బ్రహ్మకమలాల వాన 

న్ని కల్పాలు

చిలుక్కుని చిలుక్కుని ఎవరెగరేసుకున్నారో –

ఆకాశానికి ఉట్టి కట్టుకున్న

రాత్రి చల్లకుండలో వెన్నముద్దలా తేలుతోంది

చలువచందనాల పంజరంలో

నేలనేలనంతా బందీ చేసుకుపోతోంది

 

మునిమాపు వంకల్లో

పూబంతులాడుకుంటున్న వేళ –

కొత్త పెళ్లికొడుకెవరో కొంటెగా విసిరేస్తే

ఆకాశాన పండిన జాజిపూలచెండు

ఆమె నవ్వంత మెత్తగా

నులిచలి వెచ్చదనాల పాలపుంతల్ని వీస్తోంది

ఏరులయ్యే మరుల్ని మెదిపిమెదిపి

ఏ గాంధర్వ లోకాలో

కొసరి విసిరిన కొండసంపెంగ వాగు

అలను వెదుక్కుంటున్న పడవ కోసం దిగి వస్తుంటే

పడవకు పాటలు నేర్పే తెరచాపలా

పుడమి చెంగు విప్పుకుంటోంది

 

విచ్చుకోబోతున్న నెమలికన్నుల్ని దూసేసి

ముద్దచామంతుల బంతిని మంత్రపుష్పంగా కుదేసి

సెగలదొర అటెళ్లగానే, ఈ వైపునుంచి ఎవరో

చుట్టూ పిల్లనగ్రోవుల్ని పేర్చి

ఒడిని పట్టని కలల్ని సీతాకోకల్ని కమ్మని శపించి

నిలువెల్లా మొగలిపొదలా మండించి

చెరుకువిల్లును లాగి విడిచిన

చెంగలువల రాతిరి – కమ్మని శత్రువై –

ప్రతిసారి తియతీయని ఓటముల్ని నాటిపోతోంది

 

సరసగంధపు సమీరాల మీద మంచె కట్టుకుని

కాంతితోపులో కాలు తప్పిన ప్రతి ఏకాంతంలో –

నీలినీలి సెలకలో రేకలు తొడిగిన ఆ దేవమల్లి

గుమ్మపాలొలికే స్థనాన్నందించి

చదువుకోలేనంతటి కవిత్వాన్ని ముందు గుమ్మరించేసి

ఇప్పపూల రసాల్లో మునకలేయించి

ఎక్కడ వాలాలో ఎరుగని పిట్టని చేసిపోతోంది

అనేకానేక ఆకాంక్షల్ని వెంటేసుకొచ్చి

నాలో నాకే ఎన్నో పురుళ్లు పోస్తూ

సరికొత్త భువనాలకు చాళ్లు కడుతోంది.

***

బతికి చెడుతూ చెడి బతుకుతూ

చావు పుట్టుకల్ని గెలవలేక

ఎన్ని జీవితాల్ని వెళ్లమార్చుకుందో కానీ

వెన్నెల ఎండకాగిన మనసులన్నీ

ఓటమి పొదరింట ఇంకోసారి

ఓనమాలు దిద్దుకోవటానికే

ఇష్టంగా పందెం కాస్తుంటాయి

 

పందేనికి ఓటమికి, ఓటమికి పందేనికి మధ్య

పురిటి సుగంధాలింకా ఇగిరిపోని

ఊహామోహాల నెమలీకలు

పూలవాకిళ్లలో దొర్లించి దొర్లించి

ఊపిరాడకుండా చేస్తున్నాయో…

గుండెగోడన మసకచిత్తరవుల్లా మునగదీసుకున్నాయో…

రెండూ కాకుండా–

పిచ్చుక గూళ్లలోకి అలల్ని దొర్లించుకుంటున్నాయో…

తెలియనంతగా ఇంద్రజాలాల తివాచీ నిండా

నిండా నిండా ప్రవహిస్తున్న ఇంద్రధనస్సులు

ఇంద్రధనస్సులు మోయలేనన్ని దీపావళులు

దీపావళుల్ని సురగంగలైపొమ్మని దీవిస్తూ

ఎడతెరపి లేకుండా కురుస్తున్న

బ్రహ్మకమలాల వాన!

అది, దివ్యాంగనలెవరో

పిండిపోస్తున్న చనుబాల ధార!

ఊహకు ఊపిరికి, మట్టికి మనిషికి,

శిలాజానికి స్వరానికి, నిన్నటికి రేపటికి,

ఎండకు చీకటికి, అనంతానికి అసంబద్ధతకు కూడా

సంగీతంలా అల్లుకున్న

చనుబాల ధారల నురగల వెన్నెల

వెన్నెల వెన్నెల వెన్నెల

దివ్యపారిజాతాల కస్తూరీ జాతర

*

యార్లగడ్డ రాఘవేంద్రరావు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది సార్. భావుకత సుతిమెత్తని తూలికై .. నా వొళ్ళంతా స్పర్శించినట్టుంది. పదాలన్నీ నెత్తావి సుగంధాలై బ్రహ్మ కమలాల వాన కురిపించాయి.

    • ధన్యవాదాలు గొరుసు … కవిత చదివి వెంటనే స్పందించి నందుకు, ప్రశంసించినందుకు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు