ఆ చిక్కుముడి విడిపోయింది మంచి స్నేహితుల వల్ల!

తొంభైల్లోని ఆరోజులు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే చాలా నాస్టాల్జిక్ గా అనిపిస్తాయి..

మా అబ్బాయి నాతో రేడియో స్టేషన్ కు వస్తూ ఉండేవాడు.

ప్రతి రేడియో స్టేషన్ లో ఎడిటింగ్ రూమ్ ఉంటుంది.అక్కడ రికార్డు చేసిన కార్యక్రమాలను ఎడిట్ చేసేవాళ్ళం.అప్పటికి కంప్యూటర్ రికార్డింగ్ రాలేదు అంటే నేను చెప్పే పీరియడ్ 1988-99 సంవత్సరాల మధ్య.ఎడిటింగ్ రూంలో  స్పూల్ రికార్డర్స్ ఉండేవి.వాటి పక్కనే “డీ మేగ్నిటైజర్” ఉండేది.దానిని “బల్క్ ఎరేజర్” అనేవారు.దానిమీద టేప్ పెట్టి స్విచ్ ఆన్ చేశామంటే చాలు, అందులోని ప్రోగ్రాం ఎరేజ్ అయిపోయేది. ఇలా నేను చాలా సార్లు చేయటం రెండున్నరేళ్ళ మా అబ్బాయి గమనించాడు.

ఆరోజున నేను గంట నాటకంలో మొదటి అరగంట ఎడిట్ చేశాను.ఇంకో నాలుగు నిమిషాలు రికార్డింగ్ ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాల్సిన టేప్ ని మాస్టర్ టేప్ అంటారు.టేప్ రివైండ్ చేశాను. ఆ పక్కనే ఇంకో రికార్డర్ మీద ఇంకో టేప్ లోడ్ అయి ఉంది. దాన్ని కూడా రివైండ్ చేస్తుంటే, మా అబ్బాయి మొదట రివైండ్ చేసిన టేప్ ను బల్క్ ఎరేజర్ మీద పెట్టిన స్విచ్ ఆన్ చేశాడు.

ఇంకేముంది అందులో ప్రోగ్రాం ఎరేజ్ అయింది. నాకు కాళ్ళు చేతులు ఆడక కింద కూర్చుండి పోయాను. ఏడుపొచ్చేసింది. నన్ను చూసి మా అబ్బాయి ఏడుపు. పక్కనే ఇంజనీర్లు ఉండే కంట్రోల్ రూమ్ ఉండటంతో వాళ్ళు చూసి, నా కొలీగ్ డ్యూటీ ఆఫీసర్ రాజారెడ్డి ని అలెర్ట్ చేశారు.వెంటనే తనొచ్చి నన్ను బయటకు తీసుకు వెళ్ళాడు. మా అబ్బాయిని ఇంట్లో దింపేసి,ఇద్దరం కలిసి, డ్రామా సెక్షన్ ప్రోగ్రాం ఆఫీసర్ మంత్రవాది మహేశ్వర్ ని కలిసి జరిగింది వివరించాం.లక్కీగా చాలా కొంచెం పార్ట్ మాత్రమే ఎరేజ్ అవటంతో బతికిపోయాం. అప్పటి స్టేషన్ డెరైక్టర్ దృష్టికి ఈ అంశాన్ని వెళ్ళనివ్వలేదు మహేశ్వర్. తర్వాతెప్పుడో వారికి తెలిసింది. చూసీచూడనట్టు వదిలేశారు. ఈవిషయంలో మహేశ్వర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జాతీయ స్థాయిలో జరిగే ఆకాశవాణి వార్షిక పోటీలలో అనేక పర్యాయాలు బహుమతులు పొందిందని గతంలో వెల్లడించాను.ఎస్.బి.శ్రీరామమూర్తి గారు ఈ బహుమతులు పొందిన వారిలో అగ్రగణ్యులు.వారు 1992లో  మహావిశ్వ అనే సైన్స్ నాటకం ప్రొడ్యూస్ చేశారు.ఆ నాటకం 

అప్పటి ఐపిఎస్ అధికారి కె.సదాశివరావు రాసి ఇండియా టుడే పత్రికలో ప్రచురించిన ఆత్మాఫాక్టర్ ఆధారంగా రూపొందించింది.

విజయవాడ లయోలా కళాశాలలో కామర్స్ అధ్యాపకులు ఎమ్.సి.దాస్.తన గళంతో ప్రాణం పోశారు.ఆ కథను నాటకంగా మార్చినవారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.

ఆ కథను చదువుతున్నప్పుడు ఎస్ బి శ్రీరామమూర్తి గారు సామర్లకోట స్టేషన్ లో ఉన్నారు.విజయవాడ చేరేసరికి ఆయనకు ఆ నాటకం ఎలా ఉండాలో సీనిక్ ఆర్డర్, చిన్న చిన్న బొమ్మలు వేసి మాకు అంటే నాకు, మా కొలీగ్ పిజికె మూర్తి కి చూపించారు.అలా మమ్మలిద్దరినీ తన టీం మెంబర్లు గా తీసుకున్నారాయన 

రికార్డింగ్ ఒక రాత్రిలో పూర్తిచేశాం.అంతకుముందు రెండురోజులు రిహార్సల్స్ జరిగాయి.

ఈ నాటకం ప్రత్యేకత దానికి సమకూర్చిన మ్యూజిక్ లో ఉంది.ఉదయకుమార్,రత్నకుమార్ సోదరులు ఆ బాధ్యత తీసుకున్నారు.వారిరువురు ఆకాశవాణిలో ఆడిషన్ అయిన గ్రేడెడ్ కంపోజర్స్.దీనికోసం పీటర్ అనే కీ బోర్డు ప్లేయర్ మద్రాసు నుంచి వచ్చారు.వారితో పాటు అనేక వాయిద్యాలు వేణువు, వయొలిన్, సితార్,దిల్ రుబా,మేండొలిన్,సారంగి, డ్రమ్స్ వంటివి జతగూడాయి.బయట స్టేషన్ల నుంచి ఆర్టిస్ట్ లను పిలిపించాలంటే స్టేషన్ డెరైక్టర్ పర్మిషన్ ఇవ్వాలి.అదంత సులభం కాదు.స్టేషన డైరెక్టర్ నాన్ లాంగ్వేజ్ వారయినా, శ్రద్ధగా విని, అవసరం అనుకుంటే మాత్రం తప్పకుండా పర్మిషన్ ఇచ్చేవారు..ఆ మ్యూజిక్ రికార్డింగ్ 

పొద్దున్న పదిగంటలకు మొదలై అర్థరాత్రి రెండు గంటల వరకు సాగింది. ఒక రెండు రోజులపాటు ఏకధాటిగా డబ్బింగ్/ఎడిటింగ్ రూమ్ లో ఉండిపోయాం ఆయనతోపాటు.ఆ నాటకం నిజంగా ఒక మాస్టర్ పీస్.. ఫైనల్ గా నాటకానికి 1992 ఆకాశవాణి వార్షిక పోటీలలో ద్వితీయ బహుమతి పొందింది..

అలాగే మరో ప్రొడ్యూసర్ గా మిత్రుడు , సీనియర్ కొలీగ్ కలగ కృష్ణ మోహన్ అనేక బహుమతులు పొందారు.నేను చేరిన కొత్తలో అంటే 1988లో  మాట -మౌనం అనే సంగీత రూపకం కృష్ణ మోహన్ రూపొందించారు.స్క్రిప్ట్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రాశారు.చాలా పాటలున్నాయి.ఆ పాటలను లింక్ చేస్తూ కొంత వచనం కలగలిసి ఉంటుంది.

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, చదలవాడ కుసుమ కుమారి ప్రధాన గాయకులు.ఈ రూపకానికి కూడా ఒక మోస్తరుగా ఉండే ఆ మ్యూజిక్ స్టూడియో లో పదిహేను మంది ఆర్టిస్ట్ లు తమ వాయిద్యాలతో సిద్ధంగా ఉండటం, టేక్ చేసినప్పుడు ఒక్క తప్పు దొర్లినా మళ్ళీ పాటంతా రికార్డు చేయటం గొప్ప జ్ఞాపకాలు..

మరో సందర్భంలో పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన కథను నాటకంగా మలిచి ఆకాశవాణి జాతీయ పోటీలకు పంపారు కృష్ణ మోహన్. ప్రశంసాపత్రం సంపాదించుకున్నది ఆ నాటకం.

తలుపు సృజనాత్మక రూపకం కృష్ణ మోహన్ చేసినప్పుడు  రజని గా సుపరిచితులయిన రజనీకాంతరావు గారు ఒక పాటపాడారు. మేమింకా చిన్నవాళ్ళం.సంగీతంలో స్వరాల ఆవిర్భావం గురించి ఒకరకమైన తన్మయత్వంలో వారు చెప్పిన విధానం ఇంకా గుర్తే.శారదా శ్రీనివాసన్ గారి చేత నేరేషన్ చదివించారు కృష్ణమోహన్.. రికార్డింగ్ అయ్యాక రాత్రి మూడు గంటలకు విజయవాడ బస్ స్టాండ్ లో ఇడ్లీలు తినొచ్చేవాళ్ళం.

తొంభైల్లోని ఆరోజులు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే చాలా నాస్టాల్జిక్ గా అనిపిస్తాయి..

అరవైల్లో పెమ్మరాజు సూర్యారావు గారు,ఎమ్.వి.రమణమూర్తిగారు సంయుక్తంగా అనేక భక్తి రంజని రికార్డింగ్ ల్లో కలిసి పాడేవారు.పెమ్మరాజు సూర్యారావు గారు తర్వాత రేడియో లో కర్నాటక శాస్త్రీయసంగీత సభల్లో పాడేవారు. వారు ప్రతి శుక్రవారం హిందూ పేపర్ ఫ్రైడే రివ్యూ లో కల్చరల్ ఐటెమ్స్ పై సమీక్షలు చేస్తూ ఉండేవారు.. అలా ఆయనంటే చాలా గౌరవం ఉండేది అరవై ఏళ్ళ వయసులో..ఒకానొక సమయంలో మాతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతుండేవారు.. అదెలా జరిగిందంటే —వచ్చే సంచికలో!

*

 

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు