సరస్వతితో మాట్లాడుతూ ఉండగానే కాటుకవంటి నల్లని మేఘాలతో ఆకాశం నిండిపోయింది. కాంతి క్షీణించింది.
“మనం బయలుదేరడం మంచిది” అని జయతి లోహితాక్షన్ చెప్పడంతో సంభాషణను అర్ధాంతరంగా ముగించి సరస్వతి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాను. సంభాషణ అర్ధాంతరంగా తెగిపోయింది. హృదయం దిగులుతో నిండిపోయింది
ఇదంతా జరిగి ఇప్పటికి ఎనిమిది ఏళ్ళు గడిచిపోయాయి. నా స్నేహితురాలిని మరలా నేను చూడలేదు. ఈ రోజు వరకూ తిరిగి ఆ గ్రామానికి వెళ్ళలేదు. ఈ రోజూ వెళ్ళలేదు. ఆ గ్రామంలోని అడవి సంపెంగ చెట్టు వరకూ వెళ్ళి స్నేహితురాలిని చూడకుండానే వెనదిరిగాను. కారణం నాకు తెలియదు.
బోరున వర్గం కురుస్తోంది. ఈ తుఫాను ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో! వచ్చిన దారిలో, పక్కా రోడ్డులో, వెనక్కి మళ్ళాను. దూరంగా ఒక మట్టి బాట కనిపించింది. ఆ బాటలో నేను ఒక బాలుడిగా వడివడిగా గుర్రాన్ని ఉరికిస్తూ నేలపై దుమ్ము రేపుతూ దౌడు తీయిస్తున్న దృశ్యం కనిపించింది. నాకు తెలియకుండానే పొలానికి అడ్డంగా వర్షపు నీటిలో బైక్ నడిపిస్తూ ఆ బాటను చేరుకున్నాను.
నేను గుర్రంపై పుస్తకాల కోసం వరుసకు తాత గారైన ఎరకయ్య నాయుడు గారు లైబ్రేరియన్ గా పని చేస్తున్న చింతపల్లి(చిన్న గిరిజన పట్టణం) లైబ్రరీకి నా బాల్యంలో ఎప్పుడూ వెళ్ళిన అడ్డదారి అది.
ఆ దారిలో bike ను చెప్పలేని ఉద్వేగంతో వేగంగా ఉరికించాను. ఆ కుండపోత వర్షంలో నేను గుర్రం పై కూర్చుని దౌడు తీయిన్నట్టుగానే అనిపించింది. అమాయకమైన బాల్యపు స్పర్శ నన్ను నిలువెల్లా స్పృశించింది.
దుర్గమమైన అదే అరణ్యం, అవే కొండలు. ఒకప్పుడు గుర్రం మీద మాత్రమే వెళ్లడానికి సాధ్యమైన సన్నని ఇరుకైన కాలిబాట ఇప్పుడు బైక్ వెళ్ళడానికి వీలుగా కనిపించింది. కానీ ఈ బాట నన్ను చింతపల్లి వరకూ చేర్చుతుందా అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణించడానికి నా వద్ద గుర్రం లేదు. ఈ భయంకరమైన, పురాతనమైన అరణ్యాన్ని, అనేక కొండల్ని ఎక్కి, దిగి, దాటి, చీకటి పడేలోగా ప్రధాన రహదారికి నేను చేరుకోగలనో లేదో తెలియదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి బైకు ఆగిపోతే క్రూర మృగాలతో నిండిన దట్టమైన అరణ్యంలో – రాత్రి చీకటిలో, ఈ ఎడతెగని తుఫాను వర్షంలో, చలిలో నా పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి కూడా ధైర్యం చెయ్యలేను. సిగరెట్ అలవాటు లేదు కాబట్టి మంట వెలిగించుకోవడానికి లైటర్ కూడా నా వద్ద లేదు. మొబైల్ ఫోన్ ఆఖరి చార్జింగ్ బార్ మిణుకుమిణుకుమని కొట్టుకుంటోంది. నేను వెనుకకు తిరిగిపోయి, ఇంతకు ముందు వచ్చిన పక్కా రోడ్డులో తిరిగి భద్రంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ,.
తత్వవేత్త John A. Shedd మహాశయుడు చెప్పిన వాక్యం మీకు గుర్తుందా? “A ship in harbor is safe, but that is not what ships are built for.”
నేను జీవితంలో ఎప్పుడూ భద్రతను లక్ష్యంచిన మనిషిని కాను కనుక ముందుకే వెళ్ళాను.
“Take my frail boat, O Lord,
through the storm and night —
If it break upon the waves,
let it break in Thy hands.
నమ్రత నిండిన హృదయంలో నా ప్రయాణాన్ని ప్రకృతి ఇచ్చాశక్తికి ఒప్పజెప్పి ముందుకు సాగాను.
ఎటువంటి కష్టాలు ఎదురైనా నేను ఈ అడ్డదారిలో ముందుకు పయనించాలనే నిర్ణయించుకున్నాను. లేదు, ఈ దారే ఫ్రోడోని మోర్డార్ పర్వతపు అగ్ని నేత్రం, అతని చేతనలోకి ప్రవేశించి పిలిచినట్టుగా నా కలల్లోకి ప్రవేశించి, నన్ను ఆవహించి, ఇక్కడికి లాక్కొచ్చి, నన్ను తనలోకి తీసుకుంటోంది.
ఈ దారి ఒక మార్మికమైన దారి. ఇది ఎందుకు ఎప్పుడూ నా కలల్లో మెదులుతూనే ఉంటుంది!
మన జీవితం బాల్యానికి అనుసంధానించబడి ఉంటుంది. అనిశ్చితమైన ఈ లోకం ముట్టుకుంటే పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. కాలి కింది నేల కూడా స్థిరంగా ఉండదు. బంధాలన్నీ స్థిరంగా అనిపించినా అనిశ్చితం. మానసికంగా మనం ఎవరి పై ఆధారపడ్డామో వారు మారిపోవచ్చు, దూరం కావచ్చు, చనిపోవచ్చు లేదా మన పట్ల ఆసక్తిని కోల్పోవచ్చు. జీవితం అంటేనే మార్పు. మనం ఏ విషయంలోనూ పిర్యాదు చెయ్యలేము. ఇక మరణం ఎదురు చూస్తూ ఉంటుంది. అది తలచుకుంటే మనల్ని ఇప్పటికిప్పుడు తీసుకుపోతుంది. అది అనివార్యం, తక్షణం కూడా కావచ్చు. పుట్టుకకు ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు. మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు.
ఈ నీటి బుడగలాంటి అనిశ్చితమైన సృష్టిలో స్థిరంగా ఉండి మనకు ఆశ్రయం ఇచ్చేది బాల్యమే. లోకపు అన్యాయాన్ని, జీవితపు అర్ధరాహిత్యాన్ని అది ధిక్కరిస్తుంది. క్రూరమైన లోకాన్ని చూసి అమాయకంగా నవ్వుతుంది. దానికదే ఆనందభరితమైనది. ఏ క్రూర ఘటనలూ దాని ముఖం పై చిరునవ్వును చెరిపివేయలేవు. అది ఈ సృష్టికంటే బలమైనది.
అందుకే అంతులేని నైరాశ్యంలో మనం బాల్యాన్ని వెతుక్కుంటాము. అక్కడికి పారిపోతాము. అక్కడ మాత్రమే మనసుకి రక్షణ లభిస్తుంది. ఆ బాల్యపు జ్ఞాపకాల్లోనే. అలా నా బాల్యానికి పయనించే బాట ఇది. ఇది అనేక వెలుగులతో, పేరు తెలియని అసంఖ్యాక పక్షులు కూజితాలతో, లెక్కలేనన్ని సాయంత్రాల్లో అడివి మొక్కలు వెదజల్లే మార్మిక పరిమళాలతో నిండి ఉంటుంది.
స్వర్గానికో, ఆత్మసాక్షాత్కారానికో తీసుకెళ్లే దారి కంటే నా అనేక ఉద్వేగాలతో, జ్ఞాపకాలతో, నా నోస్టాల్జియాతో ముడిపడి ఉన్న, నా కలల్లో ఎప్పుడూ కనిపించే – దివ్య కాంతి ద్యుతితో, వెండిలా మెరిసే జ్ఞాపకాల రజనుతో, ఒక కవి బాల్యంతో, అతని ఆధ్యాత్మిక వికాసంతో ప్రగాఢంగా ముడిపడి ఉన్న – నా ప్రియాతి ప్రియమైన ఈ అడ్డుదారి నాకు ప్రీతికరమైనది. అందుకే ఈ దారి పిలిచినప్పుడు తుఫాను నన్ను అడ్డుకోలేకపోయింది. ముంచుకొస్తున్న చీకటి నన్ను భయపెట్టలేకపోయింది.
ఈ బాటలో పయనించాలనే కదా నేను దశాబ్దాలు ఎదురు చూసింది! ఈ బాటలో ఏముంది అని అడిగితే నా జీవితం మొత్తం ఉంది అని చెబుతాను. అది ఎలాగో ముందు ముందు మీకు తెలుస్తుంది.
ఏటి వద్దకు వచ్చాను.
చింతపల్లి వెళదామని గుర్రం మీద బయలుదేరినప్పుడల్లా కళ్ళు చెదరగొట్టే పచ్చని పచ్చికలోంచి సాగే ఈ చిన్న ఏరు దాటాల్సి వచ్చేది. చల్లని తేటైన నీటిలో నల్లని గులక రాళ్ళ పైన నా బాల్యపు చిన్ని పాదాలు తెల్లగా మెరిసేవి. చల్లదనానికి జివ్వున లాగేవి. ఆ చల్లదనం, జీవం హృదయంలోకి ప్రవేశించి కళ్ళు మూతలు పడేవి.
ఆ నీటిలోని జీవశక్తి నా మెదడు వరకూ ప్రవహించేది. కాలాతీతమైన దాని స్పర్శ నాకు ఆ ఏటిలో లభించేది. అప్పుడు దాని అర్థం నాకు తెలియదు. ఆ సమయంలోనే మేము ఉన్న గడ్డి ఇంటి మట్టి గోడపై నేను తగిలించిన రష్యన్ కేలండర్ లోని కాకసస్ పర్వత శ్రేణులను చూస్తూ నెలలకు నెలలు గడుపుతున్నప్పుడు, వాటి వెనుక ఏముంది అని వెతుకులాడినప్పుడల్లా మనోలయం అయ్యేది. లోతైన శూన్యస్థితి కలిగేది. ఆ స్థితి ఏంటో అప్పుడు తెలిసేది కాదు. కొన్ని అవగాహనలు, స్థితులు, అనుభూతులు మనకు పుట్టుకతోనే వస్తాయేమో?
ఎంత స్వచ్ఛమైన రోజులవి!
కుక్క పిల్ల సోనీ ఆ ఏటి వరకూ తోడు వచ్చేది. వీడ్కోలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయేది. ఇక్కడికి రాగానే ఎప్పుడూ గుర్రం ఆపి, కిందకి దిగి ఏటిలో దిగకుండా ఎప్పుడూ వెళ్ళ లేదు నేను.
ఇప్పుడు ఆ ఏరు అలాగే ఉంది. కానీ దానికి ఏ సౌందర్య శక్తీ లేదు. దాని మీద కల్వర్టు కట్టారు. జీవితమంతా మనం సౌకర్యాల కోసం సౌందర్యాన్ని నాశనం చేసుకుంటూనే ఉంటాము. ఇప్పుడు ఏటిలో దిగే పరిస్థితి కూడా లేదు. ఆ అవసరమూ లేదు. ఈ ఆధునికత, నాగరికతలు సనాతనమైన ఆదిమ సౌందర్యాన్ని నాశనం చేస్తాయి.
వర్షాకాలంలో చిమ్మచీకటిలో హోరున పెద్ద శబ్దం చేస్తూ ఉదృతంగా ఏటిలో నీరు ప్రవహిస్తున్నప్పుడు ఒకరి చేతుల్ని ఒకరం బలంగా పట్టుకుని మొల లోతు ఏరుని దాటేటప్పుడు భయంగానే ఉండేది. కానీ శాంతించాకా ఆ ఏరు చూపే ప్రేమ ముందు ఈ భయం ఏపాటిది? ఆ ఏరు నా పాదాల గుండా నా ఆత్మలోకి ప్రవహించినప్పుడు నేను ఏమి పొందానో దాని కోసం కవి లార్డ్ బైరన్ లా తుఫానులో సముద్రాన్నే ఈదవచ్చు.
మానవ జీవితం అంతా సౌందర్యానికి సుఖానికి నడుమ పోరాటంతోనే గడిచిపోతుంది. ఎక్కువ మంది జీవితంలో ఈ పోరాటం ఉండనే ఉండదు. వారు సుఖాలకు పూర్తిగా లొంగిపోతారు. సౌందర్య స్పృహ లేకుండా ఆనందం అసాధ్యమని ఎప్పటికీ వారు తెలుసుకోలేరు. అది తెలుసుకున్నవారి జీవితంలో నాణ్యత వేరేగా ఉంటుంది.
(సశేషం)
Add comment