హుండి

వాళ్ళందరూ అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు, ఇదేమి కొత్త కాదు. నేను మెట్రో ఎక్కిన ప్రతి సారి నాకు జరిగేదే …

1

యాదమ్మ ఉదయం నుండి ఊర్లో ఉన్న ఎరువుల దుకాణాలన్నీ తిరిగి తిరిగి అలసి పోయి ఎండలో ఇల్లు చేరింది. మండువాలో ఉన్న నవ్వారు మంచం మీద నడుము వాల్చింది. మనస్సంతా వరి పొలం చుట్టూ తిరుగుతోంది. ఈ ఏడు మొక్క బలంగా ఉంది, మంచి పంట వచ్చేలా ఉన్నది అని సంబుర పడ్డదో లేదో ఇప్పుడు ఈ యూరియా గోస పట్టింది. పది రోజుల్లో మందు కొట్టకపోతే పురుగు పట్టి మొక్క చనిపోయేలా ఉంది.

ఊర్లో ఎక్కడా యూరియా మందు దొర్కుతలేదు… ఊర్లో ఎంది, రాష్ట్రం, దేశం మొత్తం ఇదే లొల్లి అంటున్నారు … యూరియా కరువు.. అదెందో..మరి కొత్తగా.. ఎప్పుడూ లేనిది…బయట బ్లాక్ మార్కెట్ లో యూరియా బస్తాలు దళారులు అమ్ముతునే ఉన్నారు, …  డబ్బున్న బడా రైతులు  కొంటూనే ఉన్నరు.  డబ్బుంటే బ్లాకులో ఎందీ అమ్రికా నుంచైనా  తెప్పించికుంటారు . ఈ కరువులన్ని మా లాంటి పేదొల్లకే, ఎరువైన , అన్నమైనా….అనుకుంటూ రెండు మెతుకులు నోట్లో వేసుకుని రైతు వేదిక దగ్గరకి పోదామని మెల్లగా మంచం మీద లేచి కూర్చుంది.

ఇంతలో దుబాయ్ నుంచి తన బిడ్డ రమేషు ఫోన్ చేసాడు అని చేతిలో నోకియా కిపాడ్ ఫోన్ పట్టుకుని  పక్కనున్న తడికెల గోడలో ఉన్న సందులోంచి నడుచుకుంటూ వచ్చింది పక్కింటి రమణమ్మ …

యాదమ్మ కొడుకు రమేషు, రమణమ్మ కొడుకు వెంకట్ ఇద్దరూ దుబాయ్ లో లేబర్ పని చేస్తూ ఉంటారు. దుబాయ్ వెళ్లి ఇప్పటికి రెండు సంవత్సరాలకు పైనే అయ్యింది.

ఫోన్ చేతిలోకి ,తీస్కుని చెవి దగ్గర పెట్టింది.

“అవ్వ – ఎట్లున్నవే ?”

“బాగున్న బిడ్డ, నువ్ పైలమేనా?”

“బాగున్నానే – ఇయ్యాలన్న దొరక బట్టినవా లేదా ?”

“ఏ – ఏడ బిడ్డ – పొద్దటి సంది యండల తిరిగి తిరిగి ఇప్పుడే ఉత్త సేతులతో  ఇంట్ల కొచ్చిన- ఎక్కడా దొర్కలే బిడ్డా – బ్లాకులో అమ్ముతున్నారు అంట మనకాడ పైసలేడివి … ”

“మరి ఎట్లనే ? , మరో పది రోజుల్లో యూరియా మందు కొట్టకపోతే పైరు పురుగు పట్టుద్ది కదా? ”

“ నాకేమి సమజ్ అయితలే బిడ్డా – ఈ ఏడు వానలు బాగా పడ్డాయి, నీళ్లకు లొల్లి లేదనుకుంటిమి, ఇప్పుడేమో ఈ యూరియా  గోస పట్టింది. మన బతుకులింతేనా బిడ్డా” యాదమ్మ గొంతు బాధతో జీర పోయింది.

“నువ్వు ఫికర్ చెయ్యకు అవ్వా… నేను ఎదో ఒకటి చేసి పైసల్ పంపిస్తా , పది రోజుల్లో యూరియా బయట మార్కెట్లో కొని పంటకు కొడదాం ”

“సరే బిడ్డా ఉంటా మరి  – నువ్వు జాగ్రత్త ”

ఫోన్ రమణమ్మ చేతికి ఇచ్చింది. రమణమ్మ  మనస్సు కూడా కలుక్కుమంది. ఈ యూరియా గోస తనకి కూడా ఉన్న విషయం యాదికి వచ్చింది.

“బిడ్డా రమేషు మా వెంకట్  ని ఒక  సారి నాకు ఫోన్ చేయమను- మా పొలంలో కూడా యూరియా కొట్టలా… దానికి తోడు ఈ ఉదయం రెడ్డన్న కన్పించి మిత్తే పైసలు అడిగిండు…” అని చెప్పి, ఫోన్ బందు చేసి, తన నడుముకి ఉన్న గుడ్డ సంచిలో పెట్టుకుంది.

యాదమ్మ వైపు చూస్తూ..

“ఏమే – యాదమ్మ – ఎంగిలి పడ్డావా ఎమన్నా ? రైతు వేదిక దగ్గర గోవర్నమెంటోళ్ళు యూరియా బస్తాలు ఇస్తున్నారంటా – పొయ్యి లైన్లో కూర్చుందాం”

ఇద్దరు నడుచుకుంటా ఊరి బయట ఉన్న రైతు వేదిక దగ్గరకి బయలుదేరారు.

వచ్చే నెలంతా ఓవర్ టైం అది కూడా నైట్ డ్యూటీ చేస్తాను అని బతిమాలాడితే రెండు నెలల జీతం అడ్వాన్స్ గా ఇచ్చేందుకు మా మేనేజర్ ఒప్పుకున్నాడు.

సూపర్వైజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని డబ్బులు ఇంటికి పంపటానికి బయలు దేరాను. బస్సు దిగి మెట్రో స్టేషన్ వైపు నడిచాను . ఎండ చిర్రెక్కిస్తోంది. రెండు కిలోమీటర్ల దూరం నడవడానికి నలభై నిమిషాలు పైనే పట్టింది.  మెట్రో స్టేషన్ లోపలికి అడుగుపెట్టగానే చల్లని ఏసీ , నేను పై నుంచి కిందటి దాకా చెమటతో తడిసిపోయి ఉన్నానని  గుర్తుచేసింది.  గ్రీన్ లైన్ ప్లాట్ ఫారం చేరుకున్నాను. మరో ఎనిమిది నిమిషాల్లో మెట్రో రైలు రాబోతోందని అరబ్బీ లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది.

వెండింగ్ మెషిన్ పక్కనే ఉన్నఅల్యూమినియం బెంచి మీద కూర్చున్నాను. ఒక్కసారిగా చల్లని నీటిలో దిగినట్లుగా అనిపించింది. చల్లని ఏసీ వల్ల ఆ అల్యూమినియం బెంచి మంచు గడ్డలా మారినట్లు ఉంది . చెమటలో తడిచిపోయి  ఉండటం వలన చిరాకుగా ఉంది, కూర్చోలేక పోయాను. లేచి నిలబడి అటూ ఇటూ నడుస్తున్నాను.

మెట్రో రైలు శబ్దం లేకుండా వచ్చి ఆగింది, డోర్స్ తెరుచుకున్నాయి. నా ముందు ఆగిన కంపార్ట్మెంట్ జనాలతో నిండిపోయి ఉంది, అందరూ కార్పొరేట్ ఎంప్లాయిస్ అనుకుంటాను. చాలా మంది సూట్లు వేసుకుని ఉన్నారు, చెవుల్లో ఆపిల్ ఎయిర్ పోడ్స్, చేతుల్లో ఐఫోన్ . కొంతమంది దిగారు, మరికొంత మంది ఎక్కారు. నాకెందుకో ఈ కంపార్ట్మెంట్ లో ఎక్కాలనిపించలేదు. కొంచెం ముందుకు వెళ్లి మరో కంపార్ట్మెంట్ చూసాను. అక్కడా అదే పరిస్థితి, జనాలు నిండుగా ఉన్నారు. ముందుకు వెళ్లి చూద్దామా అనిపించింది, ఇంతలో డోర్స్ క్లోస్ అవుతున్నాయి అన్న అనౌన్స్మెంట్.

చేసేది లేక నా ముందు ఉన్న కంపార్ట్మెంట్లోకి అడుగుపెట్టాను.  లోపల అడుగు పెట్టగానే అప్పటిదాకా ఫోన్లల్లో మునిగి ఉన్న తలలన్నీ, ఒక్కొక్కటిగా పైకి లేచి, అటూ ఇటూ చూస్తున్నాయి. మొఖం అదోరకంగా పెట్టి, చేతిని ముక్కు దగ్గర అడ్డంగా పెట్టుకుంటున్నారు. కొంతమంది, జేబుల్లోంచి చేతి రుమాలు తీసి ,మరికొంత మంది సీట్లలో అటు ఇటు కదులుతూ తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు.

వాళ్ళందరూ అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు, ఇదేమి కొత్త కాదు. నేను మెట్రో ఎక్కిన ప్రతి సారి నాకు జరిగేదే … వాళ్ళందరూ చెమటతో తడిసిపోయి ఉన్న నా శరీరంలోంచి, ఉప్పు పట్టి, అట్ఠ కట్టి ఉన్న నా బ్లూ కలర్ యూనిఫామ్ లోంచి వచ్చే వాసనకు ముక్కు మూసుకుంటున్నారు.

ఈ దుబాయ్ ఎండలో పన్నెండు గంటల పైన పనిచేసే కన్స్ట్రక్షన్ లేబర్, నడి మధ్యాహ్నం నలభయ్ నిముషాలు నడిచి వచ్చిన మనిషి శరీరం నుంచి చెమట కంపు రాక ఇంకేమొస్తుంది.

అలవాటైన ఆ అసహ్యపు చూపులను, ఈసడింపులను ఇరవై నిముషాలు భరించి బూర్ దుబాయ్ చేరుకున్నాను. మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఎక్స్చేంజి ప్లాజాలో రెండు మూడు  మనీ ఎక్స్చేంజి ఆఫీసుల్లో రేట్ కనుక్కున్నాను. ప్రస్తుతం మార్కెట్ రేట్ ఒక్క దిర్హానికి ఇరవై నాలుగు రూపాయలు నడుస్తోంది. కానీ వీళ్ళు  కమిషన్, సర్వీస్ ఛార్జి, టాక్సు అన్ని కట్ చేసి పందొమ్మిది రూపాయలు అంటున్నారు.

నా లాంటి చిన్న జీతగాళ్లకు ఒక్క పైసా ఎక్కువ రేట్ వచ్చిన  కోటి రూపాయలతో సమానం, అందుకే మంచి రేట్ కోసం ఆ బిల్డింగ్లో ఉన్న ఆఫీసులన్ని తిరుగుతున్నా . గంట సేపు పైనే తిరిగాను, ఎక్కడ రేట్ కుదరట్లేదు. నేను పంపే ఉత్త మూడు  వేల దిర్హామ్ లు  కి మంచి రేట్ ఏమి ఇవ్వాలి  అంటున్నారు. ఆ మూడు వేల దిర్హామ్ లు నా రెండు నెలల కష్టం. అందుకే మంచి రేటు కోసం తిరుగుతూ ఉన్నాను.

తెలియకుండానే సాయంత్రం అయ్యింది, తక్కువ రేటుకు డబ్బులు పంపేందుకు మనసొప్పట్లేదు. తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ మళ్ళీ  రావడానికి సూపర్ వైజర్ పర్మిషన్ ఇస్తాడో లేదో, ఇంత దూరం వచ్చాక పంపకుండా పొతే ఎలా ?

ఇంతలో వెంకట్ గాడు ఫోన్ చేశాడు.

“ఎరా , పనయ్యిందా ?”

“అవ్వలేదు మావ,  .. రేట్ బాగా తక్కువ ఇస్తున్నారు, పందొమ్మిది రూపాయలు కంటే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వట్లేదు. ప్లాజా అంతా తిరిగాను.”

“ ఏందీ పందొమ్మిది రూపాయలా? ఈ లత్కోర్ కొడుకులు అంతే రా. మనకి సదువు రాదు, అర్ధం కాదు అని ఇలా మోసం చేస్తూ ఉంటారు.అందుకే నా మాట విను “హుండీ” పంపుదాం  . నాకు తెలిసిన బెంగాలీ ఉన్నాడు, మనోళ్ళం అందరం అక్కడే పంపుతాం.

“ హుండీ, అంటే భయం రా , ఇప్పటిదాకా ఎప్పుడు చెయ్యలేదు.”

“ భయం ఎం లేదు రా, మొన్ననే మన  రవి గాడు పంపిండు- అయినా గల్ఫ్ లో పనిజేసే మనోళ్లందరూ హుండీ నే పంపేది , ఒక్కరోజులో అకౌంట్లో డబ్బులు పడ్డ్డయ్, ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిండు రేటు “

“ఇరవై ఐదా?”

“ అవును రా , ఇరవై ఐదే!“

నా మెదడు తెలియకుండానే లెక్కలు వేసేసింది. నా దగ్గర ఉన్నది మూడు వేల దిర్హాములు. ఇరవై ఐదు రూపాయల రేట్ లెక్కన డెబ్బై రెండు వేల ఇండియా రూపాయలు. అదే ఈ పందొమ్మిది రూపాయలు ఐతే, యాభై ఏడూ రూపాయలు, అంటే దాదాపు పదిహేను వేల రూపాయల తేడా. పదిహేను వేలు చిన్న లెక్క కాదు, చెల్లెలి ఫీజు డబ్బులు . ఆశ మా చెడ్డది కదా…

“ సరే మామ – హుండీ పంపుదాం,  నువ్వే చూసుకోవాలి రా మరి  ”

“ ఫికర్ ఎం లేదు రా, ఇప్పుడే  ఆ బెంగాలీ అన్నకు ఫోన్ చేసి మాట్లాడుతా , రాత్రి క్యాంపులో నీ దగ్గర కాష్ తీస్కుని, రేపు డ్యూటీ  అవ్వగానే వెళ్లి చేయిస్తాను.”

3

నైట్ షిఫ్ట్ అవ్వగానే , క్యాంపుకు పోయే కంపెనీ బస్సు ఎక్కకుండా , రమేష్ గాడి డబ్బులు “హుండీ” పంపడానికి మెట్రో బస్సెక్కాడు వెంకట్. బుర్ దుబాయ్ లో హుండీ చేసే బెంగాలీ భాయ్ దగ్గరకు వెళ్ళాలి. ఈ హుండీ వ్యవహారం అంతా భలే గమ్మత్తుగా అనిపిస్తుంది వెంకట్ కి. ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్చేంజి రేట్ కన్నా ఒకటో , రెండో రూపాయలు ఎక్కువే ఎందుకు ఇస్తుంటారో, వాళ్ళకి లాభం ఎలా వస్తోంది, ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇలా ఎన్నో సార్లు ప్రశించుకున్నాడు.

బస్సు దుబాయ్ రోడ్ల మీద పరుగులు తీస్తోంది, వెంకట్ గాజు కిటికీ మీద తల ఆనించి  ఏటో దీర్ఘంగా చూస్తున్నాడు. ఫోన్ జేబులోంచి  తీసి మొబైల్ డేటా ఆన్ చేసాడు, తేనె తట్టుని కదిపితే మీద పడే కందిరీగల్లా ఒక్క సరిగా నోటిఫికేషన్ మీద పడుతున్నాయి .

కాసేపటికి వాట్సాప్ లో కాల్ వస్తోంది, వెంకట్ అసహనంగా సీట్లో కదిలాడు. సైలెంట్ లో పెట్టి కిటికీలోంచి బయటకు చూసాడు. మళ్ళీ రింగవుతోంది, నుదుటి మీద చెమట చుక్కలు మొలుస్తున్నాయి . ఈ సారి కాల్ లిఫ్ట్ చేసి, చెవి దగ్గర పెట్టుకున్నాడు.

“ ఎం వెంకట్ , ఫోన్లో దొర్కుతనే లేవు. మొన్నటి సంది ఫోన్ చేస్తున్న నీకు”

“నమస్తే రెడ్డన్న , అరె అట్ల ఎం లేదు అన్న, నైట్ షిఫ్ట్ నడుస్తోంది. అందుకే “

“సరే గాని – పైసల సంగతి ఏమైంది?  ఇప్పటికే రెండు నెల్ల మిత్తే కట్టలే .”

“ అన్నా అదే చూస్తున్న, కొంచెం టైం కావాలి. ఈ ఒక్క నెల ఆగరాదు ?”

“ తమ్మి – ఇప్పటికే మస్తు ఆగిన, ఇగ ఆగేది లే.  నువ్వు వారం రోజుల్లో రెండు నెలల బాకీ మిత్తే కట్టకపోతివా – మీ ఇంటికి పోయి , మీ అవ్వ, బాపు ముందు కూసుంట మరి. ఆరోజు ఎం లొల్లయినా నన్ను అనొద్దు మళ్ళా.”

“ అట్లాకాదన్న – ఇంటి దగ్గర పరిస్థితి తెలిసిందే కదా , కొంచెం  అర్ధం  చేసుకో అన్నా “

“ ఇప్పటికే రెండు నెలలు ఆగిన తమ్మీ, ఇగ నా వల్ల కాదు,  నా పంచాయతీలు నాకున్నాయి”

ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేసాడు రెడ్డన్న. వెంకట్ మొహమంతా ఎర్రబడింది. సీటులో జాగిలపడి , కళ్ళు మూసుకున్నాడు . రెడ్డన్న మాటలు చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. ఇంటి దగ్గర అవ్వ , బాపు గుర్తొచ్చారు. రెడ్డన్న ఈ సారి ఇంటికి తప్పకుండా వెళ్తాడు. ఆ విషయం ఆలోచిస్తూంటేనే  శరీరమంతా సన్నని వణుకు పుట్టింది. కాసేపటి తరువాత వాట్సాప్ లో చెల్లె మెసేజ్ వచ్చింది. రాబోయే ల్యాబ్ పరీక్ష కోసం డబ్బులు కావాలి అని .

వెంకట్ దగ్గర ప్రస్తుతం డబ్బులేదు. ఆరు నెలల క్రితం తన పెద్దక్క పురుడు  కోసమని రెడ్డన్న దగ్గర ఐదు రూపాయల వడ్డీకి లక్ష అప్పు చేసాడు .అప్పటి నుండి తన చిన్న జీతంతో  ఇంట్లో ఖర్చులు , చెల్లెలి కాలేజీ, హాస్టల్ ఖర్చు, రెడ్డన్న వడ్డీ  కట్టలేక దొరికిన  చోటల్లా అప్పులు చేసి, తనకు తెలియకుండానే ఈ అప్పుల ఛట్రంలో చిక్కుకున్నాడు.

జీతం రావడానికి ఇంకో పదిహేను రోజులు టైం ఉంది. వచ్చినా ముందు తీసుకున్న అడ్వాన్స్ డబ్బుల కట్ అయ్యే వస్తోంది. బస్సులో కూర్చొనే ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురు దోస్తులకు ఫోన్లు చేసి పైసలు అడిగిండు. అందరి దగ్గర లేదనే సమాధానమే వచ్చింది.  తలంతా ఎదో  పిచ్చి  పొగ పట్టినట్లు మబ్బుగా ఉంది,ఎం చెయ్యాలో అర్థం కావట్లేదు.

మరి కాసేపట్లో బస్సు బూర్ దుబాయ్ స్టేషన్ దగ్గర ఆగింది. వెంకట్ బస్సు దిగి, నడుచుకుంటూ మనీ ఎక్స్చేంజి ఆఫీసు చేరుకున్నాడు.

“సలాం , వెంకట్ భాయ్! నీకోసమే చూస్తున్న ”

వెంకట్ మాట్లాడట్లేదు, మౌనంగా నిలబడి అక్కడ డిస్ప్లే బోర్డు మీద ఆ రోజు ఎక్స్చేంజి రేట్ల వైపు  దీనంగా చూస్తున్నాడు .

“ వెంకట్ భాయ్, క్యా హు ఆ ?”

“అరె – ఎం లేదు భాయ్. నైట్ డ్యూటీ అయ్యింది కదా నిద్ర వస్తోంది.. ఇగో ఈ మూడు వేల దిర్హామ్ తీస్కొని “హుండీ” పంపు, మంచి రేట్ కావాలి. రేపటికల్లా డబ్బులు అకౌంట్లో పడాలా”

“ వెంకట్ భాయ్ , నీకు ఎప్పుడు మంచి రేటే ఇస్తా కదా- రెగ్యులర్ కస్టమర్ వి నువ్వు – సరే మీ దోస్తు బ్యాంకు  అకౌంట్ నెంబర్ ఇక్కడ రాసివ్వు”

“నా అకౌంట్ నెంబర్ ఉంది కదా – దానికే పంపు”

“అదేంటి,  నిన్న ఫోన్ చేసి మీ దోస్తుకు హుండీ పంపాలి అన్నావ్”

“లేదు లే భాయ్, నా అకౌంట్ కే పంపు”

“సరే భాయ్. రేపు ఉదయం నీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి”

వెంకట్ అక్కడినుంచి బయలుదేరి తన క్యాంపు కి వెళ్ళిపోయాడు.

4

నాలుగు రోజులుగా రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టట్లేదు . ఫోన్లో ఏ నోటిఫికేషన్  వఛ్చిన అకౌంట్లో డబ్బులు పడ్డ మెసేజ్ ఏమో అని శరీరం జివ్వు మంటోంది. అప్పటికే నాలుగు రోజులు పైగానే అయ్యింది వెంకట్ గాడికి డబ్బులు ఇచ్చి , ఇంకా డబ్బులు పడకపోయేసరికి ఎదో తెలియని భయం. ఎప్పటిలా ఎక్స్చేంజి లో పంపించి ఉంటె ఇంత టెన్షన్ ఉండేది కాదు, తెల్లారే సరికి ఇండియా అకౌంట్ లోకి వచ్చేసేవి.దిగులుగా ఉంది, ఏ పని సరిగా చెయ్యలేక పోతున్నాను . రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటి దగ్గర అవ్వకు యూరియా కోసం డబ్బులు పంపుతానన్న మాట గుర్తుకొచ్చి నిద్ర పట్ట నివ్వట్లేదు. ఈ గల్ఫ్ జిందగీ మామూలుది కాదు , ముందు డబ్బులు సంపాందించడానికి ఎన్నో కష్టాలు పడాలి, సంపాందించిన ఆ నాలుగు దినార్లు ఇంటికి పంపడానికి మరిన్ని కష్టాలు. ఆ డబ్బు ఇంటి కాడ అవ్వ చేతిలో పడే దాకా మనస్సు , మనస్సులా ఉండదు. ప్రతి నెల ఇదే గోస  ..ఈసారి ఈ హుండీ వల్ల ఇంకొంచెం ఎక్కువే  అయ్యింది.

వెంకట్ కి ఫోన్ కలిపాను. మూడు సార్లు రింగ్ అయ్యాక లిఫ్ట్ చేసాడు.

“ఎరా మామ, డబ్బులు ఇంకా  పడలేదు రా . ఇప్పటికే నాలుగు రోజులవుతోంది.ఒక్కరోజులో పడుతాయి అన్నవ్”

“మామ, అదే కనుక్కున్నా … సాయంత్రానికల్లా తప్పకుండా పడతాయి అంటున్నాడు .”

“సరే రా – చుస్తుంటా , మెసేజ్ రాగానే నీకు ఫోన్ చేస్తా .” అని చెప్పి ఫోన్ పెట్టి, పనిలో పడ్డాను.

డ్యూటీ అయిపోయే సరికి సాయంత్రం ఆరయ్యింది. క్యాంపుకు వెళ్లే బస్సులో కూర్చొని మొబైల్ స్విచ్ ఆన్ చేసాను. కళ్ళు బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్ కోసం ఆతృతగా వెతుకుతున్నాయి. కానీ రావాల్సిన మెసేజ్ రాలేదు.  యెనో ఆప్ ఓపెన్ చేసి , పైనుంచి కిందకి రెండు మూడు సార్లు లాగి , రిఫ్రెష్ చేసిచూశాను… అంకె మారలేదు.కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. కోపం వచ్చింది. వెంటనే వెంకట్ కు ఫోన్చేశాను..

“అరేయ్, వెంకట్ . ఇంకా డబ్బులు పడలేదు రా. ఏమైంది. నాకేం అర్ధం కావట్లేదు. భయమవుతాంది”

“మామా , ఇప్పుడే మాట్లాడినా రా. ఎదో అకౌంట్ ప్రోబ్లం అంట. పెండింగ్ లో ఉంది, కొంచెం వెయిట్ చెయ్ మంటున్నాడు”

నాకు ఒళ్ళు మండిపోయింది. అప్పటిదాక ఉన్న చిరాకు, కోపం, భయం , బాధ అంతా ఒక్క సారిగా మందుపాతర లాగాపేలింది . వెంకట్ మీద గట్టి , గట్టిగా ఫోన్లో అరుస్తుంటే పద్నాలుగు గంటలు డ్యూటీ చేసి, అలసిపోయి బస్సు సీట్లలో నిద్రపోతున్న తోటి కార్మిక అన్నలు, ఒకరిద్దరు లేచి , నా వైపు జాలిగా చూసి, మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు.

నాలుగు రోజులు దాటిపోయాయి,డబ్బుల జాడ లేదు. ఇంకో వారం రోజుల్లో పొలానికి యూరియా మందు కొట్టకపోతే మొక్క చచ్చి పోతది, అవ్వ ఆర్నెల్లుగా పడ్డ కష్టం, పెట్టిన పెట్టుబడి అంతా పురుగుల పాలైపోయేలా ఉంది. కన్నీళ్లు ఆగట్లేదు, నా మీద నాకు కోపంగా ఉంది… తలను ముందు సీటు మీద పిచ్చి పట్టినవాడిలా కొట్టుకుని, అలాగే ఏడుస్తూ కూర్చున్నాను.

తరువాతి రోజు సూపెర్వైజర్ తో తిట్లు తిని, బతిమాలి ఎలాగోలా పర్మిషన్ తీసుకుని, బుర్ దుబాయిలో ఉన్న బెంగాలీ మనీ ఎక్స్చేంజి అడ్రెస్ కనుక్కుని ఆ ఆఫీసుకు పోయాను.

“నమస్తే, బెంగాలీ భాయ్. నేను వెంకట్ వాళ్ళ దోస్తుని”

“ హ – చెప్పండి భాయ్. ఏంటి హుండీ చెయ్యాలా మీ డబ్బు కూడా ?”

“కాదు భాయ్, మొన్న వెంకట్ వచ్చి మూడు వేల దిర్హామ్స్ హుండీ చేసాడు కదా, ఆ డబ్బు ఇంకా నా అకౌంట్లోకి రాలేదు భాయ్. దాని గురించి మాట్లాడదామనే వచ్చాను.”

“ అదేంటి… ఆ మూడువేల దిర్హామ్స్ ఆ రోజు రాత్రికే వెంకట్ ఇండియా అకౌంట్ కి డబ్బు పంపించేసాను కదా … వెంకట్ కు స్క్రీన్ షాట్స్ కూడా పంపాను.”

నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా ఉంది. బెంగాలీ చెప్పింది సరిగా అర్ధం కాకా , మళ్ళీ అడిగాను. బెంగాలీ చెప్పిందంతా రెండో సారి విన్న నాకు జరిగింది అర్ధం అయ్యింది…. వెంటనే వెంకట్ కి ఫోన్ చేశాను..

రింగ్ అవుతోంది, లిఫ్ట్ చెయ్యట్లేదు..

5

ఐదవ రోజు ఉదయం యాదమ్మ చీటీ పట్టుకుని రైతు వేదిక బయట ఉన్న వేప చెట్టు కింద కూర్చొని తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ రోజు రమణమ్మ తనతో రాలేదు. ఊర్లో పనుంది , నేను వెనకంబడి వస్తాను అని చెప్పింది.

రైతు వేదిక చుట్టూ జనాలు చిటీల కోసం బెల్లం చుట్టూ ఈగల్లా తిరుగుతున్నారు . పోలీసోళ్ళు కర్రలతో వాళ్ళని అదిలిస్తున్నారు . ఎవ్వరిని లోపలి పంపట్లేదు. చీటీలు దొరికిన జనం చెట్ల నీడల్లో,  టీ , టిఫిన్ షాపుల  దగ్గర కూర్చొని ఉన్నారు. పంచాయతి సెక్రటరి సీరియల్ నంబర్లను మైకులో పిలుస్తున్నాడు .

ఇంతలో రమణమ్మ యూరియా బస్తాలు ఆటోలో వేసుకుని రైతు వేదిక వెనకున్న మట్టి  రోడ్డు లోంచి బయటకు రావడం చూసి, అటు వైపుగా నడిచింది.

“ఏమో ,  రమణ ,  ఎట్ల పట్టినవే బస్తాలు” ఆశ్చర్యకరంగా అడిగింది.

“ డబ్బులు ముట్టిపించిన , ఇంకేం చెయ్యాలె. లేకుంటే పంట పోయేట్లు ఉన్నది. మా వెంకటీ దుబాయ్ కెల్లి పంపినాడు, ఈ పొద్దుగాల్నే బ్యాంకికి పోయి తెచ్చిన .”

“ మంచిదే – నువ్వన్న పట్టినవ్”

యాదమ్మకు తన కొడుకు పైసలు పంపిస్తాడన్న విషయంగుర్తుకువచ్చింది. వెంటనే రమణమ్మను తన కొడుకు రమేషు కు ఫోన్ కలపమన్నది. రెండు సార్లు రింగైనా ఫోన్ ఎత్తలేదు.

“ఎత్తుత లేడే , సాయంకాలం మళ్ళా చేద్దాం. పొలం కాడ కూలీలు కూసోని ఉన్నరు జల్ది పోవాల్నా” అంటూ ఆటో డ్రైవర్ సీటు పక్కన ఉన్న చెక్క బల్ల మీద కూర్చొని, ఆటో డ్రైవర్ ను బండి తియ్యమన్నది.

ఆటో యూరియా బస్తాల బరువుకు- “ గీ- గీ ” అంటూ అరుచుకుంటూ, నల్లని డీజిల్ పొగ చిమ్ముకుంటూ వెళ్లిపోయింది.

యాదమ్మ మనస్సు ఉసూరు మన్నది. ఆర్నెల్లుగా చంటి బిడ్డలా సాకిన పంట, రాత్రనక , పగలనక  చెమటోడ్చి నిలబెట్టిన పంట తన కళ్ళ ముందే చావబోతుంటే ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితి అర్థం కాక పిక్కుపోయి ఉన్న కళ్ళల్లోంచి రెండు చుక్కల కన్నీళ్లు కార్చింది.

ఇంతలో రైతు వేదిక దగ్గర హడావుడి మొదలైంది. వేరే రాష్ట్రం నుంచి రెండు యూరియా లారీలు వచ్చాయి. రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. యాదమ్మ కూడా చెమ్మగిల్లిన కళ్ళతో ఆశగా అటు వైపు అడుగులు వేసింది.

యాదమ్మ వరి పొలంలో మొక్క పచ్చబడి , పురుగు తినడం మొదలయ్యింది.

*

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Hundi is a story about those who are effecting Inside Gulf as well as outside Gulf bcoz of their lack of knowledge and also trusting people like anything. Yadhamma and Ramesh lanti vallu inka entha mandhi vunnaroooo. :(.Nijam ga Paapam anipinchindhi story reed chesthunte.
    Sanjay garu, you are amaging about the script of their native language and slang.. congratulations!!…. So….relevant and accurate slang…super! Keep rocking Sanjay.

  • కథ చదివి కళ్ళు చెమ్మగిల్లాయి భాయ్. దుబాయ్ నుంచి ఇండియాకు డబ్బులు పంపడం కూడా చాలా పెద్ద సమస్య. ఇక్కడి సమస్యలను నెరవేర్చేందుకు అక్కడ పడే పాట్లు చదివి దుబాయ్, మస్కట్ వెళ్ళిన మా మామలు, చిన్నాన్న, పెదనాన్నలు, బావలు, బామ్మర్దులు గుర్తొచ్చి గుండె చెరువైంది. హుండీ గురించి తెలిసి ఉలాక్కిపడ్డాను. దుబాయ్ నేపథ్యంలో మనవాళ్ళ వెతలను ఇలా కథలుగా మలుస్తున్న సంజయ్ ఖాన్ కు దిల్ సే ముబారక్.

  • గల్ఫ్ దేశాలలో డబ్బు సంపాదించడం ఒక వ్యధ ఐతే.. ఆ డబ్బుని తమ కుటుంబానికి పంపడం ఇంకో వ్యధ.. ప్రతి రూపాయి విలువైనది.. ఎక్కువ exchange value వస్తుంది అని హుండీ ని ఎంచుకుంటారు చాలా మంది.. కానీ నమ్మదగిన వ్యక్తులు తక్కువ.. ఈ వచ్చే కొన్ని ఎక్కువ రూపాయల కోసం.. మొత్తాన్నే కోల్పోతుంటారు.. కొందరు పాపం.. ఏమీ చేయలేని పరిస్థితి… ఎంత ఏడ్చిన తీరని కష్టం… చాలా బాగా వర్ణించారు Sanjay గారు.. thank you for showing us how it is actually to earn in Gulf and sending money to India. Awaiting more stories from You.💫

  • చాలా బాగుంది కథ.. తెలంగాణ ప్రస్తుత పరిస్థితిలను కళ్ళకి కట్టినట్టు బాగా చూపించావ్.. అల్ ది బెస్ట్ బా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు