2008-2018: తెలుగు సినిమాని మలుపు తిప్పిన దశాబ్దం

తెలుగు సినిమా ఇప్పుడు కొత్త ఆశలతో చిగురిస్తోంది. అంతా మన మంచికే.

“It was the best of times, it was the worst of times…”

సినిమాలంటే ఇష్టంలేని తెలుగువాళ్లని నేను ఇంతవరకూ కలవలేదు. సినిమా మొదలైన నిమిషం నుంచీ, చివరి వరకూ లైవ్ అప్డేట్స్ అంటూ రన్నింగ్ కామెంట్రీ ఇచ్చే స్థాయికి మన ఫ్యాన్స్ ఎదిగిపోయారు. ఇలాంటి పరిస్థితి నేనెక్కడా చూడలేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో సినీ ప్రేమికులుంటారు కానీ, తెలుగువాళ్లంత సినిమా పిచ్చోళ్లని నేనెక్కడా చూడలేదు. మరీ అంతకాకపోయినా నేనూ పెద్ద సినిమా పిచ్చోడినే. గత పదిహేనుళ్లుగా రోజుకొక సినిమా అయినా చూడకుండా ఉన్న రోజులు చాలా తక్కువ అని చెప్పాలి. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ, సినిమాలు చూస్తూ, సినిమా రివ్యూలు రాసుకుంటూ ఉన్న నాకు 2008లో ఒకరోజు జ్ఞానోదయం అయింది. సినిమాలు చూడడం కాదు. సినిమా నిర్మాణంలో నేనూ ఒక భాగం కావాలనుకున్నాను. 2009 లో ఇండీయా వచ్చేశాను. ఇప్పటికి దాదాపు పది సంవత్సరాలయింది, ఈ పదేళ్లలో తెలుగు సినిమా పరిశ్రమను అతిదగ్గరగా చూసిన వాడిగా నేను పంచుకోవాలనుకుంటున్న కొన్ని అనుభవాలు, జ్ఞాపకాలు ఇవి.

2008లో నేను UK లో ఉన్నాను. ఎప్పుడో పెద్ద హీరోల సినిమాలు తప్పితే అన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేవి కావు. అది కూడా నేనుండే ఊరినుంచి లండన్ వెళ్లి సినిమా చూసి రావడమంటే పెద్ద పని. ట్రావెల్, టైం, మనీ ఇలా ఎన్నో విషయాలకు ముడిపడి ఉన్న అంశం అది. అంత కష్టపడీ వెళ్లి సినిమా చూసొచ్చాక కలిగిన నిరాశను ఏ కొలతల్లో చెప్పాలో తెలియదు కానీ, ఒక రకమైన వైరాగ్య స్థితిలోకి వెళ్లిపోయేవాడిని. వైరాగ్య స్థితి అని ఎందుకంటున్నానంటే, కేవలం వైరాగ్యం వల్ల మాత్రమే మనిషిలో కోరికలు నశించి విముక్తి పొందగలుతాడు కాబట్టి. కానీ ఆ స్థితిలోనుంచి బయటకు రావడానికి ఇట్టే టైం పట్టేది కాదు. అందుకు కారణం కూడా సినిమానే. 2007లో నాకు లండన్ చలన చిత్రోత్సవంలో అక్రెడిట్ ప్రెస్ మెంబర్ గా సినిమాలు చూసే అవకాశం వచ్చింది. అక్కడ చూసిన కొన్ని సినిమాల ద్వారా కొత్త సినిమా ప్రపంచానికి దారులు తెరుచుకున్నాయి. ఇప్పుడంటే నెట్ ఫ్లిక్స్ లో ఆన్లైన్ లో సినిమాలు చూడొచ్చు కానీ, ఆ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే నెలకు ఎన్ని కావాలంటే అన్ని డివిడిలు ఇంటికి తెప్పించుకునే ఒక రెంటల్ సర్వీస్. అలా నెట్ ఫ్లిక్ లో తెప్పించుకున్న ప్రపంచ సినిమా చూస్తూ వైరాగ్య స్థితి నుంచి బయటపడేవాడిని. అంతే కాకుండా అప్పట్లో విడుదలైనా కొన్ని హిందీ సినిమాలు – ఏ వెనెస్ డే, రాక్ ఆన్, ఓయ్ లక్కీ ఓయ్, ముంబై మేరీ జాన్, ఆమీర్ లాంటివి చూసి కొంత ఆశావాదాన్ని పెంపొందించుకునేవాడిని. అదంతా మరో తెలుగు సినిమా చూసే వరకే. ఛార్ల్స్ డికెన్స్ మాటల్లో చెప్పాలంటే – “It was the best of times, it was the worst of times…”

ఆ సమయానికి ప్రపంచ సినిమాలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకూ హాలీవుడ్ తీసే ఇంగ్లీష్ సినిమాలు తప్పితే మిగిలిన దేశాల సినిమాలు ఇతరులకు అందుబాటులో ఉండేవి కావు. కానీ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, టొరెంట్ టెక్నాలజీల కారణంగా అందరికీ ప్రపంచ సినిమా దగ్గరైంది, రొమానియా దేశపు సినిమా పరిశ్రమ గురించి ఏ మాత్రం పరిచయం లేకపోయినా, 2008 లో వచ్చిన ఫోర్ మంథ్స్మ్ థ్రీ వీక్స్, టు డేస్ సినిమాతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా రొమానియన్ సినిమా వైపు దృష్టి సారించింది. అదొక్కటే కాదు. అంతకుముందు సంవత్సరాల్లో వచ్చిన కొన్ని సినిమాలు సినీ ప్రేమికులను ఆయా దేశాల సినిమాల మీద దృష్టి సారించేలా చేశాయి. మన దేశంలో కూడా బాలీవుడ్, తమిళ్, మలయాళం, మరాథీ, బెంగాలీ సినీ పరిశ్రమలో కొత్త దర్శకులు రావడంతోపాటు, కొత్త రకమైన సినిమాలు రావడం మొదలు పెట్టాయి. కానీ తెలుగు సినిమా మాత్రం ఒక మూసలో ఇరుక్కునిపోయి ఒకే రకమైన సినిమాని మళ్లీ మళ్లీ తీయడంలో మునిగిపోయుంది. ప్రపంచం మొత్తానికి it was the best of times. కానీ తెలుగు సినిమాకి worst of times లా అనిపించేది.

దిశమార్చిన గమ్యం-2008

అయితే ఎక్కడో లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టనెల్ లాగా శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ ఏలేటి లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రం కొంత ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కమర్షియల్ సినిమా పరిధిలో సుకుమార్, రాజమౌళి లాంటి కొంతమంది దర్శకులు కొత్త హంగులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఇలాంటి సమయంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ’గమ్యం’ (2008) సినిమా తెలుగు సినిమా గతిని మార్చే సినిమా అవుతుందని ఆ రోజు ఎవరూ అనుకుని ఉండరు. అమెరికాలో చదువుకుని, అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇండియాకి తిరిగివచ్చి సినిమాలు తీయాలనుకునే వారి సంఖ్య అప్పటికే చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, ఆలోచనని ఆచరణ రూపంలోకి తెచ్చిన మొదటివాళ్లలో క్రిష్ ఒకడు. అదే సంవత్సరంలో వచ్చిన ’అష్టా చెమ్మా’ సినిమా కూడా తెలుగు సినిమా ప్రయాణిస్తున్న దిశని మార్చే సినిమాగా మనం పేర్కొనవచ్చు. విడేశాలలో సినిమా కళను అభ్యసింది, ఇండియాకి తిరిగొచ్చి సినిమాలు తీయాలనుకున్న తెలుగు వాళ్లలో అప్పటికి శేఖర్ కమ్ముల ఒక్కరే ఉండేవాళ్లు. ’అష్టా చెమ్మా” సినిమాతో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆ లిస్ట్ లో రెండవ దర్శకుడయ్యాడు.

అంతే కాకుండా, ఐఐఎం లో చదువుకుని సురేష్ ప్రొడక్షన్స్, యూటివి లాంటి సంస్థల్లో పనిచేసిన అనుభవంతో రాంమోహన్ అనే నూతన నిర్మాత పూర్తిగా కొత్తవాళ్లతో నిర్మించిన ’అష్టా చెమ్మా’ హిట్ కావడం ఒక కొత్త పరిణామం. ఇప్పుడొచ్చిన ’జెర్సీ’ సినిమా చూస్తుంటే – ’అష్టా చెమ్మ’ సినిమా ద్వారానే కదా తెలుగు సినిమాకి నాని లాంటి అద్భుతమైన నటుడు పరిచయమైంది అని గుర్తుంచుకోవాలి. ఆ సంవత్సరంలోనే జరిగిన మరొక వినూత్న ప్రయత్నం, సాయికిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన ’వినాయకుడు’ సినిమా. 2008లో విజయవంతం అయిన ఈ మూడు సినిమాలు ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమాని ఎంతో ప్రభావితం చేశాయి. ఆ సంవత్సరంలో వచ్చిన ’ఆవకాయ బిర్యాని (అనీష్ కురువిల్లా)’ , ‘నచ్చావులే (రవిబాబు)’, ’కొత్తబంగారు లోకం(శ్రీకాంత్ అడ్డాల)’ లాంటి కొన్ని సినిమాలు మార్పుకి స్వాగతం పలికినట్టుగా అనిపించాయి.

మగధీర ప్రభావం-2009

మూస పద్ధతిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా అవతలి వైపు నుంచి వచ్చే సమాధానం ఒక్కటే – సినిమా అంటే వ్యాపారం. డబ్బులు పోగొట్టుకుని ఎవరూ కళని పోషించలేరు అని. అయితే కమర్షియల్ సినిమాని పూర్తిగా ఆపేసి కళాత్మకమైనా సినిమాలే రావాలని ఎవరూ అనరు. వినోదాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి. చెప్పిన కథే చెప్పడం. అంతకుముందు హిట్ అయిన సినిమానే రీమిక్స్ చేయడమే ప్రేక్షకుల అసహనానికి కారణం. కమర్షియల్ సినిమాలు ఉండాలి. అందులో ఉండాల్సిన మసాలాలు అవీ ఉండాలి. కానీ వాటితో పాటు అప్పుడప్పుడూ మనసుకి హత్తుకునే కథలూ కావాలి. కొంత సామాజిక స్పృహ ఉన్న సినిమాలు రావాలి. ఒక దర్శకుడు తను అనుకున్న కథను ఉన్నదున్నట్టుగా చెప్పే అవకాశమూ ఇవ్వాలి. కళ-వ్యాపారం రెండూ బ్యాలెన్స్ కావాలనేదే చాలా మంది కోరుకునేది, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో రెండు రకాల సినిమాలకీ అవకాశం ఉంటుంది. తెలుగులోనే ఏ మాత్రం కళాత్మక అంశాలున్నా ఆర్ట్ సినిమా అని కొట్టి పారేసే సమయం అది. అంతే కాకుండా ’అరుంధతి’, ’మగధీర’ లాంటి రెండు పెద్ద సినిమాలు భారీ విజయం సాధించడమే కాకుండా భారతదేశమంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేశాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలు తెలుగు సినిమాకి ఒక ప్ర్తత్యేకతను తెచ్చిపెట్టాయి. ఇలాంటి సమయంలో కూడా చైతన్య దంతులూరి దర్శకత్వంలో వచ్చిన ’బాణం (చైతన్య దంతులూరి)’ సినిమా కొత్త రకం సినిమా గా అందరి దృష్టిని ఆకర్షించింది.

మహా ప్రస్థానం – 2010

ఎవరో కొద్ది మంది దర్శకులు మాత్రమే కొత్త తరహా సినిమాల వైపు చూస్తున్న రోజులవి. ఒక వైపు తమిళ్ లో శశికుమార్, సముద్రఖని లాంటి దర్శకులు తీసిన ’సుబ్రమణ్యపురం’, ’నాడోడిగల్’ సినిమాలతో ఒక కొత్త శకం మొదలైపోయింది. గౌతం మీనన్ అప్పటికే ఎన్నో మంచి సినిమాలు తీశారు. ’అంగాడి తెరు’, ’అరణ్యకాండం’, ’మైనా’ లాంటి సినిమాలతో కొత్త రకం సినిమాలు, కొత్త దర్శకులు పరిచయమయ్యారు. కానీ తెలుగులో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. క్రిష్ తీసిన ’వేదం’ మల్టిపుల్ నేరేటివ్ పద్ధతిలో వచ్చిన ఒక అరుదైన తెలుగు సినిమా. అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలో పేరున్న నటీనటులు నటించడానికి ముందుకురావడం తెలుగు సినిమాకి ఒక పెద్ద మలుపు. రానా ని నటుడిగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల తీసిన ’లీడర్’ సినిమా తెలుగులో వచ్చిన పొలిటికల్ సినిమాల్లో ఉత్తమమైన వాటిల్లో ఒకటిగా మిగిలిపోయింది. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం ఉన్న గౌతం మీనన్ తీసిన మొదటి తెలుగు చిత్రం ’యే మాయ చేశావే.’ రొమాన్స్ ని తెరకెక్కించడంలో కొత్త ప్రయోగం.

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వదిలేసుకుని సినిమా దర్శకులు అవ్వాలని వచ్చిన మధుర శ్రీధర్ తీసిన ’స్నేహ గీతం’ రియలిస్టిక్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా అమెరికా నుంచి తిరిగొచ్చిన దేవ కట్టా తీసిన ’ప్రస్థానం’ ఒక సంచలనం కాబోయి ఆగిపోయింది. తెలుగు సినిమా అంటే, కామెడీ ట్రాక్ ఉండాలి, హీరోయిన్ తో రొమాన్స్ తప్పక ఉండాలి, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్ తప్పదు లాంటి పాత నియమాల ప్రకారం నడుస్తున్న రోజుల్లో, కథ, కథనం, పాత్ర చిత్రణలకు ప్రాముఖ్యం ఇస్తూ వచ్చిన సినిమా ’ప్రస్థానం’.

‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా.  కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న తెలుగు పరిశ్రమ, అగాధపు అంచులు అందుకుంటున్న ఈ తరుణంలో వచ్చిన ఒక చల్లని తెమ్మెర దేవ కట్టా.  సంచలనాల్ని నమ్మే ప్రరిశ్రమలో స్వయంకృషిని నమ్ముకునొచ్చిన కార్యశీలి దేవ.

అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రెండు రోజుల్లో చూసిన ప్రేక్షకులు – సినిమా బావుంది. కానీ కమర్షియల్ అంశాలు అనవసరంగా ఇరికించారనే ఫీడ్ బ్యాక్ రావడంతో, ఆ సన్నివేశాలను తొలగించారు. ఇది చాలా గొప్ప పరిణామం. ఏ అంశాలైతే ఉంటే తెలుగు సినిమాలు ఆడుతాయని అన్నారో, ఆ అంశాలు ఉండడం కారణంగానే ఒక సినిమా ఆడడం లేదు అని తెలుగు సినిమా మొదటిసారి గుర్తించింది ఈ సినిమాతోనే. ఈ సినిమా విజయవంతమై ఉంటే తెలుగు సినిమా ఎప్పుడో కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టేది. దురదృష్టవశాత్తూ ఈ సినిమా ఒక ప్రయోగంగానే నిలిచిపోయింది.

అలా మొదలైంది – 2011

మార్పు వచ్చినట్టే వచ్చి మళ్లీ కథ మొదటికి వచ్చిన సంవత్సరం 2011. అంతకుముందు వచ్చిన మూడు సంవత్సరాల్లో జరిగిన ప్రయోగాలేవీ 2011 లో పెద్దగా జరగలేదు. 2011 లో వచ్చిన ’అలా మొదలైంది’ సినిమాతో తెలుగులో చాలా రోజుల తర్వాత నాని అనే మంచి నటుడు అందరి కళ్లల్లో పడ్డాడు. అంతే కాదు. చాల రోజుల తర్వాత నందిని రెడ్డి దర్శకురాలిగా ముందుకొచ్చింది ఈ సినిమాతోనే. కానీ ఎవరికీ తెలియకుండా లోలోపల తెలుగు సినిమా కొత్త దారులు వెతుక్కుంది ఈ సంవత్సరంలోనే.

అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినిమా నిర్మాణం ఫిల్మ్ రీల్ నుంచి డిజిటల్ సినిమా వైపు మళ్లుతోంది. గతంలోలాగా పెద్ద పెద్ద లైట్లు, కెమెరాలు లేకుండానే అరచేతిలో పట్టేటంతటి డిజిటల్ కెమెరాతో పూర్తి స్థాయి చలనచిత్రాలు నిర్మించొచ్చని అందరికీ అర్థమయింది. తెలుగులో అంతకుముందు ఐదారు సంవత్సరాల క్రితమే, దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి, సినిమాటోగ్రాఫర్ పిజివింద కలిసి ’గ్రహణం’ అనే సినిమాని డిజిటల్ టెక్నాలజీతో నిర్మించారు. కానీ అదొక ప్రయోగంగానే మిగిలిపోయింది. కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు తన సినిమాల్లో వాడుతూ వచ్చిన రాం గోపాల్ వర్మ ఈ సంవత్సరంలో తీసిన సినిమా ’దొంగల ముఠా’. ఈ సినిమా 5D కెమెరాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే చిత్రీకరించి కొంత సంచలనాన్ని సృష్టించారు. ఇలాంటి సినిమాలో నటించడానికి ఒప్పుకున్న రవి తేజ లాంటి నటులను మనం అభినందించాలి. ఈ సినిమా విజయవంతం కాకపోయినప్పటికీ అందరికీ డిజిటల్ సినిమా మీద ఆసక్తి కలుగచేసిన సినిమా ఇది. అలా 2011 లో డిజిటల్ సినిమా యుగం మొదలైంది.

ఇప్పటి సినిమాలకు పునాది అప్పట్లో వచ్చిన ’ఈ రోజుల్లో’ – 2012

2012 నాటికి తమిళ్ లో షార్ట్ ఫిల్మ్స్ చాలానే వచ్చాయి. వాటిలో కొన్ని యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాయి కూడా. ఆ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చాలామంది యువ దర్శకులు సినిమా అవకాశాలను పొందారు. అలా వచ్చిన వాళ్లలో బాలాజీ మోహన్ ఒకరు. అతను తను తీసిన షార్ట్ ఫిల్మ్ నే పూర్తి స్థాయి సినిమాగా రూపొందించారు. ఇలాంటి మరికొన్ని ప్రయత్నాలు తమళ్ లో విజయవంతం అయ్యాయి. ఇదంతా డిజిటల్ సినిమా టెక్నాలజీ పుణ్యమే. ఇలాంటి సమయంలో మారుతి అనే కొత్త దర్శకుడు ’ఈ రోజుల్లో’ అనే సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించాడు. యాభై లక్షల రూపాయలతో తీసిన ’ఈ రోజుల్లో’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. సినిమా తీయడానికి మంచి కంటెంట్ కావాలి, కోట్ల రూపాయల బడ్జెట్లు అవసరంలేదని ఉదాహరణగా నిలిచిన సినిమా ’ఈ రోజుల్లో.’ అప్పటివరకూ పూర్తిగా ఫిల్మ్ రీల్ ద్వారా సినిమాలు నిర్మించిన రాజమౌళి లాంటి దర్శకులు సైతం డిజిటల్ టెక్నాలజీ వైపు మళ్లారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ’ఈగ’ సినిమాతో ప్రపంచానికి తెలుగు సినిమాని పరిచయం చేసింది. చాలా రోజుల తర్వాత సాహిత్యం నుంచి తీసుకున్న కథతో నిర్మించిన ’మిధునం’ సినిమా కొంతమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అన్ని మసాలాలు కలిపి కలగాపులగం చేసే తెలుగు సినిమాని పద్ధతి ప్రకారం ఏ జాన్రా అనుకుంటే ఆ జాన్రా లో పూర్తిగా సినిమాని నడిపించే అతికొద్ది మంది తెలుగు దర్శకుల్లో ఒకరైన రవిబాబు తీసిన ’అవును’ సినిమా విజయవంతం కావడం ఒక కొత్త మార్పు. హను రాఘవపూడి అనే దర్శకుడు తీసిన ’అందాల రాక్షసి’ సినిమా చూసి విజువల్ పోయెట్రీ అన్నారు ప్రేక్షకులు. బహుశా ఇదే తెలుగులో ఫిల్మ్ రోల్ మీద తీసిన చివరి సినిమా. అచ్చమైన తెలుగు కథగా వచ్చిన ’ఓనమాలు’ సినిమా మంచి రోజులు రాబోతున్నాయనే కొంత ఆశను నిలబెట్టింది.

తెలుగు సినిమా ’ఉయ్యాల జంపాల’ అని ఊగిసలాడిన వేళ : 2013 -2015

తమిళనాడులోలాగే ఇక్కడ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసే కుర్రాళ్ల సంఖ్య ఎక్కువైపోయింది. అప్పటివరకూ సినిమా దర్శకుడిగా ఛాన్స్ కావాలంటే, ఏడేళ్లైనా కనీసం సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, ఆ తర్వాత హీరోల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగి సినిమా చేసేసరికి కనీసం పదేళ్లైనా పట్టేది. కానీ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి, నిర్మాత, హీరోకి చూపించి సినిమా ఛాన్స్ కొట్టేసే యూత్ పరిశ్రమలోకి వచ్చి చేరింది. ఇదే సమయానికి చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో, కొలకత్తాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకొని వచ్చిన కొంతమంది తెలుగువాళ్లు కూడా పరిశ్రమలోకి ప్రవేశించారు. క్రిష్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన జ్ఞానశేఖర్, ఎడిటర్ గా పనిచేసిన శ్రవణ్, FTII లో చదువుకుని వచ్చిన సుధాకర్ రెడ్డి, జయకృష్ణ గుమ్మడి లాంటి వాళ్లు రావడం కూడా తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మార్పుకి కారణం అని చెప్పొచ్చు, ఒక వైపు ఫిల్మ్ స్కూల్స్ లో చదువుకుని వచ్చిన టెక్నీషియన్స్, మరొకవైపు చేతిలో డిజిటల్ కెమెరాతో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఉన్న దర్శకులు. వీళ్లందరి ప్రభావమే 2013లో వచ్చిన ’ఉయ్యాల జంపాల (విరించి)’, ’సెకండ్ హ్యాండ్’, ’ప్రేమ ఇష్క్ కాదల్ (పవన్ సాదినేని)’, ’వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (మేర్లపాక మురళి)’, ’స్వామి రారా (సుధీర్ వర్మ)’ లాంటి సినిమాలు. కొత్త హీరోలా, పెద్ద హీరోలా అని కాకుండా కంటెంట్ ఉంటే జనాలు సినిమా చూస్తారనే నమ్మకం 2013 కలిగించింది.

కానీ చిన్న సినిమా చిన్న సినిమానే, ప్రేక్షకులు ఎప్పటికైనా పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలనే చూస్తారు అని పరిశ్రమ గట్టిగా నమ్మే రోజులవి. అప్పటి మార్పులకు అనుగుణంగా ’చందమామ కథలు (ప్రవీణ్ సత్తారు)’, ’ప్రతినిధి (ప్రశాంత్)’ ’పాఠశాల (మహి)’ ’అలా ఎలా (అనీష్ కృష్ణ)’ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చి పెద్దగా విజయవంతం కాకపోవడంతో, తెలుగు సినిమాలో మార్పు కోరుకునే వారికి2014 ఎంతో నిరాశాజనకంగా ముగిసింది.

2015లో ’బాహుబలి’ విడుదలైంది. తెలుగు సినిమాకి ఎన్నడూలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది. ’శ్రీమంతుడు’, ’టెంపర్’ లాంటి కమర్షియల్ సినిమాలు కూడా కొంత కంటెంట్ ని నమ్మడం మొదలైంది. ’పటాస్’ సినిమాతో అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాని తిరిగి నిలబెట్టాడు. వీటన్నిటి మధ్యలో కూడా కథకు, కథనానికి ప్రాధాన్యమిచ్చిన చిన్న సినిమాలు – ’లేడీస్ అండ్ జెంటిల్మన్ (మంజునాథ్) ’, ’మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (క్రాంతి మాధవ్) ’, ’యెవడే సుబ్రమణ్యం (నాగ్ అశ్విన్)’ ’అసుర (విజయ్ కృష్ణ)’ కూడా వచ్చినప్పటికీ చిన్న సినిమాలకు పెద్ద భవిష్యత్తు లేదనీ, భారీ హంగులున్న పెద్ద సినిమాలే తెలుగు సినిమాని కాపాడతాయని ఉయ్యాల – జంపాల ఊగింది తెలుగు సినిమా ఈ మూడు సంవత్సరాల్లో.

ముచ్చటగా మూడు సినిమాలు – 2016

చిన్న సినిమాకు భవిష్యత్తు ఉందా లేదా అనే ఊగిసలాటలో ఉన్న తెలుగు సినిమాకి మూడు సినిమాలు ఊపిరి పోశాయి. అవి ’క్షణం (రవికాంత్)’ , ’పెళ్లిచూపులు (తరుణ్ భాస్కర్)’, ’అప్పట్లో ఒకడుండేవాడు (సాగర్ చంద్ర).

పివిపి అనే పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించిన ’క్షణం’ సినిమా కి రచయిత, నటుడు అయిన అడవి శేష్, దర్శకుడు రవికాంత్ కలిసి అతి తక్కువ బడ్జెట్ తో సినిమా రూపొందించి భారీ విజయాన్ని అందించారు. కేవలం ఎనభై లక్షల్లో రూపొందించిన ’పెళ్లిచూపులు’ సినిమాని బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అతి తక్కువ బడ్జెట్ లో ఎంతో పెద్ద స్పాన్ ఉన్న కథను ఎంతో చాకచక్యంగా రూపొందించి విమర్శకుల మన్ననలు అందుకున్న సినిమా ’అప్పట్లో ఒకడుండేవాడు.’

తెలుగు సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఎక్కడా రాసి పెట్టిన నియమాలు లేవు కానీ, పరిశ్రమకు కొత్తగా వచ్చిన వాళ్లకు సులభంగా అర్థమయ్యే కొన్ని విషయాలు గట్టిగా అందరి మనసుల్లో నాటుకుని ఉన్న రోజులవి. కామెడీ ఉండాలి. ఐటెం సాంగ్ ఉండాలి, మొహాలు తెలిసిన నటీనటులు ఉండాలి, పాటలు విదేశాల్లో తీయాలు లాంటి అన్ సెడ్ రూల్స్ పాటించక తప్పని రోజులు.

అంతేకాకుండా సినిమా షూటింగులు జరిగే లొకేషన్లు, సినిమాలకు వాడే లైట్లు, ట్రాక్ అండ్ ట్రాలీ లాంటి ఎక్విప్మెంట్ విషయాల్లో కూడా ఇలాంటి అన్ సెడ్ నియమనిబంధనలు ఉండేవి, ఇవి కాకుండా యూనియన్ మెంబర్స్ తోనే పని చెయ్యాలి లాంటి నియమాలు అదనం. ఇటువంటి నిర్బంధ పరిస్థుతులకు వ్యతిరేకంగా నిర్మించబడ్డ సినిమాలు పైన పేర్కొన్న మూడు సినిమాలు.

లొకేషన్ల కోసం లక్షలు ఖర్చు పెట్టి సెట్లు వెయ్యలేదు. అందుబాటులో ఉన్న లొకేషన్లను సినిమాకు తగ్గట్టుగా ఎలా వాడుకోవాలి. రోజుకి ఇంతకావాలి అంతకావాలి అని అడిగే నటీనటులు అవసరం లేదు. కొత్తవాళ్లనే సినిమాలోని ముఖ్యపాత్రలకు ఎన్నుకుంటే చాలు. అన్ని సినిమాలు డబ్బింగ్ చెయ్యనక్కర్లేదు. సింక్ సౌండ్ ద్వారా మరింత నాచురల్గా నటీనటుల చేత నటింపచేయవచ్చు. సినిమా తీయడానికి భారీ ఎక్విప్ మెంట్ అవసరం లేదు, ఉన్నవాటితో కూడా ఎఫెక్టివ్ గా కథని చెప్పొచ్చు – అని ఎన్నో కొత్త విషయాలను ఈ మూడు సినిమాలు తెలుగు సినిమాకి పరిచయం చేశాయి.

విజయ్ నామ సంవత్సరం – 2017

2017 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఈ సంవ్సతరంలోనే ’అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు తెలుగు సినిమా వేసుకున్న సంకెళ్లను పూర్తిగా తొలగించి కొత్త రకమైన సినిమాకు నాంది పలికింది. ఈ సినిమా ద్వారా తెలుగు హీరో కొత్తగా ఆవిష్కృతమయ్యాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ’అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు సినిమాకి ఉండాల్సిన మూస ధోరణులను చెరిపేసింది.

ఈ సంవత్సరంలోనే ’బాహుబలి’ రెండవ భాగం విడుదలై భారతదేశంలోనే నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఇదే సంవత్సరంలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ’ఘాజీ’ సినిమా గతంలో తెలుగులో తీయాలంటే ఆలోచనకు సైతం అందని కలగా ఉండేది. కానీ అలాంటి సినిమాని పూర్తిగా హైదరాబాద్ లో నిర్మించి పలు భారతీయ భాషల్లో విడుదలచేసి విజయవంతం కావడం కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత.

హీరోయిజం జోలికి పోకుండా కథలోని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ’ఫిదా (శేఖర్ కమ్ముల), ’నిను కోరి (శివ నిర్వాణ)’ , ’గురు (సుధ కొంగర) ’, ’నేనే రాజు నేనే మంత్రి (తేజ)’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించనంత విజయం సాధించింది కూడా ఈ సంవత్సరంలోనే.

ఎన్నో విజయవంతమైన సినిమాలు, అందులోనూ కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలే ఎక్కువ శాతం విజయం సాధించడంతో మెల్లగా తెలుగు సినిమా కొత్త కథలు, కొత్త దర్శకుల వైపు దృష్టి సారించింది ఈ సంవత్సరంలోనే.

కేరాఫ్ కొత్త సినిమా – 2018

అప్పటివరకూ మాస్ మసాలా ఎంటర్టైనర్స్ వైపే చూసిన పెద్ద దర్శకులు, హీరోలు సైతం 2018 లో కొత్త కంటెంట్ కావాలని కోరుకున్నారు. ’రంగస్థలం (సుకుమార్)’ లాంటి నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో టాప్ హీరో అయిన రాం చరణ్ నటించడం అందుకు ఉదాహరణ. ’మహానటి (నాగ్ అశ్విన్)’ లాంటి సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి నటులు హీరో హీరోయిన్లుగా కాకుండా తమకు తగ్గ పాత్రల్లో నటించడానికి ఒప్పుకోవడం మరొక ఉదాహరణ. కాజల్, నాని, రెజీనా, శ్రీనివాస్ అవసరాల, నిత్య మీనన్, ఇషా లాంటి ఎంతోమంది పేరున్న నటీనటులు ’ఆ (ప్రశాంత్ వర్మ)’ అనే సినిమాలో నటించడం, అది కూడా ఒక కొత్త దర్శకుడి చిత్రంలో నటించడానికి అంగీకరించడం, అలాంటి సినిమాని నాని లాంటి ప్రముఖ హీరో నిర్మించడం తెలుగు సినిమా మారిందనడానికి ఒక నిదర్శనం.

హీరోయిన్ ప్రధాన పాత్ర పోషించిన ’చి.ల.సౌ (రాహుల్ రవీంద్రన్)’, తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ ప్రధానంగా సాగే ’నీది నాది ఒకే కథ (వేణు ఉడుగుల)’, ’గూఢచారి (శశికిరణ తిక్క)’ , RX100 (అజయ్ భూపతి),’ఈ నగరానికి ఏమైంది (తరుణ్ భాస్కర్), హుషారు (శ్రీ హర్ష) లాంటి సినిమాలు భారీ విజయం సాధించడం కూడా తెలుగు సినిమా మారిపోతోందనే ఒక కొత్త ఉత్సాహాన్నందించింది 2018.

వీటన్నింటికంటే ముఖ్యంగా, 2018 లో వచ్చిన ’కేరాఫ్ కంచరపాలెం (వెంకటేష్ మహా)’ సినిమాగురించి చెప్పుకోవాలి. వైజాగ్ లోని కంచరపాలెం కి వెళ్లి అక్కడ నివసించే వారినే నటీనటులుగా ఎన్నుకుని వారితో సినిమా తీయడమంటే అది కలలో కూడా జరిగే విషయం కాదనిపించొచ్చు. ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలోనో, లేదంటే కేరళ, బెంగాల్ లోనో ఫలానా దర్శకుడు ఇలాంటి ఒక ప్రయత్నం చేశాడంటే కేవలం చదువుకుని వదిలేసే పరిస్థితిలో ఉండే తెలుగు సినిమా, ’కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఆ కలను నిజం చేసింది.

సాధారణంగా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు అవి కేవలం అవార్డులకోసం మాత్రమే తీసిన ఆర్ట్ సినిమాగా మిగిలిపోయే అవకాశాలే చాలా ఎక్కువ. 2018లో కేరాఫ్ కంచరపాళెం సినిమా విడుదలైంది. సాధారణ తెలుగు ప్రేక్షకులే కాదు, దేశంలోని అన్ని మూలలనుంచి ప్రేక్షకులు సినిమా చూసి ప్రశంసలు అందచేశారు.పదేళ్లలో తెలుగు సినిమా పూర్తిగా యూ టర్న్ తీసుకుంది.

ఇప్పుడు తెలుగు సినిమా కేరాఫ్ కొత్త సినిమా!

అంతా మన మంచికే.

ఇది 2019 వ సంవత్సరం మే నెల. సమ్మర్ హాలిడేస్ కి తెలుగు సినిమాకి ఎంతో అవినాభావ సంబధం ఉంది. మంచి మంచి సినిమాలను సమ్మర్ హాలిడేస్ లో విడుదల చేసి భారీ విజయాలను అందుకోవాలని ప్రతి నిర్మాతకూ, హీరోకూ ఉంటుంది. కానీ ఈ సమ్మర్ లో పరిస్థితి వేరు. మజిలి సినిమా విజయవంతమైంది. ఇది రొటీన్ సినిమా కాదు. ఈ సినిమా దర్శకుడికి ఇది రెండో సినిమానే. ’చిత్రలహరి’ విడుదలైంది. కమర్షియల్ సినిమానే నమ్ముకున్న సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా. ఇది కూడా విజయవంతమైంది. ఈ సినిమా దర్శకుడు కిశోర్ తిరుమలకి ఇది మూడవ సినిమా.

’జెర్సీ’ విడుదలైంది. భారీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కలిసి ఒక్కొక్క సినిమాతో తెలుగు సినిమాని మార్పు దిశగా ప్రయాణం చేపిస్తూ ఇక్కడ వరకూ తీసుకొచ్చారు. ’జెర్సీ’ తో ఆ మార్పు అత్యున్నత స్థితిని చేరుకుంది. అత్యుత్తమ సినిమా అంటే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏ మూలనున్న ప్రేక్షకుడినైనా కదిలించే గుణం ఉండాలి. అటువంటి క్వాలిటీ ఉన్న సినిమా ’జెర్సీ’. తెలుగు సినిమా మసాలా దినుసులన్నీ కలిపి కమర్షియల్ హంగులతో తీయగలిగే సినిమా అయినప్పటికీ, తను నమ్మిన కథను ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతం తిన్ననూరి.

ఇప్పుడు మనం కూడా ఒక జెర్సీ మీద టాలీవుడ్ అని రాసుకుని, కాలరెగరేసుకుని మన సినిమాలు ఇతర రాష్ట్రాల వాళ్లకి, ఇతర దేశాల వాళ్లకి గర్వంగా చూపించుకోవచ్చనే ధైర్యం వచ్చింది. ఇక తెలుగు సినిమా గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. పైన పేర్కొన్న దర్శకులంతా ఇప్పుడు తెలుగు సినిమాని తమ భుజాల మీద మూస్తున్నారు. ఇకనుంచి మనకు అన్నీ మంచి సినిమాలే ఉండకపోవచ్చు. కానీ మంచి అభిరుచి కలిగిన ప్రేక్షకులకు మంచి సినిమాలు తీసే దర్శకులు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతోమంది కొత్త దర్శకులు కొత్త రకమైన సినిమాలతో మన ముందుకు వస్తారనే నమ్మకం ఉంది. ఈ సంవత్సరంలోనే ’దొరసాని;, ’మల్లేశం’, ’ఫలక్ నుమా దాస్’, ’బాయ్’, ’రాజావారు రాణిగారు’, ’డియర్ కామ్రేడ్’ ‘పలాస’ ఇలా ఇంకా ఎన్నో మంచి తెలుగు సినిమాలు మన ముందుకు రానున్నాయి. తెలుగు సినిమా ఇప్పుడు కొత్త ఆశలతో చిగురిస్తోంది. అంతా మన మంచికే.

*

వెంకట్ శిద్ధారెడ్డి

9 comments

Leave a Reply to Surya Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 2008 nundi 2018 varaku Telugu cine prasthananni, Telugu Cinema lo jarigina visheshalanu Chala chakkaga chepparu Sir!!

  • తెలుగు సినిమాలను ఓ పట్టుపట్టారు. 2008-2018 వరకు జనం మెచ్చిన, ప్రభంజనం తెచ్చిన చిత్రాలను వరుసన పెట్టారు. చక్కగా పట్టం కట్టారు..🙏🙏
    ‘తెలుగు వాళ్లంత సినిమా పిచ్చోళ్లు ఎక్కడా ఉండరు..❤️❤️’

  • మంచి వ్యాసం. వివి వినాయక్ దర్శకుడిగా సినిమాలు లేక పోవటంతో నటుడిగా మారాలనుకోవటం ఇప్పుడు వస్తున్న మంచి మార్పులకు సూచకం. తెలుగు సినిమాకి పట్టిన పెద్ద శని హీరోయిజమే. జూ. ఎన్. టి.ఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రాం చరణ్ వంటి హీరోలే తెలుగు సినిమా పాలిటి విలన్లు. వీళ్ళు మారరు. మారలేరు. మారినా జనం చూడలేరు. ఏదైనా థీమ్ బేస్డ్ సినిమాలు వీళ్ళు చేసినా, కమర్షియల్ గా సక్సెస్ అయినా అవాస్తవమని తెలిసిపోతుంది. హీరోయిజం మీద ఆధారపడి చేసిన అటువంటి సినిమాల్ని మంచి సినిమాలు అసలేం. వీళ్ళని పూర్తిగా తిరస్కరించే స్థాయికి తెనుగు ప్రేక్షకుడు ఎదగాలి.

  • Very good review of Telugu cinema trajectory in 21st century both its content and form. I think realism is still in stage of infancy?

  • ఊహలు గుసగుసలాడే! అనే ఓ మంచి సినిమా కూడా వుందండోయ్! ఎందరో సినిమా పిచ్చోళ్ళు – అందులో నేనూను!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు