నిత్య యవ్వని ఆన్న కరినీన 

న్న కరినీన కాలం ఎప్పుడో పాతబడిపోయింది. 140 ఏళ్ళయినప్పటికీ నేటికీ సజీవంగానే నిత్య యవ్వనిలాగే పుస్తకం, నాటిక , సినిమా, రేడియో నాటకం, బాలే.. ఏదో ఒక రూపంలో  ఆన్న కరినీన  మనని  ఏడ్పిస్తునే ఉంది. హింసిస్తూనే ఉంది. తమని తాముమలుచుకునేందుకు దోహదం చేస్తూనే ఉంది. జీవితాన్ని ప్రేమించేందుకు చోదకశక్తి అవుతూనే ఉంది.

ఓ సందర్భంలో  ‘నేను రాసిన దాన్ని ఈనాటి పిల్లలు 20 ఏళ్ళు చదువుతారని, వాళ్ళు ఏడ్చి, హింసించి జీవితాన్ని ప్రేమిస్తారని నాకు చెబితే నేను నా యావజ్జివితాన్ని  సకల శక్తుల్ని దానికే అంకితం చేసేవాడిని’ అన్నాడు టాల్ స్టాయ్. కానీ, ఇరవై ఏళ్ళు కాదు ఇప్పటికీ  ప్రపంచంలోనే అత్యంత ఆరాధిత 10 నవలల్లో  మొదటిస్థానంలో  ఉన్న క్లాసిక్ “ఆన్న కరినీన”.

టాల్ స్టాయ్ అంతరంగాన్ని ఆవహించి, ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నం చేసిన తొలి నవల “ఆన్న కరినీన” రష్యన్ మెసెంజర్ పత్రికలో ధారావాహికగా దాదాపు ఐదేళ్లపాటు (1873 నుండి 78 వరకూ) వచ్చింది. ఆ తర్వాత నవలగా వచ్చింది. రచయితగా టాల్ స్టాయ్ కి గొప్ప పేరు తెచ్చిపెట్టింది.

ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదమైన ఆన్న కరినీన నవలను ‘జీవిత యావత్ వ్యవస్థనీ కఠోరంగా, నిర్ధాక్షిణ్యంగా విచారణ చేస్తుంది ఈ నవల’ అని వ్యాఖ్యానించిన రష్యన్ కవి ఏ.ఫెత్  మాటలు అక్షరాలా నిజం అని ఈ నవల చదివాక ఒప్పుకోక తప్పదు.

మాతృత్వాన్ని సామాజిక కోణంలో చూడడం, అన్యాయమైన చట్టాలను బద్దలు కొట్టడం, విడాకుల వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని తొలగించి సులభతరం చేయడం, మహిళల్ని పౌరులుగా గుర్తించడం, సమాజంలో మహిళలకు స్వేచ్ఛ సమాన ప్రతిపత్తి, సాంఘిక రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో స్త్రీలకు సమాన భాగస్వామ్యం, హక్కులు కల్పిస్తూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడం వంటి ఎన్నో మార్పులు రష్యన్ సమాజంలో బోల్షివిక్ విప్లవనంతర కాలంలో చోటు చేసుకున్నాయి. అదే విధంగా భూములపై భూస్వాముల ఆధిపత్యం తగ్గిపోవడం పాత సమాజాన్ని పునర్వ్యవస్థీకరించు కోవడం మనకు తెలిసిందే.

అక్టోబర్ విప్లవం తర్వాత రష్యన్ సమాజంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా మహిళల జీవితంలో వచ్చిన అనేక మార్పులగురించి అనేకానేక సందర్భాల్లో మనం చాలా చదివాం. అయితే, అక్టోబర్ విప్లవానికి ముందే రాసిన టాల్స్టాయ్ రచనలను చూస్తే అతని  దార్శనికత అర్ధమవుతుంది. 1870లో రష్యన్ విప్లవంలో స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో టాల్ స్టాయ్ మహిళల జీవితంలో వచ్చే మార్పుల్ని ముందుగానే పసిగట్టి ఎన్నో ప్రశ్నలను తన పాత్రలతో సంధింపచేసినట్లు అనిపిస్తుంది.

పెయింటింగ్: గిరిధర్

జీవితాన్ని హత్తుకుని గాఢంగా పరిశీలించి, పరిశోధించి పాత విలువల స్థానంలో కొత్త విలువల్ని పొందుపరిచే సాహసోపేతమైన నిర్ణయంగా అగుపిస్తుంది ఆన్న కరినీన.  జీవితం లేవనెత్తే అనేక ప్రశ్నలకి, సందేహాలకి ఆనాటి “ఆన్న కరినీన”లో ఈనాటికీ సమాధానాలు దొరుకుతాయి. ఆనాటి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థని అద్భుతంగా కళాత్మకంగా మన ముందు పరిచారు రచయిత  .

కుటుంబ ఇతివృత్తంగా సాగినట్లు కనిపించే  ఈ నవల అంతకు మించి  జీవితం ఎంత కఠినంగా, క్లిష్టంగా ఉంటుందో తెలుపుతుంది.  కుటుంబాలు ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ముందుకు సాగుతూనే ఉండాలని చెప్తుంది. అట్లాని సమాజాన్ని వదిలి పెట్టలేదు. పందొమ్మిదో శతాబ్దంలో రష్యాలో జరిగిన అతిపెద్ద రాజకీయ, సాంఘిక మార్పులు, ఆనాటి రష్యన్ సొసైటీ వాస్తవిక ప్రపంచాన్ని అందులోని క్లిష్టతలు, మహిళల సంఘర్షణలను ఈ నవలలోని పాత్రలు మనకి చెప్తాయి. నాగరికత పతన దిశగా సాగుతోందని 140 ఏళ్ళక్రితమే చెప్పాడు రచయిత. రష్యా సమాజంలో రాబోయే మౌలిక మార్పులకు సూచన ఈ నవలలో కనిపిస్తుంది.

ఈ నవలలో పాత్రల అంతరంగ లోతులోకెళ్ళి విశ్లేషించడంతో పాటు, అతి చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్కోవడం,  ప్రకృతినో, మనిషినో, సంఘటననో, సన్నివేశాన్నో కళ్ళకు కట్టినట్టు వర్ణించడం, సమాజంలో జరిగే ప్రతి చిన్న సంఘటనల్ని వదలకుండా అద్భుతమైన శైలితో, నైపుణ్యంతో కళాత్మకంగా చెక్కిన నవల “ఆన్న కరినీన”.

అద్భుతమైన శారీరక లావణ్యం గల ఆన్న కరినీన ఇందులో ప్రధాన పాత్ర. ఆమె  వివాహిత. ఉన్నత సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ప్రభుత్వంలో మంచి హోదాలో ఉన్న ఆమె భర్త 20 ఏళ్ళు పెద్దవాడు. తన ఉద్యోగ బాధ్యతల్లో మునిగి ప్రేమంటే ఏంటో తెలియకుండా యంత్రంలా పనిచేసుకుపోయే కరినీన్ అంటే ఆన్నకు ఏవగింపు. అసహ్యం. జీవితాన్ని కోరికలూ, వ్యామోహాలూ తృప్తి పరుచుకోవాలనుకునే ఆన్నకి కరినీన్ తో వైవాహిక సంబంధంలో సంతోషం లేదు. పైగా తీవ్ర అసంతృప్తి.

అటువంటి ఆమెకు తనలాటి మనస్తత్వం కలిగిన వ్రాన్ స్కీ తారసపడడం అతని ప్రేమలో మునిగిపోవడం, ఆ విషయం ఎటువంటి సందిగ్దత లేకుండా పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసినా భర్తకి చెప్పేయడం.. అప్పటివరకూ కొడుకుకోసమే బతికిన ఆమె, ఆ కొడుకుని భర్తకి వదిలేయడం (ఆనాటి చట్టాల ప్రకారం).  ప్రేమ పండించించుకోవడం కోసం అప్పటివరకూ తామున్న రష్యన్ సమాజాన్ని వదిలి కొంతకాలం యూరోపియన్ సమాజంలో తిరిగొచ్చి ‘చట్ట వ్యతిరేక కుటుంబం’ గా జీవించడం… పైకి ఇద్దరూ  ఆనందంగా ఉన్నట్లు కనపించినా లోలోన ఎవరికి వారు సంఘర్ధిస్తూనే ఉండడం, చివరికి ఆమె జీవితం అత్యంత విషాదంగా ముగియడం.. స్థూలంగా చెప్పుకుంటే అదే కథ. ఈ మధ్యలో వీళ్ళ చుట్టూ అల్లుకున్న ఎన్నో పాత్రలు చాలా సహజంగా వచ్చి పోతుంటాయి.

ఆన్న ఒక కాలానికీ, ఒక సాంఘిక బృందానికీ, అంటే సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన మహిళ. ఆనాటి సమాజపు నియమాలకు, ఆచారాలకు, నీతులకు విరుద్ధంగా కనిపించే ఆమె తత్వన్నీ, తనను తాను వంచించుకుంటూ తన సహజ స్వభావానికి విరుద్ధంగా నటిస్తూ బతకలేని తనాన్ని ఆమె ఆంతరంగిక లోతుల్లోకి వెళ్లి ఆవిష్కరిస్తుంది ‘ఆన్న కరినీన’. నిజమైన ప్రేమను అనుసరించి జీవితాన్ని, తనకున్న అన్నిటినీ నష్టపోయినా ఆమె తన స్థితికి, తాను సమాజానికి దూరం కావడాన్ని ఎవరినీ తప్పుపట్టదు. నేరారోపణ చేయదు. కానీ ఆమెను ఆనాటి సమాజం వెలి వేసింది. చట్టం, మతం, సమాజం ఆమెను దోషిగా చూశాయి. అయినా ఆమె వెరువలేదు. తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. తన పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడని సమాజంలోకి వచ్చే తెగువ చూపింది.

మామూలుగా చూస్తే.. దిగజారిపోయిన దోషిగా, జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తిగా, చివరికి జీవితాన్ని కోల్పోయిన వ్యక్తిగా కనిపిస్తుంది. కానీ, ఆ వెనుక ఇల్లు వదలలేక, ప్రియుడిని చేరకుండా ఉండనూలేక ఆమె మనో సంఘర్షణ, గాఢమైన ఆమె ఆంతరంగిక శక్తిని చిత్రించడంలో రచయిత గొప్ప నైపుణ్యం స్పష్టమవుతుంది.

అదే విధంగా భార్య తనని కాదని వెళ్ళిపోతానన్నప్పుడు పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు నిలుపుకునే ప్రయత్నంలో  ‘లోకులకి తెలియకుండా ఉన్నంత కాలం, నా పేరుకి భంగం కలగనంత కాలం భార్యని ఉపేక్షిస్తానని ఔదార్యం చూపుతూనే లేదంటే తన గౌరవం కాపాడుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భర్త  కరినీన్ చేసిన హెచ్చరిక లక్ష్య పెట్టి అతని ఔదార్యాన్నిఅంగీకరించలేని ఆమె దృఢమైన వ్యక్తిత్వం అగుపిస్తుంది.

విడాకులు తీసుకొమ్మని వదిన డాలీ మధ్యవర్తిత్వం నెరపినప్పుడు ఇలా అంటుంది  ‘నను ప్రాణ ప్రదంగా చూసుకునే వాళ్ళు కొడుకు, నా ప్రేమికుడు. వాళ్ళని వోకోక్కళ్ళని కలపలేను. నాక్కావల్సింది అదొక్కటే.. అలా చేయలేనప్పుడు ఇక ఏదన్నా ఖాతరు చేయను. జరిగేది జరుగుతుంది’ ఉన్నత సమాజపు మహిళల్లో కన్పించని  తెంపరితనం ఆన్న కరినీనలో కనిపిస్తుంది.

విజయ కాంక్ష, ఉన్నత సమాజం, రాజదర్బారు .. వ్యామోహాలు ఎక్కువ ఉన్న అన్నా ప్రియుడు వ్రాన్ స్కీది పెళ్లి జంఝాటంలో ఇరుక్కో కూడదనే తత్త్వం. అందుకే అన్నాని  భర్తని వదిలి తనతో వచ్చెయ్యమని చెప్పడు. కానీ వివాహబంధంలో లేకుండా అతనికి  ఆమె కావాలి అనుకుంటాడు. కానీ అతని ప్రేమకోసం తపించే ఆన్న కరినీన భర్తను వదిలి వ్రాన్ స్కీని చేరుతుంది. వారి ప్రేమబంధంలో వారికో కూతురు. ఈ సందర్భంలో వ్రాన్ స్కీ డాలీతో అన్నమాటలు ఇక్కడ చెప్పుకోవాలి.

‘నా కూతురు చట్ట ప్రకారం నా కూతురు కాదు. కరినీన్ కూతురు. ఇలాంటి అబద్దాన్ని నేను సహించను’ రేపు కొడుకు పుట్టొచ్చు.. నా కొడుకు చట్టప్రకారం కరినీన్ కొడుకవుతాడు. నా పేరుకి, నా ఆస్తికి వారసుడు కాదు.. నాదంతా నా తర్వాతి వాళ్ళకి సంక్రమించాలి. కానీ నా విషయంలో అలా కాదు.. తన బిడ్డలు  తాను ప్రేమించే స్త్రీకి .. పుట్టిన బిడ్డలు తనకి కాకుండా మరో మనిషికి వాళ్ళని అసహ్యించుకునే మనిషికి వాళ్ళతో ఏ సంబంధం లేని వ్యక్తికీ చెందడాన్ని.. ఆ కన్న తండ్రి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో.. ఆలోచించండి’ అంటాడు (ఆన్న- కరినీన్ లు చట్టరీత్యా  విడాకులు తీసుకోక పోవడం వల్ల).  వ్రాన్ స్కీ ద్వారా ఆనాటి రష్యన్ సమాజపు చట్టాల్లో, వివాహవ్యవస్థలో ఉన్న లోటుపాట్లని ఎత్తి చూపుతుంది ఈ నవల.

అంతే కాకుండా దారి తప్పి  విచ్చలవిడిగా ప్రవర్తించే మగవాళ్లని చూసీచూడనట్లు వ్యవహరించే సమాజంలో, తమలో కలుపుకునే సమాజంలో ఒక వివాహిత  మరొకరితో సంబంధం ఏర్పరచుకుని పూర్వపు బంధాన్ని వదిలితే ఆమెను వెలివేసే సమాజపు పోకడను, వివాహబంధానికి ఆవల ఏర్పర్చుకునే బంధాలు పురుషుల విషయంలో ఒకలా స్త్రీల విషయంలో మరోలా ఉన్న ఆనాటి మహిళల స్థితిని తెలుపుతుంది.  మనుషుల్లో ఉండే అనేకానేక మనస్తత్వాలు, ద్వంద్వ వైఖరులు మనకిందులో దర్శనమిస్తాయి.  మనిషి జీవన విధానానికీ, అభిప్రాయాలకి మధ్య ఉండే తేడాలు ఇందులోని పాత్రలు తెలుపుతాయి.

చట్టం, మతం చట్రంలో ఆనాటి రష్యన్ సమాజం ఇరుక్కుపోవడం వల్ల వాస్తవ జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు లెవిన్- కిట్టీల పెళ్లి సమయంలోను, వ్రాన్ స్కీ – అన్నాల సహజీవనంలోను ఉన్న సమస్యల్ని, రైతాంగ సంస్కరణల తర్వాత భూస్వామ్యపు పోకడలను చర్చకు పెట్టారు రచయిత. అప్పటి సమాజానికంటే ముందుకు నడిచి  చర్చకు పెట్టడం గొప్ప సాహసమే.

ఆనాటి రష్యన్ సమాజం, సొంత ఆస్తి, రాజ్యం  చారిత్రక సంఘటనలూ వాటి చారిత్రిక సంబంధం, సంస్కృతి, ఉన్నత సమాజపు ఆచార వ్యవహారాలూ, కుటుంబ వ్యవస్థ, చట్టాలు, మతం, మారుతున్నభూస్వామ్య వ్యవస్థ రూపాలు, బానిసత్వ నిర్మూలనకు పోరాటాలు, ఆర్ధిక వ్యవస్థ, ప్రజా చైతన్యం, పితృస్వామిక రైతాంగ జీవితంలో కుటుంబ సూత్రాలూ, శ్రమజీవన సౌందర్యం, వ్యవసాయం, వేట, రష్యన్ సమాజంలో ఉన్న 5 వర్గాలు, యుద్ధం, నిర్బంధ సైనిక కొలువు, సైనిక సంస్కరణలు, భూస్వామ్య రాచరికం నుండి బూర్జువా రాచరికంగా మారడానికి తోడ్పడ్డ అభివృద్ధి, పౌర ఉద్యోగాల్లో హోదాలు, వంశపారంపర్యంగా వచ్చే బిరుదులూ.. ఎన్నో విషయాలు నవలలో చర్చకొచ్చాయి.

రచనా కాలం నాటికి అనేక తరగతులుగా ఉన్న రష్యన్ సమాజం, ఆ తరగతుల్లో వారి సాంఘిక హోదాలో ఉన్న అంతరాలు, ఉన్నత తరగతుల్లో వారికుండే వసతులు, స్వేచ్ఛ, మిగతా వారి విషయంలో ఉన్నహెచ్చుతగ్గులు చూస్తే మన దేశంలో కులవ్యవస్థ రూపాలు గుర్తొచ్చాయి

మగవాళ్ళు మేజాబల్ల దగ్గర భోజనానికి కూర్చుంటే ఆడవాళ్లు నుంచుని వాళ్లకు వడ్డన చేయడం,  విద్య లేకపోవడం, ఆడవాళ్ళకి హక్కులు లేకపోవడం స్త్రీ విద్య గురించి వారి సామర్ధ్యం గురించి చర్చ, దాంపత్య హక్కులు, అసమానత్వం..  ఇవన్నీటినీ చూసినప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా స్త్రీల సమస్యలు, వాళ్ళను చూసే చూపు ఒకటిగానే ఉన్నట్లుగా తోచింది.

టాల్ స్టాయ్ సమకాలీన రచయిత దోస్తవిస్కీ ఈ నవల గురించి అన్న మాటలు ఇక్కడ తప్పక చెప్పుకోవాలి  ‘తాను వర్ణించే యదార్ధానికి సంబంధించిన అతి చిన్న వివరాలని కూడా (చారిత్రకమైనవీ , వర్తమానానికి సంబంధించినవీ) తెలుసుకుని ఉండాలన్న తిరుగులేని తీర్మానానికి  వచ్చేను నేను. ఈ విషయానికి సంబంధించి ప్రతిభావంతుడైన రచయిత మనదేశంలో కౌంట్  లియో టాల్ స్టాయ్ ఒక్కడేనని నా అభిప్రాయం’.

*

శాంతిప్రబోధ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ చట్టం, మతం, సమాజం ఆమెను దోషిగా చూశాయి. అయినా ఆమె ( అన్నా కెరనీనా ) వెరువలేదు. తిరుగుబాటు బావుటా ఎగురవేసింది “. టాల్ స్టాయ్ నవల “ఆన్న కరినీన” ను అద్భుతంగా విశ్లేషించిన శాంతిప్రబోధ గారికి కృతజ్నతలు.

    ఎమెస్కో బుక్స్ లక్ష్మి గారి సాహితీ ప్రచురుణల నుండి తాజాగా వెలువడిన యీ అమూల్యమైన పుస్తకం నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైద్రాబాద్ వారి వద్ద కూడా లభ్యం.

    https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/anna-keranina-tolystoy

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు