హాల్ట్ పాయింట్

“నా ప్రేమ మీకే అర్థం కాలేదు. ఇక పాపకి అర్థమవుతుందా? అర్థం చేసుకుని నా దగ్గర ఉంటుందా?”

పెద్ద అరటి తోట. ఇక్కడ రోజూ ఆడుకోవడం ఎంత బాగుంటుందో మీకు చూపించాలి. చూపించలేకపోతే కనీసం చెప్పాలి.

ఆటలయ్యాక అరటితోట నుంచి తోట బావి, దాని పక్కనే ఉండే చెరువు దగ్గరరికెళ్లి ముఖం కడుక్కొని ఇంటికి చేరుకోగానే అమ్మ నాలుగు తగిలించడానికి సిద్ధంగా ఉండేది. “ఈ ఎండలో ఆటలేంటిరా?” అని కోప్పడేది. అయినా నేను మాట వింటానా, అమ్మ కాస్త నిద్ర పోతుందన్నట్టు కనిపించగానే ఇంటి వెనకాల గోడ దూకి స్కూల్లోకి పరిగెత్తేదాన్ని. అప్పటికే నా ఫ్రెండ్స్ అక్కడ ఆడుకుంటుండేవారు. వాళ్ళ ఆట చెడగొట్టి మరీ, “మళ్లీ ముందు నుంచి అడదాం” అని గోల చేసేదాన్ని.

అమ్మ నిద్రలేచే సమయానికి ఎలాగోలా ఇంట్లో ఉండేదాన్ని. కొన్నిసార్లు అడ్డంగా దొరికేదాన్ని. నాన్న ఉంటే కొట్టనిచ్చేవారు కాదు కానీ లేరంటే ఇంకంతే.

కొన్నిసార్లు ఊరు చివరున్న అరటి తోటలో ఆడుకునేవాళ్లం. అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. ఓ పెద్దయన ఉంటాడు కానీ, ఆయన మమ్మల్ని ఏమీ అనేవారు కాదు. నేను ఇంట్లో కనిపించలేదంటే అమ్మ నేరుగా స్కూల్ దగ్గరికే వచ్చేసేది. అక్కడ కూడా కనిపించలేదంటే నాన్నను అరటి తోట దగ్గరికి పంపించేది. నాన్న వచ్చి ముద్దాడి, ఆయన సైకిల్ ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లేవారు.

ఇలాగే ఒకరోజు అరటితోటలో ఆడుకుంటుంటే.. “శ్రావణి.. శ్రావణి..” అని గట్టిగా ఎవరో పిలిచినట్టు అనిపిస్తే చూశా. అమ్మ. ఎప్పుడూ నాన్నే వచ్చేవారు. ఈసారేంటో అమ్మ వచ్చిందని చూస్తున్నా, అమ్మ కళ్లనిండా నీళ్లు.

“ఏమైందమ్మా?” అడిగా.

సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకొని లాక్కెళ్తోంది.

“ఏమైందమ్మా?” మళ్లీ అడిగా. నా చెయ్యి అలాగే పట్టుకొని, “మీ మావయ్య బావి దగ్గర కరెంట్ షాక్ కొట్టి చచిపోయాడు” అంటూ బోరున ఏడుస్తూ చెప్పింది. బావి దగ్గర నీళ్లలో మావయ్య పడిపోయి ఉన్నాడంట. నేను, అమ్మ వెళ్లేసరికి బయటకు తీశారు.

అమ్మతో పాటు ఊళ్లోవాళ్లంతా మామయ్యను చూసి ఏడుస్తున్నారు.

మామయ్య అంటే నాకెంతో ఇష్టం. ఏ ఊరెళ్లినా కొత్త బట్టలు తెచ్చేవాడు. ప్రతి పండక్కీ గాజులు, బట్టలు, బొట్టుపిల్లలు కొనిచ్చి, “నా కోడల్ని హీరోయిన్ చేస్తా” అని మురిసిపోయేవాడు. అలాంటి మామయ్య ఇప్పుడు లేడని అమ్మ చెప్తుంటే.. గుండెల్లో ఏదో గుబులు. ఆ గుబులు అలాగే నన్ను ఎన్ని రోజులు వెంటాడిందో!

ఎందుకో తెలీదు కానీ, మామయ్య చనిపోయాక మళ్లీ అరటి తోటకు ఆడుకోవడానికి వెళ్లలేదు. ఆ తోట చూస్తే భయమేసేది. అప్పటినుంచి ఎక్కువగా స్కూల్ దగ్గరే ఆడుకుంటుండేదాన్ని. ఒక్కోసారి మా పొలం దగ్గరికి వెళ్తుండేదాన్ని. అక్కడ ఓ పెద్ద గుడిసె ఉండేది. ఆ గుడిసె దగ్గరే ఆడుతుంటే అన్నీ మరచిపోయినట్టు అనిపించేది.

ఆ పొలం, స్కూలు, ఇల్లు.. ఇదే ప్రపంచంగా బతుకుతున్న నా జీవితంలో, మా పొలాన్ని ఆనుకొనే ఉన్న మర్రిచెట్టుకు ఉరేసుకొని నాన్న చనిపోవడం అతిపెద్ద విషాదం. ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పే నాన్న, భారీ వర్షానికి పొలం పాడైతే అలా చనిపోతారని నేనస్సలు ఊహించలేదు.

******

నాన్న లేకపోవడాన్ని అమ్మ తట్టుకోలేకపోయింది. నాకైతే ధైర్యం చచ్చినట్లే ఉండేది. రాత్రుళ్లు అలా ఏడుస్తూనే ఉండేదాన్ని. మా నాన్న ఉరేసుకున్న చెట్టుని, మా నాన్న చనిపోవడానికి కారణమైన ఆ పొలంపై కోపంతో రాళ్లు విసిరికొట్టాను. కొన్ని రోజులు ఆటల జోలికే పోలేదు. నాన్న సమాధి దగ్గరికెళ్లి రోజూ కూర్చొని వచ్చేదాన్ని.

ఓ రోజు అర్ధరాత్రి నిద్ర రాక అటూ ఇటు కదులుతున్నా. నాన్న సమాధి చూడాలనిపించింది. అమ్మకు చెప్పకుండా నాన్న సమాధి దగ్గరకు వెళ్లా. పెద్ద వర్షం పడుతోంది. ఆ వర్షంలోనే బోరున ఏడుస్తున్నా. ఇంతలో అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చింది.

నన్ను చూసి చూడగానే, “దెయ్యం పట్టిందా, ఇక్క్కడ కూర్చున్నావు?” అని కోప్పడింది.

“నాన్న గుర్తొచ్చారు. అందుకే వచ్చా” అని మళ్లీ ఏడ్చా. దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అమ్మ. “మీ నాన్న మనతోనే ఉంటారు. రోజులు బాలేవు. నువ్వు ఇలా ఒంటరిగా రాత్రుళ్లు రావడం మంచిది కాదు” అని ఇంటికి తీసుకెళ్లింది.

ఉదయాన్నే లేవడంతోనే విపరీతమైన కడుపునొప్పి. మంటగా అనిపించడంతో అమ్మకు చెప్పా. పక్కన ఉన్న వాళ్లను పిలిచి చూపించింది.

“పిల్ల పెద్ద మనిషి అయింది” అన్నారు.

నాకేం అర్దం కాలేదు. “ఏమైంది?” అనడిగా అమ్మను.

“ప్రతి అమ్మాయికీ అయ్యేదే ఇది. కంగరు పడకు. ప్రతి నెల ఇలా అవుతూనే ఉంటుంది” అని ధైర్యం చెప్పింది. గదిలో ఓ మూలకి చాప వేసింది. “ఇక్కడే తొమ్మిది రోజులు కూర్చోవాలి” అని చెప్పింది. నాకు భయంగా అనిపించింది. రోజూ బయట తిరిగేదాన్ని ఒకేదగ్గర కూర్చోవాలంటే బెంగగా అనిపించింది.

మొదటిరోజు అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. మీ నాన్న, మామయ్య ఉంటే ఎంత సంతోషించేవారో అని చెప్పుకుని ఏడ్చింది. నాకూ కన్నీళ్లు ఆగలేదు. ఓ చిన్న బొమ్మ చేతికి ఇచ్చింది. కారం, ఉప్పు లేకుండా పప్పు, అన్నం పెట్టేది. తినాలనిపించేది కాదు. పక్కనే ఉన్న బొమ్మతో కాస్త ఆడుకునేదాన్ని. కొద్దిసేపు పడుకునేదాన్ని. తొమ్మిది రోజుల తర్వాత కాస్త ప్రశాంతంగా అనిపించింది.

“పిల్లకి ఫంక్షన్ చేయవా ఏంటి?” అని అమ్మను అడిగింది పక్కనున్న శారద అత్త.

“పిల్ల ఫంక్షన్‌కు పైసలు కావాలి. ఆయన ఉంటే ఏదో ఒకటి చేసేవారు. ఆడదాన్ని నాకు ఏం తెలుసు?” అని అమ్మ మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది.

“ఉన్న పొలం అమ్మి ఫంక్షన్ చెయ్యి. మిగిలిన డబ్బు దాచుకో” అని చెప్పింది అత్త. ఇక చేసేది ఏం లేక పొలం అమ్మి, అందులో కొంత డబ్బుతో ఫంక్షన్ చేసింది. ఆ తర్వాత చదువుపై శ్రద్ద పెట్టి చదువు కంప్లీట్ చేశాను. ఉద్యోగం చేస్తే కాస్త గౌరవం ఉంటుందని బలవంతంగా ఊరునుంచి పంపించింది. ఊరు వదిలి వెళ్లాలి అనిపించలేదు. కానీ తప్పలేదు.

 

*****

 

కొత్త ఊరంతా కొత్తగా ఉండేది. సమయం దొరికితే వెంటనే ఊరెళ్లేదాన్ని. ఓ రోజు అమ్మకు గుండెనొప్పి అని ఫోనొచ్చింది. పట్టణంలో చూపించా. మరోసారి వస్తే బతకదని అన్నారు. అమ్మను నా దగ్గరే ఉండమని అడిగా. ఒప్పుకోలేదు.

“మీ నాన్న జ్ఞాపకాలు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఇంటిని వదిలిరాలేను. ఉన్నని రోజులు అందులోనే ఉండి చచ్చిపోతా” అని ఏడ్చింది. అమ్మ మాటలకు నాకూ కన్నీళ్లు తన్నుకొచ్చాయి.

ట్రీట్‌మెంట్ తర్వాత తిరిగెళ్లిపోయింది. అలా తిరిగెళ్లిపోయిన కొద్ది రోజులకే మరోసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఈసారి అది అమ్మను తీసుకెళ్లిపోయింది.

అమ్మ చనిపోయాక అంతా శూన్యంలా ఉండేది. జీవితం మొత్తం కోల్పోయిన గుబులు వెంటాడేది. చాలారోజులపాటు ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయి ఏడ్చా.

ఎన్నాళ్లని ఇలాగే ఉండిపోతావని అమ్మ అడిగినట్టు అనిపించినరోజు, ఆ వెంటనే ఊరు వదిలేసొచ్చా.

ఒక చిన్న టీచర్ ఉద్యోగం దొరికింది.

సరిగ్గా అప్పుడు పరిచయమయ్యాడతను.

అందంగా ఉంటాడు. అందంగా నవ్వుతాడు. స్త్రీల పట్ల అతనికి ఉన్న గౌరవం చూస్తే భలే ముచ్చటేసేది. బాగా మాట్లాడతాడు కూడా. అతనితో ఏదోకటి ఎప్పుడూ మాట్లాడాలానిపించేది. కానీ అమ్మాయినని గుర్తొచ్చి కాస్త తగ్గేదాన్ని. అతనిపై మనసు పారేసుకున్నానని చెప్పాలి.

అతనికీ అలాగే ఉండేదేమో కానీ ఎప్పుడూ బయటపడేవాడు కాదు.

ఓ రోజు సాయంత్రం.. “నేను డ్రాప్ చేస్తా” అనడిగాడు.

ఆ టైంకి ఎందుకో అతని బైక్ ఎక్కాలనిపించింది. ఎక్కి కూర్చున్నా. మెల్లిగా తీసుకెళ్తున్నాడు. దార్లో చాలా విషయాలు చెప్పాడు. పొలం దగ్గర నాన్న సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన కబుర్లు గుర్తొచ్చాయి.

అతనితో ఏదో తెలియని కనెక్షన్ దొరికింది. అదే మా మధ్య లెక్కలేనన్ని మాటలకు దారిచ్చింది.

అరటి తోట, స్కూల్, ఆటలు, అమ్మ, నాన్న, మామయ్య.. నాకు సంబంధించిన జీవితమంతా అతనితో పంచుకున్నా.

కనిపించినప్పుడల్లా, “హలో మేడమ్,” అనేవాడు. పనిమీద ఉంటే అస్సలు పట్టించుకునేవాడు కాదు.

కొన్నిరోజులకి అతనికి పెళ్లై ఓ పాప కూడా ఉన్నట్లు తెలిసింది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

ఇదంతా దాచాడనిపించినా, అతనిపై నా ఒపీనియన్ అలాగే ఉంది. ఎందుకో అతని పాపని చూడాలనిపించిది. ఓ రోజు వాళ్ల ఇంటికి వెళ్లి తలుపు కొట్టా. తీశాడు. నన్ను చూసి షాకయ్యాడు. ఆ వెంటనే నేను పాప కోసం వచ్చానని అర్థం చేసుకొని మామూలుగా ఉన్నాడు. పాప చాలా అందంగా ఉంది. ఓ నాలుగేళ్ళు ఉంటాయనుకుంటా. తనని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. అచ్చం నాలాగే అల్లరి చేస్తోంది. ఏదైనా నచ్చకుంటే విసిరిగొడుతోంది. నోరు అస్సలు అదుపులో లేదు. నాన్నకు ఎదురుచెబుతోంది. తనని చూస్తే, నా చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరు, అమ్మ, నాన్న గుర్తొచ్చారు.

’మీ భార్య ఏది?’ అని అతడ్ని ఎప్పుడూ అడగలేదు. అతను కూడా చెప్పలేదు.

టైం దొరికినప్పుడల్లా పాపతో ఆడుకోవడం ఒక రొటీన్ అయింది. కొన్నిసార్లు పాప నా దగ్గరే ఉండేది. అల్లరి చేసేది. మొహమాటం అస్సలు ఉండేది కాదు. కావాల్సింది అడిగేది. తను ఉన్నంతసేపు టైం తెలిసేది కాదు.

మా ఊరు గురించి, అరటి తోట గురించి, అమ్మ, నాన్న, మామయ్య గురించి చెప్పాను. అప్పట్నుంచి మా ఊరికి తీసుకెళ్లమని గొడవ చేయడం మొదలుపెట్టింది. కానీ ఇందుకు అతను ఒప్పుకుంటాడో, లేదో!

ఓ నాలుగుసార్లు అడిగాక ఒప్పుకున్నాడు.

ముగ్గురం కలిసి బస్సులో బయలుదేరాం. పాప నాపై కూర్చుని, అలాగే మెల్లిగా నిద్రలోకి జారుకుంది.

“పాప పుట్టిన రెండేళ్లకు నా భార్య యాక్సిడెంట్‌లో చనిపోయింది. తనకు పాప అంటే చాలా ఇష్టం” పాప పడుకోవడం చూసి మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ మాట చెబుతున్నపుడు అతడి కళ్లలో నీళ్లు.

“పాపకి ఈ విషయం తెలుసా?”

”ఎందుకు తెలియదు? నేను కొన్నిసార్లు ఏడిస్తే తనే నాకు ధైర్యం చెబుతుంది. పాపే లేకుంటే నేను కూడా తన దగ్గరికేపోయేవాడిని..” అతను ఆ మాట చెబుతూ బాధగా నా వైపు చూసినప్పుడు, మా ఊరొచ్చింది. బస్సు దిగాం. పాప నిద్ర లేచింది. ఊర్లో ఆరటి తోట, స్కూల్, పొలం, ఇల్లు, మర్రి చెట్టు, అమ్మ, నాన్న, మామయ్యల సమాధి.. అన్నీ చూపించా.

అవన్నీ చూశాక నాకు ఆ గతమంతా వెంటాడినట్టు అనిపించి గట్టిగా ఏడ్చా. పాప.. చిన్నదైనా నన్ను ఊరుకోమంటూ బతిలాడింది. సాయంత్రానికి అక్కడ్నుంది తిరిగి బయలుదేరాం.

అతని గతం విన్నాక అతనికి తోడుగా ఉంటే తప్పేంటనిపించింది.

నా మనసులో మాట అతనికి చెప్పా. అతను రెండు రోజులు టైం కావాలని అడిగాడు.

ఆ తర్వాత “నా భార్య స్థానంలో మరో స్త్రీని ఊహించుకోలేను” అని పాపని తీసుకుని దూరంగా వెళ్లిపోయాడు. నాకేం చేయాలో అర్దంకాలేదు. కొన్నిరోజులు ఎవ్వరితోనూ మాట్లాడలేదు. స్కూల్‌కి కూడా పోలేదు.

పదే పదే అతనే గుర్తొచ్చేవాడు. పాపకు బాగా దగ్గరవ్వడం వల్ల ఆ లోటు పదే పదే గుర్తొచ్చేది.

కొన్నిరోజుల తర్వాత అతని దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. “ఒక్కసారి పాపతో మాట్లాడండి” అన్నాడు. పాప ఎప్పట్లాగే అదే అల్లరితో మాట్లాడింది. ఫోన్‌లోనే ముద్దులు పెట్టింది. నన్ను కలవాలన్నది. నాకు కూడా తనని చూడాలనిపించింది.

ఓ వారం తర్వాత తిరిగి ఇక్కడకు వచ్చాడు. అదే అందం. కానీ ముఖంలో సంతోషం లేదు. భార్యను ఇంకా మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతూనే ఉంది. ఇంత మంచి మనిషికి ఇలా అయిందనే ఆవేదన నాకు రోజురోజుకీ ఎక్కువైంది. అతనికి దగ్గర కావాలని చాలా ప్రయత్నాలు చేశా. కానీ అతనెందుకో నన్ను దూరంగానే పెట్టాడు. సమయం దొరికితే అతనిని, పాపను చూడటానికి వెళ్లేదాన్ని. కానీ తక్కువగా మాట్లాడేవాడు. పాప మాత్రం నేను ఉన్నంతసేపు బాగా ఆడుకునేది.

కొన్నాళ్లకు మళ్లీ స్కూలుకెళ్లడం మొదలుపెట్టాను. అతను మాత్రం ఆ స్కూల్ మానేసి వేరే స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయిపోయాడు.

స్కూల్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి వర్షంలో అతను తడిచి నిలబడ్డాడు. ఆ వర్షంలో కూడా అతను అందంగా కనిపిస్తున్నాడు. మా ఇద్దరి మధ్య మౌనం సాగుతోంది. డోర్ ఓపెన్ చేశా. లోపలికి రమ్మని పిలిచా. తల తుడుచుకోమని టవల్ ఇచ్చా. కాఫీ పెట్టి చేతికిచ్చా.

’నాతో మాట్లాడటమే ఇష్టంలేని వ్యక్తి నా కోసం ఇక్కడికి ఎందుకు వచ్చాడు?’

“ఇంత వర్షంలో మీరేంటి ఇక్కడ ? పాప ఎక్కడ ఉంది?” మనసులో అనుకున్నదే బయటకు అడిగేశా.

“పాపను పక్కింట్లో ఉంచి వచ్చా. వర్షంలో తడిస్తే మళ్లీ జ్వరమొస్తుందని”

“సరే, ఇంత వర్షంలో వచ్చారు. ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా ?”

“నేను ఈ పని చేయ్యొచ్చో లేదో నాకు తెలియదు. కానీ మీరు ఇందుకు ఒప్పుకోవాలి”

“అర్థమయ్యేలా చెప్పండి”

“నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి మీ ఫొటో చూపించాను. నచ్చారని చెప్పాడు”

“నచ్చితే నన్ను ఏం చేయమంటారు?”

“మీరు అతడ్ని పెళ్లి చేసుకోండి. చాలా మంచి వ్యక్తి. మంచి ఉద్యోగం కూడా ఉంది”

“నేనో పిచ్చిదానిలా, నా ప్రేమ శాపంలా కనిపిస్తునాయా మీకు? మిమ్మల్ని చూసిన మొదటి రోజే నాకు చాలా నచ్చారు. ప్రేమించాను. ఆ తర్వాత మీ మాటలు, మీ వ్యక్తిత్వం బాగా నచ్చాయి. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నే గుర్తుకొస్తున్నారు. పాప ఉందని, మీకు పెళ్ళయిందని తెలిశాక ఆ ప్రేమ ఎక్కువైంది తప్ప తక్కువ కాలేదు. అలాంటి ప్రేమ మీకు ఎందుకు అర్థం కావడం లేదు”

అతనేం జవాబు చెప్పలేదు. చేతికి ఇచ్చిన కాఫీ కప్పు కింద పెట్టి ఆ వర్షంలోనే తడుస్తూ వెళ్లిపోయాడు. పిలిచినా పలకలేదు. కోపం, బాధ ఒకేసారి వచ్చాయి.

ఎంతో బాగా చూసుకునే మామయ్య పోయాడు. ఊహ తెలిశాక నాన్నను పొగొట్టుకున్నాను. పెద్దయ్యాక అమ్మను పోగొట్టుకున్నాను. నా జీవితంలో నేను ఏం కోరుకున్నా అది దక్కదనే బాధ నాకు నా నరకాన్నే మళ్లీ మళ్లీ చూపిస్తున్నట్టు అనిపించింది.

ఆ తర్వాత కూడా అతడ్ని కలుస్తూనే ఉన్నా. నన్ను మార్చాలని చూశాడు. కానీ అది కుదరలేదు.

“నీకు నేను కావాలా ? పాప కావాలా” అని అడిగాడు. నేను ఇద్దరూ కావాలని చెప్పా. అందుకు తను ఒప్పుకోలేదు. పాప కావాలంటే తీసుకెళ్ళమన్నాడు. నాకు కోపం వచ్చింది. ఇది ఇలాగే జరుగుతున్నప్పుడల్లా అతనికి దూరంగా వెళ్లిపోయేదాన్ని. ఆ మరుసటి రోజు పిలవగానే ఏం తెలియనట్లు వచ్చేవాడు. అసలు ఏం జరగనట్లే, ఓ కొత్త అమ్మాయిని కలిసినట్లు కలిసేవాడు.

వర్షం వస్తుండటంతో కాఫీ డేలోకి అడుగుపెట్టాం. “ప్లీజ్! నన్ను వదిలేసి.. నువ్వు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. కావాలంటే పాపను నీతో పంపిస్తాను. నాకంటే పాపను నువ్వే బాగా చూసుకుంటావు”

“అది జీవితంలో జరగని పని. నాకు నువ్వు, పాప ఇద్దరు కావాలి” ఆ నువ్వు అనుకునేంత దగ్గర, ఇలా గొడవ పడేంత దూరం ఒకేసారి వచ్చేశాయి మా జీవితాల్లోకి.

“నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎందుకు వింతగా ప్రవర్తిస్తావు?” అని నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అతనికి కోపం వస్తే లేచి వెళ్లిపోతాడు.

ఈసారి అలా వెళ్లిపోలేదు. వెనక్కి వచ్చి కాఫీ తాగాడు. నేను ఏం మాట్లాడలేదు. “ఇంటికి వెళ్దాం” అన్నాడు. వెళ్లాం. పాప నన్ను చూడగానే కౌగిలించుకుని ముద్దు పెట్టింది. ఆ పాప ప్రేమలో మా అమ్మ గుర్తొచ్చేది. అతనిని చూస్తే నాన్న గుర్తొచ్చేవాడు. ఇది ఎందుకు అతనికి అర్థం కావడం లేదు!

రోజులు గడుస్తున్నా అతనిలో మార్పు కనిపించలేదు. ఓ రోజు పాపను తీసుకుని ఇంటికి వచ్చాడు. నవ్వుతూ కనిపించాడు. మనసుకు ఆనందం కలిగింది. పాప లోపలికి వెళ్లింది. నన్ను చూసి మళ్లీ నవ్వాడు.

“నేను ఓ పది రోజులు వేరే ఊరు వెళ్తున్నా. పాపను జాగ్రత్తగా చూసుకుంటావు కదా” అనడిగాడు.

ఎందుకో అతను నాకు దగ్గరయ్యాడనిపించింది. ఏ ఊరని అడిగా. పనిమీద వెళ్తున్నా అని నవ్వేసి వెళ్లిపోయాడు.

పాప నా దగ్గర సంతోషంగా ఉంది. కానీ అతను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. పాప “నాన్న ఎక్కడ?” అని అడిగేది. ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పేదాన్ని.

సరిగ్గా పన్నెండు రోజులకు తిరిగొచ్చాడు. “ఎందుకు ఇన్ని రోజులు?” అని అడిగా. నవ్వుతూ పాపను తీసుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు.

అతను మళ్లీ మునుపటిలాగే కనిపించాడు. అతని ప్రవర్తన వింతగా ఉంది. దూరం అవ్వాలా, దగ్గరవ్వాలా అనే సందేహం నాలో అలాగే ఉంది. నావల్ల కాలేదు.

కలుద్దామని పిలిచా.

“ఏంటి నీ ప్రాబ్లమ్? నీకు ఓ భార్యగా, పాపకు తల్లిగా ఓ అమ్మాయి ఒప్పుకుందంటే.. మీ ఇద్దరినీ ఎంత ప్రేమించి ఉంటే ఒప్పుకుంటుందని ఒక్కసారైనా ఆలోచించారా?”

అతనేం సమాధనం చెప్పలేదు. నవ్వాడు. కోపం వచ్చింది. ఏడ్చా.

వర్షం మొదలైంది. ఆ వర్షానికి నా కన్నీళ్లు అతనికి కనిపించలేదనుకుంటా. “పాప కావాలంటే తీసుకెళ్లు.. నా జీవితంలోకి వచ్చి.. నష్టపోకు” అని వెళ్లిపోయాడు.

బాగా ఆలోచించా. అతనిలో మార్పు రాలేదు. అతను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటానని చెప్పా. మళ్లీ నవ్వాడు. నాకు కోపం వచ్చింది.

“నీకు పెళ్లాయక.. నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోతాను. పాపను మీరే చూసుకోవాలి” అడిగాడు.

“నా ప్రేమ మీకే అర్థం కాలేదు. ఇక పాపకి అర్థమవుతుందా? అర్థం చేసుకుని నా దగ్గర ఉంటుందా?”

మళ్లీ మౌనంగా ఉండిపోయాడు. ఏ ప్రశ్న అడిగినా అలా మౌనంగా ఉండిపోయి తల దించుకుంటాడు. లేదా నవ్వి వెళ్లిపోతాడు. మళ్లీ అలానే వెళ్లిపోయాడు.

ఇది ఇష్టంతో ఒప్పుకున్న పెళ్లి కాదని అతనకి తెలుసు. కానీ బయటపడడు. ఆదివారం పాప ఇంటికి వచ్చింది.

“మీరు పెళ్లి చేసుకుంటున్నారంట కదా! మీరు పెళ్లి చేసుకుంటే నా దగ్గరకు రారు కదా” అని నెమ్మదిగా అడిగింది.

“ఎందుకు రాను, కచ్చితంగా వస్తాను”

“మా నాన్నను మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా?” అని సున్నితమైన గొంతుతో అడిగింది.

నాకు దుఃఖం వచ్చింది. “లేదు. నేను మీ నాన్నకు సరిపోను” అని చెప్పా.

“లేదు, మీరు మంచి వారే. మా నాన్నే మీ గురించి బోలెడు విషయాలు చెబుతుంటారు. మీరు నాకు అమ్మలాంటి వారని చెప్పేవారు” అంది.

“నువ్వు అంటుంది నిజమా?”

“అవును”

నాకు మళ్లీ అతనిపై ఆశలు పుట్టాయి. వెంటనే ఫోన్ చేశా.

“హలో, నువ్వు పాపతో చెప్పిన మాటలు నిజమేనా?”

“అవును నిజమే” అని నెమ్మదిగా చెప్పాడు.

“అంటే భార్యగా నన్ను ఒప్పుకుంటున్నావా?”

“నీకు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. పాపకు తల్లిగా ఉండాలని అనుకున్నాను తప్ప.. నా భార్యగా ఉండాలని అనుకోలేదు. అది కుదరదు. కుదిరినా ఎక్కువ రోజులు నిలబడదు” అని అరిచినట్టు చెప్పాడు.

అతడి జవాబు విన్న తర్వాత ఫోన్ విసిరిగొట్టా. పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశా.

కొన్ని రోజులకి ఊరు వదిలి వెళ్లిపోతున్నాని చెప్పాడు. అతడ్ని ఆపలేకపోయాను. అతను కోప్పడితే నేను ఏం చెప్పలేను. పాపను ఇంటికి తీసుకొచ్చాడు.

పాప లోపలికి వెళ్లి ఆడుకుంటోంది. బయటకు పిలిచాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతను ఏడవటం మొదటిసారి చూస్తున్నా.

“పాపను నీకు అప్పగించి వెళ్తున్నా నేను వచ్చేవరకు బాగా చూస్కో” అన్నాడు.

“తప్పకుండా” అని చెప్పా. పాపని పిలిచాడు. గట్టిగా హత్తుకుని నుదిటిపై ముద్దు పెట్టి బాగా ఏడ్చాడు.

“వెళొస్తా. అమ్మ నిన్ను బాగా చూస్కుంటుంది” అని పాపకు చెప్పి తనని నాకు అప్పగించి వెళ్లాడు. పాప ఏడ్చింది. అయన ఆగకుండా వెళ్లిపోయాడు.

పాపకు, నాకు దూరంగా వెళ్లిపోయాడు. అతను వెళ్లిన రెండో రోజునుంచే నాన్న ఎప్పుడు వస్తారని పాప అడిగేది. ఏదో ఒక అబద్దంతో నచ్చజెప్పేదాన్ని.

నాలుగు నెలల తర్వాత ఓ రోజు రాత్రి ఫోన్ వచ్చింది అతని దగ్గర నుంచి.. “హలో” అని దగ్గుతూ నెమ్మదిగా అన్నాడు.

“హలో చెప్పండి” అన్నాను.

“చాలా తక్కువ మంది ఉంటారు నీలాగా. నాకు పెళ్లై ఓ పాప ఉందని తెలిసినా నన్ను ఇష్టపడ్డావు. అప్పుడే నీ గొప్పదనం, నాపై నీకున్న గౌరవం ఏంటో తెలిశాయి. చాలాసార్లు నిన్ను చూస్తుంటే నా భార్యనే గుర్తొచ్చేది. తన స్థానం నువ్వు అడగకముందే ఇవ్వాలనిపించేది. కానీ ఇవ్వలేను. అంత అదృష్టం నాకు లేదు. పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని చీకటి గదిని చేయలేను. నువ్వు వింటుంది నిజమే. నాకు క్యాన్సర్ ఉంది. ఎక్కువ రోజులు బతకను. ఆమధ్య పాపను నీ దగ్గర ఉంచి పది రోజులు వెళ్లింది ట్రీట్మెంట్‌కే. ఇప్పుడు కూడా ట్రీట్‌మెంట్‌కే వచ్చాను. తల్లి లేదని పాపను చాలా జాగ్రత్తగా చూసుకున్నా. పాపకి అమ్మ ఉంటే బాగుండు అనే సమయానికి నువ్వు వచ్చావు. దేవుడు నాపై దయ ఉంచాడనిపించింది. ఇప్పుడు నేను చనిపోయినా పర్లేదనిపిస్తోంది. నేను బతికితే కచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. చనిపోతే మాత్రం ఈ విషయం నా కూతురుకి చెప్పకు. నా బిడ్డను బాగా చూసుకుంటావు కదూ! నీ ప్రేమను దక్కించుకోలేనందుకు నీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నా. ఇన్ని రోజులు నిన్ను బాధపెట్టాను. కానీ నా మనసులో ఎప్పటికీ ఉంటావు. నన్ను క్షమిస్తావు కదూ” అని ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ కలవలేదు.

అతని మాటలు విన్నాక కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి మనిషికాకుంటే నా జీవితం పాడుకాకూడదని చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్నానా? ఏడుపొచ్చింది.

ఆ తర్వాత రెండు రోజులకే అతను చనిపోయాడని ఫోన్ వచ్చింది.

ప్రతిసారీ పాపను తీసుకెళ్లు, నా జీవితంలోకి మాత్రం రావొద్దు అన్నప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేకపోయా. అతని మనసు కఠినం అనుకున్నా. కానీ అతడి మాటల వెనుక ఇంత విషాదం దాగుందని అర్థమయ్యాక ఎంతలా ఏడ్చానో తెలియదు.

పాపను చూడగానే కన్నీళ్లు తుడుచుకొని దగ్గరికి తీసుకున్నా.

“నాన్న ఎప్పుడొస్తాడు” అనడిగింది పాప. నేనేం చెప్పాలి!

 

 

Avatar

రమేశ్ రాపోలు

రమేశ్ రాపోలు కథలు రాయడం మొదలుపెట్టడానికి ముందు.. పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాడు. కథలు చెప్పడమంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం ఇతనికి. చదువవ్వగానే సినిమాల్లోకి వెళ్లాలన్న కల ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది. ఉద్యోగంలోనైతే చేరిపోయాడు కానీ ఎక్కువకాలం ఉండలేక తిరిగి నచ్చిన పనిలోకే వచ్చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్న రమేశ్‌, సినిమాలకు పనిచేస్తున్నాడు. సాహిత్యం, సినిమా ఒకే దారిలో నడవాలని కోరుకునే ఈ రచయిత, వివిధ పత్రికల్లో ఇప్పటికి అర డజను కథల దాకా రాశాడు. ఎక్కువగా ప్రేమ కథలు రాయడానికి ఆసక్తి చూపిస్తానని చెబుతున్న ఈతరం రచయిత, కథలు రాస్తే ఏదో తెలియని సంతృప్తి దొరుకుతుందని చెబుతాడు.

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • బాగుంది తమ్మీ. మరిన్ని మంచి కథలు రాయాలి

 • స్టోరీ చాల బాగుందండి. చదువుతున్నంత సేపు బాధగా అనిపించింది. జీవితంలో ప్రతి ఒక్క ఫామిలీ మెంబెర్ ఇంపార్టెంట్. బాధ వచ్చిన, సంతోషం వేసినా చెప్పుకోవడానికి ఒకరు లేని పరిస్తితి శ్రావణిది. పాపని ఇవ్వడానికి ఇష్టపడుతున్న వ్యక్తి తనని ఎందుకు accept చేయలేక పోతున్నాడు అనేది గ్రహించగలిగాను. శ్రావణి కి ఎవ్వరూ లేకపోయినా, పాపకి అయితే అమ్మ ఉందిగా ఉన్న దైర్యం…ఇక శ్రావణి కూడా తన ఆనందాన్ని పాపాలొనే చూసుకుంటుందేమో…

 • ఏమని చెప్పాను………. మీ కథ గురించి
  ప్రపంచం లోని అన్ని భావోద్వేగాల కలయిక మీ కథ అని చెప్పమంటారా……..
  మీ మనసులానే సున్నితమైన ఒక విరి (పువ్వు )లా ఉంది అని చెప్పమంటారా……..
  ఒక అమ్మాయి జీవితాన్ని….. అమ్మాయిలే రాయలేని విధంగా అబ్దుతంగా రాసారని చెప్పమంటారా……….
  ఎన్ని చెప్పిన…… అసలు ఏం చెప్పకపోయినా ఒకటి మాత్రం నిజం……..

  మీ రచనలకు ఈ అభిమాని దాసోహం 🙏

 • చాలా బాగుంది రమేష్
  శ్రావణి చాలా ధైర్యవంతురాలు ,ఎవరు లేరని బాధపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడడం ఇంకా పాపకు తోడు ఉండడం చాలా great
  ఏ కథ ని చదువుతున్నంతసేపు నా.. చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తుచేసింది 🙂

  ఎలాంటి కథలు ఎన్నో రాయలని కోరుకుంటూన్నాం………..

 • Are ramesh nuvvu na friend inadhuku nenu chala happy ga feel avuthunna ra nuvvu enka machi position lo undalani ne friend korika machi story super ra

 • ఇది కథ అని అనుకోలేము సర్! జీవితం ను కళ్లెదురుగా పరిచి పెట్టారు మీరు. కొందరి జీవితాల్లో ఏది ఇష్టపడినా దక్కదు అంటారు నిజమే కొన్ని జీవితాలు అంతే. కానీ ఆ జీవిత పోరాటం మాత్రం చాలా ఆత్మస్తైర్యాన్ని ఇస్తుంది. శ్రావణి అలాంటివాటికి అలవాటు పడింది కదా తొందరలోనే పాపతో కొత్త జీవితాన్ని తప్పక కొనసాగిస్తోంది అనిపించింది. ఆ విషయం మీరు చెప్పకపోయినా కథలో ఉన్న బలం ద్వారా నాకు అనిపించింది. కొన్ని జీవితాలు సంతోషంతో మొదలై విషాదం అవుతాయి కథలో అతని జీవితం కూడా అంతే కదా. ప్రతి విషాదం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. అలాంటి కథను మీరు అందించారు చూడండి 💐💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు