సిరికి స్వామినాయుడు ప్రజలభాషలో కవిత్వం రాసే కవి. సామాజిక సంఘటనల పట్ల తన సంస్పందన ప్రత్యేకమైనది. ఇటీవల యావత్ ప్రపంచాన్ని తలదించుకునేలా చేసిన మనీషా ఉదంతంపై కవి రాసిన “చెరబడ్డ భూమి”  కవితను చదివి కండ్లు తెరుద్ధాం.
*
చెరబడ్డ భూమి
~
అంతా శాఖాహారులే ..
బాపనీదిలో రొయ్యల గంపేదని అడక్కండి !
అందరూ సాధుపుంగవులే ..
ఏ చిత్తకార్తె కుక్కలు
ఆమెను పీక్కుతిన్నాయని ప్రశ్నించకండి !
ఇక్కడ .. ప్రశ్నించటం రాజద్రోహం !
తన మర్మాంగాన్ని తనే చింపుకుందనీ ..
తన నాలుకను  తనే కోసుకుందనీ ..
తన వెన్నుముక తనే విరుచేసుకుందనీ ..
కులానికి పుట్టిన కొడుకుల పక్షాన
నివేదికలొస్తాయి !  మీరూ నమ్మాల ..!
తెల్లారితే వీర్యపు నదుల్లో 
కుప్పలుతెప్పలుగా కొట్టుకొస్తున్న 
స్త్రీల శవాలనెన్నని చూడలేదు ! ఇదీ .. అంతే !
ఇదీ .. చెరబడ్డ భూమి !   
చచ్చిన దళిత మేక సంగతటుంచి
చంపే పెద్దపులుల హక్కులకోసం
ఇవాల దర్నాలు జేయాల !
ఒళ్లు పోత్రంతో రంకెలేస్తున్న నాగరిక మృగాలకు
చెరిచే అధికారాన్ని చట్టబద్దం జేయాల !
నరతోట మీద ఈ మాత్రం న్యాయం ఉండొద్దూ ..!
యివాలామె .. నాలుకనెవరు తెగ్గోసారని 
నేరకపోయి అడక్కండి !
ఈ దేశపు నాలుకేనాడో తెగిపోయింది !
కట్టెను విరిచినట్టు
ఆమె వెన్నెముకనెవరు విరిచేసారని
అన్నీ తెలిసీ అడక్కండి !
ఈ దేశపు వెన్నెముకేనాడో  విరిగిపోయింది !
అంతా నిర్దోషులే ..
ఒక నమ్మకం గుమ్మటాలతో సహా 
ఎలా కూలిపోయిందని ఎవరైనా అడగ్గలరా ..?
అడిగితే .. బతగ్గలరా..! ఇదీ .. అంతే !
పూడ్చేస్తే సాక్ష్యం లేచొస్తుందేమోననీ ..
కాల్చేసిన కారణాల్ని మాత్రం అస్సలడక్కండి !
కోతబడ్డ నాలుక నిజం చెప్పలేదు !
కాల్చబడ్డ శవం సాక్ష్యమూ చెప్పలేదు !
పురుషాంగాలను పూజిస్తున్న దేశంలో ..
పలుకుబడున్నోడి మాటే చెల్లుబాటు !
అగ్ర కులమోడిదే జరుగుబాటు !
అయినా .. ఒరే నాయనా ..
పచ్చని పంట పొలంలాంటి ఆమెను
అత్యాచారం జేసి చంపింది వాళ్లే గాదు ..
నడిరాతిరి న్యాయాన్ని తగలబెట్టి
ఆమెను మరోసారి హత్యజేసింది రాజ్యం కూడా ..!                                ( మనీషా కి మౌనంగా ..)

*
ఎత్తుగడ ఎలా వుండాలి? తెలిసిన విషయమై ఉండాలా? ఆసక్తి రేకెత్తించేలా వుండాలా? ఉత్కంఠను కలిగించేలా వుండాలా? ప్రయోజనకరంగా వుండాలా? విశిష్టమైనదిగా వుండాలా? “A great opening line in poetry should be compelling, urgent, and/or unusual. The main key to any poem is that the reader should feel the need to continue reading to findout what happens after the first line”(Robert Lee Brewer). సిరికి రాసిన ‘చెరబడ్డ భూమి’ ఎత్తుగడను చూస్తే బాగా తెలిసిన, జనాల్లో నానిన విషయాన్ని ఎత్తుకొని, వ్యంగ్యధోరణిలో ప్రారంభమై ఒక స్టేట్ మెంట్ ను వొత్తి పలుకుతుంది..ఇట్లా పలకడంలోని ధర్మాగ్రహమేంటో, సంఘటనను ప్రొజెక్ట్ చేసిన విధానంలో గోచరిస్తుంది.
*
స్త్రీలపై జరిగే దాడులు, అత్యాచారాలు అతిసాధారణమైన వార్తలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పతాకశీర్షిక కాస్తా సింగిల్ లైన్ వార్తగా మారి కనుమరుగై పోతుంది. పేర్లు మాత్రమే మారే శాశ్వతమైన వార్తలివి. పెద్ద ఎత్తున నిరసనలు, వాడీ వేడీ చర్చలు కొనసాగి, హాట్ టాపిక్ గా మారితే గానీ ఆ సంఘటన అంతగా ప్రాచుర్యం పొందదు. మన దాకా రానంతవరకు అంతకంత పాశవికంగా, అత్యంత అమానుషంగా జరిగే సంఘటన సైతం మనల్ని కదిలించలేకపోతుంది. వయసుతో నిమిత్తం లేని ఆసిడ్ దాడుల నుంచి, గ్యాంగ్ రేపుల నుంచి, దేహాల్ని నుజ్జు నుజ్జుగా చేసేంత దాకా భారతదేశం ఎంతగా ఎదిగి, ఎంతలా వెలిగిపోతుందో నిత్యం చూస్తూనే వున్నాం. ఇప్పుడు ‘మనీషా’ వంతు వచ్చింది. అంతే తేడా! నిజం చెప్పకుండా నాలుకలు కోయడం, కదలకుండా వెన్నెముక విరిచేయడం ఇప్పటి ప్రగతికి సాక్ష్యం.
*
కొనసాగింపులోని “కులానికి పుట్టిన కొడుకుల పక్షాన నివేదికలొస్తాయి” అన్న వాక్యం లోతును దొరకబట్టుకొని పదే పదే మననం చేసుకుంటాం. పాలనా వ్యవస్థ పనితీరును ప్రశ్నించే, సమర్థతను వెక్కిరించే paradoxical statements కవితకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. పారడాక్స్ లోని తర్కం అర్ధమైతే సంక్లిష్టత చేధించబడుతుంది. “పరస్పర వ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు”(కవిత్వ భాష/బొల్లోజు బాబా).
1. చచ్చిన దళిత మేక సంగతటుంచి/చంపే పెద్దపులుల/హక్కుల కొసం ఇవాల దర్నాలు జేయాల!
2. ఒళ్లు పోత్రంతో రంకలేస్తున్న నాగరిక మృగాలకు/చెరిచే అధికారాన్ని చట్టబద్ధం జేయాల!
– ఇక్కడ కవి చెప్తున్న వాక్యార్థం, భావార్థం ఒకటిగాదు. ఇందులోని తేలికపాటి ముడిని విప్పి, కాస్త ఆలోచించగలిగితే ధర్నాలు చేయడంలోని, అధికారాన్ని చట్టబద్ధం చేయడంలోని అసలు మర్మం బోధపడుతుంది. ‘కులం’ యొక్క ప్రాధాన్యత, దాని పర్యావసానాల చిట్టా బైటపడుతుంది. ‘స్త్రీలపై జరిగే దాడుల్లో దళిత స్త్రీలపై జరిగే దాడులు వేరయా’ అని చరిత్రను, వర్తమానాన్ని సవరించుకోవాల్సిన సందర్భంలో వుండి ప్రశ్నించడాన్ని సమర్ధిస్తాం.
“పురుషాంగాలను పూజిస్తున్న దేశంలో../పలుకుబడున్నోడి మాటే చెల్లుబాటు!/అగ్రకులమోడిదే జరుగుబాటు!”
– సామాజిక సత్యాలను ప్రభావవంతంగా కవిత్వంలో చేర్చడాన్ని పట్టుకొని చదవగలిగితే కవి మరియు కవిత్వ తత్వం తెలిసివస్తుంది.
*
“ముగింపు ఒక దీపస్తంభం”(పెన్నా శివరామకృష్ణ). ఇక్కడ ‘ఆమె’ ను ‘పంటపొలం’ గా చెప్పడం గమనించాలి. అదే సమయంలో న్యాయాన్ని తగలబెడుతున్న తీరుకు సిగ్గుపడాలి. “ఆమెను మరోసారి హత్యజేసింది రాజ్యం కదా” అన్నప్పుడు చైతన్యవంతులమై తిరగబడాలి. ముగింపు తర్వాత పాఠకులు ఆలోచనల్లో పడితే, అంతర్మథనం జరిగితే కవిత్వ ఆయుష్షు పెరిగినట్టుగా భావించాలి. ఫైనల్ స్ట్రోక్ కవిత మొత్తాన్ని మళ్ళీ చదివింపజేస్తుంది, ఆనుపానుపు తడిమి తడిమి చూపిస్తుంది. ముగింపులోని అనూహ్యమైన మలుపుకి పాఠకుడి మనోనేత్రం తెరుచుకుంటుంది. అప్పటివరకు లేని సోయిని తిరిగి తీసుకువస్తుంది. ఇక్కడే కవి సాధించే విజయరహస్య సూత్రం ఇమిడి వుంటుంది.
*
    
    

 
        		 
        	






చాలా బాగా రాశారు . ఆయన చివర్లో చెప్పినట్టు “పచ్చని పంట పొలంలాంటి ఆమెను
అత్యాచారం జేసి చంపింది వాళ్లే గాదు ..
నడిరాతిరి న్యాయాన్ని తగలబెట్టి
ఆమెను మరోసారి హత్యజేసింది రాజ్యం కూడా ..”
పోయం బాగుంది.కవి అభినందనీయుడే. మీ వివరణ బాగుంది.
అందరూ శాఖాహారులే అంటూ మళ్ళీ ‘బాపనీది ‘ని ప్రత్యేకించి చెప్పడం నిందార్ధం ధ్వనిస్తుంది.అలాంటి అనవసరస పదాలను తీసేయగలిగితే స్వామినాయుడు మంచి కవి అని అందరూ ఒప్పుకుంటారు.
కవిత, కవితను విష్లేషించిన తీరూ – రెండూ బాగున్నాయి. కవిత లో spontaneity ఉంది. మనీషా కోసం మరొక్కసారి గుండెను బరువెక్కించిందీ కవిత. ‘బాపెనీది లో రొయ్యల గంపేదని అడక్కండి ‘ అన్న opening వాక్యాలతో nativity ధ్వనించాడు కవి.
గుండె పగిలి పోతున్న వేళ మాటలు రాని సందర్భం ఇది