ఆ “హోరు” తరవాత ఆయన కథ మారింది!

పతంజలిశాస్త్రి గారు నగిషీ పని బాగా తెలిసిన స్వర్ణకారుడు.

చాలా ఏళ్లకిందట అంటే ఇరవై ఏళ్లకిందట అయి ఉండొచ్చు. ఆంధ్రప్రభ వారపత్రికలో ‘జెన్’ అనే శీర్షికతో ఒక కథ చదివాను.
‘జెన్’ అనే పదం పట్ల ఉన్న ఆసక్తే కాక రచయిత పట్ల ఉన్న ఆసక్తి కూడా దానికి కారణం. చదివేక రెండింటి పట్లా నా అభిమానం మరింత పెరిగింది.
అప్పటికే ఆయన రాసిన ‘హోరు’ నవల చదివిఉన్నాను. ఆ కాస్త చిన్న నవలిక తోనే నేను ఆయన అభిమాని గా మారేను. మా చినవీరభద్రుడు అప్పటికి రాజమండ్రి లో ఉండేవాడు
తనని ఎవర్రా ఈయన అని అడిగేను. “ఆయన మన సాహితీవేదిక మిత్రుడే. నువు చాలాసార్లు చూసావు” అన్నాడు.
ఏమో చూసేనేమో గానీ ఈ హోరు నవల ఆయనను ప్రత్యేకవ్యక్తి ని చేసింది నాకు
అలా తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి గారు నాకు మిత్రులయ్యారు అప్పటికి.
అదే ఆసక్తి తో ఈ జెన్ కథ. ఎప్పటికీ మర్చిపోనివ్వని కథ చదివాను.
త్రిపుర కథలు పుస్తకం నా దగ్గర రెండు కాపీలు ఉండేది. మొదటి ముద్రణపుస్తకం. ఒకటి ప్రయాణాల్లో ఊ, ఒకటి ఇంట్లోఉన్నప్పుడూ చదువుకుంటూ ఉండేదాన్ని. మూడోపెగ్ జిన్ అని రాస్తారు ఆయన. అదేమో గానీ ఆ కథల మత్తు అలాగే నెమ్మదిగా నరాల్లోకి ఎక్కేది. ఆ మత్తులోకి జిన్ ఏమో గానీ జెన్ అన్నపదం చేరింది. వినడం వేరు. అది నరాలలోకి ప్రవహించడం వేరు.
ఇక దానిమీదనే పతంజలిశాస్త్రి గారి కథ.
కథంతా ప్రతీకాత్మకమే.
తండ్రి నాయుడుగారు. కొడుకూ కోడలూ దగ్గర ఉంటారు. కొడుకు కృష్ణ కి తండ్రిమీద గౌరవం, కోడలికీ అభిమానమే. మరే అపోహలూ లేని కుటుంబం
కొడుక్కి హైదరాబాద్ నగరంలో ఉద్యోగం. స్కూటర్ వాడుతూ ఉంటాడు. కానీ అది అతని మాట విననట్టే ఉంటుంది. నాయుడి గారి భాషలో ”  అతనికీ రోడ్డుకీ ఇతర వాహనాలకీ సంబంధం ఉన్నట్టు కనిపించదు. వాహనాన్ని శిక్షిస్తూ వెళ్లిపోతాడు . స్కూటరు అతని శరీరానికి అతుక్కున్న  ఇనపముక్కలా దాన్ని త్వరగా వదిలించుకోవాలనే ఆదుర్దా తో కనిపిస్తాడతను.”
అతని చేతిలో అది మొరాయిస్తూనే ఉంటుంది. అతని విసుగూ చిరాకూ మరింతగా దాని మీద చూపెడతాడు.కిక్ కి కదలకపోతే కాలితో ఒక్క తన్ను తంతూ ఉంటాడు.
అసలు పతంజలిశాస్త్రి గారు కథ మొదలు పెట్టడమే ఈ వాక్యాల తో మొదలు పెడతారు.
“గేటుముందర స్కూటరు భయంకరం గా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడిదగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు.”
ఈ వాక్యమే కథంతటినీ చెప్తుంది. యంత్రం బాధ నాయుడికి ఇలా వినిపించడం లోనే ఆయన ఏమిటో చెప్పేడు రచయిత.
కొడుకు దాన్ని బూతులు తిట్టి నాలుగు తన్నులు తన్నేక తండ్రి ఆగమని వచ్చి నిదానంగా చూసి సరిచేసి ఓవర్ ఫ్లో అవుతోంది చూసుకో అని నిర్విచారంగా స్టార్ట్ చేసి ఇస్తారు
కథంతా చెప్పేసినట్టే.
నాయుడు కి కోడలి దగ్గర కాస్త దగ్గరితనం. ఆమెకు డైనింగ్ టేబుల్ దగ్గర తన జ్ఞాపకాలు చెప్తూ ఉంటాడు. రోజూ ఇంచు మించు అలాంటివే. అయిదువందల నలభైరెండోసారి వింటూ ఓపికగా నవ్వుకుంటుంది. నిజానికి పదహారోసారినుంచే వినడం మానేసింది. కానీ ఆయన ఆమె తో మాటాడడు. తనకి తనే చెప్పుకుంటాడేమో.
 ఆయనకళ్లలో సముద్రం అడవి కొంగలూ కనిపిస్తాయి ఆమెకు. ఒకోసారి కళ్లజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు ఆమెకు .
అదీ ఆయన తాదాత్మ్యం
నిత్యకృత్యాలయ్యాక ఆయన అమ్మతల్లి ముందు కూర్చుంటారు. “జానపదుల పూజారిలా నాయుడుగారు భక్తిగా, ప్రేమగా, ఓపిగ్గా అమ్మతల్లిని సేవిస్తుంటారు”
అమ్మ తల్లి పాత బ్రిటిష్ మోడల్ కారు. మిత్రుడు “అమ్మితే ఏమీరాదు, సరదా ఉంటే పట్టుకెళ్లి చూడు” అంటే తెచ్చుకున్నారు
రోజూ దాన్ని చక్కగా తుడిచి, లోపం వెతికి శ్రద్ధగా సరిచెయ్యబోయి ఐనా కుదరకపోయినా విసుగు ఎరగని దినచర్య.
ఇంజన్ లోపలి పొగలు ఆర్పి మళ్లీ లోపం వెతకడానికి చిరునవ్వుతో సిద్ధమయ్యే మామగారు కోడలికి ఆశ్చర్యం.
ఆయన చిన్నస్థలం కొని కట్టిన ఇల్లు. పెంచుకున్న పూలమొక్కలు. గోడ బయట తురాయి మొక్క నాటారాయన. చైత్రం నుంచి అది కెంపులు పూస్తుంది. ఉదయం సాయంత్రం నాయుడు గారు గోడవతల పూసిన ఎర్ర పూవుల్ని చూసి వస్తుంటారు. ఆయన్నలా చూసిచూసి కోడలు మావగారే అలా ఎర్రగా పూసివస్తారనుకుంటుంది. ఆయన నీళ్లు పోస్తున్నప్పుడు పూలతో మాట్టాడతారని కొడుకు నమ్మకం.
ఇలా నడుస్తుంది కథ.
కృష్ణ విసుగూ చిరాకులవల్ల భార్యాభర్తలు సయోధ్యగా ఉండలేకపోవడం అయనకు తెలుస్తూనేఉంటుంది. కోడలి నెమ్మది తెలుసు.
అర్ధరాత్రి నల్లటి సముద్రాన్ని ఈదుకుని వచ్చి పెద్ద పెద్ద వందల తాబేళ్లు రహస్యంగా వడ్జున ఇసుక బొరియల్లో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే ఉదంతం ఆయన అనుభవం గా  కోడలికి చెప్తాడు. అవి గుడ్డు పెట్టినప్పుడు ఆ నిశ్శబ్దం లో టప్ టప్ మనే చప్పుడు కూడా విన్నానంటాడు. వేల గుడ్లలో కొన్నిమాత్రమే పిల్లలయి తిరిగి కొంతకాలానికి సముద్రంలోకి వెళ్లిపోతాయిట
ఇలాంటి సృష్టి విచిత్రాల పట్ల ఆయనకు ఆరాధన అని కోడలికి తెలుసు కానీ ఈ పాతబడి చెడిపోయినవాహనాన్ని ఆయన ఎందుకు బావుచెయ్యాలో అర్ధం కాదు ఆమెకు. ఒక్కసారి కూడా ఆయన విసుక్కోవడం చిరాకు పడడం చూడలేదామె. పైగా యంత్రాలు ఆయన నాడి తగలగానే ప్రాణంతో కట్టుకుని కెవ్వుమన్నట్టుంటాయట.
కొడుకుకూడా “ఎందుకు నాన్నా అది పైసాకి కూడా పనికి రాదు ఎందుకు బాగుచెయ్యడం” అంటాడు
పైగా” ఆఫీస్ నుంచి వస్తూనే వరండాలో మెషీన్ కళేబరాన్ని చూశాడు కృష్ణ” అని రాస్తారు.
దానికి నాయుడు “లాభం గురించి కదయ్యా అసలు ట్రబుల్ ఏమిటో చూస్తున్నాను. రన్నింగు లో పెడితే మంచిదని, పెర్ఫెక్ట్ గా స్మూత్ గా నడిపించాలని”
ఈ మాటల్లోంచి ఎంత లోతైన భావమేనా తోస్తుంది.
ఈ కథకి జెన్ అని పేరు పెట్టేరు శాస్త్రి గారు. కథని ఇంకా వివరించే దుర్మార్గానికి పూనుకోను
కానీ జెన్ గురించి మరో రెండు మాటలు చెప్పాలని ప్రలోభం. ఎవరికి తెలియదని!!!?
కానీ చెప్పేను గా ప్రలోభమని. ఈ సందర్భంలో అవసరమేమో అని కూడా అనిపించింది.
జెన్ బౌద్ధంలో జాపనీ పదమైన’ సతోరీ’ అనేదానికి ఎంతో విలువ ఉంది. నిజానికి సతోరీ లేంది జెన్ లేదు. సతోరీ అంటే మేధ కు అందని ఒక మెరుపులాంటి అద్భుత జ్ఞానోదయం. ఒక పారదర్శకదృష్టి. దానికి అందని వస్తువుండదు. ఆలోచన ఉండదు. అనుభూతి ఉండదు.
నీవు సతోరీని కలిగిఉంటే ఒక్క గడ్డి పోచమీద రాజభవనాన్ని నిర్మించవచ్చు. కానీ నీవు సతోరీని కలిగిఉండనప్పుడు ఒక్క గడ్డిపోచయే రాజభవనాన్ని కనపడకుండా కప్పి వేస్తుంది.
అందరికీ తెలిసిన ఉదాహరణే. సరదాగా చూద్దాం
ఒక సజీవమైన బాతు ఒక సీసా లో ఉంటుంది ఆ సీసా మూతి సన్నగా ఉంటుంది. ఆ బాతుకు హాని కలగకుండా ఆ సీసాని పగలగొట్టకుండా ఆ బాతును సీసానుండి బయటకు తేవాలి. ఇటువంటి అసాధ్యం సాధ్యం ఎట్లా అవుతుంది
అదిగో ఆ బాతు బయటకు వచ్చేసింది. అని గ్రహించడమే పరిష్కారం. ఈ సృష్టియే సాధ్యమైనప్పుడు ఇక ఈ సృష్టిలోనిది ఏది సాధ్యంకాదు. క్రియతో సాధ్యం కానిది భావన తో సాధ్యం అవుతుంది. భావనతో సాధ్యమైనది ఒక నాటికి క్రియ లో సాధ్యమౌతుంది.
ఇప్పటికీ ప్రకృతి శక్తులన్నింటినీ మనిషి ఎందుకు జయించలేకపోయినాడూ అంటే మనిషి కంటే ప్రకృతి ఎన్నో కోట్ల సంవత్సరాలు వయసు లో పెద్దది. అది సంతరించుకున్న శక్తి ని మనిషి పూర్తి గా సంతరించుకోలేడు. అంటాడు సంజీవ్ దేవ్. కాబట్టి బయటిప్రకృతిని లోపలిప్రకృతిని తెలుసుకోవాలంటే ప్రతీ పనీ ధ్యానంతో చెయ్యాలన్నది జెన్ భావన
నాయుడి గారి అమ్మతల్లి ఎప్పటికైనా ఆయన చేతులలో రిపేరింగ్ పూర్తిచేసుకుని స్మూత్ గా నడుస్తుంది సుమా అనిపించేలా పతంజలిశాస్త్రి ఆశ పెడతారు.
నేనూ అలాగే  ఏ జిన్ లోకో జెన్ లోకో ప్రయాణం చెయ్యాలని ఆశ పడుతూ ఉంటాను. అది వదలని ఆశ. దైనిందన జీవితంలోకి ధ్యానం తేవాలన్న ఆ దురాశ వదలదు
 అర్ధరాత్రి సముద్రపు ఒడ్డునుంచి చూస్తే నక్షత్రాల్ని ఎవరో కడిగి పొదిగి నట్టు మిలమిల మంటాయట. ఆయన రాస్తారు
ధ్యానం కూడా దైనందిన అనుభవాలను అలా చేస్తుందేమో
పతంజలిశాస్త్రి గారు నగిషీ పని బాగా తెలిసిన స్వర్ణకారుడు. అవార్డులు ఆయనకు ఎంతో ఆలస్యంగా ఇస్తారు. అయినా కొంపేమీ ములగదు.
మా లాంటి అభిమానులం మెండుగా ఆయన కథల కోసం కాచుకుని ఉంటాం. చాలుకదా
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

10 comments

Leave a Reply to rajavali Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “My favorite piece of technical writing: Assembly of Japanese bicycle require great peace of mind.”

    — Robert M. Pirsig, In his work ‘‘Zen and the Art of
    Motorcycle maintenance’’ –

    అమ్మా, వీరి రచనలు చదివేవుంటారు. Zen and the Art of Motorcycle Maintenance: An Inquiry into Values (1974) and Lila: An Inquiry into Morals (1991).

    మీకు అవకాశం వుంటే ఈ రచనలన తెలుగులో తీసుకువచ్చే ప్రయత్నం చేయకూడదూ? (వీరభద్రుడు గారైనా)

  • చదువుతుంటే ఏదో తెలియని ఫీల్! కథ పూర్తిగా చదవాలనిపిస్తోంది.

  • Chala bavundi e sephalika Veera Lakshmi garu. Mastari gari sangatyam ,abhimanam dorkadamu. Naa adrustam. Dhanyvadalu .

  • Zen కథ చదవడం, మొదటి సారి,నేను,.చదవగానే బాగా, నచ్చింది, మేడం నాకు, కృతజ్ఞతలుమీకు💐!శాస్త్రి గారు ఎవ్వరో అంతగా తెలియక పోయినా మీవల్ల వారి కధ,చదివే భాగ్యం, కలిగిందిమాకు ధన్యవాదాలు, మేడం!pa

  • Zen కథ చదవడం, మొదటి సారి,నేను,.చదవగానే బాగా, నచ్చింది, మేడం నాకు, కృతజ్ఞతలుమీకు💐!శాస్త్రి గారు ఎవ్వరో అంతగా తెలియక పోయినా మీవల్ల వారి కధ,చదివే భాగ్యం, కలిగిందిమాకు ధన్యవాదాలు, మేడం!

  • పతంజలి శాస్త్రిగారి కథ మీరు మళ్లీ చెప్పినట్లు లేదు ,కథ చదివినట్లే వుంది .బాతు సీసాలోకి వెళ్ళగలిగితే బయటకూ రాగలదు .భావనకు ఉన్న శక్తి అలాంటిది .

  • రేపు బాగుంటుంది అన్న ఆశావాదం ఇవాళ మనల్ని నడిపిస్తుంది.జెన్ నుంచి పతంజలి శాస్త్రి దాకా అదే దృక్పధం.మీరు రెండిటితో వ్యాసం నడిపిన తీరు బాగుంది.కథను చడటమే కాదు అర్థవంతంగా అర్ధం చేసుకోవాలి అని చెప్పకనే చెప్పారు.అభినందనలు.

  • పతంజలి శాస్త్రి గారు ధ్యానం గురించి రాసిన నాకెంతో ఇష్టమైన ఇంచక్కని కథ. ధ్యానంతో పరిచయం చేసి గుర్తుకు తెచ్చిన మీకు అభినందనలు. ప్రకృతి శక్తులను జయించటం కంటే అర్థం చేసుకుని మెలగటమే మనిషికీ ప్రకృతికీ మంచిది.

  • ధ‌న్య‌వాదాలు మేడ‌మ్‌..
    చ‌దువుతా జెన్ క‌థ‌ను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు