ఈ కథ వొక్క పంజాబ్‌కే పరిమితం కాదు!

ఇక ప్రేమ, పరువు పేరిట వెదజల్లే విషం, మారణహోమం అన్ని ప్రాంతాల్లో వున్నదే. ఎవరూ దానికి అతీతం కాదు.

జుపిందర్‌ జిత్‌ సింగ్‌ రాసిన ‘బుచ్చర్డ్ ఫర్ లవ్’ నవలకి ప్రముఖ కథా రచయిత్రి, “దేవుడమ్మ” ఫేమ్ ఝాన్సీ పాపుదేశి అనువాదం “పరువు” ఇటీవలి అనువాద విజయాల్లో ఒకటి.  ఒక పబ్లికేషన్స్ ద్వారా ప్రచురణ అయిన ఈ అనువాద నవల  కొద్ది నెలల్లోనే పాఠకుల అభిమాన పుస్తకాల జాబితాలో చేరింది. ఈ సందర్భంగా సంచలన జర్నలిస్టు శ్రీనిధి విప్లవశ్రీకి ఝాన్సీ ఇచ్చిన ఇంటర్వ్యూ:

పరువు మీ మొదటి అనువాదం అన్నారు, కొంత భాగం డాక్యుమెంటరీని తలపించేలా ఉంటూ అను సృజనకు పెద్దగా ఆస్కారం ఉండనటువంటి ఈ నవలనే మీరు ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా ?

 బాధను, కష్టాన్ని వ్యక్తీకరించడానికి సృజనాత్మకత అవసరం లేదు. కాస్త మూలిగినా చాలు కదా. అందరికీ ఆ బాధ అర్థమవుతుంది. ఇక్కడ నాకు కావల్సింది అదే. జుపిందర్‌ జిత్‌ సింగ్‌ రాసిన ‘బుచ్చర్డ్ ఫర్ లవ్‘ చదివాక మిట్టూ వేదనను అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటే అభినందించాల్సింది పోయి వారి ప్రాణాన్ని తీయాలని అనిపించేంత పగ మనలో ఎందుకుంది? ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు వొక ప్రాణం నేలరాలిపోతే మరో ప్రాణం మాదకద్రవ్యాలకు బానిసై, అబద్దపు కేసుల్లో జైలు పాలవ్వడం ఎంతవరకు సమంజసం? రెండు జీవితాలను వొక్క రాత్రిలో నలిపేసి డబ్బు, అధికార మదంతో ఆ కుటుంబసభ్యులు విర్రవీగుతుంటే వాళ్లకు పోలీసులు, చట్టాలు కొమ్ముకాయడం ఎంత దారుణం? కన్న తల్లిదండ్రులే ఈ హత్యలకు పాల్పడటం ఎంత అన్యాయం? జెస్సీ హత్య జరిగి ఇరవై ఐదేళ్లు అవుతున్నా ప్రతి నిమిషం జెస్సీ జ్ఞాపకాలలో కృంగిపోతున్న మిట్టూ కధ అందరికీ చెప్పాలనుకున్నాను. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు, తన జీవితం ఎలా వుండాలో నిర్ణయించుకున్నందుకు జెస్సీ ఈ లోకంలోనే లేకుండా పోయింది. ఇలాంటి జెస్సీలు మనచుట్టూ చాలా మంది ఉన్నారు. మౌనంగా ఆశల్ని, ఆశయాలను చంపుకుంటూ, తెగించి ముందడుగు వేస్తే ప్రాణాలే కోల్పోతూ. వాళ్లందరి వాయిస్ ఈ పుస్తకం. ఈ నవల చదివి కనీసం వొక్క చేయి అయినా పట్టుకున్న కత్తిని పడేస్తుందేమోనన్న చిన్న ఆశ. సమాజం అంటే మనమే కదా. మారాలి. మార్పు కోసం ప్రయత్నించాలి. అందుకే ఈ నవల.
 పంజాబ్ నేపథ్యం నవలను తెలుగు పాఠకులను ఆకట్టుకునేలా రాయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
నవల మొత్తం ఇంగ్లీషులో మూడు నాలుగు సార్లు చదివి ముందుగా అక్కడి పరిస్థితులను, ప్రాంతాన్ని భౌగోళికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. వ్యక్తులు, ప్రాంతాల పేర్లు ఎలా పలకాలో అడిగి తెలుసుకున్నాను. మూల రచయిత అందుబాటులో వుండటం వల్ల లభించిన సౌలభ్యం అది. అర్థం కానివి అతన్నే నేరుగా అడిగి తెలుసుకోవడం వీలైంది. పూర్తిగా ఇంగ్లీషు అనువాదంగా పాఠకులకు అనిపించకుండా వుండటానికి వాక్య నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇక ప్రేమ, పరువు పేరిట వెదజల్లే విషం, మారణహోమం అన్ని ప్రాంతాల్లో వున్నదే. ఎవరూ దానికి అతీతం కాదు. జెస్సీ మిట్టూల కథ వొక్క పంజాబ్‌కే పరిమితం కాదు. అది యూనివర్సల్. అందుకే ఈ నవల అందరి హృదయాలను తాకుతుంది.
 ఇప్పటికే మంచి కథకులైన మీరు, పరువు నవలలో చొరవ తీసుకుని ఏవైనా ప్రేమ సన్నివేశాలు కానీ, విషాద సన్నివేశాలు కానీ జోడించారా ?
పరువు నా తొలి అనువాదం కాబట్టి తప్పులు దొర్లకుండా వుండటంపైనే ఎక్కువగా నేను దృష్టి పెట్టాను. పదాల ఎంపికలో కాస్త సరళంగా, సూటిగా వుండటానికి ప్రయత్నించాను. నేను దిద్దిన అదనపు మెరుగులు ఏవీ లేవు. కేసు వివరాలు లీగల్ లాంగ్వేజ్ లో వుండటంవల్ల చదువరికి కాస్త ఇబ్బంది కలుగుతుంది. దాన్ని మార్చలేం కాబట్టి ఒరిజినల్ నవలలో మొదట్లోనే వున్న కేస్‌హిస్టరీని కాస్త వెనక్కి జరిపాను.
 పాత్రలన్నీ వేటికవే ఫస్ట్ పర్సన్ లో కథ చెప్తున్నట్టుగా రాయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ?
ఈ శైలిని ఒరిజినల్ రైటర్ ఎంచుకున్నారు. ఇది పాత్రలే చెప్పుకున్న కథ. దానంతట అదే అన్‌ఫోల్డ్ అవుతూ వొచ్చిన కథ. పరువు నవల మొత్తం మిట్టూ దృష్టి కోణంలో వుంటుంది. నేరుగా కలసి మిట్టూని మనం జెస్సీ గురించి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అతను జెస్సీ గురించి చెప్తూనే గతంలోకి జారిపోతాడు. మళ్ళీ వర్తమానం లోకి వస్తాడు. అతను తన కథ చెప్పే తీరు, జ్ఞాపకాల వెదుకులాటలో వున్న ప్రత్యేకతను నవలలో ప్రతిబింబించే విధంగా జుపిందర్‌ జిత్‌ సింగ్‌ రాశారు. కథలో ముఖ్యపాత్ర అలా మాట్లాడటం వల్ల మిగతా పాత్రలతో కూడా అలాగే మాట్లాడించాల్సి వచ్చిందని జెజె చెప్పారు. పైగా ఇంకొకరి కథను చెప్తున్నప్పుడు, వారి బాధను రాయడానికి కూర్చున్నప్పుడు దాన్ని వాళ్ల మాటల్లో చెప్పడమే కరెక్టు. అది ఇంకా కొనసాగుతున్న బాధ అయినప్పుడు. మన మాటల్లో ఎంత చెప్పినా, ఎలా వర్ణించినా అది పేలవంగా ఉంటుంది.

*

పరువు కాపీల కోసం ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. 9849635421

శ్రీనిధి విప్లవశ్రీ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు