అడగలేని ప్రశ్నేదో

నిన్న బాగా గుర్తొచ్చావ్ అన్నాడు

తను నన్ను చూడగానే

ఏం వస్తాననుకోలేదా అన్నా

కాస్త చిరాగ్గా

మహా తల్లీ నా మాటకు ఎగిరిగంతేసి

హగ్ ఇస్తావనుకుంటేనూ

కాస్త అలిగినట్టన్నాడు

కౌగిలింతకు ఇంత డ్రామా ఎందుకు

అడిగితే ఇస్తాగా అన్నా

హా అనడమే ఆడగ్గానే ఇస్తానంటావు

తీరా ఇచ్చే టైం కి మూడ్ పాడు చేస్తావు నసిగాడు మళ్లీ ..

 

నీలో ప్రేమలేదు అంటూ

ప్రేమకి హగ్ కి ఏంటి సంబంధం అడిగా

తెలీనట్టు అదో పెద్ద గ్రంధం

అమ్మాయికి అర్థంకాదులే అన్నాడు కవ్విస్తూ

 

చెప్పవా అన్నా మురిపెంగా

అలా అడగమాకే ఏదో అయిపోతుంది అన్నాడు

నా మాటతో కరిగిపోతూ

 

లస్ట్ అంటారు దాన్ని

ప్రేమకు ముందే పుడుతుంది

ప్రేమను రెట్టింపు చేస్తుంది

ఎన్సైక్లోపీడియా అవుతూ అన్నాడతను

 

కామం లేకుండా ప్రేమ ఉండదంటావ్ అన్నా

ఏదో పట్టా చేతికొచ్చినట్టు

తనకు అర్థమైనట్టుంది

హమ్మా నే చిక్కనుగా నీకు అన్నాడు

కాస్త తటపటాయింపుగా నేనన్నప్పుడల్లా..

ప్రేమే అని బల్లలు ఎన్ని పగలగొట్టావో ..

ఇప్పుడు కామానికి ఓటేస్తున్నావ్ అన్నా

కాస్త విసురుగా ప్రేమలేని కామం ఉండొచ్చు

కానీ కామంలేని ప్రేమ ఉండదే అన్నాడతను

కొత్త విషయం చెబుతున్నట్టు

నేనెప్పుడో చెప్పా

నువ్వే మాటమారుస్తున్నావ్

తెలీనట్టు కబుర్లు చెప్పావ్ అన్నా

ఇప్పుడేమైందని

నిన్ను కోరుకోవడం తప్పా అన్నాడు తను

కాదు కానీ లీగల్ గా ప్రొసీడ్ అవ్వకపోవడమే ఇబ్బంది అన్నా

సరేలే వెళ్లిపో అన్నాడు తను

ఎప్పటిలానే నన్ను ఏమారుస్తూ

వెళ్ళేదాన్నైతే ఇన్ని ప్రశ్నలెందుకు అన్నాన్నేను

ఇప్పటికి జవాబు దొరకలేదన్న ఇదితో కదులుతూ…

 

2

తియ్యని విషం..

తప్పదు

కొన్నిసార్లు కాలాన్ని కొలవడం

కొన్ని వాక్యాలను మంత్రించిన

పదాలనుకొని కళ్లకద్దుకొని

గుండెల్లో దాచుకోవడం

 

ఎగిరే గాలిపటాన్ని  నేను

రెక్కలు మొలిచిన గాయాన్నీ నేనే

నన్ను కూడా వినలేని నేను

అతన్ని వినమంటాడు

అతన్ని మాత్రమే

 

నాలుగు చినుకులు పడితే

కవిత్వంగా రాలుతుంటానా

గొడుగై పొడి పొడిగా

నను తడిపే అతని పిలుపులు

తియ్యగా ఉన్నా

కొన్ని విషమ పరిస్థితుల్లో చేదౌతుంది

న్యాయమా అని అడుగుతుంటాను

అతన్ని కాదు,

నాలోని భావోద్వేగాలను-

 

ఎందుకలా

ఎంత కాలమిలా అంటూ

చెప్పానా కాలాన్ని కొలుచుకురమ్మని..

ఆజ్ఞ ధిక్కారం నేరం కాదేమో ఇప్పుడు..

అయినా

ఒకింత చీకటి దుఃఖాన్ని

ఒలుచుకొని

పొద్దుటి దీపానికి చమురు చేస్తుంటా.

కవి మాట:

నీళ్ళునింపుకున్న గాజు గ్లాసులా మాట్లాడుతా…నేను రాసేదంతా కవిత్వమేనని మీరన్నా అనకున్నా పారదర్శకంగానే వ్యవహరిస్తా..కవర్ చేసుకోవటం లౌక్యం చూపటం, ఎక్కడా నన్ను నేను దాచుకోవటం ఉండదు అంతా బోల్డ్.. మందుకొచ్చి పెగ్గు దాచుకున్నోడికి మత్తెట్టా ఎక్కుతుంది..మందెట్టా దక్కుతుంది..
                         నేను కవిత్వంలో పుట్టలేదు పుట్టిపెరిగాకే కొంత అలవరచుకున్నా.. అబ్బే..కవిత్వం అబ్బేదే తప్ప అంటిస్తే అంటేది కాదంటారు..మరి నాకు అలవడిందో అంటిందో అదీ తెలీదు.. నాన్న భాష్య కార్ల రామ చంద్రరావు హైస్కూల్ తెలుగు పండితుడు..బహుశా ఆ పండితుని  కడుపున పుట్టినందుకేమో ఈ వాక్యాల వరం కవిత్వ జ్వరం..
                  స్వతహాగ తెలుగు పాఠంపై మక్కువ పదాల ప్రతిపదాల నానార్థాల వెతుకులాట.. సంధులు సమాసాలు యతి ప్రాస గణవిభజనలు వల్లెవేయించినందువలనో చేతనో చేతన్ చేన్ తోడనో కానీ తెలుగుపాట హిందీ పాట సినిమా పాట నన్నల్లుకుంది.. అలా నా పందిరికి కవిత్వ మారాకు తొడిగింది..మొదటి కవితా వాక్యం ఏది రాసుంటానో ఎరుక లేదు..బహుశా అందరిలా ఏ రాకుమారుడినో నా కలల ఊహ చేసి ఉంటా.. రెక్కల గుర్రాలెక్కి వస్తాడని..
పెళ్ళొకరితో అయ్యింది కానీ త్రివిక్రం శ్రీనివాస్ సినిమా ప్రేమలో పడిపోయా..అతని రచనా శైలికి  నేను ఫిదా..నేనూ తొలుత అట్లా పంచులు దించేసా..శ్రీ శ్రీ చలం, జాషువా ల పేర్లు వినటమే కానీ  నేనే రచయితనూ చదువని నిరక్షర కుక్షిని..నేను మొదటినుంచీ చదివి నేర్చే రకం కాదు విని గమనించి చూసీ సాధిస్తుంటా.. మా అమ్మ పేరు సరస్వతి బహుశా అందుకేనేమో కవిత్వమూ అందుకు మినహాయింపేం కాలేదేమో..
              శోకం శ్లోకం రాయించిందట నాన్న పోయిన శోకం నన్ను సాహిత్య బాట పట్టించింది..ఏవో నివాళి వాక్యాల్లో నాన్నను చూసుకునేదాన్ని.. ఆన్ లైన్ లోని కొన్ని సాహిత్య గ్రూపుల్లో అంతంత మాత్రపు పాండిత్యం చూపేదాన్ని..ఆకాస్త రాతలే కవిత్వమనుకుని మురిసేదాన్ని..
        మన జీవితాన్ని అపరిచితుడెవడో ఆకస్మిక మలుపు తిప్పుతాడని ఖుషీ సినిమాలో ఎన్ జే సూర్య చెప్పినట్టు..నిలకడగా సాగుతున్న నా కవిత్వ యాత్రను పరుగులు పెట్టించాడు శ్రీనివాస్ సూఫీ.. వైయుక్తింగా ఉన్న నాకవిత్వాన్ని అస్థిత్వం వైపు తిప్పాడు, సామాజిక దిశా నిర్దేశం చేశాడు..
      తన సూచనతో ఖమ్మంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎనెస్పీ) కాలనీ కూల్చివేతను నిరసిస్తూ బాధితుల తరుపున కవిత్వ గొంతుక వినిపించాను సహకవులను కలుపుకొని శిధిలాల్లో మొలిచిన అక్షరాలు అనే సంపుటి వెలువరించా.. ఆ తరువాత సామాజిక వివక్ష కు గురవుతోన్న మూడోతరగతి ప్రజల హక్కులను ఎలుగెత్తుతూ మానవీయ కోణంలో కవిత్వ రచన చేశా..శ్రీనివాస్ తో కలిసి థర్డ్ వాయిస్ అనే సంపుటి ప్రచురించా.. దళారుల ధరదోపిడీకి గురవుతున్న మిర్చి రైతుల దుస్థికి చలించిన కవులందరితో కలిసి కవిత్వం మండుకొస్తోంది అనే సంపుటి విడుదల చేశా.
       మహిళా సమస్యలు తదితర సామాజిక ఇతివృత్తాలు మనోస్పందనల నేపధ్యంగా నేను రాసిన ఇతర కవితలతో నా వ్యక్తిగత సంపుటి త్వరలో వెలువరించే ప్రయత్నాల్లో ఉన్నా..
*

సుభాషిణి తోట

4 comments

Leave a Reply to Laxmi Radhika Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు కవితలు దేనికదే భిన్నంగా ఉన్నయ్..సంభాషణా శైళి సుభాషిణికి ప్రత్యేకం..ముఖ్యంగా తన ఇంట్రో ఇరగదీసింది..

  • అభినందనలు చెల్లెమ్మా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు