఖమేసింది.’
‘సిల్లీ రీజన్స్ కి గూడ అబద్ధాలు చెప్తది కదా.’
‘ఇప్పుడు ఆ చదువు ఉండబట్టే ఈ యిల్లు, ఈ ఇంటివల్లే ఆమె కుటుంబంతో సహా వచ్చి కూసుంది.’
‘నిజమే.’
‘మొన్నగూడ ఒకమాటన్నది.’
‘ఏమన్నదే’
‘మేం షాదీ కాంగనే హైదరాబాద్ వచ్చినం కదా. ఒకల తర్వాత ఒకలు ఇంటికి వస్తనే ఉన్నరా. మా పెద్ద మరిదికి ఏమన్న నేర్పమని పంపిన్రా. ఏదీ నేర్చుకోలేకపోయిండా.’
‘అవునే. నీకసలు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ మెంట్ ఏందో తెల్వకుండనే పాయె. ఈ మెంటల్ స్ట్రెస్ తోటే ఇన్ని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నవ్.’ బాధపడింది పుష్ప.
‘ఆయనను మేము ఒక్క నెలో రెండు నెల్లో ఉంచుకొని పంపేసినమంటా.’
‘ఆమెకెట్లా నోరొచ్చిందే అంత మాటంటానికి.’ ఆశ్చర్యపడింది పుష్ప.
‘రోజుకొక మాట అంటనే ఉంది. కొడుకు లేనప్పుడే ఎక్కువ అంటది. ఆయనకేమో తెల్వదు. నాకేమో ఓపిక పోతుంది.’
‘నువ్ చెప్పొచ్చు కదే.’
‘నాతోని మాట్లాడకుంట తప్పిచ్చుకుంటుండు. అయినా ఇన్నేళ్ళనుంచి లేంది ఇప్పుడు కొత్తగ ఏదన్న చేస్తడనుకోవడమంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదే.’
‘ఎట్లనే మరి. ఇప్పటికీ ఆల్లను ఏ కొడుకుల మీద వొదలకుండా ఆపరేషన్లు, మందులు మాకులు, ఖర్చులు మీరే చూస్తున్నరాయె.’ దిగులుపడింది పుష్ప.
XXX
ఆదివారం ఉదయం పదకొండు అయితుంది.
టేబుల్ మీద కాఫీ ఘుమాయించిపోతుంది. హాయిగా ఉంది ఫర్రూకు. తేలికగుంది మనసుకు.
కాఫీ కప్ ఫొటో తీసి పుష్పకు షేర్ చేసింది.
ఆ వాతావరణాన్ని ఛిద్రం చేసుకుంట హబీబ్ ఫోన్.
‘హలో’
‘యాడున్నవ్?’
‘ఎందుకూ’
‘యాడున్నవో చెప్పు ముందు.’
‘హర్రే..! సార్ కు నేను గుర్తొచ్చిన్నా! నమస్తే సార్. బాగున్రా?’ బనాయించటం మొదలుపెట్టింది ఫర్రూ.
‘జోక్ కాదు. యాడున్నవో చెప్పు. ఇంట్ల అంత చూశిన. ఎవ్వరిని అడిగినా చూడలేదు అంటున్రు. ఎటు పోయినవు?’
‘అబ్బో. అందరు లేచిన్రన్మాట. చెప్పండి సార్. మీకు ఏ విధంగా సహాయపడగలను.’ ఫర్రూ గొంతు నిండా ఎటకారమే.
‘ఇంటికి రా ఫస్ట్. తరువాత సంగతి తరువాత.’ ఆర్డర్ వేసిండు హబీబ్.
‘ఆకలైతుందా సార్? వండిపెట్టడానికి రావాల్నా?’ ఇంకో రాయేసింది ఫర్రూ.
‘వండేటందుకే రమ్మంటనా? రా ముందు. నాకు అర్జెంట్ మీటింగుంది. నేను పోతున్నా. ఆదివారం పూట నువ్వన్నా ఇంట్లె లేపోతే ఏం బాగు.?’
‘ఓ… థాంక్స్. నన్ను ఇంటి మనిషి అనుకుంటున్నందుకు.’
‘ఎక్స్ట్రాలు చేయకు. దబ్బున వచ్చెయ్.’
‘మంచిగ చెప్తున్న ఇను. “నేను రాను.” అంతే.’ ఒత్తి పలికింది.
‘ఎందుకూ?’
‘నేను పార్టీ చేసుకుంటున్నా.’
‘పార్టీనా. ఏం పార్టీ?!’
‘నా పార్టీ. నాకోసం నేను సెలబ్రేట్ చేసుకుంటున్న పార్టీ.’
‘పిచ్చి పట్టిందా నీకేమన్నా.’
‘అవును.’
‘ఏం పిచ్చి? పిల్లలు నిన్ను అడుగుతున్నరు. లేకుంటే యాడున్నవో చెప్పు. పిల్లలు వస్తరు.’
‘నాకు నా పిచ్చి పట్టింది. నేను సంతోషంగా ఉండాల్ననే పిచ్చి పట్టింది. నా పిల్లలు బాగుండాల్ననే పిచ్చి పట్టింది.’
‘నువ్వైతే ముందు రా. తరువాత మాట్లాడదాం. పుష్ప ఇంటికి కూడా పోలేదంట!’
‘హ హ్హ హ్హ. గెస్ చేసిన. నీ పుచ్చు మెదడు ఇంకేం ఆలోచిస్తది.’
‘ఏమైంది నీకు. అందరు అడుగుతున్నరు.’
‘ఓహ్హో… అల్లకూ ఆకలైతుందన్మాట. కాబట్టి నీకు గుర్తొచ్చిన్నా? దొబ్బేయ్.’ కట్ చేసింది ఫర్రూ.
బాధ, కోపం అంతా తోసుకొచ్చినట్లు కందగడ్డలాగ మారింది ఆమె ముఖం.
నెల రోజులుగ ఇంట్ల జరుగుతున్న సంఘటనలు కండ్లల్ల మెదులుతున్నయి.
పప్పు రుబ్బుకుంట తన కొడుకునే కొన్ని నీళ్ళు ఇయ్యమని పిలిషింది ఫర్రూ.
‘మొగ పిలగాణ్ణి మాటిమాటికి పొయ్యికాడికి పిలుస్తుంటవూ. నేనెన్నడన్న అట్ల చేసిందాన్ని కాదు.’ మొఖం చిట్లించి అన్నది అత్త.
‘అదొక్కటే ఏందత్తా. నువ్వు ఏదీ చేయనియ్యలేదు నీ కొడుకులను. నువ్వు ఉద్యోగం చేసిందానివి గూడ కాదు. ఎట్ల అర్థమైతది. నాకొచ్చే కోడలన్నా నాలెక్క బాధపడొద్దు కదా. అందుకనే పిలిచిన.’ తగ్గొద్దని ముందే నిర్ణయించుకుంది గనుక ఆ మాత్రం జవాబిచ్చింది ఫర్రూ.
ఆరోజు సాయంత్రం పెద్ద చర్చ.
‘మా అమ్మను అంతమాట ఎట్లంటవ్? మాఫీ అడుగు.’ హబీబ్ ఒత్తిడి చేసిండు.
చెప్పబుద్ధి కాలేదు. చెప్పలేదు. అప్పటి నుంచి ఆమె కోడలు ఎదురుపడితే కొరకొరా చూస్తున్నది.
కండ్లకెల్లి జల జలా నీళ్ళు రాలినయ్ ఫర్రూకు. ఎట్లాంటి కుటుంబంల పడింది తను.
‘పుష్ప మంచిగ చదువుకున్న తరువాతనే నచ్చిన వాడిని ప్రేమించి పెండ్లి చేసుకున్నది. ఆల్లది జాయింట్ ఫ్యామిలీయే. ఇంట్ల అందరు చదువుకున్నోళ్లే కాబట్టి ఈ టెన్షన్లు లేవు. హాయిగా ఉంది.’ రకరకాల ఆలోచనలు కమ్మేస్తున్నయి.
ఫర్రూకు ముగ్గురూ కొడుకులే. చిన్న మాట సాయానికైనా ఒక బిడ్డ ఉంటే బాగుండేదని ఎన్నిసార్లు అనుకుందో.
ఇంతల్నే పెద్ద కొడుకు ఫర్హాన్ నుంచి ఫోను.
‘యాడవున్నా మంచిగున్న. మీరందరూ హోటల్ నుంచి తెచ్చుకొని తినండి.’ పెట్టేసింది ఫోను.
ఫర్రూ కూసున్నది ఒక మాల్ ల. లంచ్ ఫుడ్ కోర్ట్ ల తినేసింది. ఆ మాల్ లనే పైన ఫ్లోర్ ల ఆరు సినిమా స్క్రీన్ లున్నయి. ఏ సినిమా చూడాల్నో డిసైడ్ చేసుకుంది. ముఫాసా సినిమాకు పోయి రిలాక్స్ గ కూసుంది. సినిమా స్టార్ట్ కావాల్నంటే ఇంకా పావుగంట టైం ఉంది.
పుష్ప రిప్లై ఏం పెట్టిందా అని వాట్సాప్ ఓపెన్ చేసింది.
‘యాడున్నవే. మీ ఆయన, పిల్లలు ఒకటే ఫోన్లు చేస్తున్రూ.’
మెసేజ్ చూడంగనే హుషారొచ్చేసింది ఫర్రూకు.
‘చెప్పుకో’ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ కనపడేటట్లు ఒక సెల్ఫీ తీసి రిప్లై పెట్టింది.
ఎంతకీ సెండ్ కాకపోతే అప్పుడు చూసింది ఫోన్ సెట్టింగ్స్. పిల్లలతోటి మాట్లాడినంక ఏరోప్లేన్ మోడ్ ల పడేసిందని గుర్తొచ్చింది.
ఆన్ చేయంగనే మెసేజ్ల వర్షం. మిస్ కాల్స్. చాలా మటుకు పిల్లలు, భర్త, పుష్పయే ఉన్నయి. ఆశ్చర్యంగ తండ్రి నెంబర్ నుంచి గూడ కాల్స్ ఉన్నయి.
‘సిగ్గు లేనోడు. అబ్బాకు కంప్లైంట్ చేసిండన్నమాట…’
‘ఎహె నన్ను వొదిలించుకోటానికి నిప్పుల్ల తోసినోల్లకు నేను రీజన్ చెప్పేదేముంది.’ సమాధానం చెప్పుకొని తండ్రికి కాల్ చేయడాన్ని విరమించుకుంది.
సెల్ ను సైలెంట్ మోడ్ ల పెట్టేసింది. ఇగ ప్రశాంతంగా సినిమా చూడాల్నని డిసైడ్ అయింది.
XXX
సాయంత్రం ఏడు గంటలు.
ఇంట్లకు అడుగు పెట్టేసరికి అంత సైలెంట్ గ ఉంది. భర్త, పిల్లలు, అత్తామామ సీరియస్ గ కూసొని ఉన్నరు.
ఏం మాట్లాడదల్చుకోలేదు ఫర్రూ. ఎవరికీ జవాబియ్యాల్నని లేదు.
‘ఆదివారం గూడ పని పెట్టిన్రా.’ అత్తమ్మ నుంచి ప్రశ్న. తెలిసినా తెలవనట్టు అడుగుతున్న సంగతిని ఆమె ముఖ కవళికల్ల దాచలేకపోయింది.
‘అవును.’ అనుకుంటనే బాత్ రూమ్ లకు పోయి ఫ్రెష్ అయ్యి కిచెన్లకు వచ్చింది.
అన్నం, కూర వండి ఉన్నయి. అందరు తిన్నట్లు గూడ తెలుస్తున్నది.
‘ఈ సాయమే చేస్తే నేనూ ఆరోగ్యంగ ఉండేదాన్ని కదా.’ అనుకోకుండా ఉండలేకపోయింది.
‘చాయ్ తాగుతరా.’ అడిగింది ఫర్రూ.
‘ఇంతసేపుంటారు.? అందరు తాగిన్రు. నువ్వు చేస్కోని తాగు.’ నిష్టూరమాడింది అత్త.
‘ముష్తాక్ తాగుతడేమో! ఆయన కోసం పోయనా పాలు.’
‘ఆఁ… ఇంకా ఉన్నడా ముష్తాక్. ఆల్లు మధ్యానమే పోయిన్రు.’ రగిలిపోతున్నట్లు ఇచ్చింది జవాబు.
‘సరే. నేను పెట్టుకుంటున్న. హమ్మయ్య. షుగర్లెస్ చాయ్ కు స్వేచ్ఛ దొరికింది.’ రిలీఫ్ గ ఫీలయింది.
టెంత్ చదువుతున్న చిన్న కొడుకు ఉమేర్ వచ్చి తల్లిని హగ్ చేసుకున్నడు.
‘యాడికిపోయినవ్ మమ్మా. నాకు భయం వేసింది.’
‘మీ ముగ్గురి కోసమే బేటా.’ కండ్లల్ల తిరుగుతున్న నీటిని తుడుచుకున్నది.
‘ఖానా ఖాలియే.’ గద్గద స్వరంతోటి అడిగింది.
‘భూక్ నై థీ.’ చెప్పిండు.
ముందుగాల కొడుకుకి అన్నం తినిపించింది. పెద్ద పిల్లలు తిన్నరేమో కనుక్కుంది. అందరూ తల్లిని తిట్టిన సంగతి చెప్పిండు ఉమేర్.
‘అచ్ఛా బేటా. ఏమన్నా సబ్జెక్టు ఉంటే చదువుకో. లేకపోతే పండుకో. నేను చాయ్ తాగి వస్తా.’
కొడుకు ఎల్లిపోయిండు. ఫర్రూ చాయ్ కప్పు తీస్కోని హాల్ లకు వచ్చి కూసుంది.
బ్యాగ్ ల నుంచి ఫోన్ తీసింది. పుష్ప నుంచి చానా మెసేజెస్ వచ్చినయ్. అన్ని టెన్షన్ పడుతున్నట్టే ఉన్నయి.
‘టెన్షన్ పడకు. ఇంట్లనే ఉన్న. తరువాత మాట్లాడత. బై.’ రిప్లై పెట్టి చాయ్ తాగడంల మునిగి పోయింది.
అయిదు రోజులు సాఫీగనే గడిచినయ్. ఒకరోజు
‘మేము గూడ పోదుము గానీ మా మందులు అన్నీ ఇంకా రాలేదంట.’ అన్నది అత్తమ్మ.
‘అట్లనా.’ ముభావంగ ఆఫీసుకు వెళ్లిపోయింది ఫర్రూ.
ఆ తర్వాత మరో వారం రోజులకు ఇల్లు ఖాళీ అయింది.
XXX
‘మేం అయిదుగురము. అప్పుడప్పుడు చుట్టాలొస్తె మటుకు జెర పెద్ద వంటనే అయితది.’
చాన్నాళ్ళుగ దేవలాడుతుంటే ఒకామె వంట చేయటానికి వచ్చింది. ఆమెకు వివరాలు చెప్తుంది ఫర్రూ.
‘చుట్టాలు ఎవ్వరూ రారు. మేం మటుకే ఉంటం.’ ఖరాఖండిగా చెప్పిండు హబీబ్.
‘రాకుండ ఎట్లుంటరులే. జనరల్ గ గెస్ట్ లు అట్ల వచ్చినా చాయో, మజ్జిగో ఇయ్యాల్సుంటది.’ భర్తవైపు చూస్కుంట చెప్పింది ఫర్రూ.
‘అదే చెప్తున్న. ఇగ ఎవ్వరు రారు. నేను చెప్తున్న కదా.’ మల్ల నిక్కచ్చిగ చెప్పిండు హబీబ్.
కొత్త మనిషి ముందల ఎట్లనో ఉంది ఫర్రూకు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని పిలుస్త అని చెప్పి పంపిచ్చింది.
‘ఎవ్వరూ రాకుంట ఉంటరా మనింటికి?’ అడిగింది ఫర్రూ.
‘అవును. ఎవ్వరూ రారు.’
‘అట్లనా? ఎవరెవరు రారంటవ్?’
‘ఎవ్వర్నీ రానీయను. మీవోల్లు ఎవరన్న వస్తే నాకు తెల్వదు.’
‘మావోల్లు ఎవరు? మీవోల్లు ఎవరు? ఈ తేడాలు ఉన్నయా మన మధ్యన?’
‘మా అమ్మ, నాయన, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు… ఎవ్వరూ రారు.’
‘ఓహో. వీళ్ళు మీవోల్లన్నమాట. మా అమ్మ, నాయన, నాతోడ బుట్టినోల్లంత నావోల్లన్మాట.’
‘అంతే కదా.’ భుజాలెగరేసిండు.
‘మరి ఇన్నేండ్లసంది మీవోల్లకు నాచేత చాకిరీ ఎందుకు చేయించినవ్. లెక్కాపత్రం లేకుంట నాజీతం ఖర్చు పెట్టిచ్చినవ్. ఆల్లను తీస్కొచ్చి నామీద ఎందుకేసినవ్?’ ఊపిరి స్పీడ్ పెరిగింది ఫర్రూకు.
‘అదంతేమో గానీ మావోల్లెవ్వరు రారు. సరేనా.’
‘అయితే ఇగ ఎవ్వరూ రారన్నమాట. నా పిల్లలు సెటిల్ అవడం నేను కండ్లార చూస్తన్నమాట.’
‘నీ పిల్లల సెటిల్మెంట్ కు ఎవరడ్డొచ్చిన్రసలు.’ నిర్లక్ష్యంగ ఉంది హబీబ్ తీరు.
వారం రోజుల నుంచి ఇదే తరహాల వాదిస్తున్నడు. పట్టిచ్చుకోకుంట ఎంత నార్మల్ గ ఉందామనుకుంటున్నా కోడిలెక్క కెలుకుతున్నడు.
వాదించే ఓపికలేదు ఫర్రూకు.
ఒకరోజు ఊడ్చి, గిన్నెలు తోమే మనిషి జీతం తీసుకుంట ‘మూడు వేలు ఎక్కువియ్యాలమ్మా’ అన్నది. ఆ విషయం భర్తకు చెప్పింది.
‘నువ్వే మాట్లాడు.’ అన్నడు హబీబ్.
‘మీవోల్ల సంగతి కదా. నేను మాట్లాడితే మంచిగుండదు.’ తప్పుకున్నది ఫర్రూ.
కొద్దిసేపటికి బయటకొచ్చేసరికి ఆమె వాదిస్తున్నది.
‘ఏంది సార్. కుప్పలు కుప్పలు బట్టలు ఉతికితిని. నాలుగైదు టబ్బుల గిన్నెలు తోమితిని. ఎంత గలీజైంది సార్ ఇల్లు. ఊడ్వటం, తుడవటం ఎంత కష్టమైంది సార్.’ గట్టిగ మాట్లాడుతుందామె.
‘అరవకు. ఇగో తీసుకో.’ మొఖం కందగడ్డయింది. ఆమె చేతుల పైసలు పెట్టి పంపిండు.
రెండో కొడుకు ముజమ్మిల్ వచ్చి తండ్రి పక్కన కూసుండు.
‘పప్పా. కిరాణా షాపంకుల్ ఈసారి అయిదువేలు ఎక్కువైందని చెప్పిండు. ఇంకా అయిదు వేలు ఇయ్యి. బిల్ క్లోస్ చేసొస్తా.’ చెప్పిండు ముజమ్మిల్.
‘ఏందీ.! అయిదు వేలా. ఎందుకైనయంటా? సామాన్లన్నీ రత్నదీప్ కెల్లి పట్టుకొస్తిమే.’ అంచనా వేస్తుండు హాబీబ్.
‘పిల్లలు రోజూ పొయ్యి నీ పేరు చెప్పి ఐటమ్స్ తెచ్చుకున్నరంట.’ మెల్లిగ చెప్పిండు ముజమ్మిల్.
‘ఇగ ఇఎమ్ ఐ ఎట్ల కట్టాలె.’ తలకాయ పట్టుకుండు హబీబ్.
XXX
‘పొద్దున్నే ఒకామె వంటకు వస్తా అన్నది. జెర అరగంట లేటుగ పోవా.’ రిక్వెస్ట్ చేసింది ఫర్రూ.
‘ఎందుకు వంట మనిషి చెప్పు. చేస్కోలేవా నువ్వు? నీ పిల్లలకు, మొగుడికే వొండి పెట్టలేకపోతున్నవా?’ బాగ కోపంగ ఉన్నడు హబీబ్.
‘అవును. చేస్కోలేను. శక్తి ఉన్నంతమటుకు వొండి పెట్టిన నా మొగుడికి, నా పిల్లలకు. ఇప్పుడు నాకోసం గ్లాసెడు మంచి నీళ్ళు తీస్కోలేకపోతున్నా. అందుకే కావాలి నాకు సాయం చేసే మనిషి.’ స్థిరంగ ఉన్నది ఫర్రూ గొంతు.
తలకాయ పట్టుకొని కూలబడ్డడు హబీబ్. షూస్ విప్పిండు. టై లూస్ చేసిండు. గట్టిగ ఊపిరి పీల్చి వొదిలిండు.
ఫర్రూను పక్కన కూసోబెట్టిండు.
‘ఏమన్న అర్థమైతుందా? ఇఎమ్ ఐలు ఎట్ల కట్టాలె. నువ్వేమో వంటకు కావాలంటవ్. ఆ తీర్గ ఏం వొండి పెడుతున్నవ్ నువ్వు?’ మల్లా మొదటికే వొచ్చిండు.
ఫర్రూకు రిపీట్ చేసే ఆలోచన లేదు.
‘సరే. పిల్లలు పండుకున్నంక మాట్లాడుదాం. నాకు కిచెన్ క్లీన్ చేయాల్సి ఉంది.’ వెళ్లిపోయింది.
వాళ్ళ భోజనాలు కాంగనే పైన ఉన్న సింగిల్ స్టడీ కమ్ బెడ్ రూమ్ లకు పోయిన్రు.
అర్థగంట తర్వాత వొచ్చి హాల్ కమ్ బెడ్రూమ్ ల భర్తకు ఎదురుంగ కుర్చీ లాక్కొని కూసుంది.
‘చెప్పు. ఇందాక ఏందో అంటున్నవ్?’ అడిగింది.
‘ఏంలేదు. మనకు ఇంటి లోన్ ఉంది కదా. పిల్లల స్టడీ ఫీజులు, ఫుడ్ ఖర్చులు… చానా అయితున్నయని, వంట మనిషి ఎందుకనీ అంటున్నా.’
‘నా ప్రాణానికి మొగోల్ల హాస్టల్ల బతుకుతున్న నేను. నువ్వు ఎట్ల బిహేవ్ చేస్తే పిల్లలు అట్ల బిహేవ్ చేస్తరని లక్షసార్లు చెప్పిన.’
‘నాకేమైంది. నా పిల్లలకేమైంది.’ గర్వం ధ్వనిస్తుంటే కాలర్ సదురుకున్నడు.
‘అదే. ఆ గర్వమే పిల్లలకు నేర్పకు అని చెప్తుంట. కనీసం తిండి తిన్న ప్లేటు టబ్ ల పెడ్తవా నువ్వు?’ సూటిగ అడిగింది ఫర్రూ.
‘నేనెందుకు పెడ్తా. ఇంకా చిన్నతనం పోలేదు ఫర్రూ నీకు. ఏందేందో మాట్లాడ్తవ్.’ ఆమె తల నిమరపోయిండు.
‘తరువాత నిమురుదువు గనీ నీ ఇగ్నోరెన్స్ నా ప్రాణాలు తీసేటట్లుంది. చూడు ఈ పిడిఎఫ్ లు.’ హెల్త్ రిపోర్ట్ లు అన్నీ వరుసపెట్టి చూపించింది.
‘బ్లడ్ ఆరుశాతం. ఏంది అంత తగ్గింది. తింటలెవ్వా?’ ఆదుర్దాగ ఉంది హబీబ్ గొంతు.
‘యాక్ట్ చేసింది చాలు. బీపీ, షుగర్, ఇఎస్సార్, యూరిక్ యాసిడ్, యూటరస్ స్కాన్… ఏ రిపోర్టన్న నార్మల్ ఉందా?’ మెల్లిగా అడిగింది.
‘అవును. లేవు.’ ఆలోచిస్తూ అన్నడు.
‘నాకు పని చేసే కెపాసిటీ ఎంతుంటదో ఈ డాక్టర్లకు కాల్ చేసి అడుగుదామా?’
‘యే.! ఛీ. ఏమనుకుంటరాల్లు. చదువుకోనోల్లెవరో మాట్లాడినట్లుంటది.’
‘మరి హెల్పర్ ను పెట్టుకోకుండా వేరే దారేముందో చెప్పు.’
‘గంట సేపటి వంటకు ఎందుకా అని.’ నసుగుతున్నడు మల్ల పాత ధోరణిలనే.
‘సరే, వొద్దు. ఎనిమిది, ఒకటి, ఎనిమిది… ఈ టైంలల్ల నాకు కచ్చితంగా ఫుడ్ కావాలె.’
‘చేస్కో! నేనేదో అడ్డుపడినట్టు చెప్తవేంది.’
‘నాకంటే గంటకు ముందే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెడీగ ఉండాలె. అది నువ్వు ప్రిపేర్ చెయ్యి. నాది నేను లేచి ప్రిపేర్ చేసుకుంట.’
‘క్యా బాత్ కర్తే యార్. అయ్యి నాకెట్ల వస్తయి?’ పనికి రాని విషయం మాట్లాడుతున్నట్లుంది హబీబ్ తీరు.
‘కదా. నీకెట్ల రావో… నాకు గూడ ఇంతకు ముందులెక్క ఉర్కులాడుకుంట పని చేసేటందుకు బాడీ కోఆపరేట్ చేస్తలేదు. ఎన్నిసార్లు చెప్పాలెనీకు? మూడ్ స్వింగ్స్ ఉంటయని తెలుసా నీకసలు.’ విసుగొస్తుంది ఫర్రూకు.
‘అది కాదు. ఇంతోటి వంటకు వంట మనిషి గూడనా అన్నది మా అమ్మ.’
‘ఇంకా.’
‘మా పెద్ద చెల్లెలు మనిషిని పెట్టుకోలేదు. చిన్న చెల్లెలు పెట్టుకోలేదు. మా అమ్మ పెట్టుకోలేదు. ఆల్లకంటే నువ్వేం కష్టపడుతున్నవని అమ్మ అన్నది.’ గొణుగుతున్నట్టు చెప్పిండు.
‘సరే, మీ అమ్మ ఏం చదువుకున్నది?’
‘ఏమీలేదు.’
‘మీ చెల్లెళ్ళు?’
‘ఏమీ లేదు’
‘మీ తమ్ముళ్ళు?’
‘ఏమీ లేదు’
పోనీ ఇంతమందిల ఒక్కలన్న జాబ్ చేస్తున్రా?
‘ఏమీ లేదు’
‘ఇన్ని ఏమీలేదుల మధ్య ఆఫీస్, అక్కడి స్ట్రెస్ ఎట్లుంటదో గ్రాడ్యుయేట్ అయిన నీకు ప్రత్యేకంగ చెప్పాల్నా?’
‘నాకు తెలవనిది కాదులే’
‘నేను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు మీవోల్లు ఎవరన్న ఫేస్ చేస్తున్నరా?’
‘లేదు.’
‘ఎక్కడన్న మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన్నా.’
‘లేదు.’
‘ఎన్నడన్న నువ్వన్న మీవోల్లను మావోల్లు కాదు అని ప్రవర్తించిన్నా.’
‘లేదు.’
‘ఇన్ని లేదు సమాధానాల మధ్య నా ఒక్క కోరిక మన్నించలేవా నువ్వు? ఆ తీర్గ అడుక్కోవాల్నా నేను?’
‘భర్త దగ్గర అడుక్కోవటమెట్లైతది డియర్.’
‘నువ్వు చేస్తున్నది అదే కదా.’
‘నేనేం చేసినా. ఇది బాగుందే.’ ఏమీ ఎరగని వాడిలా చేతులు తిప్పిండు హబీబ్.
అయితే రేపు వచ్చే మనిషితోటి మాట్లాడి కుదుర్చు. నేను మాట్లాడితే ఇంకా తక్కువకు మాట్లాడొచ్చని రకరకాలుగ వేధిస్తవ్.
‘నేను నాలుగు రూపాయలు పొదుపు చెయ్యాల్ననుకుంట. తప్పా ఏంది.’
‘అయ్యో. అస్సలు కాదు. సూపర్ పొదుపు నీది.’
‘మరి నువ్వు చెప్పాపెట్టకుండా పోతే పద్ధతా? మావోల్లు ఏమనుకుంటరు చెప్పు.’ అసలు విషయం మల్లా తీసిండు.
‘నాకు చేత కానప్పుడు, పిల్లలకు ఎగ్జామ్స్ టైమ్ అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉండాల్నని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంది?’
‘ఆల్లు వస్తున్నమని కాల్ చేసిన్రు. ఎట్ల కాదంటం చెప్పు?’
‘అదే కదా. మీవోల్లూ మీవోల్లూ అంటవ్. నావోల్లు కాదు కదా అని చెప్పకుంట పోయిన. తప్పేముంది.?’
‘పద్ధతేనా నువ్వు మాట్లాడేది?’
‘అవునో కాదో నువ్వే తేల్చుకో.’
‘తేల్చుకోటానికేముంది. ఇగ ఎవ్వరు రారులే.’
‘అరే, మాట్లాడితే ఎవ్వరు రారు ఎవ్వరు రారు అంటవు. ఇగ అసలుకే రారా? ఇక్కడికి దోస్తీ ఖతం అయిందా? కోడి కెలికినట్లు కెలుకుతున్నవూ’ సూటిగుంది ఫర్రూ ప్రశ్న.
తడబాటు కనబడ్డది హబీబ్ మొఖంల. అయినా భార్య ముంగట తగ్గటం ఇష్టంలేదు.
‘రారు వాళ్ళు. నేను రానియ్యను.’ బింకంగ చెప్పిండు.
‘అటు పిల్లల పరీక్షలు ఎగ్గొట్టించి రావడం, ఇటు చూస్తే ఒక్క ఇల్లు వెతకకపోవటం చూస్తుంటే నువ్వే పిలిచినట్లుంది. అయినా ఒక ప్లాను లేకుండ చదువుల మధ్యల వస్తరా ఎవరన్నా?’
‘ఆల్లను నేనే రమ్మన్న. ఉండమన్న.’ మెల్లగ చెప్పిండు హబీబ్.
‘సరే, రమ్మన్నవ్. ఆల్లే వస్తున్నరని నాతోని అబద్ధం చెప్పినవ్. ఓకే. పిల్లల చదువు గూడ లెక్క చేయకుండా అట్లెట్ల వచ్చిన్రు. నాకు చాన చిత్రంగ ఉన్నది.’
‘ఇగ రారులే. అయిపోయింది.’
‘సో! సంబంధాలు తెగిపోయినయి అంటవ్. ఇగ కచ్చితంగ రారు. ఇదే కదా నువ్ చెప్తున్నది.’ నొక్కి మరీ అడుగుతున్నది ఫర్రూ.
డైలమాల పడ్డడు హబీబ్.
అట్లకాదు. నువ్వు చెప్పిపోతే బాగుండేది.
‘ఇరవయ్యేళ్ళ నుంచి మంచి కోడలు. అదబ్ గ ఉండే కోడలు. అన్నీటికి సాయం అందించే కోడలు. ఆపరేషన్లు అయితే కడుపున పుట్టినోల్లు రాకున్నా, కట్టుకున్నోడు తిరిగి సూడకున్నా తోడుండి జాగర్తగ చూసుకున్న కోడలు ఒక్కసారి, ఒకేఒక్కసారి తన జీవితం తాను జీవించే హక్కును అనుభవిస్తే ఇంత చేదైంది మీకు?’ ఫర్రూకు బాగా కోపం వచ్చింది.
‘అది కాదు.’ ఏదో చెప్పబోతున్నడు.
‘చల్లటి వెండి వెన్నెల కురిపించే చందమామ మీదనే మచ్చలు వెతికిన మనుషులు. ఇగ నేను మటుకు ఎంతకని నన్ను నేను పోగొట్టుకుంట అజ్ఞానులకోసం. ప్రేమగా అన్నీటిని జయించొచ్చు అంటరు. ఇన్నేండ్లు బాగున్న మనిషికి ఈసారి ఎందుకో బాగలేనట్లుంది. లేకపోతే ఇట్ల చేసే మనిషే కాదని ఒక్కరు కాకపోతే ఒకరు ఆలోచించిన్రా. నన్నెప్పుడూ బయటి మనిషే అనుకుంటున్నరుగా మీరంతా.’
‘హే… ఎక్కడికో ఎందుకుపోతవ్ నువ్వు. ఇప్పటి విషయాలు మాట్లాడు.’ హబీబ్ గొంతు పదును తగ్గుతున్నది.
‘ఎక్కడికో పోకుండా నన్ను నేను పోగొట్టుకున్నది చాలు. మిగిలిన జీవితం అచ్చంగా నాకోసం ఖర్చు చేసుకుంట.’ స్పష్టంగా చెప్పింది. బయటకు వచ్చి కాంపౌండ్ వాల్ కు అవతల చూడటం మొదలు పెట్టింది.
వెనుక నుంచి హబీబ్ వచ్చిండు.
‘అయ్యన్నీ మైండ్ ల పెట్టుకోకు. నీ మంచి కోసమే ఆలోచించిన నేను.’ బయటకు చూడటం మొదలు పెట్టిండు.
‘అవునవును. నువ్వు చేసిన మంచి ఖాన్దాన్ అంత ప్రచారమైతుంది.’
‘ఏం ప్రచారమైతుంది.’
‘నాకు కోడళ్ళు రారా. నేను ముసలిదాన్ని కానా? ఇంకా నేను పలకలేని సవాలక్ష బూతులు.’
‘ఎవరు చెప్పిన్రు నీకు?’
‘నీకు తెలిసే నోరు మూసుకొని ఇంటున్నవా? భలే మొగుడివి దొరికినవ్. ఛ.’
‘ఎవరన్నరని అడగబోయి ఎవరు చెప్పిన్రు అన్నా.’ సర్దుకున్నడు.
‘మీ అమ్మ. ఏం చేస్తవ్ ఇప్పుడు.’
‘అడుగుత గ్యారంటీగ.’
‘అడుగు మరి. ఫోన్ చెయ్.’
‘అడుగుతా. ఫోన్ ఎందుకు. డైరెక్ట్ గనే అడుగుత.’
‘నాకు చేతనైనప్పుడు నేను పిలిచేదాన్ని. ఆల్లు ఆశించిన అదబ్ చూపించేదాన్ని. ఇట్లాంటి టైంల రావడమేంది. శాపాలు పెట్టడమేంది. చీప్ గ అనిపిస్తలేదా?’
‘నువ్వట్ల పోవడం చీప్ కాదా?’
‘అస్సలు కాదు. నీకంటే కొద్దిగా రోషం ఉంది నాకు.’
‘మరి శాపాలు పెడతరు.’
‘సరే. పెట్టనీలే. పిల్లి శాపాలకు ఉట్లు తెగిన దాఖలాలు లేవు.’
‘పిల్లి అంటవ్ ఇప్పుడు.’
‘నన్ను అంటున్న ఆ బూతులు నిజమైతే ఈ పిల్లీ నిజమే.’
సైలెంట్ అయిపోయిండు హబీబ్.
‘యీడ్నే ఉండు. వాష్రూమ్ కు పోయొస్త’ చెప్పింది ఫర్రూ. లోపటికి వచ్చి మెయిన్ డోర్ మూసేసింది.
అప్పటి నుంచి తలుపు తీయమని బతిమిలాడుతుండు హబీబ్.
‘తలుపులు తీసేదే లేదు. అన్నింటిల నా కష్టార్జితం నాకు ఇస్తున్నట్లు కాగితం మీద రాసి సంతకం పెట్టినంకనే డోర్ తీస్త.’ నిశ్చయంగ చెప్పింది ఫర్రూ.
‘అంతా మనకోసమే కదా ఫర్రూ. మల్ల నువ్వు, నేను ఏంది?’
‘ఆ మాట మావోల్లు మావోల్లు అన్నవే. అప్పుడే ఆలోచించాల్సింది.’ ఏడ్చుకుంట అన్నది.
‘ఎక్కువ ఏడ్వకు. ఆరోగ్యం ఖరాబైతది.’
‘అబ్బ.! ఆహా.! నక్క వినయాలు. ఇంకేడైనా చెప్పుకో. రేపు డివోర్స్ కు లాయర్ ను పిలుస్త. సప్పుడు చేయకుండ సంతకం చెయ్యి. మీవోల్లతో మంచిగ కలిసుండొచ్చు.’
‘నువ్వు లేకుండ మావోల్లను పిలుస్తనా.?’
‘ఓ.. అవున్లే. పని మనిషి లేకుంటే వచ్చినోల్లకు మస్తు కష్టమైతది.’ ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కోపం కట్టలు తెంచుకుంటనే ఉంది. ఓపిక అడుగంటిపోయిందని ఆమెకు అర్థమైతనే ఉంది.
ఏ ఒక్కదానికీ ఒప్పుకోకుండా అట్ల అర్థరేత్రిదాంక బతిలాడుతనే ఉన్నడు.
ఏమాత్రం కరిగిపోయినా జీవితంల ఇంకా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తది. అందుకే తొణకలేదు. బెణకలేదు.
‘నువ్వు నాకు ఎంతమాత్రం వద్దు. డివోర్స్ పేపర్స్ పైన సంతకం చేస్తా అని కాగితంపై రాసి సంతకం చేసి డోర్ కిందనుంచి ఇయ్యి.’ పంతం పట్టింది ఫర్రూ.
‘ఏమనుకుంటున్నవ్. తౌబా చేసుకో. ఇస్లామ్ ల పెద్ద గునాహ్ ఆ మాట.’ భయపడుతున్నట్టున్నది హాబీబ్ గొంతు.
‘నీతోని అరవ చేతకాదు నాకు. తోటి మనిషిని రోజూ రంపపు కోత కోయడం గూడ గునాహ్ నే. భార్యను బానిసను చేయడం ఇస్లామ్ ల గునాహ్ అని తెల్వదా?’ మల్ల దుఃఖం పొంగుకొచ్చింది ఫర్రూకు.
‘అదేంది ఫర్రూ. నువ్వు లేకుంట ఉంటనా నేను. అట్ల సంతకం చేయలేను.’ ఇప్పుడు మెతకగుంది హాబీబ్ మాట.
‘ఎన్నన్నా చెప్పు. చాన అయింది నీతోటి. నా బతుకుల నువ్వు వొద్దు.’
‘అదేంది ఫర్రూ. మనం ఎంత బాగుండేటోల్లం.’
‘బస్. ఆ ఫర్రూను చంపేసినవ్. ఇగ నీ దఖల్ ను భరించలేను. పేపర్ వస్తుంది సూడు. సైన్ చేయ్.’
‘అది చానా పెద్ద తప్పు ఫర్రూ. తప్పయిందని ఒప్పుకుంటున్న కదా. ప్లీజ్.’
‘నువ్వు సైన్ చేయకపోతే ఇప్పుడే సూసైడ్ చేసుకుంట. చేస్తవా లేదా.’
‘అంతపని చేయకు. సైన్ చేస్తున్న. ఇగ డోర్ తీయ్.’
సైన్ చేసిన పేపర్ డోర్ కింద నుంచి లోపలికి పెట్టిండు. అతడి మొహం చూడటం ఇష్టంలేదు ఫర్రూకు. డోర్ తీసేటందుకు తటపటాయిస్తుంది. ఆలోచన చేసుకుంటనే బెడ్రూమ్ ల ఉన్న అల్మారా లాకర్ ల హాబీబ్ సైన్ చేసిన పేపర్ పెట్టింది.
హాబీబ్ అరుపులకు పిల్లలు ఎప్పుడు లేచిన్రో ఏమో! పెద్ద కొడుకు నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ గొడవలు పిల్లలకు ఎప్పటికీ తెలవొద్దనుకుంది. కానీ, ఇప్పుడు కండ్లారా చూస్తున్నరు. ఏం చెప్పాల్నో మనసులనే ప్రిపేర్ అయింది కొద్దిసేపు.
‘క్యా బేటా! నీళ్ళు కావాల్నా?’ ఆ ప్రశ్న ఎబ్బెట్టుగా ఉందనుకుంది. ఏదో మాట్లాడాలని సర్దుకుంది.
‘మమ్మా! పప్పా ఎందుకు బయట ఉండి అరుస్తున్నడు. ఏమైంది?’
గుండె పగిలినంత పనయింది ఫర్రూకు.
‘కుఛ్ నై బేటా. టైగర్ ను పంపించడానికి పోయిండు. అది తప్పించుకొని ఇంట్లకు వస్తది కదా. అందుకని తలుపు పెట్టిన. పప్పా వచ్చేలోపు వాష్ రూమ్ పోయి రావొచ్చనుకున్న. ఈ లోపట్నే అరుస్తున్నడు. నీకు తెలుసు కదా ఆయన హడావుడి.’ అనుకుంటనే తలుపు తీసింది.
తండ్రి పక్కనే కొడుకులను చూసి గుండె పొట్టలోపటికి జారినట్టయింది. తమాయించుకొని గట్టిగ నిలబడేటందుకు ప్రయత్నించింది.
‘బాత్రూమ్ లకు గూడ ప్రశాంతంగ పోనీయవు కదా. ఇంతల్నే పిల్లలు లేసేటంత గోల. ఏం తరీఖనో ఏందో నీది.’ అనుకుంటనే పిల్లలను వెళ్ళి పండుకోమన్నది. అనుమానంగ చూస్తున్న పిల్లలు తండ్రి లోపటికి పోవటం చూసి మెల్లగా పోయిన్రు.
ఇప్పటికిప్పుడు ఏదో చెప్పినా పిల్లలకు పరిస్థితులు అర్థం చేయించే ధైర్యం ముందుగాల తనే కూడగట్టుకోవాలనుకున్న తరువాతే ఆమె మనసు తేలిక పడ్డట్టయింది.
‘సంస్కారం మాటున ఇన్నాళ్లు సరిగ్గా పెగల్చని నోటికి కొద్దిగ పని చెప్తే ఫలితం ఇట్లుంటదన్మాట.’ ఊపిరి పీల్చుకుంది.
ఏండ్లుగా నలిగిపోయిన బాధ ఇది. దీనికి పరిష్కారం చూపిన రోజు ఆమె ఎస్కేప్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నరోజు. కండ్లు తెరిపించిన ఆ ఒక్కరోజుకు వెయ్యి సలాములు చేసుకుంది ఫర్రూ. అలియాస్ ఫర్హానా.
*
Add comment