మనకు అర్థం కాని వర్మ!

నేను చర్చకు పెట్టిన ముగ్గురిలో చలం, ఓషో ఆలోచనలకి దగ్గరగా వర్మ ఆలోచనలు ఉంటూనే, వాళ్ళు చెప్పని ఒక కొత్త లాజిక్ వర్మ చెప్పాడు.

నిషి పుట్టి, మట్టిని తట్టి, గుట్టుగా ఓ గూడు చేసుకున్నాడు. గూడుతో ఆగక తోడుకోసం స్త్రీ, పురుషులు జతకట్టారు. ఒకరు ఇద్దరయ్యారు. ఇద్దరు ముగ్గురయ్యారు. అలా ఓ కుటుంబంగా మారి, ఓ వ్యవస్థగా అవతరించారు. ఈ మానవ పరిణామ క్రమంలో పుట్టుక-చావూ మధ్యలో అనేకమైన నియంత్రణలతో, నిబంధనలతో మనిషి జీవితాన్ని మనిషే బంధించుకున్నాడు. ఈ విధంగా ఉక్కిరి, బిక్కిరి అవుతున్న తరుణంలో సాహిత్యం పుట్టింది. మనిషి జీవితాన్ని మనిషే; సాహిత్యం ద్వారా దర్శించి, దాని జ్ఞానంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి సాహిత్యం కొంత వరకూ ఉపకరిస్తుంది. కానీ, ఇది కేవలం చదువుకున్న వారికే పరిమితమైన వేళ ‘అక్షరం మాట నేర్చింది’. ఆ మాటే ఆనాటి రూపకం. ఈనాటి సినిమాగా మార్పు చెందింది. ‘నాటకం సమాహార కళ’ అని ఆర్యోక్తి; ‘సినిమా సమాహార సమాజం’ అని నా ఉక్తి.!

ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకి నవరసాలు జోడించి సినిమాగా చిత్రిస్తున్నారు. దాన్ని చూసి బాగుపడ్డం ఉండదు. చెడిపోవడం ఉండదు. కానీ మనం గమనించవలసింది ‘యద్భావం తద్భవతి’. మనలో ఉన్నదాన్నే అందరిలోనూ చూస్తాం తప్పితే; వాస్తవాన్ని చూడలేము. దానికి సినిమానే కారణం అనుకోవడం సరికాదు. సాహిత్యం-సినిమా సమాజానికి ప్రతి బింబాలే తప్ప, సమాజానికి అతీతం కాదు. సినిమా నుండి మనం అనుభవించని ఒక అనుభూతిని పొందుతాం.              ఆ అనుభవం నుండి అనుమానం లేని ఆలోచనల్ని చేసి జీవితాన్ని ముందుకు నడపవచ్చు. హాయిగా గడపవచ్చు. అందుకే సినిమా అంటే దేవుళ్ళకి, దేవుళ్ళ పేర్లు నిలువెల్లా పూసుకున్న మతాలకీ భయం. అందుకే సినిమాని వినోదం అంటారు తప్పా విజ్ఞానం అనలేరు. జ్ఞానివి కావాలంటే ఖచ్ఛితమైన నిష్టాగరిష్టలు పాటించాలంటారు. సులభంగానో, సినిమా ద్వారానో వస్తే అది విజ్ఞానం కాదు; అజ్ఞానమే అంటుంటారు    ఈ పండిత బడుద్దాయులు. అందుకే సాహిత్యం – సినిమా వేరని గీసిన గీత కూడా వీళ్ళ చలవే. ఈనాటి అభ్యోదయ సాహిత్యకారులు కూడా ఆ గీతను చెరపలేకున్నారు.

‘ప్రయోగం వ్యాకరణ సూత్రం’ అని వ్యాకర్త చిన్నయసూరి చెబితే, ‘ప్రయోగం జీవిత సూత్రమని’ రామ్ గోపాల్ వర్మ తన ప్రయోగాల ద్వారా నిరూపిస్తున్నాడు. సమాజం ఒక ప్రయోగశాల అందులో ప్రయోగాలతో పాటు ప్రయోగకర్తలు కూడా వెలుగులోకి వస్తారు. వాళ్ళనే తరువాత కాలపు ప్రజలు ఉద్యమకారులుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ రోజు ప్రయోగకర్త రామ్ గోపాల్ వర్మ. ఈయన అసలు రామ్ గోపాల్ వర్మ నుండి ‘కామగోపాలవర్మ’ గా ఎలా మారాడో ఒక లుక్ వేద్దాం.!

మన తెలుగు సాహిత్యంలో స్త్రీ స్వేచ్ఛా; స్త్రీ లైంగిక స్వేచ్ఛను గురించి మాట్లాడిన మొట్ట మొదట ప్రయోగ సాహస శీలి చలం. ఈయన రాసిన ‘మైదానం’ నవల 1927లో పెద్ద సునామినే సృష్టించింది. చలం పెట్టిన నిప్పు; అప్పటి సనాతన భావాల్ని కాల్చి బూడిద చేసింది. విశ్వనాథ సత్యనారాయణలాంటి సంప్రదాయవాదులు చలాన్ని ఖండిస్తూ ‘చెలియలకట్ట’ అనే నవలని కూడా 1935 లో రాయడం జరిగింది. ఇది పక్కన పెట్టేస్తే!

అసలు చలం అభిప్రాయాలు ఏమిటో చూద్దాం.‘‘ఈ  స్త్రీ, పురుష సంబంధం లోంచి సుఖం రావాలంటే, వికాసం కలగాలంటే, దేశపు ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారాలి. వంట, చాకిరీ, పిల్లల్ని కనడం, పెంచడం, ఇంతకన్నా చాలా సుఖమూ, సులభమూ కావాలి స్త్రీకి’’. అని చలం 1925 లో తాను రాసిన ‘స్త్రీ’ పుస్తకంలో చెబుతాడు. అదే పుస్తకంలో స్త్రీ లైంగిక స్వేచ్ఛ కోసం మాట్లాడుతూ ‘‘భార్యా భర్తలు, ఒకరి నీతి నింకొకరి పైన విధించు కోకూడదు. అందరి స్వభావానికీ ఒకటే నీతి సరిపోతుందనుకోవడం తప్పు. హృదయ పూర్వకంగా ప్రేమిస్తే గానీ శరీరాన్ని తాకనియ్యని వాళ్ళు కొందరు; శరీరానికీ మనసుకీ సంబంధం లేక మనసుతో పూర్ణంగా ప్రేమించి కూడా శరీర వాంఛల్ని ఇతర విధంగా తీర్చుకోగల వారు కొందరు; – ఇట్లా అనేక విధాలుగా వుంటారు. కనుక ఎవరి నీతికి వారిని వొదిలి, రెండో వారు తాము అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. భర్త దగ్గిర లేనప్పుడు, భర్త సంపూర్ణమైన తృప్తిని కలిగించనప్పుడు, శరీర వాంఛ తీర్చుకోవడం కోసం, నౌకర్ని జీతానికేర్పరుచుకున్నా, భర్త అర్థం చేసుకుని, ఆమె నీతి అభిప్రాయాలతో సానుభూతిని చూపే ఔదార్యం కలిగి వుండాలి’’. అప్పట్లోనే చలం ఇలాంటి సంచలనాలు ప్రకటించాడు.

దీనిపై స్పందిస్తూ రంగనాయకమ్మ‘‘ఈ రచయిత మీద చాలా విముఖత కలుగుతుంది. కానీ కొంత సహనంగా ఆలోచిస్తే, పురుషుడు వేశ్యకి డబ్బు ఇచ్చి కేవలం కామం తీర్చు కోడానికే ఆమెతో సంబంధం పెట్టుకోవడం లేదూ? అదే పద్ధతి స్త్రీ విషయంలో వుండాలంటే, ఏం కొంప, మునుగుతుంది? పురుషుడి విషయంలో ఏం జరుగుతుందో దాన్నే స్ర్తీకీ కూడా వర్తింపజేయాలన్నదే ఈ అభిప్రాయం. కానీ            ఈ విషయంలో మంచి చెడ్డల్నీ, స్త్రీ పురుషులకు జరిగే అభివృద్ధినీ చర్చించుకుంటే, డబ్బు ఇచ్చి కామ సంబంధాలు పెట్టుకోవడం అన్నది, ఎవరి విషయంలోనూ అంగీకరించ దగ్గదీ, సమర్థించ దగ్గదీ కాదు. దానిలో మంచి చెడ్డలు పరిశీలించుకుంటే దాని లోపాలు తెలుసుకోవచ్చు. అది స్త్రీకీ పనికి రాదు, పురుషుడికీ పనికి రాదు’’. ఈ విధంగా ‘చలం సాహిత్యం’ అనే పుస్తకంలో ఆమె చలాన్ని ఖండించారు. మొత్తానికి పురుషుడు తప్పు చేస్తే తప్పు కాదు, అదే స్త్రీ చేస్తే తప్పు అవుతుందా? అనే ప్రశ్నలు ఆనాటి స్త్రీకి పరిచయం చేశాడు చలం. రంగనాయకమ్మ ఇద్దర్లో ఎవరు చేసినా తప్పు తప్పే అంటూ వాదించారు. ఈ ఇరు వాదనలు రామ్ గోపాల్ వర్మకి ఏమిటి సంబంధం అనిపిస్తుందా? చెబుతా!.

ఒకసారి ‘ఓషో’ ఏం చెప్పాడో కూడా చూసేస్తే మన అనుమానాలకి కొంచెం మందు దొరికిపోయినట్లే.‘‘శతాబ్దాల తరబడి ప్రజలు అణచివేయబడ్డ శృంగార జీవితాన్ని అనుభవిస్తూ ఉండడమే అందుకు ముఖ్య కారణం. అది మహాపాపమని ధార్మిక ప్రవక్తలు, మహా పురుషులు, రక్షకులు వారికి భోధించడం జరిగింది. నాకు తెలిసినంతవరకు మీలోని లైంగిక శక్తే మీ అసలైన జీవశక్తి. దాన్ని పాపంగానైనా మలచుకోవచ్చు లేదా మీ చైతన్య ఉన్నత శిఖరాగ్రంగానైనా మలచుకోవచ్చు. ఆకలి, నిద్ర ఇలా జీవితంలోని అన్నింటిలాగే శృంగారాన్ని కూడా మామూలుగా జరిగే అతి సహజమైన విషయంగా పరిగణించి దాన్ని అంగీకరించాలి’’. ఈ విధంగా ఓషో రాసిన ‘శృంగారోపనిషత్’లో చెప్పబడింది. మనం తరతరాల నుండి ప్రోగ్రామింగ్ అయ్యిపోయి ఉండడం వల్ల ఓషో చెప్పేదాన్ని అంగీకరించలేము. కాబట్టే వీళ్ళు మనకంటే గొప్పవాళ్ళుగా ఇప్పటికీ, ఎప్పటికీ కీర్తించబడుతునే ఉంటారు.

ఇప్పుడు వర్మ చేస్తున్న ప్రయోగం గురించి చూద్దాం! ఆయన మాటల్లోనే.‘‘దేవుడు, సెక్స్ మరియు నిజం లో మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా పలుకుతుంది..దానికి కారణం ఏది ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి వస్తున్న ప్రశ్నకి సమాధాన మివ్వటానికే. విపరీత కట్టుబాట్ల సమాజం, ఒక పద్ధతి ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన స్వేఛ్చాలోచనల్ని బహిరంగ పరచడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే ప్రాజెక్టు ఒక ప్రతినిధి. సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనేది ఒక మహోన్నత సాధనం. పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వెనుక ఉన్న ఒక తాత్వికత’’. దేవుడూ, సెక్సూ, నిజమూ కలగలిసిన మియామాల్కోవా’ అనే వ్యాసంలో వర్మ ఇలా వివరించారు. ఇందులో వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే స్త్రీ తన సెక్సువాల్టీని తను గర్వంగా గుర్తించాలి. పురుషుణ్ణి ఆకర్షించే శక్తి స్త్రీకి ఉంది కనుక, దాన్ని స్ర్తీ ఒక ఆస్తిలా భావించాలి. అవసరం ఉన్నప్పుడు ఆస్తిని వినియోగించినట్టే, తన అవసరార్ధం తాను ఇష్టపూర్వకంగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అందులో తప్పు లేదనేది వర్మ వాదన.

మనం మన తెలివిని ఉపయోగించి ఆదిమానవుడి కాలం నుండీ ఆధునిక మానవుడి వరకూ ఎలాగైతే అభివృద్ధి సాధించామో అదే లెక్కన స్త్రీ, తన సెక్సువాల్టీని తెలివిగా వాడుకోవాలి. ఎవరి వల్ల అయితే స్త్రీ జాతి ఇంతకాలం అణచవెయ్యబడిందో వాళ్ళతో సెక్స్ అనే ఆయుధంతో యుద్ధం చెయ్యాలి. కుదిరితే ఒక ఆటాడుకోవాలని అంతర్కోణంలో వర్మ చెప్పకనే ఈనాటి స్త్రీలకు చెబుతున్నాడు. ఇది స్త్రీలకి అర్ధమైన నాడు వర్మని ‘ఇండియా ఫ్రీ సెక్స్ బ్రాండ్ అంబాసిడర్ గానూ, సులభ శృంగార ఉద్యమకర్తగా’ ప్రజలు అభివర్ణిస్తారు. వర్మ మాట్లాడేది పురుషులకు వ్యతిరేకంగా అని స్త్రీలు గమనించిన రోజు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి.

నేను చర్చకు పెట్టిన ముగ్గురిలో చలం, ఓషో ఆలోచనలకి దగ్గరగా వర్మ ఆలోచనలు ఉంటూనే, వాళ్ళు చెప్పని ఒక కొత్త లాజిక్ వర్మ చెప్పాడు. ఆడతనాన్ని అపహాస్యం చేసే పురుషాహంకారులను తమ జండర్ పవర్ తో గట్టిగా దండించాలి, దండయాత్ర చెయ్యాలని అంటున్నాడు. ఆడవారు తమను తామే తక్కువగా చూసుకోవడం మానేసి, ఒకరినొకరు హృదయపూర్వకంగా గౌరవించుకోవాలి. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో వుండాలి . పురుషాధిపత్యాన్ని బాగా అవగతం చేసుకొని, రేషనల్ థింకింగ్ తో దూసుకుపోవాలి. రంగనాయకమ్మగారు చెప్పినట్టు ‘స్త్రీ, పురుషులిద్దరూ తప్పు చెయ్యకూడదు. ఎవరు చేసినా అది తప్పే’ అంటున్నారు. కానీ సమాజంలో ఈ మాట ఆకాశంలో గాలిపటంలా ఎగురుతుంది తప్పా ఆచరణకు ఏ మాత్రం అందకుండా ఉంది. మనుషులు ఏదైనా తెలిసే చేస్తున్నారు. తెలియక చేసేవాళ్ళ శాతం చాలా తక్కువ.

ఇప్పుడు వర్మ చేసిన ఇలాంటి ప్రయోగాల వల్ల తప్పు, ఒప్పుకాకపోయినా; ఒప్పు, తప్పుకాకపోయినా ఇద్దరికీ మాత్రం సమాన భాగస్వామ్యం చెందుతుంది. ఇది కూడా ఒక రకమైన ఆస్తి పంపకంలాంటి గొడవే. వర్మ ఇప్పుడు చెబుతున్న లాజిక్ కూడా కనీ-వినీ ఎరుగనిదేమీ కాదు. ‘‘ఈ జతగూడడంలో ఇప్పుడు చాలా నియమాలు వచ్చాయి. ఇష్లం అయిష్టం, అందం చందం, ఆచారం గౌరవం- ఇలాంటివి ఇప్పుడు అనేకం ఆలోచిస్తారు. కానీ, ఆ అనాది రోజులలో మనుష్యుల ప్రవర్తన, దగ్గర దగ్గర జంతువుల ప్రవర్తనతో సమానంగానే ఉండేది. జంతువుల్లో ఎంచుకోవడం అన్నది లేనట్టే, మనుష్యులతోను జతగూడడంలో ఎంచుకోవడం ఉండకుండానే ఉండాలి. విచ్చలవిడిగా,  అంటే, ఆ ఉద్రేకం కలిగినప్పుడు, విహరించి జతగూడడమే జరిగేది. వావి, వరుస, నిషేధం, ఆంక్ష- ఇలాంటివి ఏవీ వుండటానికి వీలులేదు. అవి వుండేవి కావు గూడాను. కామవాంఛ కలిగినప్పుడు జతకూడడమే సహజ కార్యం’’. ఇలా అనేక మంచి చెప్పినవే. తన శైలిలో వర్మ కూడా చెబుతున్నాడు. మానవ పరిణామక్రమంలో పెళ్ళి సృష్టి జరగక మునుపు సమాజం కూడా ఈ విధంగానే ఉండేది. సెక్స్ విషయంలో స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఉండేది. కానీ కొంతమంది స్వార్థపరులు కట్టిన విషపుగోడల వల్ల స్త్రీకి, పురుషుడికున్నంత లైంగిక స్వేచ్ఛ లేకుండా పోయింది. అది గుర్తించిన కొంతమంది రేషనల్ థింకర్స్ స్త్రీ లైంగిక స్వేచ్ఛ కోసం రకరకాల మాధ్యమాల ద్వారా స్పందించారు. ఆ స్పందనలో భాగంగా కొన్ని గోడల్ని బద్దలుగొట్టే పనిలో రామ్ గోపాల వర్మ కాస్త, కామ గోపాల వర్మగా కనిపిస్తున్నాడు. ఇందులో విచిత్రం ఏమిటంటే స్త్రీలే దీన్ని వ్యతిరేకించడం. మూలవాసుల మూలాల్ని మన ముందు తరాలకు తెలుపవలసిన బాధ్యత మనపై మెండుగా ఉంది. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ కాస్త మొండే!

*

ప్రవీణ్ యజ్జల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఓ ! అంటే, ఎంచక్కా, వెనుకకి, ఆదిమానవుల యుగానికి వెళ్ళిపోయి ఏ రూలు బుక్కులూ లేకుండా స్వేచ్ఛగా జంతువుల్లా బతకాలంటాడు.
    భలే. మరి, ఇళ్ళు కాకుండా గుహల్లో బతికితే సరి. గోడలు, తలుపులూ, తాళాలు…ఇవన్నీ ఎందుకు.
    ఆహారం కూడా… అప్పటివలెనె పచ్చిమాంసం తింటే చాలు. ఈ వండడాలు, వార్చడాలు,గృహోపకరణాలూ… కుక్ బుక్కులూ…. అబ్బెబ్బే. దండుగ కదూ.
    ఆకులు కట్టుకున్ననాటినుంచీ, పూర్తిస్థాయి వస్త్రాలు ధరించేవరకూ వచ్చాక, ఈ బరువులెందుకనటం….గొప్ప ప్రభోధకుడు.
    ఇంత గొప్పగా… చెడితే అందరూ చెడండి అని ఉద్భోధలు ప్రస్తుత సమాజానికి అవసరం లేదు. ఈతని భావజాలం పురోగమనం కాదు, తిరోగమనం.

  • అన్న మీ వ్యాసం బాగుంది.నేడు యువత మీద సినిమా ప్రభావం చాలా వుంది. మద్యం,పొగ తాగడం అదో పాశన్ లా ఫీలౌతున్నారు. సినిమాల ప్రభావం లేదని చెప్తున్నారు. సినిమాల్లో హీరో ల ఆటిట్యుడ్సే చాల మంది యువత వారి లాగ ఫీలౌతూ మందు తాగడం సిగరెట్స్ తాగడం చేస్తున్నారు.లవ్ అనే పదం సినిమాల నుండే వచ్చింది దాని వల్ల నిజ జీవితంలో ఎంతమంది బాగుపడ్డారు.సినిమాల్లో సుఖాంతమైనప్పటికీ బయట అందరి జీవితాల్లో అలా జరగదు.యివన్ని వ్యసనాలు.వంద శాతం సినిమాని వినోదం అనే అనాలి,ఎందుకంటే విజ్ఞానంతో కూడుకున్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి వినోదంతో కూడుకున్న విషయాలు ఎన్ని వస్తున్నాయో కంపార్ చేస్తే తెలుస్తుంది.సినిమాల్లో మంచి చెప్తే 20 శాతమైనా తీసుకుంటారు.కాలక్షేపానికి
    బాగుంటాయి, ఈ విషయం మీరు అంగీకరించవచ్చు.నేను మీ అంత విరివిగా చలం గారిని చదవలేదు. ఓషో గారిని అసలే చదవలేదు. ఈ విషయం మీకు తెలుసా‌!కాని చలం గారు ఒక సమయంలో చరమ దశలో ఆయన రచనల పట్ల అసంతృప్తి గా ఫీలయ్యాడు అని ఎవరో చెప్తే విన్నాను. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే సెక్స్ గురించి మీరు కోరుకుంటుంది విచ్చల విడి గా శృంగారం.విశృంఖల శృంగారం.

  • చలం స్త్రీకి లైంగిక స్వేచ్ఛ ఉండాలి అన్నాడు. అయితే దానికి అర్థం కంటి కి నచ్చిన ప్రతీ వ్యక్తితో సెక్స్ చేయమని కాదు. శృంగారం అనేది కేవలం శరీరాల కలయికగా కాక రెండు ఆత్మల కలయిక కావాలి అన్నాడు.
    దానికి వక్ర భాష్యాలు చేస్తు విచ్చలవిడి శృంగారాన్ని ప్రోత్సాహిస్తూ జంతువుల్లా ప్రవర్తించటం కాదు.
    అలా చేస్తే మనిషికి పశువుకి తేడా ఏంటి?

  • ప్రవీణ్ గారు మీ రాతలలో కొత్త ఒరవడి కనిపిస్తుంది.. ఇంతకు ముందు మీరు రాసిన వ్యాసాలు చాలా చదివాను . మీరు రాసిన వ్యాసం సారంగ‌ లో రావటం ఆనందం గా ఉంది. ఏ మార్పులకు లోనవకుండా మీ మార్క్ ని కొనసాగిస్తారని ఆశిస్తూ, ఇంకా మీ నుండి మంచి రచనలు రావాలని కోరుతున్నాను..ఆల్ ది బెస్ట్…

  • బాగా విశ్లేశించారు. నాకు తెలిసిన వర్మ చెప్పేదీ అదే.
    కొందరు దీన్ని మళ్ళీ వావివరసలు లేని జంతు ప్రవృత్తిలోకి మళ్ళడం అనుకుంటున్నారు. కాదు. జంతువులకు వావివరసలు, చిన్నాపెద్ద తేడాలు వుండవు. కానీ మనిషి ఆ తేడాలు గుర్తించగలడు. ఆ తేడాలు గుర్తిస్తూనే పురుషుడికి స్త్రీ యొక్క అవసరాన్నీ గుర్తించాలి. ఎవరితో కూడాలి, ఎప్పుడు కూడాలి అన్నది పూర్తిగా స్త్రీ యిష్టాన్ని బట్టి వుండాలి. కానీ నాగరికత పేరుతో, కుటుంబ వ్యవస్థ పేరుతో, శారీరకంగా బలవంతుడైన పురుషుడు స్త్రీనుండి ఆ హక్కును కాజేశాడు. అది ఆమెకు తిరిగివ్వాలి. ఆమె హక్కును ఆమెకు తిరిగివ్వడం అంటే విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించినట్లూ కాదు. జంతువుల్లా వావివరసలు మరచి కామకలాపాలు సాగించమనీ కాదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు