అక్కడ దళితులను ఆపిన శక్తి ఏది?

క్కడ రెండు ఫోటోలు జత పరుస్తున్నాను చూడండి. ఇవి రెండూ మా వూరికి సంబందించిన గూగుల్ మ్యాప్ చిత్రాలు. ఒకటి ప్రస్తుతం మావూరి సామాజిక, నైసర్గిక స్వరూపాన్ని చూపిస్తే మరొకటి వూరి చుట్టుపక్కల భూముల్ని చూపిస్తుంది.

వూరి ఫోటోలో 1980లకు ముందు వున్న వూరి స్వరూపాన్ని హైలైట్ చేశాను. శూద్రులూ, దళితులూ ఒక ఫర్లాంగు దూరంలో విడివిడిగా నివసించేవారు. దళితులున్న వూరికి ప్రత్యేకమైన పేరేదీ లేదు. చుట్టుపక్కలవారు మాదిగ పల్లె అని పిలిస్తే, దూరాన వున్నవారు అగ్గురారం(అగ్రహారం) మాదిగపల్లె అని పిలిచేవారు. సూద్రులుండే వూరిపేరు అధికారికంగా “కల్పనాయుని చెరువు” కానీ ఆ పక్కనే పాతూరుగా పిలవబడే ప్రాంతంలో ఒకప్పుడు బ్రాహ్మణులు నివసించడంతో దాన్ని అగ్రహారం అనేవారు. అదేపేరుతో ప్రస్తుతం వున్న వూరినీ స్థానికంగా పిలుస్తారు.

ఈ పాతూరు అనబడే స్థలం ఒకప్పుడు బ్రాహ్మణులు నివసించి వదిలేసిన స్థలం గనుకనో, పాడుబడిన చోట మళ్ళీ ఇళ్ళు కట్టగూడదనే వాస్తు నియమాల వల్లనో అందులో 1980ల వరకూ ఎవరూ ఇల్లు కట్టుకోలేదు. అందులో కొంతభాగంలో వామిదొడ్లకోసం నాలుగైదు సెంట్ల భూమిలో వరిగడ్డి వాములు, చెనక్కాయవాములూ వేసుకొనేవారు. అలా కొంత భూమి పోయినా ఇంకా ముప్పాతిక వంతు భూమి ఎవరి ఆక్రమణలో లేకుండా వుండేది. ఎవరన్నా తల్చుకుంటే అందులో యిల్లు కట్టుకోవడానికి ఎవరికీ అభ్యంతరముండేది కాదు. అలా 90ల్లో మరో వూరునుండీ వచ్చిన కుటుంబం ఇల్లు కట్టుకొని నివసిస్తోంది కూడా.

అప్పట్లో శూద్రుల వూర్లో మూడిళ్ళకు తప్ప అందరికీ పూరిళ్ళే వుండేవి. 1980ల చివర్లో తెలుగుదేశం ప్రభుత్వం పూరిల్లు వున్న అందరికీ ఇంటికొకరికి చొప్పున పక్కా ఇల్లు మంజూరు చేసింది. అప్పుడు ఆ పక్కా యిళ్ళకు స్థలం ఎక్కడ ఇవ్వాలి అనుకున్నప్పుడు సహజంగానే అధికారులకు ఖాళీగా వున్న పాతూరు స్థలం కనపడింది. కానీ ఎవరూ ఆ పాడుబడ్డ వూరి స్థానంలో ఇళ్ళు కట్టుకోవడానికి సుముఖంగా లేరు. అప్పుడు ఈ శూద్రుల, దళితుల పల్లెలను వేరూ చేస్తూ వున్న రాచమ్మ చేనును కొని ప్లాట్లు చేసి పంచి యిచ్చింది ప్రభుత్వం. అప్పుడు కూడా దళితుల పల్లెను ఆనుకొని దళితులకూ, శూద్రుల పల్లెను ఆనుకొని శూద్రులకూ వుండేలా రెండింటికీ మధ్య రోడ్డు వుండేలా విభజించి కేటాయించింది. దాంతో వూరు పెద్దదయింది.

అయినా 90లు దాటి కొత్త శతాబ్దంలోకి అడుగు పెట్టేసరికి పెళ్ళి అయి వేరుపడిన కుటుంబాలతో వూరుపెరుగుతూ వచ్చింది. ఒకరిద్దరు శూద్రులు పాతూరు అనే సెంటిమెంట్ వదిలేసి పాతూరులో కూడా ఇల్లు కట్టుకున్నారు. కానీ అక్కడ ఎవరికీ చెందని స్థలం లభ్యమవుతున్నా ఏ దళితుడూ అక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఎవరికైనా కట్టుకోవాలని ఆలోచన వచ్చివుంటే శూద్రులు ఎలా స్పందించేవారో గానీ ఎవరికీ అసలా ఆలోచనే వచ్చినట్టులేదు. ఆ పాతూరు స్థలంలోనే పక్కా పాఠశాల భవనము, అంగన్‌వాడీ భవనము, ఈ మధ్యనే కొత్తగా పంచాయితీ కార్యాలయ భవనమూ కట్టారు. ఏ ఒక్క భవనాన్నైనా దళితుల పల్లెకు ఆనుకొని కట్టలనే ఆలోచన ప్రభుత్వానికీ రాలేదు. ఆ పల్లెకూ, ఈ పల్లేకూ రాలేదు. వస్తే ఎలా వుండేదో తెలియదు. రాన్రానూ భూమికి డిమాండు హెచ్చుతూ వచ్చింది. వూరి చుట్టుపక్కల ఖాళీగా వున్న ప్రతి ఇంచి భూమినీ శూద్రులు ఆక్రమించేశారు. దళితులు మాత్రం మొదట వాళ్ళు ఏ ఇళ్ళలో వున్నారూ, ఆ తర్వాత ప్రభుత్వం 80ల్లో ఏ యిళ్ళు ఇచ్చిందో వాటిని దాటి మరొక్క ఇంచి కూడా ఆక్రమించినట్టు నాకు తెలియదు. పైగా దళితుల పల్లెకు పడమరా, తూర్పునా ఖాళీగా బండలతో కూడిన ఖాలీ స్థలం వుండేది. ఇప్పుడు వూరంతా వూపిరి సలపనీకుండా అన్నివైపులనుండీ ముట్టడించినట్టు వుంది.

ఆ ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు కట్టుకోకుండా దళితులను ఆపిన శక్తి ఏది? పేదరికమా? కులమా? ప్రతి ప్రభుత్వ భవనమూ శూద్రుల వైపే అనాయాసంగా కట్టబడడానికి తోడ్పడిన శక్తి ఏది? కులమా? ధనమా?

ఇక రెండవ ఫోటో పరిశీలిద్దాం. ఇది మా గ్రామపు భూములు ప్రధానంగా వున్న ప్రాంతం. 1980ల వరకూ ఎరగొండ క్రింది ప్రాంతంలోనే ఏ వ్యవసాయమైనా నడిచేది. మ్యాపులో పచ్చగా కనపడే ప్రాంతం వ్యవసాయ బావుల ఆధారంగా పండేది. ఎరుపుగా కనిపించేది కేవలం వర్షాధారితం. మేము వాటిని చేలు అంటాం. వర్షాకాలంలో కేవలం వేరుశెనగ వేసేవాళ్ళం. ఈ కొండకింది భూములన్నీ కూడా శూద్రుల చేతుల్లోనే వుండేవి. ఇప్పటికీ వున్నాయి. అప్పట్లో ఆ బూములేవీ శూద్రులు కొన్నవి కాదు. శూద్రులు వృత్తిగతంగా సాగుచేసుకుంటూ వుండిన భూమిని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకే పట్టాలిచ్చారు. కొందరు వీటినే అప్పులు తీర్చలేక కోమట్లకు కొదువ పెట్టడం జరిగింది. ఈ శూద్రుల శ్రమను కోమట్లు పీల్చుకుంటే. ఈ శూద్రులు తమకింద పనిచేసే దళితుల నుండీ పీల్చేవాళ్ళు.

ఇక ఎరగొండ పైభాగం (#2) చిట్తడవిలా వుండే ప్రభుత్వ బంజరు భూమి. రాళ్ళు రప్పలూ వున్నా వ్యవసాయానికి అనువైనదే. మా తాతల టైంలో ఈ ప్రాంతంలోనే ఇంటికి, వ్యవసాయానికి కావల్సిన కలప పుష్కలంగా దొరికేదట. రాన్రానూ అడవి కుచించుకుని వెనక్కు వెనక్కు పోయింది. 80లు, 90ల వరకూ ఈ ప్రాంతంలో ఆవులూ, ఎనుములూ, గొర్రెలూ, మేకలూ మేతకు వెళ్ళేవి. ఇక్కడే అడపా దడపా నేనూ ఆవులు మేపినాను. ఈ ప్రాంతంలో ప్రభుత్వం మావూరి దళితులకు పట్టాలు ఇవ్వబోతే మా ఆవులు ఎక్కడ మేయాలి అంటూ దాన్ని వ్యతిరేకిస్తూ పెద్దలు అర్జీ రాయమంటే నేనే రాసినాను. అయినా ప్రభుత్వం కొందరు దళితులకు పట్టాలు ఇచ్చింది. కానీ వారి దగ్గర అక్కడ వ్యవసాయం చేయడానికి కావల్సిన పెట్టుబడి, సమయమూ లేక అలా బీడుగా వదిలేశారు. కానీ ఇప్పుడు నేను వింటున్నదాన్ని బట్టి అక్కడ దళితులకిచ్చిన పట్టా భూమి మినహాయించి మిగిలిన భూమిని రాజకీయపలుకుబడి వున్న రెడ్లు, శూద్రులూ గుట్టు చప్పుడు కాకుండా తమ తమ పేర్లతో రాయించుకున్నారని. నిజం ఎంతవరకో పెరుమాళ్ళ కెరుక. పేదలకూ, దళితులకూ ఇచ్చే సంక్షేమ పథకాల గురించి గుండెలు బాదుకునేవాళ్ళు ఈ కులబలుపు దోపిడీని ప్రశ్నించరు.

భూముల చరిత్ర బాగానే వుంది మరి కులం గురించి ఎందుకూ అని మీరనవచ్చు. బ్రిటిష్ వాళ్ళు పట్టాలిచ్చేనాటికి భూమిని కేవలం శూద్రులే ఎందుకు సాగుచేసుకుంటూ వుండినారు? వాళ్ళు శూద్రులు గనక. అదే దళితుడు ఆ పని చేయగలిగేవాడా? లేదు.

దళితుడికి తానూ వ్యవసాయం చేయగలను అనే వూహే రాదు. వచ్చిందిపో.. తనకు చేదొడుగా తన స్వంత కుటుంబమే నిలవక పోవచ్చు. తోటి శూద్రులు కులబ్రష్టమైన పని చేస్తున్నాడని వెలి వేయనూవచ్చు, చంపేయనూ వచ్చు. కాబట్టి నాటికి దళితుడికున్న ఒకే ఒక ఆప్షన్ శూద్ర రైతు దగ్గర పాలేరులా జీతం లేకుండా పని చేయడం. పుట్టిననాటి నుండీ చచ్చే దాకా పనిచేసిన దళితుడికి దక్కేది తాగడానికి గంజి, పెట్టుకోవడానికి గోచీ, వుండడానికి గుడిసె. మరి ఈ దళితుడి శ్రమంతా ఎలా పోయింది? అతడు పండించిన పంటంతా ఎవరి పాలయింది? శూద్రుడికి, ఆ శూద్రుడి ద్వారా కోమటికి చేరింది. ఇలా వూటబావిలోంచి నీరు తోడుకున్నట్టు కోమటి, శూద్రుడి నుండి, శూద్రుడు దళితుడి నుండీ శ్రమ అప్పనంగా దోచుకోబడడానికి కులమే దోహదకారి. ఆ శ్రమ దోపిడీకి బీసీ రిజర్వేషన్లు కూడా తోడయి నాలాంటి శూద్రులు ఆ వూబినుండి బయట పడితే, శ్రమదోచుకోవడానికి తమ కింద మరే వర్గమూ లేని దళితులు ఆ చివరి ఘట్టంలోనే మిగిలిపోయారు. వారి శ్రమ దోపిడీలోంచి ఎదిగి, మరింత శ్రమను దోచుకునే స్థానంలో నిలబడి అయ్యో వాళ్ళకు ప్రభుత్వం అన్నీ వుచితంగా ఇస్తుంది అని ఏడవడం దొంగే దొంగ, దొంగ అని అరవడం లాంటిది.

*

ప్రసాద్ చరసాల

6 comments

Leave a Reply to U.SURYACHANDRARAO Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • Very insightful sensible observations and thoughts. I think every village has similar patterns. Mala, Maadiga castes are proletariat class without means except to sell their Labour from the centuries.

  Welfare measures are keep them to alive and not to radicalise further. It is happening every capitalist country on earth. Absolute majority of the people sell their Labour for subsistence. This subsistence too would spend in the market to buy goods. The Labourer would hardly save money is the way anybody will live. It is the capitalist way of functioning. These welfare money ‘also comes from the taxes’ collected from the working class of all castes. Our coming publication discussed about this.

  Further studies about the political economy would provide some answers for your enquiries.

  • థ్యాక్సండి.
   ప్రతి ఏటా విశ్వవిద్యాలయాల నుండీ ఎందరో డాక్టరేట్లు వస్తూనే వున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ల మీద ఎంత మంది రీసెర్చ్ చేస్తున్నారో తెలియదు.

 • మీ గ్రామం ఒక కేస్ స్టడీ. దళితులెలా చారిత్రకంగా భూమి నుండి దూరం చేయబడ్డారో తెలుసుకోడానికి. ఇది ఒక పల్లె కథ కాదు. భారతదేశ గ్రామ గ్రామల కథ. మంచి వ్యాసం అందించారు ప్రసాద్ గారు.

  • అవును. ప్రతివూరి కథా ఇంతకంటే భిన్నంగా వుంటుదనుకోను.

 • ఊరు తగలబడడానికి మిణుగురులే కారణం అంటే ఎంత నిజమో.. సమస్యలన్నింటికీ రిజర్వేషన్లూ, సంక్షేమ పథకాలూ కారణం అన్నా అంతే నిజం. మీ ఊరి కథ దాదాపు అన్ని ఊళ్ళ కథలకూ అద్దం.

  • రిజర్వేషన్లూ, సంక్షేమపథకాలూ అట్టడుగు ప్రజల్లో విప్లవం రాకుండా చూసే అస్త్రాలు కూడా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు