ఆ పాత్ర ఆమెదే!

విజయనగరం మహారాజా మహిళా కళాశాలలో 70-72 బేచ్ లో నేను బీయస్సీలోనూ , విజయవాహినీదేవి బియ్యే లోనూ సహాధ్యాయులం. అందుచేత మొదటి రెండేళ్ళు ఇంగ్లీష్, తెలుగు క్లాసుల్లో మాత్రమే అన్ని గ్రూపుల విద్యార్థినులం కలిసే వాళ్ళం. అటెండెన్స్ పిలిచినప్పుడు విజయవాహినీదేవి పేరు నన్ను ఆకర్షించేది. ఆ అమ్మాయి ఎందువలనో ఆలస్యంగా కాలేజీలో క్లాసులకు హాజరైంది.కుతూహలంగా ఆమెకోసం ఎదురుచూసి తీరా ఆ అమ్మాయిని చూసి అవాక్కయ్యాను.వంకరముఖంతో,పైకి వుబికిన కనుగుడ్లతో, బొంగురు గొంతుతో మరుగుజ్జు అమ్మాయిని విజయవాహినీదేవిగా చూసాను.
                 ఆ అమ్మాయి కాలేజీలో హాస్టల్ లో వున్నా స్నేహితులతో కలిసేది కాదు.ఇంగ్లీష్, తెలుగు క్లాసుల్లో ఎవరి గ్రూప్ వారితో వాళ్ళే కూర్చోవడంతో విజయవాహిని ఎదురైనప్పుడు హలో చెప్పడమో,ఒక పలకరింపు చిరునవ్వు విసరటమో తప్ప స్నేహం లేదు .అది నన్ను ఎప్పటికప్పుడు కించపరుస్తూనే వుండేది. కథలో రాసిన సినీమాహాల్ సంఘటన కూడా ఆ నాటి అనుభవమే. దానినే కథగా మలిచాను. నేను రాసిన “పరాజిత” కథలో అపరాజిత పాత్ర విజయవాహినీదేవే.
             నాకు అక్షరాలు రాయటం రాకముందే అక్కయ్య నాకోసం పంపిన సోవియట్ లాండ్ బొమ్మల పుస్తకాల నాటినుండి ఎదుగుతూ నేను తెలుగు సాహిత్య పుస్తకాలపురుగునే అయ్యాను. పెద్దక్క పి.సరళాదేవీ, చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావూ కథకులు కావటంతో కథాసాహిత్యం విపరీతంగా చదివేదాన్ని.కాలేజీ మాగజైన్లో రాయటమే కాక కథలు కొన్ని రాసినా చదువు అశ్రద్ధ చేస్తున్నానని ఇంట్లో కోప్పడతారని కథల్ని పుస్తకాలు కింద దాచేసేదాన్ని.
           1967లో వచ్చిన కుటుంబరావుగారి కురూపి నవల చదివిన తర్వాత కథానాయిక అందాలరాశిగా, సకల సద్గుణరాసిగానే వుండాలా అనే ఆలోచన నాకు కలుగుతూ వుండేది.అందువల్ల నా సహాధ్యాయిని చూసి ” పరాజిత” కథని రాసాను. కానీ పోష్టు చేయలేదు.
           స్వాతి మాసపత్రిక ప్రారంభసంచికలో గౌరవసంపాదకులుగా శీలా వీర్రాజుగారి పేరు చూసి ఆయన రచనల గురించి దేవి పేరుతో కొన్నాళ్ళు వీర్రాజుగారికి కలం స్నేహంగా ఉత్తరాలు రాయడం, తదనంతరం వీర్రాజుగారికి నేను తన మేనమామ కూతుర్నే అని తెలిసి వివాహం చేసుకుంటానని ఉత్తరంలోనే అడగటం జరిగింది.మేనత్త మేనమామ పిల్లలమే అయినా అప్పటికే సుమారు పది పదిహేను ఏళ్ళుగా మా రెండు కుటుంబాల మధ్య సయోధ్య లేదు. నా సాహిత్యమోహం వలన మళ్ళా కలవటం జరిగింది.
ఆ సందర్భంలో మాఇంటికి వచ్చిన వీర్రాజుగారికి అప్పటికే రాసిన నా కథల్ని చూపించాను.అందులో మూడు కథల్ని ఎంపిక చేసి పత్రికలచిరునామాలు ఇచ్చి పోష్టు చేయమని చెప్పారు.ఆ విధంగా 9-10-1970 పొలికేక వారపత్రికలో కొడవంటి సుభద్రాదేవి పేరుతో నా మొదటి కథ ప్రచురితం అయ్యింది.
             సెకెండియర్లో నా వివాహానంతరం విజయనగరంలోనే వుండి నా డిగ్రీ చదువు పూర్తి చేసుకొనే 1972లో హైదరాబాద్ వచ్చాను. నాకు వివాహం అయ్యిందనే విషయం అందులోనూ ఒక ప్రముఖ రచయితతో నాటకీయంగా జరగటం మా కాలేజీలో ఒక సంచలనం కలిగించింది.ముఖ్యంగా సభావివాహం జరగటం వలన కుతూహలంతో మా వివాహానికి లెక్చరర్లు కూడా వచ్చారు. వివాహానంతరం కాలేజీకి వెళ్తే అందరూ నన్ను ఓహీరోయిన్లా చూసి అభినందించారు.ఆ సందర్భంలో విజయవాహిని కూడా అభినందించింది.నా వివాహానికి ముందేరాసిన “పరాజిత” కథలో సుమకి పెళ్ళికానుకగా అపరాజిత “కురూపి” నవల పంపటం కల్పించాను.
              మొదటికథే నాకు మంచిపేరు తెచ్చింది. వీర్రాజుగారు వివాహ ఆహ్వానపత్రిక ఇచ్చినప్పుడు ఒకరిద్దరు “ఆ మధ్య పొలికేక లో కథ చదివాను ఆ అమ్మాయేనా?” అని తనని అడిగారని చాలా సంబరంగా చెప్పటం మర్చిపోలేను.   రచయితల తొలికథలను పరిచయం చేస్తున్న  కె వి ఎస్ వర్మ గారు 2023 ఆగష్టు సంచికలో నా కథ “పరాజిత”ను పరిచయం చేసారు.
త్వరలో ప్రచురితం కాబోతున్న నా సమగ్ర కథల సంపుటికి కాత్యాయని విద్మహేగారు రాసిన ముందుమాటలో ప్రత్యేకంగా ఈ కథను ప్రస్తావిస్తూ  “అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం” వంటి పాటలు అందంలేని వాళ్లకు ఆనందం, జీవితం లేనట్లే అని చెప్పకనే చెప్తుంటాయి. నిజానికి శారీరక వైకల్యాన్ని, ఆకారాన్ని, రంగును, జుట్టును, కట్టు బొట్టును బట్టి స్త్రీ పురుషులెవరినైనా అవమానపరచటం బాడీషేమింగ్గా ఈనాడు అందరికీ తెలిసిందే. అది గౌరవంగా జీవించటానికి మనుషులకు ఉన్న ప్రాధమిక హక్కుకు భంగకరం అన్న చైతన్యం ఈ నాటిది. ఆ క్రమంలోనే బాడీషేమింగ్కి వ్యతిరేకంగా సామూహికచైతన్యంతో ఉద్యమాలు నిర్మించబడటం వర్తమానవాస్తవం. ఆ దిశగా పెంచుకోవాల్సిన సంస్కారాల గురించిన ఆకాంక్ష అర్థశతాబ్ది క్రితమే (1970) సుభద్రాదేవి వ్రాసిన అపరాజిత కథలో ప్రతిఫలించటం ఆశ్చర్యకరం.”అని ప్రశంసించారు.
         హైదరాబాద్ వచ్చాక ఇంట్లో కవిత్వం వాతావరణం ఉండటం,ఉమ్మడి కుటుంబంలో కథ అల్లటానికి కావలసినంత సావకాశం సమకూర్చుకోలేక కవిత్వంలోకి వచ్చియాభైఅయిదేళ్ళ సాహిత్య జీవితంలో పదకొండు కవిత్వపుస్తకాలు తెచ్చినా,కథని మాత్రం వదిలేయలేదు . అప్పుడప్పుడు రాసిన కథలు మూడు సంపుటాలుగా వచ్చాయి.
*
శీలా సుభద్రాదేవి

పరాజిత
          “అందమే ఆనందం…. ల ల లా” అంటూ కూనిరాగం తీసుకుంటూ చెంగు చెంగున మెట్లు దిగుతూ మలుపు తిరిగిన సుమ, తనకి డేష్ యిచ్చేంత దగ్గరకు వచ్చిన ఆకారాన్ని చూసి కెవ్వున అరవబోయి అప్రయత్నంగానే పెదాలు బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి బొమ్మలా ఉండిపోయింది.
         “క్షమించండి… చూసుకోలేదు…” అంటూ బొంగురుగొంతుతో చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆ ఆకారం వంక చూస్తూ “నెవర్ మైండ్” అనైనా అనకుండా అలానే ఉండిపోయింది.
           నాలుగడుగులకు మించనిది, చామనఛాయ వర్ణం, వంకర్లు తిరిగిన చేతులూ వేళ్ళూ, పైకి ఉబికిన కనుగుడ్లు, వంకర ముఖం, కొద్దిగా గూని, సగం పండిన జుట్టు, నిజంగా అష్టావక్రుడనే వాడుండేవాడో లేదో తెలీదు కానీ… ఈమె…. ఈమెమాత్రం అష్టవక్రే…”
           “ఓహెూ! సుమా! నిన్ను నమ్ముకుంటే అయినట్లే! వేగంగా క్లాసు రూముకి వెళ్ళి డ్రామా క్లాసుకు ఫస్టు సీట్లే రిజర్వు చేస్తానని పావుగంట క్రితం బయలుదేరిన దానివి, ఇక్కడ మెట్ల మీద నిలిచిపోయి ఏ మన్మధుడికోసం కలలు కంటున్నావే తల్లీ!…” తుఫానులా వచ్చిపడిన విమలను చూడగానే మళ్ళా సుమకు చైతన్యం కలిగింది. అప్పుడే చూసింది విమల సుమ కళ్ళలో నీటిని.
           “ఏమిటి! ఈ కోమల సుమ హృదయాన్ని నలిపిన పాపాత్ములెవరే! సుమ కన్య మదిలో మకరందము వదిలి, సుమదళాయతాక్షి కన్నుల తుహిన బిందువు లొలికింపజేసిన వారెవరే!” అంటూ నిజమైన స్పెషల్ తెలుగు స్టూడెంటులా మాట్లాడుతున్న విమల మాటలు వినకుండానే మెల్లగా క్లాసురూముకు బయలుదేరింది సుమ.
          అటెండెన్సు తీసుకుంటున్నప్పుడు, ఆమె తన క్లాసేనని, పేరు అపరాజిత అని తెలుసుకొన్న సుమ హృదయం మరోసారి నిట్టూర్చింది. “అపరాజిత… ఈమె జీవితంలో నిజంగా అపరాజితగా బ్రతకగలదా? ఈ మనుషులు ఈమెను పరాజితను చేయకుండా ఉండగలరా? అపరాజిత అనే అమ్మాయి క్లాసులో ఉందని తెలిసినప్పుడు తను ఏమేమో ఊహించుకొంది. మాటలతో చేతలతో ఎవరినైనా పరాజితులను చేయగల మెరుపుతీగెలాంటి అమ్మాయే తన మనసులో మెదిలేది. ఈమె ఈరోజే క్లాసుకు వచ్చినట్లుంది, కాలేజీ తెరిచి పదిరోజులైనా, యింతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి…
      “ట్వెల్త్ నైట్ లో ఒలీవియా అందాన్ని అన్ఇమేజనబుల్ బ్యూటీ…” అంటూ తెగపొగిడేస్తున్న మేడమ్ చెప్పే పాఠం ఏమాత్రం చెవుల్లో పడటంలేదు. అపరాజితే మనసులో మెదులుతోంది.
       తర్వాత చాలాసార్లు సుమకు అపరాజిత కనిపించింది. కాని ఆమెతో మాట్లాడ లేకపోయింది సుమ. కన్పించినప్పుడల్లా చిన్నగా నవ్వబోయేది సుమ. అయితే ఆ నవ్వు ఆమెకు కన్పించేలా ఉండేదో లేదో కూడా అనుమానమే.
        అలానే మూడు సంవత్సరాలు గిర్రున తిరిగాయి.
        సెలవులకు అక్కగారింటికి బయలుదేరిన సుమ బస్ లో కూర్చుని ఆ వారం వీక్లీ కొని పేజీలు తిరగేస్తోంది.
        “ఏమిటయ్యా! వది అణాలకి ఒప్పుకొని తీరా యిక్కడికి వచ్చాక పధ్నాలుగణాలంటావేమిటి?”
        బొంగురుగొంతుక విని తటాలున తలెత్తి పైకి చూసింది సుమ. ఆమె! ఏమాత్రం అందంలేని ఆ అనాకారి క్లాస్ మేట్ అపరాజిత.
        “చాల్లేవమ్మా! నీది ఇలాటి బేరంఅని నాకేటెరుక. అయినా కాలేజీకాడ నుండి స్టేండుకు పద్దాలుగణాలే. నీలాటి దాన్నెక్కించుకోవటం నాదే తప్పు…” అంటూ నోటికి వచ్చినట్లు వాగేస్తున్నాడా రిక్షావాడు.
          చటుక్కున ఆమె మరేమనకుండా వాడడిగినంతా యిచ్చేసింది. ఆమె కూడా సుమ ఎక్కిన బస్సే ఎక్కింది. ఎక్కడా ఖాళీలుకూడా లేనట్లున్నాయి. ఒకవేళ ఆమె ఏమాత్రమైనా అందగత్తె అయి ఉంటే ఆ బస్సులో చాలామంది ఆమెకు సీటు ఆఫర్ చేసే వారేమో,కాని – కానీ ఆమె అనాకారి.ఆమె సుమను చూసింది .అప్పుడిక సుమకు ఆమెను పిలవక తప్పింది కాదు. “అపరాజితా – ఇక్కడకురా” తను కొంత జరిగింది.
        “థాంక్స్- బస్సు దొరుకుతుందో లేదోననీ, ఇంతా చేసి సీటు దొరుకుతుందో లేదోననీ బెంగ పెట్టుకు చచ్చాను. దారిలో రిక్షావాడొకడూ, అక్కడ ఊరుకొని ఇక్కడకు వచ్చాక అల్లరి పెట్టాడు -” అంది ఆమె కొంత కుదుటపడి.
         ఎవరే వూరు వెళ్తున్నారో అన్నీ అడిగేసుకున్నాక యింక మామూలు కబుర్లలో పడ్డారిద్దరూ.
          “సుమా! తర్వాతేం చేస్తావు? బి.ఏ. అయ్యిందిగా ఎమ్మేకి వెళ్తావా?”
         “అబ్బే లేదు! అయినా పాసు కావాలికదా! పాసయినా చదువుతానని నమ్మకంలేదు” మెల్లగా నవ్వింది సుమ.
         “అదేం? ఏవైనా మేరేజి ప్రపోజల్సు ఉన్నాయా?” నవ్వుతూ అంది.
         నవ్వుతున్న అపరాజిత ముఖం చూస్తుంటే మనసెందుకో కలుక్కుమంది. కాని ఆ ఆలోచన రానీకుండా అణచుకొని తిరిగి ముసిముసిగా నవ్వేసింది సుమ.
          “అయితే నిజమేనన్నమాట: మాకు పప్పన్నం ఉందన్నమాట. మరి నన్ను పిలుస్తావా?” చటుక్కున ఆమె ముఖం మరింత నల్లబడింది.
       “బాగుంది. ఎందుకు పిలవనూ? తప్పకుండా పిలుస్తాను. అదిగో మా ఊరు వచ్చేస్తోంది మరి నేను దిగిపోతాను. నీ అడ్రసు తీసుకున్నానుగా; వెడ్డింగు కార్డు పంపుతాను తప్పకుండా రావాలి. మరి ఉంటాను-” వెళ్ళిపోబోతున్న సుమ చేతిని చటుక్కున పట్టుకొని మెల్లగా నొక్కి సుమ కళ్ళల్లోకి చూస్తూ “మర్చిపోరుకదూ! విష్ యూ బెస్టాఫ్ లక్ యిన్ యువర్ మేరిటల్ లైఫ్” అంది.
           “థాంక్స్” దిగిపోయిన సుమ అలానే ఉండిపోయింది. దూరమౌతున్న బస్సును చూస్తూ.
        వంకరవేళ్ళతో తన చేతిని నొక్కిన ఆమె స్పర్శ, చివరి మాటలోని మనసును కదిలించే భావం, చూపులలోని తడి మరోసారి గుర్తుకు తెచ్చుకుంది సుమ.
            *. *. *
             “సుమా! నీకిష్టమైనది ఒకటివ్వనా? నీ ఫ్రెండెవరో పెళ్ళికానుకగా పుస్తకం పంపింది. నీకు ప్రజంటుగా పుస్తకాలిస్తే చాలా యిష్టమని, ఆమె ఎవరో కాని నీ టేస్టు బాగా తెలిసినదానిలా ఉంది” అంటూ సుందరం వచ్చాడు.
        అతని మాటలు వింటూనే పార్శిల్ విప్పింది.
        కొడవటిగంటి కుటుంబరావుగారి “కురూపి”
          “ప్రియమైన సుమ హృదయానికి- అపరాజిత”
              సుమ ఒక్కమాటు ఉలికిపడింది. “అపరాజిత” అంతలోనే పుస్తకంలో నుండి పడిన కవరు చూసి విప్పింది.
          “ప్రియమైన సుమా!
         నీవ్వు పంపిన శుభలేఖ అందింది. నేనెందుకు రాలేకపోయానో నీవూహించుకో గలవనుకుంటాను. నాకు నిజంగా రావాలనే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ, నిష్కల్మషంగా, చిలిపిగా గలగలామాట్లాడే సుమ నవవధువుగా ఎలా ఉందో చూడాలని ఉంది.
నువ్వంటే నాకెంతో యిష్టం. ఎందుకంటే నన్ను గౌరవించిన అమ్మాయివి నువ్వే.
         ఆ రోజు నన్ను మొదటిసారి చూసినప్పుడు నీ కళ్ళల్లో మెదిలిన భావాలు నేను గుర్తించగలిగాను. ఆ రోజు నీ కళ్ళల్లో అసహ్యం కనిపించలేదు. కాని నన్ను చూడగానే నీకా కలవరపాటు కలగటానికి కారణం నాకు తెలుసు. నేను అసహ్యంగా ఉంటానని తెలుసు. కాని నన్ను అసహ్యించుకోకుండా నువ్వే నన్ను చూడగలిగావు.
            తర్వాతకూడా నువ్వు కనిపించినప్పుడు నీ చిరునవ్వు నన్ను మరపించేది. నీతో స్నేహం పెంచుకోవాలనిపించేది. కాని ఎప్పుడూ నువ్వు నీ ఫ్రెండ్సు మధ్యనే వుండేదానివి. కాని ఎందుకో నువ్వంటే నాకు అభిమానంమాత్రం పెరిగిపోతూ ఉండేది. నిన్ను ఏకవచనంతో పిలిచి ప్రేమగా స్నేహంగా కబుర్లు చెప్పాలనీ, నీ చల్లని స్నేహంతో నా బాధంతా మరిచిపోవాలనీ ఏవేవో ఊహలు చెలరేగుతూ ఉండేవి. కాని నా ఆశ అడియాసే అయింది.
             చిన్నప్పటి నుండి నన్ను చాలామంది అసహ్యించుకునేవాళ్ళు. నేను పక్కన నడుస్తే యిన్ఫీరియారిటీ ఫీలయ్యేవారు. ఎవరైనా తమని నాతో రాగా చూస్తారేమోనని. ఎప్పటికప్పుడు నాకు బ్రతుకు పై విసుగు కలిగినా మొండిగా బ్రతికేసేదాన్ని. కాని ఎంతకాలం యిలా నిస్సారంగా జీవితం గడపాలో తెలియటంలేదు.
          నేనిచ్చిన కానుక నచ్చిందనుకుంటాను. ఈ నవల గుర్తు వచ్చినప్పుడు తప్పకుండా నేను గుర్తువస్తానుకదూ. కాని ఈ నవలలోని కురూపి నాకన్నా అదృష్టవంతురాలు, ఎమ్మే పాసైన విద్యావతి. నేను బియ్యే కూడా పాసు కాలేనిదాన్ని, నా జ్ఞాపకాలు నిన్ను బాధించేవే కావచ్చు కాని, నీది సుమ హృదయం, అందుకే నిన్ను అభిమానిస్తున్నాను.
                     నీ
                అ-పరాజిత”
              ఉత్తరం పూర్తిచేసిన సుమ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఓ కన్నీటి బిందువు ఆమె చెంపమీదకు జారింది. ఆమెతోపాటుగా ఆ లేఖను చదివిన సుందరం ఆమె తలను దగ్గరకు తీసుకొని “పిచ్చి సుమా! ప్రతీ విషయానికీ ఎందుకింతగా బాధపడతావు? మరీ యింత కుసుమకోమలివైతే యెలా?” అన్నాడు.
            “కాదు… కాదు… నేను సుమ హృదయిని కాదు. ఆమె, అ… అపరాజిత పొరపడింది. ఆమెను చూసినప్పుడు నేనెంతగా అసహ్యించుకొనేదాన్నో… ఆమెకు తెలియదు. ఆమెతో స్నేహంగా మాట్లాడిఉండిఉంటే ఆమెలోని నిరాశను కొంతైనా తొలగించి ఉండేదాన్నేమో!… కాని అంతగా సాహసించలేకపోయాను. నన్నిలా పొగిడేయకండి. నేను భరించలేను. అ-పరాజిత మానసిక ఔన్నత్యంముందు నేను పరాజితను…” బొంగురుకంఠంతో సుందరం ఒడిలో తలదూర్చేసింది సుమ.
(పొలికేక -9, అక్టోబర్, 1970)

శీలా సుభద్రాదేవి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ మొదటి కథ అనుభవం బాగుంది.
    వీర్రాజు గారితో వివాహం అంశం బాగుంది.
    వర్మగారు మీ కథను ప్రస్తావించడం మరీ బాగుంది.
    మీకు శుబాకాంక్షలు.
    —-డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్/హన్మకొండ.
    03-04-2025

  • మీ మొదటి కథ “పరాజిత” పాత్ర మీ అనుభవాల
    నుంచే తీసుకుని రాయటం చాలా నచ్చింది.
    ఆమె ను చూసినప్పుడు మీ కళ్ళలో బాధావీచికలు,
    సున్నిత హావభావాలు, స్పందన సహజంగా , స్వచ్చంగా
    మా మనస్సులనూ కదిలించాయి.
    శీలా వీర్రాజుగారికి మీరెవరో తెలియకుండా అభిమానిగా
    లేఖలతో పరిచయమయితే..కొసమెరుఫుగా..
    మీ అభిమానిగా వీర్రాజుగారే మారిపోయి,
    పెళ్ళిచేసుకోవటం బలే థ్రిల్లింగ్ గా వుంది.
    అప్పటిరోజుల్లో నవలా నాయికలా కనిపించారు.

    • మీ స్పందనకు ధన్యవాదాలు భాస్కర రెడ్డి గారూ

  • మీ సుదీర్ఘ స్పందనకు బహు ధన్యవాదాలు అమరజ్యోతి గారూ

  • మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ

  • చాలా బాగా రాశారు. చాలామందికి అందవిహీనంగానో శారీరక అవకరంతోనో వుండటం శాపం గా మారింది.ఇతరులు అసహ్యంగానో నిరాదరణగా చూసిన చూపుల వల్ల వారిలో ఆత్మనూన్యత పెరుగుతుంది. అలాంటివారిలో ఆత్మవిశ్వాసం నింపేవారు అరుదు. అందుకే అపరాజితలు అలా మరుగున వుండిపోతారు. సుమ లో కల్గిన పశ్చాత్తాపం సహజంగా వుంది. అభినందనలు సుభద్ర గారు. వీర్రాజు గారి అభిమానిగా మీరు ఉత్తరాలు రాయడం వారు మీకు వివాహ ప్రతిపాదన చేయడం .. మీ వివాహం జరగడం పాతకాలం ప్రేమ కథ ఎంతో బావుంది.

    • నీ ఆత్మీయ స్పందనకు అనేక ధన్యవాదాలు వనజా

  • బావుందండి. కదిలించే విషయమే కథగా రాయమని తొలుస్తుంది.

  • నీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు వనజా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు