ఖాళీ పేజీలు -4

అతని పరిస్థితి చూస్తే జాలేసింది స్వరూప్‌కి. ఏమయ్యిందో అర్థం కావడం లేదు.

 [క్రితం వారం  పేజీలు:

 ప్రాహీలో వచ్చిన మార్పు చూసి ఆమె అమ్మా, నాన్నా ఆశ్చర్యపోతారు.  రాజు ఎలా పోయాడని అడుగుతాడు ప్రాహీ తండ్రి. జవాబు చెప్పకుండా దాట వేస్తుంది ప్రాహీ.

  నేహాని రిసీవ్ చేసుకోడానికి సుధీర్ రావడంతో అతని కారులో వెళిపోతుంది నేహ. శీను మీద నీరు కోపగించుకుంటుంది, నేహాతో అతను కలిసి ఉండడం ఇష్టం లేక.

నేహా అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని ఆవిడ కోరిక తీర్చడం కోసం శీనూ, నేహా పెళ్ళి చేసుకుంటారు. ఆవిడ చనిపోగానే విడాకులు తీసుకో వచ్చన్న  ఆశతో.

 బీ.ఎమ్.డబ్లుయూ  కారు అప్పు చేసి  తీసుకు కొందని దీప మీద తల్లి కోపగించుకుంటుంది. అదీ నీరజ్‌కోసం కొన్నందుకు. దీప తల్లి ముందర కారు ప్రస్తావన తీసుకొచ్చినందుకు బాధపడతాడు స్వరూప్. 

 తల్లిని ఆర్నెల్లు ఎలా నెట్టుకురావాలా అని దీప చికాకు పడుతుంది. 

 దేవవ్రతని కలవడానికి అతని ఇంటికి వెళతాడు స్వరూప్.  భార్య ఫ్లైట్ మిస్సయ్యిందని దిగాలు పడతాడు దేవవ్రత. ఈమెయిల్ చెక్ చేస్తే, అది చదివి భోరున విలపిస్తాడు దేవవ్రత. ]

*

దేవవ్రతని ఊరుకో పెట్టడం స్వరూప్ వల్ల కాలేదు.

“ఒరేయ్! ముందు ఆ ఏడుపు ఆపి ఒకసారి మెయిల్ చూద్దాం. అది ప్రేంక్  కాల్ అయ్యుండచ్చేమో? ఒకసారి లాగిన్ అవ్వు. చూద్దాం!” అన్నాడు.

దేవవ్రత దిండులో నుండి తలెత్త లేదు. చికాకొచ్చింది స్వరూప్‌కి.

“ఒరేయ్! ముందా ఏడుపాపు! అసలా మెయిల్ నిజమో కాదో చూద్దాం!” అని కసురు కోవడంతో మంచమ్మీద నుండి లేచి లాగిన్ అయ్యాడు.

స్వారూప్ ఆత్రంగా మెయిల్ పైకి చదవడం  మొదలు పెట్టాడు:

— మిస్టర్ దేవవ్రత! నీకూ, నాకూ పొత్తు కుదరదు. త్వరలో విడాకులు తీసుకుందాం. నాకోసం మా అమ్మా, నాన్నలని హెరాస్ చెయ్యకు. ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టావో నీమీద హెరాస్మెంట్ కేసు పెడతాను. ఇది అమెరికా. ఇండియాలా కాదు. నిన్ను జైలుకి  పంపడం చిటెకలో పని…– అనూ.

“దేవా! మెయిల్ ఐ.డి కరక్టేనా…?” స్వారూప్ అనుమానంగా చూస్తూ అడిగాడు.

“అది ఆమెదే!…” అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు.

వేంటనే ఫేస్‌బుక్ లాగిన్ అయ్యాడు స్వరూప్. అనూ అక్కడేమయినా పోస్ట్ చేసిందేమో చూడ్డానికి.

“ఒరేయ్! అనూ ఫేస్‌బుక్ ఎకౌంట్ డిలీట్ చేసేసిందేమోరా…? సెర్చ్‌కి కూడా దొరకడం లేదు…” అన్నాడు.

దేవవ్రత ఆత్రంగా వచ్చి చూసాడు. తన పేర మీద లాగిన్ అయ్యి చూసాడు. అను పేజే కనిపించలేదు. అనూ తల్లి తండ్రుల పేజ్ కూడా కనిపించ లేదు.

“ఒరేయ్! నన్ను బ్లాక్ చేసి ఉండచ్చు. నువ్వు మరలా లాగిన్ అయ్యి చూడు…” మొహం తుడుచుకుంటూ స్వరూప్‌ని అడిగాడు.

“చూసాన్రా! వాళ్ళు నా సెర్చ్ లో కూడా దొరక లేదు…ఓ పని చేద్దాం. ఇండియాలో తెల్లారేక మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పు. అక్కడే వాళ్ళని వాకబు చెయ్యమను!” అన్నాడు.

అలాగే అంటూ తలూపాడు కానీ, దేవవ్రత మొహంలో కన్నీళ్ళు ఆగడం లేదు.

“ఒరేయ్! ముందు ఆ ఏడుపాపు. ఆడాళ్ళ కంటే ఘోరంగా ఉన్నావు. అక్కడ ఇండియాలో ఏమైనా గొడవలు జరిగాయా….?”

లేదన్నట్లు తలూపాడు దేవవ్రత.

“గోడవలేమీ లేకపోతే…మరిదంతా…?”

“పెళ్ళయ్యాక గోవా హనీమూన్‌కి వెళ్ళాం. నాతో చాలా సంతోషంగా ఉంది. ఒక్క చిన్న పాటి కోపం కూడా లేదు. ఏంటో, నాకేమీ అర్థం కావడం లేదు…ఆఖరికి వచ్చే ముందు కూడా నాతో…” గట్టిగా ఏడుస్తూ తలగడలో తల దాచుకున్నాడు దేవవ్రత.

అతని పరిస్థితి చూస్తే జాలేసింది స్వరూప్‌కి. ఏమయ్యిందో అర్థం కావడం లేదు. దేవవ్రత స్వతహాగా నెమ్మదస్తుడు. ఇంకా చెప్పాలంటే పిరికి వాడు కూడా. కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిలతో మాట్లాడ్డానికి కూడా భయపడి పోయేవాడు.  ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఇప్పుడు నిలదీస్తే దేవ చెప్పలేడని అనుకున్నాడు స్వరూప్.

కాసేపాగాకా మెల్లగ ఆడగొచ్చని అనుకున్నాడు. అతనికీ ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో దేవవ్రతని వడిలి వెళ్ళడం మంచిది కాదని అనుకున్నాడు.

“ఓరేయ్! మొహం కడుక్కురా! స్టార్‌బక్స్ కెళ్ళి కాఫీ తాగొద్దాం. తెల్లారేకా మీ వాళ్ళతో మాట్లాడుదాం!” అన్నాడు.

సరే నని తలూపుతూ బాత్రూం వైపు వెళ్ళాడు దేవవ్రత.

——-

ఆ సాయంత్రం సుధీర్‌ని వెంట పెట్టుకొని శీను పార్ట్‌మెంటుకి వచ్చింది అను.

వాళ్ళు రాగానే శివ పనుంది, వెళతానని లేచాడు శివ.

“శివా! వెళిపోయాడేం…? అందరం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం కదా?” శీనూతో అంది అను.

“పొద్దున్నుండీ నాతోనే ఉన్నాడు. మీరూ వచ్చారని అడ్డు ఎందుకని వెళిపోయుంటాడు…” భుజాలు ఎగరేస్తూ నవ్వాడు శివ.

“అనూ! ఇంకో అర గంటలో మనం ఇండియా కాల్ చేద్దాం.  మీ అమ్మ వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడద్దు. కాల్ త్వరగా ముగించేద్దాం! కావాలంటే రేపు మాట్లాడచ్చు!” అని చెప్పాడు శీను. సరే నన్నట్లు తలూపింది అను.

వచ్చినప్పటినుండి సుధీర్‌ని బల్లిలా అంటిపెట్టుకునే వుంది.  అది చూసి ఎందుకో చికాకు కలిగింది శీనుకి. పైకి అనలేదు.

వేరే కబుర్లలో ఉండగా ఫోన్ మ్రోగింది. అది ఇండియా కాల్ అని తెలుసుకొని – “మీరు ఫోన్ పెట్టేయండి, మేం ఒక పదినిమిషాల్లో చేశ్తాం…” అంటూ అనూ వైపు తిరిగి – “మీ వాళ్ళే…ఫోన్!”  అన్నాడు.

ఇంతలొ కాలింగ్ బెల్ మ్రోగింతే వెళ్ళి డోర్ తెరిచి చూసాడు. వచ్చింది నీరూ.

వస్తూనే – “హాయ్!” అంటూ అడుగుపెట్టింది. ఒక్కసారి అనూని చూసి ఎందుకో వెనకడుగు వేసింది నీరూ.

“నో ఫార్మాలిటీస్!” అంటూ అనూ లేచి వెళ్ళి పలకరించింది. నీరూ మాట్లాడుతోంది కానీ ఎందుకో ఇల్లంతా పరికించి చూస్తోంది.

రెండు నిమిషాల తరువాత శీనే వాళ్ళతో అన్నాడు, ఇండియా కాల్ చెయ్యాలని.  వాళ్ళెవరూ అతని మాట పట్టించుకున్నట్లు లేరు.

మెల్లగా అనూ దగ్గరగా వెళ్ళి – “ఇండియా కాల్ చేద్దాం. అంతవరకూ సుధీర్‌ని బయట ఉండమను. లేదా బెడ్రూములో కూర్చో మను. నీరూకి నేను చెప్తాను!” అన్నాడు.

ఆ మాట వినగానే తోక తొక్కిన పాములా లేచింది అను.

“మన ఫోన్ కాల్‌కీ, సుధీర్ ఇక్కడ ఉండడానికి సంబంధం ఏవిటి…సిల్లీ” అంది.

“మనం చేసేది వీడియో కాల్! మీ వాళ్ళు చూస్తే మంచిది కా…” అని అంటూండగానే – “చూస్తే చూసారు. ఫ్రెండ్స్ అని చెబుదాం!” అని విసుగ్గా మది అనూ.

శీను ఏదో చెప్పబోయాడు కానీ వినడానికి అనూ సిద్ధంగా లేదని గ్రహించి ఆగిపోయాడు.

శీను ఇండియా కాల్ చేసాడు. అనూ వాళ్ళ అమ్మా, నాన్నా స్కైపులో కనిపించి మాట్లాడారు. అనూ వాళ్ళమ్మకి పక్షవాతం వచ్చింది. బెడ్ మీదే ఉంటుంది. ఆమె దగ్గరగా లాప్‌టాప్ పెట్టి చూపిస్తున్నారు ఎవరో!

“క్షే..మ..మంగా..” మాటలు ముద్దగా వినిపించాయి.

తల్లి తనకేసే చూస్తోందని గ్రహించి శీనూని పక్కకి లాగి అతని భుజాలమీద చెయ్యేస్తూ మాట్లాడింది అనూ.  ఒక్కసారి సుధీర్, నీరూ బిత్తర పోయి చూసారు.

మామూలు పలకరింపులు అయ్యేవరకూ, శీనుని అంటిపెట్టుకునే మాట్లాడింది అనూ. నీరూకి అది నచ్చలేదు. చికాగ్గా తలదించుకుంది. సుధీర్ కూడా లేచి దూరంగా వెళిపోయాడు.

వీళ్ళందర్నీ ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు శీను. పైకి మాత్రం ఏమీ అనలేదు.

“ఆ క్షేమంగా చేరానమ్మా! శీను ఎయిర్‌పోర్టుకి వచ్చాడు. ప్రయాణంలో అలసి పోయాను. మరలా రేపు ఉదయం మాట్లాడతానులే!” అంటూ ఫోన్ పెట్టేసింది అనూ.

ఆవతల వైపునుండి అనూ వాళ్ళమ్మ ఏదో చెప్పబోతోంది. అది పూర్తికానివ్వకుండా కట్ చేసేసింది అనూ.

“పాపం పెద్దవిడ ఏదో…” అంటూండగానే “ఇట్స్ ఓకే!” అంటూ చికాగ్గా అంది అనూ.

బాత్రూములొకి వెళ్ళి మొహం కడుక్కొచ్చింది అనూ.

“నేనూ, సుధీర్ డిన్నర్‌కి వెళుతున్నాం…బై” అంటూ చరచరా వెళిపోయింది. ఆమె వెనుకనే సుధీర్!

నీరూకి అనూ ప్రవర్తన చికాకు తెప్పించింది.

“మనల్ని కూడా పిలవచ్చు కదా…? ఏదో నీ మొహం చూసి ఒప్పుకున్నాను కానీ, ఐ రియల్లీ డోంట్ లైక్ హెర్…” అంది నీరూ.

“వాళ్ళు వెళితే వెళ్ళారు, మనం వెళదాం.  వాట్ ఈజ్ దేర్…?” విసుగ్గా తలూపాడు.

నీరూ ఏం మాట్లాడ లేదు.

వెళుతూ వెళుతూ తలుపేస్తూండగా – “డిన్నర్ అయ్యాక రాత్రికి అనూ ఇక్కడికే వస్తుందా…?” అనుమానంగా అడిగింది.

“ఏమో తెలీదు…” భుజాలు ఎగరేస్తూ అన్నాడు శీను. తెలీదా అన్నట్లు చూసింది నీరూ.

“కమాన్! డొంట్ బి సిల్లీ! వస్తే వచ్చింది లేకపోతే లేదు. హౌ డజ్ యిట్ మేటర్…?”

గబగబా మెట్లు దిగి వెళ్ళాడు శీను. అతని వెనుకే నీరూ!

———

అమ్మా, నాన్నా రావడంతో నీహార్‌కి ఒకటే సందడి. నిజానికి మా ఇంటికి కర్తార్ తప్ప ఎవరూ రారు. ఎప్పుడైనా వస్తే కర్తార్ కుటుంబం వస్తుంది. అది కూడా దీపావళి నేను పిలిస్తే!  ఒక్కోసారి వాళ్ళింటికి బంధువులు వస్తే మేమే వెళ్ళేవాళ్ళం.

అమ్మకి నీహార్ అతుక్కుపోయాడు. ఆవిడకేమో వచ్చీ రాని పొడి ఇంగ్లీషు ముక్కలు. వీడి తెలుగూ అంతే! వాళ్ళిద్దర్నీ చూస్తూంటే నవ్వొచ్చింది.

రెండ్రోజుల్లో వాడికీ అమ్మ భాష అదే అర్థమవుతుందని అనుకున్నాను.

నాన్న మాత్రం ఎక్కువగా మాట్లాడ లేదు. ఇల్లంతా పరికించి చూస్తూనే ఉన్నాడు.

సాయంత్రం డిన్నర్ అయ్యాక నేను రేపటి స్కెడ్యూల్ చూద్దామని కంప్యూటర్ దగ్గరకి వెళ్ళాను.  మర్నాడు అప్పాయింట్‌మెంట్స్, మిగతా వాళ్ళవీ చూస్తూండగా నాన్న నా వెనుకే వచ్చి నుంచున్నారు.

ఆయన వచ్చిన అలికిడికి తలతిప్పి చూస్తూ – “రేపటి వర్కు గురించి చూస్తున్నాను, నాన్నా!” నవ్వుతూ అన్నాను.

“ప్రాహీ! నిన్ను చూస్తూంటే నా కళ్ళని నేనే నమ్మ లేకుండా ఉన్నాను….” అన్నాడు.

“నీకే కాదు; నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది నాన్నా! రాజుబావ బ్రతుకుంటే వేరేలా ఉండేది…అవసరం కూడా ఉండేది కాదేమో…?”

“ఇంతకీ నీ ఉద్యోగం ఏవిటి…? ఏ కంపెనీ…”

“అదా! కంపెనీ నాదే. రాజ్ కార్ రెంటల్స్! మా దగ్గర ముప్పై వరకూ కార్లున్నాయి. అవి నడపడానికి డ్రైవర్లూ ఉన్నారు. ఇవన్నీ నేనే చూసుకుంటాను.

కర్తార్‌కీ ఈ బిజినెస్సులో 30% భాగస్వామ్యం ఉంది. రాజు బావ పోయాక

ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చింది.  అదీకాక వాళ్ళ కంపెనీ నుండి కొంత డబ్బు వచ్చింది.

ఈ కార్ రెంటల్స్ చెయ్యమని కర్తార్ చెప్పాడు. కర్తార్ రాజుబావకి చాలా ఏళ్ళగా పరిచయం. అతని బిజినెస్సు పెట్టుకోవడానికి రాజుబావ సాయం చేసాడు.

అతను నిలదొక్కుకునేలా ఆదుకున్నాడు. అందుకే రాజుబావ పోయాక అతను నాకు సాయం చేసాడు. నా ఈ వేషానికి అతనే స్ఫూర్తి…” చెబుతూంటే నా గొంతు మారింది.

నాన్న నాకేసి మొహం చిట్లిస్తూ చూసాడు. మరలా నేనే చెప్పడం మొదలు పెట్టాను.

“నిజానికి రాజుబావ పోయే సమయానికి నాకు వచ్చిన ఇంగ్లీషు అంతంత మాత్రమే!  కర్తారే నన్ను కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లీషు కోర్సులో బలవంతాన జాయిన్ చేసాడు.

కారు డ్రైవింగ్ నేర్పాడు. ఇలా ప్రతీ అవసరానికి అతనే ఉన్నాడు,”  వచ్చే కన్నీళ్ళు బయటకి రాకుండా ఆపుకున్నాను.

“ఎందుకొచ్చిన ఈ కష్టాలు? మేం ఉన్నాం కదా…?”

“లేదు నాన్నా! ఇది నా ప్రయాణం. ఆసరా కొంతవరకే! నిజం చెప్పద్దూ! రాజుబావ పోయాక నాకే తెలీని మొండి ధైర్యం వచ్చేసింది. అదే నన్ను ఇన్నాళ్ళూ నడిపించింది.

రాజుబావ ఉంటే జీవితం వేరేలా ఉండేదేమో తెలీదు…”  నా కంట్లో నుండి రాలిన రెండు కన్నీటి బొట్లు చూసి నన్ను దగ్గరకి తీసుకున్నాడు నాన్న.

ఇంతకాలం ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది.

నాన్న భుజం కన్నీళ్ళతో తడిపేసాను.

నాన్న మౌనంగానే ఉండిపోయాడు.

ఒక్కసారి తల తిప్పి చూసాను. దూరంగా నీహార్, అమ్మా!

నేను ఏడవడం నీహార్ చూడడం ఇదే మొదటి సారి.

ఒక్కసారి బెదిరి పోయాడు.

అమ్మని గట్టిగా కావలించుకున్నాడు.

రాజుబావ తరచూ అనేవాడు – దుఃఖంలో మౌనానికి మాటలెక్కువని!

———-

(ఇంకా వుంది)

గొర్తి సాయి బ్రహ్మానందం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు