ఆ తరవాత నాలుగు జులపాలు వచ్చాయి మరి!

నాలుగు కాలాలు నిలిచే తొలి కథల వెనక ప్రసవ వేదన – ఈ కొత్త శీర్షిక

1976 లో నేను యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ -డాక్టొరల్ ఫెలో గా కాలక్షేపం చేసే రోజుల్లో హ్యూస్టన్ లో సుమారు వంద మంది తెలుగు వాళ్ళం ఉండేవాళ్ళం. ఉగాది, సంక్రాంతి, దీపావళి లాంటి  పండగల సమయం లో ఎవరో ఒక పెద్దల ఇంట్లోనో, ఎపార్ట్మెంట్ కాంప్లెక్స్ లలో ఉండే క్లబ్ హౌస్ లలోనో కలుసుకుని పండగలు చేసుకునే వాళ్ళం. ఇది బాగానే ఉన్నా, అంతకు ముందు బొంబాయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉన్నప్పటి నా అనుభవం ప్రకారం నాటకం, సంగీతం, కూచిపుడి మొదలైన ఎటువంటి సాంస్కృతిక ప్రదర్శనకి అయినా ఒక సంస్థ తరఫున వేదిక ఉంటేనే ఒక పధ్ధతిలో ‘కలా పోసన” జరుగుతుంది అనే నా నమ్మకం. అంచేత హ్యూస్టన్ లో అటువంటి అధికారిక వేదిక ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన చేసి, అందరితోటీ మాట్లాడడం, ఐదారు నెలల తర్జన భర్జనల తర్వాత 1976 లో తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్ నెలకొల్పడం జరిగింది. ఆ సంస్థకి నేను వ్యవస్థాపక సహ సమన్వయ కర్త…అంటే సహ అధ్యక్షుడిని అన మాట.

అలా ఏర్పడిన మా తెలుగు సాంస్కృతిక సమితి మొదటి ఉగాది కార్యక్రమం మార్చ్ 1977 లో జరపాలి అని నిర్ణయించుకున్నాక, ఇంటర్నెట్, ఇమైల్, సెల్ ఫోన్లు, ఆఖరికి కంప్యూటర్లు కూడా లేని ఆ రోజుల్లో సంస్థ సభ్యులకి సమాచారం అందజెయడానికి పోస్ట్ లో అందరికీ పంపించగలిగే పత్రిక ఒకటే సాధనం కాబట్టి నాకు అప్పుడే ఒక తెలుగు పత్రిక కూడా మొదలుపెట్టాలి అనే ఆలోచన వచ్చింది. అయితే సంస్థాగత విశేషాలతో పాటు, ఆ పత్రిక ని ఒక సాహిత్య ప్రధానమైన పత్రికగా తీర్చిదిద్దాలని నా తపన. దానికి ఆ నాడు హ్యూస్టన్ లో సాహిత్య పిపాస, భాషాభిమానం ఉన్న వారి  సహకారంతో “మధుర వాణి” అనే పేరిట ఒక పత్రిక ప్రారంభించాం. దానికి నేను ప్రధాన సంపాదకుడిని. ప్రారంభ సంచిక మార్చ్, 1977 ఉగాది కి వెలువరించాలి అని అందరం నిర్ణయించుకున్నాం.

ప్రధాన సంపాదకుడిని నేనే కాబట్టి వెంటనే..అంటే సుమారు జనవరి, 1977…లో  ‘మధుర వాణి” లో ప్రచురణకి సాహిత్య పరంగా కవితలు, కథలు, వ్యాసాల కోసం వేట మొదలుపెట్టాను. కొన్ని కవితలు వచ్చాయి కానీ కథల దగ్గరకి వచ్చే సరికి ఏ విధమైన స్పందనా రాలేదు. అంతకు ముందు బొంబాయిలో ఉన్నప్పుడు నేను నాలుగైదు నాటికలు రాశాను కానీ కథల జోలికి వెళ్ళే అవకాశం రాలేదు. ఇప్పుడు మా సరి కొత్త పత్రిక సాహిత్య పత్రికగా తీర్చిదిద్దాలి అంటే అందులో కనీసం ఒక్కటయినా సరి కొత్త కథ ప్రచురించాలి కదా!. మరెలా?

అప్పుడు నేనే ఒక కథ రాద్దాం అని అనుకుని “దేని గురించి రాయాలా?” అని ఆలోచన మొదలు పెట్టాను. అప్పుడు తట్టిన ప్రశ్న “అసలు మనం రాసిన కథ ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు?”. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి జీవన విధాన నేపధ్యం లో ఈ ప్రశ్నకి సమాధానం సులభంగానే దొరికింది. అనగా… అక్కడి రిక్షావాడి కష్టాలు, కట్నం వేదింపులు, కుల వివక్ష మొదలైన అంశాల కంటే  ఇక్కడి అమెరికా సమాజం, అందులో మన అనుభవాల మీద కథలు చదవడానికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా అని అనిపించింది. అలాంటి అనుభవాలలో మాతృ దేశం జ్ఙాపకాలతో సతమతం అయ్యే పరిస్థితులు, అప్పుడప్పుడే అమెరికా జీవితం లో నిలదొక్కుకుంటున్న మొదటి తరం ఎదుర్కొంటున్న అనేకానేక ఇబ్బందులు మొదలైన ప్రగాఢ అంశాలు చాలానే ఉన్నా, నా సహజ మనస్తత్వం ప్రకారం ఎందుకో ఆయా కథా వస్తువుల కంటే హాయిగా చదువుకుని, నవ్వుకునే ఆహ్లాదకరమైన కథ రాద్దాం అనే అనిపించింది. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా, రోజు వారీ జీవితం లో ఆహ్లాదంగా, హాయిగా నవ్వుకునే సందర్భాలకి లోటు లేదు సుమా అనేదే నాకే తెలియని లోలోపలి భావన. అటువంటి సందర్భాలని కథ అక్షర రూపం లో పెట్టగలిగితే పాఠకులకి ఆహ్లాదకరంగా, మనసుని తేలిక పరిచే ‘హాస్యం” పుట్టుకొచ్చి, హాయిగా నవ్వుకుంటారు. అయితే ఇవన్నీ నాకు ఆనాడు 1977 లో తెలియనే తెలియదు. నాకు తోచినదల్లా….ఒక కథ రాయాలి, అది సరదాగా ఉండాలి…అంతే…

ఈ నేపధ్యం లో వారం, పది రోజుల ముందు ఒక అసలు సిసలు ఉద్యోగానికి ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి నిజమైన క్షవరం చేయించుకోవాలి కదా….అనగా అప్పటి వరకూ పోస్ట్ డాక్టరల్ ఫెలో గా బొటాబొటీ జీతంతో జీవితం గడుపుతున్న నేను మా యూనివర్శిటీలో పార్ట్ టైమ్ ఉద్యోగస్తులుగా ఉన్న విద్యార్ధుల చేత కేవలం రెండు డాలర్లకి జుట్టు కత్తిరించునే వాడిని. ఈ సారి అసలు, సిసలు మంగలి షాప్ లో క్షవరం చేయించుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి అనిపించి ఒక రోజు ఆ పని మీద బయలు దేరాను. “జులపాల కథ” అనే పేరిట 1977 మార్చ్ లో మా “మధుర వాణి” పత్రిక తొలి సంచిక కోసం వ్రాసిన నా మొట్ట మొదటి కథ నేపధ్యం ఇదే!

కథ ఇక్కడ చదవండి.

కథల నాణ్యత ని బేరీజు వేసే అమెరికా, భారత దేశ ప్రముఖులు, విమర్శకులలో కొందరికి ఈ “జులపాల కథ” స్థాయి చాలా నిరాశ పరచడం లో ఆశ్చర్యం లేదు.  కానీ, గత ఈ చిన్న కథ సుమారు ఏభై ఏళ్ళ గా ఇప్పటికీ పాఠకుల ఆదరణ పొందుతూనే ఉంది. అమెరికాలోనే కాక, భారత దేశం లో కూడా అనేక పత్రికలలో పదే, పదే పునర్ముద్రణ పొందింది. అలాగే అనేక శ్రవణ పుస్తక మాధ్యమాలలో ఈ కథ చదివి శ్రోతలని అలరించింది. ఈ కథకి కొనసాగింపుగా వ్రాసిన మరొక మూడు,,వెరసి నాలుగు జులపాల కథలు కూడా పాఠకుల ఆదరణకి నోచుకున్నాయి.

ఆఖరిగా..

గురజాడ వారి “దిద్దుబాటు” కథ శత వార్షికోత్సవం సందర్భంగా 2020 లో గొల్లపూడి మారుతీ రావు గారు ఎంపిక చేసి ప్రచురించి, హె.ఎమ్. టీవీ లో ప్రసారం చేసిన “వందేళ్ళ కథకి వందనాలు” శీర్షికలో ఆయన ఎంపిక చేసిన వంద కథలలో రెండు అమెరికా రచయితల కథలు…..నా మొదటి కథ “జులపాల కథ” , కల్పనా రెంటాల వ్రాసిన “ఐదోగోడ”….చోటు చేసుకోవడం ఎంతో గర్వకారణం.

*

 

వంగూరి చిట్టెన్ రాజు

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొదటి కథ వెనుక ఇంత కథ ఉంది.. ఈ కథ కూడా ఎంతో ఇంట్రెస్టింగా ఉంది

    • ధన్యవాదాలు, మిత్రమా

    • ధన్యవాదాలు…హేమంత రావు గారూ

  • జులపాలు కథ మొదటిసారి తెలుగు అమెరికా పత్రికలో చదివాను. రెండో జులపాల కథ తెలుగునాడిలో ప్రచురించామని గుర్తు. 3,4 ఎప్పుడు, ఎక్కడ ప్రచురించబడ్డాయి

    • మీ స్పందనకి ధన్యవాదాలు, డా. జంపాల గారూ….జులపాల కథ నవ్య, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, సర్కార్ ఎక్స్ ప్రెస్…ఇంకా చాలా వాటిల్లో నన్ను అడిగి కొందరూ, అడగకుండా కొందరూ ప్రచురించారు. గొల్లపూడి వారి “వందేళ్ళ తెలుగు కథకి వందనాలు” లో కూడా ముద్రణకి నోచుకుంది…అన్నీ గుర్తు లేవు సార్. ప్రచురణ తేదీలు అంతకన్నా గుర్తు లేవు….”రెండో జులపాల కథ” తెలుగు నాడిలో ముద్రించినందుకు ధన్యవాదాలు….

      • డా. జంపాల గారూ..

        మీ స్పందన లో ప్రశ్నకి “మొదటి జులపాల కథ మూడో సారి, నాలుగో సారి ఎక్కడ ప్రచురించబడ్డాయి” అని మీరు అడిగారేమో అని అనాలోచితంగా అపార్ధం చేసుకుని నేను స్పందించినందుకు మన్నించండి..బాబోయ్. అయ్యోయ్….

        ఇక నా కథలు కాని కథలు అన్నీ మొదటి సారిగా కౌముది.నెట్ లోనూ, అప్పుడప్పుడు “మధురవాణి. కామ్” లోనూ మాత్రమే ప్రచురించబడతాయి.

        మీరు అడిగిన మూడో జులపాల కథ, నాలుగో జులపాల కథ ప్రచురణల లింక్స్ ఈ క్రింద ఇచ్చాను.

        మూడో జులపాల కథ: https://www.madhuravani.com/vanguri-jan17

        నాలుగో జులపాల కథ: https://www.koumudi.net/Monthly/2024/february/feb_2024_amerikulasakathalu.pdf

        ఇవి మేము ప్రచురించే అమెరికా కథానిక సంకలనాలలో పునర్ముద్రితం అయ్యాయి అని గుర్తు.

        మరొక సారి మీ మన్ననలు కోరుకుంటూ,,

        – “కంగారులో” వంగూరి చిట్టెన్ రాజు

  • రాజుగారు మీ మొదటి కథ అనుభవం చాలా చాలా బాగుందండి ఈ కథ నేను కూడా చదివాను నిజానికి నాకు కూడా హాస్య కథలు అంటేనే ఇష్టం హాయిగా కాసేపు కూర్చొని చదువుకున్న వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది. మీ అనుభవం కూడా ఒక కథ లాగా ఉంది జోహార్లు మీకు

    • ధన్యవాదాలు, రాజ్యశ్రీ గారూ

  • మీ మొదటి కథ గురించి చాలా చక్కగా వివరించారు. మీరు తలచుకుంటే మొదటి కథ రాసిన అనుభవాన్ని కూడా కథగా మార్చగలరు. మంచి అనుభవాన్ని అందించినందుకు మీకు కృతఙ్ఞతలు.

    • ధన్యవాదాలు, సురేష్ గారూ

  • Chitten Raju garu, thanks andi. I am glad to note that you have re-started your serial. Indian professionals like me can learn a lot from your serial. But, if you continued as an Assistant Professor in IIT-Bombay, you would have done wonders in your field. You would have attained national level fame.

    Sandi Chandrashekara Reddy

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు