స.వి.శ.లు వున్నారు జాగ్రత్త!

బాధ్యతారహితంగా, చెత్తగా తీసే అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఎన్ని వేల కుటుంబాలు నష్టపోయి వుంటాయి? 

త్తో, గొడ్డలో, తుపాకో పట్టుకొని అతనొస్తాడు మన ముందుకు.  మనం ఆరాధనగా చూస్తాం.  కనబడ్డవాడినల్లా అడ్డంగా నరికేస్తుంటాడు అమ్మతోడుగా.  ఒక ఏకే 47 తుపాకీ  పట్టుకొని శతృవుల దేహాలలో బుల్లెట్టు విత్తనాలు నాటి నెత్తుటి సేద్యం చేస్తాడు.  మనం మైమరిచిపోతాం.

అతను దేన్నీ లక్ష్య పెట్టడు.  చట్టాన్ని ఖాతరు చేయడు.  రాజ్యాంగ వ్యవస్థల్ని వెంట్రుక ముక్కలా తీసి పారేస్తాడు.  మనం నడిచొచ్చిన నాగరికతల్ని చిన్న చూపు చూస్తుంటాడు.  అయినా సరే మనం చప్పట్లు కొడుతుంటాం.

అతను స్త్రీలని ఎగతాళి చేస్తుంటాడు.  క్రూరంగా పరిహసిస్తుంటాడు.  ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ చేతులేసి వేధిస్తుంటాడు. జడ పట్టుకు గుంజుతాడు. ఎత్తి పడేస్తుంటాడు.  పిరుదుల మీద దరువేస్తుంటాడు.  అయినా మనం కళ్ళప్పగించి మైమరుపుతో చూస్తుంటాం.

అతను దొంగతనాలు చేస్తుంటాడు.  దోపిడీలు చేస్తుంటాడు.  స్థలాలు కబ్జా చేస్తుంటాడు.  అయినా మనం అతనిలో ఉదాత్తతని వెతుక్కుంటాం.

అతను బాధ్యతారహితంగా ప్రభుత్వ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తుంటాడు.  మోసం చేస్తుంటాడు.  మాఫియా నేర సామ్రాజ్యాల్ని విస్తరిస్తుంటాడు.  కోర్టుల్ని మోసగిస్తుంటాడు.  అయినా సరే మనం అతనికి ఈలలేసి చొక్కాలు చించుకొని అభిమానం ప్రదర్శిస్తుంటాం.

అతనే మన సినిమాల్లో హీరో!

ఎక్కడో అరుదుగా తప్ప  మన హీరోలందరూ (అదేదో సినిమాలో నాగభూషణం వెటకారంగా అన్నట్లు) స.వి.శ.లే (సంఘ విద్రోహ శక్తులే).  అందుకే మన ఫెమినిస్టు కవి సావిత్రిగారు “మన హీరోలందరూ నిజానికి విలన్లు” అన్నారు.

రజనీకాంత్ నుండి రవితేజ వరకు అతని పేరేదైనా కావొచ్చు.  అతను సిల్వర్ స్క్రీన్ హీరో.  ఒక్కడే అన్ని సినిమాల్లో పాత్రల్ని పోషించలేడు కాబట్టి ఒక్కో సినిమాలో ఒక్కొక్కడు హీరోగా అవతరిస్తుంటాడు.  అది చిరంజీవైనా లేదా మొన్నే హీరోగా ప్రమోషన్ పొందిన షకలక శంకర్ అయినా సరే హీరోగా ఎవరేసినా అచ్చం హీరోలా చేయాల్సిందే.  వాడు ఐదడున్నరడుగులున్నా లేదా ఆరున్నర ఎత్తున్నా, ఛాతీ ముప్ఫైన్నరున్న లేదా ఛప్పన్నారున్నా వాడి హీరోయిజం మాత్రం ఒక్కటే.  హింస, అసభ్యత, నేరాలు, ఘోరాలే హీరోయిజం.  తిరుగుబాటులో ప్రేమ వుంటుంది.  వొట్టి హింసలో కేవలం ద్వేషం మాత్రమే వుంటుంది. మన సినిమాలు రెండొ పనే చేస్తుంటాయి.  వ్యవస్థ మీద హేతుబద్ధమైన విమర్శని కాకుండా వ్యక్తిగత ద్వేషం, కసి రేకెత్తించి ఆలోచనల్ని హింసానందంలో ముంచేసే ప్రక్రియే మన సినిమా హీరోయిజం.  మనం ఈ హీరోయిజానికి కట్టు బానసలమయ్యాం.  ఆ హీరోయిజానికి గుడ్లప్పగించి మరీ జేజేలు కొడుతుంటాం.  జులాయితనంతో, రౌడీయిజంతో, గూండాగిరితో, స్మగ్లింగ్ తో, మాఫియాతో నిజ జీవితంలో ఒక ఐదు నిమిషాలు కూడా భరించలేని ప్రవర్తనతో వుండే సినిమా హీరోయిజానికి మాత్రం మనం వొంగొంగి మరీ సలాం చేస్తుంటాం.

ఇది మనలోని వైరుధ్యమా? ఆలోచించలేని మన బలహీనతా?  లేక మనలోని సున్నితత్వాన్ని చంపేసే వాణిజ్య వ్యూహమా?

“సినిమా అంటే వ్యాపారం. దాని లక్ష్యం సంఘ సేవ కాదు.  సినిమా పరిశ్రమ మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి.  తీసేవాడికి లెక్కలుంటాయి.  సినిమాని సినిమాలా చూడండి” అనే రొడ్డకొట్టుడు వాదనలని, ఉచిత సలహాలను నివారించటానికి సినిమా ప్రయోజనం ఏమిటనే చర్చని ఇక్కడ తీసుకురాను.  చేయను.  మంచి సినిమా, చెడ్డ సినిమా లక్షణాల గురించి చర్చించను.  ఆర్ట్ ఫిలంస్, ఆఫ్ బీట్ ఫిలంస్ ప్రస్తావన కూడా చేయను.  సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెనగళ్, ఆదూరు గోపాలకృష్ణన్ ఎవరో కూడా నాకు తెలియదనే ఒప్పేసుకుంటాను.  అసలు సామాజిక స్పృహ అన్న విషయాన్నే ముట్టుకోను.  కాసేపు ఈ వ్యాసార్ధం (అంటే ఈ వ్యాసం కోసం అన్నమాట) సినిమా ప్రయోజనం వినోదమే అని ఒప్పేసుకుంటా.  అయితే ఒక ప్రశ్న మాత్రం అనివార్యం.  వినోదానికి మాత్రం మానవీయ విలువలుండాల్సిన అవసరం లేదా?  ఎన్నో వేల సంవత్సరాల నాగరిక ప్రయాణం అనంతరం కూడా సంఘ విద్రోహ శక్తుల్ని కథానాయకులుగా చూపటం, శారీరిక బలానికి ఆరాధనీయతని ఆపాదించటం, హింస పట్ల ఆకర్షణ పెంచటం, నేర ప్రవృత్తిని కీర్తించటం, నేరస్తుడికి చప్పట్లు కొట్టేలా చేయటం, బహుభార్యత్వం లేదా అమ్మాయిలను ఏడిపించటం వంటి పురుషాధిపత్యపు డ్రైనేజి పొంగించటం, హీరోగారి కోసం స్త్రీలని భయంకరంగా ఆబ్జెక్టిఫై చేయటం వినోదం కిందకి వస్తే ఆ వినోదం ఆక్షేపణీయం కాదా?  వినోదం అనగానే దుష్ట విలువల్ని బేషరుతుగా ఆమోదించాల్సిందేనా?   అసలు కొట్టడం, తన్నటం, అవమానించటం వంటి చీప్ లక్షణాలేనా వినోదపరచటానికి అవసరమైన దినుసులు?  వినోదం పేరుతో ఈ ఎదవ పనులు చేయని ఒక్క అగ్ర హీరోని చూపండి.  వాళ్ళందరూ బలాదూర్, జులాయి, పోకిరి, డాన్, టెర్రర్, టెంపర్ గాళ్ళు కాదా?

నిజానికి మన హీరోల పాత్ర రూపకల్పనలోనే ఒక భూస్వామ్య దురహంకారం వుంటుంది.  అది ప్రధానంగా హీరోల కోసం ప్రత్యేకంగా వండించిన పంచ్ డైలాగుల్లో మరీ వ్యక్తమౌతుంటుంది.  విపరీతమైన దురహంకారం, సిగ్గులేకుండా స్వంత డబ్బా కొట్టుకోవటం లేదా బరితెగించి ఇతర పాత్రల్ని చులకన చేయటం.  ఈ హీరోలు ప్రధానంగా “మగతనం” అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఆధార పడుతుంటారు.  “ఆడు మగాడ్రా బుజ్జీ” “మగాడివైతే రా” “సింహాలతో సెల్ఫీ” “మచ్చల పులి”…ఈ వ్యక్తీకరణలన్నింటినీ మగతనానికి ముడిపెట్టడం ద్వారా మగతనం అంటే దురహంకారం, హింస అని తేల్చి చెప్పటమే కదా!  నిన్న మొన్న (నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో) దుర్మరణం పాలైన లేటు వయసు యాక్షన్ హీరో హరికృష్ణ కూడా ఒక సినిమాలో “మగాడు అన్నాక తెగింపు ఉండాలిరా! చావుకి మనం భయపడకూడదు. చావే మనల్ని చూసి భయపడాలి!” అని హుంకరించాడు. అసలే ఎల్లలు లేని పురుషాధిక్యతతో కునారిల్లే సుందర ముదనష్టపు వ్యవస్థలో  ప్రేక్షకుల మెదళ్ళని అదే భావజాలంతో మరింత విషపూరితం చేసి, క్రేజ్ పెంచుకొని తమ వాణిజ్య ప్రయోజనాలకి అనుగుణంగా సినిమాలు తీయటమే వినోదమా?  నాని, శర్వానంద్ వంటి కొద్దిమందిని మినహాయిస్తే పంచ్ డైలాగులతో పనికానిచ్చే మన హీరోలు ఏ రకంగానూ కథానాయకులు కారు.

మన హీరోలు బాబాల్ని మించినోళ్ళు.  ఒంటి చేత్తో కార్లనెత్తి పారేయటం, ఒక్క తన్ను తంతే జీపులు ఎగిరిపడటం వంటి విడ్డూర మానవాతీత విన్యాసాలు మన హీరోలకే సాధ్యం.  సన్నివేశాన్ని బలంగా తీర్చిదిద్దలేని, ప్రేక్షకులని సృజనాత్మకంగా కట్టి పడేయలేని భావ దారిద్ర్యానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు హీరోయిజం.  ఒకప్పుడు బానపొట్టల్ని గర్భ టక్ లో దాచేసుకొని చిన్న చిన్న గంతులేసినా, డూపుల్ని పెట్టుకొని యాక్షన్ సన్నివేశాల్ని లాగించినా, ఇప్పుడు సిక్స్ పాక్ బాడీలో నిగనిగలాడే కండలు చూపించినా మన హీరోలకి నిజంగా “స్టంట్స్” అనే కళ ఎప్పుడూ తెలియదు.  నిజంగా మార్షల్ ఆర్ట్స్ ఎంతో కొంత తెలిసిన సుమన్, భానుచందర్ వంటి హీరోలు ఇప్పుడైతే అసలు లేరు.  అంతా కెమెరా ట్రిక్స్.  గ్రాఫిక్ మాయాజాలం.   రోప్ ట్రిక్స్.  సినిమా సగభాగం ఏ పీటర్ హెయిన్సో లేదా రాం లక్ష్మణో లాగించేస్తుంటారు. మన ప్రేక్షకులు ఈ పిచ్చ పిచ్చ ట్రిక్స్ కే మురిసిపోతుంటారు.  ముప్ఫై ఏళ్ళ క్రితం తన “స్టిఫ్” కదలికలతో కృష్ణ చేసే ఫైటింగులకీ ఇప్పుడు ప్రభాస్ వంటి కండలవీరుడు చేసే ఫైటింగులకీ వున్న తేడా ఏమిటంటే కొన్ని ట్రిక్స్, ఫైటింగ్ సీన్ల కోసం బడ్జెట్ పెరగటమే.  ఏ మాత్రం ఒరిజినాలిటీ లేకపోవటమే హీరోయిజమా?

హాలీవుడ్ సినిమాల్లో కూడా యాక్షన్ సీన్లు వుంటాయి.  కానీ వాటిని “స్టంట్స్” అనాలి.  అంటే ప్రధానంగా విన్యాసాలన్న మాట. వాళ్ళ సినిమాల్లో రాం లక్ష్మణ్ తరహా వొంటి చేతి వీరబాదుడు ఫైటింగ్లుండవు.  అలా చేయించాలనిపిస్తే వాళ్ళు స్పైడర్ మాన్, బాట్ మాన్ వంటి ఫాంటసీ పాత్రలనే సృష్టిస్తారు.  పాపం వాళ్ళు అమాయకులు కదా అందుకే అటువంటి సినిమాల్లో కూడా బలమైన విలన్ని కూడా సృష్టిస్తుంటారు.  వాళ్ళ సినిమాల్లో అసలు హీరోలుండరు.  కేవలం లీడ్ కారెక్టర్లు మాత్రమే వుంటాయి.  వాళ్ళ యాక్షన్ సినిమాల్లో ఒకే సమ ప్రాధాన్యతతో హీరో, విలన్ల మధ్య ఘర్షణే సినిమాగా రూపుదిద్దుకుంటుంది.

సినిమా అనేది వినోద వ్యాపారం కాబట్టి, దాని మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి వుంటాయి కాబట్టి మనం దాని మంచి చెడులు మాట్లాడకూడదని ఒక బూకరింపు తరచు ముందుకొస్తుంటుంది.  అయితే మరి సో కాల్డ్ హీరోల సినిమాలు ఎందుకు గల్లా పెట్టె దగ్గర విఫలం అవుతున్నాయి?  ఓవర్సీస్ వసూళ్ళు కూడా ఆదుకోలేకపోతున్నాయి.  బాధ్యతారహితంగా, చెత్తగా తీసే అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఎన్ని వేల కుటుంబాలు నష్టపోయి వుంటాయి?  అసలు ఎంత బాగా ఆడినా నష్టం వస్తుంటుంది ఒక్కోసారి.  ఎందుకంటే కోట్లల్లో వుండే హీరోల పారితోషికాలు సినిమా నిర్మాణ వ్యయంలో ముఖ్య భాగం.  మరిప్పుడు చెప్పండి తమ స్వార్ధానికి సినిమా నిర్మాణ వ్యయం పెంచే హీరోలు సినిమాల్లో ఎలాగూ మంచివాళ్ళు కాదు కానీ కనీసం పరిశ్రమకైనా విలన్లు కాకుండా వున్నారా?  తెర మీద, తెర వెనుక కూడా వాళ్ళు విలన్లే.

దొంగ, రౌడి, గూండా, పోకిరి, బలాదూర్, డాన్, లోఫర్ అయిన మన సినిమా హీరోని దృష్టిలో వుంచుకొని మీకెవరి మీదనైన కోపం వస్తే “నువ్వు మనిషివా లేకపోతే సినిమా హీరోవా?” అని అడిగితే తప్పేమిటంట! అహ, అసలు తప్పేంటట?

*

అరణ్య కృష్ణ

28 comments

Leave a Reply to Geeta Vellanki Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రచయిత సినీ సామాజిక అవగాహన ప్రశ్నార్ధకం , కేవలం వ్రాయటం కోసం రాసినట్లుగా చప్పగా వుంది. సారంగ ఈ మధ్యే చూస్తున్నా . ఫేస్బుక్ పోస్ట్ ల్లాగా ఆర్టికల్స్ వుంటే పత్రిక విలువ తగ్గుతుంది.
    రచయితలు మరింత భాద్యత గానూ , ఆశావహంగానూ , సృజన చేయటానికి సంపాదకులు ధృష్టి
    సారించాలి. ఈ పత్రిక గమనం లో గతుకులు సహజం . అయినా గొప్ప సంపాదకులు మంచి రచనల
    విషయంలో రాజీపడరు. ధన్యవాదాలు.

    • భగవాన్ గారూ! మీ స్పందనకి ధన్యవాదాలు. నేనేదో ఒక అద్భుతమైన రచన చేసానన్న భ్రమల్లో లేను. అందువలన ధృవీకరణ పత్రాలు, తీర్పులు ఆసక్తి కలిగించవు. కానీ విమర్శించినా, మెచ్చుకున్నా కారణాన్ని కోరుకోవటం అత్యాశ కాదనుకుంటాను. ఈ వ్యాసం మీకెందుకు నచ్చలేదో మీరు చెప్పలేదు. చప్పగా వుందన్న జనరల్ స్టేట్మెంట్ తీర్పు కాగలదే కానీ విమర్శ కాజాలదు. ఈ శీర్షిక కింద ఏదో ఒక సమకాలీన సమస్య మీద రాస్తున్న వ్యాసాలన్నీ చర్చనీయాలే. అందువలన విభేదాలకు ఎంతో ఆస్కారముంది. ఈ వ్యాసంలో సినిమాకి వుండాల్సిన సామాజిక ప్రయోజనాన్ని నేను చర్చించననే చెప్పాను. నా దృక్పథం నుండి నేను మన సినిమాల్ని విమర్శిస్తూ ఈ వ్యాసం రాయలేదు. సామాజిక ప్రయోజనం సంగతి పక్కన పెట్టి చూసినా వినోదానికి మానవీయ ముఖం వుండాల్సిన పనిలేదా? అన్న ఒక్క ప్రశ్న ఈ వ్యాసం రాయించింది. వివరణాత్మకంగా వుండే మీ విభేదాన్ని, విమర్శని ఆహ్వానిస్తున్నాను.

  • అస‌లు కళాకారుల ను కళాకారులు గా చూడక పోవటంలోనే తప్ప ంతా! ముఖ్యంగా సినిమా హీరోలను. వాళ్లు ఎంతగొప్ప కళాకారులైనా, వాళ్లను ఎంతగొప్పగా గౌరవించినా, చెప్పులతో ఇంట్లోకి అడుగు పట్టనివ్వడంలోనే ఉంది ప్రేక్షకుల దౌర్బాగ్యం. అంతే గాక, మరీ పడకగదులలోకి అడుగు పెట్టనివ్వడం ఇంకా దౌర్బాగ్యం.
    ఇలాంటి ప్రేక్షకుల అమాయకత్వాన్ని అసరాగ తీసుకొని కోట్లాది రూపాయలు తేరగా దండుకోడమే గాక, కళను పిచ్చిగా ఆరాధించే వారి మానసిక అవిటితనంపై అధికారం చలాయించడానికి రాజకీయాన్ని వారిపై రుద్ది, ఓట్లుగా మార్చు కోవడాన్ని ఏమనాలి? వీరికి ఆత్మపరిశీలన చేసుకోవడం ఏమైనా ఉన్నదా? దాన్ని ప్రోత్సాహించే రాజకీయ పార్టీలను ఏమనాలి?
    తేరగా వచ్చిన ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకోవాలనే వీరి ఉద్దేశం? ఈ దారి దోపిడీ దారులపై అభిమానం ఎలా కలుగుతుంది? ప్రేక్షకులు ఆలోచించుకొనేది ఎప్పుడూ? ” ప్రతి వాడు ఎదుట వాడిని దోచుకొనే వాడే,తన స్వార్థం, తన సౌఖ్యం చూచుకొనే వాడే” నని మహా కవి ఎప్పుడో చెప్పాడు.
    అరణ్య కృష్ణ గారి వ్వాసం ఎన్ని పరిమితులున్నా బాగుంది. ఇలాంటి రచనలను ప్రోత్సహించాలి!

  • చాలా కరెక్ట్ గా రాశారు. అందుకే సినిమాలు చేయాలంటే చిరాకుగా ఉంటోంది. థాంక్యూ అండీ మంచి విశ్లేషణకి!

  • నిజానికి మంచి అంశం పై రాశారు. ఈ ఆలోచన ఎల్లప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతుంది. పాతసినిమాల్లో హిరో లు కొంతైనా సౌమ్యత చూపేవారు. కాని కొత్త తరానికి హిరో అంటే నేర్చుకోవాల్సిందే మీలేదు. పాత్ర తో పాటు డైలాగ్స్ కూడా వినలేని పరిస్థితి. కొందరు హిరో లు పదానికో అశ్లీల పదం ఆడవాళ్ల ని కించపరిచే పదం జత చేసి సిగ్గు లేకుండా వాడతారు. అది సభ్యసమాజంలో అంత బాహాటంగా ఆడకూడదు అని కూడా ఆలోచించరు. ఏదిఏమైనా మంచి విషయాన్ని చర్చ లో పెట్టారు.ధన్యవాదాలు

    • మీ వివరణాత్మక స్పందనకు ధన్యవాదాలు సర్వమంగళగారూ

  • సినిమాలలో మానవీయవిలువలు అంటే నేతిబీరకాయలో నేయికోసం వెతికినట్లే అరణ్యా.. మానవీయ విలువలను వినోదంతో పాటు జోడించి చెప్పగల చక్కని సాధనం సినిమా . ఉపయోగించుకోరు.
    డ్రైనేజీపొంగిపొర్లే సినిమాల జోలికి నేను పోను. ఆ కంపు భరించలేక చూడడం ఎప్పుడో మానేశా.

    • నేనూ మానేసాను శాంతీ. చిరంజీవి సినిమా నేను థియేటర్లో చూసిన ఆఖరి సినిమా “ఇంద్ర”. అంతకు ముందు చూసిన చివరి సినిమా “గ్యాంగ్ లీఎడర్”. దిక్కుమాలిన హీరోయిజం. సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న దౌర్భాగ్యం.

  • Excellent write-up sir kudos💐💐it is an exhaustive elucidation of ethics , pros n cons of commercial cinema..I request you to focus on art cinema too, like films of Satyajit Ray,Mrunal Sen, Ritwik Ghatak,Shyam Bengal.. whose films were criticised once,as these art directors are selling poverty of India to the world . I too opine that in the name of art film..they made films exposing the utter poverty of our country, instead of exploring the rich culture, legacy and beautiful locations which could have won, the laurels of world and revenue aswell, by way of tourism.. Trust you can make an exhaustive write-up as a sequel to this.All the very best Sir
    Basavaraju Venugopal

    • సార్! మన దేశ సంస్కృతిని భూతద్దంలో పెట్టి చూపించే సినిమాలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి కూడా. అందుకేమీ కొరత లేదు. తాష్కెంట్, మాస్కో, జకార్త నగరాల్లో నేను గమనించాను. వాళ్ళు మన సినిమాల్లోని రాజప్రాసాదాల వంటి సెట్టింగుల్ని చూసి మనం చాలా ధనవంతులం అనుకుంటారు. మన హీరోయిజాన్ని చూసి ముచ్చట పడతారు. తాష్కెంట్లో మమ్మల్ని చూసి పిల్లలు కూడా నమస్తే చెప్పి “షారుఖ్ ఖాన్” అంటూ కళ్ళెగరేస్తారు. మా ఉజ్బెక్ గైడ్ హిందీ పాటలు పాడటాన్ని నేను ఇంతకు మునుపే ఎఫ్బీలో పోస్ట్ చేసాను. ఇరుకిరుకు ఇళ్ళల్లో బతికే సంపన్న జపాన్ వంటి దేశాలకు మన సినిమాల హంగు ఆర్భాటం అంటే గొప్ప క్రేజ్. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి కాలం నుండి మన సినిమాలంటే విదేశీయులకు గొప్ప క్రేజ్ వుంది. ప్రస్తుతం హాలీవుడ్, బ్రిటన్ సినిమాల తరువాత అత్యధికంగా అంతర్జాతీయ మారక ద్రవ్యం సంపాదిస్తున్న సినిమా పరిశ్రమ మనదే. ఇంక సత్యజిత్ రే, మృణాల్ సేన్ సినిమాల మీద వచ్చిన అభియోగం అన్యాయమని భావిస్తాను. వాళ్ళు ఒక గొప్ప నిబద్ధతతో తీసిన సినిమాలు అవి. వారి వాస్తవిక దృక్పథాన్ని ప్రజాస్వామికంగా అర్ధం చేసుకోవాలి. వారి సినిమాల్లో చూపించే పేదరికంలో వున్న పెయిన్ ని మనం ఏ మేరకు ఎంపతైజ్ చేస్తాం అనేది ముఖ్యం. వారి సినిమాల్ని తప్పు పట్టే పక్షంలో ఈ దేశంలో పేదరికం గురించి, పీడిత వర్గాల గురించి వచ్చిన సమస్త కళా రూపాల గురించి, సాహిత్యం గురించి కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి. చిత్త ప్రసాద్ బొమ్మలు, భూపేన్ హజారిక సంగీతం, గద్దర్ పాటలు, చలం, శ్రీశ్రీ నుండి నగ్నముని మీదుగా నా వరకు అందరి కవిత్వానికి అభ్యంతరం పెట్టాలి. ఇవి అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళవు కాబట్టి పర్లేదంటారా? మరి దేశీయంగా ఒక రకంగానూ, అంతర్జాతీయంగా మరో రకంగానూ వుందామా సార్?

  • “మన హీరోలు ఏ రకంగానూ కథానాయకులు కారు.”

    ఇది నిజ్జంగా నిజ్జం. ఇప్పటి తెలుగు సినిమా హీరో ఎప్పటికీ కథానాయకుదు కాలేడండి – కథానాయకుడు కథలో భాగమై దాన్ని నడిపిస్తే మన హీరోలు కథకి పైనుండి దాన్ని నడకని శాసిస్తారు – in the name of image.

    • “శక్తి పీఠాలనూ, దేవుళ్లనూ రక్షించే మొనగాళ్లు కదా ( బద్రీనాథ్) మన హీరోలు

      ఆర్నాల్డ్ స్క్వాజ్నెగర్ ది లాస్ట్ స్టాండ్ అని ఒక సినిమా లో టౌన్ షెరిఫ్ పాత్ర వేశాడు . అందులో ఒక మెక్సికన్ డ్రగ్ డీలర్ తో ఫైట్

      వాడు లాగి పెట్టి డొక్కలో తంతే ఆర్నాల్డ్ బొక్క బోర్లా పడి లేవలేక పోతాడు

      తర్వాత కష్టం మీద చేతులు కింద ఆనించి లేవడానికి ప్రయత్నిస్తూ “ ఆ……. ఓల్డ్” అని గొణుక్కుంటాడు ముసలాడినయ్యానని (పాత్ర పరంగా అయినా) ఒప్పుకుంటూ!

      ఎవరూ? ఉక్కుమనిషి ఆర్నాల్డ్

      మన తెలుగు హీరో వందేళ్లు వచ్చినా అసలు అలాటి డైలాగు పెట్టడానికి ఒప్పుకోవటం ఊహించగలమా?

      మనవళ్లనెత్తాక కూడా “అమ్మడూ లెట్స్ డూ ….” అని పాడాల్సిందే

      సుమోలూ క్వాలిస్ లూ గాల్లోకి లేపాల్సిందే

      అలా చేయక పోతే ఫాన్సూ ఒప్పుకోరు

      We deserve this nonsense” – A wonderful comment by Sujatha Velpuri.

  • Nice artical sir..నేరాలు అనగానే దొంగతనాలు దోపిడీలులాంటివి గుర్తొస్తాయి కానీ వాటికన్నా స్కామ్లు లాంటి ఆర్ధిక నేరాలవలనే దేశ ప్రగతి నాశనం అవుతుందని white collers crimes more than the other crimes అని చదువుకున్నాము అలాగే ఒక రేపిష్టో , రోమియోనో,రౌడీలో సమాజాన్ని కలుషితం చేసేదానికన్నా సినిమాల ప్రభావమే ఎక్కువ అని ఒప్పుకోవలసిందే . లైఫ్స్టైల్ ఇంతగా మారిపోయి సమస్యలను మనమే కొనుక్కునే స్థితిలో వున్నామంటె దానికి సినిమాల పాత్ర తక్కువేమీ కాదు

      • ఎన్నాళ్లుగానో వున్న మనసులోని నా ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు. ధన్యవాదాలు.

  • ఎంత చక్కగా చెప్పారండి. ..! ” నువ్వు మనిషివా లేక సినిమా హీరోవా” అనే అద్భుతమైన తిట్టుని అందించినందుకు వేసుకోండి రెండు వీరతాళ్ళు 😄

  • As per today what u said is right sir,our heroes dont deserve anything in the movie field,but what i want to say is,don’t blame flims they are united by every religion,still there are some people who love films as a art,there are some directors which produce high quality films,man need basic entertainment,Some movies like ,needhi nadhi oke katha,and some other small budget movies are too good,they are thinkable to society,i watch every movie,but i only take good into it,parents should take care what their children are watching,youtube destroyed everything,anyway i still beleive they are some good artists and directors who love films as a art, Audience also changed alot they need something which was not there in their life………….

    • This article is not films broadly. It focuses on the frenzied heroism in the contemporary films. You said you can take only good leaving the bad. Not all people are bestowed with such discretion. We need to think of vulnerability of human minds to violence. I am also a lover of films. I enjoy commercial ones too. But negative and bad ones are to be abhorred always.

  • Ippati movieslo heroes enta aggressivegaa unte anta great..enta attitude choopiste anta heroism. cheppedemundi..oka movieni minchi maroka movie daanni taladanneettu teestunnaaru. avasaramunnaa lekunnaa konni include chesi maree..prasninchevaaru lenantavarakoo alaa movies vastoone untaayi..ikada heroisme dominate chestundanadamlo sandeham emundi ji..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు