అర్జునుడు యుద్ధం చేచ్చాంటే.. ఇట్ల శ‌బ్దం!

రాత్రి ప‌ద‌కొండు అయితాంది..
బ‌య‌ట ఒక‌మైన వాన‌..
యూట్యూబ్‌లో టెక్నాల‌జీ వీడియోలు సూచ్చానా..
ఉన్న‌ట్లుండి.. ఓ దోమ నా కాడ నుంచి పోయింది. దోమ‌ల బ్యాటు ప‌ట్టుకోని లైటేసినా. దోమ క‌న‌ప‌డ‌లా. పైకి సూచ్చే ప్యానుకాడ  శ్లాబు నెమ్మ‌క్కింది.  రోంత ప‌క్క‌కు సూచ్చానే వెంటిలేట‌రు నుంచి వాన నీళ్లు ఇంట్లో ప‌డ‌తానాయి. *అనూష.. నీళ్లు లోప‌లికి ప‌డ‌తానాయి* అన్యా. గ‌బ‌క్కని లేచి సూప‌ర్ సంచిప‌ట్ట తెచ్చింది. ప‌క్క‌నుండే కుర్చీ వేసుకుని దానిమింద నిల‌బ‌డినా. వెంటిలేట‌రు ఆతిక్కు బ‌య‌టికి నీళ్లు ప‌డేట‌ట్టు సూప‌రు సంచి ప‌ట్ట‌ను క‌ప్పినా. *హ‌మ్మ‌య్య నీళ్లు రాలేదు* అని త‌నంది. ఇట్లాంటియి మ‌చ్చుగా చూసిన‌పో అని బిల్డ‌ప్పిచ్చినా.వానంటే నాకెంత ఇష్ట‌మో. వాన‌లో త‌డిచ్చే.. ప‌డిసం ప‌డ‌తాది, జ‌ర‌మొచ్చాదనే భ‌య్యం నాకెప్పుడూ లేదు. వాన‌ ప‌డ‌తాంటే ఆ స‌న్న‌ని శ‌బ్దానికి నా మ‌న‌సు నిమ్మ‌ళ‌మ‌య్యేది.  వాన చినుకుల‌తో ఉండే ప్రేమ అట్టాంటిది. చెప్పాలంటే..  వానంటే ఇష్ట‌ప‌డేట్లు చేసింది మాయ‌మ్మే. పిల్ల‌ప్పుడోపారి వాన‌మో.. అంటా ప‌రిగెత్తినా.  అట్ల చెయ్య‌కు *వాన‌ప‌డితే.. మొల‌కెత్త‌వు* అన్యాది మాయ‌మ్మ‌.  *వాన‌యినా.. ఎండ‌యినా.. చ‌ల‌యినా ఓర్చుకోవాల‌* అని అంటాండె మాయ‌మ్మ. *స‌రే.. మా* అంటాంటి.  మేం పిల్ల‌ప్పుడు ఇట్ల సెప్టెంబ‌రులో వాన‌లు దంచికొట్టేయి. అయ్యి త‌ల్చుకుంటాంటే.. గుండె ఉప్పొంగుతాది. ఆ జ్ఞాప‌కాలు మ‌తికొచ్చే.. కాలుగేలే పిల్లి మాదిరి మ‌న‌సు మా మ‌ట్టిమిద్దెలో తిరుగుతాది. మంచంతా కొట్ట‌క‌లాడతాది.రాత్రి ప‌ద్ద‌ప్పుడు వాన జోరున ప‌డేది. స‌గం నిద్ద‌ర‌లో నామింద‌, మా చెల్లెలు మింద నీళ్లు ప‌డేవి. మా చెల్లెలైతే ఏడిచేది. నేనేమో రోంత‌సేపు ర‌గ్గు అట్ల‌నే క‌ప్పుకుంటాంటి. *గుమ్మ‌డి ప‌డింది లెయ్యి.. మంచం ప‌క్క‌కు జ‌రుపాల‌* అనేది మాయ‌మ్మ‌. నాకు నిద్ద‌రంతా దిగిపోయేది. బ‌య‌ట వాన మోదు గ‌ట్టిగా వినిపించేది. మంచంలోంచి లేచి వ‌సార కాడికి పోయి ఒంటికి వాన‌లోకి పోచ్చాంటే… మానాయిన వ‌సార్లోని గ‌డ్డిని తీసుకుంటాండె. గాటిపాట‌కు పోయి ఎన‌మ‌ల‌కు ఆ మేపు ఏచ్చాండె.  వాన‌కు దిక్కు తెలీక ఎనుములు తొక్కులాడేయి. ఎనుములుండే కందికొట్టం కారిపోయేది. చిన్న దూడ‌ను గ‌ట్టిగా పీక్క‌చ్చి వ‌సారాలో ఇడుచ్చాండె.  *రోంత అట్ట‌పో.. జాలోట్లేకి పోప్పా* అంటాండె మా నాయిన‌. కాశీపుల్ల‌ల‌ కొట్టంలోని జాలాట్లోకి  పోవాలంటే.. నాకు బ‌య్యం. తేళ్లో, మండ్రిగ‌బ్బ‌లో ఉంటాయ‌ని ద‌డుచుకుంటా.. *సోమీ కోడిమూర్తి బ‌య్యారెడ్డి *  మంచులో అనుకుంటా అట్ల‌నే ఉచ్చ‌లు పోచ్చాంటి.  *ఉంటేంలే.. పిల్లోల్లు యాడ‌పోయచ్చేమి. పోతాయి అయి వాన‌లో అంటాండె* మాయ‌మ్మ‌.

కొట్రీ ఇంట్లోకి పోతానే.. గ‌బ్బునూనె బుడ్డి  ఎల్త‌ర‌లో మాయ‌మ్మ‌, నాయిన య‌వ్వారాలు సేచ్చాంటారు. మా నాయిన బీడి ముట్టిచ్చి మంచం మీద కూచ్చుంటే.. మాయమ్మ బుడ్డిదీపం కాడ కుచ్చోని ఉంటాండె.  ఉరుములు, మెరుపుల‌తో వాన వాంచుతాంటే.. *అర్జ‌నా.. అర్జ‌నా.. శాంత‌ప‌డండి* అంటూ మాయ‌మ్మ దండ‌పెట్టేది.  ఏంటికిమా అట్లంటాండావు అంటే.. *అర్జునుడు యుద్ధం చేచ్చాంటే.. ఇట్ల శ‌బ్దం* అని ఏదో క‌థ చెప్పేది.  ఉరుములకు వ‌ణుకుతాంటి. మోడ‌ము మా ఇంటిమీద ప‌డ‌తాదేమోన‌ని భ‌య‌ప‌డ్తాంటి. గుండె గ‌బ‌గ‌బా కొట్టుకునేది.  రేప్ప‌ద్ద‌న ప‌నికి యాడ పోతాం. సోమీ.. వాన ప‌డితే చాల‌ని అనుకుండేవాళ్లు. ఉన్న‌ట్లుండి మాయ‌మ్మ *అద్దుగో ప‌డెరా గుమ్మ‌డి* అంటాండె. మా నాయిన జాలాట్లోకి పోయి బెరిక్క‌న సిల‌వ‌ర బ‌క్కెట తెచ్చాండె. దాంట్లో వాన తుపుక్కు తుపుక్కు మ‌ని ప‌డ్తాంటే.. నేను త‌మాషా సూచ్చాంటి.   మ‌ట్టి, నీళ్లు క‌ల్చి త‌డికెళ్లోంచి బుర‌ద ప‌డేది. నిమ్మ‌ట్లో మా నాయిన సూప‌ర్ సంచిప‌ట్ట‌ తీసుకోని.. పైన కోపును లోప‌లికి మ‌డిచి.. త‌ల‌కాయ మీద పెట్టుకోని మెల్ల‌గా మా ఇంటి ప‌క్క‌న ఉండే గొల్లోళ్ల మిచ్చెన ఎక్కి..  మిద్దెమీద గుమ్మ‌డి చౌడుతో బూడుచ్చాండె.మానాయిన  కిందికొచ్చినాక అట్ల కుచ్చున్యాడో లేదో  ఇంటి వెన‌కాల గోడ‌కి నీళ్లు దిగేవి. పైనుంచి నీళ్లు పోసిన‌ట్లు సున్నంమింద ఎర్ర‌గా నీళ్లు దిగుతాంటే.. మాయ‌మ్మ దిగులుప‌డేది.  ఇంగో చోట గుమ్మ‌డి ప‌డేది. అక్క‌డ టోపీగిన్నె పెడ్తాండె మాయ‌మ్మ‌. మా నాయిన మ‌ళ్లా మిద్దెక్కి గుమ్మ‌డి బూడుచ్చాండె. వానెక్కువైతే.. ఇంట్లో నాలుగైదు గుమ్మ‌ళ్లు ప‌డేవి.. వ‌సార్లో కూడా ఒక‌టో రెండు గుమ్మ‌ళ్లు ప‌డేయి. ఈ వాన‌కు నేను పోలేను ఇంగ‌.. అని వ‌ణుకుతాండె. మాయ‌మ్మ ఇళ్లంతా..  టోపీ గిన్నె, రంగుల బ‌క్కెట‌, సిల‌వ‌ర త‌పేలాలు, చెంబులు పెడ‌తాండె.  ఇండ్లంతా దంత‌ల్లోంచి ప‌డేనీళ్ల చిటుకులు డ్యాన్సేసిన‌ట్లు.. ఒక్కోటి ఒక్కోపారి టంగ్ టంగ్ అని ప‌డ‌తాండె.  మా పాప నిద్ద‌ర పోతాండె.  నాకు నిద్ద‌రొచ్చేది కాదు. సిల‌వ‌రు చెంబుకాడ పోయి కూచ్చుంటాంటి.  చెంబు నిండుతానే ఇంగో చెంబు పెట్టి.. నిండిన చెంబును బ‌య‌ట వ‌సార్లోనుంచి ఉల‌క‌బోచ్చాంటి. వ‌సారాలో కంటే మా కొట్రీ ఇంట్లో ఎల‌క‌లు సంచుల‌కింద‌, త‌డికెల్లో దాక్కుంటాండె. అయ్యి కీసుకీసుమ‌ని అర్చేవి. మా ఇంట్లో పాము కూడా త‌డిక‌ల్లో అప్పుడ‌ప్పుడు అట్ల క‌న‌ప‌డ‌తా పోతాండె. అది ఎవురినీ ఏమీ అనేది కాదు (మా జేజీ ద‌స్తగిరి సోమి అది చంపాకండి అంటాండె).  దీనెమ్మ వానెప్పుడు ఎలుచ్చాదిబ్బా.. అని మా నాయిన అంటాండె.  దిక్కు తెల‌క.. ఇంగో బీడీ కొడ్తాండ‌. మాయ‌మ్మేమో… దిగులుగా కూర్చోని.. *నీయాకు జించ‌.. కొత్త‌మిద్దె క‌ట్టిచ్చుకుందామంటే ప‌ల‌క‌వు* అని బాధ‌ప‌డేది. *ఈ మ‌ట్టికొంప‌లో ఎన్నాళ్లు బ‌త‌కాలో.. పిల్లోల్లు పెద్దోళ్ల‌యితానారు* అని కండ్ల నీళ్లు పెట్టుకునేది. *మా నాయిన రేపు సంవ‌చ్చ‌రం.. క‌ట్టిచ్చుకుందాం* అంటాండె.. మాయ‌మ్మ‌ను ఓదార్చ‌టానికి. బోరున వాన కొడ్తాంటే.. కొట్రీ ఇంట్లో గోడ రోంత ఉబ్బుకున్యాది. *ఉబ్బుకోని ప‌డ‌తాదేమో* అని మాయ‌మ్మ భ‌య‌ప‌డేది.  ఇళ్లు ప‌డి నేను స‌చ్చిపోతే ఎట్ల‌బ్బా.. అనుకుంటాంటి. గ‌బ్బునూనె ఐపోతే దీపంలోకి పోసి అగ్గిపుల్ల ముట్టిచ్చాంటి. బ‌యంతో నేనూ సైరు పొద్దు వ‌ర‌కూ మేలుకునేవాణ్ణి.

తెల్లారుతాండంగ‌నే.. మా ఇంటి ద‌గ్గ‌ర ఉండే కుంట‌లోని క‌ప్ప‌లె బెక‌బెక మ‌ని అర్చేది. ప‌సుపు పూసిన‌ట్లుండే గోండ్ర క‌ప్ప‌లు వాన‌లో ప‌డినాయ‌ని మాయ‌మ్మ చెప్తాండె. *మా.. సోమి.. మోడంలోనుంచి క‌ప్ప‌లు, చేప‌లు ఏచ్చాడు. నాకు తెల్చు* అంటాంటిని బిల్డ‌ప్పు ఇచ్చా.  గంప కింది కోళ్ల‌ను నేను, మా నాయినా ఎత్తుతాంటిమి. అయ్యి కోడిపియ్య పెట్టుకుంటా.. రెక్క‌ల‌తో నీలుగుతా.. బ‌య‌టికి పోతాండె. మా ఇంటి ముందు మురికికాల్వ‌ని వాన‌నీళ్లొచ్చి క‌డుగుతాండె. ఎగుమారు నీళ్ల‌న్నీ మా ఇంటి ముందు మురికి కాల‌వ‌లోకి వ‌చ్చాంటే.. పెద్ద కాల‌వమాదిరి బాగా పారేది. నీళ్ల‌న్నీ కుంట‌లోకి పొయ్యేవి. వాన‌ప‌డిన ప‌ద్ద‌న్నే అంద‌రూ లేచి.. ఎవురింటికాడ వాళ్లు మ‌ట్టి దొబ్బుకుంటాండిరి. ఇండ్లంతా మాయ‌మ్మ క‌డుగుతాండె. పుల్ల‌ల ప‌ర‌క‌తో గాటిపాట అంతా దొబ్బి.. క్లీను సేచ్చాండె. గంజుగుంత‌లోని నీళ్లు తోడ‌తాండె.  మ‌ల్లా వాన ప‌డ్తాంటే.. *ఇది ఈ పొద్దు చ‌ల్లుకోదు. మ‌ళ్లా ప‌డ్తాంది* అంటాండె మాయ‌మ్మ‌. *ఈ పొద్దు, రేపు.. తుపానంట‌. ఆరుగంటల రేడియో వార్త‌ల్లో చెప్పినారు* అంటాండె మా నాయిన‌. పేడ ఎత్తి గంప‌లో కేచ్చే.. నేను పేడ‌గంప దిబ్బ‌లో ఏసి వ‌చ్చాంటి.

కాఫీ తాగినాక ఉరికిత్త పోయి మా బ‌జారులోని, ఎనిక బ‌జారు పిల్లోళ్ల‌ను క‌లుచ్చాంటి. పెద్దోళ్లుంటే.. *ఈ పొద్దు మ‌న కాన్వెంటు ఉండ‌దేమోల్యా. తుపానంట‌* అంటాంటి. ఎందుకుండ‌దూ.. ఉంటాది అంటాండిరి. గుడ్డ పెట్ట‌కోడిని సూసి సోప‌క‌చ్చి మా నాయిన హ‌లాలు  సెయ్య‌టానికి రెడీ అయితాండె. *కాళ్లు ప‌ట్టుకుందురాప్పా* అంటాంటె. *నేను ప‌ట్టుకోను. మా కోడిని కోచ్చాడంట నాయిన* అంటా ఏడుచ్చాంటి. ఎవుర‌న్నా దావుంటిపోయేవాళ్ల‌ను పిల్చి కోడి కాళ్లు, రెక్క‌లు ప‌ట్టుకోమ‌ని చెబుతాండె. ఆ రోజు మా ఇంట్లో సంగ‌టి, కోడిసీలు. ఘుమ‌ఘుమ‌లాడ్తాండే. ఆ వాస‌న‌కు నాకు కండ్లు తిరిగేవి. మాయ‌మ్మ నాకోసం పొప్పు చేసేది అదే ప‌నిగా.. సీలు తిన‌న‌ని.  సంగ‌టి తింటానే.. బ్యాగు భుజానికి ఏసుకోని.. యూరియా సంచి ప‌ట్ట క‌ప్పుకోని పోతాంటిమి నేనూ, మా పాప‌. కాపోళ్ల పిల్లోళ్లు న‌ల్ల‌గొడుగు ప‌ట్టుకోని వ‌చ్చాండ్రి. కాన్వెంటుకు పోయి.. *రామ‌కృష్ణాడ్డి సారు.. అంకేన‌ప‌ల్లి నుంచి రాకూడ‌దు. వంక అడ్డ‌ప‌డాల* అనుకుంటాంటి మ‌న‌సుతో. ఎంత వాన ప‌డుతున్నా.. సైక‌ల్లో కాకున్నా న‌డిచి చత్రీ ప‌ట్టుకోని వ‌చ్చాండె ఆ సారు. మా గుండెలు ప‌గిలిపోయేవి. తుఫాను ప‌డేప్పుడూ బ‌డిలో ఉంటే బాధ ప‌డ్తాంటి.  *సుబ్బ‌య్య‌గారి వంక పార‌తాంది, న‌ల్ల‌వంక పార‌తాంది.. చెర్లోప‌ల్లె బాల‌య్య క‌ట్ట‌పార‌తాంది* అనే మాట‌లు ఇన‌ప‌డేవి. సుబ్బ‌య్య‌గారి వంక పోనీకుంటే.. బ‌స్సు రాలా.. మైటాల బ‌స్సు రాదంట అనేవాళ్లు దావుంటి పోయేవాళ్లు. మాకు పెద్ద‌వానొచ్చేనే వంక‌లు పారాల‌. ఊరంతా సంతోష‌ప‌డేవాళ్లు.  ప‌ద్ద‌న లేచినాన్నుంచి మైటాల వ‌ర‌కు వంక‌ను సూడ‌టానికి న‌డిచిపోయ్యేవాళ్లు.

సెల‌వప్పుడు తుఫాన్లు వ‌చ్చే మా సంతోషం అల‌వికాదు. ఇంటిముందు పారే చిన్న‌కాల‌వలాంటి నీళ్ల‌లో కాగిత‌పు ప‌డ‌వ‌లు చేసి దాంట్లో చిన్న రాయి పెట్టి ఇడిచేవాళ్లం. నేను క‌త్తి ప‌డ‌వ చేసేవాణ్ణి. కాగిత‌పు ప‌డ‌వ‌ల‌న్నీ బాయికాడికి పోయేలోపే నీళ్ల‌లో కొట్ట‌క‌పోయేవి. అట్ల‌నే కుంట‌లోకి పోయేవి. ప‌డ‌వ‌లు ఇడుచ్చా.. గంట‌లు గంట‌లు ఆడ్లాడ‌తాంటిమి. కుంట‌కాడికి పోయి నీళ్ల‌కోళ్లు, క‌ప్పల అరుపులు సూచ్చా నిల‌బ‌డుకుంటాంటిమి. అదో ఆనందం. అట్ల‌నే సుజికీ గాను దొలుపుకుంటా.. పిల్లోళ్ల‌మంతా చెర్లోప‌ల్లె గుట్ట‌మింద‌కు పోతాంటిమి. అక్క‌డ మా కంటే పెద్దోళ్లు బంక‌మ‌ట్టితో క‌ట్ట‌లు క‌డ్తాండిరి. మేం ప‌క్కిడ్డి తోట తిక్కు పోయి సుజికీ గాను లోప‌ల బంక మ‌ట్టి పెట్టుకోని తీస‌క‌చ్చాంటిమి. కొంద‌రు జిల్లేడు ఆకుల్ని బీడిలాగా చుట్టి బంక‌మ‌ట్టికి మెల్ల‌గా వేలితో బొర‌క పెట్టి ఆ బొర‌క‌లో జిల్లేడు ఆకు పెడ్తాండిరి. నీళ్లు పైపుల్లో దుంకిన‌ట్లు ఎర్ర‌గా ఆకులోంచి దుంకుతాండె. అది చూసి అంద‌రం *బ‌లేగుందిబ్బా..ఈ డ్యాము* అని సంబ‌ర‌ప‌డ‌తాంటిమి.

తుఫాన్ల‌కాలంలో ఎవురికీ ప‌నుండేది కాదు. ఇండ్ల‌న్నీగుమ్మ‌ల్లు ప‌డేవి. గోడ‌ల‌న్నీ నెమ్ము ఎక్కేవి. యా ఇంటికాడ చూసినా రాగి సంగ‌టి, సీలు వాస‌న వ‌చ్చాండి. గాటిపాట‌లో ఎనుముల్ని దోమ‌లు కుడ్తాంటే.. అయ్యి ఇష్టం వ‌చ్చిన‌ట్లు తొక్కులాడేవి. గ‌రుగుమీద ఉండే కొంద‌రు వాళ్ల ఎద్దుల్ని మా ఫ్రెండు గంగిడ్డి వాళ్ల ఇంట్లోని పెద్ద గాటిపాట‌కు తీస‌కెళ్లి క‌ట్టేసేవాళ్లు. అక్క‌డే గ‌డ్డి వేసేవాళ్లు. పాలకొచ్చేవాళ్లు, మ‌జ్జిక్కు వ‌చ్చేవాళ్లు, చేన్లు ఎట్టున్నాయో చూద్దామ‌ని పోయేవాళ్లు.. అంద‌రూ సూప‌రు సంచి ప‌ట్ట‌ల్ని నెత్తిమీద ఏసుకోని పొయ్యేవాళ్లు.  మా బ‌జ‌ర్లో ఉండే వాళ్లు.. మా ఇంటికాడికి పొద్దుపోక బారాక‌ట్ట ఆడ‌టానికి వ‌చ్చాన్యారు. సంద‌డిగా ఉండేది ఇండ్లు. అట్ల ఎవ‌రంత‌కు వాళ్లు వాన‌ల‌కాలంలో బారాక‌ట్ట, పులిగీతం ఆడ‌తాండ్రి. ఒక్కోపారి తుఫాను ముసురు ప‌ట్టుకుండేది. నాలుగైదు రోజులు ఇడ్చ‌కుండా వాన ప‌డేది. అప్పుడు మా బ‌డి కారుతాంద‌ని సెల‌వు ఇరిసేవాళ్లు. *పాపం… కాళ్లు జోమొక్కుతాయంటా..* ఎన‌మ‌ల్ని మా నాయిన బ‌య‌టికి ఇడుచ్చాండె. నేనేమో ఇట్ల‌నే ఇంగా రొన్నాళ్లు వాన దంచాల సోమీ అనుకుంటా..  బ‌డి ప‌డిపోవ‌ల్ల.. అట్ల ప‌డాల అని ముక్కుంటాంటి.

*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వానలో గుమ్మళ్లు పడితే మాయమ్మ గుమ్మడి కింద తపాళ్లు పెట్టేది,మా నాయన దొడ్లోకి పోయి యాప చెట్టుకు కొమ్మలు ఇంచకచ్చి, మిచ్చేన ఎక్కిపోయి వానలోనే గుమ్మడి పన్నేగుంతలో యాపాకు కాలితో తొక్కి,పక్కనున్న చౌడు దొబ్బి బుడుచ్చండే… కారటం తగ్గేది… మల్లా రోంచేపుకు బించేర్ల పక్కనుంచి మాడo వచ్చి వాన దంచికొట్టేది….మళ్ళా ఇంగోసాట గుమ్మడి పడతాండే అప్పుడు మాయమ్మ మిద్దె ఎక్కిపోయి గుమ్మడి బుడిసేది

  • Recollection of memories by the writer is captivating throughout the narration. Middle class and lower middle classes family financial problems are seen in the story. How terrible the life when it rains heavily as there was no proper roof.
    I wonder how the writer retains the old memories so fresh and live with him even today. The skill of writer in presentaion is very clear while reading the story as it was presented so well as if it happened yesterday and happened with us .
    I heartily appreciate the blooming Writer Rajavali garu for bringing out an interesting and touching story..May he rise to a famous writer soon..

  • వర్షం వాగులు ,వంకలు , కాగితం పడవలు ,కత్తి పడవ అలా బాల్యంలోకి ఏలు పెట్టి నడిపించు కెళ్ళిపోయారు రాజా వలి గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు