ఆకాశవాణి అవార్డుల కేంద్రం విజయవాడ

1988 కాలం నాటికి  రేడియో స్టేషన్ అనేక విభాగాల్లో ప్రతిభతో వెల్లివిరుస్తుండేది. 

రెండు నెలల తర్వాత విజయవాడ తిరిగి వచ్చేసరికి,భూతల స్వర్గంలా అనిపించింది.విజయవాడ “వైబ్”(vibe) ఏమిటో తెలిసొచ్చింది.కొత్తగూడెం వెళ్ళాక  ఎడిటింగ్, రికార్డింగ్ నేర్చుకోవటం వలన ఆఫీస్ లో ధైర్యం వచ్చింది.కొత్త డైరెక్టర్ జి.కె.కులకర్ణి తెలుగు వారు కాకపోయినా, తెలుగు ప్రసారాలలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారు.

ఆరోజుల్లో ఒక కార్యక్రమం పునఃప్రసారం చేయాలన్నా దానికో పద్ధతి ఉండేది.స్టేషన్ డైరెక్టర్ అనుమతి రాతపూర్వకంగా ఇచ్చేవారు.దానిని రిపీట్ బ్రాడ్ కాస్టింగ్ అనేవారు.కులకర్ణి గారు ఆ పద్ధతికి వ్యతిరేకి.ఫైల్ అప్రూవల్ కోసం ఎవరు ఎవరు నోటింగ్ పెట్టినా ఆయన తిరస్కరించేవారు.నాటకం అయితే కొత్త రచన తెప్పించి ప్రొడ్యూస్ చేయాలి.ఫీచర్ అయితే బయటకు వెళ్ళి రికార్డు చేసుకొచ్చి OB ఫీచర్ చేయాలి.యువవాణి కార్యక్రమం అయితే కాలేజీలకు వెళ్ళాలి.ఇలా ప్రతి సమస్య కు ఆయన దగ్గర సమాధానం ఉండేది..

ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్ట్ ప్రొడ్యూసర్ గా సుమన్ ఉండేవారు.ఆయనేం చేసేవారంటే స్టేషన్ డైరెక్టర్ గదిలోకి ఇలాంటివి అడగాలంటే నన్ను తీసుకెళ్ళేవారు.. సంభాషణ అంతా ఇంగ్లీష్ లో సాగుతుండేది.. కులకర్ణి గారు ఫలానాది చేయమంటే సరే సర్ అని ఒప్పుకుని , ఆ కార్యక్రమం నాకు తగిలించేవారు.. ఇదేమిటి సర్ అంటే, లేకపోతే నిన్నెందుకు SD(స్టేషన్ డెరైక్టర్) ఛాంబర్ కు తీసుకు వెళ్ళడం అని పెద్దగా నవ్వేసేవారు.అలా మా కొలీగ్ పి.జి.కె.మూర్తికి “ఇంద్రధనుస్సు” అనే విజ్ఞాన సంచికా కార్యక్రమం అవలీలగా అప్పగించారు సుమన్ మా మూర్తి డ్యూటీలో ఉంటూ స్క్రిప్ట్ రాయటానికి తిప్పలు పడుతుండేవాడు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నగరానికి ఒక నెర్వ్ సెంటర్ లా ఉండేది.రేడియో స్టేషన్ కి రాజకీయనాయకులు వచ్చేవారు. సంగీత,జానపద సంగీత కళాకారులు, డ్రామా ఆర్టిస్ట్ లు, జర్నలిస్టు లు.. ఈవిధంగా అనేకమంది వస్తుండేవారు.  అలా నేను ఒకసారి స్వాతంత్ర్య సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య గారు రికార్డింగ్ వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను.చిన్న చేతిసంచితో వచ్చారాయన.గొప్ప సింప్లిసిటీ ఆయనది.ఆయన అనుభవాలు చెబుతుంటే అందరూ మౌనంగా వింటుండేవారు.

నా తొలి ఇంటర్వ్యూ నేను గొప్ప వ్యక్తి సంజీవ్ దేవ్ గారిని చేశాను.ఆయన తెల్లటి లాల్చీ,ధోవతిలో నవ్వుకు ప్రతిరూపం లా ఉండేవారు. ఇప్పటిలా అప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజన్ లేవుకదా..ప్రయాగ వేదవతి గారు ఈతరం వారు

ఇంటర్వూ చేయాలంటూ అవకాశం నాకిచ్చారు.ఇది 1988లోనే-  అప్పటికి నేను చేరి కొన్ని నెలలే అయింది.మేడం నాకు సంజీవ్ దేవ్ రాసిన ఒక పుస్తకమిచ్చి సిద్ధం కమ్మన్నారు. వారితో సంభాషించినప్పుడు ఆయన ఓపికగా సమాధానాలు చెప్పారు. వారి గురించి తర్వాతెప్పుడో తెలుసుకుంటే అంత పెద్ద వ్యక్తిని చేశామా అనిపించింది. ముఖ్యంగా వారి ఉత్తరాల గురించి కవి దర్భశయనం నేను హైదరాబాద్ కేంద్రం లో పనిచేస్తున్న కాలంలో(2017) ఒక ప్రసంగం కూడా చేశారు.

కులకర్ణి గారి సమయంలో 89-93ప్రాంతంలో ఆకాశవాణి ఆహూతుల సమక్షంలో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది.వారానికి ఒకటి ఖచ్చితంగా ఉండేది.ఒక పండగలా నిర్వహించేవారు.ఆరోజు ఎవరు డ్యూటీ లో ఉంటారో ఒక ఆర్డర్ వేసేవారు.డ్యూటీఆఫీసర్ బాధ్యత, ప్రోగ్రాం అయిపోయాక ఆ ఆర్టిస్ట్ లకు వారి చెక్కులు వారికి అందచేయటం– ఆరోజుల్లో మొబైల్ ఫోన్ లేదు.. కాబట్టి ఫోన్ కెమేరా లేదు.. లేకపోతే ఆ జ్ఞాపకాలన్నీ ఛాయాచిత్రాలుగా రూపొందేవి.

అప్పట్లో ప్రోగ్రాం సిబ్బందిలో డ్యూటీ ఆఫీసర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు ఉండేవారు.డ్యూటీ ఆఫీసర్లు కార్యక్రమ ప్రసార సరళిని పర్యవేక్షిస్తూ, కంట్రోల్ రూమ్ (సాంకేతిక ప్రసార విభాగం)ఇంజనీర్లతో అనుసంధానం చేస్తూ ఉండేవారు.ప్రొడక్షన్ అసిస్టెంట్లు ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్, ప్రొడ్యూసర్ లకు సహాయకారులుగా ఉండేవారు.ఇవేకాకుండా మరికొన్ని పోస్ట్లు ఉండేవి.. వాటిల్లో కొన్ని చెబుతాను.సబ్ ఎడిటర్ స్క్రిప్ట్, అసిస్టెంట్ ఎడిటర్ స్క్రిప్ట్, ఫార్మ్ రేడియో రిపోర్టర్, ఫ్యామిలీ వెల్ఫేర్ రిపోర్టర్ అనే పోస్ట్లు ఉండేవి.వీరు కాకుండా స్టాఫ్ ఆర్టిస్ట్లు గా తంబూరా, క్లారినెట్ వయొలిన్, మృదంగం,తబలా విద్వాంసులు ఉండేవారు.

ఒక విధంగా చెప్పాలంటే నేను చేరిన 1988 కాలం నాటికి  రేడియో స్టేషన్ అనేక విభాగాల్లో ప్రతిభతో వెల్లివిరుస్తుండేది. విజయవాడ కేంద్రానికి అవార్డుల కేంద్రమని పేరుండేది. ప్రతి సంవత్సరం ఆకాశవాణి కేంద్రాలకు జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో రూపొందించిన కార్యక్రమాలకు పోటీలు నిర్వహిస్తూ ఉండేవారు.ఈ పోటీలు ఆకాశవాణి కేంద్రాలకే పరిమితం.

సంగీత రూపకాలు, డాక్యుమెంటరీ,నాటకం, సృజనాత్మక రూపకాలు,యువవాణి, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ కార్యక్రమాల విభాగాల్లో ఈ పోటీలు ఉండేవి.ఆకాశవాణి కేంద్రాల ద్వారా వచ్చిన ఈ ఎంట్రీలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇచ్చేవారు.ఒక్కో విభాగంలో రెండో, మూడింటికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అంటే ప్రశంసా పత్రాలు ఇచ్చేవారు. ఈ ఎంట్రీలన్నీ ఢిల్లీలో న్యాయనిర్ణేతల ముందు స్క్రీన్ చేసేవారు. న్యాయమూర్తులుగా దేశవ్యాప్తంగా ఉన్న నిష్ణాతులైన వారిని పిలిచేవారు.. అన్ని భాషలకు కలిపి ఈ పోటీ ఉండేది.ఒక డాక్యుమెంటరీ విభాగంలో రాజస్తాన్ లోని “చురు”కేంద్రానికి మొదటి బహుమతి వస్తే, దక్షిణాదిలో ఉన్న “విజయవాడ” కేంద్రానికి ద్వితీయ బహుమతి వస్తుండేది.. మారుమూల కేంద్రాలు బహుమతులు పొందుతూ ఉండేవి. 

సంవత్సరం చివరిలో శీతాకాలపు చలిగాలుల మధ్య రేయింబవళ్ళు ఈ అవార్డు కార్యక్రమాల కోసం కష్టపడుతూ ఉండేవారు.ఎస్.బి.శ్రీరామమూర్తిగారు సీనియర్ అనౌన్సర్ గా ఉండేవారు.వారికి దాదాపు పది అవార్డులు గెలుచుకున్నారు.అలాగే ట్రాన్స్మిషన్ ఎక్సిక్యూటివ్ గా ఉన్న సీనియర్ కొలీగ్ కలగ కృష్ణ మోహన్ ఎన్నో సార్లు బహూమతులు గెలుచుకున్నారు 

ఇంకా సీనియర్ అనౌన్సర్లు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, మల్లాది సూరిబాబు, మాడుగుల రామకృష్ణ,బి.జయప్రకాష్, ఈమని కృష్ణశాస్త్రి ప్రోగ్రాం అధికారి ముంజులూరి కృష్ణ కుమారి, ఫార్మ్ రేడియో ఆఫీసర్ వై. హనుమంతరావు- వీరంతా బహుమతులు పొందినవారిలో ఉన్నారు. కవి, రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, ఎస్.బి.శ్రీరామమూర్తి, కలగ కృష్ణ మోహన్ కార్యక్రమాలకు రచన చేస్తుండేవారు.

నేను చేరిన సంవత్సరం 1988లో మాట -మౌనం అనే సంగీత రూపకం కృష్ణ మోహన్ చేసినప్పుడు, పాటల రికార్డింగ్ సినిమా స్థాయిలో ఉండటం ఆశ్చర్యం అనిపించింది. ఎస్.బి.శ్రీరామమూర్తిగారు 1992లో రూపొందించిన సైన్స్ నాటకం “మహావిశ్వ “ లో నేను, మిత్రుడు పి.జి.కె.మూర్తి ప్రొడక్షన్ టీం లో పనిచేశాం.ఆయన నలభై ఎనిమిది గంటల పాటు బ్రేక్ లేకుండా డబ్బింగ్ చేశారు.. రచయిత, ఐపిఎస్ అధికారి కె.సదాశివరావు  అప్పట్లో ఇండియా టుడే పత్రిక లో వచ్చిన కథ ఆధారంగా చేసిన నాటకం అది..ఇందులో థీం మ్యూజిక్, ఎఫెక్ట్ లు, రెండు పాటల కోసం మద్రాసు నుంచి ఆర్టిస్ట్ లను పిలిపించారు.. దానికి పర్మిషన్లు అవీ పెద్ద తతంగం ఉండేది.

ఇలా రూపొందించిన కార్యక్రమాలకు స్టేషన్ స్థాయిలో వీటికి స్క్రీనింగ్ జరుగుతుండేది. లోకల్ కమిటీ వీటిని విని ఎంపిక చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉండేది.ఆ కమిటీ లో స్థానిక ప్రముఖులు ఉండేవారు. నిజానికి ఆకాశవాణి పోటీలకు ఎంట్రీలు పంపటంలో చాలా చాకిరీ కూడా ఉంటుంది.. ప్రతి భాషవారూ తమ స్క్రిప్ట్ ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం చేయాల్సి ఉంటుంది.. కార్యక్రమం థీంను ప్రతిఫలిస్తూ బొమ్మలు వేయిస్తూ ఉండేవారు.అదంతా చక్కగా బైండింగ్ చేయించాలి.. డిసెంబర్ 31న ఆ ఎంట్రీలను ప్రత్యేకంగా మనిషిని నియమించి ఢిల్లీకి పంపించేవారు.చివరి నిముషం వరకు మార్పులు, చేర్పులు చేస్తుండేవారు.. వీటి ఫలితాలు మార్చి చివరి వారంలో ప్రకటిస్తూ ఉండేవారు.అవార్డులను కేంద్ర, సమాచార ప్రసారశాఖ అమాత్యులు ఇస్తుండేవారు.. ప్రతి సృజనకారుడికి ఆకాశవాణి వార్షిక పురస్కారం పొందాలన్నా బలమైన కాంక్ష ఉండేది..ఈ బహుమతులు ఇతర ఆకాశవాణి కేంద్రాలయిన హైదరాబాద్, విశాఖపట్నం,కడప కు కూడా వస్తుండేవి.. కానీ విజయవాడ ఈ రేసు లో ముందుండేది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మొదలైన మొదటి రెండు సంవత్సరాల్లోనే సంగీత రూపకానికి జాతీయ పురస్కారం పొందింది.అప్పట్లో అక్కడ స్టాఫ్ గా ఉన్న శిష్ట్లా శారద ఆ కార్యక్రమం రూపొందించారు. ఆ విధంగా రేడియో లో ఉద్యోగం ఎంతో వైవిధ్యంగా ఉండేది.ఎంతోమంది పెద్దలు రేడియో స్టేషన్ కు వస్తూ ఉండేవారు. నేను, నా చిన్ననాటి స్నేహితుడు డి.వి.మోహనకృష్ణ ఇద్దరం విజయవాడ రేడియోలో ఒకేసారి చేరాం. మేం విడిపోయిన పదమూడేళ్ళకు 1988లో  ఇద్దరం కలిసి ఇంచుమించుగా ఒకేసారి చేరడం ఆశ్చర్యమనిపించింది.. విజయవాడ లో పనిచేస్తున్నప్పుడు అనేకమంది పెద్దలను కలుసుకునే అవకాశం లభించింది..ఆ జ్ఞాపకాలు మరోసారి 

*

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు