కవిత్వం ఒక ఆల్కెమీ.
భావాలు మెదడులోకి జొరబడినప్పుడు అవి రేపే అలజడే మనిషిని కవిని చేస్తుంది. ఆ అలజడి అంతరాంతరాలలో నిబిడీకృతమైన పురాతన జ్ఞాపకాలో, జ్ఞానేన్ద్రియాలద్వారా గ్రహిస్తున్న ప్రకృతి ఉనికో, మానవ సంబంధాలలోని సంగతాసంగతాలో, ప్రకృతికీ మనిషికీ మధ్య జరుగుతుందనుకుంటున్న (ఊహలోని) ఘర్షణనో, నిత్యం జరుగుతున్న సామాజిక పోరాటాలో, ఇలా ఎన్నింటినో స్వీకరించగలిగే మెదడు కవిని స్థిమితంగా ఉండనివ్వదు.
“తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వమంటాడు చలం”1 ఈ సామరస్యం తను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పానని కవి భావించినప్పుడే కవిత్వం పై పట్టు సాధించగలడు. అది కవి గొడవ. అయితే ఇక్కడ ఇక్కడ ఒక మెలిక ఉంది. ఆ కవి చెప్పదలచుకున్నవారికి ఆ కవిత్వం అర్థం అయినప్పుడే ఆ కవి సంకల్పం, కవిత్వ ప్రయోజనం సిద్ధిస్తాయి. ఇలా సిద్ధించాలంటే కవి బాష కవిత్వం చదివే వారికి తెలిసి ఉండాలి లేక కవికి తన కవిత్వాన్ని చదువరుల బాషలో చెప్పగలిగే నైపుణ్యం ఉండాలి.
ఇక్కడ తర్కం ప్రవేశిస్తుంది. ఏది ముందూ, ఏది వెనుకా అనే విచక్షణ కవి నిర్దారించుకోగలగాలి. చదువరుల స్థాయిని సరిగ్గా అంచనా వేయగలగాలి. ఈ అంచనా వేయడం అనేది కత్తిమీద సాము.
ఏ కవి అయినా ప్రారంభ దశలో కవిత్వం రాస్తున్నప్పుడు తను రాస్తున్నది కవిత్వం కాదేమో అని ఎవరైనా అంటే విపరీతమైన కోపం రావడం సహజం. ప్రారంభ దశలో తను వాడుతున్న పదాలకూ మంచి కవిత్వంగా అప్పటికే చెలామణి అవుతున్న కవిత్వంలోని పదాలకూ తేడా ఏమిటో మన ప్రారంభ కవికి అర్థం కాదు. సంపాదకులపైనా తమ కవిత్వంపైన అభిప్రాయం ప్రకటించే వారిపైనా కలిగే అసహనం ఆ వ్యక్తిలోని కవిని చంపేసే ప్రమాదం కూడా ఉంది.
మరి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి? తన భావాల సంఘర్షణను అర్థవంతంగా బయటికి ఎలా ప్రకటించాలి? తెలుగునాట కథకు ఉన్న మార్గనిర్దేశం కవులకు దొరకడం లేదు అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది.
సాంప్రదాయ కవిత్వానికి ఉన్న చందస్సూ, యతి ప్రాసల నియమాలూ, అలంకార శాస్త్రమూ ఆధునిక కవిత్వానికి ఎలా అన్వయించాలి? ఆధునిక కవిత్వానికి సాంప్రదాయ కవిత్వం కన్నా అధికంగా ఉన్న లక్షణాలు ఏమిటి? సాంప్రదాయ కవిత్వపు పరిమితులకన్నా ఆధునిక కవిత్వంలోని అదనపు సుళువులేమిటి? సాంప్రదాయ కవిత్వం నుండి మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా?
ఆధునిక కవిత్వం ఛందస్సు సంకెళ్ళను తెంచుకుని భావాలను స్వేచ్చగా ప్రకటించే వెసలుబాటునిచ్చింది. అయితే ఆ వెసలుబాటు భావాలను మరింత స్పష్టంగా ప్రకటించేందుకు ఉపయోగపడాలిగానీ చదువరికి కవిత్వం ఒక పర్వతారోహణ సదృశం కాకూడదు.
ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. కొందరు ప్రసిద్ధ కవుల ఆధునిక కవిత్వం కూడా నారికేళ పాకంగానే ఉంటున్నదిగదా అని. భావ వ్యక్తీకరణలో సంక్లిష్టత అనివార్యమైనప్పుడుకూడా కవిత్వపు ప్రాధమిక లక్షణమైన తక్షణ స్పందనకు అది అవరోధం కాకూడదు.
ప్రాచీన సాంప్రదాయ కవిత్వంలో ఉన్నట్లే, ఆధునిక కవిత్వంలో కూడా తక్షణ స్పందన అనేది అనివార్య అంశం. ఆధునిక కవిత్వంలో ఈ లక్ష్యాన్ని చేరడానికి కవులు ఎంచుకునే ఒక మార్గం కవిత్వం మొదట్లోనే కవి ప్రతిపాదిత రసోత్సాహానికి ప్రాతిపదిక నిర్మించుకోవడం.
“మరో కవి మరణం
సాయం సంధ్యలో చిక్కని చీకట్లో
సృష్టి మధ్యలో
ప్రతి ఒక్కరి కళ్ళముందు
ఎవ్వరికీ తెలియకుండా”2
అంటూ కవితను ప్రారంభిస్తారు ఒక కవి. ‘కవిని రక్షించుకో’ అనే కవితలో. ఒక కవి అంతర్ధానాన్ని దుఃఖించే ఆ కవితలో కవిని రక్షించుకోవాలన్న ఆరాటాన్ని ప్రకటిస్తాడు.
ప్రారంభ పదాలలోనే కవి తను చెప్పదలచుకున్న అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఆ కవిత స్వరాన్నీ, భావాన్నీ ప్రకటించడం ఆధునిక కవిత్వంలోని ఒక ప్రాధమిక లక్షణం.
“నా వారసుడెప్పుడూ ఒకే ఒక ప్రశ్న వేస్తాడు
‘నాన్నా! నేనెప్పుడు పుట్టాలి?’
నిలువుటద్దం ముందు నిల్చుంటాన్నేను
అవయవాల దొంతరకాదు
అవమానాల పరంపర కనిపిస్తుంది”౩
“ఒక జననం వాయిదా” అనే కవిత్వంలోని మొదటి పంక్తులు ఇవి. దళితుల జీవితాలలోని అవమానాల పరంపరనూ భవిష్యత్తును ఊహించుకోవడానికి భయపడే దళిత ఆవేదననూ ఈ ప్రారంభ పంక్తులలోనే సూచిస్తారు కవి.
ఒక కవితను స్వప్నించిన కవి ఆ కవితను చెప్పే క్రమం ఆ కవిలోని విషయ స్పష్టతనూ, గందరగోళాన్నీ కూడా ఆ కవి ప్రారంభ వాక్యాలే చెబుతాయి.
“నిజమే మరి
మనమిప్పుడు బతకనేర్చిన బడిపంతుళ్ళం
బతకలేక బదిపంతులనేది పాత మాట
బ్రతుకు నేర్పడం మాని బ్రతుక నేర్చాం నేడు”4
అని మొదలుపెట్టి ‘వాంటెడ్ క్వాలిఫైడ్ టీచర్స్ టు టీచ్’ అనే కవితలో నేటి ఉపాధ్యాయుల పోకడలగురించి రాస్తారు ఒక కవి. కవిత మకుటం లోని వ్యంగ్యం కవిత మొదటి వాక్యాలలోనే మనకు కనిపిస్తుంది.
ఇంకొక కవి తన కవిత ఇలా ప్రారంభిస్తారు.
“ఆగిపోయిన పంక్తి నిట్టూర్పు
ఊపిరి తెంపిన హటాత్ నిశబ్దం
వెనకనుంచి ఎవరో శ్వాసిస్తున్నారు ఆగీ ఆగీ” 5
‘కవిత మధ్యలో’ అనే ఈ కవితలో కవి నిస్సత్తువనూ, నిర్వేదాన్నీ వ్యక్తం చెయ్యడం కోసం ఎంచుకున్న ఈ ఎత్తుగడ ఒక పూర్ణ దృశ్యాన్నీ ఒక అసంపూర్ణ కృత్యపు నిర్వేదాన్నీ ఆవిష్కరిస్తుంది.
పాద సూచికలు:
- చెలం యోగ్యతాపత్రం.
- ‘అంతర్వేది’ డాక్టర్ అవధానం రఘు కుమార్ కవితా సంపుటి నుండి.
- ‘పంచమవేదం’ సతీష్ చందర్ కవితా సంపుటి. నుండి.
- ‘బాల్యమే శరణార్థి’ కే రత్నం యేసేపు కవితా సంపుటి నుండి.
- ‘వలస; అఫ్సర్ కవితా సంపుటి నుండి.
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment