స్వరాజ్యం ఇల్లు

“సొరాజ్జెమ్మ తల్లీ , కాస్త నువ్వే దయ జూడాల.ఈయన మన ఇనిమెళ్ళ గవర్నమెంటు స్కూల్లో పంతులు గారు. కూతురు కి పెద్ద కాలేజీలో సీటొచ్చిందంట. కాస్త డబ్బులు తక్కువ పడ్డయ్యి. నువ్వే సర్దాలి” సైకిల్ స్టాండేసి సిమెంట్  బెంచీ మీద కూచున్నాడు పోస్ట్ మాన్ రాఘవులు.

తవ్విన మట్టిలోంచి పాకుతూ పైకి వస్తున్న వాన పాముల్ని,గునపం తగిలి దెబ్బ తగలకుండా శ్రద్ధగా తీసి మరో పాదులో వేస్తూ తల తిప్పి చూసింది స్వరాజ్యం
యాభయ్యేళ్ళ వ్యక్తి రాఘవులు పక్కనే, “అమ్మా, నమస్కారం” అన్నాడు

“ఒస్తున్నా” చేతులు బక్కెట్లో కడుక్కుని ఆ నీళ్ళు గులాబి పొదలో పోసి లేచి వచ్చింది.

“లోన్లు అవీ పెట్టుకున్నారా పొంతులు గారూ”

“అన్నీ అయ్యాయమ్మా, అవన్నీ పోగానే మరి కొంత డబ్బు అవసరం పడింది. అమెరికా లో సీటు అందరికీ రాదు కదమ్మా, పిల్ల బాగా చదువుకోవాలని ఆశ”

“అమెరికాలోనా? ”
“అవును”
“ఒక్కదాన్నే పంపిస్తన్నారా?” తెలీని తనపు ప్రశ్న”అంతే కదమ్మా మరి! ఒక్కతే ఎళ్తంది. అక్కడ తెలుగోళ్ళు చాలా మందే ఉంటారు. లేక పోయినా సరే, అక్కడ చదువుకోవాలంటే నెట్టుకు రావాల్సిందే గదా! పిల్ల దైర్నమంతురాలే, ఏం పర్లా”

నవ్వింది

“బాగా చదివిపిచ్చండి. చేతినిండా డబ్బుండే ఉజ్జోగం సంపాదిచ్చాల. సొమ్ములిచ్చే దైర్నం ఎవరూ ఇయ్యరు లోకంలో. సేతిలో డబ్బుంటే జమాయిచ్చి బతకచ్చు. ఆ పిల్ల సొమ్ముల మీద పిల్లకే హక్కులుండాల”

పంతులు గారు ఏమనాలో తెలీక చూస్తూ నిల్చున్నాడు

డబ్బు ఇస్తుందా ఇయ్యదా?

“అంతే గదమ్మా .సేతిలో డబ్బు లేక పోతే కాకి కూడా నెత్తి మీద తన్ని పోయిద్ది” రాఘవులు

పంతులు గారి ఉద్యోగం వివరాలన్నీ కనుక్కుంది మాటల్లోనే. సొంత ఇల్లుంది కదా, చాలు

లోపలికి వెళ్ళి ప్రామిసరీ నోటు తెచ్చి అక్కడ పెట్టింది

“ఇల్లు కాయితాలు తెచ్చానమ్మా” అన్నాడు మాష్టారు వినయంగా బల్ల  మీద పెడుతూ
మళ్ళీ నవ్వింది

“చదివి సంతకం పెట్టండి పొంతులు గారూ, కాయితాలొద్దు లెండి. పిల్ల సదువుకన్నారు గదా వడ్డీ కూడా తీసుకోట్లా, వూరకే దాంట్లో రాసుంటది గానీ.  తొందరగా సర్దే యవ్వారం సూడండి. యాడాది అయితే మంచిది ” గుడ్డ సంచి లోంచి డబ్బు తీసింది.

గొంతు తగ్గించి “వడ్డీ  సంగతి బయట అనమాకండి, ఎవరన్నా అడిగితే పన్నెండు రూపాయల వడ్డీ అని సెప్పండి”అంది

పంతులు కి స్పృహ తప్పింది. సొరాజ్జమ్మ డబ్బు దగ్గర ఖరాఖండి గా ఉంటుందని, వడ్డీ చాలా తీసుకుంటుందని వంద రకాలు గా విని భయం భయంగానే వచ్చాడు.

“నోటు తీసి  సంచి లో పెడుతూ, “కాయితాలు తీసుకోలేదని సులాగ్గా ఉండబాకండి. డబ్బులు వొసూలు సెయ్డానికి వొంద మార్గాలుంటై గదా కాడ ” అంది

మాష్టారుకి భయం వెయ్యలేదీ సారి.

“అట్టాగే సొరాజ్జెమ్మ తల్లీ,  నా బిడ్డ చదువు ఆగి పోతుందేమో అని భయపడి పోయిందమ్మా, తొందరలోనే తీర్చేస్తా గా! దయగల తల్లివమ్మా.నీ కాపరం చల్లగా ఉండాలి” భక్తి గా నమస్కరించి బయలు దేరుతుంటే స్వరాజ్యం మొహంలో నవ్వు నెమ్మదిగా మాయమైంది. రాఘవులు తత్తర పడి మాష్టారిని లాక్కు పోయాడు

###

అది మంచి రోజా చెడ్డ రోజా ఇప్పటికీ నిర్థారించుకోలేదు తను. ఆ రోజు తర్వాత చాలా కష్టాలు పడి నిలదొక్కుకుంది తను.
చాలా పోగొట్టుకుంది, ఆత్మ గౌరవం తప్ప

ఒంటరి తనంతో అలమటించి పోయింది. ఎవరికీ దగ్గర కాలేక, కావాలనుకున్నా, సంఘానికి జడిసి, నలిగి పోయింది

ఐనా చివర్లో.. తన మొహాన మొలిచే నవ్వు..సంతృప్తి కి, మనశ్శాంతికి చిరునామా. బహుశా అదే తనని బతికిస్తుందేమో

పదహారేళ్ళ క్రితం…..
ఆ రోజు సాయంత్రం నాలుగింటికి,

వానొచ్చేలా ఉందని జీతగాడి భార్య సుబ్బమ్మ చేత ఎండినపిడకలన్నీ బస్తాలకెత్తించి పాకలో ఒక మూల పెట్టిస్తోంది

“ఏవే.. యాడున్నావ్?” వరండాలోంచి పెద్దగా పిలుస్తూ వచ్చాడు చిన కోటేశ్వర్రావ్. వాళ్లన్నయ్య పెద్ద కోటేశ్వర్రావ్. తమ్ముడు బుల్లి కోటయ్య.

“ఓయ్, వస్తన్నా, పిడకలెత్తిస్తున్నా” పెద్ద గొంతుతో చెప్పింది

దొడ్లోకి వచ్చి, అక్కడి నుంచి సందు వాకిట్లోంచి గొడ్ల కొట్టం దగ్గరికి వచ్చాడు

“మొత్తం పన్నెండు బస్తాలు. ఇంతకు ముందు వెంకాయమ్మ గారికి ఆరు బస్తాలిచ్చాం. బ్రామ్మల సూరమ్మ కి మూడు, యానాదోళ్ళ రత్తాలొచ్చి నాలుగు బస్తాలు తీసక పోయింది. రత్తాలొక్కతే డబ్బులిచ్చింది గానీ మిగతా ఇద్దరూ ఇయ్యలా. గుర్తుంచుకో” సుబ్బమ్మకి లెక్కలు చెప్తోంది

“నీ పిడకలు పాడు గాను. ఇట్రా పనుంది” అరిచాడు”ఒస్తున్నా” పేడ ఎత్తుతూ అరిచింది.

అక్కడికే వచ్చాడు
“మా వీరయ్య బాబాయోళ్ళు డాబా ఏస్తన్నారు తెల్చు గా?” సిగరెట్ ముట్టించాడు
“ఊ”
“చేతికొస్తయ్యనుకున్న డబ్బులు రాలేదంట. రెండో అంతస్తు శ్లాబు పడాలంట. ఎమ్మట్నే నాలుగు లచ్చలు కావాలన్నారు. “నొసలు ముడేసింది”మీ సెల్లెలు మాంచాలమ్మ పెళ్ళికి దీసుకున్నయ్యి ఇచ్చారా?”

మండిపడ్డాడు కోటేశ్వర్రావ్.

“ఇత్తార్లే, నీ అబ్బ సొత్తేమైనా దెచ్చిచ్చావా? ఓ తెగ నీలుగుతున్నావ్?”

“నా అబ్బ సొత్తెందుకు దెస్తానూ? మన సొత్తు గాబట్టే నాకు అక్కర. అప్పుడు దీసుకున్న ఆరు లచ్చలు ఇయ్యకుండానే ఇల్లు కడతానికి మొదలు బెట్టారే? యాణ్ణించి ఒచ్చినై? మళ్ళీ ఇప్పుడు కావాలంటే మనకి మాత్రం యాణ్ణించొస్తై?”

“ఎదవ సోదంతా సెప్పమాక. బాబాయోళ్ళకి డబ్బులు గావాల. నీ కాసి కాయ పూసలూ, పలకసర్లూ తే పో”

“ఏందీ” కళ్ళు పెద్దవి చేసి చూసింది.

“ఇంతా జేసి నా నగలకు ఎసరు బెట్టావా? వాయబ్బ, నేనెట్టా ఇస్తా?”

“ఇప్పటికిప్పుడు కావాలంటే సొమ్ములేడ ఉన్నయి? మనం ఇయ్యక పోతే స్లాబు ఆగి పోయిద్ది. మా పిన్నాం ఏడుత్తుంది ఒకటేమైన, ఇల్లాగి పోతే ఊళ్ళో మర్యాద పోయిద్దని”

“యాడవనీ. అంత అలివి గానప్పుడు ఇల్లెట్ట ఏద్దామనుకున్నారు? ఎవురో ఒకరు ఎర్రోళ్ళు టయానికి ఇస్తార్లే  అనుకున్నారా ? తీసుకున్న అప్పు తీర్చక పోతే మర్యాద పోదా? ఓయబ్బా…అసలదంతా నాకు దెలవదు. ఇంతకు ముందిచ్చిన ఆరు లచ్చలు, వొడ్డీ ఎట్టాగూ లేదు, అసల్లో అయినా పైసా గూడా ఇయ్యలేదు. అంతకు ముందు నాట్లప్పుడు ఇత్తనాలకని లచ్చ ఇచ్చావు మీ తమ్ముడికి. ఇటిక బట్టీ పెడతన్నామంటే ఇచ్చిన మూడు  లచ్చలూ ఇంగ రానే రావని కాయంగా తెలిసి పానే పాయె.మళ్ళీ కొత్తగా గావాల్నంటే ఎట్ట?”

“దవడ పలిగి పోయిద్ది ఒక్కటి నూకానటే !ఏందే పెద్ద ఆపీసరు లాగ లెక్కలు మాట్టాడతనావు లెక్కలు? నీ అబ్బ సొమ్మా ఏంది? నా సొమ్మేగా? నా సొత్తేగా నా వోళ్లకిచ్చుకుందీ? నీ మడుసులు తీసుకుంటే ఇట్టనే వాగుతావంటే నువ్వు?”

“నీ వోళ్ళూ నా వోళ్ళూ అని గాదు. సిన్నా సితకా మొత్తమా మనం ఇచ్చిందీ? ఎన్నాళ్లని వొసూలు సెయ్యకుండా, ఇట్టా ఇచ్చుకుంటా పోతాం?”

“ఇందులో నీకు సమందం లేదు. ఇయ్యన్నీ నా డబ్బులు. ఇది నా ఇల్లు”

ఒక నిమిషం మాట రాలేదు స్వరాజ్యానికి
“నీ ఇల్లా? నీ డబ్బులా? ఇది మనిల్లూ, ఇయ్యన్నీ మన డబ్బులూ అనుకుంటన్నా నేనిన్నాళ్ళూ? ”

“అనుకోబాక. నా పెళ్ళాంగా పడుండు గానీ, ఇట్ట నా డబ్బూ నా ఇల్లూ అని ఇర్రబీగమాక ”

ఘోరమైన అవమానం గా తోచాయి ఆ మాటలు.
రోషం తో మొహం ఎర్రబడి పోయింది.

“సరే అట్నే కానీ!నీ డబ్బే, నీ ఇల్లే! నా నగలు మాత్రం ఇయ్యను. గెనాల మీద (చేల గట్లు) మీద పూల చెట్లేసీ, కూరగాయలు కాయించి అమ్మీ, పిడకలు చేసీ, పాలు పెరుగు చేసీ ఎట్టనో నాలుగు సొమ్ములు చేపిచ్చుకున్నా.

నా కష్టార్జితం. అయ్యన్నీ ఎవురిల్లు కోసమో నేను ఇయ్యను” కంది కంపతో కట్టిన చీపురు తో వరిగడ్డిని వూడ్చి కోపంతో విసురుగా  మూలకు నెట్టింది

శివమెత్తి పోయింది కోటేశ్వర్రావు కి. నగలు ఇవ్వదేమో అన్న భయం నమ్మకంగా మారింది

“ఏందే, ఎగస్ట్రాలు వాగుతుండా? నీ కష్టార్జితమా? చేను, గెనాలు, బర్రెలు, ఇయ్యన్నీ నీ సొంతమనుకున్నావా? నా ఇంట్లో నా చేలో పని చేసి, అయ్యన్నీ నీ సొంత సొమ్ములనుకున్నావా? యాణ్ణించి వొచ్చినై నీకు చేలూ గెనాలూ? తెచ్చావా నీ అబ్బ కాణ్ణించి? లంజ కానా?”

సొరాజ్జానికి భయం పోయింది

“ఈ ఇంట్లో నువ్వొక్కడివే ఉండట్లా. నేను కూడా కలిస్తేనే ఇల్లు ఇది. రెక్కలు ముక్కలు జేసుకోని, నాలుగు డబ్బులు కూడేసి సేపిచ్చుకున్నా . నీ చేలూ, నీ గెనాలా? నిజవే. అట్టయినా నా శాకిరీ కి లెక్క గడితే ఎంతైద్దో తెల్సా? పాతికేళ్ళ బట్టీ ఈ ఇంట్లో అడుగు పెట్టిన్నాట్నుంచి ఒంచిన నడుం ఎత్తకుండా సేత్తన్నా శాకిరీ. ఎన్నెన్ని పాలు పితికి కేంద్రానికి పోశాను. ఎంతెంత పేడ దిబ్బలు వేశాను? నాట్లప్పుడు, కోతలప్పుడు నలబై మందికి అన్నాలొండి పెట్టాను. అసలిదంతా నేను సెప్పడమేంది నీకు? .. నువ్వసలు ఆ డబ్బులు…..”

కోటేశ్వర్రావు నింపాదిగా అన్నాడు “ఏంది బో లెక్కలు కడతన్నావ్? నువ్వు పాతికేళ్ల బట్టీ గాలి బీల్చి బతికావా? నా తిండి తినేగా? శాకిరీ శాకిరీ అని అరుస్తుండావ్? నీ శాకిరీ కీ తిన్న తిండికీ సరి”

కోపం, నిస్సహాయత, ఉక్రోషం ముప్పేటగా స్వరాజ్యాన్ని చుట్టు ముట్టి గుండెల్లో మంట పుట్టించాయి. “అతనిముందు” ఏడవకూడదనే పట్టుదలతో “అబ్బో, పెద్ద ఉద్దారకుడివి బయలు దేరావు. ఆలికి అన్నం పెట్టి, ఊరికి ఉపకారమనుకున్నాడంట నీలాంటోడో ఎనకటికి ఎవడో”

“మరి ఇంటికి సేసిన శాకిరీ కి డబ్బు లెక్క గడతన్నావు గదే! నాతో ఇన్నేళ్ళు పడుకున్న దానికి కూడా లెక్క గట్టక పొయ్యావా? పక్క మీద బాగనే ఉంటావు గా, దానికి ఇంకా ఎక్కువ డబ్బులొస్తయి లెక్కేస్తే”

స్వరాజ్యం చేతిలో పేడ తట్ట విసురుగా వచ్చి కోటేశ్వర్రావ్ చొక్కా మీద పడింది

“ర్రేయ్..” గొంతు చీరుకు పోయేలా కేక పెట్టి పరిగెత్తుకొచ్చింది అతని వైపు. చొక్కా పట్టి చింపేస్తూ పిడి గుద్దులు గుద్దింది

“దొంగ నా బట్టా, అంత మాటంటావా? ఎవురనుకున్నావ్  నన్ను. పల్నాడోళ్ళ  ఆడపిల్లని, నన్ను..నన్ను ” బింకం సడలి అతను అన్న మాట గుండెల్లో కత్తిలా దిగడంతో గోలున ఏడుస్తూ నేల మీద కూలబడి పోయింది.

కోటేశ్వర్రావు ఆ మాట అన్నందుకు పశ్చాత్తాపం పడలేదు. ఏడుస్తున్న స్వారాజ్యాని దాటి సిగరెట్ వూదుతూ నిర్లక్ష్యంగా బయటికి నడిచాడు. నగలు మాత్రం రాబట్టలేక పోయాడు

###

పిల్లలిద్దరూ ఎంత బతిమాలినా, చుట్టు పక్కల వాళ్ళు నచ్చజెప్పినా, పుట్టింటోళ్ళు బుజ్జగించినా స్వారాజ్యం సమాధాన పడలేక పోయింది

“ఇన్నేళ్ళు కాపరం చేసినాక, రెక్కలు ముక్కలు జేసుకోని, నానా శాకిరీ పొలానికీ, బరె గొడ్లకీ, ఇంటికీ సేసినాక, నలభై యేళ్ళకే రంగంతా మాసి పోయి సగం ముసలి దాన్నై పోయినాక, ఈ ఇల్లు  నాది గాదని, ఇక్కడ నేను ఒక ముద్ద అన్నం కోసం పని చేస్తన్నాననీ నా మొగుడు జెప్పే దాక తెలీలా నాకు. పడుకున్నందుకు కూడా ఆ ముద్దలోనే సరిపుచ్చాడు దర్మాత్ముడు. ఆ సంగతి తెలిసినాక ఇంగ నేనిక్కడ ఉండి లాబం లేదు..”

ఎవరెన్ని చెప్పినా ఇదే మాట

తన చాకిరీతో చేయించుకున్న నగల్లో మాత్రం ఒక్క సవరు కూడా మొగుడికి ఇవ్వలేదు. మెడలో పుస్తెల తాడు, నల్లపూసలు తీసి, పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి వేసుకుంది. గాజులు వొలిచి తీసి అక్కడ పెట్టింది.

” నీ ఇల్లు, గడపలూ నీ మొహనేసి కొట్టుకో. నేను లేని వొలుకుల్ని ఏలుకో” బట్టల పెట్టెతో వరండా లోకి వచ్చింది
“ఏందో, బో ఎగిరెగిరి పడతన్నావు, ఒక్కసారి అడుగు బయట బెట్టినాక, ఇంక మళ్ళీ ఇంట్లోకొచ్చే పన్లేదు  బాంచత్, ఇయాలే తేలి పోవాల” వీరంగం వేశాడు కోటేశ్వర్రావ్

“నీ కంటే ముందు నేను పోతే నా శవం గూడా నీ ఇంటి ముందు నుంచి పోదు. సరేనా? మాట తప్పేదే లేదు. గరికపాటోళ్ళ ఆడపిల్లని, గురజాల రక్తం.. రోషం లేకుండా బతికేదే లేదు” స్వారాజ్యం మాటకు కోటేశ్వర్రావు కి భయం వేసింది కొంచెం .
బెదిరిస్తే పనవుతుందనుకున్నాడు

చుట్టాల్లో చాలా మంది తిట్టి పోశారు సీతమ్మని. “ఏం రోగమే నీకు? వాడిల్లు కాక ఏందిది? అంటే అన్నాడనుకో? ఆ మాత్రానికే బంగారం లాంటి కాపరం ఒదిలేసి పోతావా? ఆడదానివని గుర్తుందా?మళ్ళీ మొదలెత్తుకుంటావా? యాడికని పోతావు? యాడుంటావు? రేపు కాలూ చెయ్యీ ఒంగినాక తెలుస్తది నాకు”

“కాలూ చెయ్యీ నాకే గాదయ్యో, ఆయనకీ వొంగుతయి” స్వరాజ్యం జవాబు

స్వరాజ్యం అన్నలు కూడా బెదిరిస్తూ బుజ్జగించి చూశారు.

“మీ ఇళ్ళకు ఒచ్చి పడను. బయపడొద్దు. నా బతుకు నేను మర్యాదగా బతుకుతా. ఇంగ పోండి. ఇసిగిచ్చబాకండి” తెగేసింది

“మా అత్తగారింట్లో వాళ్ళేమనుకుంటారు?” విజయవాడ నుంచి వచ్చిన కూతురు ఏడ్చింది

“ఇక్కడ నీ అమ్మ మర్యాద ఒలుకుల్లో కల్సినా నీకేం నెప్పి లేదు ! నీ అత్తగారింట్లో నా గురిచ్చి ఏమనుకుంటారో అని నేను మాత్రం అన్నీ అణుచుకోని బతకాల. అంతేగా? నా వొల్ల కాదమ్మా” ఈసడించి పారేసింది

“ఎంతైనా సొరాజ్జానికి తొందరెక్కువ” అని కొందరంటే

“మడిసంటే అట్టా ఉండాల,డంకా మీద దెబ్బ గొట్టింది పో ” అన్నారు కొందరు

స్వరాజ్యం ఆ శుక్రవార పూట ఆ ఇంట్లోంచి రెండు పెట్టెలతో శాశ్వతంగా బయటికి నడిచింది.

###

ఆ తర్వాత ఎంత కష్టపడిందో, ఎన్ని రాత్రులు మొగుడూ, కూతురూ గుర్తొచ్చి ఒంటరిగా ఏడ్చిందో, మాట పడని దానిగా ఎంత మనశ్శాంతి గా తృప్తి గా నిద్ర పోయిందో.. తనకే తెలియాలి

నగలు అమ్మి పొలం కొని, కూలోళ్ళని పెట్టి సన్న బియ్యం ఒడ్లు పండిస్తే, ఇల్లొదిలి ఎట్ట బతికిద్దో సూస్తాంగా అన్నోళ్ళే సెబాసో అన్నారు. వూరి మధ్యలో స్థలం కొని పెద్ద పెంకుటిల్లు  వేసుకున్నపుడు వాళ్ళే “ఒక్క దానికి ఎందుకో అంత పెద్ద కొంప ” అన్నారు

రక్తమంతా శక్తిగా మార్చి చేమతుల తోట పెంచి పూలన్నీ పెద్ద మార్కెట్ కి తనే ట్రాక్టర్ మీద తోలినపుడు “సొరాజ్జం రా ఆడదంటే” అన్నారు

సీతమ్మ ఇవేవీ పట్టించుకోలేదు. జీతగాడి కుటుంబానికి పొలం దగ్గరే ఇల్లు వేసిచ్చి చేతికింద పెట్టుకుంది. వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించింది.

డబ్బు తన దగ్గరికి చేరాక, దగ్గరకు చేరబోయిన వాళ్ళని దూరం పెట్టేసింది. అవసరమైన వాళ్ళకి వడ్డీకి అప్పులిస్తూ అందరికీ అవసరంగా మారింది. ఎవరికి డబ్బు అవసరమైనా సీతమ్మే దిక్కు. ఎవర్ని అడిగినా, పది రూపాయల వడ్డీ తీసుకుంటుందని చెప్తారు

కోటేశ్వర్రావుకి సుగర్ వచ్చిందని తెల్సినా, పొలం లో జారి పడి కాలు విరిగిందని తెల్సినా చూడ్డానికి వెళ్ళలేదు.ఇంట్లోనే దీపం పెట్టి, కన్నీళ్ళు పెట్టుకుంది. “అతడి” ఇంట్లో అడుగు పెట్టలేదు

చుట్టాలందరూ ఇంటికి వచ్చినపుడు ఉండే సందడీ, భర్తా, పిల్లా గురొచ్చి మనసు భారంగా అయిపోయేది. ఆ ఇల్లు తనది కాదని కోటేశ్వర్రావు అన్న మాట గుర్తొచ్చి కఠినంగా అయిపోయేది

స్వరాజ్యం పొలం పెరిగి పాతిక ఎకరాలైంది. కోటేశ్వర్రావు 60 ఎకరాలను స్వరాజ్యం లెక్క చెయ్యదు

###

కూతురు ఇద్దరు పిల్లల తల్లి, తండ్రి దగ్గరకు వచ్చినపుడు ఇక్కడికి కూడా వచ్చి పెట్టుపోతలు పెట్టించుకుని వెళ్తుంది.

ఒకప్పుడు కాపరం పోయిందనే బాధ లోలోపల ఉండేది. కానీ నెమ్మది నెమ్మది గా అది మాసి పోయింది. తన చుట్టూ తనంటే ఇష్టపడే వాళ్ళు బోలేదు మంది

అవసరానికి కేకేస్తే పరిగెత్తుకొచ్చే మనుషుల్ని సంపాదించుకుంది.

చాలది తనకి

బయటికి రాగానే పంతులు గారన్నారు “చాలా భయపడ్డాను డబ్బులిస్తుందో లేదో అని. ఆస్తి కాయితాలైనా  తీసుకోలేదే ఏం మనిషనుకోవాలి? వడ్డీ కూడా ఒద్దందే” చటుక్కున నోరు జారి నాలుక కొరుక్కున్నాడు

రాఘవులు నింపాది గా నవ్వాడు

“నేనక్కడే ఉన్నాగా పంతులు గారూ, తెలుసు నాకు. నా దగ్గర కూడా వడ్డీ తీసుకోలేదు సొరాజ్జెమ్మ. ఎవరి దగ్గరా తీసుకోదు. కానీ డబ్బులిచ్చిన అందరితోనూ బయట పది రూపాయల వడ్డీ అని చెప్పమంటుంది. అందరూ సరే అంటారు.

కానీ,అలుసుగా తీసుకుని డబ్బులు ఎగ్గొట్టిన వాళ్లు ఉండరు లెండి. వూళ్ళో వాళ్ళే గదా అందరూ ”

బయట దాకా వచ్చి వెనక్కి చూశారిద్దరూ
ఇనప గేటు మీద “స్వరాజ్యం నిలయం” అని రాసున్న అక్షరాలు అతికించి ఉన్నాయి

తులసి కోటలో దీపం పెట్టి, కుంకం బొట్టు దిద్దుకుంటోంది స్వరాజ్యం .

*
సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ధైర్యాన్నిచ్చే కథ. నాకు తెలియని మాండలిక ప్రయోగాలు ఓ నాలుగు కనబడ్డాయి .ఓమారు సోరాజ్జెం ,ఓమారు సీతమ్మ ,కావాలనే అన్నారా ?

  నా , మన తేడా తెలియని కాపురాలెన్నో .బంధం ఏర్పడడానికి కాలం పడుతుంది కాని తెగిపోవడానికి క్షణమే.

  • కల్యాణి గారూ, ఈ కథలో స్వరాజ్యం నిజమైన పాత్రే. పేరు సీతారావమ్న. అదే పేరుతో రాసి, తర్వాత స్వరాజ్యంగా మార్చాను
   కథ మొత్తంలో పేరు మారుస్తూ పోవటంతో రెండు చోట్ల మిస్ అయి అలాగే సీతమ్మగా ఉండి పోయింది

   పొరపాటు

   కథ నచ్చినందుకు థాంక్యూ అండీ

 • యెస్, నాక్కూడా అదే డౌటొచ్చిందండీ, పేరు రెండు చోట్లా మారిందా లేక నేనేమయినా మిస్సయ్యానా అని, వెనక్కెళ్ళి మళ్ళీ చదువుకుని వచ్చా, కింద మీ జవాబు చూసాక క్లియర్ అయ్యింది సంగతి.

  ఇలాంటి కధలు రాయడం మీకు కొట్టిన పిండి, మాక్కూడా ఆ భాష అలవాటయిపోతోంది మెల్లి మెల్లిగా.

 • బాగుందండీ.. స్వరాజ్యం ఆత్మగౌరవం… ఓలుకులు అంటే శ్మశానం కదా

 • Palnaadu yaasa inkaa padunekkaali ani naa abhipraayam. Kathanam baavundi. Akkadakkada pusthaka bhaasha kanpisthundi.
  Overall it is good one

 • చాలా బాగుంది సుజాత. మాట ములుకు చాలా పదును ఊరికే పడేది లేదు అని చాలా చూపించింది స్వరాజ్యం . ఊర్లో కబుర్లు తెలిస్నోళ్ళు వచ్చి పూస గుచ్చి చెప్పినట్టు దొడ్లో మునుమాపు వేళ కాఫీ తాగుతూ వింటూ ధీర్ఘాలోచనలో పడినట్టయ్యింది మనసంతా. చాలా బాగా రాసేవు సుజాత.

 • చాలా మంచి కధ రాశారు సుజాత గారు. స్వరాజ్యం చేత కధ నడిపించి ఆడవాళ్ళకి ఆవిడ ఒక ఉదాహరణ గా చూపించారు.

 • కథ చాలా బాగుంది సుజాత గారు…

  “మన” అని తను అనుకోనప్పుడు “నా” అనుకోవడమే ఉత్తమం.

 • కథ బాగుంది. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్య మున్నా లేకపోయినా ఆత్మ నిబ్బరం, ధైర్యం ఉంటే ఆర్థికంగా కూడా ఎదగవచ్చు. చేతులు కడుక్కున్న తర్వాత ఆ నీళ్లు మొక్కలకు పోయడం, గట్ల మీద కూరగాయ మొక్కలు, పూల మొక్కలు వెయ్యడం ఇలాంటి డీటెయిల్స్ బాగున్నాయి.
  అవును ఆస్తులు ఉమ్మడి పేర్ల మీద ఉంటే ఈ నాది అని దబాయించుడు పోతుంది.

 • వెంకాయమ్మ.
  ఆ పేర్లు పెట్టడంలో కూడా ఆ మట్టి, ఆ నేల గుబాళింపు, పోపులో కరివేపాకులాగా!
  సీత కి ‘సొరాజ్జెం’ వచ్చింది. చి న
  నేను చూసింనంతలో సొరాజ్జెం లాంటి స్త్రీ ల మనసు వెన్న. కానీ వారిలో భయం ఎక్కువ. ఎక్కడ వారి చుట్టూ ఉన్నవారు తనని exploit చేస్తారోనని. అందుకని అతి జాగ్రత్తకూడా తీసుకుంటారు. ఈ కధ ఆ విధంగా జీవితాన్ని ఒక చిన్న అద్దంలో చూపించింది. చాలా టైపోలున్నాయి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు