గత సంచికలో మనం కవిత్వ భాష గురించి మాట్లాడుకున్నాం గదా! కవిత్వపు భాష కవి హృదయాన్ని పాఠకులకు తెలియజేస్తుంది. ఇప్పటి కవిత్వం గత కాలపు కవిత్వానికి కొనసాగింపుగానే వస్తున్నప్పటికీ కవిత్వపు అభివ్యక్తిని ప్రభావితం చేసిన/చేస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా మనం కవిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కొంచం కష్టమే.
అసలే కవిత్వం, ఆపైన సామాజిక చలనాల ప్రభావం కవుల భావావేశాన్నీ, అభివ్యక్తినీ నిరంతరం ప్రభావితం చేయగల ఒక సన్నివేశంలోకి ప్రవేశించాం మనం. కవిత్వ విశ్లేషకుడు ఇయాన్ హామిల్టన్ మాటల్లో “ఆధునిక కవిత్వం అంతకుముందున్న కవిత్వం కంటే భిన్నమైనదని పాఠకులు భావిస్తారు. (Ion Hamilton: Introduction to the first edition of ‘Oxford companion to Modern Poetry P. xi)
అలా భావించడానికి కారణంగా వారు ఆధునిక కవిత్వం అంతకు ముందున్న కవిత్వంలా సులభగ్రాహ్యం కాదనీ, కవిత్వపు కట్టుబాట్లకు నిలవదనీ అంటారు. ఆధునిక కవులు సాంప్రదాయ ధిక్కార స్వరంతో పాఠకులను లెక్కచేయని తనంతో తమ అభివ్యక్తిని వ్యక్తం చేస్తుంటారానీ చదువరుల భావన”1 అయితే ఇయాన్ హామిల్టన్ ఆధునిక కవిత్వంలోని సంక్లిష్టత కొత్తగా వచ్చినది కాదనీ రూపంలో, వ్యక్తీకరణలో కొత్తదనం కూడా ఆధునిక కవులలో కొత్తగా వచ్చినదేమీ కాదనీ అంటారు.
కవిత్వంలో సంక్లిష్టత ఆధునిక/ఆధునికానంతర కవిత్వాన్ని ప్రభావితం చేస్తున్న అనేక అంశాలద్వారా ఒనగూడినదే. ఆధునిక పూర్వ కవిత్వంలోలాగ ఒక విషయం, దానికి ఉపోద్ఘాతం ఆధునిక కవిత్వంలో ఉండడం అరుదు.
“అటజని కాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జ్హరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్”(పెద్దన, మనుచరిత్రము)
పై పద్యంలో అల్లసానివారు శీతశైలమును వర్ణించి గాని అది శీతశైలము అని విశదపరచని వైనం 19 వ శతాబ్దానంతర ఆధునిక కవిత్వంలో కనబడదు.
“చూరునుంచి కారుతున్న వాన నీళ్ళు
సరాసరి అన్నం కంచంలోనే పడుతున్నాయి”(బండ్ల మాధవరావు)
అంటూ ఒక ఆధునిక కవి తన కవిత ప్రారంభంలోనే వివిధ దృశ్యాలనూ, ఆ దృశ్యాల వెనక వాస్తవాలనూ చదువరుల ముందు పెడుతున్నారు.
ఆధునిక కవిత్వం ఆధునిక కవికి ఇచ్చిన స్వేచ్చ అభివ్యక్తిలో నూతనత్వాన్నీ సూటితనాన్నీ మరింత పదును దేల్చి ఇయాన్ హామిల్టన్ గమనించిన వాటితోపాటు ఇప్పటి సంక్లిష్ట భావాల వ్యక్తీకరణకు అవసరమైన పదునైన భాషనూ కనుగొనాల్సిన అవసరాన్ని కవులముందుకు తెస్తున్నది.
కవిత తొలిపాదాలలోనే ఒక సంక్లిష్ట దృశ్యాన్నీ ఆ దృశ్యం పాఠకుల హృదయాలలో కలిగించగలిగిన స్పందనలనూ చిత్రిక పడుతోంది.
కవిత తొలి పాదాలు చూడగానే ఆ కవిత స్వరం తెలిసిపోతుందిగానీ కవి ఆ కవిత ద్వారా చిత్రించిన తరువాతి దృశ్యాలకోసం చదువరులు ఆ కవితను పూర్తిగా చదివేలా చెయ్యగలిగాడు కవి.
“చూరునుంచి కారుతున్న వాన నీళ్ళు సరాసరి అన్నం కంచంలోనే పడుతున్నాయి
తడిసిన పుల్లలు పొయ్యిలో రేపుతున్న పొగ
ఇంటిని కంటిని చుట్టుముట్టి కన్నీటి తుఫాన్లు రేపుతోంది
వానంటే గ్రీష్మానికి ఎండిన మట్టి గర్భాన్ని తడిపే చినుకు మాత్రమే కాదు
సుడులు తిప్పే నీళ్ళలో బతుకుల్ని తిప్పేసే చినుకుల సమూహం కూడా
వానంటే మొలలోతు నీళ్ళల్లో మునిగిన ఆరుగాలపు కష్టం కూడా
రేకుల్లోంచో మైనపు కాగితాల మధ్యనుంచో కారుతున్న దుఖపు బొట్లు కూడా
కట్టుకున్న బట్టలు మాత్రమే మిగిలి ఉన్న వేళ
గుప్పెడు మెతుకుల కోసం ఆహార పొట్లమై
వర్షం కళ్ళతో దిక్కులు చూడడం కూడా
టీవీలముందు పోసిన వేడివేడి పకోడీలు నంజుకుంటూ పొంగిపొరలుతున్న కాలువల
దృశ్యాల ముక్కలు తింటున్న ఎవరికైనా అది ఒకానొక దృశ్యం మాత్రమే
కొండలే ప్రవహించాయో అడవులే కొట్టుకొచ్చాయో
ఆక్రమణలై మూసుకుపోయిన దారుల్ని ఒరుసుకుంటూ
నిన్ను నిండా ముంచేసిన నీటినే అడగాలి.
చెరువు కాళ్ళల్లో ఆకాశ హర్మ్యాలై దిగబడ్డ ముళ్ళ కంపల్ని తొలగించేదెవరు
కాగితప్పడవల పిల్లకాలువలు మహోధృతాలై నగరాల నడిరోడ్లపై పారుతున్నప్పుడు
నదిని తినేసిన చెదపురుగుల్నే ప్రశ్నించాలిప్పుడు
నీరింకి పోవాల్సిన చోట మనిషింకి పోవడమే విషాదం”
‘వాన రాదారుల్లో’ అనే ఈ కవిత రాసిన కవి కవిత కు పెట్టిన మకుటమే కవిత విషయాన్ని సూచిస్తోంది.
కవిత మొత్తం దృశ్యమానమై మనముందు ఒక వాన చిత్ర ప్రదర్శనను ఉంచుతూనే ఆ దృశ్యాలు కవి మదిలో రేపిన గాయాలనూ అవగతం చేస్తున్నాయి. ఈ కవిత ద్వారా కవి చెప్పిన విషయాలు ఎన్నో. రెండుగా చీలిపోయిన సమాజాన్నీ, నిర్లిప్తత నిండిపోయిన మనిషినీ, నిష్క్రియగా మారుతున్న వ్యవస్థనూ కవి తన కవిత ద్వారా మనకు చూపుతున్నారు. ఇక్కడ వస్తువూ, భావమూ పెనవేసుకుని కవి అభివ్యక్తిని రక్తి కట్టిస్తోంది.
కవి ఇవాళ తన అంతరంగాన్ని వ్యక్తం చేయడానికి చూపే ఉత్సుకత కవి అభివ్యక్తిని ఫలవంతం చేస్తుంది.
మెంథా తుఫానుపై మెంథాయనం పేరుతో గరికపాటి మణీందర్ రాసిన ఈ కవితను చూడండి.
“పొద్దున్నే మా వూరికి (ఖమ్మం) మెంథా వచ్చింది
జల నాలుక చాస్తుందేమోనని ఒళ్ళు జలదరించింది
రాత్రంతా మున్నేటి వొడ్డు నిర్నిద్రగా గడిపింది
క్షణక్షణం ముంపు అలల కలలు కళ్ళనిండా ఒంపులు తిరిగాయి
గాంధీ చౌకూ జెడ్పీ సెంటరూ కూలీల కువకువలు లేక చినుకులు చప్పరిస్తూ మౌనంగా ముడుచుకున్నాయి
రోడ్లనిండా ప్రవహించే పసుపుపచ్చ బస్సులన్నీ స్కూళ్ళముందు బద్దకంగా పడుకున్నాయి
ఇళ్ళలో టీవీలు అన్నీ సముద్రతీరాన్ని ముందేసుకుని సహానుభూతిగా నిట్టూర్పులు రాల్చుతున్నాయి
ఇక చెప్పడానికేముంది
మొత్తంగా మెంథా కూలీల పస్తుల పొట్టలతో చలికాచుకుంటుంది”
ఈ కవితలో కవి చెప్పిన అంశం ఒకటే. అయితే దాన్ని దృశ్యమానం చేయడానికి కవి ఎన్నుకున్న పద్ధతిని ఇక్కడ మనం గమనించాల్సి ఉంది.
*








Add comment