ఊ! ఆ తరువాత?

మీరు పాఠకులను గౌరవిస్తే వాళ్లకి కూడా వారివారి జీవిత అనుభవాలు కొన్ని ఉంటాయని, వాటిని వాళ్లు చదువుతున్న కథలోకి తీసుకువస్తారని తెలుసుకుంటారు.

ది టీవీలో వచ్చే ఒక క్రైమ్ సీరియల్. ముగ్గురు ఆఫీసర్లు. ప్రతి ఎపిసోడ్ మొదట్లో ఒక క్రైమ్ జరుగుతుంది. ఇన్వస్టిగేషన్ మొదలుపెడతారు. చాలా క్లూస్ కళ్ల ఎదురుగానే ఉంటాయి కానీ వాటిని వాళ్లు త్వరగా లింక్ చెయ్యలేకపోతారు. ప్రేక్షకులకి హంతకుడు ఎవరో తెలిసిపోయిన పది పదిహేను నిముషాల తరువాత ఆ ఆఫీసర్లు నేరస్తుడిని పట్టుకుంటారు. ఇలాంటి కథనంతో నడిచే సీరియల్. ఈ సీరియల్ చూడటానికి ప్రేక్షకులు ఇంటరెస్ట్ చూపిస్తారంటారా?

మరో టీవీ ప్రోగ్రామ్. రకరకాల వంటకాలు ఎలా చెయ్యాలో చెప్తారు. చాలా వరకు మనకి తెలిసిన వంటలే. టమాటో రసం ఎలా చెయ్యాలో ఒక ఎపిసోడ్. బంగాళాదుంప వేపుడు మరో ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లు టెలీకాస్ట్ చేసినప్పుడు ప్రేక్షకులు చూస్తారంటారా? ఈ ప్రోగ్రాం viewership ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ముఖ్యంగా వంట చెయ్యడం వచ్చిన వాళ్లకి ఈ ఎపిసోడ్‌ల మీద ఆసక్తి ఉంటుందా? ఉండదా?

గత పక్షం మనం కలిసినప్పుడు “చెప్పద్దు, ప్రదర్శించండి” అని తెలుగులోకి తర్జుమా చేసుకున్న “Show, don’t Tell” అనే టాపిక్ కదా మాట్లాడుకున్నాం? దానికి కొనసాగింపుగా ఏదో చెప్తాను అనుకుంటే ఇంకేదో చెప్తున్నాను అని అనుకుంటున్నారా? మరేం ఫర్లేదు. ఎక్కడ మొదలుపెట్టినా ఆ టాపిక్‌లోకే వెళ్తాం, పూచీ నాది. ఇప్పుడు నేను పైన చెప్పిన రెండు టీవీ ప్రోగ్రాముల గురించి ఆలోచించండి. ఆ తరువాత నేను అడిగినదానికి సమాధానం చెప్పండి.

మొదట చెప్పిన సీరియల్ పేరు CID. 1998లో మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యి, 2018 వరకు, అంటే ఇరవై ఏళ్లపాటు, 1600కి పైగా ఎపిసోడ్లు టెలీకాస్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ నెట్‌ఫ్లిక్స్‌లో మొదలుపెట్టారు. సూపర్ హిట్ సిరీస్ ఇది. అలాగే సామాన్య ప్రేక్షకులు సర్వ సాధారణంగా చేసుకునే వంటలనే వండి చూపించే కుకరీ ప్రోగ్రాములు కూడా సూపర్ హిట్టే.

అయితే కావచ్చు. ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ ఎమిటి? అసలు ఈ రెండింటికి, ఫిక్షన్ రైటింగ్‌కి ఉన్న సంబంధం ఏమిటి? చెప్తాను. ఈ రెండు ప్రోగ్రాములు ఎందుకు అంత హిట్ అయ్యాయో ఒక చిన్న పరిశీలన చేసి, ఆ పరిశీలనని రచనలకు ఆపాదించి చూద్దాం.

“చారు ఎలా కాయాలో నాకు తెలుసు. టీవీలో దాని గురించి ఎపిసోడ్ వస్తే, వీళ్లు నాకు తెలిసినట్లే చేస్తున్నారా లేక ఇంకేదైనా మార్పులు చేస్తారా?” అని కొంతమంది చూస్తారు. “టీవీలో వంట చేస్తున్నవాళ్లు ఏదో ఒక తప్పు చెయ్యకపోతారా, అది నేను పట్టుకోకపోతానా” అని చాలామంది చూస్తుంటారు. పొరపాటున అలాంటి సందర్భం దొరికితే దాన్ని హైలైట్ చేసి – “ఇదేనా టమాటా పప్పు పెట్టే పద్ధతి? నేతితో తాళింపు వెయ్యాలి. అందులో కూడా ముందు ఇంగువ వెయ్యాలి.” అని పెదవి విరుస్తారు. ఇంకోరకంగా చెప్పాలంటే అలా పెదవి విరవటం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్‌లు చూస్తారు.

అలాగే డిటెక్టివ్ పట్టుకోడానికి ముందే నేరస్తుడిని కనిపెట్టేసి, ప్రకటించడం ద్వారా, CIDల కన్నా మేమే తెలివైన వాళ్లం అని ప్రపంచానికి చాటి చెప్పేందుకే CID చూస్తారు. “ఏమి CIDలు రా మీరు? మీ పక్కన ఉన్న వాడే హంతకుడని నేను ఎపిసోడ్ మొదట్నించి చెప్తూనే ఉన్నాను. అంత మాత్రం తెలుసుకోలేరా?” అని తమ జడ్జ్‌మెంట్ ఇవ్వడం కోసం చాలామంది ఈ సిరీస్ చూస్తారు.

ఇలా చూస్తున్న ప్రేక్షకులలో మీరు కూడా ఉన్నారేమో నాకు తెలియదు. ఒక వేళ ఉన్నా మీరు ఈ విషయాన్ని ఒప్పుకోరని అనుకుంటున్నాను. మీరే కాదు ఈ సీరియల్ చూసేవాళ్లలో చాలా మంది ఇది గుర్తించరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఒప్పుకోరు.

“ఆ సీరియల్ ఏం పెద్ద బాగుండదు. ఏదో టైంపాస్ కి చూస్తుంటాను. అంతే! ” అంటారు. దాని మీద వాదించి సాధించేదేమీ లేదు కాబట్టి అదలా పక్కనపెట్టి, ఇలాంటి ప్రవర్తనకి కారణం ఏమిటో తెలుసుకుందాం.

డిటెక్టివ్ కన్నా ముందే తెలుసుకోవడంలో – నాకు డిటెక్టివ్ కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనే ప్రకటన ఉంది. వ్యూయర్ సుపీరియారిటీ (viewer superiority) అని ఒకటుంది. నాకు ఆ సీరియల్‌లో పాత్రలకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనే కల్పిత భావన (illusion of intellectual mastery) ఆ సీరియల్ మళ్లీ మళ్లీ చూసేలా చేసింది. ఆ సీరియల్ నిర్మించిన వాళ్లు ఇది తెలిసి చేశారో, తెలియకుండా జరిగిందో తెలియదు కానీ CID సీరియల్ ఎందుకు హిట్ అయ్యిందో తెలుసుకోవడం సైకాలజీ స్టూడెంట్‌కి మంచి ప్రాజెక్ట్ అవుతుంది. నన్నడిగితే – CIDలో ఉండే ప్రధాన పాత్రలు తెలివితక్కువ పాత్రలు కావు అంటాను. వాళ్లు తెలివిగానే ఆలోచిస్తారు. కాకపోతే ఆలస్యంగా ఆలోచిస్తారు. కళ్ల ముందు ఉన్న విషయాన్ని కనిపెట్టడానికి ఐదారు డైలాగుల విశ్లేషణ చేస్తారు. వాళ్లు కనిపెట్టబోయే విషయాన్ని కొన్ని క్షణాల ముందు కనిపెట్టేందుకు ప్రేక్షకులకి ఇచ్చే అవకాశం అది. CIDల కన్నా ముందే కనిపెట్టడంలో ఇంటలెక్చువల్ మాస్టరీ, తమ తెలివితేటల మీద నమ్మకం, తృప్తి లాంటి ఫీలింగ్సే కాకుండా ఒక ఎఫిఫని కూడా ఉంటుంది. ఎఫిఫని అంటే ఏమిటి? ఆకస్మికంగా మెరుపులా మెరిసే ఒక భావన. ఠక్కున, ఎవెరో చెప్పినట్లు, అప్పటిదాకా కప్పి ఉన్న మంచు ఒక్కసారిగా పక్కకి తొలగి “ఓ మై గాడ్! ఇతనే హంతకుడు” అని తెలిసిపోవడం. దీని గురించి వివరంగా తరువాత చెప్తాలెండి.

ప్రేక్షకులకి వర్తించే ఈ లక్షణం పాఠకులకి కూడా వర్తిస్తుంది. అదే ఈ ఎనాలసిస్‌కి మన చర్చకి ఉన్న సంబంధం. మనం రాసే రచనలు – కథలు, నవలలు, స్క్రిప్ట్‌లు – చదివే పాఠకుడు కూడా ఇలాగే తరువాత వచ్చే పదమేమిటో, తరువాత వచ్చే వాక్యమేమిటో, తరువాత జరగబోయే సంఘటన ఏమిటో ఊహిస్తూ ఆ కథలో ప్రయాణిస్తూ ఉంటారు. తరువాత ఏం జరగబోతోంది అన్న భావనే పాఠకులని కథ వెంబడి నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఏ జాన్రాలో కథ రాసినా పాఠకుడి చేతిలో అది ఒక మిస్టరీనే. ప్రతి కథా డిటెక్టివ్ కథే. విచిత్రంగా ఉన్నా ఒక్కసారి ఈ దృష్టిలో ఆలోచించి చూడండి. ప్రేమకథలో చివరికి ఆ ప్రేమికులు కలుస్తారా లేదా అన్న మిస్టరీ ఉంటుంది. సామాజిక సమస్యని కథ ఎత్తి చూపితే ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనే మిస్టరీ ఉంటుంది. డిటెక్టివ్ కథల గురించి చెప్పే పనేముంది? వాటిల్లో నేరస్థుడు పట్టుబడతాడా లేదా అనే సస్పెన్స్ ఉంటుంది. కథలో భార్యా భర్త కొట్టుకుంటే తిరిగి మాట్లాడుకుంటారా లేదా అనే చిన్న సస్పెన్స్ ఉంటుంది. ఒక పేదవాడు ఎర్రజెండా పట్టుకుని తిరగబడితే ఆ తరువాత అతనికి ఏమౌతుంది అనే సస్పెన్స్ ఉంటుంది.

తరువాత ఏం జరుగుతుంది?

ఇదే ప్రతి కథలో ఉండే సస్పెన్స్. ఇదే పాఠకులని డిటెక్టివ్‌లుగా మారుస్తుంది. పాఠకులని డిటెక్టివ్‌గా మార్చడమేమిటి? మీరు ఏదైనా ఒక మిస్టరీ నవలని ఉదాహరణగా తీసుకోండి. అందులో ఒక మర్డర్ కేస్. కేస్ ఇన్వస్టిగేషన్ చెయ్యాలి. దానికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేశారు. కానీ ఆ టీమ్‌కి తెలియకుండా అందులో పాఠకుడు కూడా ఉంటాడు. ఆ టీమ్‌తోపాటే ఉండి తన పాటికి తాను కేస్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. అతని కన్నా ముందు, ఆ నవల్లో ఉండే తెలివైన డిటెక్టివ్ కేస్ సాల్వ్ చెయ్యగలిగితే పాఠకుడు అబ్బురపడతాడు. అలా కాకుండే పాఠకుడే ముందు సాల్వ్ చెయ్యగలిగితే రెండు రకాలుగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆ కేస్ సాల్వ్ చెయ్యడానికి పాఠకుడు పడే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. చాలా కష్టపడి డిటెక్టివ్ కన్నా ముందే కేస్ సాల్వ్ చెయ్యగలిగితే అది viewer superiority ని ఇస్తుంది కాబట్టి కథ/పుస్తకం అద్భుతంగా ఉందని ప్రచారం చేస్తారు. ఏ మాత్రం కష్టపడకుండా డిటెక్టివ్ కన్నా ముందే కేస్ సాల్వ్ చెయ్యగలిగితే పుస్తకం ఫర్వాలేదని చప్పరిస్తారు. కానీ ఆ పుస్తకానికి సీక్వెల్ వస్తే అందరికన్నా ముందు కొనుక్కుంటారు.

ఇప్పుడు ఒక్క క్షణం ఆగి గత పక్షం వ్యాసంలో చెప్పిన విషయాన్ని, ఈ వ్యాసంలో ఇప్పటిదాకా చెప్పిన విషయాన్ని కలిపి మననం చేసుకుందాం.

పాఠకులు తరువాత ఏం జరగబోతోంది అనే ఉత్సుకతతో కథని చదువుతారు. రచయిత ఆ విషయాన్ని వాచ్యంగా చెప్పకుండా వాళ్లంతట వాళ్లే తెలుసుకునేలా ప్రదర్శించిన కథని ఇష్టపడతారు.

రచయిత అతిగా వివరించడం వల్ల సన్నివేశం చాలా చప్పగా తయారౌతుందని ఇంతకు ముందు చెప్పాను. కానీ దానివల్ల జరిగే పెద్ద నష్టం ఏమిటో తెలుసా? పాఠకులు తమంతట తామే తెలుసుకోవడం అనే ఆనందానికి దూరమౌతారు. ఇది చెప్పడానికే ఇంత చెప్పాల్సి వచ్చింది. సరే, మీరంతా ఈ విషయం ఒప్పుకుంటే అలా పాఠకులు నిరుత్సాహపడకుండా, ఆసక్తి కోల్పోకుండా, వాచ్యంగా చెప్పకుండా కథని ఎలా ప్రదర్శించాలి? అనే ప్రశ్నకు కొన్ని సమాధానాలు చెప్పుకుందాం.

పాఠకుడి మీద నమ్మకం ఉంచండి

ఒక రచయిత అలవరచుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, పాఠకుల మీద నమ్మకం ఉంచడం. మీరు నేరుగా చెప్పకపోయినా, మీరు అందించిన ఆధారాల ద్వారా కథని అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం పాఠకులకు ఉంది అని నమ్మి రచన చెయ్యడం. అలా మీరు పాఠకుల సామర్థ్యాన్ని నమ్మిన రోజు, ప్రతి భావోద్వేగాన్ని వాచ్యంగా చెప్పడం మానేస్తారు. దాని బదులుగా ఆ భావం అర్థమయ్యేలా, ప్రదర్శించడం మొదలుపెడతారు.

“నాకు పిడుగులు అంటే చచ్చేంత భయం” అని పాత్ర చేత చెప్పించాల్సిన పని లేదు.

ఎక్కడో పిడుగుపడిన చప్పుడుకి ఆమె ఉలిక్కిపడి, బెదురుగా కళ్లు ఆర్పుతూ అతని వైపు చూసింది – అంటే చాలు.

మీరు పాఠకులను గౌరవిస్తే వాళ్లకి కూడా వారివారి జీవిత అనుభవాలు కొన్ని ఉంటాయని, వాటిని వాళ్లు చదువుతున్న కథలోకి తీసుకువస్తారని తెలుసుకుంటారు. అలా వాళ్ల జీవితంలో ఉన్న అనుభవాన్ని తెచ్చి కథకి ఆపాదించి అర్థం చేసుకునే అవకాశం ఇవ్వడమే వాళ్ల పట్ల గౌరవాన్ని ప్రకటించడం. కొన్ని అద్భుతమైన కథలలో, నవలలో కావాలనే రచయితలు అస్పష్టత తీసుకొస్తారు. ఇది పాఠకుల మీద గౌరవం మాత్రమే కాదు, వాళ్లు ఆ అస్పష్టని తొలగించుకుని కథని అర్థం చేసుకుంటారు అనే విశ్వాసానికి ప్రతీక. అందుకే చాలా గొప్ప కథల్లో అపరిష్కృతమైన ముగింపు ఉంటుంది. అది పాఠకులని ఆలోచించే దిశగా నడిపిస్తుంది అని ఆ రచయిత నమ్మకం అందులో ఉంటుంది.

మీరు రాసేటప్పుడు, లేదా రాసిన కథని ఎడిట్ చేసేటప్పుడు ఎక్కడైనా “జోక్‌ను వివరించినట్లు” ఏ భావోద్వేగాన్నైనా వాచ్యంగా చెప్పి పాఠకుల మనసులో బలవంతంగా ఆ భావాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. “ఆమె తనలో తను ఇలా అనుకుంది”, “అతను ఆమెకి కోపం వచ్చిందని గ్రహించాడు.” ఇలాంటి వాక్యాలు ఉన్నాయా అని చూసుకోవాలి. పాత్ర మనసులో ఉన్న భావోద్వేగాన్ని పాఠకులలో కూడా కలిగించడానికి అన్నిసార్లు సంభాషణే వాడుతున్నామా అని కూడా చూసుకుంటూ ఉండాలి.

మనసు మాత్రమే మాత్రమే కాదు

వాచ్యంగా చెప్పేటప్పుడు కేవలం మనసులో ఏముందో చెప్తాము. “అతనికి భయం వేసింది” అంటాము. మనసుని వదిలిపెట్టి పంచేంద్రియాలకు కనిపించేది, వినిపించేది, అనిపించేది చెప్పడమే ప్రదర్శన. ఇది చూడండి –

నాన్న ఇంట్లో ఉంటాడు అని గుర్తుకురాగానే బ్యాగ్‌లో ఉన్న ప్రోగ్రస్ రెపోర్ట్ బరువు వంద కేజీలు అయినట్లు అనిపించింది. అడుగులో అడుగేస్తుంటే కూడా దూరంగా ఉన్న ఇల్లు దానంతట అదే నడిచి వస్తున్నట్లు దగ్గరౌతోంది. చెమట తడి వెన్నెముక మీదుగా జారుతూ సన్నని వణుకు పుట్టిస్తోంది. ఇంట్లోకి అడుగుపెడుతుంటే అమ్మ చేస్తున్న పకోడి వాసన మొదటిసారి వెగటు పుట్టించింది. పెరట్లో నాన్న ఎద్దుల్ని అదిలించడానికి అరిచిన అరుపు పులి గర్జనలా వినపడి ఉల్లిక్కిపడ్డాడు వాడు.

***

ప్రముఖ రచయిత అనువాదకులు ముక్తవరం పార్థసారధిగారు గీ ద మొపాస కథల గురించి చెప్తూ ఆయన detailing of sensory experience (ఇంద్రియానుభవ వర్ణన) భలే చేస్తాడని చెప్పినప్పుడు నేను నేర్చుకున్న విషయమిది. ఆ తరువాత మొపాసానే కాదు క్లాసిక్స్ రాసిన చాలామంది రచయితలు ఈ పని చేశారని అర్థం చేసుకున్నాను. ఇలా ఇంద్రియానుభవ వర్ణనతో పాటు పాత్ర ఏదో పని చేస్తున్నట్లుగా రాస్తే ఆ కథ కళ్ల ముందుకి వస్తుంది. ఈ ఉదాహరణ చూడండి –

టేబుల్ మీద ఉన్న అన్నం గిన్నెని తీసి విసిరికొట్టాడతను. కాళ్లకి జిగటగా అంటుకుంటున్న మెతుకుల మీదుగా నడిచి బయటికి వెళ్లిపోతూ బలంగా లాగి వేసిన తలుపు శబ్దం ఆమె గుండె చప్పుడుని ఒక్క క్షణం ఆపింది. ఆ తరువాత అరగంట సేపు ఆమె ఆ తలుపునే చూస్తూ ఉండిపోయింది.

పాత్ర చేసే చిన్న చిన్న పనులు – చిన్న సంజ్ఞ, కనురెప్పల కదలిక, సమాధానం చెప్పడానికి ముందు తీసుకునే ఒక చిన్న విరామం — లాంటివి కూడా చాలా విషయాలు చెబుతాయి. సమస్యేమిటంటే ఇలాంటి వివరాలు చాలా ఉంటాయి. ఐదు పంచేంద్రియాలు, ఒక మెదడు, ఒక మనసు – ఈ ఏడు కాక రచయిత వాఖ్య మొత్తంగా ఒక సందర్భం గురించి చెప్పడానికి ఎనిమిది విషయాలు ఉంటాయి. రచయిత వాఖ్య వీలైనంత తగ్గించుకున్నా, ప్రతిసారీ ఈ ఏడూ వివరించాల్సిన పని లేదు. సందర్భాన్ని, పాత్రని లేదా మనోభావాలను సరిగ్గా వెల్లడి చేసే ఒకటి లేదా రెండు స్పష్టమైన వివరాలను మాత్రమే ఎంచుకుని చెప్పడం బాగుంటుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు నేరుగా వాచ్యంగా చెప్పిన భావోద్వేగాలను గుర్తించి వాటిని అనుభూతులుగా, లేదా పాత్ర చర్యలుగా మార్చచ్చా అని ప్రశ్నించుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీ ప్రోజ్ మీకే కొత్తగా కనిపిస్తుంది. పాఠకులకి స్పష్టత పెరుగుతుంది. కథ డ్రమాటిక్ / సినిమాటిక్‌గా నడుస్తుంది. పాఠకులని దూరంగా ఉంచకుండా కథలోకి లాగుతుంది.

సంభాషణ, పాత్ర ప్రవర్తన ద్వారా భావోద్వేగం

సంభాషణ అంటే బయటకి వినపడే మాటలు మాత్రమే కాదు. పాత్ర అంతర్గత స్థితిని చూపించే ఒక ఎక్స్-రే లా సంభాషణను వాడచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్లు మాటల మధ్యలో తీసుకునే విరామం, అసంపూర్తిగా వదిలే వాక్యం కూడా మీతో సంభాషిస్తుంది. మాట్లలో చెప్పని ఆ సంభాషణ ఒక పేజీ వివరణ కంటే ఎక్కువ విషయాలను ప్రభావవంతంగా వెల్లడిస్తుంది. “ఆమెకు అది నచ్చలేదు” అని రాయడానికి బదులు – ఆమె అతని వైపు కాకుండా నేల వైపు చూస్తూ “వదిలెయ్. నేనే చూసుకుంటానని చెప్పాను కదా?” అని అంటే వాక్యాలలో చెప్పని ఒక అంతర్లీనమైన అర్థం (Subtext) బలంగా తెలుస్తుంది.

ఇద్దరు ప్రేమికులు. అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిన మర్నాడు కాఫీ షాపులో కలిశారు. వాళ్లు ఏం మాట్లాడుకుంటారు? –

“ఈ రోజు ఎండ ఎక్కువగా ఉంది కదా?” అన్నాడతను.

“ఊ!” అన్నదామె

“ఉక్కపోతగా ఉంది” అన్నాడు కూర్చున్న చోటే కదులుతూ. ఆమె వచ్చిన దగ్గర్నుంచి మెనూలో ఒక పేజీనే చూస్తూ ఉంది. అందులో ఏముందో ఆమె కళ్లు చదవటం మానేసి చాలాసేపైంది.

అతను ఆమెనే చూస్తూ పై పదవిని, మీసాలను కింది పళ్లతో కురుకుతున్నాడు.

“నువ్వు బానే ఉన్నావా?” అన్నాడు.

“నాకేం? బానే ఉన్నాను.” ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని తిప్పుతూ అంది. ఆమె గొంతు అవసరానికి మించి గట్టిగా ఉండనిపించింది అతనికి. వెయిటర్‌ని పిలిచాడు.

ఆ రోజు నిజంగానే చాలా ఉక్కపోతగా ఉంది.

***

“బాగానే ఉన్నాను” అనే మాట చెప్తున్నది ఒకటి. కాని దానికి ఆమె చూపుని, ఉంగరాన్ని తిప్పే విధానాన్ని కలిపి చూసినప్పుడు ఆమె అన్న మాటకి వ్యతిరేకమైన అర్థం వస్తుంది. ఇలాంటివి రాసేందుకు పదాల ఎంపిక కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.

ఫార్మల్ మాటలు ఇద్దరి పాత్రల మధ్య దూరాన్ని చూపిస్తాయి, యాసలో మాట్లాడితే పాత్రలు చరిత్ర చెప్తాయి, ఒకరి మాటల మధ్యలో ఒకరు మాట్లాడుకుంటే వాళ్లిద్దరి మధ్య చాలా కాలం నుంచి పరిచయం ఉందని అనిపిస్తుంది. ఒక్కోసారి అసలు ఏం మాట్లాడకపోతే, వంద పేజీల వ్యాఖ్యానం చేసినంత ఫలితం ఉంటుంది. ఇలా మాటలు, మౌనాలు, వాక్యాలలో ఉండే టోన్, కదలికలు, ప్రవర్తన కలిసిన సంభాషణ, పాఠకులకి ఎలాంటి సూటి వివరణ ఇవ్వకుండా ఉత్సుకతతో, రచనని చదవమని కాకుండా అనుభవించమని ప్రేరేపిస్తాయి.

ఈ రోజుకి ఇక్కడ ఆగుదాం. చెప్పకుండా ప్రదర్శించడం ఎలా అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం మనం. ఈ వ్యాసంలో పాఠకులని గౌరవించడం, మనసుని దాటి ఇంద్రియానుభవాలను వర్ణించడం, పాత్రల ప్రవర్తన, సంభాషణ ద్వారా భావోద్వేగాన్ని చూపించడం అనే మూడు అంశాలు చెప్పాను. మరో మూడు మళ్లీ కలిసినప్పుడు.

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు