“రావూజీగారి క్యూటీ కనబడటం లేదుట. ప్లేట్లో పెట్టిన పెడిగ్రీ పెట్టింది పెట్టినట్లే ఉందిట. గింజ కూడా ముట్టలేదుట.
రక్షణకవచం లాంటి సెక్యూరిటీని దాటుకుని బైటకు ఎలా వెళ్ళింది?” ఫోన్ చేసి సెక్యూరిటీ ఆఫీసర్ సింహని గదమాయిస్తూ అడిగాడు, కమ్యూనిటీలో రావూజీకి ప్రీతిపాత్రుడు, కుడిభుజంలాంటివాడు, బ్లూ క్రాస్ బ్రాండ్ అంబాసిడరులా పిలుపించుకునే ప్రభాకరం. ఇదే ఆదివారం బ్రేకింగ్ న్యూస్. కమ్యూనిటీ గ్రూపుల్లో, ‘మూగజీవుల ప్రేమిక’ సమూహాలలో వార్త దావానలంలా వ్యాపించింది.
“క్యూటీకి కోపం వచ్చిందా? గింజైనా నోట్లో పెట్టలేదంటే రావూజీ మీద అలిగిందా? కనబడకుండా ఎక్కడకెళ్ళింది?” అందరిలోనూ అవే ప్రశ్నలు. ముఖాల్లో ఆందోళనలు. రావూజీకి సానుభూతి చూపించడానికి ఉన్నపళంగా పెట్ లవర్స్ అంతా కట్ట కట్టుకుని గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసారు. రావూజీ సంఘసేవకుడిగా, కళాభిమానిగా మంచి పేరుంది. వ్యాపారవేత్త. ఆర్ధికంగా బలమైన వ్యక్తి. పట్టణంలో ఎన్నో సాహితీ,సాంస్కృతికసంఘాల గౌరవాఅధ్యక్షులు. ఇదంతా ఒక పార్శ్వమయితే మూగజీవులను మనుషులకంటే మిన్నగా ప్రేమించడం మరోకోణం. జనం సమస్యలని జపించేవాడు
‘జననేత’గా కీర్తించబడితే, మూగజీవుల సంక్షేమంకోసం పరితపించే రావూజీని ‘జీవరక్షక’ని పిలవచ్చు.
కమ్యూనిటీలో జరిగే ప్రతి సమావేశంలోనూ, వచ్చిన అవకాశం వదలిపెట్టకుండా, రాకపోయినా కల్పించుకుని మరీ పెంచుకునే జంతువుల గురించి గొంతు చించుకుంటాడు. వాటిని కాపాడుకోవలసిన అగత్యం మీద అనర్గళంగా మాట్లాడతాడు. అందుకే ఆ గేటెడ్ కమ్యూనిటీలో పెట్స్ ని పెంచేవారికి రావూజీ ఆరాధ్యదైవం.
క్యూటీ మిస్సింగ్ వార్త ప్రభాకరం పోస్ట్ ద్వారా జంతుప్రేమికుల గ్రూపుల్లో సంచలనమైపోయింది. కమ్యూనిటీలో జంతుప్రేమికులంతా వాళ్ళ కొంప, గోడు వదిలి బ్లాకుల మధ్య ఖాళీస్థలం బ్లాక్ చేసారు. గుంపులుగా గుమికూడారు. ఎలా వెతికి పట్టుకోవాలాని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. విషాదవదనంతో దిగులుగా కూర్చున్న రావూజీకి క్యూటీని ఇంటికి తెచ్చుకున్న రోజు గుర్తుకొచ్చింది.
వైజాగ్ కి చెందిన మిత్రుడు ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ఢిల్లీ ఇండస్ట్రియల్ సమ్మిట్లో కలసినప్పుడు మాటల మధ్య కుక్కలపెంపకం గురించి చర్చ జరిగింది. అప్పుడు జర్మనీ షెపర్డ్ జాతి ఇష్టమని రావూజీ చెప్పడం, క్షణాల్లో మేనేజర్ కి ఫోన్ చేయడం, వాళ్ళ లయన్ (పెట్ నేమ్ ) పెట్టిన పిల్లని పంపించే ఏర్పాటు చేస్తానని చెపితే, స్వయంగా వైజాగ్ తానే వస్తానని రావూజీ చెప్పాడు.
ఢిల్లీ నుంచి తిరిగి వెళ్ళగానే పనులన్నీ పక్కనపెట్టి విశాఖ వెళ్లి అపురూపంగా తెచ్చుకున్నదే క్యూటీ. చిన్నఅట్టపెట్టెకి నాలుగు వైపులా చిల్లులు పెట్టి, మధ్య మధ్య ముద్దుగా చూసుకుంటూ దర్జాగా కార్లో తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి రావూజీ ఇంటిల్లపాది క్యూటీని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అంత ప్రేమ పంచుకునే ఇల్లు వదలి క్యూటీ వెళ్ళిపోయింది.
ఆయన ఒళ్లో కూర్చున్న క్యూటీ పిల్లలు అమ్మకోసం పెట్టే ఏడుపుతో వాస్తవంలోకి వచ్చాడు రావూజీ. పసికూనల్ని చూసి రావూజీ గుండె తరుక్కుపోతోంది. భక్తబృందం మనసు అల్లాడిపోతోంది. రావూజీ చేతిలో ఉన్న క్యూటీ బెల్ట్ ఊపుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
“సార్! మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదిగా.” అన్నాడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
“మంచిదే, కాని కనీసం కమ్యూనిటీలోనూ, చుట్టుపక్కలు కూడా వెతక్కుండా కంప్లైంట్ ఇస్తే పోలీసోళ్ళు ముఖం వాచేలా చీవాట్లు పెడతారు.” క్యూటీతో, స్నూపీని కలపాలనే ఆలోచనలో ఉన్న బిల్డర్ సలహా ఇచ్చాడు.
“అదీ నిజమే.”మిగిలిన వారంతా సమర్ధించారు.
“సార్! ఇప్పుడేం చేద్దాం.” దిక్కు తోచక బుర్ర గోక్కుంటూ రావూజీ దగ్గర నిలబడ్డాడు ప్రభాకరం.
ఇంతలో సెల్లారులో కారు పార్క్ చేసి వచ్చిన భైరవ ఈ హడావిడి చూసి “ఏమిటీ మొత్తం కమ్యూనిటీ అంతా
ఇక్కడే ఉంది.” అని అడిగాడు.
“అంటే, గ్రూపులో మెస్సేజ్ చూడలేదా?” క్షమించరాని నేరం చేసినట్లు అడిగాడు ప్రభాకరం.
లేదన్నట్లు తలాడించి ఫోన్ తీసి చూడడం మొదలు పెట్టాడు భైరవ.
“మన రావూజీగారి కు…” ఒకక్షణం సంభాలించుకున్నాడు. రావూజీ విశ్వరూపం చూసిన క్షణాలు గుర్తుకొచ్చాయి.
అది క్యూటీ పిల్లల్నిపెట్టిన రోజు. అందరూ వెళ్లి చూసి రావూజీని అభినందిస్తున్నారు. స్వీట్స్ పంచుతున్నాడు.
ఒక్కొక్కరే క్యూటీ పిల్లలను, వాటి అందాల్ని గొప్పగా చెపుతున్నారు. ఒకరు నుదురు బాగుందంటే, మరొకరు నుదుట మీద నల్లమచ్చ దేవుడినామంలా అందాన్ని రెట్టింపు చేసిందంటున్నారు. మరొకరు మూతిని పొగిడితే, ఇంకొకరు మెడని వర్ణిస్తున్నారు. కొందరు గోళ్ళ శాస్త్రం చెపుతూ రావూజీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు.
అప్పుడే లోపలనుంచి వచ్చిన భైరవ “రావూజీ! కుక్క …” మాట పూర్తి కాలేదు. ఒక్కసారిగా కాలి కింద బాంబు
పేలినట్లు అంత ఎత్తు ఎగిరాడు రావూజీ.
“ఏం మాట్లాడతున్నావు. నోటికీ ఎంత వస్తే అంతా పేలడమే.”
రావూజీ కోపానికి కారణమేమిటో అర్ధంకాక బిక్కచచ్చిపోయి నిలబడ్డాడు భైరవ. చుట్టూ ఉన్న జనానికి కూడా
రావూజీ రంకెలకి కారణం తెలియలేదు. ఇంతలో లోపలనుంచి రావూజీ భార్య కమల కంగారుగా వచ్చింది. ఏమైందన్నట్లు అడుగుతూ అందరి మధ్య దోషిలా నిలబడ్డ భైరవను చూసింది.
“ఏమి లేదండీ. క్యూటీకి పుట్టిన కు…”
“మళ్ళీ అదేమాట. క్యూటీకి పేరుందిగా. నోటికీ వచ్చినట్లు పిలవడమేనా?” అగ్గి మీద గుగ్గిలంలా లేచాడు రావూజీ. కమలకు విషయం అర్ధమైంది.
“సరేలెండి, ఏదో తెలియక అన్నాడు. ఆవేశపడకండి.” అని సముదాయించింది. మాట్లాడిన మాటల్లో తప్పు
తెలియక భైరవ బిత్తరచూపులు చూస్తున్నాడు.
“చూడు భైరవా! ఆయనకు క్యూటీ అంటే ప్రాణం. కన్నబిడ్డ కంటే ఎక్కువ. అమెరికా వెళ్ళిన కూతురిని
మూడేళ్ళయినా చూడలేదని బెంగలేదు కాని క్యూటీని ముప్పై నిమిషాలు చూడకపోతే అల్లాడిపోతారు. అలాంటి క్యూటీ, ‘జంతువు’ అనేసరికి తట్టుకోలేకపోయారు. అంతే. ఏమి అనుకోకు.” సర్దిచెప్పింది.
‘బతుకు జీవుడా’ అని బైట పద్డాడు భైరవ.
అంత ప్రేమగా చూసుకుంటున్న క్యూటీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
ఎవరిమీదైనా మితిమీరి ప్రేమ పెంచుకుంటే ఎలా ఉంటుందో రావూజీని చూస్తే అర్ధమౌతుంది. అది మనిషైనా, జంతువైనా ఒకటే. భైరవకు రావూజీ మీద జాలివేసింది. ఇంతలో కమ్యూనిటీలో కొంతమంది చుట్టుపక్కల చూసి కనబడలేదని కబురు మోసుకొచ్చారు.
“సి సి టివి ఫూటేజ్ చూసారా?” అక్కడ అందరి కంటే హడావిడిగా తిరుగుతున్న ప్రభాకరంని అడిగాడు బైరవ. ఆ మాట వినగానే రావూజీ లేచి నిల్చున్నాడు. ప్రభాకరంకి ఆలోచన రానందుకు నాలిక కరచుకున్నాడు. ఆఫీసు రూంలోకి పరిగెత్తాడు. రావూజీ వెంబడించాడు.
కారు పక్కన నక్కుకుంటూ క్యూటీ మెయిన్ గేటు దాటడం స్పష్టంగా కెమెరాలో రికార్డు అయింది. క్యూటీ తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. రావూజీ గర్వపడ్డాడు. ఇక పోలీసు కంప్లైంట్ ఇవ్వక తప్పదని నిర్ణయం తీసుకుని, కమ్యూనిటీ జనాలని కలుపుకుని, క్యూటీని రావూజీ ముద్దాడుతున్న ఫోటో జేబులో పెట్టుకుని పోలీసుస్టేషనుకి బయలుదేరారు.
ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో రివ్వుమంటూ జెట్ స్పీడులో దూసుకుంటూ వచ్చాడు ఆరడుగుల వామనరావు.
ప్రభాకరం చెవిలో ఏదో గొణిగాడు. రావూజీ మోహంలో అందోళన, ఆతృత గమనించిన ప్రభాకరం వెంటనే ఆయన దగ్గరకు వచ్చాడు.
“సార్! వామనరావు మన క్యూటీని ఇందిరాకాలనీ దగ్గర గ్రౌండ్ లో చూసాడుట”. చెవిలో చెప్పినా మైకులో
చెప్పినట్లే చెప్పాడు. ఒక్కసారి అందరి దృష్టి ప్రభాకరం వైపు తిరిగింది.
“ఇంకా ఆలస్యం ఎందుకు, కారు అటు తిప్పండి. కారెక్కు వామనరావూ!” పోలీసు స్టేషన్ వైపు వెడుతున్న కార్లన్నీ వామనరావు ఎక్కిన ప్రభాకరంకారుని అనుసరించాయి. గ్రౌండ్ చేరుకోగానే వామనరావు, ప్రభాకరం కారు దిగారు. అక్కడ దృశ్యం చూసి అందరూ అవాక్కయ్యారు. రావూజీ కంగారుగా కారు దిగాడు. ఏ దృశ్యం రావూజీ కంట పడకూడదొ అదే కనబడింది. ఆయన త్రీవ్రమైన షాక్ కి లోనయ్యాడు.
“క్యూటీ..” చాలా స్వీట్ గా పిలిచాడు ప్రభాకరం. ఒకసారి చూసి,చూడనట్లు మళ్ళీ వీధికుక్కలతో కలసిపోయింది.
ప్రభాకరంకి అవమానం అనిపించింది. రావూజీ వైపు చూడలేకపోయాడు.
“నీకు సారు ఏం తక్కువ చేసారు. ఇలా…”
“ఇది మా కుటుంబ వ్యవహారం. మధ్యలో దూరకు.”క్యూటీ మాటకు ప్రభాకరంకి తల తీసేసినట్లయింది. మారు మాట్లాడకుండా నెమ్మదిగా వెనక్కి వచ్చాడు. రావూజీ పక్క మౌనంగా నిలబడ్డాడు.
“క్యూటీ… “ తనని తాను సంభాళించుకుని ప్రేమతో గోముగా పిలిచాడు రావూజీ. ఆ పిలుపులో ఆవేదన ఉంది.
చూడకూడని దృశ్యం చూసిన బాధ ఉంది.
క్యూటీ ఊరకుక్కల మధ్య విచ్చలవిడిగా తిరుగుతోంది. అక్కడున్న గజ్జికుక్క, క్యూటీ పరస్పరం మూతులు
నాక్కుంటూ కలసిమెలసి కొత్తజంటలా తిరుగుతున్నాయి. పిల్లలు జారుడుబల్ల ఎక్కినట్లు, వీధికుక్క పిల్లలు క్యూటీ వీపు మీదకు ఎక్కుతున్నాయి. జారుతున్నాయి. క్యూటీ కూడా ఎంతో సంబరపడుతోంది. ఒక్కోసారి కుక్కపిల్ల క్యూటీ రెండుకాళ్ళ మధ్య దూరి పాలు తాగే ప్రయత్నం చేస్తోంది.
పసికూన చేసే ప్రతిచేష్టకి క్యూటీ అనుభూతి అవధులు దాటుతోంది. రావూజీకి మాత్రం మండుటెండలో ఒంటికి మిరపకాయిలపొడి రాసుకున్నట్లుంది. అందరి ముందు అవమానంగా అనిపించింది. అసహనం ఆవరించింది. కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో రగిలిపోతున్న రావూజీని గమనించిన ప్రభాకరం భుజం మీద చేయి వేసి నచ్చచెపుతున్నట్లుగా తట్టాడు.
“నీకేం లోటు చేసానూ?”
“లోటు చేసారని చెప్పానా?
“మరీ ఇలాంటి తప్పెందుకు చేసావు.” కూతురుని అడిగినట్లు చాలా గోముగా అడిగాడు.
“నేను చేసిన తప్పేమిటీ?”
“ఇంకేం చేయాలి? నలుగురిలో తల ఎత్తుకోకుండా చేసావు. మాటమాత్రమైనా చెప్పకుండా ఇల్లు వదిలి రావడం,
వీధికుక్కలతో జత కలవడం తప్పు కదా!”.
“నేను ఇల్లు వదలిపెట్టానని ఎవరు చెప్పారూ. ఎప్పుడూ మీరు తీసుకోచ్చేవారు. ఇప్పుడు నేనే వచ్చాను. మెడలో
గొలుసు లేదు. గొలుసుచివర మీ చేతిలో లేదు. అంతేగా తేడా.”
“ వైజాగ్ నుంచి ఎంతో ఇష్టపడి తీసుకొచ్చాను. వేడిని తట్టుకోలేవని ఎయిర్ కండిషన్ రూంలో పెట్టాను. చలికి
ఇబ్బంది పడకూడదని రూంహీటర్ పెట్టించాను. చక్కటి మంచం, మెత్తని పరుపు వేసాను. ఇన్ని రకాలుగా నీకు సౌకర్యాలు
కల్పించి మహారాణీలా చూసుకుంటున్నానుగా .”
“అవన్నీ నిజమే.”
“మీ జాతి విశ్వాసాన్ని, నువ్వు ఇలా…”
“విశ్వాసమంటే మీ కాళ్ళని నాకూతూ ఉండడమా?” రావూజీ తడబడ్డారు.
“చూడండి! నాకు పట్టుపరుపులు పరిచింది నిజం. ప్రేమగా చూసుకున్నదీ నిజం. సుఖాలు ఇచ్చింది మరింత నిజం.
నా ఆరోగ్యం కాపాడింది నిజం. కానీ నాకూ ఓ జీవితం ఉంటుందనీ, నావాళ్ళు, నా అనేవాళ్ళు ఉంటారని ఎందుకు
అనుకోలేదు.”
“అనుకున్నాం కనుకనే కమ్యూనిటీలో స్నేహితులని ఏర్పాటుచేసాంగా?”
“చేశారు. వాళ్ళంతా నాలాగా బతుకుతున్నా వాళ్ళే. ఇనుపగొలుసులో మెడలున్న స్వేచ్చజీవులు. నాకు
స్నేహితులుగా ఎవరు ఉండాలనే ఆలోచన నాకు ఉండకూడదా?”
“నీకూ ఆలోచనలా… “ ఒక క్షణం ఆగి “అయినా నిన్ను వీకెండ్ ‘డాగ్ పార్క్‘ కి తీసుకుని వెళ్తున్నాంగా. అక్కడ
స్నేహితులని చేసుకోవచ్చుగా.”
“కోవచ్చు, కాని ఆ అవకాశం మాకిస్తున్నారా? అలా జరగటంలేదనే చెప్పేది. మేం పిల్లల్ని కనాలంటే మీకు
కావలసిన జాతితో కలుపుతారు. మా పిల్లలని మీకు నచ్చినచోట పెంచుతారు. ఎంతసేపూ మీరిచ్చిన సుఖాలు చెపుతున్నారు.
మేం పడుతున్న కష్టం మాట్లాడరేం. రాత్రిళ్ళు మీకూ, మీ ఇంటికి కాపలాగా ఉంటాం. అలికిడికి అరుస్తాం. మిమ్మల్నిలేపుతాం.
కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అది విశ్వాసం కాదా?”
“అదిసరే, నీకు వీధి కుక్కలతో స్నేహమేమిటీ ? ఒకరికొకరు తెలువరుగా?”
“మీరు ఊరు చూపించినప్పుడే ఊరకుక్కల్ని కూడా చూసాను. అవి పడే కష్టాలు గమనించాను. జాతులలో హెచ్చు
తగ్గులు ఉంటాయామో, జీవులంతా ఒకటేగా. మేమక్కడ పట్టుపరుపుల మీదా, ఇవిక్కడ గడ్డి మొక్కల మీద. మాకు పళ్ళెంలో
పెడిగ్రి, వీటికి చెత్తకుప్ప మీద పాచిపోయిన ఆహరం. మాకు సర్వసుఖాలు, వీటికి అష్టకష్టాలు. ఎందుకో బాధనిపించింది.
ఇక్కడకొచ్చిన మూడు గంటలలో వీటి బతుకులు,పడుతున్న కష్టాలు విని మరింత భయమేసింది. ఆవేశం వచ్చింది.”
“ఇది తిరుగుబాటా!..”
“కాదు, ఇప్పటిదాకా సుఖాల మత్తులో పడి సోయి లేకుండా గడిపాను. స్వార్ధంతో బతికేసాను. ఇప్పుడే
తెలిసొచ్చింది. సాటిజీవుల గురించి ఆలోచించే తెలివొచ్చింది.”
ఇంతలో పక్కన చేరి నాకుతున్న కుక్కపిల్ల వైపు జాలిగా చూసింది క్యూటీ. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది.
“ఈ పిల్లని చూశారా? అదిగో, ఆ మూల దిగులుగా కూర్చుని దీనంగా చూస్తోందే నల్లకుక్క, అదే దీని అమ్మ.
తొలికాన్పులో మూడుపిల్లలకు జన్మనిచ్చింది. ఒకటి పంది పొట్టన పెట్టుకుంది. మరొకటి కారు నడిపే జనాల నిర్లక్ష్యానికి
బలైపోయింది. ఇక మిగిలింది ఇదే. ఎలా బతుకుతుందాని అమ్మగా భయం, కాపాడుకోవాలనే తల్లిగా తపన.”
“సృష్టిలో ఏ జీవి పుట్టుక, మరణం వాళ్ళ చేతుల్లో ఉండదు. అదంతా భగవంతుడి నిర్ణయం.”
“సరే, అలాగే అనుకుందాం. మరీ మీరు చేస్తున్న పనులు కూడా ఇబ్బంది పెడుతున్నాయిగా?”
“మా వల్లా?…”
“అవునూ, మీవల్లే. వాటి మానాన అవి బతుకుతుంటే మున్సిపాలిటీకి కంప్లైంట్స్ ఇస్తారు. వాళ్ళు ఊరుకుంటారా?
వెంటాడి, వేటాడి పట్టుకుని చంపేస్తారు. మీకు స్టేటస్ సింబల్ గా మేం ఉండాలి. మీ ఇళ్ళలో మేం పెరగాలి. మీ పాదాలు
నాకుతూ తిరగాలి. వీధికుక్కలు మాత్రం కనబడకూడదు. వాటిని చూస్తే మీకు అసహ్యం.”
“మేం కంప్లైంట్స్ ఇచ్చేది మీ పిల్లల కోసమే. మీ పిల్లలుని సరదాగా రోడ్డుమీదకు తీసుకొస్తే నిలబడనివ్వవు. మీద పడి
మొరిగి భయపెట్టిస్తాయి.”
“అవీ మొరుగుతాయి, అంతే. మరి మీరో, కుక్కపిల్లలుని పసికూనలని కూడా చూడకుండా కర్రలతో, రాళ్ళతో
దాడిచేసి హింసిస్తున్నారు. దీనికేమంటారు? మా సాటిజీవుల బతుకులకు గ్యారంటీ లేనిచోట్ల మేం ఎలా ఉండగలం. ఇక్కడ
మా జాతి ప్రాణులు ఆకలితో చస్తుంటే, మేం విదేశాల నుంచి వచ్చిన ఫుడ్ తిని బలవడం సరైనదేనా?”
“చూడు, ఎవరి జీవితాలైనా మన పూర్వజన్మ కర్మతో నడుస్తాయి.”
“పెద్దమాటలు నాకు అర్ధం కావు. అందుకే అవి వద్దు. నాకు అనిపించేది, చేసిన తప్పుల్ని మార్చుకోవడమే. మంచి
చేయడమే. అంతే…”
“ఇప్పుడేం చేద్దామాంటావూ?”
“వీటి జీవితాలకి కనీస రక్షణ ఇద్దామంటాను. వానలో తడవకుండా, ఎండలో మాడిపోకుండా, చలికి
గడ్డకట్టకుండా ఒకేచోట కలసి ఉండేలా గూడు కడదాం. కనీసం వారంలో మూడు రోజులైనా మంచి ఆహారం ఇద్దాం.
మున్సిపాలిటి వాళ్ళబారి నుంచి వీటిని కాపాడదాం. ప్రమాదవశాత్తు కార్ల కింద పడి చనిపోయిన కుక్కల కుటుంబాలని
ఆదుకుందాం.ఇళ్ళలో ప్రేమగా పెంచుకుందాం.” క్యూటీ మాటలకు అక్కడ వారంతా అవాక్కయారు.
క్యూటీ మాటలకు రావూజీ ముఖంలో రంగులు మారాయి. ఎంతో దూరం నుంచి, కావాలని తెచ్చుకుని,
మురిపెంగా పెంచితే దీనికి వీధికుక్కలు ఎక్కువయ్యాయి. కన్నకూతురి కంటే ఎక్కువనుకుని ప్రేమగా చూసుకుంటే చేసిన
నిర్వాకం ఇదా? తాను రోడ్డున పడింది. తనని పడేసింది. అదే భావం అతనిలో కన్పించింది.ఆలోచిస్తున్నా కొద్ది క్యూటీ మీద
కోపం పెరుగుతోంది. మాటని నిర్లక్ష్యం చేసిందనే అహం తన్నుకొస్తోంది.
“రావూజీ, ఇవన్నీ మనకి తెలియని ఇజాలా?” వెటకారంగా నవ్వాడు ప్రభాకరం.
“ఇజాలు కాదు. పొగరు. బలుపు. కూత నేర్చిన కోడి పాక ఎక్కి కూసిందంటే ఇదే. మనం ప్రేమగా చూసుకుని
సింహాసనం ఎక్కించినా, సహజలక్షణం మారదుగా. అదే కుక్కబుద్ధి.” అని కసిగా చేతిలో గొలుసు నేలకేసి కొట్టి, కారు
వెనక్కి తిప్పమని సైగ చేసాడు. ఆయన కారుని అందరూ అనుసరించారు.
వీధికుక్కలతో ఆడుకుంటున్న క్యూటీ ఆ మాటలకు రెండుక్షణాలు తలెత్తి రావూజీ వైపు తీక్షణంగా చూసింది.
క్యూటీతో పాటు వీధికుక్కలు ఒక్కసారి స్థాణువులా నిలబడిపోయి, క్యూటీ స్పందనకోసమన్నట్లు చూస్తున్నాయి.
రావూజీతో పాటు కారెక్కి వెళ్ళిపోతున్న జనాన్ని చూసింది. తన పిల్లల్ని చూసుకుంది. వస్తూన్న కన్నీరుని
ఆపుకుంది. గుండె దిటవు చేసుకుంది. తనతో ఆడుకుంటున్న పిల్లలని ప్రేమగా చూసింది. అనాధలుగా పెరుగుతున్న కుక్కల
వైపూ ఆప్యాయంగా చూసింది. రావూజీ మాటలు పట్టించుకోనట్లు నాలుక ఎగరేసింది. “మారనిది కుక్కబుద్ధా? మనిషి
బుద్ధా?” అనుకుని తిరిగి ఊరికుక్కలతో ఏకమై ఆటలోకి వెళ్ళిపోయింది.








Add comment