స్వప్నంలో తప్ప కలవని ఆత్మీయుడు

మహాస్వప్నకి పెద్దగా కొనసాగింపు లేదు ఆయనొక విస్ఫోటనం మరి.

  ఆరునెలలక్రితం ఫోను చేసి ఒక్కసారి తమగ్రామానికి వచ్చి నన్ను కలవమన్నారు మహాస్వప్న. నా అలసత్వం జడత్వం చాల గొప్ప ఆత్మీయమైన కలయికలని కూడా అసంభవం చేస్తాయి.

కందుకూరులో జరిగిన బహుజనరచయితల సమావేశానికి మిత్రులు నూకతోటి  రవికుమార్ నన్ను ఆహ్వానించారు. అక్కడనే ఒక వ్యక్తివచ్చి , మహాస్వప్న గారి మేనల్లుడని అని పరిచయం చేసుకొన్నాడు.మహాస్వప్నకి నేను అంటే అభిమానం అని కూడాచెప్పాడు.తర్వాత ఆయనే ఫోనుకలిపి మహాస్వప్నతో మాట్లాడించారు. చాలాసంవ త్సరాల క్రితమే  మిత్రులు సాహిత్యవేత్త కె.శ్రీనివాస్ మహాస్వప్నని ఇంటర్వూ చేసినపుడు- మహాస్వప్న నేను రాసిన లాస్ట్ బ్రాహ్మణ గ్రంధం గురించి మాట్లాడారు.ఇటీవల ఆరునెలలక్రితం ఫోనులో మాట్లాడినపుడు నాకథల గురించి కూడా మాట్లాడారు. నేను చివరికి అత్యంత అనామకంగా భూమినుంచి నిష్క్రమించకతప్పదని చెప్పే మిత్రుడు తాత్వికుడు నరహరితో మురిసి పోతూ ఈసంగతి చెప్పాను.

 ‘భూమండలాన్ని  శిశ్న శిఖరాగ్రంపై నిలిపిన వ్యక్తి ‘ నన్ను మెచ్చుకొన్నాడని గర్వంగా చెప్పాను.

  కాని నా అంత దుర్మార్గుడు ఎవరు ఉండరు. నేను ఆయన్ని వెళ్లి  ,ఎప్పుడు కలవనేలేదు. సౌదా అనేవాడు- దిగంబరకవులలోకెల్లా నిజమైన దిగంబరుడని. అందుకే ఆయనకి పెద్దగా కొనసాగింపు లేదు ఆయనొక విస్ఫోటనం మరి.

యన రాత్రి ఉదయిస్తున్న రవి
చరిత్ర నిద్రాసముద్రం మీద తుఫాను.
నటసామ్రాట్ యింట్లో అరలెన్నో  మరలెన్నో తెలుసు అని గర్జించిన సింహం.
బట్టలేసుకోదు సింహం .అందుకే ‘నీసిగ్గుచీ ర కొడుతొంది కంపు’ అని వస్త్రాలని ముసుగులుగా గుర్తించిన ఆదిముడు.

నగరం నడిరోడ్డుమీద నాగరికత బొడ్డుమీద నగ్నంగా నిలబడినవాడు.
ఇన్నికోట్ల గోడ్సేల ఘాతుక హస్తాల నడుమ నిశ్చలంగా వెలిగే బాపు చిరునవ్వుని ప్రేమించినవాడు.
దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పు అన్నాడు.
అంతేకాని ఆచ్చాదనలని నమ్మలేదు. ఏ సిద్దాంతాలని కప్పుకోలేదు.

నాతొ ఆరు నెలల క్రితం మాట్లాడినపుడు మహాస్వప్న  అన్నారు-అందరూ ఏదోఒక సిద్దాంత0 వైపు జరిగారు. నేను  ఇలా మిగిలాను అన్నారు,మిగిలిన దిగంబర కవులని స్మరిస్తూ.
ఐతే సహృదయులు విరసం చలసాని ప్రసాద్ తన కవిత్వం ప్రత్యేకమైనది అని ప్రశంసించేవారు అని చెప్పారు. కవిత్వానికి సిద్దాంతాలు అడ్డు కావు.

 వాస్తవానికి భ్రమకి, సత్యానికీ స్వప్నానికీ  తేడా తెలుసుకోలేకుండా జీవించిన నాకథలోని ప్రొటగొనిస్ట్  ఆయనకి నచ్చాడు. [‘మరణానంతరం’ కథ.]

అందుకే మహాస్వప్న ఉద్యమజ్వాలకి కిరసనాయిలు డబ్బాలని సరఫరా చేయలేను అని ఒక వ్యాసం లోరాశారు. ఒకసారి కవి  శివారెడ్డి గారు తెనాలిలో మాటల సందర్భంలో మహాస్వప్న వచనంలో వేడిని వాడిని మెచ్చుకున్నాడు. గొప్ప స్వాప్నికుడైన కవి గాలిలా వెల్తురులా అందరిని తాకుతాడు మరి.

 ఈరోజు ప్రకాశంజిల్లా అర్ధవీడు నుంచి బస్సులో వస్తున్నపుడు ఒక లెక్చరర్ తో మాట్లాడుతూ ప్రపంచ ద్రిమ్మరిగా ఉండడంకోసం భూమిలా ఒంటరిగా మిగిలిపోయిన స్కాలర్ జిప్సి  ఆదినారాయణ  ఈప్రాంతం వాడే తెలుసా అని అడిగాను. ఆదినారాయణ గురించి వివరించి చెప్పాను.

అదేసమయంలో దిగంబరుడు మహాస్వప్న మనసులో మెదిలాడు. కానీ అయన గురించి చెప్పడం ఎలా?
చరిత్ర నిద్రాసముద్రం మీద తుఫాను అని చెప్పాలా?
కాలం వాయులీనం మీద కమాను అని చెప్పాలా?

   జ్ఞానిర్భవతి భారత అనేపేరుతో ఒక దిగంబర కవిత రాశారు మహా స్వప్న. యదా యదాహి ధర్మస్య అనే భగవద్గీత శ్లోకంతో మొదలవుతుంది  ఆ కవిత. ఎందుకంటే -ఈ కృత్రిమ నాగరికతని చీల్చుకొని తానూ పుడమి పగిలి పుడతాను అని హామీయిచ్చారు అయన .  మహా స్వప్న  దిగంబర అవతార పురుషుడు.

నేను దళిత కవి మద్దూరి నగేష్ బాబుతో కలిసి రాసిన’ ఊరు వాడ ‘  కవితలో భగవద్గీతకన్నా కల్లు  గీత గొప్పది అని రాశాను. భగవద్గీత గొప్ప తాత్విక కావ్యం. కల్లు  ఆరోగ్యకరమైన[ నాగరికత సోకని] పానీయం. నాకు రెండిటి మీదా గౌరవమే ఇప్పుడు.

 భగవద్గీత చెప్పింది- జ్ఞాని అందరూ  నిద్ర పోయినపుడు జాగరూకుడై ఉంటాడు అని.

మహాస్వప్న అన్నారు- రాత్రి ఉదయిస్తున్న రవిని అని-

*

రాణి శివశంకర్ శర్మ

2 comments

Leave a Reply to Giriprasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొనసాగింపుని బద్దలు కొట్టేదికదా విస్ఫోటనం. తెలుగువారికి అది గట్టిగా వినబడ్డట్లుగా కూడా లేదు. ఇపుడు ఆయన మరణించాక స్మృతి వాచ్యంగా మళ్లీవినబడుతోంది. కవితలో తనని తాను అవిష్కరించుకున్న వాక్యంతోనే మీ సంతాపం ముగియడం సమయోచితం. ఆయన కవిత్వానికి న్యాయం. కవి మరణానికి కవిత్వన్యాయం. ఇక యధాతధ కొనసాగింపుకు మార్గం సుగమమ్. రాత్రిన ఉదయించి రాత్రిన అస్తమించిన కవిస్వప్నం ముగిసింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు