ఆ ఆడమనిషి అన్న మాటతో అదే లోకం, కారెక్కి కిక్కురుమనకుండా నోరెళ్ళబెట్టి ఉండి పోయాడు బెజవాడ నుంచి వొచ్చిన శోభనాద్రి.
అతనలా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడంతో ఏం మాటాడకుండా ఉండి పోయారు ఎర్ని బాబు, కన్నం నాయుడు.
కాసేపటి వరకూ ఆహా.. ఓహో.. అన్న చోట, గల గలా మాటలు వున్న చోట ఈ మౌనం అందరినీ బాధిస్తోంది.
ఇంతకీ ఆ ఆడమనిషి ఏమన్నాది?
* * *
‘ఇది సౌభాగ్య రాయ పుర అగ్రహారం.. కానీ ఇప్పుడందరం ఎస్ ఆర్ పురం అంటాము ‘ అన్నాడు ఎర్ని బాబు.
‘ఒకప్పుడు రాజులు బ్రాహ్మలకు రాజులు రాసిచ్చిన అగ్రహారాలు ఇవ్వన్నీని చూడండి మా వూరు ఎంత అందంగా వుందో, అదిగో అవి తూరుపు కనుమలు, ఇవ్వన్నీ జీడి,మామిడి తోటలు , ఊరి మధ్యలో గుడి, ఆ పక్కన పంచాయతీ ఆఫీసు, ఇదిగో ఇక్కడనుంచి నాలుగు రోడ్లు ఒకటి అలా ఎత్తుకి వెళితే దబ్బంద అనే వూరికి వెళ్లొచ్చు, కింద రోడ్డు పట్టుకుంటే వాలి మెరక అనే ఊరొస్తుంది ‘ అన్నాడు అతనే.
అతనలాగా ఊరిని వర్ణిస్తున్నాడు , బానే వుంది గానీ వూర్లో పొలాల చుట్టూ కంచెలు వేసి చాలా చోట్ల లే అవుట్లు వేసి వున్నాయి, గ్రామంలో చాలా భూములు అలానే వున్నాయి, కొన్ని చోట్ల వాటిల్లో పశువులు గడ్డి మేస్తున్నాయి. చెరువుపనికి వెళ్ళినవాళ్ళు నిదానంగా ఇళ్ల దారి పడుతున్నారు.
అక్కడొక కొండని క్వారీ కోసం నమిలి పారీసారు, అది సగం నమిలి వొదిలేసి న చికెన్ ముక్కలాగుంది.
ఇళ్ల పక్కన పశువుల పాకలో గేదెలు కూర్చొని తాదాత్మ్యంతో గడ్డి నములుతున్నాయి.
‘ టైం .. పదయ్యిందా?’ అన్నాడు కన్నం నాయుడు, చెరువుపని జనం ఇళ్లకు వెళ్లడం చూసి.
‘ ఇంకా ఎన్ని ఊర్లు చూపిస్తారు ‘ అన్నాడు శోభనాద్రి.
‘ మీరెన్ని వూర్లడిగితే అన్ని, తరువాత మీకు నచ్చిన చోట నచ్చిన బిట్టు కొనుక్కుందురు ‘ అన్నాడు ఎర్నిబాబు.
కన్నం నాయుడు, ఎర్నిబాబు తమ పనులు చేసుకుంటూ అప్పుడపుడు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు.
అంత కమర్షియల్ కాదు జెన్యూన్ పర్సన్స్ అని తన ఫ్రెండు చెబితే శోభనాద్రి ఇక్కడకు వొచ్చి వీళ్ళను కలిసాడు, తిరగడానికి కారు అతనే తెచ్చుకున్నాడు.
మొదటి సారి ఈ ఊర్లు రావడంతో అతనికి ఈ ఊరి పేర్లు తెగ నచ్చేసాయి.
‘ఇదిగో ఈ ఊరి పేరు జుత్తాడ , అంటే ఏటని అడక్కండి నాకు తెల్దు’ అన్నాడు నాయుడు.
‘మరీ ఊరేంటనుకున్నారు?’ అన్నాడు ఎర్నిబాబు ఒక బోర్డు దగ్గర ఆపి.
‘ గుర్రంపాలెం .. అబ్బా భలేవుందయ్యా పేరు ‘ అన్నాడు శోభనాద్రి.
అతను పూర్తిగా స్థలం బిట్లు కొందామన్న ధ్యాస మర్చిపోయి ఊరిపేర్ల మాయలో పడి ఆనందపడిపోతున్నాడు.
అయితే అన్ని వూర్లలోనూ పొలాలు లే అవుట్లుగా ఖాళీగా ఉండిపోయాయి .
కొన్ని చోట్ల పెద్ద కారుల్లో తెల్ల చొక్కా, తెల్ల పాంట్ల మనుషులు దూరంగా వున్న భూముల్ని చూపిస్తూ పక్కనున్న వాళ్ళతో ఏదో మాట్లాడటం కారు అద్దంలోంచి కనిపిస్తా వుంది.
రోడ్లపక్కన ‘ కోడి పలావు ‘ ‘ బిర్యాని తయారు ‘ వంటి బోర్డులు ఎక్కువ వున్నాయి.
జనాలు శాంపిళ్లు, నిబ్బులు కొనుక్కొని జేబుల్లో పెట్టుకొని పోతున్నారు.
రోడ్డు పక్క కుర్రాళ్ళు భయం లేకుండా కూర్చొని బీర్లు తాగేస్తున్నారు.
చికెన్ సెంటరు ముందు కోళ్లు మాసి పోయి జీవం లేకుండా వున్నాయి.
అలా చూసుకుంటూ పెందుర్తి జంక్షను కొచ్చిన వాళ్ళు ‘ ఇక్కడ సరిపల్లి అనే అందమైన పేరుగల ఊరుంది ‘ అన్న ఎర్ని బాబు మాటతో ఆ వూరు కూడా చూసొచ్చారు.
తిరిగి పెందుర్తి జంక్షను కొచ్చాక ‘ఇక్కడ టీ తాగుదామండీ..’ అన్నాడు శోభనాద్రి . ‘పదండలాగా వెళదాము ..టీ టైం ..లేదా టీ బ్యాంకు.. టీ టీ టీ .. అనే షాపులుంటాయి అక్కడ తాగుదాం ‘ అన్నాడు కన్నం నాయుడు.
‘నాకవొద్దు.. పెందుర్తి టీ కావాలి ‘ అన్నాడు శోభనాద్రి.
‘ కష్టమే ..మీకు చాలా ఊరి సరదాలు వున్నాయి కదా? ‘ అన్నాడు ఎర్ని బాబు.
‘అలా అనకాపల్లి రోడ్డులో ముందుకు వెళ్లి మలుపు తిరిగితే పినగాడి, చింతలగ్రహారం అనే వూర్లు వస్తాయి పదండి’ అన్నాడు కన్నం నాయుడు.
‘మేఘాద్రి గెడ్డ కింద వున్న వూర్లవి, చాలా అందమైనవి. ఇంకా మా పెందుర్తి లో పెదగాడి, చింతగట్ల, ముదపాక అనే చిత్రమైన పేర్లు వున్నాయి ‘ కళ్ళు పెద్దవి చేసుకొని అన్నాడు ఎర్నిబాబు.
అలా చుట్టూ కొండల మధ్య వున్న ఆ ఊర్లు చూసుకుంటూ, అక్కడక్కడా తంసప్ , కోకోకోలా బోర్డులు దాటుకుంటూ ఒక చోట కారాపేరు.
ఎర్నిబాబు, కన్నం నాయుడు కాళ్ళు సాగుతాయని కాస్త దూరంగా ఫోను మాటాడుకుంటూ వెళ్తుండగా ఒక ఇంటిముందున్న ఆడమనిషితో శోభనాద్రి ‘ అమ్మా కాస్త మంచినీళ్లియ్యమ్మ, మినరల్ వ్వాటర్ ఉంటే ఇయ్యు, కాను వేయుంచుకున్నట్టున్నావుగా ‘ అన్నాడు.
అం తే అంతెత్తున లేసిన ఆడమనిషి ‘ అల్లక్కడ షాపుంది, ఇరై రూపాయలిచ్చి కొనుక్కో, మామీ టిన్నునీళ్లు నలభై రూపాయలిచ్చి కొంతాన్నం, గాలాసుడు నీళ్లు ఇవ్వడం కూడా కుదరదు ‘ అంది.
అదే లోకం కార్లోకొచ్చి కూర్చున్న శోభనాద్రి వేపగుంట జంక్షన్ వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చొని, సింహాచలం వెళ్లే దారిలో వున్న ఆ టీ స్టాలు దగ్గర టీ తాగేక,
‘ అంత మాటనేసిందేంటండి ఆ ఆడమనిషి? ఊర్లు ఇలాగైపోయాయేమిటండి ? ఇంకా నయం టీ పెట్టమని అడిగాను కాదు, మొఖం మీద వేడినీళ్లు కుమ్మరించునేమో ‘ అనేసి తాను కొనుక్కున్న ఆ మినరల్ వ్వాటర్ బాటిల్తో మొఖం కడుక్కోడం మొదలెట్టాడు.
ఊర్లు అందమైన పేర్లుతో వున్నాయి, ఇంకా వాటి అందం కూడా పూర్తిగా పోలేదు,మనుషిలాగైపోతున్నారెందుకు అని ఇద్దరూ ఒకేసారి ఆలోచించడం మొదలెట్టారు.
*
Add comment