నా మొదటి కథ పేరు‘మాయమవుతున్న మనుసు’. 2006 వ సంవత్సరంలో నాకు ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకునే సమయంలో రాశాను. ఈ కథకు ‘భూమిక స్త్రీవాద పత్రిక’ నిర్వహించిన పోటీల్లో తృతీయ బహుమతిని, ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి చేతుల మీదుగా అందుకున్నాను. 2007వ సంవత్సరం మే సంచికలో అనుకుంటా అచ్చయింది.
కథాంశం మా అమ్మ దెంచనాల కోటేశ్వరమ్మకు సంబంధించినది. ఆమె స్నేహితురాలు శ్రీకాకుళం జిల్ల నుండి వచ్చిన లచ్చుమమ్మ గురించి. ఇద్దరి ప్రాంతాలు, నేపథ్యాలు వేరయినా వయస్సు కారణంగా ఒకే రకమైన సమస్యలున్నందున ఒకరికొకరు చేరువయ్యారు. స్వాతంత్ర్యానికి పూర్వమే పల్లెటూర్లలో పెరిగి, వివాహానంతరం ఎన్నో ఉద్యమాల్లో సాహసంగా పాల్గొని, ఎన్నో అనుభవాలను ప్రోది చేసుకున్న నాటి తల్లుల మానసికానుభూతి ఈ కథ. వారు పట్నంలో అపార్ట్మెంట్ కల్చర్ లో సర్దుకోలేక పడిన అవస్థల గురించి, మారుతున్న ఆధునిక సాంకేతికతతో ఎలా ఇబ్బంది పడ్డారు, ఈ సౌకర్యాలు వారిని ఏ విధంగా అసంతృప్తినిచ్చాయి అనేది కథాంశం.
ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మా అమ్మమ్మగారి ఊరు. మా అమ్మమ్మకు 20వ సంతానం మా అమ్మ. మరో సంతానం కలిగితే అమ్మమ్మ తాతయ్యలకు మళ్ళీ పెళ్ళి చెయ్యాలనేది నాటి ఆచారం. అందుకని ఇంక చాలు అని అమ్మకు ‘సాలమ్మ’ అని పేరు పెట్టారట. ఏడేండ్ల వయసులో తల్లి వద్ద పాలు తాగుతున్న సాలమ్మను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి ఇరవై సంవత్సరాల యువకుడికిచ్చి పెళ్లి చేశారట. అత్తగారు కోటేశ్వరమ్మ అని పేరు మార్చారు.
గార్ల బయ్యారం, రంగాపురం దాటిన తర్వాత ఊరు పెత్తాళ్లగడ్డ (పెద్ద తాళ్ల గడ్డ) అది అమ్మ అత్తగారూరు. అదే మా నానమ్మ ఊరు. మా నానమ్మను తాతయ్యను చూడలేదు నేను. మేము పుట్టక ముందే వారు చనిపోయారు. కానీ మా అమ్మకు అత్తగారి పోరు లేకున్నా.. పెద్దయారాలు అత్తగారిలా కష్టపెట్టిన తీరు, తాను పడ్డ కష్టాలు, భర్త చనిపోతే కుటుంబాన్ని ఎదిరించి తను చేసిన సాహసం. రజాకార్ల సమయంలో ఖాసిం రజ్వీ అనుచరులను తప్పించుకోవడానికి మగవాడిలా పంచె కట్టి, తలపాగా చుట్టి నడుస్తుంటే ఆడ మనిషని తెలుస్తోందేమోనని, ముల్లుగర్రను అడ్డంగా తల వెనుక నుండి రెండు భుజాల పై పెట్టుకుని కర్ర చివరల పై రెండు చేతులు వేసి తిరిగేదట.
నాలుగు రాత్రులు మర్రిచెట్టు మీద పడుకున్నదట. అమ్మ మాటల్లో ఇవన్నీ వింటూ పెరిగాను. మా పెదనాన్న గొంతు మీద రజాకార్లు పెట్టిన కత్తి గాటు గురించి చెప్పగా నాన్న మాటల్లో విన్నాను. ప్రముఖ నక్సలైట్ లీడర్ దొరన్న కుటుంబంతో వారికి ఉన్న సహవాసం (గడ్డం వెంకట్రామయ్య పేరే దొరన్న), అతని చెల్లెలు యశోదమ్మతో అమ్మా నాన్నలకు వున్న స్నేహం. వాళ్ళ ప్రోత్సాహంతో గాజులశెట్టి సాయంతో గార్ల వరకు నడిచి, అక్కడి నుండి రైల్లో బెజవాడ పారి పోయారట. అక్కడ ఆంధ్ర మహాసభ సభ్యులైన అన్నపూర్ణమ్మ, పిల్లల మర్రి వెంకటేశ్వర్లు జంటతో పరిచయం ఏర్పడింది. వారిది అభ్యుదయ భావాలున్న జంట. వారు కులాంతర వివాహం చేసుకోవడమే కాక మరికొందరికి కులాంతర వివాహాలు చేశారట. వారి ద్వారా ప్రగతిశీల కార్యక్రమాలలో పాల్గొనడం, గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొనడం, మధ్యాహ్నం ఇరుగుపొరుగు మహిళలతో కలిసి మెలిసి ఉండడంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నది అమ్మ. తను కూడా చదువుకోవాలని ఆసక్తి కలిగింది కోటేశ్వరమ్మకు. పనికి పోతూ భర్త తలుపు వెనక రాసిన అక్షరాలను నేర్చుకొని విద్యనభ్యసించింది.
ఈ విధంగా చరిత్రను కొంత, వ్యక్తిగత సమాచారాన్ని కొంత చెబుతుంటే చిన్నతనంలోనే నా పసి మనసులో ముద్ర పడింది. మా ఊరి నుండి చదువుకున్న మొట్టమొదటి ఆడపిల్లలం నేను మా అక్క. మా సామాజిక వర్గంలో, మా బంధువర్గంలో 1960- 1970ల్లో హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళం, పదో తరగతి కంటే ఎక్కువ చదవగలిగిన వాళ్ళం మా అక్కచెల్లెళ్లం మాత్రమే. మా తర్వాత ఎందరో చదువుకున్నారు.
*








Add comment