త‌మ‌సోమా

“నిన్న మీ ఫ్రెండు ప్ర‌మీల, వాళ్లాయ‌న క‌నిపించారు బ‌జార్లో. మాట‌ల మ‌ధ్య‌లో చెప్పారు, మీకు చిన్న‌ప్పుడు తెలుగు చెప్పిన  మోహ‌న‌రావుగారు  ఈ ఊళ్లోనే వుంటున్నాడ‌ట‌గా”.

భ‌ర్త య‌థాలాపంగా చెప్పిన మాట‌లు రాజేశ్వ‌రి చెవిలో ప్ర‌తిధ్వ‌నిస్తున్నాయి.

హైస్కూల్లో ఏడెనిమిది త‌ర‌గ‌తుల‌కి  తెలుగు పాఠాలు చెప్పిన మోహ‌న‌రావు. ఇంత‌కంటే మొన‌గాడిత‌నంగా తెలుగు పాఠం చెప్పేవోడు జిల్లాలోనే కాదు, హోల్ స్టేట్‌లోనే లేడు అని పిల్ల‌ల‌తో,పేరెంట్స్ తో అనిపించుకున్న మోహ‌న‌రావు. రాజేశ్వ‌రి జీవితం మీద‌, ఆలోచ‌న‌ల మీద మోహ‌న‌రావు ప్ర‌భావం చాలానే వుంది.  డిగ్రీ చ‌దివే రోజుల్నించీ.. పెద్ద‌య్యాక ఏమేం చేయాలా అని  ఆలోచించుకున్న ప్ర‌తిసారీ రాజేశ్వ‌రి “టూ డూ” లిస్టులో త‌ప్ప‌నిస‌రిగా వుండే ఐట‌మ్ మోహ‌న‌రావు మాస్టారిని  క‌ల‌వ‌డం. ఇన్నాళ్ల‌కి ఆమె కోరిక తీర‌బోతోంది.

రాజేశ్వ‌రికి న‌వ‌ల‌లు, క‌థ‌లు చ‌ద‌వ‌డం ఇష్టం. రోజుకి రెండ్రూపాయ‌లు పెట్టి లెండింగ్ లైబ్ర‌రీలో పుస్త‌కాలు అద్దెకి తెచ్చుకునే పిచ్చికి టీనేజీని అంకితం చేసిన చాలామందికి లాగానే రాజేశ్వ‌రికి కూడా తెలుగు సాహిత్యం మీద కాస్త ప‌ట్టుంది. రావిశాస్త్రి నుండీ బీనాదేవి వ‌ర‌కూ, కొడ‌వ‌టిగంటి నుండీ కొమ్మూరి వ‌ర‌కూ.. ఎవ‌రి పేరు చెప్పినా వాళ్లు రాసిన ఏదో ఒక పుస్త‌కం గురించి ఎంతోకొంత మాట్లాడ‌గ‌లదు. రాజేశ్వ‌రికి పుస్త‌కాలు వ్య‌స‌నంగా మార‌డానికి ఇంట‌ర్లో డిగ్రీలో ఆవిడ‌కి తెలుగు చెప్పిన పంతుళ్లు కొంత‌వ‌ర‌కూ  కార‌ణం. అలాగే మిగిలిన స‌బ్జెక్టుల టీచ‌ర్లలో కొంత‌మంది ఆస‌క్తిక‌రంగా పాఠాలు చెప్ప‌క‌పోవ‌డం ద్వారా.. పిల్ల‌లు వెన‌క బెంచీలో చేరి, నోటు పుస్త‌కాల్లో న‌వ‌ల‌లు దాచుకొని చ‌ద‌వ‌డానికి ప‌రోక్షంగా కార‌కుల‌య్యారు.

మొత్తానికి తెలుగు అనేది మార్కుల కోసం భ‌రించాల్సిన‌ ఒక స‌బ్జెక్టు మాత్ర‌మే కాద‌నీ, దాన్ని చ‌ద‌వ‌డంలో ఏదో ఆనందం వుంద‌నీ రాజేశ్వ‌రికి హైస్కూల్లో వుండ‌గానే అర్థ‌మైంది. ఈ అవ‌గాహ‌న తాలూకూ క్రెడిట్లో కొంచెమైనా  ఏడు ఎనిమిది త‌ర‌గ‌తుల్లో తెలుగు చెప్పినాయ‌న‌కి యివ్వ‌డం ధ‌ర్మం. ఆ విష‌యం రాజేశ్వ‌రికి తెలుసు. అయితే ఆవిడ యిప్పుడు అర్జంటుగా మోహ‌న‌రావు మాస్టారిని క‌ల‌వాల‌నుకోవ‌డం వెన‌కున్న‌ కార‌ణం వేరు.

****

“ఒక పావుగంట‌లో తెమిలేట‌ట్ల‌యితే నేనూ లోప‌లికొచ్చి కూచుంటా. నాకేం ఇబ్బంది లేదు”, నాలుగోసారి చెప్పాడు రాజేశ్వ‌రి మొగుడు.

“బావుంది సంబ‌డం. వొద్దు మొర్రో అంటుంటే ఎన్నిసార్లు అంటావు అదే మాట”, ముద్దుగా విసుక్కుంటి రాజేశ్వ‌రి.

దారిలో ఆగి కొన్న స్వీట్లు, ఫ్రూట్సు భార్య చేతికందిస్తూ, “స‌రే, నీ ప‌నైపోయాక రింగ్ యివ్వు. రెండు నిముషాల్లో వ‌చ్చేస్తా”, చెప్పాడు. అలాగే అన్న‌ట్లు త‌లూపి, గేటు తీసి లోప‌లికి న‌డ‌వ‌డం మొద‌లెట్టింది.

కాలికి మ‌ట్టి అంట‌కుండా మ‌ధ్య‌లో గ‌చ్చు చేసి వుంది. దారికి రెండువైపులా కుండీల్లో ర‌క‌ర‌కాల పూల మొక్క‌లున్నాయి. కానీ, రాజేశ్వ‌రి ఇవేమీ గ‌మ‌నించ‌డం లేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.

కాలింగ్ బెల్ కొట్టాల్సిన అవ‌స‌రం కూడా రాలేదు. త‌లుపు గ‌డిపెట్టి లేదు. కొంచెం నెట్ట‌గానే డోర్ ఓపెన్ అయిపోయింది. ఎదురుగా ప‌డ‌క్కుర్చీలోనే ప‌డుకోని వున్నాడాయ‌న‌. రిటైరైన టీచ‌ర‌న‌గానే సినిమాల్లో చూపించిన‌ట్టు చూపు ఆన‌కుండా, మ‌రీ మంచాన ప‌డబోయేవాడిలా ఏం లేడు. అర‌వై ఐదేళ్లుంటాయేమో. ఇంకో ప‌దేళ్లు త‌క్కువేన‌ని చెప్పినా న‌మ్మొచ్చు.

“సార్‌, నేను రాజేశ్వ‌రిని. గుర్తుప‌ట్టారా?” అడిగింది.

ఆయ‌న‌కి గుర్తు రాలేదు. కానీ వెంట‌నే ఆ మాట చెపితే బాగోద‌ని ఏదో కాస్త గుర్తొచ్చిన వాడిలా మొహం పెట్టి మొహ‌మాట‌పు న‌వ్వొక‌టి న‌వ్వాడు.

“మీకు గుర్తు రాలేదు క‌దా. ట్యూష‌న్ కి ప్యాంటూ ష‌ర్టూ వేసుకొచ్చే రాజేశ్వ‌రి. రాతెండి పుస్త‌కాల పెట్టె, జేబులో హీరో పెన్ను..”

“అవున‌వును గుర్తొచ్చింది. అశోకా చెట్లుండే ఇల్లు. పాన‌కాల రాజేశ్వ‌రి..” ఆయ‌న మొహంలోకి న‌వ్వు ప్ర‌వేశించింది.

“య‌స్ స‌ర్‌. పాన‌కాల రాజేశ్వ‌రి. మీరొక‌సారి నాకు కాంప్లిమెంట్ కూడా యిచ్చారు. నా పెద‌వుల్ని చూస్తే ప‌త్యేకంగా మా యింటిపేరు ఏంటో అడ‌గాల్సిన అవ‌స‌రం లేదు అని..”

అవునా? అలా అన్నాడా త‌ను? అన్న విష‌యం గుర్తుకు రావ‌డం లేదులే కానీ, అని వుండ‌డు అని క‌చ్చితంగా చెప్ప‌డానికి లేదు. ఈ విష‌యం గుర్తు చేసేట‌ప్పుడు ఆ అమ్మాయి మొహంలో కోపం గానీ, బాధ గానీ క‌నిపించాయా?  లేద‌నుకుంటా. మ‌రీ అతిగా డిఫెన్సులో ప‌డిపోవ‌డం కూడా అన‌వ‌స‌రం.

“పాతికేళ్ల‌యిపోలా?”  మాట మారుస్తూ అడిగాడు.

“అవును స‌ర్‌. క‌చ్చితంగా ఇర‌వై ఏడేళ్లు. ఇప్పుడు ప్యాంటూ ష‌ర్టూ వేసుకోవ‌డం త‌గ్గించేశాను. ఎప్పుడైనా వేసుకున్నా పెన్ను మాత్రం ప‌ర్సులోనే పెట్టుకుంటున్నా”, న‌వ్వుతూ చెప్పింది.

రాజేశ్వ‌రి ష‌ర్టు జేబులో వున్న పెన్నుతీయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తాను త‌ర‌చూ ఆమె ఛాతీని త‌డిమేవాడినన్న‌ విష‌యం గుర్తొచ్చింది మోహ‌న్రావుకి. ఆ విష‌యం ఆ అమ్మాయి మైండ్ లో రిజిస్ట‌ర్ అయ్యింద‌న్న‌మాట‌. ఆడ‌పిల్ల‌లు అలాంటి విష‌యాలు ఆ వ‌య‌సులోనే గ‌మ‌నిస్తార‌ని కానీ,  ఇంత వ‌య‌సొచ్చేవ‌ర‌కూ గుర్తు పెట్టుకుంటార‌ని కానీ అత‌నికెప్పుడూ తోచ‌లేదు. చెప్పుకోడానికి స‌వాల‌క్ష విష‌యాలుండ‌గా ప‌నిగ‌ట్టుకోని యిలాంటి విష‌యాలే ఎందుకు ప్ర‌స్తావిస్తుందో అర్థం కావ‌ట్లేదు. పెద‌వుల అందాన్ని మెచ్చుకున్నారంటుంది. ష‌ర్టు జేబులో పెన్ను పెట్టుకోవ‌డం మానేశానంటుంది. త‌న చిలిపి చేష్ట‌ల్ని అప్పుడూ యిప్పుడూ కూడా ఇష్ట‌ప‌డుతూనే వుందా? న‌రాల్లో ఎక్క‌డో చిన్న క‌ద‌లిక‌.  అలాంటి చిన్న‌చిన్న లైంగికానందాలు త‌న‌లో ఎంత మోహావేశాన్ని క‌లిగించేవో గుర్తుకొచ్చి మోహ‌న‌రావు మ‌న‌సు బాధ‌గా మూల్గింది.

“ఒక‌సారి ద‌స‌రా పండ‌క్కి ఇందీవ‌రాక్షుని వృత్తాంతం నాట‌కం వేయించారు గుర్తుందా మాతో. ఆరోజు నాకు మేక‌ప్పేసి, చీర కూడా స్వ‌యంగా మీ చేతుల్తో మీరే క‌ట్టారు”. సిగ్గు ప‌డ‌కుండా ఎంత సింపుల్‌గా చెప్పేస్తోందీ! సందేహం లేదు. త‌న మీద అప్ప‌ట్లో వున్న క్ర‌ష్‌ని యిప్పుడు బ‌య‌ట‌పెట్టాల‌నే వ‌చ్చిందీ అమ్మాయి. మోహ‌న‌రావుకి ఈసారి నరాల్లో క‌ద‌లిక యింకా స్ప‌ష్టంగా తెలుస్తోంది.

“ఇప్పుడు ఎవ‌రి హెల్పూ లేకుండానే క‌ట్టేసుకుంటున్నావా?”, కొంటెగా న‌వ్వుతూ అన్నాడు. ఆ అమ్మాయి చ‌టుక్కున చీర విప్పేసి, ‘మ‌ళ్లీ ఒకసారి క‌ట్టి చూపించ‌రూ’ అని అడిగితే బావుండు. అత‌ని మ‌న‌సు వ‌య‌సుని జ‌యించి, కాల‌యంత్రం ఎక్కి శ‌ర‌వేగంతో వెన‌క్కి ప్ర‌యాణిస్తోంది.

“ఆ రోజు మీరు ట‌చ్ చేసిన ప్రైవేట్ పార్ట్స్ మ‌ళ్లీ ఎవ‌రూ అలా ట‌చ్ చేయ‌లేదు. పెళ్లికి ముందు ఎప్పుడైనా యాక్సిడెంట‌ల్ గా మా అమ్మ‌, పెళ్ల‌య్యాక మా ఆయ‌న‌..”, రాజేశ్వ‌రి గొంతులో వ‌చ్చిన మార్పు మోహ‌న్రావుకి అర్థ‌మైంది. న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడి స‌రిపెట్ట‌కుండా అలా ప‌చ్చిగా బ‌య‌ట‌ప‌డిపోయేవాళ్ల‌తో ఆయ‌న‌కి గ‌తంలో ఎప్పుడూ అంత‌గా అచ్చిరాలేదు.  వెంట‌నే బాణీ మార్చి, “అవ‌న్నీ ఇప్పుడు ఎందుక‌మ్మా” అన్నాడు, అమ్మా అన్న ప‌దాన్ని వొత్తి ప‌లుకుతూ.

అత‌ని మాట‌లు ప‌ట్టించుకోకుండా రాజేశ్వ‌రి చెప్పుకుపోతోంది. “మా బ్యాచ్‌లో నాతో పాటు చ‌దివిన ప్ర‌మీల‌, రాణి, సునంద‌, కృష్ణ‌వేణి అంద‌రం ఇప్ప‌టికీ ట‌చ్‌లోనే వున్నాం. అన్ని విష‌యాలూ షేర్ చేసుకుంటూనే వుంటాం. ఎవ‌రూ ఏమీ మ‌ర్చిపోలేదు”. చెప్ప‌డం ఆపి అత‌నివైపు చూసింది. అత‌ని మొహంలో కంగారు పైకే క‌నిపిస్తోంది.

“వేరేవాళ్లెవ‌రితోనూ చెప్పుకోలేని విష‌యాలు. చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌ని విష‌యాలు. అందంరం నోరు మూస్కోనే వున్నాం. ఒక్క కృష్ణ‌వేణి మాత్రం వాళ్లింట్లోవాళ్ల‌కి చెప్ప‌డానికి రెడీ అయ్యింది. ఆ విష‌యం తెలిసి, మీరు కృష్ణ‌వేణి వాళ్ల నాన్న‌ని పిలిపించి ‘మీ అమ్మాయి కాల‌నీ కుర్రోళ్ల‌తో తిరుగుతోంది. అదుపులో పెట్టుకోక‌పోతే ప‌రిస్థితి చేయి దాటిపోద్ది’ అని చెప్పారు. అదే ఆఖ‌రిరోజు ఆ పిల్ల బ‌డికి రావ‌డం.  ఆ త‌ర్వాత కృష్ణ‌వేణి ఎంత మొత్తుకున్నా దాన్ని గ‌డ‌ప దాట‌నివ్వ‌లేదు. అంతా మీ వ‌ల్లే”, ఆపి అత‌ని మొహంలోకి చూసింది.

“నువ్వేం మాట్లాడ‌త‌న్నావో నాక‌ర్థం కావ‌ట్లేదు. అస‌లు నువ్వెవ‌రో కూడా గుర్తు రావ‌ట్లేదు నాకు. ఇక నువ్వు బ‌య‌ల్దేరితే మ‌ర్యాద‌గా వుంట‌ది”, లేచి నిల‌బ‌డుతూ కోపంగా అన్నాడు మోహ‌న్రావు.

“కొంచెం పెద్ద‌య్యి, వూహ తెలిసిన త‌ర్వాత‌.. మీకు ఎదురుప‌డి, ‘చిన్న‌ప్పుడు ఎందుక‌లా చేశారు?’ అని అడ‌గాల‌ని అనుకునేదాన్ని. ఇంకొంచెం పెద్ద‌యింత‌ర్వాత.. అస‌లేం జ‌ర‌గ‌లేద‌నీ, నేనే లేనిపోనివి వూహించుకుంటున్నాన‌నీ న‌మ్మ‌డానికి ప్రయ‌త్నించేదాన్ని.  నా వ‌ల్ల కాలేదు. నా జీవితంలో ఎవ‌రు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టినా మీరు గుర్తుకొచ్చేవారు. మీరు అలా చేసుండ‌క‌పోతే ఆ త‌ర్వాత కూడా ఎవ‌రూ నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించేవారు కాదేమో అనిపించేది నాకు. అలా అనుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని తెలుసు నాకు”. విర‌క్తిగా ఒక చిరునవ్వు న‌వ్వి, చెప్ప‌డం కొన‌సాగించింది.

“ఇన్నాళ్లూ ఏ మూలో ఒక ఆశ వుండేది నాకు. న‌న్ను చూడ‌గానే మీకు మీరు చేసిన త‌ప్పు జ్ఞాప‌కం వ‌స్తుంద‌నీ, ఏడుస్తూ క్ష‌మించ‌మ‌ని నా కాళ్ల‌మీద ప‌డ‌తార‌నీ ఏదోదో వూహించుకునేదాన్ని. అస‌లు మిమ్మ‌ల్ని క‌ల‌వ‌కుండా అదే భ్ర‌మ‌లో వుండిపోయినా బావుండేది. ఇప్పుడు యివ‌న్నీ మాట్లాడి, వెన‌క్కి తిరిగెళ్లిపోతే యిన్నాళ్ల నా బాధ యింకా ఎక్కువైపోతుంది”. ఏదో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆమె మొహంలో క‌నిపించిన ఎక్స్ప్రెష‌న్ చూసి మోహ‌న్నావు గాభ‌రాప‌డ్డాడు.

“నేను చేసింది త‌ప్పే. బుద్ధి గ‌డ్డి తిని నీతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాను. న‌న్ను క్ష‌మించు. కావాలంటే నీ ఫ్రెండ్స్ అంద‌రికీ సారీ చెపుతాను. న‌న్ను బ‌జారుకీడ్చొద్దు”, ఆల్మోస్ట్ ఏడుస్తున్న గొంతుతో బ‌తిమ‌లాడ‌డం మొద‌లెట్టాడు.

“మీ ప‌రువు పోయినంత మాత్రాన నా మ‌న‌శ్శాంతి నాకు తిరిగొస్తుందా.  చూస్తూ చూస్తూ యీ వ‌య‌సులో  మిమ్మ‌ల్ని న‌లుగురిలో అల్ల‌రిపెట్టి, నేనూ అల్ల‌రిపాలు కాలేను. క‌నీసం ఆ చావు న‌న్ను క‌రుణించినా బావుణ్ను.అదే జ‌రిగితే, అప్పుడు మాత్రం మిమ్మ‌ల్ని పీక్కు తిన‌కుండా వ‌దిలిపెట్ట‌ను”. అత‌నిలో వ‌ణుకు మొద‌లైంది. నేల‌మీద కూల‌బ‌డి రాజేశ్వ‌రి కాళ్ల‌కి ద‌ణ్నం పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు.

“వ‌ద‌లండి. ఏం పనులివి?  నేను బ‌తికున్నంత‌వ‌ర‌కూ మీకు నాతో ఎలాంటి స‌మ‌స్యా వుండ‌దు. నేను చ‌చ్చాక మాత్రం మిమ్మ‌ల్ని సాధించ‌కుండా వ‌ద‌లుతాన‌ని అనుకోకండి”, అంటూ అక్క‌ణ్నించీ వెళ్లిపోయింది.

రాజేశ్వ‌రికి ఏదోవొహ‌టి చెప్పి ఆపేసి, త‌న‌తోపాటే వుంచుకొని ఆమె ప్రాణాల‌కి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాల‌నీ, త‌న శేష‌జీవితం హాయిగా గ‌డ‌వాలంటే అదొక్క‌టే మార్గ‌మ‌నీ అనిపించింది మోహ‌న్రావుకి.

*****

రాజేశ్వ‌రి వ‌చ్చివెళ్లి రెండువారాల‌య్యింది. మోహ‌న్రావు ఆరోజునుండీ మామూలు మ‌నిషి కాలేక‌పోయాడు. పాతికేళ్ల త‌ర్వాత ఒక అమ్మాయొచ్చి అప్పుడెప్పుడో జ‌రిగిన విష‌యాల‌న్నీ తోడ‌డం, చావ‌డం గానీ జ‌రిగితే అంత తేలిగ్గా వ‌దిలిపెట్ట‌న‌ని వార్నింగివ్వ‌డం అంతా క‌ల‌లో జ‌రిగిన‌ట్టే వుంది. ఆ అమ్మాయి గుర్తుచేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఏదైనా అబ‌ద్ధం వుండుంటే అంతా ట్రాష్ అని కొట్టి ప‌డేసి వుండేవాడేమో. కానీ, రాజేశ్వ‌రి చెప్పిన‌దాంట్లో వీస‌మెత్తు కూడా క‌ల్పితం లేదు. ఇందీవ‌రాక్షుని వృత్తాంతం అంటూ స్ప‌ష్టంగా నాటకం పేరు కూడా చెప్పిందయ్యే..! అంత‌టితో ఆపుతుందా? అంద‌రికీ టాంటాం చేసి పరువు తీస్తుందా? మ‌నిషి చూడ‌బోతే చాలా ఎమోష‌నల్ టైపులా వుంది.  త‌న పేరు రాసిపెట్టి ఏదైనా అఘాయిత్యం చేసుకుచ‌స్తేనో. ఇలాంటి అనుమానాల‌తో మోహ‌న్రావుకి నిద్ర క‌రువ‌య్యింది. ఆక‌లి చ‌చ్చిపోయింది. ఎప్పుడు చూసినా మ‌నిషి ప‌ర‌ధ్యానంగా ఏదో లోకంలో వున్న‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌సాగాడు.

రాజేశ్వ‌రి ఉదంతం జ‌రిగిన ప‌దిహేనో రోజు ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు మోహ‌న్రావుని క‌ల‌వ‌డానికి వ‌చ్చాడు. “ఎవ‌రు మీరు? ఏం కావాలి?”  నిరాస‌క్తంగా అడిగాడు మోహ‌న్రావు.

“నా పేరు నాగ‌రాజు”, చెప్పాడ‌త‌ను. అయితే ఏంట‌ట అన్న‌ట్టు విసుగ్గా చూశాడు మోహ‌న్రావు. “నేను రాజేశ్వ‌రి భ‌ర్త‌ని”, అన్నాడ‌త‌ను. ఆ మాట‌లు వింటూనే మోహ‌న్రావు వొళ్లంతా చ‌చ్చుబ‌డిపోయిన‌ట్లు అనిపించింది. రెండు నిముషాల‌య్యాక తేరుకొని “రాజేశ్వ‌రి ఎవ‌రు?  నాకు ఏ రాజేశ్వ‌రీ తెలియ‌దు”, అన్నాడు. అత‌ని గొంతు నూతిలోనుండీ వ‌స్తున్న‌ట్లు బ‌ల‌హీనంగా వుంది.

మోహ‌న్రావు మాట‌లకి ఆ వ్య‌క్తి ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టు క‌నిపించాడు. అంత‌లోనే బాధ‌గా మొహం పెట్టి చెప్ప‌సాగాడు, “రాజేశ్వ‌రికి ఎందుకో మొద‌ట్నించీ మీరంటే చాలా అభిమానం. త‌న మాట‌ల్లో త‌ర‌చూ మీ పేరు ప్ర‌స్తావిస్తూ వుండేది. ఎప్ప‌టికైనా మిమ్మ‌ల్ని మ‌ళ్లీ క‌లుసుకోవాల‌ని ఆరాట‌ప‌డేది.  ఒక నెల క్రితం అనుకుంటా మీరీ వూళ్లోనే వున్నార‌ని తెలిసి చాలా సంతోష‌ప‌డింది. కానీ, చివ‌రికోరిక తీర‌కముందే నా రాజేశ్వ‌రి విధి ఆడిన వింత‌నాట‌కంలో పావులా మారిపోయింది. గుండెపోటు రూపంలో కాలస‌ర్పం నా రాజీని క‌బ‌ళించింది.. త‌ను మిమ్మ‌ల్ని క‌ల‌వాల‌నుకున్న విష‌యం క‌నీసం మీ చెవిన వేస్తే రాజేశ్వ‌రి ఆత్మ శాంతిస్తుంద‌ని అనిపించి, మీ ద‌గ్గ‌రికి వ‌చ్చాను..”,  బాధ‌తో పూడుకుపోయిన గొంతులోనుండీ అతి క‌ష్ట‌మ్మీద బ‌య‌టికొస్తున్నాయి మాట‌లు.

కానీ, మోహ‌న్రావు అదేమీ ప‌ట్టించుకునే స్థితిలో లేడు. రాజేశ్వ‌రి క‌న్నుమూసింద‌న్న‌ మాట ద‌గ్గ‌రే అత‌ని మెద‌డు ప‌నిచేయ‌డం ఆగిపోయింది. నేను బ‌తికున్నంత‌వ‌ర‌కూ మీకు నాతో ఎలాంటి స‌మ‌స్యా వుండ‌దు. నేను చ‌చ్చాక మాత్రం మిమ్మ‌ల్ని సాధించ‌కుండా వ‌ద‌లుతాన‌ని అనుకోకండి రాజేశ్వ‌రి మాట‌లు చెవుల్లో గింగురుమంటున్నాయి.  నాగ‌రాజు త‌ర్వాత ఏదేదో మాట్లాడ్డం, కాసేప‌టికి లేచి వెళ్లిపోవ‌డం యివేమీ మోహ‌న్రావుకి ప‌ట్ట‌లేదు.  ఇర‌వై నాలుగ్గంట‌లు తిర‌క్కుండానే మోహ‌న్రావుకి పిచ్చెక్కింది.  ఆయ‌న‌లాగా మొన‌గాడితనంగా తెలుగు పాఠం చెప్పేవోడు జిల్లాలో కాదు వోల్ స్టేటులోనే లేడు అని మ‌ళ్లొక‌సారి గుర్తు చేసుకున్నారు అత‌న్ని ఎరిగున్న జ‌నం.

*****

“కాసేపైనా  రాజేశ్వ‌రి మొగుణ్న‌ని చెప్పుకోడం నాకు బాగానే వుంద‌నుకో. కానీ, అస‌లు నువ్వు చ‌చ్చిపోయిన‌ట్లు ఆ ముస‌లిపంతులుకి ఎందుకు చెప్ప‌మ‌న్న‌ట్టు? అలా చెప్పిన‌ట్లు మీ ఆయ‌న‌కి కూడా తెలియ‌నివ్వ‌కుండా ఎందుకు దాచిపెట్టిన‌ట్టు?  నాకేం అంతు ప‌ట్ట‌డం లేదు”, అయోమ‌యంగా అడిగాడు నాగ‌రాజు. “ అంత అంతుప‌ట్ట‌ని వాడివి నేను చెప్పిన నాలుగు ముక్క‌లూ క‌క్కేసి రాకుండా..  విధి ఆడిన వింత‌నాట‌కం, కాల‌స‌ర్పం క‌బ‌ళించ‌డం లాంటి హెవీ డైలాగ్స్ ఎందుకు వాడిన‌ట్టో”, ప‌గ‌ల‌బ‌డి న‌వ్వింది రాజేశ్వ‌రి. “ఆ మాత్రం ఇంప్ర‌వైజేష‌ను చేయ‌లేక‌పోతే రాజేశ్వ‌రి ఫ్రెండునెలా అవుతాను?”, సిగ్గు అభిన‌యిస్తూ బ‌దులిచ్చాడు నాగ‌రాజు.

మోహ‌నరావుకి పిచ్చెక్కిన సంగతి తెలిస్తే, అత‌ని కార‌ణంగా బ‌డి మానేసిన కృష్ణ‌వేణి సంతోషిస్తుందా? అప్ప‌టి విష‌యాల‌న్నీ గుర్తుచేసి అన‌వ‌స‌రంగా దాన్ని బాధ పెట్టిన‌ట్టు అవుతుందా?

*

శ్రీధర్ బొల్లేపల్లి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలిసీ తెలియని వయసులో చేసిన పిల్లల పై చేసిన లైంగిక వేధింపులు ఆ పిల్లలనకు చాలా కాలం మానసిక వేదన కలుగజేస్తాయి. రాజేశ్వరి చేసినది తప్పేమీ కాదు. మంచి కథ.

  • కథ బాగుంది, కానీ అన్నేళ్లతర్వాత తను అతడికి పిచ్చెక్కించి ఏం సాధించింది?

    రాజేశ్వరి వెళ్లిపోయాక అతడు మనోవ్యకులత తో మంచంపట్టిపోయుంటే సరిపోయేదేమో?

    చావడం, దయ్యం అయి పీక్కుతింటుందేమో అనే భయంతో పిచ్చెక్కడం కాస్త కొనసా గింపేమో అనిపించింది.

    బహుశా గతాన్ని తలచుకుని కుళ్లిచావడం కంటే శిక్ష ఏమీ ఉండదేమో!

    ఆ వయసులో కూడా మళ్లీ చీరకట్టంమటుందేమో అనే ఆలోచన వచ్చేంత దారుణమైన ఆలోచనలున్నవాడు చచ్చాక వదల్నంటే భయపడతాడా?

    ఇవీ ఓ కథ చదివాక నా ఆలోచనలు.

    మొత్తంగా ఒక మంచి పాయింట్ మీద ఆ వృత్తిలో ఉంటూ అందులోని దౌర్భాగ్యాలను విషయంగా తీసుకుని కథచెప్పడం, నెరేషనూ చాలా బాగున్నాయి.

  • ఇలాంటి చెప్పుకోలేని బాధలు ఎన్నెన్నో కదా ఆడపిల్లలకి!అందరికీ రాజేశ్వరి లాగా కక్ష తీర్చుకునే అవకాశం వస్తే బావుణ్ణు

  • ఇలాంటి మోహనరావులెందరో రకరకాల రూపాలలో తారసపడుతూనే ఉంటారు. రాజేశ్వరి చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయం, తన పథకాన్ని అవలంభించిన తీరు అభినందనీయం.

    నాకు తెలిసిన అద్భుతమైన రచనా శైలి గల రచయితల్లో మీరూ ఒకరు. మీకెలా నుంచి ఇంకా ఎన్నో ఆలోచింపజేసే రచనలు రావాలని కోరుకుంటున్నాను శ్రీధర్ గారు. అభినందనలు.

  • This is certainly your best so far .చాలా పకడ్బందీగా రాశారు .తెలుగు మాష్టర్లవల్ల ఏదో ఒక రేంజిలో బాధపడని ఆడపిల్లలు ఉండరేమో !మా కాలేజి రోజుల్లో అసభ్యమైన కథలు చెప్తూంటే ఆయన క్లాసులు బాయ్ కాట్ చేయడమే ,ఆ విషయం ఆయనకే మొహం మీద చెప్పిన బ్యాచ్ మాది .ఫీల్ గుడ్ స్టోరీ.

  • ఓ క్షణం నేను ఆలోచనలో పడ్డా ఇలా కూడా ఫీలౌతారా ఆడపిల్లలు అని
    హ్మ్మ్మ్మ్ కానీ రాజేశ్వరి లా కృష్ణవేణిలా ప్రమీల లా కాకుండా ఆడపిల్లలు ఉండకూడదు.
    మొదటే నివారించాలి. చేసేపని తప్పైనపుడు ఎదట ఉన్నది మాష్టారైన తండ్రైనా బాబాయో మామయ్యో అయినా ఎవరైనా సరే ఆ స్పర్శ ఇబ్బంది పెట్టినపుడు ఊరుకోకూడదు. అప్పుడే అక్కడే నిలదీయాలి. బహుశా ఆ తెగింపు వల్ల ఇంకొందరు ఆడపిల్లలు ఇలాంటి పీడకలకు లోను కాకుండా ఉంటారేమో.

  • ప్రతి ఆడపిల్ల జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే పీడకల, చాలా మంది మగవాళ్ల లో వున్న వున్న వికారం చాలా బాగా చెప్పారు.
    రచయిత భాష, భావం,శైలి దేనిని మెచ్చుకోవాలో, ఎలా మెచ్చుకోవాలో నా స్థాయి సరిపోదనిపిస్తుంది. ఈకాలంలో ఇంత మనసుకు నచ్చేలా రాసిన రచయిత కు అభినందనలు

  • most of these “sexual advances/overtures” done by the teachers/lecturers/professors go unnoticed/ unreported in schools/colleges/universities for various reasons; even in case of escalating/reporting it is the victim who is at the receiving end. Reason is the bully/tormentor/violator/molester in most of these cases is always at advantageous position. Besides that the “stigma of victim blaming” which is prevalent in our society.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు