ఆపరేషన్ కగార్లో చాలామంది విప్లవకారుల్లానే కామ్రేడ్ రేణుక (అలియాస్ మిడ్కో) కూడా అమరత్వం పొందింది. కానీ మిగతావారి కన్నా ఆమె పేరు, ఫోటో చాలా ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది. ఆమె వ్యాసాలు, ఫీల్డ్ రిపోర్టులు, ఇంకా ఆమె కథల ప్రస్తావన కూడా చాలా గొప్పగా వచ్చింది. మరీ ముఖ్యంగా చాలా మంది ఆమె ‘మెట్ల మీద’ (2007) కథా సంపుటిపైన ‘భావుకత’ కథ గురించి ఎన్నో ఫేస్బుక్ పోస్టులు రాశారు.
అవును. ఆమె కథా రచనలో ఉన్న పరిమళం, పరిచయం లేని వాళ్ళకు కొత్త ఆశ్చర్యాన్ని కలిగిస్తే తెలిసినవాళ్ళకు ఆమె మరణం భరించలేని ఆవేదన మిగిల్చింది. విప్లవోద్యమంలోకి వెళ్ళే (2004) ముందూ ఆ తర్వాత, మిడ్కో రాసిన కథలు ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఒక సంఘర్షనాత్మక పోరాట దశ తాలూకు ప్రతిఫలనాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. అందుకు ఆ కథల్లో ఉన్న సహజత్వమూ, జీవన సౌందర్యమే ముఖ్య కారణం. మెట్ల మీద పుస్తకంలో 18 కథలుంటే; విరసం ప్రచురించిన ఆరు వియ్యుక్క కథా సంపుటాల్లో మొత్తంగా ఆమెవి 37 కథలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కథా ఒక్కో మలుపు. ఒక్కో కథా ఒక్కో కుదుపు. మిడ్కో మరణం తర్వాత వియ్యుక్క సంపుటాల ప్రస్తావన మరింత జరిగిందంటే అతిశయోక్తి కాదేమో ?
పాఠకుణ్ణి చదివించే లక్షణం కథల్లో ఏముంటుంది ? తనవైపు లాక్కునే శక్తి కథకు ఎలా సాధ్యపడుతుంది ? అనుకున్నప్పుడు ప్రధానంగా ఆ రచయిత పాఠకుడి అనుభవాన్ని ప్రభావితం చేస్తున్న అంశంపై ఎక్కువ దృష్టి పోతుంది. మిడ్కో తన కథల్లోకి కొత్త జీవితానుభవాల్ని, సంక్షోభాల్నీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆమె కథా వస్తువులు తీరుబాటుకు చదువుకునేవి కాదు. ఒక కార్యాకారణ సంబంధమైనవి. తాను చూసిన సాధారణ జీవితాల్లోంచి వర్గ దృక్పధాన్ని సూక్ష్మంగా చర్చించినవి. అంతేగాక ప్రజాపోరాటంలో నిమగ్నమై ఉన్న మావోయిస్టు పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాలను చాలా బలంగా తెలియజేసినవి.
ఈ కథలు భిన్నమైన నేపథ్యం గలవి. వీటిని చదవడం చేత మనం ఉద్యమ నిర్మాణంలో, నిర్వహణలో ఉన్న అనేక సామాజిక ప్రత్యామ్నాయ విముక్తి కోణాలను తెలుసుకుంటాము. ఉద్యమం తీర్చిదిద్దిన సృజనాత్మకతలోంచి సమస్యల అస్తిత్వాల్ని అవగాహనలోకి తెచ్చుకోవడమనే వివేకం వస్తుంది. మిడ్కోకి ఉద్యమమంటే ఎంతో ప్రేమ. నమ్మకం. భరోసా. ఒక ఆచరణ నమూన. అమూల్యమైన జీవన మార్గం. ఆ స్పృహే లేకుంటే ఈ కథలింత జీవన ప్రమేయంగా, సజీవంగా ఉండగలిగేవి కాదు. వొట్టి నాటకీయంగా మాత్రమే మిగిలిపోయేవి. కథల్లో కేవలం నాటకీయత ఒక సామాజిక మార్పును ఉన్నదున్నట్టుగా పట్టుకోగలుగుతుందా ? లేదు.
మిడ్కో కథలు స్త్రీల వైవాహిక జీవితంలో ఉండే నిర్బంధాన్ని, స్వేచ్చాయుత సాహచర్య విలువల్ని చాలా సున్నితంగా విడమరచి కళ్ళకు కడతాయి. అందుకే భావుకత కథ అంత ప్రాచుర్యం పొందింది. అది చదివిన వాళ్ళకి స్త్రీ నిద్రపోవడం అనే కనీస అవసరాన్ని కూడా స్వేచ్చగా తీర్చుకోలేకపోవడాన్ని ఆమె చెప్పిన తీరు కదిలిస్తుంది. భావుకత కలిగి ఉండటం ఒక గొప్ప విషయంగా భావించే మగ ప్రపంచం స్త్రీల విషయంలో ఎంత బాధ్యతగా ఆలోచించాలో తెలుసుకోగలిగేట్టు రాస్తుంది. అంటే స్త్రీ నిద్రని మిడ్కో ఎంత సూక్ష్మతలం పై నుండి చూసింది?
పితృస్వామ్యంపై మిడ్కో ఆలోచనలు తెలియాలంటే ప్రవాహం, విప్లవ పయనం వంటి కథలు చదవాలి. స్త్రీలపట్ల మన పెర్స్పెక్టివ్ ని విప్లవోద్యమ కార్యకర్తలకున్న స్పష్టతలోంచి మిడ్కో కథలుగా మలుస్తుంది. స్త్రీపురుషుల సహచర్యంలో ఉండవల్సిన ఔన్నత్యం మాటలవరకూ మాత్రమేగాక ఆచరణలో ఎలా ప్రతిబింబించాలో విప్లవ పయనంలో సుగుణ – మధు పాత్రలు చెబుతాయి. మధు అరెస్టై తిరిగిరాడం అసాధ్యం అనుకున్నాక సుగుణ శేఖర్ అనే కామ్రేడ్ ను పెళ్ళి చేసుకుంటుంది. మధు – సుగుణలు అప్పటికే భార్యాభర్తలు. అనుకోనివిధంగా మధు తిరిగి ఉద్యమంలోకి వస్తాడు. సుగుణ హృదయం ఎంతో నలిగిపోతుంది. అయితే ఆఖరుకి మధు ‘నువు బాధ్యురాలివి కాదు. నువు తీసుకున్న నిర్ణయం పట్ల నువు ధృఢంగా ఉండాలె’ అని అంటాడు. విప్లవోద్యమంలో ఇలాంటివి చాలా ప్రత్యేకమైన పరిస్తితులు. ఆ మధు శాఖమూరి అప్పారావని మిడ్కో కథ చివర రాస్తుంది. అతను ఆర్తిగా సుగుణ పట్ల ‘పాపం తానెంత ఘర్షణ పడ్డది’ అనడం కూడా కథలో భాగమైపోతుంది.
సోయి కథలో కోడలు సన్నీ భూత వైద్యుడైన మామ కోసాల్ తో చేసిన వాదన, ఎదురుతిరిగిన వైనానికి నివ్వెరపోతాం. ఆదివాసీ కుటుంబాలలో మంత్రతంత్ర వైద్యాలు, అటువంటి వైద్యులపై ఉండే గురిని తప్పించి ఆ స్త్రీలలో చైతన్యం తీసుకురావడం చాలా కష్టమైన పని. మిడ్కో కథలు ఆ మార్పును అక్షరబద్దం చేశాయి. అసలు మిడ్కో కథల్లోని పాత్రలు ఒక పరిణామ క్రమాన్ని ఎలా చిత్రిక పట్టగలిగాయి ? అది తలుచుకుంటోంటేనే నా హృదయం పులకరించిపోతోంది. ఎందుకు ?
ఎందుకంటే, ఆ రాజకీయాలు నాగ్గావాలె లో కొడుకు కొమురయ్యను ఎంకౌంటర్లో పోగొట్టుకున్న వెంకటమ్మ ‘ఆడు ఇరవై ఎనిమిదేండ్లు బతికిండు భూమ్మీద. మరి ఆ బతుకు గురించి చెప్పాల్నని నాకనిపియ్యదా అమ్మలాల అయ్యలాల ? ఇగో నా కొడుకు గిసువంటి బతుకు బతికిండు అని చెప్పుకుంటందుకు గీ గోరీ గట్టుకున్న’ అని అతని స్మారక స్తూపం కోసం ఎన్నో నిర్బంధాలను ఆ తల్లి ఎదుర్కొంటుంది. అలాగే ఇద్దరు తల్లులు కథలో అడివమ్మ, రమ పాత్రలు విప్లవంపై ప్రేమను పెంచుకున్న తీరు హృదయ వైశాల్యాన్ని ప్రదర్శిస్తాయి. అమ్మ కోసం కథలో కూతురు విద్య తన తల్లికి బహుమతిగా మిక్సీ కొనడం కరెక్టు పని కాదని మిడ్కో ఉమ అనే పాత్ర చేత చెప్పిస్తుంది. అమ్మలకి వాషింగ్ మెషీన్లు, వంటింటి సామాన్లు కాదు, తమ అభిరుచులకి తగ్గట్టు బహుమతులు ఇవ్వాలి అన్న మాట చదువుతోన్నప్పుడు ఏ కూతురు, కొడుకు కన్నీళ్ళ పర్యంతమవకుండా ఉండగలడు ? మిడ్కో భావోద్వేగ మూలాల్ని వెతికి పట్టుకునే పద్దతిలోనే కథా నిర్మాణ చాతుర్యాన్ని అందిపుచ్చుకున్నది. బొందజూడనైతి, పూల తోట, ఈ శోకం ఎందరిది ? కథలు చదవాల్సిందే గానీ వివరించలేను.
మిడ్కో కథల్లో స్త్రీ పాత్రలు సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య మూలాలను చాలా సరళమైన వాచకం ద్వారా కూకటివేళ్ళతో పెకలిస్తాయి. అందుకు రచయిత్రికున్న స్త్రీవాద అవగాహన మాత్రమే కారణం కాదు. మిడ్కో కథల్లో స్త్రీల అస్తిత్వ పోరాటము – విప్లవోద్యమ నేపథ్యము రెండూ కలగలసిన ఒక చిక్కదనం ఉంది. పితృస్వామ్యంపై మనం చేయవలసిన పోరాటానికి విప్లవోద్యమ దన్ను తప్పనిసరి అని ఆమె గాఢంగా భావిస్తుంది. కనుకనే స్త్రీల లైగింక రాజకీయాలను చర్చించిన ‘అమ్మ మనసు’ కథ కావచ్చు, సంసారంలో స్త్రీ వ్యక్తిగత స్వేచ్చ విలువ తెలియజెప్పే ‘అనగనగా ఒక అమ్మ’ కథ కావచ్చు మిడ్కో మాతృ సంవేదనలలో ఒక కొత్త స్వరాన్ని వినిపించడమే అసలు ఈ కథల విజయ రహస్యం. ఉద్యమ రహస్యం కూడానేమో ! సర్వసాధారణ తల్లుల్లా కూతుర్లని మొగుళ్ళతో సర్దుకుపోయి బ్రతకమని చెప్పే రకం తల్లులు ఈ కథల్లో కనబడరు. ‘ఎక్కడ నెల తప్పినవనే వార్త వింటానో అని హడలి చస్తున్న’ (అనగనగా ఒక అమ్మ) అని ఒక అమ్మ అంటే ‘తప్పేముందండ్ల ? తిండి బెట్టుడు గూడ తప్పా ? పదిహేనేండ్లు నా కొడుక్కు నా అసువంటి తల్లులే గదా అన్నం బెట్టింది. అన్నం బెట్టుడు తప్పనుకుంటే వాడేమయ్యేటోడో ఆలోచించు (మెట్ల మీద) అంటుంది మరొక అమ్మ సరోజమ్మ. విప్లవోద్యమం పట్ల ఆ తల్లులకెంత స్పష్టత.
నిజానికి మెట్ల మీద కథ ఒక నవలిక అంత పెద్దది. బహుశా సామాన్య జనాలకు తెలియని జీవిత చిత్రణకి సవివరత చాలా ముఖ్యమనుకోవడం చేత మరిన్ని కథలు నిడివిలో పెద్దవిగా ఉంటాయి. ఉన్నా అవేమీ మనని విసిగించకుండా చదివించడం ఆ శైలికున్న ఆకర్షణ. నాకు ఆమె వాక్సరణిలో పరిమితి వెతకడం నిరుపయోగ చర్య అయింది.
ఎన్నేళ్ళక్రితం రాసిన కథైనా కావచ్చును గానీ ఆ కథల్లోని గమన శైలి బహు నిష్కళంకమైనది. నిజాయితీగలది. ఆడంబరంలేనిది. ఆత్మీయమైనది. Katie Wales రాసిన Dictionary of stylistics లో మనిషి చర్యకు ప్రతిచర్య, దానికి దోహదం చేసే భిన్నమైన జీవన సన్నివేశాలు, అందులోని భాష, దాని ప్రయోగ విస్తృతి ఒక శైలిని నిర్వచిస్తాయని చెబుతాడు. మిడ్కో తను జీవించిన విప్లవకాల మూల చోదకశక్తుల్ని తను తిరుగాడిన, పరస్పరం మాట్లాడిన, రాసిన భాషలోనే భలే కొత్తగా కనుగొన్నది.
లేకపోతే ఈ కథలకింత ప్రాచుర్యం ఎక్కడిది ? ఆమె కథల్లో మనకు తెలియని అజ్ఞాత విప్లవోద్యమ జీవిత విశేషాలు ఎంత విస్మయంతో చదివిస్తాయో ఆ ఉద్యమం పట్ల మైదాన ప్రాంత సామాన్య ప్రజల ఆలోచనలు కూడా అంతే సున్నితంగా అర్థం అవుతాయి. అందుకే సాహసం చేసి తన కథా వస్తువులన్నీ, శైలి వలనే ఒక రచనా వైఖరిగా(?) రూపాంతరం చెందుతాయి అని చెప్పదలుచుకున్నాను. వైఖరి మరింత చర్చకు ఆస్కారమున్న పదప్రయోగమే. అయితే “ఈ కథలను కేవలం వస్తు వైవిధ్యం జాబితాలో వేయడానికి లేదు. ఇవి పెద్ద ఇతివృత్తాలు కాదు, సూక్ష్మరూప పరిణామాలు చెప్పిన కథలివి” అని ఒక రచయిత్రి జీవితాచరణను సాహిత్యకత వెన్నెముకగా పాణి వ్యాఖ్యానించడాన్ని నేనిక్కడ ఉటంకిస్తాను.
విప్లవ సిద్దాంత బలం చేత, శాస్త్రీయమైన అధ్యయన శక్తిచేత ఒక స్పష్టమైన, ఖచ్చితమైన పోతపోసినట్టుగా నిర్మాణమయిన కథల్లో ఎంతటి కఠినమైన సారాంశమైనా ఆయా పాత్రల ప్రవర్తనలో ఉండే పరిణితి దాన్ని పరమ సులువు చేసేస్తుంది. ఆ తెలివిడిని వాస్తవికత అని ఒక్క మాటతో తీసిపారేయలేను. ఆ వాస్తవికతలోంచి ఆమె రూపొందించిన చారిత్రక, కళాత్మక చైతన్యం అపురూపమైనది. అందుకే ఆమె నవ్వినప్పుడు కనిపించే నిరుపమాన సౌందర్యం ఒక ప్రజాపోరాటం ఎదుర్కొంటున్న నిర్బంధ క్షణపు సామూహిక దు:ఖంలోకి మనని నెట్టేసింది. స్వంత కుటుంబంలోని వ్యక్తినే కోల్పోయిన బాధ కలిగించింది. బహుశా అదే మనల్నామె కథలగుండా ఏకబిగిన ప్రయాణం చేసే అనివార్యతలోకి నెట్టింది కూడా. బీడీ దమయంతి అన్నా, ఎంజీ శ్వేత అన్నా, చైతే అన్నా, మిడ్కో అన్ని పేర్లూ గుముడవెల్లి రేణుకవే. తెలంగాణ లోని జనగామ జిల్లా కడవెండిలో ఆమె పుట్టింది. లా చదివింది.
ఆమె నిలువెల్లా సృజనమూర్తి. నేను స్త్రీల భాగస్వామ్యం వలన మాత్రమే సాంఘిక అభివృద్దిని అంచనా వేస్తాను అన్నాడు అంబేద్కర్ మహాశయుడు. కథలు రాయడం ద్వారా మిడ్కో చేసిన పని తలుచుకుంటే ఆయన మాట నూటికి నూరుపాళ్ళూ నిజమేనని గట్టిగా అనిపిస్తుంది. మొన్న మే పదవ తారీఖు హైద్రబాదులో జరిగిన మిడ్కో సంస్మరణ సభకు వెళ్ళకుండా ఉండలేకపోయాను. ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఆమె తల్లి జయమ్మ రెండు చేతుల్ని సుతారంగా తాకి, తండ్రి నరసయ్యకి వినమ్రంగా నమస్కరించాను. అంతకు మించి ఇంకేం చేయగలను. అనారోగ్యంగా ఉన్న మిడ్కోని పోలీసులు తీసుకెళ్ళి అమానుషంగా చంపేసినట్టు సభలో విన్న మాటలు తిరుగుప్రయాణంలో నన్నెంతో తొలిచేశాయి. రాజ్యానికెందుకింత కర్కశత్వం ? We shall heal our wounds, collect our dead and continue fighting.
*
Add comment