నాలుగో భాగం
అయిదుంబావు కల్లా కాణిపాకం…
కానీ అదో యాంటీ క్లైమాక్స్ అయింది. గుడి మూసేసి వుంది. ఆరింటికిగానీ తెరవరట…
మూసిన తలుపుల్లోంచి బయటకొస్తోన్న ఓ యువ పూజారి కనిపించాడు. నా గోడు వినిపించాను. ఎన్నాళ్లనుంచో ఉన్న కోరిక తీర్చుకోడానికి ఎక్కడెక్కడినుంచో వచ్చానని విన్నవించాను. విన్నాడేగానీ ఫలితం లేకపోయింది. ఆరింటివరకూ ఆగక తప్పదన్నాడు. ఓ నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగాను. ఏదో చిన్నపాటి గుడి అనుకొని వెళ్లానుగానీ బహు పెద్ద ఆవరణ, రెండు మూడు అంచెలు దాటి వెళ్లవలసిన దర్శన యాజమాన్యమూ- అట్టహాసంగానే అనిపించింది. పదే పది నిమిషాలు గుడి ఆవరణలో గడిపి బయటపడి తిరుపతి దారి పట్టేశాను.
సారంగ చానెల్ లో చూడండి
కాణిపాకం-తిరుపతి-అక్షర మిత్రులు
అయిదున్నర… చీకటిపడే సమయం దగ్గరవుతోంది. ఇంకా రెండు గంటల ప్రయాణం ఉంది. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన సాగిపోవాలని నిశ్చయం. అప్పటికే రోడ్డు పట్టుకొని ఎనిమిది గంటలయింది. శరీరం అలసిపోవడం తెలియవస్తోంది…
నోటు పుస్తకంలో రాసుకొన్న ఊళ్ల పేర్లు ఒకటి రెండుసార్లు చదువుకొని, గుర్తుపెట్టుకొని ముందుకు సాగాను. కొత్తకోట దాటాక ‘వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ కనిపించింది. ఊరుగాని ఊరిలో ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజ్! ‘భలే’ అనిపించింది. ఆ సంబరంలో ఉండగా ఎక్కడో దారి తప్పాననిపించింది. చూస్తే మనుషులెక్కడా కనిపించడం లేదు. వాహనాలూ లేవు. అలా మరో కిలోమీటరు వెళ్లగా ఓ గొర్రెల కాపరి. ‘ఎలాంటి సరళమైన తెలుగులో ఇతడిని దారి అడగాలి??’ అన్న సందేహం. నాకొచ్చిన భాషలోనే అడిగాను.
“ఆఁ ఆఁ మీరు సరైన రూట్లోనే వెళుతున్నారు. ఇంకొంచెం తిన్నగా వెళితే చిత్తూరు-తిరుపతి హైవే పట్టుకొంటారు,” అని నాగరికభాషలో సమాధానం చెప్పాడతను. ఎంతోకొంత చదువుకొని ఉండాలి. అయినా ఈ రోజుల్లో రూటు, హైవే అన్నవి అందరికీ తెలిసిన ‘తెలుగు’ మాటలేగదా.
హైవే అందుకొనేలోగానే చీకటి పడిపోయింది.
‘చీకట్లో ఏక్టివా నడపగూడదు,’ అన్న నా నియమానికి గండి పడిందన్న మాట. పోనీ ఆగిపోదామా అంటే అక్కడ మధురాంతకం నరేంద్రా, ఇతర మిత్రులూ ఎదురుచూస్తూ ఉంటారాయె. ముందుకు సాగాను…
ఊళ్లల్లోనూ, సిటీల్లోనూ రాత్రిపూట వాహనం నడపడం అంటే సరేగానీ హైవే మీద అదో గొప్ప చిరాకు. సంధ్యా సమయంలో కీటకాల బెడద. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్లు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తాయి. కీటకాల నుంచి తప్పించుకోడానికి హెల్మెట్‌కి ఉన్న వైజర్ని కిందకు దించితే ఆ వైజరు ఎదుటి హెడ్లైట్ల జోరును నాలుగింతలు చేస్తుంది. ఏదో అంటారే – ముందు నుయ్యి, వెనక గొయ్యి! అలాగే పళ్ల బిగువున సాగాను. అప్పటికే కాణిపాకంనుంచి బయల్దేరి గంటన్నర. చంద్రగిరి చేరువలో ఉందని మైలురాళ్లు చెపుతున్నాయి. చంద్రగిరి దాటాక కాలురు అన్న ఊరు దాటుకొని చెర్లోపల్లి మీదుగా పద్మావతీ కాలేజి దగ్గరికి చేరి రైల్వేలైను దాటి పద్మావతీనగర్లోని రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ విగ్రహం ఉన్న చౌరాస్తా దగ్గరికి రమ్మనీ, ఆ దగ్గరలోనే తమ ఇల్లనీ – నరేంద్ర చెప్పిన సూచనలు, గుర్తులు.
లక్ష్యం మరో పది కిలోమీటర్లలో ఉందనగా, కాలూరు చేరువలో మళ్లా వెనక చక్రపుగాలి పోయింది! ఒకేరోజు రెండు ఉపద్రవాలు!
అదృష్టమేమంటే ఓ ఏభై గజాలలోపే రిపేరు దుకాణం కనిపించింది. ఏడుంబావు దాటింది. చీకటి చిక్కనయిపోయి అర్ధరాత్రిని తలపిస్తోంది. మెల్లగా బండిని దుకాణం దగ్గరికి చేర్చాను. ‘పంక్చరు,’ అని నీరసంగా పలికాను. ఆ పలుకులో శారీరక అలసటకన్నా మానసిక గ్లాని ఎక్కువ ధ్వనించి ఉండాలి. చిన్న ప్రదేశం అవడం వల్లనో, చీకటి ముదరడంవల్లనో దుకాణం మనిషి షాపు కట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు. నన్నూ నా వాలకాన్నీ చూసి- స్కూటరు దగ్గరికి వచ్చాడు.
“ఎక్కడ్నించి వస్తున్నారూ? ఎంతసేపట్నించీ బండి నడుపుతున్నారూ?” చక్రం చూసి చేత్తో ముట్టుకొని అడిగాడు.
“కాణిపాకం. రెండు గంటలు,” టెలిగ్రాఫు జవాబు.
పనిలో పడ్డాడు. రెండు నిమిషాలాగి అన్నాడు. “ఇది చిన్న బండి. సిటీల్లోనూ, పట్నాల్లోనూ వాడడానికి సరిపోతుందేగానీ గంటల తరబడి ఏకబిగిన నడపడం తగని పని. మీకా సంగతి ఈపాటికి తెలిసి ఉండాలే??”
ఉక్రోషం ఆపుకొని వినసాగాను.
నా యాత్రా వివరాలు విన్నాడు. నాకన్నా పాతిక ముప్పై ఏళ్ల చిన్నాడే అయినా పెద్దన్నయ్యలా వాత్సల్యంతో చెప్పాడు.
“మిమ్మల్ని నిరుత్సాహపరచను. వెనక చక్రపు రిమ్ము చూశారా? నీటిచుక్క వేస్తే ఆవిరయ్యేంత వేడెక్కింది. అదృష్టవశాత్తు బీటలివ్వలేదు. ఆ వేడికి ట్యూబు నెక్కు ఊడిపోయింది. నా దగ్గర కొత్త ట్యూబు లేదు. ప్రస్తుతానికి పాతదానితో సరిపెడతాను. రేపు వీలయినంత వెంటనే కొత్త ట్యూబు వేయించుకోండి. మరోమాట- గంటకొకసారి బండి ఆపి కనీసం అయిదు నిమిషాలు దానికి విశ్రాంతి ఇవ్వండి. అవసరం. అపుడే సమస్యా ఉండదు.”
నిజంగా గొప్ప పాఠమది.
ఎంత తొందర ఉన్నా విరామం లేకుండా బండిని రెండు గంటలు నడపడం దుస్సాహసం. అది నాకు అప్పటిదాకా తోచకపోవడం మూర్ఖత్వమందామా? కనీసం అనుభవరాహిత్యం అనాలి. ఆ అనుభవం ఈ పెద్దాయన పుణ్యమా అని అతి సులభమైన పద్ధతిలో దొరికేసింది. సంతోషమనిపించింది.
ఈలోగా నరేంద్ర నుంచి ఫోనులు. ‘కాలూరు రమ్మంటారా?’ అన్న ఆఫరు. వద్దన్నాను.
వద్దన్నానేగానీ ఆ హడావుడిలో ఆరేడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఆయన ఇంటికి చేరడానికి దారి తప్పిపోయి ముందూ వెనకలయి పదహారు కిలోమీటర్లూ ముప్పై అయిదు నిమిషాలూ పట్టేసింది.
చివరికి అందరి సహనాలకూ పరీక్షలు జరగాక, ఎనిమిదిన్నరకు గూడు చేరాను. నరేంద్ర, రమేశ్ ఎదురుచూస్తూ కనిపించారు. ఆరెమ్ ఉమాకు అది జర్నలిస్టుగా పని వత్తిడి ఉండే సమయం. వచ్చి వెళ్లిపోయారట. అతడ్ని మిస్సయిపోయానన్న మాట. కలవాలని ఆశపడిన మరో రచయిత- సుంకోజు దేవేంద్రాచారి. బహుశా ఊరు మారారనుకొంటాను.
నరేంద్ర, రమేష్‌లతో కబుర్లాడడానికి నాకున్నవి అంతా కలిపి రెండు గంటలు.
పదమూడు భారతీయ భాషలలోని ‘తొలి కథలు’ సేకరించి తొండనాడు తెలుగు రచయితల సంఘం ద్వారా ప్రచురింపచేసిన రమేష్, ఉమాలకు గట్టిగా కృతజ్ఞతలు – మప్పిదాలు చెప్పాలన్నది నాకు ఆరు నెలలుగా మిగిలిపోయిన కోరిక. ఇద్దరికి చెందిన అభినందనలనూ రమేష్‌కు అందించాను.
కోయంబత్తూరు దగ్గరి ఉడుములపేట పరిసరాలలోని నలభై గ్రామాలకు చెందిన తెలుగు వారికోసం అత్యంత సరళమైన పాఠ్యపుస్తకాల రూపకల్పన చేసి వారికి తెలుగు నేర్పించే ప్రయత్నంలో రమేష్ నిమగ్నమై ఉన్నాడని విని ఉన్నాను. ఆ వివరాలు తెలుసుకొన్నాను. ఈ తెలుగు నేర్పడం, నేర్చుకోవడం భాషా సెంటిమెంటు కోసమేనా- దానివల్ల మరేమైనా అసలు సిసలు ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న మనసులో మెదిలింది. అడగడానికీ, చర్చకూ అది సందర్భం కాదనిపించింది.
పాతికేళ్ల మిత్రుడు నరేంద్ర దగ్గర ఏకంగా యుద్ధారావమే వినిపించాను.
“మొన్న మెన్ననే కథ 2013లో మీ ‘చివరి ఇల్లు’ చదివాను. పి. సత్యవతిగారి సప్తవర్ణ సమ్మిశ్రితం కూడానూ. రెండింటిలోనూ వయోవృద్దులే కేంద్రబిందువులు. మళ్లీ వాళ్ల దగ్గర పనిచేసే విజ్జీ, స్వర్ణ అనే యువతులే ముఖ్యపాత్రలు. మీ కథ చదివితే మనసంతా ఆందోళన నిండిపోయింది. మీ ముసలమ్మా ముసలాయనా ఏవగింపు కలిగించారు. అదే సప్తవర్ణంలోని ముసలావిడను చూస్తే ఒక రకమైన ప్రశాంత భావన, ఆత్మీయస్పర్శ కనిపించాయి. ఆవిడ కన్నీరు పెట్టినపుడు స్వర్ణతోపాటు మనకూ దిగులేస్తుంది.
“మీరు పెద్దవాళ్ల సమస్యను తీసుకుని రాసిన ఈ కథలో చదువరులకు వాళ్లంటే ఏవగింపు కలగడం- మీరు ఆశించిన స్పందనేనా? అలా అయితే మరి ఏం ఆశించి మీరు అలాంటి స్పందన కోసం రాశారూ?” ఏ మాత్రం సంకోచించకుండా అడిగేశాను.
నరేంద్ర ఊహించని దాడి ఇది. కాసేపు ఆలోచించి అన్నాడు. “నిజమే. అలోచిస్తే ఆ ఏవగింపు పాఠకుల్లో కలిగే అవకాశమున్నమాట నిజమే. బహుశా ఆ పాత్రలంటే ఆ ఏవగింపు నాకూ ఉందనుకొంటాను. మీరు ఎత్తి చూపించేదాకా నాకా విషయం తట్టలేదు. అది ఆ కథా ప్రయోజనానికి అడ్డంకా? ఆలోచించవలసిన విషయమిది. మీకు థాంక్సు చెప్పుకోవాలి.” నిజాయితీ నిండిన సమాధానమది.
కబుర్లు సాగిపోయాయి. నరేంద్రను కలసి మూడేళ్లు దాటింది. నేను పూణెలో పని చేస్తున్నప్పడు మేం జరిపిన తెలుగు-మరాఠీ సాహితీ సమ్మేళనం సందర్భంగా వచ్చాడాయన. అది జరిగింది 2011 జూన్ నెలలో. మూడేళ్ల విరామం పుణ్యమా అని మాట్లాడుకోడానికి బోలెడన్ని సాహితీ విషయాలూ విశేషాలూ దొరికాయి. ఎత్తిన కలం దించకుండా ముప్పై ఏళ్లనుంచీ సామాజిక అవగాహనతో నాణ్యమైన సాహిత్యం సృష్టిస్తున్న అతనంటే నాకు మురిపెం. సాహితీ కేంద్రాలకు దూరంగా ఎక్కడో తిరుపతిలో ఉండడం వల్ల తమ తమ రచనలు అందరికీ అందడం లేదనీ, అందినా సరి అయిన చర్చ జరగడం లేదనీ అతని అభియోగం. కబుర్లు దాదాపు పన్నెండుదాకా సాగాయి. మర్నాడు ఉదయమే సూర్యుడికన్నా ముందుగా లేచి అరక్కోణం వెళ్లడమన్న నా ప్రణాళిక అతనికి వినిపించాను. సహజంగానే కోపించాడు. రమేశ్ శెలవు తీసుకొని ముందే వెళ్లిపోయాడు. పన్నెండున్నరకు మేమూ గుడ్‌నైట్లు చెప్పకున్నాం!
ప్రతిరోజూ ఉదయం అయిదూ అయిదున్నరకల్లా రోడ్డు పట్టుకోవాలన్నది నా ఆలోచన.
అది మొదటిరోజు టైరు పంక్చరు పుణ్యమా అని తొమ్మిదిగా మారింది. నిన్న రాత్రి ఆలస్యంగా పడుకోవడం పుణ్యమా అని ముప్పై ఒకటి నాటి నా ప్రయాణం మొదలయేసరికి ఆరుంబావు. ఆ లోపలే ఓ మార్నింగ్ కాఫీ ఇచ్చారు నరేంద్రగారి సహచరి. ఆవిడ మంచి పరిచయమే ఉందిగానీ నిన్న లేటుగా రావడం, ఈరోజు పొద్దున్నే బయల్దేరడం- అసలు ఆమెతో మాటలే సాగలేదు. అదో అసంతృప్తి.
నిన్నటి రాత్రి నా తడబాటులు గమనించిన నరేంద్ర ఆ ఉదయం ఓ నాలుగు కిలోమీటర్లు నాతోపాటు తన స్కూటరు మీద వచ్చి తిరుచానూరు మీదుగా అరక్కోణం వెళ్లే నేషనల్ హైవే నెంబరు 18ఎ కి దారి చూపించాడు.
అటూ ఇటూ కలసి మొదటి రోజు మూడు వందల కిలోమీటర్లు అయింది. రెండవరోజు లక్ష్యం చెన్నై చేరడం. అంతా కలసి రెండొందల కిలోమీటర్ల లోపు- హడావుడి లేకుండా వెళ్లొచ్చనిపించింది.
దారంతా తమిళం తెలుగు కలగలసిన సువాసన. తిరుపతి శివార్లలోని తిరుచానూరు దాటాక తడుకు, నగరి అన్న ఊళ్లు దాటితే అరవై కిలోమీటర్లలో తిరుత్తణి. అది దాటి మరో ఇరవై కిలోమీటర్లు వెళితే అరక్కోణం. తొమ్మిదింటికల్లా చేరాలన్నది నా ప్లాను.
సూర్యోదయ దృశ్యం కట్టిపడేసింది. దానికోసం ఓ పది నిమిషాలు రోడ్డు పక్కన ఆగిపోయాను. దొరికిన ఆ కాస్త సమయంలోనూ మద్రాసు మిత్రులకు ఫోన్లు, రేపటి కార్యక్రమాల రీ-కన్ఫర్మేషను తీసుకొన్నాను. ఆకాశవాణిలో పనిచేసే- అంతకుమునుపే పరిచయం ఉన్న నాగసూరి వేణుగోపాల్‌గారిని పలకరించాను. ‘రేపు రేడియో స్టేషనుకు రండి” అన్నారు.
ఏడు దాటేసింది. దారిలో ఓచోట అద్భుత శిలావిన్యాసం కనిపించింది. ఏదో ఒక కుటుంబసభ్యులో, క్రికెట్ ఆటగాళ్ళో నిలబడి, తలా తలా దగ్గరకు చేర్చి అతి ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్న ధోరణిలో నాలుగయిదు నిట్టనిలువు బృహత్ శిలలు. నా ప్రమేయం లేకుండానే స్కూటరు ఆగిపోయింది. పనిలో పనిగా ఆ రోడ్డు పక్కనే ఓ చిరు దుకాణంలో అల్పాహారం. కెమెరా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.
మరో అరగంట సాగాక తిరుత్తణి. ఆ ఊరి పేరు చిరపరిచితమేగానీ అక్కడ అంత పెద్ద ఎత్తున గుడి ఉందనుకోలేదు. ఓ అరగంట ఆగుదామని మనసూగింది. ఆగొచ్చుగానీ అరక్కోణం చుట్టాలు శెలవుపెట్టి మరీ నాకోసం ఎదురు చూస్తున్నపుడు తెలిసి తెలిసి ఆలస్యంగా వెళ్లడం బాధ్యతారాహిత్యమనిపించింది. ముందుకు సాగాను.
(మిగతా వచ్చే సంచికలో…)








మీతో పాటు ప్రయాణిస్తూ నరేంద్ర గారిని రమేష్ ని ఉమని నేను కూడా కలిసినట్లే ఉంది అమరేంద్ర గారూ ! ప్రయాణ కథనం చాలా బాగా ఉంది.